శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

భక్తిసోపానాలు

>> Monday, January 31, 2011



శ్రీకృష్ణ సందర్శనం కోసం గోకులం చేరుకున్నాడు నారద మహర్షి. తలకు వాసెనకట్టుతో ఉన్న గోపాలకృష్ణుని చూసి- ఏమిటి స్వామీ అని అడిగాడు. 'తలనొప్పి నారదా!' బదులిచ్చాడు వాసుదేవుడు. 'నీకు తలనొప్పి ఏమిటి స్వామీ?' అన్నట్లు ముఖం పెట్టాడు నారదుడు. ఆ ముఖకవళికలను పసిగట్టాడు నల్లనయ్య. 'ఏం రాకూడదా... మందు కూడా ఉంది. తెచ్చేవారు లేరు' అన్నాడు.

'ఏమిటో చెప్పండి స్వామీ... క్షణంలో పట్టుకొస్తా'

'భక్తుల పాదధూళి. అది తలపై చల్లుకుంటే నొప్పి పోతుంది'

నారదమునీంద్రుడు నివ్వెరపోయాడు. తేరుకొన్న తరవాత వీధిలోకి అడుగుపెట్టాడు.

గోపకాంతలు మహర్షిని చూశారు. నమస్కారాలు చేశారు. ఆయన దిగులుగా ఉండటం గమనించారు. కారణం అడిగారు. శ్రీకృష్ణుని తలనొప్పిని వివరించాడు నారద మహర్షి.

అంతే. ఒకతె చటుక్కున నేలమీద చతికిలపడింది. చేతివేళ్లకున్న గోళ్లతో పాదాలకున్న మట్టిని తీస్తోంది. చెక్కపేడుతో మరొకతె మట్టె గోకుతోంది. అలా ఎవరికి వారు పనిలో మునిగిపోయారు. ఒక చేటనిండా మట్టి పోగుచేశారు. నారదులవారికిచ్చారు.

'ఈ మట్టిని స్వామి తలమీద నేను పోయలేను. పోస్తే పాపకూపంలో పడిపోతాను'

'ఎన్ని నరకాల్లో పడినా ఫర్వాలేదు. మా కిట్టయ్య తలనొప్పి తగ్గాలి' అంటూ చరచరా లోపలికి వెళ్లారు గోపికలు.

జగన్నాటక సూత్రధారి కృష్ణ పరమాత్మ తన భక్తిని పరీక్షించాడని గ్రహించడానికి నారదునికి ఎంతోసేపు పట్టలేదు.

భక్తి పండిన ప్రేమలో నారదాది మునీంద్రులకన్నా గోపికలు మెరుగని భాగవతం చెబుతోంది మనకు. బుట్టలో పాలు, పెరుగు, నెయ్యి పెట్టుకొని అమ్మడానికి వెళ్లింది ఓ గోపిక.

శ్రీకృష్ణ పాద సమర్పిత చిత్తంతో ఉన్న గోపిక పాలు పెరుగు నెయ్యి కొంటారా అనడంలేదు. గోవిందా దామోదరా మాధవా అని స్మరిస్తోంది. పరమాత్మ ఎడబాటును ఏమాత్రం సహించలేకపోవడమే నిజమైన ప్రేమతత్వం.

చిన్ని కృష్ణునికి యశోదమ్మ ఎన్నిసార్లు దిష్టితీసిందో చెప్పలేం. ప్రేమదశలో గుండెలోతుల్లోంచి వచ్చే భక్తి, తన్మయత్వం కొలిచేందుకు తూనికరాళ్లు లేవని చెప్పాలి. మన ప్రేమ, మన భక్తి అంతా- మన శరీరం, భార్యాబిడ్డలు, బంగారు ఆభరణాలు, బ్యాంక్‌ ఖాతాలు వంటివాటిపైనే ఉండటం సర్వసాధారణం.

పూజామందిరంలో ఓ క్షణం శాంతంగా ఉండొచ్చు, తక్కిన సమయమంతా రుసరుసలాడుతూ ఉంటారు చాలామంది. దేవుడినీ ఆ గదికే పరిమితం చేస్తారు. బయటికి వచ్చాక సంసారసాగరంలో మునగానాం తేలానాం.

అంతా నాదే అనేది మమతాభిమానం. నేను స్వతంత్రుణ్ని అన్న భావన అహంతాభిమానం. ఈ రెండు అభిమానాలూ పోవాలి. నేను పరతంత్రుడిని. సర్వస్వతంత్రుడు పరమాత్మ అన్న దృక్పథం కలిగితే ఆ రెండు అభిమానాలూ పోతాయి. ధారకం పోషకం భోగ్యం పరమేశ్వరుడే అని తలచినప్పుడు భగవత్‌ కటాక్షం లభిస్తుందంటారు.

కష్టాలు నీవే ఇచ్చావు. సుఖాలు నీవే ఇచ్చావు. అంతా నీదే. నాదేంలేదు. ఈశావాస్యమిదం సర్వం కదా. పాలముంచినా నీవే, నీటముంచినా నీవే, భారం నీదే స్వామీ అంటూ ఉంటారు పెద్దలు. యుద్ధరంగంలో శరణాగతి చేస్తూ తలవంచాడు అర్జునుడు. వాని భారం తలపైకెత్తుకున్నాడు భగవానుడు. ప్రహ్లాద నారదాదుల గోపికల స్థాయి చేరలేం. కనీసం భగవద్గీత చెప్పినట్లు, పెద్దలు చెప్పినట్లు- శరణాగతి చేసి భగవదనుగ్రహప్రాప్తికి నోచుకోవాలి.

పరమాత్మ కల్యాణగుణాలు స్మరించాలి. భగవానుల లీలలు కథలు కథలుగా వినాలి. సత్‌సంగంలో భాగస్వాములై పరమేశ్వరుని మీద బుద్ధి నిలిపితే విషయవాసనలు, దుర్బుద్ధులు నలిగి నశిస్తాయి. భగవత్‌ప్రాప్తి అనే శ్రద్ధ అసురశక్తుల్ని ధ్వంసం చేస్తుంది. 'నేను పరమాత్మకు చెందినవాడిని, ఇతరులకు బంధుమిత్రులకు కాదు. భగవత్‌ భాగవత ప్రీత్యర్థం పనులు చేస్తున్నాను. నేను ఆ స్వామి చేతిలోని ఒక పనిముట్టును' అని గ్రహించగలిగితే జన్మ చరితార్థమైనట్లే.


- రాళ్లబండి శ్రీనివాసన్‌

Read more...

గట్టిగా గాలివీస్తే ఎగిరి పోయేట్లుండే ఈ మనిషికి ఇంత శక్తి ఎలావచ్చిందబ్బా !??

>> Saturday, January 29, 2011


గాంధీ

ఈపేరు వినగానే పసివాని బోసినవ్వు చూసిన ఆనందం

కానీ చిన్న అనుమానం నన్ను వదలటం లేదు.

ఈయన చేసిన పోరాటం లో నాకు కొన్ని అనుమానాలు తీరటం లేదు.

ఈయన రూపం ,అలంకరణ చూస్తే ఏమాత్రం ఆకర్షణ కనిపించదు.

ఇక గొప్ప గొప్ప పోరాట యోధులకుండే శారీరిక దారుఢ్యం తోపోలిస్తే గాలివీస్తే ఎగిరిపోయేలాఉండే శరీరం .కొల్లాయిగుడ్డ.

ఇక ఆయన ప్రసంగాలు వింటే నాటి గొప్పగొప్ప వక్తల దరిదాపుల్లో కూడా నిలబెట్టలేం .
మరి ...ఇలాంటి మనిషి నాయకత్వంలో కోట్లాదిమంది జనులు ఏకమై తెల్లవాల్లతూటాలకు గుండెలను ఎదురొడ్డి ప్రాణాలు తృణప్రాయంగా వదలటానికి సిద్దపడ్డారే !!! ఎలా జరిగిందబ్బా !
ఏమిటీ మనిషిలోని ప్రత్యేకత . ఎక్కడిదీ శక్తి ఆమనీషికి .
ఎందుకంటే .......
ఏది ఆలోచిస్తాడో.అదిమాత్రమే పలికి ,ఏది పలికారో దానినే ఆచరించిన మనిషి ఆయన .
నిరంతర రామనామజపతత్పరుడాయన
ఒక సిద్ధాంతాన్ని అనుసరిస్తే ఎన్ని అవరోధాలెదురైనా సిధ్ధాంతాలను మార్చుకోని నాయకుడాయన
అహింసా సిద్ధాంతం తో ప్రారంభమైన ఉద్యంలో చౌరీచౌరా సంఘటన తో కలతచెంది నాయకులు ప్రజలంతా ఉద్యమాన్ని ఆపవద్దని కోరినా ,హింస జరిగినందున ఇది సిధ్దాంతానికి వ్యతిరేకమని ఉద్యమాన్ని నిలిపివేసిన మహామనిషి ...కాదుకాదు మహాత్ముడాయన . అని పెద్దలు చెప్పిన మాట నిజం . నిజం . అందుకేనేమో ఈదేశం .ప్రపంచమంతా ఆయనమాటలలోశక్తితో ప్రభావితమవుతున్నది.
నమస్సులు తాతా . మళ్ళీమళ్ళీ నీ పదములకు .నువ్వుచూపిన పథమునకు .

Read more...

వృద్ధులకేనా భక్తి!



తీర్థయాత్రల్లో. దేవాలయాల్లో, పౌరాణిక ప్రవచనాల వేదికల వద్ద మనకెక్కువగా వయోవృద్ధులే కనిపిస్తుంటారు. పిల్లలు, యువకులు చాలా తక్కువ సంఖ్యలో అగుపిస్తారు. పిల్లలకు అవన్నీ అంతగా ప్రయోజనకరం కాదన్న భావన పెద్దల్లో పాతుకుపోవడం కారణం కావచ్చు లేదా, మరేదైనా కావచ్చు. ఈ లోపం పెద్దలదే. బాల్యం నుంచే పిల్లల్లో భక్తిబీజాలు నాటాలి. మన సభ్యత, సంస్కృతి, సంప్రదాయాల విలువల్ని బోధించి వారిలో వీటిపైన అభిమానాన్ని, ప్రేమనీ పెంచే ప్రయత్నం చేయాలి. తీర్థయాత్రలకు వెళ్లేటప్పుడు పిన్నల్నీ తప్పనిసరిగా వెంటతీసుకుని వెళ్లి, ఆయా ప్రదేశాల ప్రాముఖ్యాన్ని వైశిష్ట్యాన్ని ఎరుకపరచాలి. దేవాలయాలకు తీసుకెళ్లినప్పుడు అక్కడి విగ్రహాలు, పూజలు, దీపారాధన, నివేదన, ప్రదక్షిణ మొదలైన విషయాలను గురించి వాళ్ళకు విపులంగా బోధించాలి.

మనదేశానికి ప్రాణపదమైన ఆధ్యాత్మిక సంపదకు నిజమైన వారసుల్ని అందించే గురుతర బాధ్యత మనపైన ఉంది. మన జాతికి అమోఘమైన పౌరాణిక, చారిత్రక నేపథ్యం ఉంది. రేపటితరాలకు వీటిని అందించవలసింది మనమే. పిల్లల వయస్సు, వివేచనాశక్తి, తరగతిస్థాయి, పరిసర వాతావరణ స్థితిగతులు, పర్యావరణం, గ్రహణశక్తి, ధారణ, ఆసక్తి, కుతూహలం మొదలైన అంశాలను దృష్టిలో ఉంచుకొని వారి వారి స్థాయినిబట్టి చిన్న చిన్న పౌరాణికగాథల్ని పిల్లలకు బోధించాలి. ఆ కథల నీతినీ బోధించి ఆచరించేందుకు ప్రేరేపించాలి. మన ఆచార వ్యవహారాలు, పండుగల చారిత్రక నేపథ్యాలను తెలియజెప్పాలి. మన సభ్యత, సంస్కృతి పట్ల విశేషమైన అభిమానాన్ని, ప్రేమను వారి హృదయాల్లో పెంపొందించాలి. పరభాషా సంస్కృతుల వ్యామోహంవల్ల, పాశ్చాత్య సంప్రదాయాల అనుకరణవల్ల పిల్లల్లో కుటుంబ విలువలు, అనుబంధ బాంధవ్యాల అవగాహన కొరవడిపోతోంది. ఇది- ఇలాగే కొనసాగితే హైందవ జాతి భారీమూల్యం చెల్లించుకోవలసిన దయనీయ స్థితిని చూడక తప్పదన్న అక్షరసత్యాన్ని ప్రతి వ్యక్తీ గ్రహించాలి.

మన ధర్మం అనాదినుంచీ తల్లి, తండ్రి, గురువు, దైవం, అతిథులు, అభ్యాగతులపట్ల అత్యంతాదరాభిమానాలు చూపాలని చెబుతున్నది. ఆధ్యాత్మిక సంపదను అభివృద్ధి చేసుకుని, ముక్తి సోపానాల్ని అధిరోహించమని హితవు చెబుతున్నది. ధార్మికతత్వ పరిరక్షణే మానవతా వికాసానికి పరాకాష్ఠ అని హెచ్చరిస్తున్నది. అందుచేతనే మనం గీత, రామాయణం, భారత, భాగవతాది పవిత్ర గ్రంథాల్లోని జ్ఞాననిధిని పిల్లలకు సుబోధకంగా ఎరుకపరచాలి. ఉత్తమ సంస్కారాలు వారి నడవడిలో కనిపించేలా చర్యలు తీసుకోవాలి. పరమత సహనంతోపాటు హైందవ విలువల పరిరక్షణకు పాటించవలసిన ధర్మసూక్ష్మాల్నీ సుగ్రాహ్యం చేయాలి. క్రమశిక్షణ, పరిశ్రమ, సమయపాలన అనే ప్రధానాంశాలకు సంబంధించిన పౌరాణిక, చారిత్రక సంఘటనలను వివరించి పిల్లల భవితవ్యాన్ని తీర్చిదిద్దాలి. ప్రహ్లాదుడు, ధ్రువుడు మొదలైన బాలభక్తుల ఆదర్శాలను పిల్లల మనఃఫలకాలపైన స్థిరపరచాలి. క్రీడలు, చిత్రలేఖనం, పదహేల, కవిత్వం, సంగీతం, నృత్యం వంటి ఆసక్తికరమైన కళలద్వారా ఆధ్యాత్మిక విలువల్ని వారి హృదయవేదికలపైన సుప్రతిష్ఠితం చేయాలి. కేవలం వయోవృద్ధులకే అంతర్యామి ఆరాధ్యుడు కాడనీ, పిల్లలతో సహా అందరికీ వందనీయుడు, చిరస్మరణీయుడని పిన్నలు గ్రహించేలా పెద్దలు తగు జాగ్రత్తలు తీసుకుంటే- రేపటితరాన్ని బంగారు కలలకు వారసులుగా తీర్చిదిద్దగలిగేవాళ్లమనిపించుకుంటాం!


- చిమ్మపూడి శ్రీరామమూర్తి

Read more...

ఆనంద రసకేళి



చాలామంది ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేందుకు భయపడుతూ ఉంటారు. భగవంతుడంటే అంతో ఇంతో భక్తి ఉన్నా, ఆధ్యాత్మిక సాధనలపట్ల ఎంతో కొంత ఆసక్తి ఉన్నా కఠిన నియమాలు ఆచరించే తీరిక, ఓపిక లేవని జంకుతూ ఉంటారు. సత్యవ్రతం, అహింస, వేకువ మెలకువలు, చన్నీటి స్నానాలు, మడి వస్త్రాలు, జపధ్యానాలు, గురుసేవలు... ఆధునిక విశృంఖల జీవితాన్ని కట్టడిచేసే ఈ నియమ నిబంధనలు ఏ సగటు ఆధునిక వ్యక్తినైనా వెనకంజ వేయిస్తాయి.

భక్తి, భగవన్మార్గం కేవలం నియమనిబంధనల సమాహారం కాదు. అదో అంతరంగ ఆనంద రసకేళి. రామకృష్ణ పరమహంస అన్నట్లు భక్తిభావన ఒక ఆట. 'ముక్తికై తారట్లాడకండి, ఆడుకోండి. ముక్తి అంటే ఆట ముగియటమే' అని. కేవలం కఠిన నియమ భయ కారణంగా ఆ ఆనంద రసాంబుధిలో ఓలలాడే భాగ్యాన్ని వదులుకోవటం అమాయకత్వమే. భక్తి సాధనల మధుర ఫలరసాల్ని గ్రోలలేకపోవటం దౌర్భాగ్యమే. నిర్విరామ జీవనపోరాటంలో సేదదీర్చే ఆ అద్భుతమైన ఆటను ఆస్వాదించలేకపోవటం దురదృష్టమే. ఇదంతా తెలియనంతవరకే. తెలిస్తే అదో పూలబంతులాట, కోలాట.

భక్తి, సాధన అంటే- నియమ రహితమా? పవిత్రాతి పవిత్రమైన భగవంతుణ్ని మలిన దేహంతో, నియమ రహిత జీవన విధానంతో కొలవవచ్చా? 'ఔను... కొలవవచ్చు'. భగవంతుని దృష్టిలో మాలిన్యమంటూ ఏదీ లేదు. పరమ 'ఆత్ము'డైన ఆయన దృష్టిలో, సృష్టిలో అంతా ఆత్మస్వరూపమే. ఏకాత్మ భావనలో లీనమైన ఎందరో మహాత్ములు మలాన్ని, మధురఫలాల్ని ఏకభావంతో స్వీకరించిన సందర్భాలే మనకు దృష్టాంతాలు. శబరి అర్పించిన ఎంగిలి పళ్లతో, కన్నప్ప పెట్టిన మాంస నైవేద్యాలతో, విదురుడు అందించిన పళ్లతొక్కల్లో- ఆయన చూసింది భక్తుడి హృదయాన్ని మాత్రమే. సమస్తాన్నీ ద్వైదీభావంతో, ఇంకా చెప్పాలంటే అనేక భావంతో చూసే మనకు మాత్రమే ఈ తేడాలు. వేరు భావాలు. భగవంతుడిది మాతృ హృదయం. అంతేనా! మాతృమూర్తినే సృష్టించిన ఆయనది మరెంత మార్దవ హృదయమై ఉండాలి! తల్లిబిడ్డను ఆ బిడ్డ ఉన్న స్థితిలోనే ప్రేమిస్తుంది. భగవంతుణ్ని ప్రేమించే భక్తుణ్ని ఆయనా ఆ భక్తుడి సహజస్థితిలోనే స్వీకరిస్తాడు. ఉన్నవాణ్ని ఉన్నట్లుగా అనుమతిస్తాడు. పూల సాంగత్యంతో దారంలా ఆ తరవాతే భక్తుడు సుగుణాల సౌరభాన్ని పులుముకొంటాడు. ఆకాశం నల్లనిదే అయినా పూర్ణ చంద్రుడి రాకతో పుచ్చపూవైపోతుంది. భక్తిరస లోలుడైన ఆ రాకా చంద్రుణ్ని మనమూ మన హృదయాకాశంలోకి ఆహ్వానిద్దాం. వెన్నెలలు పూయించుకుందాం.

శాస్త్రాలు, నియమాలు, కఠిన సాధనలు... ఇవన్నీ ఉండవలసిందే, ఉండి తీరవలసిందే. అయితే ఎప్పుడు? ఇప్పుడు... ఇప్పుడే... వాటికి భయపడినప్పుడే కాదు. ఆ కారణంగా ఆ పరమాత్మకు దూరమైనప్పుడు కాదు. ముందు మనమున్న స్థితిలోనే ఆయనను సమీపిద్దాం. ఆయనతో స్నేహం చేద్దాం. మంచి స్నేహితుడు మనలోని మాలిన్యాలను పట్టించుకోడు. దేవుడూ అంతే. తల్లి తన బిడ్డను ఉన్నతంగా చూడాలనుకుంటుంది. నిజమే... అయినా నీచస్థాయిలో, స్థితిలో ఉన్న బిడ్డను కూడా అమ్మ అక్కున చేర్చుకుంటుంది. అమ్మ బిడ్డ శుభ్రంగా ఉండాలనుకోవటం సహజమే. అయినా మాలిన్యాన్ని పులుముకుంటే ముందు దగ్గరకు తీసుకుంటుంది. ఆపై నిర్మాలిన్యం చేసి ముద్దు పెట్టుకుంటుంది. భగవంతుడూ అంతే. మనలోని లోక సహజ మాలిన్యాలకు ఆయన ప్రాధాన్యాన్నివ్వడు. ఆయన సామీప్యానికి వెళ్లే కొలదీ మన ప్రమేయం లేకుండానే అవి క్రమంగా తొలగిపోతాయి. గాలి వీచే చోటికి వెళ్లినప్పుడు మన బట్టలమీది దుమ్ము లేచిపోతుంది. చెమట ఆరిపోతుంది. చల్లని సమీరాలతో సేదదీరుతాం.

ముందు ఆ అపురూప అతిథికి మన హృదయంలో స్థానమిద్దాం. అందుకు ప్రాథమిక ప్రయత్నంగా ఆయన పవిత్రపాదాలవైపు అడుగులు వేద్దాం, చూపు సారిద్దాం. మనో హస్తాలతో వాటిని తాకే ప్రయత్నం చేద్దాం. చాలు. ఈ మాత్రానికే మనలోని భయాలన్నీ పటాపంచలైపోతాయి. ఆ తరవాత ఆయనకు సంబంధించిన ఊహ, ఆపై ఆయనమీద ఆసక్తి, దరిమిలా ఆయన గురించిన ఆలోచన ఆయన పట్ల అనురక్తి పెంచి మనకు తెలీకుండానే సాధనల వైపు అడుగులు వేస్తాం. క్రమేణా... నిండా మునిగిపోతాం... ఆయన అత్యంత అద్భుత ఆకర్షక ప్రేమాంబుధిలో కాకపోతే... ఆయన ప్రేమాంబుధిలో మనమా? మన ప్రేమాంబుధిలో ఆయనా? తెలీదు. ఎందుకంటే అప్పటికే చక్కెర బొమ్మలమై ఆ అమృతార్ణవంలో కరిగిపోయి ఉంటాం!!


- చక్కిలం విజయలక్ష్మి

Read more...

శివుణ్ని మలిచే శిల్పి

>> Friday, January 28, 2011



క శిల, ఒక శిల్పం, ఒక శివుడు...!
ఒక కళాకారుడు శిలను శిల్పంగా మలుస్తాడు. సాధారణ శిలకు తన కళద్వారా ప్రాణంపోసి ఒక రూపాన్ని, జీవ చైతన్యాన్ని పొదుగుతాడు. హావభావాలను ప్రదానం చేస్తాడు. చిరునవ్వును చెక్కుతాడు. విశ్వామిత్రుడిలా సృష్టికి ప్రతిసృష్టి చేస్తాడు. పరమాద్భుతమైన మరో విషయం ఉంది. అది... ఒక భక్తుడు శిలలో సాక్షాత్‌ శివుణ్ని మలచుకుంటాడు. రాయిలో రాముణ్ని సృష్టించుకుంటాడు. నిర్జీవ వస్తువులోంచి నిటలాక్షుని వెలికితీస్తాడు. శిలలోంచి శిల్పం వస్తుంది. అది వస్తువుది కావచ్చు. మనిషిది కావచ్చు. దేవతామూర్తిదీ కావచ్చు. నిజమే. సహజమే. కానీ... శివుడు, కృష్ణుడు, రాముడు...!!! అదీ సాకారంగా, చిన్మయమూర్తిగా...!!! ఎంత అద్భుతం! ఇది ఎలా సాధ్యం!? భక్తి... భగవంతునిపట్ల అతిశయించిన ప్రేమ. పరమప్రేమ. ఆ నిరాకారుడు, ఆ నిర్గుణుడు ఆకారాన్ని దాల్చి రాముడిగా, కృష్ణుడిగా, దేవిగా భక్తుడి ముందుకు హఠం చేసి ఆ పసిబాలుడి ముందుకు నడచిరాక తప్పదు. నడయాడక తప్పదు. ఇందుకు ఏ అద్భుతమైన ఉలి కావాలి!? ఎలాంటి అపురూపమైన సుత్తి ఉండాలి!? ఇవేవీ అవసరం లేదు. ప్రేమ, భక్తి, సమర్పణ, శరణాగతి ఉంటే చాలు. తనకంటూ ఏమీ దాచుకోకుండా, తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా, తనదంటూ ఏమీ లేకుండా, చివరకు తనంటూ, నేనంటూ ఒక ఉనికి, ఒక 'అహం'భావం ఏమీ మిగలని ఆత్మస్వరూపంగా సర్వ సమర్పణ చేయాలి. అలాంటి శరణాగతుడు రాతిగుండులోని ఈశ్వరుణ్ని- అణువణువూ శోధించి, పరిశోధించి, సాధించి వెలికి రప్పిస్తాడు. ప్రత్యక్షం చేసుకుంటాడు. అయ్యేదాకా వదలడు. అయితే... కోరుకుంటే కాడు శివుడు. రమ్మంటే రాడు రాముడు. భక్తుడిలో ఆ భావం ఉండాలి. ఆ విశ్వాసం ఉండాలి. ఆ ఆర్తి, ఆ ఆవేదన, ఆ హఠం ఉండాలి. అణువణువునా ఆవరించి ఉన్న ఆ తత్వాన్ని గుర్తెరిగి ఉండాలి. ప్రేమతోపాటు భగవంతునితో ఆ చనువు, ఆ అధికారం, ఆ నమ్మకం శ్రుతి మించి ఉండాలి. మితిమీరి ఉండాలి. ఒక రాతి గుండుకు సొంత కళ్లు పెరికి అమర్చగల విశ్వాసం, స్తంభంలో తాను చూడటమే కాదు- తండ్రికీ చూపించగలననేంత ధీమత్వం, ఆయనను నమ్మి విషం కూడా తాగేంత నిర్భయత్వం, నీళ్లలోకి, నిప్పులోకి ఉరికేంత భయరాహిత్యం, మైమరచిపోయి అరటి తొక్కను ఎంగిలి పళ్లనూ తినిపించగలిగేంత మమేకత్వం... ఇవి ఉండాలి. ఇవన్నీ ఉండాలి. ఇంకా ఎన్నో ఉండాలి.

భక్తుడికోసం భగవంతుడు శిలనో, అలనో చీల్చుకుని రావటం కాదు. పండుతింటాడు. పిండి విసురుతాడు. పల్లకీ మోస్తాడు. బంటు అవుతాడు. బందీ అవుతాడు. బంధనాలు తెంచుతాడు. భక్తుడికి, భగవంతుడికి మధ్య ఉన్న అనుబంధం ఏ బంధనాలకూ లొంగనిది. ఏ కఠిన పరీక్షలకూ వెరవనిది. ఏడ్చే బిడ్డ తంతు. బిడ్డదీ, భక్తుడిదీ కూడా. తల్లికోసం బిడ్డ ఏడ్చే ఏడ్పులో సిగ్గు, బెరుకు, సంకోచం, సందేహం ఏమీ ఉండవు. నీళ్లు, నిప్పు, పాము, పల్లం అడ్డమున్నవేవీ కనిపించవు. తల్లికీ అంతే. భక్తుడికీ, భగవంతుడికీ మధ్యా ఇదే! సిరికింజెప్పడు, శంఖ చక్రములన్‌ ధరియింపడు... భగవంతుడు! భగవంతుని చేరుకునే ఆత్మావలోకన మార్గంలో ఏ అవరోధమూ భక్తుణ్నీ ఆపలేదు. అడుసులో అనుంగు బిడ్డనైనా తొక్కేస్తాడు. ఏనుగులతో తొక్కించుకుంటాడు. ఇలాంటి బిడ్డను ఏ తల్లి నిరాదరిస్తుంది? ఇలాంటి భక్తుణ్ని ఏ దేవుడు నిరాకరిస్తాడు? శిలలోంచి శిల్పం కాదు. శివుడే నడిచి వస్తాడు. రాయిలోంచి రాముడే వేంచేస్తాడు. రాతిని నాతిని చేసిన రాముడు కాదు... రాతిలోంచి రాముణ్ని రమ్మని పిలిచి సాధించిన భక్తుడే ఘనుడు. ఘనాఘనుడు. అందుకే ఆంజనేయుడు- రాముని భక్తుని, ఆ భక్తుని భక్తుని, ఆ భక్తుని భక్తుని భక్తుని పాదదాసుణ్ని నేను' అన్నాడు.


- చక్కిలం విజయలక్ష్మి

Read more...

స్వయంజ్యోతి స్వరూపం

>> Thursday, January 27, 2011

స్వయంజ్యోతి స్వరూపం
బ్రహ్మతత్వం జగత్తులో చాలా గొప్పది. మహత్‌ పదార్థాలైన ఆకాశాదుల కంటే పెద్దది. అది స్వయంజ్యోతి స్వరూపం. లోకంలోని వస్తువులను ఇంద్రియాల (కన్ను, ముక్కు, చెవి) ద్వారా తెలుసుకొని వాటి రూపాన్ని ఆలోచించవచ్చు. బ్రహ్మ స్వరూపాన్ని అట్లా ఆలోచించేందుకు వీలుకాదు. అదొక గొప్ప పదార్థం. అది ఎప్పుడు ఒక్కటిగా ఉంటుంది. మార్పులేనిది. అది సత్యానికి పరమావధి. దానికి మించిన సత్యమింకొకటి లేదు.

జ్యోతి స్వరూపుడైన పరమాత్మను దర్శించేందుకు నిత్యం సత్యభాషణ చేయడం, సుఖదుఃఖాలను సమానంగా సహించడం, మానావమానాలను శీతోష్ణాలను భరించడం, భగవంతుని యథార్థమైన అనుభూతిని పొందడం, బ్రహ్మచర్యాన్ని పాలించడం మొదలైనవి సాధనాలు. తపస్సుతోనే బ్రహ్మస్వరూపాన్ని మనం పొందగలం. నిత్యం యోగాభ్యాసం ద్వారా మనస్సులోని అసూయ రాగద్వేషాలను, కామ, క్రోధ లోభ మోహ మద మాత్సార్యాలనే మాలిన్యాలను తొలగించుకోవాలి. సమాధి అవస్థలో సమస్త జగత్తును మరచిపోవాలి. వేదాలకు కర్తయైున పరమాత్మను ధ్యానించి యోగిగా మారిపోవాలి. అప్పుడే సాధకుడు సర్వ దుఃఖాల నుంచి ముక్తుడై నిర్మలుడవుతాడు.

ప్రణవం అంటే ఓమ్‌. అది ధనువు. జీవుడు బాణం. బ్రహ్మ లక్ష్యం. ముక్తిని ఆశించే ముముక్షువు ప్రణవ జపంతో తనను తాను బ్రహ్మకు అర్పణ చేసుకోవాలని భావం. ప్రణవం భగవంతుని సర్వోత్తమనామం. ఓమ్‌ అంటే రక్షకుడని అర్థం. అర్థ భావంతో ప్రణవ జపం చేసేవారికి మనస్సు ఏకాగ్రతమవుతుంది. ఆ మనస్సే పరమాత్మను తెలుసుకొనేందుకు సమర్థమవుతుందని ముండకోపనిషత్‌ తెలియజెబుతోంది.

మానవజన్మ ఇతర జన్మల కంటే చాలా ఉత్తమం. ఈ జన్మలోనే తనను తాను తెలుసుకోవాలి. వారికే జన్మ సఫలమవుతుంది. అట్లాకాక ఇంద్రియ సుఖాలకు లోనైనవారు మంచి చెడులను ఆలోచింపక శుభ అశుభాలను గురించి తెలుసుకోనివారు- మానవజన్మ విలువను గుర్తించలేరు. క్షణిక సుఖాల కోసం జీవితాలను వ్యర్థం చేసుకుంటారు. ఇంతకుమించిన నష్టం మానవజన్మకు మరొకటిలేదని ఉపనిషత్కాలంటున్నారు. అందుకే విద్వాంసులు విషయ వాసనల్లో అంటే శారీరకపరమైన సుఖాల్లో చిక్కుకోరు. వారు ధ్యాన సమాధి ద్వారా సర్వప్రాణులందు సర్వ పదార్థాలందు వ్యాపకమై ఉన్న పరమాత్మను తెలుసుకొని అమరులవుతారు. జన్మమరణ రూప దుఃఖ పరంపర నుంచి తొలగి స్వయంజ్యోతి స్వరూపమైన పరబ్రహ్మలోని ఆనందాన్ని అనుభవిస్తారని వేద రుషులు ఉపదేశిస్తున్నారు.

భగవంతుడొక్కడే. అతడు సమస్త చరాచర జగత్తును సృజించి వానిలో నిరంతరం వ్యాపకుడై ఉన్నాడు. బ్రహ్మాండాన్ని తన వశంలో ఉంచుకున్నాడు. ఈ ప్రపంచం ప్రళయంలో సూక్ష్మమై ప్రకృతి రూపంలో ఉంటుంది. సృష్టిలో ఈనాడు మనం చూస్తున్న వివిధ రూపాలు ఆనాడుండవు. అప్పుడు ఒకే రూపంలో అది భాసిస్తుంది. అట్లాంటి సూక్ష్మరూపంలో ఉన్న ప్రకృతిని వివిధ రూపాల్లో పరిణమింపజేసేవాడు పరమాత్ముడే. యమనియమాది యోగాంగాలను అనుష్ఠించే ధీరులే ఆ భగవంతుని సాక్షాత్కారం చేసుకుంటారని కఠోపనిషత్తు చాటుతోంది.

బుద్ధిమంతులు ముందుగా తమను తాము తెలుసుకున్న తరవాతనే పరమాత్మను తెలుసుకుంటారు. ఆత్మను తెలుసుకోనంత వరకు అందులో ఉండే పరమాత్మను తెలుసుకోవడం సాధ్యంకాదు. అందుకే రుషులు 'పశ్యంతి' అని చెప్పక 'అనుపశ్యంతి' అని వివరిస్తున్నారు. పశ్యంతి అంటే తెలుసుకోవడం; 'అనుపశ్యంతి' అంటే తరవాత తెలుసుకోవడమని అర్థం.

ఆత్మ సాక్షాత్కారానికి తరవాత పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అట్లాంటివారికే శాశ్వత సుఖమైన మోక్షానందం లభిస్తుంది. ఇతరులకు అది లభించదని ఉపనిషత్తుల్లో రుషులు వివరిస్తున్నారు.

- డాక్టర్‌ సంధ్యావందనం లక్ష్మీదేవి

Read more...

భావనకు బలముంది

>> Wednesday, January 26, 2011


[- సామవేదం షణ్ముఖశర్మ]
సంఘటన బహిరంగం. భావన అంతరంగం.

ఈ రెండూ ఒకదానిపై ఒకటి ప్రభావం చూపించడం సహజం, సంఘటనను అంచనా వేయడమో, అనుభవించడమో చేయగలం- కానీ పూర్తిగా మార్చగలగడం మనవల్ల అవుతుందా! అన్ని సందర్భాల్లోనూ కుదరదేమోగానీ; తగిన ప్రణాళికలతో, ప్రయత్నాలతో కొన్నిటినైనా మలచగలం, మార్చగలం అనడంలో సందేహించనక్కర్లేదు. జరగబోయేవి మన చేతుల్లో లేవు- అనడం నిజం కావచ్చు. కానీ 'సద్భావన'తో వాటిని ప్రయోజనకరంగా పరిణమింపజేయగలం- అని శాస్త్రాలు రుజువు చేస్తున్నాయి.

భావనలో సలక్షణం ఉంటే- 1. సంఘటన తీవ్ర ప్రభావం చూపించకపోవచ్చు, 2. లేదా, అది తప్పిపోవచ్చు, 3. దాన్ని తట్టుకొని, సానుకూలంగా మలచుకొనే సమర్థత పొందవచ్చు. అందువల్లనే భావనను బలపరచే సాధనలు మనకు సూచించారు మహర్షులు. ధ్యానం, తపస్సు, క్రమబద్ధమైన జీవితం... భావనకు బలాన్నిస్తాయి. సంకల్ప సిద్ధులు కావడమంటే ఇదే. 'భావనాయోగం' అనే దివ్యప్రక్రియను కొన్ని ఆధ్యాత్మిక శాస్త్రాల్లో వివరించారు. ఒక యోగంగా అభ్యసిస్తే భావనను కళ్లముందు సత్యంగా సాక్షాత్కరింపజేయవచ్చు- అని శాస్త్రనిరూపణ. ఆధ్యాత్మికసిద్ధికి భావనే ఆధారసూత్రం. 'చిత్తంకొద్దీ శివుడు-విత్తం కొద్దీ వైభవం' అనీ సామెత. భౌతికరంగంలోనూ ఈ భావనాబలం పనిచేస్తుంది. జీవితంలో అనుబంధాలు, అనుభవాలు భావంతో అల్లుకున్నవే. ఏకాగ్రచిత్తంతో, యోగశాస్త్రపద్ధతుల్లో తపశ్శక్తితో భావనను దృఢపరిస్తే దేనినైనా సాధ్యం చేయవచ్చు... అని ధైర్యాన్నిస్తున్నాయి. దానికి ఎన్నో తార్కాణాలు నేటి యుగంలోనూ చూడవచ్చు. ఎల్లవేళలా సానుకూల సకారాత్మక భావన కలిగి ఉండి, దాన్నే వ్యక్తీకరించేవాడు తప్పకుండా విజయాలు సాధించగలడు. స్వప్నాలను సత్యం చేసుకోగలడు, ఏ పనినైనా ప్రారంభించేటప్పుడు 'ఇది నేను చేయగలను- చేసి తీరతాను' అనే దృక్పథం ఉన్నప్పుడు ఆ పని దాదాపు సిద్ధించినట్లే. ఈ సద్భావన ఇచ్చే బలం ఏ అవరోధాన్నైనా ఎదుర్కొనేలా చేస్తుంది. ఈ విధానమే 'శుభాకాంక్షలు'లో ద్యోతకమవుతుంది.

దీవెనలు, ఆశీర్వచనాలు, ప్రార్థనలు... ఇవన్నీ శుభాకాంక్షలే. పెద్దలు మనసారా పలికే దీవెనలు, శుభాన్ని 'ఆశించి' చెప్పే ఇతరుల ఆశీస్సులు, భగవచ్ఛక్తిని ఆరాధిస్తూ మనకోసం, ప్రపంచం కోసం ప్రసరించే మంచి భావాల ప్రార్థనలు... ఇవన్నీ ప్రాచీనకాలంనుంచి మనదేశంలో సంప్రదాయాలు. పర్వదినాల్లో, కార్యారంభాల్లో, శుభకర్మల్లో ఈ ఆనవాయితీ నేటికీ ఉన్నది. ముఖ్యంగా కాలం మలుపుల్లో శుభకామనను వ్యక్తపరచడం మానవ స్వభావం. అందుకే దేశాలేవైనా, మత, సంస్కృతులేవైనా అందరూ వారి కాలమానాల ప్రకారం- ఏడాదంతా ఆనందమయం కావాలని కోరుకుంటారు. 'ఈ సంవత్సరంలో జరిగే మార్పులన్నీ శుభకరంగా ఉండాలి...' అంటూ ప్రపంచంలోని ప్రథమ వాఞ్మయమైన వేదంలోనే కనబడుతోంది. నూతన సంవత్సర శుభాకాంక్షలను వేదం తొలిసారి పలికింది. జరగబోయే చెడు ముందే తెలిసినా, సద్భావంతో కాలాన్నే మార్పుచేసిన వైనాలు మన పురాణాల్లో కోకొల్లలు. తన భర్త సత్యవంతుడు కొద్దికాలంలో మరణిస్తాడని తెలిసీ నిబ్బరంగా నిలబడింది సావిత్రి. నిజానికి వివాహానికి పూర్వమే ఆమెకు తెలుసు. కానీ ధైర్యంగా, తన ప్రేమకు ప్రాధాన్యమిచ్చి పెళ్లాడింది. తనకు తెలిసిన నిజం భర్తకు చెప్పలేదు. తాను తపస్సాధనను కొనసాగిస్తూ, తన భర్తకు ఆయువు పెరగాలనే సద్భావాన్ని కేంద్రీకృతం చేసింది. సద్భావాన్ని విశ్వాసంతో, ఏకాగ్రంతో బలపరచడమే కదా తపస్సు! దాని ఫలితంగా కాలం (కాలుడు = యముడు) ఆమెను అనుగ్రహించింది, అనుకూలపడింది. జరగబోయే దుస్సంఘటనను తప్పించగలిగింది. మానవుడు తన సద్భావనాబలంతో దేన్నైనా సాధించగలడనడానికి ఇదో తార్కాణం! 'నేను లంకకు వెళ్లి సీత జాడ తెలుసుకొని తీరతాను' అనే సద్భావనను సమర్థంగా సత్యంచేశాడు హనుమ. సీతమ్మకు ఆ శుభభావనను ప్రసరించి ధైర్యాన్నిచ్చాడు. అరణ్యవాస సమయంలో ధర్మరాజు వద్దకు వచ్చిన అనేకమంది రుషుల దీవెనల్లోంచి ఈ సద్భావన శుభాకాంక్షలుగా వెలువడి శుభాన్నే కలిగించింది.

శుభాన్ని ఆకాంక్షించడం ఎన్నడూ వ్యర్థం కాదనేది- సారాంశం. వ్యర్థంకాని విధంగా ఆకాంక్ష తెలపాలంటే ఆ తెలిపే చిత్తంలో నిజాయతీ, శుద్ధి ఉండాలి. అప్పుడది అమోఘమవుతుంది, ఫలవంతమవుతుంది. సద్భావన స్వభావమైతే ప్రభావం తప్పక ఉంటుంది.


Read more...

సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వసంపద నాకు గర్వకారణము.

>> Tuesday, January 25, 2011


భారతదేశము నామాతృభూమి

తొమ్మిది నెలలు మోసే తల్లి గొప్పది.అంతకంటే పుట్టినప్పటినుంచి తనమట్టిలో కలిసేవరకు నన్నుభరించి లాలించి పాలించి సర్వంసమకూర్చిన నాతల్లి ఈదేశం.

భారతీయులందరు నా సహోదరులు.

ఈ దేశస్థులైన ప్రజలందరు ఈదేశమాత బిడ్డలందరు ఏకోదరులు కాన నాకుసోదర సోదరీమణులని వారి క్షేమము నాక్షేమమని విశ్వసిస్తున్నాను.

నేను నాదేశమును ప్రేమించుచున్నాను

నాతల్లిని ఎలాప్రేమిస్తున్నానో ! అంతకుమిన్నగా ఈనేల తల్లిని ప్రేమిస్తుంటాను.

సుసంపన్నమైన ,బహువిధమైన నాదేశ వారసత్వ సంపద నాకెంతో గర్వకారణము

ఈ నా మాతృభూమి నాకు ప్రసాదించిన విజ్ఞానము,సంస్కృతి,సంప్రదాయాలన్నీ ప్రపంచములోనో ఉన్నతమైనవి అని ప్రగాఢముగా విశ్వసించి బహువిధములుగా విలసిల్లిన ఈ సంపదను వారసత్వంగా పొందిన నేనెంతోధన్యుడనని గర్వపడుతున్నాను.

దీనికి అర్హుడనగుటకై సర్వదా నేను కృషిచేయుదును

మహామహులైన నాపూర్వీకులంతా ప్రసాదించిన ఈ వారసత్వాన్ని పొందటం అదృష్టం .అందుకుకూడా నాకు అర్హత ఉన్నదా లేదా అని నిరంతరం పరిశీలించుకుంటూ ఆ అర్హతపొందటానికై తపిస్తుంటాను.

నాతల్లిదండ్రులను,ఉపాధ్యాయులను,పెద్దలందరినీ గౌరవింతును

జన్మనిచ్చిన తల్లిదండ్రులను, అజ్ఞానమునుండి సుజ్ఞానమువైపు పయనించుటకు కారకులైన గురువులను, ఈవారసత్వాన్ని పరంపరాగనుగతంగా అందజేస్తున్న పెద్దలను గౌరవించటం నా జన్మకుసార్ధకత చేకూరుస్తుంది.

ప్రతి వారితోటీ మర్యాదగా నడుచుకొందును

నాకు ఏవిధమైన గౌరవమర్యాదలు కావాలనుకుంటానో అవి ఇతరులకు నానుంచి ఇవ్వటానికి ప్రయత్నిస్తుంటాను.

నా దేశము పట్లను, నాప్రజలపట్లను సేవానిరతి కలిగియుందునని ప్రతిజ్ఞచేయుచున్నాను .

నాదేశాన్ని,నాదేశప్రజలను సేవించుకునే అవకాశం మహద్భాగ్యం గా భావిస్తూ అందుకు సంసిద్ధుడనైయున్నాను

వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందమునకు మూలము

"తవసుఖేన మమ సుఖం" అనే సూత్రాన్ని నేర్పింది నా సంస్కృతి . భోగము ద్వారా కాదు త్యాగము ద్వారా మాత్రమే నిజమైన ఆనందం కలుగుతుందని చెప్పి ఆచరణాత్మకంగా నిరూపించిన పుణ్యభూమి ఇది . ఇది సత్యం ..సత్యం..సత్యం. అని ఎలుగెత్తి చాటుతున్నాను.


. [ఈ నేలపై పుట్టి ఈగాలి పీల్చి.ఈ నీరుతాగి, బిడ్డఎదగటానికి గుండెలపై కాళ్ళుచేతులూ తాడిస్తున్నప్పుడు ఆనందించే తల్లిలా మనకోసం సర్వంప్రసాదించిన ఈ నేలతల్లిని ,ఈ సంస్కృతిని ఉపయోగించుకుని కూడా అవన్నీమరచిపోయి ఈ పుణ్యభూమిని విమర్శిస్తూ,ద్వేషిస్తూ,ధూషించే అవమానిస్తూ,అంతచేయాలనుకునే నికృష్ట జీవులను మాత్రం నాకంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నా చివరిశ్వాస దాకా వ్యతిరేకిస్తాను, ఈ నామాతృభూమికోసమై .వేలవేలసార్లు మరణించి జన్మిస్తూనే ఉంటాను .]


వందేమాతరం .

Read more...

త్యాగరాజస్వామి ఆరాధన

>> Monday, January 24, 2011

త్యాగరాజ ఆరాధన
- డాక్టర్‌ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి
కీర్తనలో ఉండే సాహిత్యానికి వాక్కు అనీ, స్వర రచనకు గేయమనీ పేర్లు. వాక్కునూ గేయాన్నీ స్వయంగా సమకూర్చగల వారిని వాగ్గేయకారులంటారు. మన తెలుగు వాగ్గేయకారుల్లో ప్రప్రథమంగా లెక్కించదగినవాడు త్యాగరాజు.త్యాగరాజు కీర్తనలు ఆయన వ్యక్తిత్వానికి నిలువుటద్దాలు. ఆయన వేదాంతచర్చలో వ్యాసుడు, మృదుమధురమైన కవితా రచనలో వాల్మీకి, వైరాగ్యంలో శుకుడు, భక్తిలో ప్రహ్లాదుడు, సాహిత్యంలో బ్రహ్మ, సంగీతంలో నారదుడు, రామభక్తి తత్పరతకు వచ్చేసరికి పరమేశ్వరుడిని మించినవాడు. ఈ లక్షణాలన్నీ అతని కీర్తనలలో కనిపిస్తున్నాయి.

త్యాగరాజు ముత్తాత పంచనదబ్రహ్మం నేటి ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం కాకర్ల గ్రామ వాస్తవ్యుడు. కారణాంతరాల వలన తంజావూరు మండలంలోని తిరువారూర్‌ గ్రామానికి సకుటుంబంగా వలస వెళ్లాడు. సర్వజిత్‌ నామ సంవత్సర చైత్ర బహుళదశమి సోమవారం (4-5-1767) నాడు ఆ ఊళ్లోనే త్యాగరాజు జన్మించాడు. తల్లి సీతమ్మ, తండ్రి రామబ్రహ్మం.

త్యాగరాజుకు బాల్యంలోనే సంగీతం పట్ల మక్కువ ఏర్పడింది. శొంఠి వేంకట రమణయ్య వద్ద ఆయన సంగీత పాఠాలను ప్రారంభించాడు. నారదానుగ్రహం వలన ఆయన ఆ విద్యలో నిష్ణాతుడై గొప్ప వాగ్గేయకారుడయ్యాడు.

త్యాగరాజు 24,000 కీర్తనలు రాశాడని కొందరన్నారు. కానీ, ప్రస్తుతం మనకు 711 మాత్రమే లభిస్తున్నాయి. నగుమోము గనలేని, సామజవరగమనా, ఏతావునరా?, వందనము రఘునందనా, నిధి చాలా సుఖమా, బంటురీతి కొలువు, ఏలా నీ దయ రాదూ- మొదలైనవన్నీ మనకు బాగా తెలిసినవే!

త్యాగరాజు కీర్తనలన్నీ ఆయన స్వయంగా చేసిన రాగతాళ నిర్దేశంతోనే, స్వరరచనతోనే మనకు లభించాయి. అతని శిష్య పరంపర ఈనాటి వరకూ అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. అందుకే మనం అందరమూ వాటిని ఒకే విధంగానే పాడుకొని ఆనందిస్తున్నాం!

జగదానంద కారకా, దుడుకు గల నన్ను, సాధించెనే, కనకన రుచిరా, ఎందరో మహానుభావులు- అనేవి ఆయన ఘనరాగ పంచరత్న కీర్తనలు. మన కర్ణాటసంగీత సముద్రం నుంచి ఉద్భవించిన అనర్ఘరత్నాలివి.

త్యాగరాజు పుదుక్కోటై సంస్థానంలో జ్యోతిస్స్వరూపిణి రాగాన్ని ఆలపిస్తే ప్రమిదలోని వత్తి వెలిగిందట. బిలహరి రాగంలో 'నా జీవాధారా...' అనే కీర్తన పాడితే మరణించిన వ్యక్తి బతికాడంటారు. తిరుపతిలో 'తెరతీయగరాదా...' అనే కీర్తనను గానం చేస్తే వేంకటేశ్వరస్వామి వారి గర్భాలయ ద్వారానికి వేసిన తెర జారి కిందపడిందని చెబుతారు. 'ముందు వెనుక...' అనే కీర్తననాలపిస్తే రామలక్ష్మణులిద్దరూ ధనుర్బాణాలు ధరించి వచ్చి త్యాగరాజు కూర్చున్న పల్లకిని అటకాయించిన దొంగలను పారదోలారని చెప్పుకొంటారు.

నిధి కన్నా రాముని సన్నిధే సుఖమన్నాడు త్యాగరాజు. శాంతము లేక సౌఖ్యము లేదన్నాడు. మనసు స్వాధీనమైన ఘనుడికి మంత్రతంత్రాలతో పనిలేదన్నాడు. సంగీత జ్ఞానము, భక్తి వినా సన్మార్గము కలదా అని ప్రశ్నించాడు. ఆ సంగీత మార్గంలోనే ప్రయాణించాడు. ఇదంతా త్యాగరాజు సూక్తిసుధ.

పరాభవ నామ సంవత్సర పుష్య బహుళ పంచమి నాడు (6-1-1847) త్యాగరాజు నిర్యాణం చెందాడు.

త్యాగరాజు గురించి ముచ్చటించుకొంటున్న సమయంలో బెంగుళూరి నాగరత్నమ్మ గురించి ప్రస్తావించాలి. ఆమె త్యాగరాజు శిష్యపరంపరలోని సంగీత విద్వాంసురాలు. ఆమె సాహిత్యాభినివేశమూ గొప్పదే! ఆమె త్యాగరాజు స్వామి సమాధి మీద ఒక మంటపాన్ని నిర్మించారు. దానిని బృందావనమంటారు. ఆమె తన ఆస్తినంతటినీ ఈ బృందావన నిర్మాణం కోసం, త్యాగరాజు కీర్తనల ప్రచారం కోసమే వెచ్చించారు. ఇప్పటికీ ఏటా తిరువైయార్‌లోని ఆ బృందావనం వద్ద త్యాగరాజు వర్ధంతి, పుష్య బహుళ పంచమి నాడు త్యాగరాజు ఆరాధనోత్సనాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కర్ణాటక సంగీతమంటే త్యాగరాజే! అంతటి త్యాగరాజు మన తెలుగువాడు కావడం మనకు గర్వకారణం, మన అందరి అదృష్టం!


Read more...

అంతరంగ సంస్కరణ

>> Sunday, January 23, 2011


- దానం శివప్రసాదరావు
ప్రభాత కాలంలో నిద్రలేస్తూనే ఈ రోజంతా మనకు అనుకూలంగా, మంచిగా జరిగిపోవాలని కోరుకుంటాం. దినచర్యలో ఒడుదొడుకులు లేకుండా సవ్యంగా సాగిపోవాలని ఆశిస్తాం. అలా ఆశించినప్పుడు ముందురోజు జరిగిన పొరపాట్లు ఈ రోజు పునరావృతం కాకుండా చూసుకోగలిగితే సంతోషకరమైన వాతావరణం ప్రతిరోజూ మన సొంతమే.

రాత్రి నిద్రించే సమయంలో ఒక్కసారి ఆరోజు దినచర్యలోని తమ ప్రవర్తనాదులను ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రతి ఒక్కరూ.

తప్పొప్పులు, తొందరపాట్లు, హడావుడి నిర్ణయాలు, మాటా-మంతీ, ఆవేశకావేషాలు దినచర్యలో సాధారణంగా చోటుచేసుకుంటుంటాయి. అంతరంగంలో మనం వేసుకునే ప్రశ్నలు- వివేకంతో కూడిన జవాబులు మన ప్రవర్తనలోని లోటుపాట్లను ఎంచుతాయి. ఏది మంచో, చెడో మనసుకు తెలుసు. విశ్లేషించుకునే శక్తి ఉంది. ఈ విశ్లేషణతో తనను తాను తీర్చిదిద్దుకోగలిగితే కోరుకున్న సుఖవంతమైన వాతావరణం లభించినట్లే. ఇదే మనో సంస్కరణ. ఎప్పటికప్పుడు మనస్సును మంచిమార్గంవైపు సంస్కరించుకొంటూ పోవాల్సి ఉంటుంది.

మనచుట్టూ 'ప్రతిరోజూ మంచి వాతావరణం ఏర్పడాలి' అంటూ కోరుకునే వేళ మనసును 'మార్పు' వైపు నడిపించుకోగలిగే వివేకమూ కలిగి ఉండాలి.

నారాయణ భట్టు మహా పండితుడే. పాణిని వ్యాకరణాన్ని ఆమూలాగ్రం శోధించినవాడే. ఆ రోజున రాజాస్థానంలో శిరోమణి భట్టుతో పోటీలో తలపడ్డాడు. శిరోమణి భట్టుదే పైచేయి అయింది.

రాజు సన్మానం, పల్లకి ఊరేగింపు శిరోమణి భట్టుకు దక్కాయి. తలవంపుగా భావించాడు నారాయణ భట్టు. అవమాన భారంతో కుతకుతలాడిపోయాడు. తన వాదనే సరైందన్నాడు. శిరోమణి భట్టు తనకు సరిసాటి కాదంటూ ఊగిపోయాడు. శిరోమణి భట్టు మందహాసం చేస్తూ ఉండిపోయాడు. ఆ రాత్రి నారాయణ భట్టు తనను తాను ప్రశ్నించుకున్నాడు. నిజానికి శిరోమణి భట్టుకు తన కంటే విద్వత్తు ఉంది. తాను జీర్ణించుకోలేకపోయాడు. 'నాలో ఈ అహం ఏమిటి? ఎందుకు? విద్వత్తుగల వారిని ప్రశంసించే గుణం నాలో లేకపోయిందే! ఓటమిని ఎందుకని ఒప్పుకోలేక పోయాను?' అని తలపోశాడు.

అహం, ఈర్ష్య, అసూయ తన మనసుపై ముప్పేటదాడి చేశాయని గ్రహించాడు.

ఆ మరుసటిరోజు రాజు సత్కారం అందుకున్న శిరోమణి భట్టు- పల్లకి ఎక్కుతుండగా 'మహాత్మా... నా అజ్ఞానాన్ని మన్నించండి... నిన్నటి సభలో నా ప్రవర్తనకు సిగ్గుపడుతున్నాను' అంటూ చేతులు జోడించి, 'పల్లకి మోసే బోయీని తప్పుకోమని తన భుజాన్ని ఆనించాడు.

శిరోమణి భట్టు దిగ్గున పల్లకి దిగి 'మహానుభావా! మీతో శాస్త్ర చర్చలో పాల్గొనడమే గొప్ప అవకాశంగా భావించాను... నా గెలుపు మీరు పెట్టిన భిక్షే' అంటూ తన సరసన కూర్చోబెట్టుకుని గౌరవించాడు.

మన ప్రవర్తనలో లోటుపాట్లు ఉన్నట్లయితే సవరించుకోవడం సంస్కరించుకోవడం మనో వికాసానికి, వివేకానికి నిదర్శనం. పొద్దున నిద్ర లేస్తూనే సమస్యలు, ఒత్తిళ్లు, అననుకూల వాతావరణాలే తప్పటం లేదు. ఏ రోజూ... ఈరోజు కూడానేమో! అంటూ డీలాపడిపోవడం సరికాదు.

ఎవరో వచ్చి ఏవో అద్భుతాలు జరిగి మన పరిసర వాతావరణాన్ని స్వర్గం చేయరు. మనకు మనమే చేసుకోవాలి. ఇందుకు మనో సంస్కరణ అవసరం. మనలోని ఈ సంస్కరణ ఎదుటివారిలోనూ పరివర్తనకు శ్రీకారం చుడుతుంది. ఎక్కువకాలం జీవించాలంటే శారీరక, మానసిక ఆరోగ్యాలు రెండూ ముఖ్యమేనన్నది అందరికీ తెలిసిందే. బలహీనతలను అధిగమిస్తూ, జయిస్తూ ముందడుగు వేయడమే పరిపక్వతకు సూచిక. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాం. మనం మనసును కూడా పవిత్ర భావనలతో ఉంచాలన్న విషయాన్ని విస్మరించకూడదు.


Read more...

శ్రీకృష్ణామృతం

>> Saturday, January 22, 2011


భక్తి వైరాగ్యాలు భగవత్ప్రాప్తికి ముఖ్య సాధనాలు. మనిషికి మహాభాగ్యాలంటూ ఉంటే అది ఈ రెండే. ఇవి భగవంతుని అనుగ్రహం వల్లనే మనకు లభిస్తాయి. ధన సంపాదన మాత్రమే భాగ్యమనిపించుకోదు. ధనవంతులందరు భాగ్యవంతులు కాలేరు. భగవదనుగ్రహాన్ని మించిన భాగ్యం ఉండదు. ఎన్నటికీ తరగనిదీ, భగవంతునికి దగ్గర చేసేది భాగ్య సంపదే. భక్తిని వ్యాపారం ద్వారా సంపాదించలేము. వైరాగ్యమూ అంతే. భక్తి సాధకుని ద్వారా వెల్లడవుతుంది. కానీ, వైరాగ్యం గుండెల్లో గుప్తంగా, గూఢంగా ఉంటుంది. భక్తునికి సమాజపరమైన గౌరవం, ఆదరణ లభిస్తాయి. భగవద్భక్తులు భగవంతునిలాగే కీర్తించబడతారు. పూజించబడతారు.
ఈ కలియుగం దోషాలకు ఆలవాలం. ‘కలే దోహనిధే’ అన్నాడు శ్రీ శుకదేవుడు. కలియుగంలోని సకలమూ, లోప భూయిష్టాలు. ఆధ్యాత్మిక రంగమూ కలుషితమైపోయింది. ‘కుతార్కికులూ, కపటభక్తులూ, వేద బాహ్యలైన పాషండులూ అనేకులు దాపురించారు. ఆధ్యాత్మిక రంగం చాలావరకు వ్యాపారమయమై పోయింది.
భక్తి కూడా వైరాగ్యం లాగే నిగూఢంగా ఉండాలి. మనం భక్తులమని ఇతరులకు తెలియవలసిన అవసరంలేదు. ఎవరు భక్తులో, ఎవరు కారో భగవంతునికి తెలియదా? ప్రతిఫలాన్నిచ్చేది భగవంతుడే గానీ మరొకరు కాదుకదా! ఇతరులు తెలుసుకోవాలని భక్తిని ప్రదర్శించే దంభాచారులు, ఎల్లవేళలా మడిగట్టుకుని తిరుగుతూ ఉంటారు. వారి దైవపూజ, జపతపాలు, ప్రదర్శన కోసమే. తమ భక్తిని ఇతరులు గమనించాలనీ, ప్రశంసించాలనీ, తాపత్రపడుతూ ఉంటారు. పరుల సమక్షంలో వీరు ప్రదర్శించే భక్తిప్రపత్తులు, ఆచార వ్యవహారాలు ఏకాంత సమయంలో మటుమాయమైపోతాయి.
ధనంకోసం, సమాజపరమైన కీర్తిప్రతిష్టల కోసం, ఆరాటపడే వాడి భగవత్ స్మరణ భగవంతుని అనుగ్రహం కోసం మాత్రం కాదు. హృదయంలో స్వచ్ఛత లేనప్పుడు, హృదయమంతా ప్రదర్శనకు మాత్రమే కేటాయింపబడి కపట బుద్ధి పూరితమైనప్పుడు, అది ఎంతకాలం నిలుస్తుంది? కలిదోషం ప్రబలినప్పుడు పాషండుల సంఖ్య అధికమైనప్పడు, సాధకులు శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించక తప్పదు. ‘కృష్ణ ఏవ గతిర్మయ’ అంటూ భగవానుని ప్రాథేయపడకా తప్పదు. కలి దోషాలు ఎంతటివైనా మధుర భక్తి భావనతో శ్రీకృష్ణుని ఆశ్రయిస్తే సర్వం అదృశ్యమైపోతాయి. సకల దోషాలనుండీ-సర్వ పాపాలనుండీ విముక్తిని కలిగించేది. ఈ కలికాలంలో శ్రీకృష్ణుని ఆరాధించడమొక్కటే. మధుర భక్తి భావనతో ప్రేమించి పూజించుటమొక్కటే. శ్రీకృష్ణ భజనతో సర్వం మరిచిపోగలిగితే చాలు హృదయం నిర్మలమవుతుంది. అంతర్యామిని దర్శించగల స్థితి సంప్రాప్తిస్తుంది.
గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని ఉద్దేశించి- ‘నా భక్తుడు సమస్త యోగులకన్నా శ్రేష్ఠుడు. అతడు సాధకులలో ఉత్తమోత్తముడు. అతడు నిజమైన తపస్వి. పరమ జ్ఞాని. కర్మయోగి. అర్జునా నీవటువంటి యోగివి కావాలి’ అని ఆశీస్సులు అందచేస్తాడు.
భగవంతుని గుణగణాలను, దివ్య లీలా విశేషాలను మైమరిచి కీర్తించే భక్తులు, భక్తులలో శ్రేష్టులు. సిద్ధ పురుషులలో బ్రహ్మ జ్ఞానులలో శాంత చిత్తం కలవారు మరింత శ్రేష్టురు. నిష్కామ భక్తులు, శ్రీకృష్ణ దివ్య పాద సేవా తత్పరులూ సదా శాంత చిత్తులై ప్రశాంత అంతరంగం కలవారై ఉంటారు. ఐతేవారిని మనం గుర్తించడం దుర్లభం. ఎందుకంటే వారు విరాగులు. వైరాగ్య సంపన్నులు. భౌతిక వేషదారణకు ఏమాత్రము ప్రాధాన్యత నివ్వనివారు. శ్రీకృష్ణ ధ్యానామృతమే వారికి అన్నపానాలు. చూపరులకు పిచ్చివారిలా కన్పిస్తారు. కపట భక్తులు లక్షలాదిగా దర్శనమిస్తూ ఉండడం ఈ కలియుగంయొక్క ప్రత్యేకత. శ్రీకృష్ణుని ఆశ్రయించడాన్ని మించిన యోగం ఈ కలియుగంలో మరొకటి లేదు.
భగవంతుని లీలా కథానకం ఎవరి సాంగత్యంలో ఉంటుందో, ఎవరి వలన భగవత్పరమైన జ్ఞానం లభిస్తుందో, హృదయం పరిశుద్ధ మవుతుందో, బ్రహ్మానందం, దివ్యానందం, అమృతానందం అనుభవంలోకి వస్తుందో ఇంద్రియపరమైన విషయాసక్తి నశిస్తుందో అటువంటి శ్రీకృష్ణుని దివ్య సన్నిధిని, పరమాత్మపరంగా అందుకోవడానికి తగిన అర్హతను సంపాదించగలడాన్ని మించిన యోగమింకేముంటుంది?
శ్రీమద్భాగవతమును విన్నంత మాత్రానే శ్రీకృష్ణ్భగవానునిపట్ల ప్రేమ పొంగిపొరలుతుంది. మధుర భక్తి భావం తన్మయతను పెంచుతుంది. శోక మోహ భయాలను నశింపచేస్తుంది. నిరంతరం చిద్విలాస, చిన్మయానంద స్థితిని సొంతం చేస్తుంది.

[ డా. కె.వి కృష్ణకుమారిగారి వ్యాసం]

Read more...

తల్లీ! నిన్నుదలంచి..............

>> Friday, January 21, 2011


తల్లీ! నిన్నుదలంచి పుస్తకము చేతం బూనితిన్ నా
యుల్లంబందున నిల్చి జృంభణముగా సూక్తుల్ సుశబ్దంబు శో
భిల్లం బల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
పుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా !


[విద్యార్ధులు ప్రతి రోజూ ఉదయం శ్రీ సరస్వతీ దేవికి నమస్కరించి ఇలా ప్రార్ధించుకుంటే చదువులో పరీక్షలలో రాణిస్తారు]

Read more...

ధర్మబోధ ఎలా జరగాలి ?

>> Wednesday, January 19, 2011

ధర్మాన్ని కేవలం ఏ కళాశాలలోనో బోధించడం చాలదు. ఏ కుటుంబానికాకుటుంబం బిడ్డకు వెన్నతో పెట్టిన విద్యగా నేర్పించవలసినదే . అలా బాల్యం నుండి అనుక్షణం జీవించడం ద్వారా నేర్చిన దానిని ఏ యోచనా తర్వాత అంత తేలికగా మనసులోంచి చెదరగొట్టలేదు . "స్త్రీపురుషబేధం భౌతికమేగదా ! అటువంటప్పుడు దాంపత్యానికి వావివరుసలు పాటించనక్కరలేదు " అని ఎందరు చెప్పినా చెప్పేవాడుకూడా అలాప్రవర్తించడానికి కష్టపడతాడు . అంత బలీయము అలాటి ధర్మబోధ . కులమతాలు వరకట్నం అధర్మమని ఎందరు [వి]నాయకులు ఉపన్యాసాలు దంచినా తమవారికి మాత్రం వాటిని కాడెద్దులలాగా పాటిస్తూనే ఉన్నారు కదా ! అలా ధర్మబోధ జరగాలి

[ఆచార్య ఎక్కిరాల భరద్వాజ [సాయిబాబా పత్రిక నుండి] ]

Read more...

ఈ సంక్రాంతి మీకు సకలశుభాలను కలుగజేయాలి .

>> Friday, January 14, 2011


మితృలకు,తెలుగు బ్లాగర్లకు అందరికీ సంక్రాంతి సకలశుభాలను కలుగజేయాలని

Read more...

అత్తగారింట్లో తిష్టవేస్తే !!?అల్లుడి పాపాలన్నీ పోతాయట [ఇదిచదవండి]

>> Thursday, January 13, 2011

అత్తగారింట్లో ఎక్కువకాలం ఉంటే అల్లుడి పాపమంతా పరిహరించ బడుతుందా !!? అనే సందేహానికి అవుననే సమాధానం వస్తుంది మహాకవి భారవి చరిత్ర చూస్తే .
భారవి కవి చిన్నతనం నుంచి చదువులో చక్కని ప్రతిభ కనపరచేవారు . ఆయన గురువులు ,సహాధ్యాయులు, జనం అంతా ఆయన ప్రతిభను మెచ్చుకుని గౌరవించేవారు . అయితే అదేమిటో గాని ఆయన తండ్రిగారు మాత్రం ఏమాత్రం దానిని గుర్తించేవారు కారు . వయసు వచ్చి పెద్దవాడై భారవి తన పాండిత్యం తో అందరినీ మెప్పిస్తున్నారు ఏరోజుకైనాసరే తండ్రిని మెప్పించాలని శ్రధ్ధగా అధ్యయనం చేస్తూ శ్రమింస్తున్నాడు. కానీ తండ్రిలో మాత్రం మార్పులేదు , అంతేనా ఎంతగొప్పగా కవిత్వం చెప్పినా ? ఇదీ ఒక పాండిత్యమేనా ? అని తేలికగా కొట్టిపారేస్తుండేవారు . చిన్నతనం నుంచి ఒక్కమెప్పుకోలుగూడా తండ్రినుంచి పొందని భారవి గారికి తండ్రంటే ద్వేషం కూడా మెల్లగా పెరుగుతున్నది . తన ఎదుగుదల చూసి కూడా సంహిచని వాడేమో తండ్రి ? అనే అనుమానం ప్రబలుతున్నది.
పెళ్లయింది . ఆయన పాండితీ ప్రకర్షకూడా చుట్టుపక్కలకుపాకుతున్నది . పదిమంది పండితులు కూర్చున్నచోటకూడా ఈ యువకవి గూర్చిన ప్రస్తావన వస్తున్నది. ఓసారి ఒక పండిత సభలో ఈయన పాండితీ ప్రకర్ష ఎల్లరకు తెలిసింది . గొప్ప పండితులు ఈయనను గుర్తించి గొప్పగా సత్కరించారు . ఎంతో సంతోషిస్తూ తనస్నేహితులతో కలసి వస్తూ ఎదురైన తండ్రికి ఈవిషయాన్ని తెలి్యపరచినమస్కరించాడు. కానీ తండ్రి మాత్రం . ఆహా ! ఈమాత్రం దానికే నీవు గొప్పపండితుడవైపోయావా ? నీకంటే చాలా గొప్పపండితులున్నారు లోకంలో అని విమర్శింఛాడు. చిన్న మెప్పుకోలు లేకపోగా స్నేహితులముందు కూడా తండ్రి అవమానపరచటం వలన దు:ఖం ముంచుకొచ్చింది ఆయనకు . అది తీవ్రక్రోధంగా మారింది . ఇటువంటి తండ్రి ఉంటేనేమి లేకుంటేనేమి ? ఇతడు తండ్రి కాదు శతృవు . ఇతనిని అంతం చేస్తేనేకాని నాకు మనశ్శాంతి లేదు ,అనే నిర్ణయానికొచ్చాడు . ఇంటికొచ్చాడు . పెద్దరాయి ని తీసుకుని అటకమీదకెక్కి కూర్చున్నాడు . తండ్రి ఇంటిలోకి రాగానే ఆరాయిని తండ్రి తలపై వేసి చంపాలని కోపంతో ఊగిపోతూ ఎదురు చూస్తున్నాడు .

మధ్యాహ్నం వేళకు తండ్రి భార్యను పెద్దగా పిలుస్తూ ఇంటిలో కొచ్చాడు . ఎదురెళ్ళిన భార్యను పట్టుకుని చూసావా ! చూసావా ! నాకొడుకు ఎంత ఎదిగిపోయాడో ! ఊర్లో పండితులంతా నాకొడుకును పొగుడుతున్నారు . అటువంటి కొడుకును కన్న నీవు అదృష్ట వంతుడవంటున్నారు ..అబ్బాయి ఏడి ..ఎక్కడ ? అని ఉబ్బితబ్బిబ్బవుతూ అడుగుతున్నాడు. విషయాన్ని చుట్టుపక్కల వారిద్వారా విని ఉన్న ఆవిడ భర్త సంతోషం చూసి ఆనందించింది. ఏమిటోనండి ! మీపద్దతి ,పిల్లవాణ్ణి ఎదురుగా ఒక్క ముక్క మెచ్చుకోరు .వాడెంత బాధపడుతున్నాడొ మీకుతెలియదు. ఈరోజు స్నేహితులముందర కూడా ఏదో అన్నారట ,పాపం వాడెంత చిన్న బుచ్చుకున్నాడో ! ఈరోజు భోజనానికి కూడా రాలేదు బిడ్డ . అయినా ఊరంతా మెచ్చుకున్నా మీకుమాత్రం నాబిడ్డ ప్రతిభ నచ్చటం లేదు ని ముక్కుచీదుతూ వాపోయింది. అప్పుడాయన . ఓసీ ! పిచ్చిదానా ! బిడ్డ ప్రతిభ తండ్రికి గిట్టదా ? నాబిడ్డ గూర్చి జనం మెచ్చుకుంటుంటే నాకెంత సంతోషమో నీకేం తెలుసు . అయినా సరే తండ్రి బిడ్డయొక్క పాండిత్యాన్ని మెచ్చుకుంటూ వారి ఎదుట మాట్లాడకూడదు ,అలాచేస్తే బిడ్డలు ఎదగరు. నేను విమర్శిస్తుండ బట్టే నాకొడుకు పట్టుదలతో ఈస్థాయికి ఎదిగాడు . ఇంకా గొప్పవాడవుతాడు అని చెబుతున్నాడు.
ఇవన్నీ పైన అటకమీద కూర్చుని ఉన్న భారవి వింటున్నాడు. తండ్రి హృదయం అర్ధమయ్యేసరికి ఆయన కళ్ళుతిరిగినేలకొచ్చాయి. అక్కడనుండి ఒక్క ఉదుటనకిందకు దూకి తండ్రిపాదాలపై వాలి భోరున విలపించటం మొదలెట్టాడు . తలబాదుకుంటూ తన పాపపు ఆలోచనను చెప్పి దుఖిస్తూ తల్లిదండ్రి పాదాలను చుట్టి దు:ఖిస్తున్నాడు.
ఆ దంపతులు కుమారుణ్ణి కౌగిలించుకుని ఎంత ఓదార్చినా ఆయన మనసు శాంతించలేదు.
తండ్రీ ! తల్లీదండ్రిని మించిన దైవం లేదు . కంటికి పొరలుగమ్మి గర్వం తలకెక్కి మూర్ఖుడినై నిన్నే చంపబోయాను . నాపాపానికి పరిహారం చెప్పండి వేదనతో వేడుకున్నాడు .
అప్పుడు మహాపండితుడైన ఆతండ్రి నాయనా ! తెలిసిచేసినా తెలియక చేసినా పాపం అనుభవించవలసినదే . కనుక పాపపరిహారం కోసం పరిహారక్రియలు చేసుకుని ఆపాపం నుంచి బయటపడే ఉపాయం మహర్షులు తెలియపరచి ఉన్నారు అన్నాడు. అయితే తండీ ! తండ్రిని మించిన గురువులేడు . నాకు తరుణోపాయం చెప్పమని వేడుకున్నాడు భారవి కవి
నీవు ! వెంటనే మీ అత్తగారింటికి వెళ్ళు .అక్కడ నీ భార్యకుకూడా చెప్పకుండా ,ఎవరినీ ఎదిరించకుండా ఎవరిమాటా కాదనకుండా ఎన్నిరోజులక్కడ ఉంటావో చెప్పకుండా నాలుగు సంవత్సరాలు గడుపు .దీనితో నీపాపం పరిహారమవుతుంది. గడువు పూర్తికాగానే ఒక్కక్షణం కూడా ఆగకుండా మాదగ్గరకొచ్చేయి నీకోసం వేయికళ్లతో ఎదురు చూస్తుంటాము అని అప్లికాడాయన. ఇదేమిటి ? అత్తగారింట్లో నివాసమంటే పరమ సుఖం కదా . కాలుకింద పెట్టనివ్వకుండా చూసుకుంటారు అక్కడ . దీనివలన నాపాప మెలా పరిహార మవుతుంది ? అని అనుమానం వచ్చినదాయనకు. కానీ గురువు చెప్పినమాటకు ఎదురాడరాదనే శాస్త్రవచనాన్ననుసరించి తల్లీదండ్రికి నమస్కరించి బయలుదేరాడాయన . బిడ్డను వదలలేక కన్నీటితోనే సాగనంపారాదంపతులు భారవిని .

ఇక భారవి గారు అత్తగారింటికి వెళ్ళగనే అత్తమామలు, బావమరుదులు ఎంతగానో సంతోషించారు .ఇక ఆయన భార్య ఆనందానికి అవధులు లేవు. మామగారు పెద్ద భూకామందులలో ఒకడు ఆగ్రామంలో .ధనధాన్యాలు పశుసంపద సమృద్దిగా ఉన్న కుటుంబం అది. పనివాల్లతోటి పాలేర్లతోటి సందడిగా ఉండే ఇల్లు. ఇక రాకరాక వచ్చిన అల్లుడికి మహారాజవైభోగాలు అమరుతున్నాయి . అత్తగారు అల్లునికి ఏమికావాలో అడిగి రోజుకో పిండివంట చేపిస్తున్నది. బావమరుదులు అణకువగా అడుగులకు మడుగులొత్తుతున్నారు. అయన కాలు కదిపితేచాలు ఏంకావాలని అడిగి అది సమకూర్చే వాల్లు . తనభర్త కు తనపుట్టింట ఏమాత్రం లోపం జరగకూడదని జాగ్రత్తగా చూసుకుంటున్నది . ఇక రోజులు గడుస్తున్నాయి. వారాలు అయిఫొయాయి , నెలలు గడుస్తున్నాయి . అల్లుడుగారు తిరుగుప్రయాణం ఉన్నట్లు గుర్తులేనట్లుంది పోనీలే పిల్ల సుఖంగా మనముందరే ఉంది అని సర్దుకున్నారు. నెలలు దాటిపోతున్నాయి .ఇక పిండివంటలలో నెయ్యిశాతం తగ్గింది . ఏమిటీ ! విషయం అని కూతురిద్వారా విచారించారు .
ఏమండీ ! అత్తయ్య,మామయ్య ఒక్కల్లే ఇంటిలో పనులన్నీ ఎలాసవరించుకుటున్నారో ! నన్ను మన ఇంటికి ఎప్పుడుతీసుకెల్తారు ? వారిసేవకోసం ఎదురు చూస్తున్నాను అని అమ్మాయి లౌక్యంగా ప్రశ్నించింది . ఆ ..వెళదాంలే ..తొందరేముంది అన్నాడు భారవి. విషయం తెలిసిన అత్తామామలు పాపం అల్లుడేదో మనదగ్గరే నాలుగురోజులు ఉండాలనుకుంటున్నాడు పోనీలే ఉండనీ. అని సర్దుకున్నారు. సంవత్సరం దాటింది . ఇక అనుమానం పెరిగింది మామగారికి ఇతగాడేదో తల్లీదండ్రితో గొడవపడి వచ్చినట్లున్నాడు ...ఇల్లరికం ఉన్నా మనకేమీ కొదువలేదులే ఉండనీ అనుకున్నాడు. బావమర్దులకు కాస్త చనువు పెరిగింది . గౌరవం తగ్గింది . కాస్త చెణకులు విసురుతున్నారు. ఇక రానురాను మర్యాదపలచబడటం మొదలైంది. పొద్దస్తమానం ఇంట్లో ఏంకూర్చుంటావు బావా! నీకూ విసుగుకొడుతుందికదా మన పొలాలు చూసొద్దాం రా అని తీసుకెల్లే వాళ్ళు . అక్కడికెళ్ళాక అందరూ పనిచేస్తుంటే ఊరికే సోమరిపోతులా కూర్చో లేడుకదా ? బావమరుదులు వద్దని వారిస్తున్నా వినకుండా పనిలోకి వంగేవాళ్లు . ఇప్పట్లా అపుడు కూలీల కొరత ఉందేమో ! మొదటమొదటిలో ఇంట్లో నలుగురిలో బావగారి పనితీరును మెచ్చుకుంటూ పొగిడి చిన్నగా పొలం పనులకు తీసుకెళ్ళెవాళ్ళు. ఎంతైనా అలవాటులేని పనికదా పనిసరిగా చేతకాదు. దానితో ఆటపట్టించడం దగ్గరనుండి అవహేళనవరకు సాగి పనిచేతగానివానిక్రింద సోమరికింద జమకట్టి అవమానకరంగా మాట్లాడటం మొదలైంది . ఇంట్లో కూడా చద్దన్నం పెట్తటం కూడా దండగనే భావన కనిపిస్తున్నది. ఇదంతా చూస్తూ భార్యకు కాస్త బాధనిపించినా పుట్టింటివారి నేమీ అనలేక భరత్ను మనప్రయాణ మెప్పుడని అడిగినప్పుడల్లా ఆయన నవ్వుతూ వెళదాంలే ....అని దాటవేస్తున్నాడు. క్రమేపీ ఆవిడకు కూడా మన ఇంట్లో మనకు మర్యాదలేంటి . ఇదీ నాయిల్లేకదా అనే సర్దుబాటు ధోరణి వచ్చేసింది . ఇక మామగారి చీత్కరింపులు పనివాల్లమీద వంకపెట్టి తిట్లుకూడా అప్పుడప్పుడు తప్పటం లేదు. పాపం ఈ వ్యవసాయ పనులెలా చేతనవుతాయి ఆయనకు ,ఏదో నాలుగుపద్యాలైతే రాయగలడుగాని కాడి మోయమంటే సాధ్యమా ?
ఇక ఏపని చేతకానివాడు ,ఊరికే కొంపమీద పడితింటున్నాడనే ముద్రపడి్పోయిందాయనకు చేతైనంత పనిచేస్తున్నా, ఊరి వాల్లలో కూడా పలనావారల్లుడు పనికి మాలినవాడనే గుర్తింపు వచ్చేసింది . బయటకు వెళితే వీడేరోయ్ అని నవ్వుకుంటున్నారు . భార్యకూడా మనపని మనం చేసుకోవటం లో తప్పేముందండి అని గొప్ప సత్యం తెలియపరుస్తున్నది. ఎప్పుడు చేయని కఠినమైన పనులనుచేసి బొబ్బలెక్కిన చేతులను చూసి బాధపడుతున్నప్పుడు దానికంటే అత్తగారింట్లో తనను ఉద్దేశించిన చీత్కారాలే మనసును తూట్లు పొడిచేవి . క్రమేపీ తండ్రి ఎందుకు ఈశిక్ష విధించాడో అర్ధమవసాగింది . వారి అవమానాలతో గుండెను కోస్తున్న బాధకలుగుతున్నా పశువులపాక ఊడ్చేపనితో సహా చేయసాగాడు. ఇక ఇతనికి వ్యవసాయంపని సరిగా చేతకాదుకనుక పశువులను కాచేందుకు పంపటం మొదలెట్టారు . రాత్రి మిగిలిన చద్దన్నం కాస్తతిని మరికాస్త చద్ది కట్టుకుని పశవుల కాపరులైన పిల్లలతో కలసి అడవికి పశువులను తోలుకుని వెళ్ళేవాడు.
ఇక ఈ గోపాలక వృత్తిలో ప్రవేశించాక అయనకు గొప్పవెసులుబాటు లభించింది . పిల్లలంతా ఆడుకుంటూ ఈయన పశువులనుకూడా కాస్తుంటారు కనుక అక్కడ తాటిఆకులను తెచ్చుకుని చెట్టుక్రింద కూర్చుని వేదనాభరితమైన హృదయం నుంచి కసిగా తన కవిత్వాన్ని లిఖితం చేసేవాడు . ఆ తాళపత్రాలను అక్కడే చెట్టి కొమ్మలను కట్టి ఇంటికి వెళ్ళేవాడు . ఈవిధంగా సరస్వతీ దేవి ప్రవాహంగా ఆయన ఘంటం నుండి అనుగ్రహరూపంలో ఆవిర్భవిస్తున్నది.
గడువు పూర్తయినది . ఆయన పశుకాపరులైన మిగతా పిల్లలకు నాయనా నేను అత్యవసరంగా వెళుతున్నాను సాయంత్రం మీ పశువులతోపాటు మావికూడా తోలుకురండి అని చెప్పి ,ఇంటికొచ్చాడు . మధ్యాహ్నం వేళ ఇలా వచ్చిన భారవిని చూసి ఇంటిలో ఆడవాళ్లు ఆశ్చర్య పోయారు . రాగానే భార్యను పిలచాడు నేను వెళుతున్నాను . నిన్ను కాపురానికి తీసుకురావటానికి మాతల్లిదండ్రులు వస్తారు అని చెప్పి బయలుదేరాడు .ఇదేమితండి భోజనం చేయకుండా అంటున్నా వారించి ,ఇప్పటివరకు మీఇంటిభోజనం చేయటం వలన నేనుచేసిన ఘోరపాపం నుండి విముక్తుడనయ్యాను , చాలు. ధన్యవాదములు అని చెప్పి ఎంచక్కా వెల్లిపోయాడు .
ఇక ఆ రోజు ఆదేశ మహారాజుగారు ఆ అడవిదారిన పల్లకీలో వెళుతున్నారు , మధ్యాహ్నం వేలవటం వలన బోయీలు అలసిపోయి పల్లకిని దించారు. భారవి గారు తనరచనావ్యాసంగాన్ని కొనసాగించిన చెట్టుక్రిందే రాజుగారికి విడిది ఏర్పాటుచేశారు. ఆచెట్టుక్రింద విశ్రాంతి తీసుకుంటున్న రాజుగారికి చెట్టికొమ్మలకు కట్టి వేలాడుతున్న తాటిఆకులు కంతబడ్డాయి .ఆయన వాటిని సేవకులచేత దించి చూశాడు . అందులోని సాహిత్యప్రతిభకు ఆస్చర్యపోయాడు . ఎవరీ మహాపండితుడు ? ఇంతగొప్ప కవి ఎవరు ? అని ఉద్వేగభరితుడై ఈ కవి ఎవరో కనుక్కొమ్మని సేవకులను ఆజ్ఞాపించాడు. వాల్లు అక్కడ ఉన్న పశువులకాపరులైన పిల్లలను పిలచి ఇవి చెట్టుకు కట్టినవారెవరని ప్రశ్నించారు.
పలానా ! వాల్ల అల్లుడు రోజూ తమతో పశువులకొచ్చి అవి వ్రాసుకుని చెట్తుకు కడుతుంటాడని ఇప్పుడే ఇంటికెళ్ళాడని చెప్పారు.
ఆహా ! ఇంత గొప్పపండితుడు మాదేశం లో ఉన్నారా ? అయినా ఆయన నివురుగప్పిన నిప్పులా ఇక్కడ పశువులకాపరిరూపంలో గుప్తంగా ఉన్నారంటే ఏదో రహస్య ముంది . వారిని మాఆస్థానానికి సగౌరవంగా తోడ్కొని పోవలసినదే అని నిర్ణయించుకుని ,సకల మర్యాదలతో వారిని తోడ్కొని రమ్మని సేవకులను మేనాను మంత్రులను పంపారు. రాజపరివార కోలాహలం తో గ్రామం లో కలకలం రేగింది . జనమంతా గుమిగూడారు . పశవుల కాపరులైన పిల్లలు దారిచూపిస్తుండగా అధికారులతో వచ్చిన మేనా భారవి గారి అత్తగారింటిముందు ఆగింది . భయపడుతూ వచ్చిన ఆయన మామగారిని మంత్రులంతా అభినందించారు . అయ్యా ! తమరి అల్లుడు గారు మహా కవి .అయినా ఇంత నిరాడంబరంగా రహస్యంగా ఉన్నారంటె వారు మహానుభావులు . వారిని సకలమర్యాదలతో తీసుకురమ్మని మాహారాజావారి ఆజ్ఞయింది అని విన్నవించారు . మామగారికి ముచ్చెమటలు పోసాయి . అల్లుడు అలిగిఫొయాడనుకుంటున్నాడాయన ......................................................................ఇక తరువాత కథ వదిలేద్దాం
కిరాతార్జునీయం అనే గొప్పకావ్యాన్ని రచించిన భారవిమహాకవి జీవితంలో సంఘటన ఇది

కాబట్టి అత్తగారింట్లో గౌరవంపోనంతకాలం మాత్రమే ఉండాలనేది పెద్దలమాట ..

[ నోరూవాయీ లేని అత్తమామల అల్లుల్లు అత్తగారిల్లలో తిష్టవేసి వేధింకు తింటుంటారు అదేదో సినిమాలో బ్రహ్మానందం లాగా .. వాల్లకు మాత్రం పాపమంతా తలపైబడి చండాలపు జన్మలొస్తాయి జాగ్రత్తండోయ్ . మామగారు తమ సంతృప్తి కొద్దీ ఇచ్చినవి స్వీకరించాలేగాని .అడుక్కుతినేవాల్లలాగా అదికావాలి ఇదికావాలని వేధించకూడదు]

Read more...

నేను ఈరోజు దర్శించిన శక్తిపీఠం , ఓ సిధ్ధగురుదేవుల జీవసమాధి

>> Monday, January 10, 2011

గంగ దొనకొండ ఆలయంలో కొలువై యున్న శ్రీ గంగామాత

పొట్లపాడులోని సిద్దయోగీంద్రుల సమాధిమందిర పై మందిరంలో శివస్వ్రరూపం
యోగయ్య స్వామివారి చిత్రం [ దిగువన భూగర్భంలో జీవసమాధి

ఈరోజు అనుకోకుండా ఓ శక్తిపీఠాన్ని అదేసమయంలో ఓ సద్గురువుల జీవసమాధిని దర్శించే అదృష్టం ప్రాప్తించింది .

ఉదయం పూజలో మనసుకు కలిగిన ప్రేరణను అనుసరించి బయలుదేరాను . ప్రకాశం జిల్లా కురిచేడు కుసమీపంలో గల
గంగదొనకొండ వెళ్లాను . అది కాటమరాజు స్థాపించిన గంగాదేవి పీఠం . యాదవవంశ లోని ప్రముఖ చారిత్రక పురుషుడు కాటమరాజు . ఆయనకు నెల్లూరు పాలకుడు మనుమసిద్ధి మహారాజుకు జరిగిన యుద్దం గూర్చి మీకందరకు తెలుసనుకుంటాను.
యాదవులు దైవాంశసంభూతునిగా కాటమరాజును పూజిస్తారు. ఆయన ఉపాశించి శక్తి గంగాదేవి. అమ్మ ఆదేశానుసారం ఇక్కడ ఆవిడను ప్రతిష్టించాడు . ప్రతి ఏడాది గొప్పతిరుణాల్ల ఇక్కడ జరుగ్తుతుంది . రాష్ట్ర్రం నలుమూలలనుంచి యాదవులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు.అక్కడ పీఠాధిపతితో కొన్ని ధార్మిక కార్యక్రమములగూర్చి చర్చించి వచ్చాను .

ఇక పక్కనే పొట్లపాడు అనే గ్రామంలో గల మహాసిధ్ధపురుషులు సద్గురువులు గుత్తికొండ యోగయ్య స్వామి వారి జీవసమాధిని దర్శించు కున్నాను . ఈమహానుభావుడు కారంపూడి సమీపంలో గల గుత్తికొండ బిలాలవద్ద పశువులకాపరిగా ఉండగా . మాహాత్ముల దర్శనం అయ్యింది .వారు ఆయన నాలుకపై దివ్య బీజాక్షరాలను లిఖించగా అప్పటినుండి బాలాత్రిపురసుందరి ఉపాసకునిగా అనేక సిద్దులను పొంది సద్గురువై లోకోపకార కార్యములెన్నో చేశారు.
పొట్లపాడు గ్రామపరిసరాలలో చరిస్తూ ఆర్తులను గాస్తూ శిష్యులకు చెప్పి జీవసమాధిలో ప్రవేశించారు . ఈనాటికి భక్తులకు దివ్యనుభవాలను అందిస్తూ తన కరుణను ప్రసరింపజేస్తున్నారు.
గతంలో వెళ్ళినప్పుడు భూగర్భంలో ఉన్న సమాధినితాకే అవకాశం రాలేదు . అప్పుడు తిరుణాల్ల అవటం వలన లోపలకు భక్తులను అనుమతిమ్చలేదు. ఇప్పుడు ఏకాంతంగా ఉండటం వలన లోపలకు దిగి మహాసమాధి పై తలానించి ప్రార్ధనచేసుకున్నాను . చిన్నతనంలో మాజేజినాయన గారి గుండెలపై పనుకుని అనుభవించిన హాయి గుర్తుకొచ్చింది. ఏదో అవ్యక్తమైన ఆనందం. అ పూర్వమైన ప్రశాంతత అనుభవంలో కొచ్చాయి .
ఇక సమాజంలో ధార్మికచైతన్యం కోసంచేస్తున్న ఈ చిరుప్రయత్నం అమ్మ ,యోగితాతల అనుగ్రహాన సఫలంకావాలని ప్రార్ధించుకుంటున్నాను . మరోసారి గంగాదెవి గూర్చి ,యోగయ్యతాత గూర్చి విపులంగా చర్చించుకుందాం

Read more...

ఆయుర్వేద ఔషధాలు ప్రమాదకరమట ! ???[ జాగ్రత్త !దాడి మొదలైంది]

>> Thursday, January 6, 2011

భారతీయ విజ్ఞాననిధులపై విషప్రచారాలు సాగించి భావితరాలకు వాటిని అందకుండా చూడటానికి సామ్రాజ్యవిస్తరణవాదులు తమ ఏలుబడి కాలంలో చేయాల్సినదంతా చేశారు. అంతేకాదు వాళ్లవి దీర్ఘకాలిక వ్యూహాలు . వాటిఫలితాలు ఇప్పుడుకూడా మనం అనుభవిస్తూనే ఉన్నాం . సమాజపరమై సమాజంలో అట్టడుగు వ్యక్తిస్థాయికి కూడా చేర్చబడ్డ భారతీయ వైద్యవిధానాన్ని సాధారణ పౌరులనుంచి దాదాపు విజయవంతంగా దూరంచేయగలిగాయి వాళ్ల వ్యూహాలు . అయితే అది సనాతనము ,ప్రకృతిపరమైనది కనుక ప్రకృతిపూర్తిగా లయమైతేనేగాని అంతరించదు . అందువలన ఈ వైజ్ఞానిక బేహారుల కుటిలప్రయత్నాలెన్నింటినో ఎదుర్కొని కూడా సజీవమై.నిత్యనూతనమై వెలుగొందుతున్నది ఆయుర్వేదం . దాదాపుగా రాబోయే రోజులలో మానవుని ఆరోగ్యానికి భద్రతనివ్వగలిగేది ఆయుర్వేదం మాత్రమేననే సత్యం కూడా తెలియవస్తున్నకాలమిది .
మరి ఇలా ఈసనాతన వైద్యవిజ్ఞానం మరలా ప్రాచుర్యంలోకొస్తే మానవుని దు:ఖాన్ని ,బాధలను ,అనారోగ్యాన్ని తమ ఆదాయవనరుగా భావించే ఈ వైద్యబేహారులకు సహిస్తుందా? వాళ్లు ఊరుకుంటారా ? అందుకే మొదలెట్టారు ఆయుర్వేద వ్యతిరేక ప్రచారాన్ని .
ఇక వాళ్లు చెప్పినంత మాత్రాన్నే ఆయుర్వేదానికి నష్టం కలుగుతుందా అని మీరనవచ్చు. దాదాపుగా మనమనస్సులు ఈవ్యాపారుల ప్రచారాలనే ప్రామాణికమని నమ్మేస్థితికి ఎదిగిపోయాయి . కాస్త కష్టమైనా చెబుతున్నాను ,బానిసభావజాలం తో నిండిపోయాయి . కనుకనే ఆరోగ్యం ,ఆనదం ఇవ్వగల మనక్రీడలను వదలి క్రికెట్ లాంటి వ్యాపారపు ఆటలే మనకు అత్యంత ఇష్టంగామారాయి. ఇలాచెప్పాలంటే ఈవ్యాసాలు చాలవు.సరే ఆవిషయం కొద్దిసేపు పక్కనపెట్టి అసలు విషయానికొద్దాము . నేను మొన్న ఒక బ్లాగుచూశాను , అందులో రచయిత విదేశీయుల ప్రచారాన్ని యథాతథంగా ఏమాత్రం దేశాభిమానం,సామాజిక బాధ్యత లేకుండా ప్రచురించారు .అది ఆయన కావాలని చేయలేదు. ఈరోజు సాధారణంగా విదేశీవిజ్ఞానం మీద అపారనమ్మకంతో మనం చేస్తున్న పనులలో ఒకటి.
http://meeandarikosam.blogspot.com/2011/01/blog-post_4266.html


చూడండి పైలికులో


నాలుగు ఐదు తారీకులలో మాకు [ఉపాధ్యాయులకు] జవహర్ బాల ఆరోగ్యరక్ష అనే కార్యక్రమం మీద శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది. అసలే పైబ్లాగు చదివిఉన్నాను . దానికి తోడు ఆశిక్షణా కార్యక్రమంలో కొందరు ఉపాద్యాయులు వెల్లడిస్తున్న తమ అనుమానాలను ,వైద్యపరమైన అవగాహనా రాహిత్యాన్ని చూస్తుంటే కడుపు రగిలిపోయింది. జగద్గురు స్థానంలో నున్న ఈదేశం ఈరోజిలా తగలబడటానికి కారణం ఇలాంటి గురువులవలనేకదా ! నా డెప్పుడొ ఒక కవి హెచ్చరించాడు " ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్" అని. నేడు బ్రతికుంటే ఇలా అనేవాడు మమ్మల్నిచూసి " ఇంత అనుకరణ గురువులుంటే ,దేశమింకెట్లేడ్చునోయ్ " అని.

ఇక కార్యక్రమ ముగింపులో నాకు మాట్లాడటానికి అవకాశమివ్వమని ఆ కార్యక్రమంలో ప్రధాన పాత్రపోషిస్తున్న ఆరోగ్యకేంద్ర వైద్యాధికారిని అడిగాను .ఆయన మిలటరీ నుంచి వచ్చిన డాక్టర్ ,కాస్త దేశభక్తి [పాలు మాకంటే ఎక్కువే . నన్ను పిలచి మాట్లాడవలసినదిగా కోరాడు .అక్కడ మాట్లాడినవి గుర్తున్నవరకు వివరిస్తాను . [ఆవేశం లో మాట్లాడానుకనుక అంతా గుర్తులేదు ]

ఇక్కడ ట్రైనింగ్ లో ఆ డాక్టర్ గారు పిల్లలకు పాఠశాలలో ప్రథమచికిత్స చెబుతూ అవసరమైనప్పుడు చిన్నచిన్న జ్వరాలకు ఇలా పారాసెట్ మాల్ వంటి టాబ్లెట్లు ఇవ్వాలనగానే , కొందరు మామితృలు లేచి .అవి ఇచ్చామనుకోండి ఏదైనా రియాక్షనొస్తే పరిస్థితేమిటి ? కాబట్టి ఇలా మందులు ఇచ్చేపని మాకు పెట్టొద్దు అన్నారు.
కంటిలో నలకలు పడినప్పుడు శుభ్రపరచే విధానాలు వివరిస్తూ .పల్లెటూర్లలో కొందరు నాలుకతో కంటినలుసులు తీస్తారు ,అదికూడా ఒకచక్కని సురక్షితమైన పద్దతి అని డాక్టర్ గారు చెప్పగనే .ఒక ఉపాధ్యాయుడు [పెద్దాయనే] లేచి .అప్పుడు వాళ్ల నోటిలో క్రిములు వీళ్ళ కళ్లలోకి ప్రవేశిస్తాయి కదా ? ఇన్ఫెక్షన్ వస్తుది కదా అని ప్రశ్నించాడు .

డాక్టర్ లోపల మా ఎవేర్ నెస్ ను చూసి లోపల నవ్వుకుంటూ బయటకు మాత్రం సార్ ! అవసరమైనప్పుడు మేముగ్లోవ్స్ తొడుక్కోవటానికి కూడా సమయముండదు ,కొణ్ణిడెలివరీ కేసులలో బిడ్డను అలానే తీస్తాము .తప్పనిసరి అని, నాలుకతో కంటినలకలను తీసే విధానంలో సౌలభ్యాలను కూడా చెప్పాడు.

ఇక మాప్రాంతంలో ఫ్లోరోసిస్ వ్యాధులు ఎక్కువ . దాని నివారణకు మినరల్ వాటర్లు కొనుక్కుని తాగాల్సినదే పరిష్కారమని సూచిస్తున్న కుర్రపంతుల్లను చూసి నవ్వాలో ఏడ్వాలో అర్ధంకాలేదు.

ఇంకా పాముకాటు విషయంలో కొందరు మంత్రాల విషయాన్ని చర్చలోకి తెచ్చి కించపరచుకుంటుంటే , ఇంతకంటే ఈదేశ విజ్ఞానానికి వేరే శత్రువులు అక్కరలేదు అనిపించింది.

ఇక ఇలాంటి చిత్రాతి చిత్రమైన అనుమానాలు విని నాకైతే నామీదేజాలివేసింది . ఇతరదేశస్తులైన విజ్ఞానులు[సమాజహితాన్నికోరేవారు] ఎవరైనా అక్కడుంటే మమ్మల్ని చూసి తప్పక జాలిపడేవారు . మనజ్ఞాన సంపద ఏమిటో మనకే తెలియక మన విజ్ఞానంపై మనమే కుళ్ళుజోకు లేసుకుని మనమేనవ్వుకుని నవ్వులపాలవుతున్నందుకు.
********************************************************************

ఇక నేను తెలిసోతెలియకో వాగిన వాగుడులోంచి కొన్ని మాటలు

ఇక్కడున్న ఉపాధ్యాయులకు పెద్దలకు,వైద్యసిబ్బందికి నమస్కారం.
ఇప్పుడు డాక్టర్లున్నారు .వైద్యశాలలున్నాయి ,వాటిలో సిబ్బంది ఉన్నారు . అసలు సమాజ ఆరోగ్యాన్ని పరిరక్షించటానికే వైద్యవిభాగం ఒకటి ఏర్పాటుచేసి వాల్లు పూర్తి కాలం వైద్యసేవలో ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి . మరి ఇప్పుడు మనం విద్యాబోధనేకాదు వైద్యవిజ్ఞానాన్నికూడా పెంపొందించు కుని ఈబాధ్యతలను కూడా చేపట్టవలసిన అవసరం ఏమిటి అని ప్రశ్నించాను .
మావాళ్లకు కాస్తగౌరవం ఎక్కువ ఎవరూ ఉలకలేదు పలకలేదు. నేనే కొనసాగించాను .
ఎందుకంటే వైద్య అవసరాలు విస్తృతమైనవి . సమాజానికి కావలసినంత మంది వైద్యులను తయారు చేయటం సులభమైన విషయం కాదు . అలాచేసి వైద్యవిజ్ఞానాన్ని కొందరు వ్యక్తులకే ధారాదత్తంచేసి వాల్లకుమాత్రమే వైద్యం చేసే అవకాశం కల్పిస్తే వచ్చేనష్టం ఏమిటి ? ఏమిటో ఈరోజు చూస్తున్నాం . సమాజానికంతటికీ అందవలసిన విజ్ఞానాన్ని కొందరికి మాత్రమే పరిమితం చేస్తే రెండునష్టాలు . కావలసినంతమంది వైద్యులు దొరకరు . ఎండవది వ్యక్తులలో స్వార్ధపరత పెరిగేకొద్దీ ఈ విజ్ఞానం ఖరీదైనదైన అమ్మకపు వస్తువైపోయి సమాజం దోపిడీకి గురవుతుంది. అది ఇప్పుడు మనం అనుభవపూర్వకంగా చూస్తున్నాంకదా ! ఈరోజు చిన్న జ్వరం వచ్చినా భయపెట్టి ఆటెస్టులు ఈ టెస్టులని పరిగెత్తించి ఎనిమిదిరూపాయల బిల్లలను ఎనిమిదొందలు పెట్టికొనిపించి పంపించే డాక్టర్లు మనకు నిత్యమూ ఈసత్యాన్ని గుర్తుచేస్తూనే ఉన్నారుకదా ! [మా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వీరపనేని యల్లమందారావు ఉన్నాడు .జ్వరం అని వెళితే రెండురూపాయల బిల్లలు రాసిచ్చేవాడు . ఆయనను పిచ్చిడాక్టర్ అని పిలచేవాల్లు లెండి] అటువంటి వాల్లను వేల్లమీద లెక్కపెట్టొచ్చుకనుక పెద్దగా లాభం లేదు.
ఇప్పుడు బాలల హక్కులచట్టం వచ్చింది కనుక పిల్లలందరి ఆరోగ్యపరిరక్షణ ప్రభుత్వ బాధ్యత . మరి నిరంతరం వాళ్ల ఆరోగ్యాన్ని పరిరక్షించగలంత సిబ్బంది ని ప్రభుత్వం నియమించగలదా ? అసలు ఏ సమాజంలోనైనా ఇది సాధ్యమా ?
కనుక వైద్య సిబ్బందిని పెంచటం కంటే వైద్య విజ్ఞానాన్నే సమాజానికమ్దిస్తే ? అప్పుడు మేలుచేకూరుతుంది . ఈమాత్రం ఆలోచన ఇప్పటికైనా ఏదో ఒక రూపంలో ప్రభుత్వాలకొచ్చినందుకు ధన్యవాదములు. మరి ఆలోచన ఇప్పటిదా ?
మీరు బాగా పరిశీలించండి .చరిత్ర పుటలు తిరగెయ్యండి .. మీబాల్య అనుభవాలలోకి వెళ్ళి చూడండి ..... మీఅమ్మమ్మలను నాయనమ్మలను గుర్తుకు తెచ్చుకోండి అప్పుడు ..ఆపుడు తెలుస్తుంది . ఈ పుణ్యభూమి విజ్ఞానాన్ని ఎలా సమాజానికి పంచిందో .సమాజాన్ని వైజ్ఞానికంగా అభివృద్దిపరచిందో . తమ జీవితాలను సర్వస్వం ధారబోసి పరిశోధించి వెలికితీసిన సత్యాలపైన ప్రకృతి సంపదలపైన ఏమాత్రం గుత్తాధిపత్యం కోరకుండా నేటి వైజ్ఞానికి బేహారుల్లా పేటెంట్ లకోసం ఎగబడకుండా సమాజానికి పంచారో ! అటువంటి నిస్వార్ధ ,త్యాగమూర్తులైన ఋషిపరంపరకు వారసులమైన మనం ఎంత గర్వపడాలో. .
మీకొక విషయం మనవి చేస్తాను .
పది సంవత్సరాలక్రితం కాలిఫోర్నియా యూనివర్సిటీలో దాదాపు రెండువందల యాభైపేజీల పరిశోధనాత్మకవ్యాసం సబ్మిట్ చేయటం జరిగింది . నాలుగు సంవత్సరాలు చేసిన పరిశోధన అది . విషయమేమిటయ్యా ! అంటే .నేరేడు పళ్ళు తినటం వలన పిత్తాశయం లో ఏర్పడే రాళ్ళు ,జీర్ణాశయం,ప్రేవులలో ఇరుకుఉని ఉండే వెంట్రుకలు లాంటివి కరగి పోతాయి . అదీ సంగతి
. ఈవిషయం మీకు తెలుసా ? అనడిగాను . ఓతెలుసు మన ముసలమ్మలను ఎవరినడిగినా చెబుతారు .నేరేడు పల్లు తింటే కడుపులో రాల్లు,వెంత్లుకలు కరుగుతాయి అని .. చాలామంది మాస్టర్లంతా సమాధానమిచ్చారు.
ఈవిషయం ఆమెరికా వాల్లకు తెలిస్తే తెల్లబోతారు . అస్సలు నమ్మరు. ఇంత పరిశోధిస్తేగాని వెలుగులోకి రాని విషయం ఇంతసాధారణం గా తెలుసు అంటే చచ్చినా నమ్మరు. ఎందుకంటే వైద్యవిషయం లో ఇంత అభివృద్దిచెందిన సమాజాన్ని వారెక్కడా చుసి ఉండరు కనుక.
మరిదెలా సాధ్యమైనది ?
మన ఆయుర్వేదమేమి చెబుతున్నది . చూద్దాం.
ఆసురీ మానుషీ,దైవీ చికిత్సా త్రివిధామతా : అని చెబుతుంది.
అంటే చికిత్స మూడు విధములు / ఒకటి ఆసురీ వైద్య అంటే శస్త్ర చికిత్స .వ్రణాలు గడ్డలు, అలాగే దుష్టాంగాలు కోసి తీసివేసి రోగిని రక్షించటం . ఇందులో శుశ్రుతుడు మెదడుకు ఆపరేషన్ చేసినట్లు ఆధారాలున్నాయి . అయితే తరువాత భౌద్ద మతం పరిఢవిల్లిన కాలంలో ఈ కోయటాలు ఖండిచడాలు ,అహింసా ప్రచారం తో మరుగుపడి ఆవిధానం లుప్తమైనది . అక్కడక్కడా మంగలి వాళ్లదగ్గర మనకు కొద్దిగా మిగిలి కనపడుతుంది. ఇప్పట్లో ఈ వైద్యం లో అల్లోపతిక్ వైద్యవిధానమే శస్త్ర చికిత్సలో అద్భుత అభివృద్దిసాధించి ఉంది.

దైవీ వైద్యం అంటే ధాతువులతోడి రసగంధకాది మూలకాలతో తయారుచేసే ఔషధాలతో వివిధ రోగాలను నివారించటం. అయితే దీనిలో ఆయారసాయనాలను శుద్దిచేసుకోవడం, వాటి విషలక్షణాలను విరగదీసి ఔషధాలుగా మార్చటం ,ఇవన్నీ సాంకేతిక విజ్ఞానం తో చేయాలి కనుక దీనిలో నిపుణత అవసరం . [కొద్దిమంది ఈ పరిజ్ఞానం పూర్తిగా పొందకుండానే ఔషధాలు తయారు చేయటం తో అవి వాడినవారికి సైడ్ ఎఫెక్ట్లు రావటం జరిగేది. ఇదిగో ఇలాంటి వారివల్లే వైద్య విధానం పట్ల సామాన్యులు భయం పెంచుకున్నారు,]

ఇక ప్రకృతితో మనిషి మమేకమైనంత కాలం శరీరం దానిపని అది నిరాటంకంగా చేసుకుంటూపోతుంది . ప్రకృతి విరుద్దజీవనం ,దానికి విరుద్దమైన పదార్ధాల స్వీకరణ వలన దాని నిర్వహణ ధర్మాలలో ఆటంకాలేర్పడి దానినో రోగం అంటాం. లేదా వ్యాధి అంటాం .
కాబట్టి ప్రకృతి లో అందరికీ అందుబాటులో ఉండే మూలికలతో వైద్యం చేపించటం వలన అందరికీ వైద్యవిజ్ఞానాన్ని అమ్దించటం సులభం కనుక దీనినే మానుషీవైద్యం గా సమాజానికి అందించారు మహర్షులు. దీనివల్ల మానవుడు ఆయుష్షును ఆరోగ్యాన్ని పెంచు కుంటూ పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ప్రకృతితో మమేకమై జీవిస్తాడు. మనకు ప్రతిదాన్నీ పరమాత్మ పరం చేయటమే మహోన్నతమైన లక్ష్యం . కనుకనే మన దేవతోపాసనా ,సంస్కృతులలో సహితం ఈ మూలికలకు గొప్పస్థానమిచ్చి పూజాద్రవ్యాలుగా ఆయా మూలికల దైవీలక్షణాలను తెలియపరచారు.
వినాయక చవితి రోజున మనం స్వయంగా వెళ్ళి మూలికలను గుర్తుపట్టి తీసుకొచ్చి పూజలో ఉపయోగిస్తాము
. మామూలు పశువులకాపరి దగ్గరకెళ్ళి అడిగినా దెబ్బతగిలితే ఏ పసరు వాడాలి ?వేడితగ్గాలంటే కలబంద ఎలా వాడాలి , మలబద్దకానికి నేలతంగెడు ఆకుల పచ్చడి ఎలాచేసుకుని తినాలి ? శరీరానికి నీరువస్తే నల్లేరు వడియాలు ఎలాచేసుకుని తినాలి ? దగ్గువస్తుంటే కృష్ణతులసి మింగితే తగ్గుతుంది....అనే విషయాలను వివరించగలడు. ఇంత విజ్ఞానాన్ని కోల్పోయి కోళ్ళఫారం చదువులతో సాగుతున్న మనవిద్యార్ధులను చూసి జాలిపడాలి మనం. ఎన్ని డిగ్రీలుచేస్తే ఆవిజ్ఞానం మన పిల్లలకొస్తుంది చెప్పండి . ఇదెలా వస్తుంది . గ్రంథాల ఆధారం లేకున్నా అనుభవపూర్వక విజ్ఞానంగా ఒకతరాన్నుంచి మరొకతరానికి అందుతూనే ఉంది మనతరం ముందుదాకా .
ఇప్పుడు మనం పిల్లవానికి చిన్నదెబ్బతగిలే ఆయింట్మెంట్ కొనుక్కుని వాడుకోవటం లేక దగ్గరలో ఏ తులసిరసమో,ఉత్తరేణి పసరో దానిపై పిండటమో ? ఏది సమాజానికి నిజమైన మేలుకలిగించేదో ఆలోచించండి !
మార్కెట్ అఔషధాలు అన్నివేళలో అందుబాటులో ఉండవు పైగా ఆర్ధిక సమస్యలు కూడా . అలాకాకుండా మనం ప్రకృతిలో భగవంతుడిచ్చిన ఈ చెట్టూచేమలను బ్రతకనిస్తూ మనం బ్రతకటం నేర్చుకోవాల్సిన అవసరమున్నదా లేదా ?
ఆ అవసరాన్ని గుర్తించే భవిష్యత్తరాలకు ఈ విజ్ఞానసంపదను అందించారు పెద్దలు.
ఇక మనం ఇలా సాధ్యమైనంతవరకు ఖర్చులేని వైద్యాలు చేసుకుంటుంటే మందుల వ్యాపారులకు గడిచెదెలా "? అందుకే వారిపై ఆధారపడే మనస్తత్వాన్ని పెంచుతారు ప్రభంజనంలా సాగే వారి ప్రచారాలతో .
ఇక్కడ చిన్నవిషయం మీరు గమనించాలి.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్టులు చూడండి . ప్రపంచంలో అత్యధిక రోగనిరోధకశక్తి గలవారెవరు అంటే . భారతీయులు అని వెల్లడించాయి . ఎందువల్ల అంత వ్యాధినిరోధకశక్తి మనకు రాగలిగింది అంటే ! మన ఆచార సాప్రదాయాలవలన .,వాటికనుగుణంగా సాగేమన జీవనవిధానం వలనఇది లభ్యమవుతుంది ఇప్పటిదాకా . ఇందులో వేకువఝామున మేల్కొనాలనే విషయం వద్దనుంచి రాయాలంటే పెద్ద ఉద్గ్రంథమే అవుతుంది . మీకు తెలిసిన విషయాలే ఇవి.
కాబట్టి ముందుగా వాటికి దూరమ్ చేయాలి కనుక ,ఈవిషయాలపట్ల చులకనభావం కలిగేలా మన చదువులను మార్చి.ఆయా ఆచారాలు,వైద్యపద్దతుల పట్ల విముఖత కలిగేలా చేస్తున్నారు. మన అలవాట్లలోనూ,జీవనవిధనంలోనూ అనారోగ్యకరమైన పద్దతులకు అలవాటుపడేలా చేస్తున్నారు . బ్రతుకంటే భీతికలిగిస్తున్నారు. ఘోరమైన భయాన్ని మన మనస్సుల్లో తిష్టవేసుకునే లా చూస్తున్నారు. జ్వరమొచ్చినా,జలుబుచేసినా అది ప్రాణాంతమనే స్థాయిలో మనలో భయాన్ని పెంచుతున్నారు. రోగనిరోధకశక్తిని ప్రసాదించే అలవాట్లవల్ల ప్రమాదమని దుష్ప్రచారాలు సాగించి వాటినుంచి దూరం చేస్తున్నారు . ఉదాహరణకు మనకు చిన్నతనంలో ఉగ్గుపెట్టే వారు పిల్లలకు . ఉగ్గుపెట్టడం వలన పిల్లలకు నెమ్ముచేస్తుందని ,భయపెట్టి డాక్టర్లు ఆ అలవాటును దాదాపు మానిపించారు. గర్భకోశాన్ని శుద్దిపరచి జీర్ణశక్తిని పెంచి రోగనిరోధకశక్తి నిపెంచే ఉగ్గుతాగిన పెద్దవాల్లను చూదండి ఎంత ఆరోగ్యంగా ఉన్నారో . ఉగ్గుపెట్టని నేటి పిల్లలను చూదండి చిన్నచిన్న రోగాల తాకిడికి కూడా గురవుతున్నారో ! ఇది ఒక ఉదాహరణమాత్రమే . నెమ్మురోగాలు ఎలాపెరిగాయో గమనించండి నేటి పిల్లలలో.

అలాగే నాడు ఎంత ఫ్లోరోసిస్ నీటిలో ఉన్నాగాని నాడు ,చింతకాయ తొక్కు పచ్చడి .రాగిసంగటి తమ తిండిలో ఉన్నంత కాలం ఈ వ్యాధి అంత తీవ్రంగా బాధించలేదు. అవి తమ ఆహారం నుంచి కోల్పోయాక ఫ్లోరోసిస్ దుష్పలితాలు ఎక్కువయ్యాయి . దానితో మినరల్ వాటర్ పేరిట నీటివ్యాపారాలు పెరిగాయి . భగవంతుడిచ్చిన నీటిని కూడా కొనుక్కుని తాగవలసిన దుస్థితిలో కొచ్చిపడ్డాము.కనుక ఈ ఆచారాలను పాటింపజేసేలా ఉన్న ఈ దేశ ధార్మిక ఆచారాలమీద దాడిచేశారు .మనలను ఈధర్మం నుంచి దూరం చేసే ప్రయత్నాలు దీనికనుబంధంగా సాగేందుకు ఆర్ధిక అండదండలను అంది్స్తూఉన్నారు.

ఇక్కడ మన సంస్కృతి ,జీవన విధానాలను మార్చుకోవటం వలన మనం కోల్పోతున్నదేమిటో మీకు అర్ధమవుతున్నదనుకుంటాను.
కాబట్టి మన ఆరోగ్యాలను కాపాడుతూ మనకు వారసత్వంగా వస్తున్న విజ్ఞానాన్ని కోల్పోవటం వలన వ్యక్తిగతంగా సామాజికంగా ఎంతనష్టమో అర్ధమవుతుంది. మనం గురువులుగా ఈలోకానికి క్షేమం చేయాలంటే లోక క్షేమకరమైన విద్యలను బోధించాల్సినదే . ముందు వాటిగూర్చి మనం తెల్సుకోవాలి . మనం మాత్రమే కొత్తతరానికి ఈ విజ్ఞానాన్ని అందించగలిగే అవకాశాన్ని కలిగి ఉన్నాము.
అయితే ఇప్పుడు ఉన్న అల్లోపతిక్ వైద్య విధానం వదిలేద్దామా ? చెట్లను పుట్టలనే నమ్ముకుందామా ? అనే వితర్కవాదనలొద్దు . చైనా లో చూడండి .ఆధునిక వైద్యవిధానంతో పాటు తమ సాంప్రదాయ వైద్యవిధానాలైన ఆక్యుపంక్చర్,ఆక్యుప్రెషర్ లను కూడా అనుసంధానం చేసుకుని సమాజానికి వైద్యసేవలందిస్తున్నారు.
అలానే మనం కూడా ఆధునిక వైద్యవిధానాన్ని సాంప్రదాయక వైద్యంతో అనుసంధానించి దాన్నికూడా సమాజంలో అందరికీ కనీసపరిజ్ఞానం కలిగేలా అందజేయవలసి ఉంది.
ఈలోగా అతి తీవ్రవేగంతో మన ఆయుర్వేద వైద్య విధానాదులపై అపప్రచారాలు సాగిస్తున్నారు . మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక ప్రమాదం పొంచి ఉంది . మన వైద్యవిధానం లోని విషయాలనే తాము పేటెంట్లుగా పొంది మనకే దాన్ని అమ్మేప్రయత్నాలు సాగిస్తున్నారు. .
మనం గొర్రెల్లా గొర్రెపిల్లల్లా ఉన్నంతకాలం మనమిలా అమాయకంగా వీళ్ళ దుష్ప్రచారాలకు లొంగి మన సాంప్రదాయక విజ్ఞానాలనుంచి మనం దూరం కాబడతాము . గొర్రెల కాపరి బాగా పెరిగాక కసాయివాడికమ్మాలనే లక్ష్యం కూడా కలిగుంటాడు. జాగ్రత్తగా ఉండాలి .
ప్రపంచఆరోగ్యసంస్థ ప్రకటించిన విషయాలు చూస్తే భయంకలుగుతుంది . మనదేశం లో అమ్మే అల్లోపతిక్ మందులలో ఎక్కువభాగం వాడకూడనివే . అవి తయారుచేస్తున్న మందులకంపెనీలు వాటిని తమదేశాలలో అమ్మటానికే అక్కడ ప్రభుత్వాలంగీకరించవు .
అతిశుభ్రత పాటించేవాల్లే ఎక్కువగా ఇఫెక్షన్ లకు గురవుతున్నారనే విషయం ఈమధ్య పరిశోధనలో వెళ్లడవుతున్నది. కాబట్టి అతిభయానికి లోనై మన వైద్యంతో మన మూలికలు ఈరోగాల్నేమి నయముచేస్తాయనే అనుమానాలు పెంచుకుని భారతదేశాన్ని విదేశీమందులకంపెనీల డంపింగ్ యార్డ్ గా మార్చటాన్ని ప్రోత్సహించకండి .మనలని మనం వాల్ల ఆదాయవనరులుగా మార్చుకోవటం నిరోదిద్దాం. అందుకోసమైనా మన విజ్ఞానాన్నిగూర్చి మనవైద్యాన్నిగూర్చి కనీసస్తాయిలో తెలుసుకుందాం దాన్ని. మనకు అన్నంపెట్టే ఈసమాజంతో పంచుకుందాం

జైహింద్
.........................
మా ఉపాద్యాయమితృలంతా చప్పట్లతో వారి అభిమానాన్ని వెల్లడించారు. ఆతరువాత మాట్లాడిన ఉపాద్యాయులు, డాక్టర్ గారు, ఒక నర్స్ తమ అనుభవాలను వెల్లడించి నాకంటే చాలా చక్కని వివరణలిచ్చారు .






Read more...

అర్హత లేకుండా ఢిల్లీ సింహాసనం మీద కూర్చుంటానంటే ?!

>> Wednesday, January 5, 2011


మాఊరి ప్రక్కనే తిమ్మాపురం అగ్రహారం ఉంది . దీనిని రాయనిభాస్కరుడు అనే మహాపండితునికి నాటి పాలకులు బహూకరించారట . అందుకనే దీన్ని రాయనిభాస్కరుని అగ్రహారం అన్నారు . ఈ అగ్రహారం లో ఆవంశంలో భాస్కరాచార్యులు అనే కాళి ఉపాసకుడొకాయన జన్మించాడు . మహా మంత్రవేత్త . దేశభక్తుడు. ఆరోజుల్లో తురష్కమూకలు సాగిస్తున్న అకృత్యాలను చూసి చలించపోయాడు. ఈ దుర్మార్గాలనుండి దేశాన్ని,ధర్మాన్ని రక్షించాలనే తపనతో కాళికాదేవి ప్రసన్నం కోసం తీవ్రతపశ్చర్యకు పూనుకున్నాడు . అయితే ఎంతసాధకుడైనా ఆవేశం పాలు కాస్త ఎక్కువైనప్పుడు అనర్ధాలు సంభవిస్తాయి.. ఈయన సాధన తీవ్రంగా సాగుతున్నది. అమ్మ దర్శనం ఆలస్యమయ్యే కొద్దీ ఈయనలో పట్టుదల కోపం రెండూ పెరుగుతున్నాయి.

ఇక భక్తపరాధీన అగు అమ్మకు దర్శన మివ్వక తప్పలేదు. అమ్మవారు ప్రత్యక్షమయ్యారు.
ఏం కావాలి నాయనా ? అని అడిగింది
తల్లీ ! భారతదేశానికి ఈనాడు పట్టుకున్న రుగ్మతలను బాపటానికి ,నూతన భారతాన్ని నిర్మించటానికి నాకు శక్తికావాలి. అందుకు నన్ను ఢిల్లీ సింహాసనం మీద కూర్చో బెట్టు అని కోరాడు.
అమ్మవారు చిరనవ్వు నవ్వి . ఎవరు ఎంతబరువు మోయాలో అంతే తలకెత్తుకోవాలి అంతేగాని అర్హతకు మించి కోరకూడదు అని చెప్పింది.
అంతే ఈయనలో తామసికశక్తి జూలు విదిల్చింది . సాక్షాత్తూ పరాశక్తినే నా ముందుకు రప్పించుకున్నవాణ్ణి ఢిల్లీ సింహాసనం మీదకూర్చోవటానికి అనర్హుడనా ? అనే అహం పెరిగింది. ఎదురుగా ఉన్నది ఎవరు అనే వి్షయం కూడా మరచిపోయాడు. తన సాధనపట్ల ,ఉపాసనపట్ల అపారనమ్మకం అహంగా పరిణమించి సాధకులకు ప్రమాదం కలుగుతుంది ఈ దశలో . అదిగో ! ఆపరిస్థితికి చేరుకుంది ఈయనమనస్సు.
హే కాళీ ! నిన్నే!దర్శించ గలవాణ్ని బోడి సీంహాసనాన్ని ఎక్కి రాజ్యాధికారాన్ని మోయలేనా ?? నన్ను చులకనచేస్తున్నావు . అని ఘీంకరించాడు.
అమ్మ కనుక పరిపరివిధాల చెప్పింది వద్దునాయనా ? ఇంకేదైనా కోరుకో అని .సృష్టి ధర్మానుసారంగా ఎప్పుడు ఎలా జరగాలో ఎవరిచేత ఏమార్పులు జరపబడాలో అవి నిర్ణయించబడి ఉంటాయి , ఆవేశపడి అన్నీంటినీ తామే సంస్కరించబూనటం అనర్ధహేతువు అని వివరించింది.
కానీ అహంతలకెత్తిన తరువాత యుక్తాయుక్తాలు తెలియవు. నిన్ను ఇంత కష్టపడి ఉపాశించాను .దేవతలు మంత్రాధీనులు . నామంత్రసాధనకు నీవు ప్రసన్నవయ్యావుకనుక నేనడిగినది ఇవ్వవలసినదే ఢిల్లీ రాజ్యాధికారాన్ని నాచేతిలో పెట్టవలసినదే అని భీష్మించాడు.
అంతేకాదు . నీవు నాయొక్క ఈ కోరికను మన్నించకుంటే మిరియాలతోను తామసిక తాంత్రికసాధనలతో నన్ను నేను క్షోభింపజేసుకుని నిన్ను వేధిస్తానని హెచ్చరికకూడా ్ చేశాడు .
ఇక వీనిని ఈమూర్ఖత్వం నుంచి కాపాడాలంటే క్రోధం వహించక తప్పదని నిర్ణయించుకున్నది అ మహాశక్తి.
సరే నాయనా ! బాగా ఆలోచించుకో ! అనువ్వు ఆబాధ్యతలను మోయగలవా ? అని మరోసారి ప్రశ్నించినది/
ఓ ! నాకాసామర్ధ్యముంది అని గర్వంగా పలికాడాయన .
సరే నువ్వా నీపట్టు వీడనంటున్నావు . కనుక నీకాసామర్ధ్య ముందని నిరూపించుకోవాలి . ముందు నాచేతిని నీతలపై ఉంచుకుని మోయగలిగితే నీకు రాజ్యాధికారాన్నిస్తాను అని పలికింది గంభీరంగా
తామసిక ఉపాసనలతో మితిమంచిన అహంకారంతో కళ్ళుమూసుకుపోయిన ఆయనకు జగన్మాత హెచ్చరిక అర్ధంకాలేదు .
ఓస్ ! అదెంతపని ? నీ పరీక్షకు నేను సిద్దం అని నిలబడ్డాడు.
అమ్మవారు తన వామహస్తాన్ని ఆసాధకుని తలపై ఉంచటం .ఆయన భూగర్భంలోకి దిగబడి పోవటం క్షణంలో జరిగిపోయాయి.
[ మహా సాధకులమనుకుని తమకు మించిన పని ,తమదికాని పని తలకెత్తుకుని లోకాన్ని సంస్కరింపబూనితే ,తీవ్రసాధనలకు దిగితే ఫలితం ఇలానే ఉంటుందని పెద్దలు చెప్పుకునేప్పుడు విన్నాను చిన్నతనంలో . జయజయ జగన్మాతృకే....]

Read more...

"కోహం రండే ?" అని తిట్టిన కాళిదాసును కూడా కరుణించిన అమ్మ .

>> Tuesday, January 4, 2011


మానవమాత్రురాలైన తల్లికే బిడ్డమీద అపారమైన ప్రేమ ఉంటే ఇక జగన్మాతకు తనబిడ్డలమీద ఎంత కరుణ ఉంటుందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం .


కాళిదాసు ,దండి, భవభూతి మహాకవులు . ఇందులో కాళిదాసు కాళీ్వరప్రసాది .అమ్మకు ముద్దుబిడ్డ. ఓసారి అనుకోకుండా ఈ మహానుభావులమధ్య పాండితీస్పర్ధ ఏర్పడినది . అది పెరిగి పెద్దదై వివాదమైనది. తమలో ఎవరుగొప్పో తేల్చుకోవాల్సినదేననే పట్టుదల పెరిగినది . అయితే ఈ మహాకవులలో ఎవరు గొప్పో తేల్చి చెప్పగల సమర్ధత ఎవరికుంది ?కనుక భోజరాజుకు కూడా ఎటూపాలుపోలేదు. అందరూ కలసి ఆజగన్మాత నే తీర్పుకోరాలని నిర్ణయించుకున్నారు. జగన్మాత ఆలయానికి చేరుకుని అమ్మకు తమలో ఎవరుగొప్పో చెప్పాలని నివేదించారు.

ఉత్కంఠతతో చూస్తున్నారు అందరూ .
అప్పుడు అమ్మ విగ్రహం నుండి
" కవిర్దండి...కవిర్దండి , భవభూతిస్తుపండిత: అని వినిపించిందట

అంతే ! మహాకవి ని అమ్మవరప్రసాదిని అనుకుంటున్న కాళిదాసుగారికి తీవ్రమైన అవమానమైనది . తలవాలిపోయింది దు:ఖం ముంచుకొచ్చింది .అది తీవ్రకోథంగా మారింది . పెదవులు వణుకుతూ కన్నీరుకన్నులను కమ్ముకొనగా "కోహం రండే " [ నేనెవరినే ముండా ?] అని ఘీంకరిస్తూ అడిగాడట.

తనను పట్టించుకోలేదన్న కోపంతో తల్లినితిట్టే పసివానిలా తనను నిందిస్తున్న కాళిదాసుగారిని చూస్తూ అమ్మ నవ్వుతూ
" త్వమేవాహం ...త్వమేవాహం " అని బదులిచ్చిందట .
అంతే ఆ దివ్యప్రేమను అనుభవపూర్వకంగా తెలుసుకున్న కాళిదాసు కాళీమాత పాదాలపైబడి పసిబిడ్డలా విలపించి ఉంటాడు .
జయజయ భవానీ...

Read more...

ఆమ్మ సంపూర్ణ అనుగ్రహం కామాక్షి పీఠం

>> Monday, January 3, 2011


అమ్మ సంపూర్ణ అనుగ్రహించే క్షేత్రం కంచి కామాక్షీ క్షేత్రం . కామాక్షి అంటే ్ విశేష అర్దమున్నది. "క" అంటే బ్రాహ్మీ శక్తి అగుసరస్వతి దేవి . "మ" అంటే లక్ష్మి దేవి . ఈ రెండు శక్తులు అక్షములు [కన్నులు గా గలది] గా గల పరాత్పరి కామాక్షీ మాత . ఆదిపరాశక్తి అగు ఆతల్లికి లక్ష్మీ సరస్వతీ మాతలిరువురూ చామరములు వీస్తుంటారు . కనుక అమ్మ అనుగ్రహం కలిగినదంటే ఇక ఆ జీవికి లక్ష్మీసరస్వతుల ఇద్దరి అనుగ్రహం పరిపూర్ణం గా వర్షిస్తుంది .
ఇక్కడఒక విషయాన్ని చమత్కరిస్తారు పెద్దలు . అమ్మకు కుడివైపున సరస్వతీ దేవి ,ఎడమవైపున లక్ష్మీదేవి ఉండి చామరలు వీస్తుంటారు కనుక భక్తుడు అమ్మకు వంగినమస్కరించేప్పుడు కుడివైపుగా మొగ్గితే సరస్వతీమాత విచేచామరం గాలి [సరస్వతీ కటాక్షం] ఎడమవైపుకు వాలితే [లక్ష్మీ కటాక్షం ] ప్రసరిస్తాయి . అలాకాక అమ్మ రెండు పాదాలకు తల వంచి నమస్కరిస్తే ఇరువురు మాతలే కాక మూలపుటమ్మ తోకలిపి ముగ్గురమ్మల సంపూర్ణానుగ్రహం ప్రాప్తిస్తుంది అని చెబుతారు .
అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే "

Read more...

శనివారం గరుడ భగవానుడిని దర్శించుకుంటే..!?

>> Sunday, January 2, 2011



శనివారం పూట గరుడ భగవానుడు దర్శనమిస్తే పుణ్య ఫలితాలు చేకూరుతాయి. పక్షుల్లో రాజుగా విరాజిల్లుతున్న గరుడుడిని శనివారం నాడు లేదా ఏ పూటైనా వీక్షించడం ద్వారా శుభ ఫలితాలుంటాయని పురోహితులు చెబుతున్నారు.

అవతారపురుషుడు, మోక్షాన్ని ప్రసాదించే విష్ణుమూర్తికి వాహనుడైన గరుడభగవానుడిని దర్శించుకోవడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం.



శనివారం మాత్రమే గాకుండా.. ఆదివారం రోజున గరుడ పక్షిని దర్శించుకుంటే వ్యాధులు తొలగిపోతాయి. ఇంకా సోమ, మంగళ వారాల్లో గరుడభగవానుడి దర్శనం లభిస్తే ముఖ సౌందర్యం పెంపొందడంతో పాటు మానసిక ఆందోళనలు తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు.

బుధ, గురువారాల్లో గరుడ భగవానుడిని దర్శించుకుంటే దుష్టశక్తుల ప్రభావం నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే శుక్ర మరియు శనివారాల్లో గరుడ భగవానుడిని దర్శించుకుంటే దీర్ఘాయుష్షు చేకూరడంతో పాటు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు సూచిస్తున్నారు.

గరుడ దర్శనం లభించకపోతే విష్ణుమూర్తి ఆలయాల్లో స్వామివారిని శనివారం దర్శించుకునే వారికి సకల సంపదలు, ఆర్థికాభివృద్ధి, దీర్ఘసుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుంది. ఇంకా శనివారం పూట సాయంత్రం ఆరుగంటలకు నారాయణ స్వామి ఆలయంలోని గరుడ భగవానునికి నేతితో దీపమెట్టే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం.

[webdunia నుండి]



[ తప్పి పోయినవారికోసం గరుడుని ఉపాసిస్తే వాళ్లు త్వరగా ఇంటికిచేరుకుంటారని శాస్త్రవచనం]

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP