శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

స్వయంజ్యోతి స్వరూపం

>> Thursday, January 27, 2011

స్వయంజ్యోతి స్వరూపం
బ్రహ్మతత్వం జగత్తులో చాలా గొప్పది. మహత్‌ పదార్థాలైన ఆకాశాదుల కంటే పెద్దది. అది స్వయంజ్యోతి స్వరూపం. లోకంలోని వస్తువులను ఇంద్రియాల (కన్ను, ముక్కు, చెవి) ద్వారా తెలుసుకొని వాటి రూపాన్ని ఆలోచించవచ్చు. బ్రహ్మ స్వరూపాన్ని అట్లా ఆలోచించేందుకు వీలుకాదు. అదొక గొప్ప పదార్థం. అది ఎప్పుడు ఒక్కటిగా ఉంటుంది. మార్పులేనిది. అది సత్యానికి పరమావధి. దానికి మించిన సత్యమింకొకటి లేదు.

జ్యోతి స్వరూపుడైన పరమాత్మను దర్శించేందుకు నిత్యం సత్యభాషణ చేయడం, సుఖదుఃఖాలను సమానంగా సహించడం, మానావమానాలను శీతోష్ణాలను భరించడం, భగవంతుని యథార్థమైన అనుభూతిని పొందడం, బ్రహ్మచర్యాన్ని పాలించడం మొదలైనవి సాధనాలు. తపస్సుతోనే బ్రహ్మస్వరూపాన్ని మనం పొందగలం. నిత్యం యోగాభ్యాసం ద్వారా మనస్సులోని అసూయ రాగద్వేషాలను, కామ, క్రోధ లోభ మోహ మద మాత్సార్యాలనే మాలిన్యాలను తొలగించుకోవాలి. సమాధి అవస్థలో సమస్త జగత్తును మరచిపోవాలి. వేదాలకు కర్తయైున పరమాత్మను ధ్యానించి యోగిగా మారిపోవాలి. అప్పుడే సాధకుడు సర్వ దుఃఖాల నుంచి ముక్తుడై నిర్మలుడవుతాడు.

ప్రణవం అంటే ఓమ్‌. అది ధనువు. జీవుడు బాణం. బ్రహ్మ లక్ష్యం. ముక్తిని ఆశించే ముముక్షువు ప్రణవ జపంతో తనను తాను బ్రహ్మకు అర్పణ చేసుకోవాలని భావం. ప్రణవం భగవంతుని సర్వోత్తమనామం. ఓమ్‌ అంటే రక్షకుడని అర్థం. అర్థ భావంతో ప్రణవ జపం చేసేవారికి మనస్సు ఏకాగ్రతమవుతుంది. ఆ మనస్సే పరమాత్మను తెలుసుకొనేందుకు సమర్థమవుతుందని ముండకోపనిషత్‌ తెలియజెబుతోంది.

మానవజన్మ ఇతర జన్మల కంటే చాలా ఉత్తమం. ఈ జన్మలోనే తనను తాను తెలుసుకోవాలి. వారికే జన్మ సఫలమవుతుంది. అట్లాకాక ఇంద్రియ సుఖాలకు లోనైనవారు మంచి చెడులను ఆలోచింపక శుభ అశుభాలను గురించి తెలుసుకోనివారు- మానవజన్మ విలువను గుర్తించలేరు. క్షణిక సుఖాల కోసం జీవితాలను వ్యర్థం చేసుకుంటారు. ఇంతకుమించిన నష్టం మానవజన్మకు మరొకటిలేదని ఉపనిషత్కాలంటున్నారు. అందుకే విద్వాంసులు విషయ వాసనల్లో అంటే శారీరకపరమైన సుఖాల్లో చిక్కుకోరు. వారు ధ్యాన సమాధి ద్వారా సర్వప్రాణులందు సర్వ పదార్థాలందు వ్యాపకమై ఉన్న పరమాత్మను తెలుసుకొని అమరులవుతారు. జన్మమరణ రూప దుఃఖ పరంపర నుంచి తొలగి స్వయంజ్యోతి స్వరూపమైన పరబ్రహ్మలోని ఆనందాన్ని అనుభవిస్తారని వేద రుషులు ఉపదేశిస్తున్నారు.

భగవంతుడొక్కడే. అతడు సమస్త చరాచర జగత్తును సృజించి వానిలో నిరంతరం వ్యాపకుడై ఉన్నాడు. బ్రహ్మాండాన్ని తన వశంలో ఉంచుకున్నాడు. ఈ ప్రపంచం ప్రళయంలో సూక్ష్మమై ప్రకృతి రూపంలో ఉంటుంది. సృష్టిలో ఈనాడు మనం చూస్తున్న వివిధ రూపాలు ఆనాడుండవు. అప్పుడు ఒకే రూపంలో అది భాసిస్తుంది. అట్లాంటి సూక్ష్మరూపంలో ఉన్న ప్రకృతిని వివిధ రూపాల్లో పరిణమింపజేసేవాడు పరమాత్ముడే. యమనియమాది యోగాంగాలను అనుష్ఠించే ధీరులే ఆ భగవంతుని సాక్షాత్కారం చేసుకుంటారని కఠోపనిషత్తు చాటుతోంది.

బుద్ధిమంతులు ముందుగా తమను తాము తెలుసుకున్న తరవాతనే పరమాత్మను తెలుసుకుంటారు. ఆత్మను తెలుసుకోనంత వరకు అందులో ఉండే పరమాత్మను తెలుసుకోవడం సాధ్యంకాదు. అందుకే రుషులు 'పశ్యంతి' అని చెప్పక 'అనుపశ్యంతి' అని వివరిస్తున్నారు. పశ్యంతి అంటే తెలుసుకోవడం; 'అనుపశ్యంతి' అంటే తరవాత తెలుసుకోవడమని అర్థం.

ఆత్మ సాక్షాత్కారానికి తరవాత పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అట్లాంటివారికే శాశ్వత సుఖమైన మోక్షానందం లభిస్తుంది. ఇతరులకు అది లభించదని ఉపనిషత్తుల్లో రుషులు వివరిస్తున్నారు.

- డాక్టర్‌ సంధ్యావందనం లక్ష్మీదేవి

1 వ్యాఖ్యలు:

Anonymous January 27, 2011 at 8:37 AM  

Very nice post, thanks!

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP