శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

వృద్ధులకేనా భక్తి!

>> Saturday, January 29, 2011



తీర్థయాత్రల్లో. దేవాలయాల్లో, పౌరాణిక ప్రవచనాల వేదికల వద్ద మనకెక్కువగా వయోవృద్ధులే కనిపిస్తుంటారు. పిల్లలు, యువకులు చాలా తక్కువ సంఖ్యలో అగుపిస్తారు. పిల్లలకు అవన్నీ అంతగా ప్రయోజనకరం కాదన్న భావన పెద్దల్లో పాతుకుపోవడం కారణం కావచ్చు లేదా, మరేదైనా కావచ్చు. ఈ లోపం పెద్దలదే. బాల్యం నుంచే పిల్లల్లో భక్తిబీజాలు నాటాలి. మన సభ్యత, సంస్కృతి, సంప్రదాయాల విలువల్ని బోధించి వారిలో వీటిపైన అభిమానాన్ని, ప్రేమనీ పెంచే ప్రయత్నం చేయాలి. తీర్థయాత్రలకు వెళ్లేటప్పుడు పిన్నల్నీ తప్పనిసరిగా వెంటతీసుకుని వెళ్లి, ఆయా ప్రదేశాల ప్రాముఖ్యాన్ని వైశిష్ట్యాన్ని ఎరుకపరచాలి. దేవాలయాలకు తీసుకెళ్లినప్పుడు అక్కడి విగ్రహాలు, పూజలు, దీపారాధన, నివేదన, ప్రదక్షిణ మొదలైన విషయాలను గురించి వాళ్ళకు విపులంగా బోధించాలి.

మనదేశానికి ప్రాణపదమైన ఆధ్యాత్మిక సంపదకు నిజమైన వారసుల్ని అందించే గురుతర బాధ్యత మనపైన ఉంది. మన జాతికి అమోఘమైన పౌరాణిక, చారిత్రక నేపథ్యం ఉంది. రేపటితరాలకు వీటిని అందించవలసింది మనమే. పిల్లల వయస్సు, వివేచనాశక్తి, తరగతిస్థాయి, పరిసర వాతావరణ స్థితిగతులు, పర్యావరణం, గ్రహణశక్తి, ధారణ, ఆసక్తి, కుతూహలం మొదలైన అంశాలను దృష్టిలో ఉంచుకొని వారి వారి స్థాయినిబట్టి చిన్న చిన్న పౌరాణికగాథల్ని పిల్లలకు బోధించాలి. ఆ కథల నీతినీ బోధించి ఆచరించేందుకు ప్రేరేపించాలి. మన ఆచార వ్యవహారాలు, పండుగల చారిత్రక నేపథ్యాలను తెలియజెప్పాలి. మన సభ్యత, సంస్కృతి పట్ల విశేషమైన అభిమానాన్ని, ప్రేమను వారి హృదయాల్లో పెంపొందించాలి. పరభాషా సంస్కృతుల వ్యామోహంవల్ల, పాశ్చాత్య సంప్రదాయాల అనుకరణవల్ల పిల్లల్లో కుటుంబ విలువలు, అనుబంధ బాంధవ్యాల అవగాహన కొరవడిపోతోంది. ఇది- ఇలాగే కొనసాగితే హైందవ జాతి భారీమూల్యం చెల్లించుకోవలసిన దయనీయ స్థితిని చూడక తప్పదన్న అక్షరసత్యాన్ని ప్రతి వ్యక్తీ గ్రహించాలి.

మన ధర్మం అనాదినుంచీ తల్లి, తండ్రి, గురువు, దైవం, అతిథులు, అభ్యాగతులపట్ల అత్యంతాదరాభిమానాలు చూపాలని చెబుతున్నది. ఆధ్యాత్మిక సంపదను అభివృద్ధి చేసుకుని, ముక్తి సోపానాల్ని అధిరోహించమని హితవు చెబుతున్నది. ధార్మికతత్వ పరిరక్షణే మానవతా వికాసానికి పరాకాష్ఠ అని హెచ్చరిస్తున్నది. అందుచేతనే మనం గీత, రామాయణం, భారత, భాగవతాది పవిత్ర గ్రంథాల్లోని జ్ఞాననిధిని పిల్లలకు సుబోధకంగా ఎరుకపరచాలి. ఉత్తమ సంస్కారాలు వారి నడవడిలో కనిపించేలా చర్యలు తీసుకోవాలి. పరమత సహనంతోపాటు హైందవ విలువల పరిరక్షణకు పాటించవలసిన ధర్మసూక్ష్మాల్నీ సుగ్రాహ్యం చేయాలి. క్రమశిక్షణ, పరిశ్రమ, సమయపాలన అనే ప్రధానాంశాలకు సంబంధించిన పౌరాణిక, చారిత్రక సంఘటనలను వివరించి పిల్లల భవితవ్యాన్ని తీర్చిదిద్దాలి. ప్రహ్లాదుడు, ధ్రువుడు మొదలైన బాలభక్తుల ఆదర్శాలను పిల్లల మనఃఫలకాలపైన స్థిరపరచాలి. క్రీడలు, చిత్రలేఖనం, పదహేల, కవిత్వం, సంగీతం, నృత్యం వంటి ఆసక్తికరమైన కళలద్వారా ఆధ్యాత్మిక విలువల్ని వారి హృదయవేదికలపైన సుప్రతిష్ఠితం చేయాలి. కేవలం వయోవృద్ధులకే అంతర్యామి ఆరాధ్యుడు కాడనీ, పిల్లలతో సహా అందరికీ వందనీయుడు, చిరస్మరణీయుడని పిన్నలు గ్రహించేలా పెద్దలు తగు జాగ్రత్తలు తీసుకుంటే- రేపటితరాన్ని బంగారు కలలకు వారసులుగా తీర్చిదిద్దగలిగేవాళ్లమనిపించుకుంటాం!


- చిమ్మపూడి శ్రీరామమూర్తి

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP