నాలుగు ఐదు తారీకులలో మాకు [ఉపాధ్యాయులకు] జవహర్ బాల ఆరోగ్యరక్ష అనే కార్యక్రమం మీద శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది. అసలే పైబ్లాగు చదివిఉన్నాను . దానికి తోడు ఆశిక్షణా కార్యక్రమంలో కొందరు ఉపాద్యాయులు వెల్లడిస్తున్న తమ అనుమానాలను ,వైద్యపరమైన అవగాహనా రాహిత్యాన్ని చూస్తుంటే కడుపు రగిలిపోయింది. జగద్గురు స్థానంలో నున్న ఈదేశం ఈరోజిలా తగలబడటానికి కారణం ఇలాంటి గురువులవలనేకదా ! నా డెప్పుడొ ఒక కవి హెచ్చరించాడు " ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్" అని. నేడు బ్రతికుంటే ఇలా అనేవాడు మమ్మల్నిచూసి " ఇంత అనుకరణ గురువులుంటే ,దేశమింకెట్లేడ్చునోయ్ " అని.
ఇక కార్యక్రమ ముగింపులో నాకు మాట్లాడటానికి అవకాశమివ్వమని ఆ కార్యక్రమంలో ప్రధాన పాత్రపోషిస్తున్న ఆరోగ్యకేంద్ర వైద్యాధికారిని అడిగాను .ఆయన మిలటరీ నుంచి వచ్చిన డాక్టర్ ,కాస్త దేశభక్తి [పాలు మాకంటే ఎక్కువే . నన్ను పిలచి మాట్లాడవలసినదిగా కోరాడు .అక్కడ మాట్లాడినవి గుర్తున్నవరకు వివరిస్తాను . [ఆవేశం లో మాట్లాడానుకనుక అంతా గుర్తులేదు ]
ఇక్కడ ట్రైనింగ్ లో ఆ డాక్టర్ గారు పిల్లలకు పాఠశాలలో ప్రథమచికిత్స చెబుతూ అవసరమైనప్పుడు చిన్నచిన్న జ్వరాలకు ఇలా పారాసెట్ మాల్ వంటి టాబ్లెట్లు ఇవ్వాలనగానే , కొందరు మామితృలు లేచి .అవి ఇచ్చామనుకోండి ఏదైనా రియాక్షనొస్తే పరిస్థితేమిటి ? కాబట్టి ఇలా మందులు ఇచ్చేపని మాకు పెట్టొద్దు అన్నారు.
కంటిలో నలకలు పడినప్పుడు శుభ్రపరచే విధానాలు వివరిస్తూ .పల్లెటూర్లలో కొందరు నాలుకతో కంటినలుసులు తీస్తారు ,అదికూడా ఒకచక్కని సురక్షితమైన పద్దతి అని డాక్టర్ గారు చెప్పగనే .ఒక ఉపాధ్యాయుడు [పెద్దాయనే] లేచి .అప్పుడు వాళ్ల నోటిలో క్రిములు వీళ్ళ కళ్లలోకి ప్రవేశిస్తాయి కదా ? ఇన్ఫెక్షన్ వస్తుది కదా అని ప్రశ్నించాడు .
డాక్టర్ లోపల మా ఎవేర్ నెస్ ను చూసి లోపల నవ్వుకుంటూ బయటకు మాత్రం సార్ ! అవసరమైనప్పుడు మేముగ్లోవ్స్ తొడుక్కోవటానికి కూడా సమయముండదు ,కొణ్ణిడెలివరీ కేసులలో బిడ్డను అలానే తీస్తాము .తప్పనిసరి అని, నాలుకతో కంటినలకలను తీసే విధానంలో సౌలభ్యాలను కూడా చెప్పాడు.
ఇక మాప్రాంతంలో ఫ్లోరోసిస్ వ్యాధులు ఎక్కువ . దాని నివారణకు మినరల్ వాటర్లు కొనుక్కుని తాగాల్సినదే పరిష్కారమని సూచిస్తున్న కుర్రపంతుల్లను చూసి నవ్వాలో ఏడ్వాలో అర్ధంకాలేదు.
ఇంకా పాముకాటు విషయంలో కొందరు మంత్రాల విషయాన్ని చర్చలోకి తెచ్చి కించపరచుకుంటుంటే , ఇంతకంటే ఈదేశ విజ్ఞానానికి వేరే శత్రువులు అక్కరలేదు అనిపించింది.
ఇక ఇలాంటి చిత్రాతి చిత్రమైన అనుమానాలు విని నాకైతే నామీదేజాలివేసింది . ఇతరదేశస్తులైన విజ్ఞానులు[సమాజహితాన్నికోరేవారు] ఎవరైనా అక్కడుంటే మమ్మల్ని చూసి తప్పక జాలిపడేవారు . మనజ్ఞాన సంపద ఏమిటో మనకే తెలియక మన విజ్ఞానంపై మనమే కుళ్ళుజోకు లేసుకుని మనమేనవ్వుకుని నవ్వులపాలవుతున్నందుకు.
********************************************************************
ఇక నేను తెలిసోతెలియకో వాగిన వాగుడులోంచి కొన్ని మాటలు
ఇక్కడున్న ఉపాధ్యాయులకు పెద్దలకు,వైద్యసిబ్బందికి నమస్కారం.
ఇప్పుడు డాక్టర్లున్నారు .వైద్యశాలలున్నాయి ,వాటిలో సిబ్బంది ఉన్నారు . అసలు సమాజ ఆరోగ్యాన్ని పరిరక్షించటానికే వైద్యవిభాగం ఒకటి ఏర్పాటుచేసి వాల్లు పూర్తి కాలం వైద్యసేవలో ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి . మరి ఇప్పుడు మనం విద్యాబోధనేకాదు వైద్యవిజ్ఞానాన్నికూడా పెంపొందించు కుని ఈబాధ్యతలను కూడా చేపట్టవలసిన అవసరం ఏమిటి అని ప్రశ్నించాను .
మావాళ్లకు కాస్తగౌరవం ఎక్కువ ఎవరూ ఉలకలేదు పలకలేదు. నేనే కొనసాగించాను .
ఎందుకంటే వైద్య అవసరాలు విస్తృతమైనవి . సమాజానికి కావలసినంత మంది వైద్యులను తయారు చేయటం సులభమైన విషయం కాదు . అలాచేసి వైద్యవిజ్ఞానాన్ని కొందరు వ్యక్తులకే ధారాదత్తంచేసి వాల్లకుమాత్రమే వైద్యం చేసే అవకాశం కల్పిస్తే వచ్చేనష్టం ఏమిటి ? ఏమిటో ఈరోజు చూస్తున్నాం . సమాజానికంతటికీ అందవలసిన విజ్ఞానాన్ని కొందరికి మాత్రమే పరిమితం చేస్తే రెండునష్టాలు . కావలసినంతమంది వైద్యులు దొరకరు . ఎండవది వ్యక్తులలో స్వార్ధపరత పెరిగేకొద్దీ ఈ విజ్ఞానం ఖరీదైనదైన అమ్మకపు వస్తువైపోయి సమాజం దోపిడీకి గురవుతుంది. అది ఇప్పుడు మనం అనుభవపూర్వకంగా చూస్తున్నాంకదా ! ఈరోజు చిన్న జ్వరం వచ్చినా భయపెట్టి ఆటెస్టులు ఈ టెస్టులని పరిగెత్తించి ఎనిమిదిరూపాయల బిల్లలను ఎనిమిదొందలు పెట్టికొనిపించి పంపించే డాక్టర్లు మనకు నిత్యమూ ఈసత్యాన్ని గుర్తుచేస్తూనే ఉన్నారుకదా ! [మా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వీరపనేని యల్లమందారావు ఉన్నాడు .జ్వరం అని వెళితే రెండురూపాయల బిల్లలు రాసిచ్చేవాడు . ఆయనను పిచ్చిడాక్టర్ అని పిలచేవాల్లు లెండి] అటువంటి వాల్లను వేల్లమీద లెక్కపెట్టొచ్చుకనుక పెద్దగా లాభం లేదు.
ఇప్పుడు బాలల హక్కులచట్టం వచ్చింది కనుక పిల్లలందరి ఆరోగ్యపరిరక్షణ ప్రభుత్వ బాధ్యత . మరి నిరంతరం వాళ్ల ఆరోగ్యాన్ని పరిరక్షించగలంత సిబ్బంది ని ప్రభుత్వం నియమించగలదా ? అసలు ఏ సమాజంలోనైనా ఇది సాధ్యమా ?
కనుక వైద్య సిబ్బందిని పెంచటం కంటే వైద్య విజ్ఞానాన్నే సమాజానికమ్దిస్తే ? అప్పుడు మేలుచేకూరుతుంది . ఈమాత్రం ఆలోచన ఇప్పటికైనా ఏదో ఒక రూపంలో ప్రభుత్వాలకొచ్చినందుకు ధన్యవాదములు. మరి ఆలోచన ఇప్పటిదా ?
మీరు బాగా పరిశీలించండి .చరిత్ర పుటలు తిరగెయ్యండి .. మీబాల్య అనుభవాలలోకి వెళ్ళి చూడండి ..... మీఅమ్మమ్మలను నాయనమ్మలను గుర్తుకు తెచ్చుకోండి అప్పుడు ..ఆపుడు తెలుస్తుంది . ఈ పుణ్యభూమి విజ్ఞానాన్ని ఎలా సమాజానికి పంచిందో .సమాజాన్ని వైజ్ఞానికంగా అభివృద్దిపరచిందో . తమ జీవితాలను సర్వస్వం ధారబోసి పరిశోధించి వెలికితీసిన సత్యాలపైన ప్రకృతి సంపదలపైన ఏమాత్రం గుత్తాధిపత్యం కోరకుండా నేటి వైజ్ఞానికి బేహారుల్లా పేటెంట్ లకోసం ఎగబడకుండా సమాజానికి పంచారో ! అటువంటి నిస్వార్ధ ,త్యాగమూర్తులైన ఋషిపరంపరకు వారసులమైన మనం ఎంత గర్వపడాలో. .
మీకొక విషయం మనవి చేస్తాను .
పది సంవత్సరాలక్రితం కాలిఫోర్నియా యూనివర్సిటీలో దాదాపు రెండువందల యాభైపేజీల పరిశోధనాత్మకవ్యాసం సబ్మిట్ చేయటం జరిగింది . నాలుగు సంవత్సరాలు చేసిన పరిశోధన అది . విషయమేమిటయ్యా ! అంటే .నేరేడు పళ్ళు తినటం వలన పిత్తాశయం లో ఏర్పడే రాళ్ళు ,జీర్ణాశయం,ప్రేవులలో ఇరుకుఉని ఉండే వెంట్రుకలు లాంటివి కరగి పోతాయి . అదీ సంగతి
. ఈవిషయం మీకు తెలుసా ? అనడిగాను . ఓతెలుసు మన ముసలమ్మలను ఎవరినడిగినా చెబుతారు .నేరేడు పల్లు తింటే కడుపులో రాల్లు,వెంత్లుకలు కరుగుతాయి అని .. చాలామంది మాస్టర్లంతా సమాధానమిచ్చారు.
ఈవిషయం ఆమెరికా వాల్లకు తెలిస్తే తెల్లబోతారు . అస్సలు నమ్మరు. ఇంత పరిశోధిస్తేగాని వెలుగులోకి రాని విషయం ఇంతసాధారణం గా తెలుసు అంటే చచ్చినా నమ్మరు. ఎందుకంటే వైద్యవిషయం లో ఇంత అభివృద్దిచెందిన సమాజాన్ని వారెక్కడా చుసి ఉండరు కనుక.
మరిదెలా సాధ్యమైనది ?
మన ఆయుర్వేదమేమి చెబుతున్నది . చూద్దాం.
ఆసురీ మానుషీ,దైవీ చికిత్సా త్రివిధామతా : అని చెబుతుంది.
అంటే చికిత్స మూడు విధములు / ఒకటి ఆసురీ వైద్య అంటే శస్త్ర చికిత్స .వ్రణాలు గడ్డలు, అలాగే దుష్టాంగాలు కోసి తీసివేసి రోగిని రక్షించటం . ఇందులో శుశ్రుతుడు మెదడుకు ఆపరేషన్ చేసినట్లు ఆధారాలున్నాయి . అయితే తరువాత భౌద్ద మతం పరిఢవిల్లిన కాలంలో ఈ కోయటాలు ఖండిచడాలు ,అహింసా ప్రచారం తో మరుగుపడి ఆవిధానం లుప్తమైనది . అక్కడక్కడా మంగలి వాళ్లదగ్గర మనకు కొద్దిగా మిగిలి కనపడుతుంది. ఇప్పట్లో ఈ వైద్యం లో అల్లోపతిక్ వైద్యవిధానమే శస్త్ర చికిత్సలో అద్భుత అభివృద్దిసాధించి ఉంది.
దైవీ వైద్యం అంటే ధాతువులతోడి రసగంధకాది మూలకాలతో తయారుచేసే ఔషధాలతో వివిధ రోగాలను నివారించటం. అయితే దీనిలో ఆయారసాయనాలను శుద్దిచేసుకోవడం, వాటి విషలక్షణాలను విరగదీసి ఔషధాలుగా మార్చటం ,ఇవన్నీ సాంకేతిక విజ్ఞానం తో చేయాలి కనుక దీనిలో నిపుణత అవసరం . [కొద్దిమంది ఈ పరిజ్ఞానం పూర్తిగా పొందకుండానే ఔషధాలు తయారు చేయటం తో అవి వాడినవారికి సైడ్ ఎఫెక్ట్లు రావటం జరిగేది. ఇదిగో ఇలాంటి వారివల్లే వైద్య విధానం పట్ల సామాన్యులు భయం పెంచుకున్నారు,]
ఇక ప్రకృతితో మనిషి మమేకమైనంత కాలం శరీరం దానిపని అది నిరాటంకంగా చేసుకుంటూపోతుంది . ప్రకృతి విరుద్దజీవనం ,దానికి విరుద్దమైన పదార్ధాల స్వీకరణ వలన దాని నిర్వహణ ధర్మాలలో ఆటంకాలేర్పడి దానినో రోగం అంటాం. లేదా వ్యాధి అంటాం .
కాబట్టి ప్రకృతి లో అందరికీ అందుబాటులో ఉండే మూలికలతో వైద్యం చేపించటం వలన అందరికీ వైద్యవిజ్ఞానాన్ని అమ్దించటం సులభం కనుక దీనినే మానుషీవైద్యం గా సమాజానికి అందించారు మహర్షులు. దీనివల్ల మానవుడు ఆయుష్షును ఆరోగ్యాన్ని పెంచు కుంటూ పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ప్రకృతితో మమేకమై జీవిస్తాడు. మనకు ప్రతిదాన్నీ పరమాత్మ పరం చేయటమే మహోన్నతమైన లక్ష్యం . కనుకనే మన దేవతోపాసనా ,సంస్కృతులలో సహితం ఈ మూలికలకు గొప్పస్థానమిచ్చి పూజాద్రవ్యాలుగా ఆయా మూలికల దైవీలక్షణాలను తెలియపరచారు.
వినాయక చవితి రోజున మనం స్వయంగా వెళ్ళి మూలికలను గుర్తుపట్టి తీసుకొచ్చి పూజలో ఉపయోగిస్తాము
. మామూలు పశువులకాపరి దగ్గరకెళ్ళి అడిగినా దెబ్బతగిలితే ఏ పసరు వాడాలి ?వేడితగ్గాలంటే కలబంద ఎలా వాడాలి , మలబద్దకానికి నేలతంగెడు ఆకుల పచ్చడి ఎలాచేసుకుని తినాలి ? శరీరానికి నీరువస్తే నల్లేరు వడియాలు ఎలాచేసుకుని తినాలి ? దగ్గువస్తుంటే కృష్ణతులసి మింగితే తగ్గుతుంది....అనే విషయాలను వివరించగలడు. ఇంత విజ్ఞానాన్ని కోల్పోయి కోళ్ళఫారం చదువులతో సాగుతున్న మనవిద్యార్ధులను చూసి జాలిపడాలి మనం. ఎన్ని డిగ్రీలుచేస్తే ఆవిజ్ఞానం మన పిల్లలకొస్తుంది చెప్పండి . ఇదెలా వస్తుంది . గ్రంథాల ఆధారం లేకున్నా అనుభవపూర్వక విజ్ఞానంగా ఒకతరాన్నుంచి మరొకతరానికి అందుతూనే ఉంది మనతరం ముందుదాకా .
ఇప్పుడు మనం పిల్లవానికి చిన్నదెబ్బతగిలే ఆయింట్మెంట్ కొనుక్కుని వాడుకోవటం లేక దగ్గరలో ఏ తులసిరసమో,ఉత్తరేణి పసరో దానిపై పిండటమో ? ఏది సమాజానికి నిజమైన మేలుకలిగించేదో ఆలోచించండి !
మార్కెట్ అఔషధాలు అన్నివేళలో అందుబాటులో ఉండవు పైగా ఆర్ధిక సమస్యలు కూడా . అలాకాకుండా మనం ప్రకృతిలో భగవంతుడిచ్చిన ఈ చెట్టూచేమలను బ్రతకనిస్తూ మనం బ్రతకటం నేర్చుకోవాల్సిన అవసరమున్నదా లేదా ?
ఆ అవసరాన్ని గుర్తించే భవిష్యత్తరాలకు ఈ విజ్ఞానసంపదను అందించారు పెద్దలు.
ఇక మనం ఇలా సాధ్యమైనంతవరకు ఖర్చులేని వైద్యాలు చేసుకుంటుంటే మందుల వ్యాపారులకు గడిచెదెలా "? అందుకే వారిపై ఆధారపడే మనస్తత్వాన్ని పెంచుతారు ప్రభంజనంలా సాగే వారి ప్రచారాలతో .
ఇక్కడ చిన్నవిషయం మీరు గమనించాలి.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్టులు చూడండి . ప్రపంచంలో అత్యధిక రోగనిరోధకశక్తి గలవారెవరు అంటే . భారతీయులు అని వెల్లడించాయి . ఎందువల్ల అంత వ్యాధినిరోధకశక్తి మనకు రాగలిగింది అంటే ! మన ఆచార సాప్రదాయాలవలన .,వాటికనుగుణంగా సాగేమన జీవనవిధానం వలనఇది లభ్యమవుతుంది ఇప్పటిదాకా . ఇందులో వేకువఝామున మేల్కొనాలనే విషయం వద్దనుంచి రాయాలంటే పెద్ద ఉద్గ్రంథమే అవుతుంది . మీకు తెలిసిన విషయాలే ఇవి.
కాబట్టి ముందుగా వాటికి దూరమ్ చేయాలి కనుక ,ఈవిషయాలపట్ల చులకనభావం కలిగేలా మన చదువులను మార్చి.ఆయా ఆచారాలు,వైద్యపద్దతుల పట్ల విముఖత కలిగేలా చేస్తున్నారు. మన అలవాట్లలోనూ,జీవనవిధనంలోనూ అనారోగ్యకరమైన పద్దతులకు అలవాటుపడేలా చేస్తున్నారు . బ్రతుకంటే భీతికలిగిస్తున్నారు. ఘోరమైన భయాన్ని మన మనస్సుల్లో తిష్టవేసుకునే లా చూస్తున్నారు. జ్వరమొచ్చినా,జలుబుచేసినా అది ప్రాణాంతమనే స్థాయిలో మనలో భయాన్ని పెంచుతున్నారు. రోగనిరోధకశక్తిని ప్రసాదించే అలవాట్లవల్ల ప్రమాదమని దుష్ప్రచారాలు సాగించి వాటినుంచి దూరం చేస్తున్నారు . ఉదాహరణకు మనకు చిన్నతనంలో ఉగ్గుపెట్టే వారు పిల్లలకు . ఉగ్గుపెట్టడం వలన పిల్లలకు నెమ్ముచేస్తుందని ,భయపెట్టి డాక్టర్లు ఆ అలవాటును దాదాపు మానిపించారు. గర్భకోశాన్ని శుద్దిపరచి జీర్ణశక్తిని పెంచి రోగనిరోధకశక్తి నిపెంచే ఉగ్గుతాగిన పెద్దవాల్లను చూదండి ఎంత ఆరోగ్యంగా ఉన్నారో . ఉగ్గుపెట్టని నేటి పిల్లలను చూదండి చిన్నచిన్న రోగాల తాకిడికి కూడా గురవుతున్నారో ! ఇది ఒక ఉదాహరణమాత్రమే . నెమ్మురోగాలు ఎలాపెరిగాయో గమనించండి నేటి పిల్లలలో.
అలాగే నాడు ఎంత ఫ్లోరోసిస్ నీటిలో ఉన్నాగాని నాడు ,చింతకాయ తొక్కు పచ్చడి .రాగిసంగటి తమ తిండిలో ఉన్నంత కాలం ఈ వ్యాధి అంత తీవ్రంగా బాధించలేదు. అవి తమ ఆహారం నుంచి కోల్పోయాక ఫ్లోరోసిస్ దుష్పలితాలు ఎక్కువయ్యాయి . దానితో మినరల్ వాటర్ పేరిట నీటివ్యాపారాలు పెరిగాయి . భగవంతుడిచ్చిన నీటిని కూడా కొనుక్కుని తాగవలసిన దుస్థితిలో కొచ్చిపడ్డాము.కనుక ఈ ఆచారాలను పాటింపజేసేలా ఉన్న ఈ దేశ ధార్మిక ఆచారాలమీద దాడిచేశారు .మనలను ఈధర్మం నుంచి దూరం చేసే ప్రయత్నాలు దీనికనుబంధంగా సాగేందుకు ఆర్ధిక అండదండలను అంది్స్తూఉన్నారు.
ఇక్కడ మన సంస్కృతి ,జీవన విధానాలను మార్చుకోవటం వలన మనం కోల్పోతున్నదేమిటో మీకు అర్ధమవుతున్నదనుకుంటాను.
కాబట్టి మన ఆరోగ్యాలను కాపాడుతూ మనకు వారసత్వంగా వస్తున్న విజ్ఞానాన్ని కోల్పోవటం వలన వ్యక్తిగతంగా సామాజికంగా ఎంతనష్టమో అర్ధమవుతుంది. మనం గురువులుగా ఈలోకానికి క్షేమం చేయాలంటే లోక క్షేమకరమైన విద్యలను బోధించాల్సినదే . ముందు వాటిగూర్చి మనం తెల్సుకోవాలి . మనం మాత్రమే కొత్తతరానికి ఈ విజ్ఞానాన్ని అందించగలిగే అవకాశాన్ని కలిగి ఉన్నాము.
అయితే ఇప్పుడు ఉన్న అల్లోపతిక్ వైద్య విధానం వదిలేద్దామా ? చెట్లను పుట్టలనే నమ్ముకుందామా ? అనే వితర్కవాదనలొద్దు . చైనా లో చూడండి .ఆధునిక వైద్యవిధానంతో పాటు తమ సాంప్రదాయ వైద్యవిధానాలైన ఆక్యుపంక్చర్,ఆక్యుప్రెషర్ లను కూడా అనుసంధానం చేసుకుని సమాజానికి వైద్యసేవలందిస్తున్నారు.
అలానే మనం కూడా ఆధునిక వైద్యవిధానాన్ని సాంప్రదాయక వైద్యంతో అనుసంధానించి దాన్నికూడా సమాజంలో అందరికీ కనీసపరిజ్ఞానం కలిగేలా అందజేయవలసి ఉంది.
ఈలోగా అతి తీవ్రవేగంతో మన ఆయుర్వేద వైద్య విధానాదులపై అపప్రచారాలు సాగిస్తున్నారు . మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక ప్రమాదం పొంచి ఉంది . మన వైద్యవిధానం లోని విషయాలనే తాము పేటెంట్లుగా పొంది మనకే దాన్ని అమ్మేప్రయత్నాలు సాగిస్తున్నారు. .
మనం గొర్రెల్లా గొర్రెపిల్లల్లా ఉన్నంతకాలం మనమిలా అమాయకంగా వీళ్ళ దుష్ప్రచారాలకు లొంగి మన సాంప్రదాయక విజ్ఞానాలనుంచి మనం దూరం కాబడతాము . గొర్రెల కాపరి బాగా పెరిగాక కసాయివాడికమ్మాలనే లక్ష్యం కూడా కలిగుంటాడు. జాగ్రత్తగా ఉండాలి .
ప్రపంచఆరోగ్యసంస్థ ప్రకటించిన విషయాలు చూస్తే భయంకలుగుతుంది . మనదేశం లో అమ్మే అల్లోపతిక్ మందులలో ఎక్కువభాగం వాడకూడనివే . అవి తయారుచేస్తున్న మందులకంపెనీలు వాటిని తమదేశాలలో అమ్మటానికే అక్కడ ప్రభుత్వాలంగీకరించవు .
అతిశుభ్రత పాటించేవాల్లే ఎక్కువగా ఇఫెక్షన్ లకు గురవుతున్నారనే విషయం ఈమధ్య పరిశోధనలో వెళ్లడవుతున్నది. కాబట్టి అతిభయానికి లోనై మన వైద్యంతో మన మూలికలు ఈరోగాల్నేమి నయముచేస్తాయనే అనుమానాలు పెంచుకుని భారతదేశాన్ని విదేశీమందులకంపెనీల డంపింగ్ యార్డ్ గా మార్చటాన్ని ప్రోత్సహించకండి .మనలని మనం వాల్ల ఆదాయవనరులుగా మార్చుకోవటం నిరోదిద్దాం. అందుకోసమైనా మన విజ్ఞానాన్నిగూర్చి మనవైద్యాన్నిగూర్చి కనీసస్తాయిలో తెలుసుకుందాం దాన్ని. మనకు అన్నంపెట్టే ఈసమాజంతో పంచుకుందాం
జైహింద్
.........................
మా ఉపాద్యాయమితృలంతా చప్పట్లతో వారి అభిమానాన్ని వెల్లడించారు. ఆతరువాత మాట్లాడిన ఉపాద్యాయులు, డాక్టర్ గారు, ఒక నర్స్ తమ అనుభవాలను వెల్లడించి నాకంటే చాలా చక్కని వివరణలిచ్చారు .
6 వ్యాఖ్యలు:
చక్కగా చెప్పారు.
అంతెందుకు జలుబు చేసినప్పుడు ఇంట్లో మిరియాల కషాయం తాగించి ఆవిరి పట్టిస్తే వచ్చే రిలీఫ్ ఎన్ని యాంటి బయాటిక్ లతో వస్తుంది?
దెబ్బ తగిలినప్పుడు, ఎక్కడైనా కోసుకున్నప్పుడు ఎన్నో తరాల నుంచి ఇంట్లో అమ్మమ్మలు కాస్త పసుపు అద్ది కట్టు కట్టడం మనకి తెలుసు. పసుపుని మించిన యాంటి బయాటిక్ ఇంత వరకు ఈ సోకాల్డ్ పాశ్చాత్య దేశాలు ఎందుకు కనుక్కోలేకపోయాయో?
అయినా ఈ ఆధునిక మందుల వెనకే వెళ్తున్నారంటే ..."పెరటి చెట్టు" సామెత గుర్తు రాక మానదు.
సమాజ శ్రేయస్సుకి ఉచితంగా అందాల్సినవి రెండు ...కనీస విద్య, కనీస వైధ్యం...కానీ ఇప్పుడు అవే పేరెన్నికగన్న లాభసాటి వ్యాపారాలు!
అలోపతి లోని చాలా మటుకు మందుల్లో దాదాపు ముప్పయ్ నుండి యాభైమూడు శాతం వరకు మార్జిన్ వుంటుంది....
ఇప్పుడున్న లాభసాటి వ్యాపారాల్లో ఫార్మా కి మించినది లేదు....ఇది వారు చేసే దాడే!
దన్వంతరీ ప్రసాదంగా అనాదిగా అశ్వినీ కుమారుల పరంపరగా వస్తున్న సత్‌సంప్రదాయం ఆయుర్వేదం...
దీన్ని కాపాడుకోవల్సిన బరువు, బాధ్యతలు మనందరి పనా ఉన్నాయ్....
బాగా చెప్పారు. రేపెప్పుడో మన ఆయుర్వేదానికి కూడా వేరే దేశాలు పేటెంట్స్ పట్టుకొస్తాయిలెండి. అప్పుడు నమ్ముతారు మనవాళ్ళు.
నమస్కారం గురువు గారు! ఇంత మంచి మాటలు వ్రాసినందుకు మీకు శతకోటి ధన్యవాదములు.
నేను తరచూ మీ బ్లాగు చూస్తూ ఉంటాను. నా దృష్టిలో మీరు ఒక రుషి. మీ వంటి గురువులు మా అందరికి కావాలి.
మీరు చెప్పినట్లు, మన సనాతన ధర్మం, సంప్రదాయాలు ఇలా క్షీణించడానికి కారణం మనమే అనిపిస్తూ ఉంది. మన ఋషులు ఎన్నో అమూల్యమైన విజ్ఞానం మనకు అందించిన, మన పాశ్చాత్య వ్యామోహం తో దానిని దూరం చేసుకుంటున్నాము.
అనుష్టానం లోకి మన మంచి సాంప్రదాయాలను తెచుకుంటూ, నేటి ఆధునిక ప్రపంచంలో మసలడం ఎలాగో మాకు అర్ధం కావడం లేదు. అందుకోసమే మీ వంటి గురువులను అమ్మ ఎప్పుడు పంపిస్తూనే వుంటుంది. ఇప్పుడు మా అదృష్టం, కలి బారిన పడకుండా, వినవలసిన మంచి మాటలు వినేట్ల అమ్మ కృప చేసింది.
మీకు సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలు అనుగ్రహించాలని జగన్మాత ను ప్రార్దిస్తున్నాను.
మోహన్ కిషోర్, గుర్గాన్ (హర్యానా)
మితృలకు
నమస్కారం
ముందుగా మీ అభిమానానికి ధన్యవాదములు.
కొంపతగలబడుతుంటే మనవంతుగా ఒక బిందెడు నీళ్ళుచల్లాలి . దొంగలకదలికలమనదృష్టిలోకొచ్చినప్పుడు వారిని వ్యక్తిగతంగా వారిని ఎదిరించి పోరాడలేకపోయినా దొగలు...దొంగలు అని కేకలన్నావేయాలి. దానితో మరింకొందరు మేల్కొనటంద్వారా దొంగలను పారద్రోలవచ్చు. ఈపనిమీదనే నేనున్నాను . గొంతుకలిపి మీరూ బిగ్గరగా కేకలు వేసి మరింతమందిని మేల్కొల్పాలని మనవి చేస్తున్నాను.
అలాంటి వాళ్ళకు ఈ దిగువ Quote వర్తిస్తుంది.
Marcus Tullius Cicero Quote
"A nation can survive its fools, and even the ambitious. But it cannot survive treason from within. An enemy at the gates is less formidable, for he is known and carries his banner openly. But the traitor moves amongst those within the gate freely, his sly whispers rustling through all the alleys, heard in the very halls of government itself. For the traitor appears not a traitor; he speaks in accents familiar to his victims, and he wears their face and their arguments, he appeals to the baseness that lies deep in the hearts of all men. He rots the soul of a nation, he works secretly and unknown in the night to undermine the pillars of the city, he infects the body politic so that it can no longer resist. A murderer is less to fear. The traitor is the plague."
Post a Comment