శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

తిథులు వాటి అధిపతులు

>> Wednesday, February 1, 2012

నమస్తే
శ్రీగురుభ్యోన్నమః

మనం ఏదైనా కార్యం చేసేటప్పుడు తిథులలో కొన్ని కార్యములకు మంచి తిథులనీ
కొన్ని కార్యములకు సరి కావనీ నిర్ణయం చేసి తద్వారా కార్య నిర్వహణ లేదా
కార్య ప్రణాళిక నిర్మించుకుంటాం. ఐతే సాధారణంగా జ్యోతిష్య శాస్త్రం
నేర్చుకుంటున్నవారు నేర్చుకున్నవారూ కూడా చెప్పేదేమంటే తిథులు జడములనీ
వాటికి ఫలితాలనిచ్చే శక్తిలేదనీ చెప్తారు. ఐతే తిథులు వాటంతట అవి
ఫలితాలని ఇవ్వకపోయినా ఆ తిథులలో ఉండే దేవతాంశలు లేదా ఆ తిథులకి అధిపతులైన
దేవతలు ఆ తిథులలో జరిపే కార్యాల ఫలితాలను నిర్దేశించడంలో ఎంతో కొంత పాత్ర
పోషిస్తాయి అసలు పాత్ర లేకుండా ఉండవని పెద్దలైనవారు జ్యోతిష్య శాస్త్ర
పండితులు చెప్తారు. ముఖ్యంగా కలిలో ఈ తిథులకి కొందరు దేవతా స్వరూపాలు
అధిదేవతలుగా ఉంటారు ఆ యా తిథిఉన్న రోజులలో చేసే కార్యక్రమాన్ని బట్టి ఆ
తిథి అధిదేవత ఎవరో వారికున్న పరిమితులలో వారు ఫలితాన్ని ప్రభావితం
చేస్తారు ఋణాత్మకమూ కావచ్చు ధనాత్మకమూ కావచ్చు.

అగ్నిః ప్రతిపదః - పాడ్యమికి అగ్ని అధిపతి
బ్రహ్మా ద్వితీయాయాః - విదియకు బ్రహ్మ
పార్వతీ తృతీయాయాః - తదియకు పార్వతీ దేవి
చతుర్థాః గణపతి - చవితికి గణపతి
పంచమ్యాః శేషః - పంచమికి శేషుడు
కుమారః షష్ఠ్యాః - షష్ఠికి కుమారస్వామి
సూర్యః సప్తమ్యాః - సూర్యుడు సప్తమికి
శివోష్టమ్యాః - అష్టమికి శివుడు
వసవః నవమ్యాః - నవమికి వసువులు
దిగ్గజాః దశమ్యా: - దిగ్గజములు దశమికి
యమ ఏకాదశ్యాః - ఏకాదశికి యమధర్మరాజు
విష్ణుః ద్వాదశ్యాః - ద్వాదశికి విష్ణువు
మన్మథః త్రయోదశ్యాః - త్రయోదశికి మన్మథుడు
కలిపురుషః చతుర్దశ్యాః - చతుర్దశికి కలిపురుషుడు
చంద్రః పౌర్ణమాస్యా: - పౌర్ణమికి చంద్రుడు
అగ్నిష్వాత్తాదిపితరః అమావాశ్యాః - అమావాస్యకుఅగ్నిష్వాత్తు మొదలైన
పితృదేవతలు

మీ..

అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్

Read more...

అంబిక అక్షిత్రయము

>> Tuesday, January 31, 2012

శ్రీ గురుభ్యోన్నమః

నమస్తే


జగన్మాత తన బిడ్డలను ఎల్లప్పుడూ కాపాడుకునేందుకు ప్రత్యక్షంగా ఏదో ఓ
రూపంలో ప్రతిచోటా ఉంటుంది. ఐతే అలా రాశీభూతమైన అంబికా తత్త్వానికి
గుర్తుగా మూడు ముఖ్య ప్రదేశాలలో ఉన్న అమ్మవారి రూపాలను చెపుతారు.
అక్కడనుండి అమ్మవారు అన్ని కోట్ల జీవరాసులను మూడురకాలుగా కాపాడుకుంటూనే
ఉంటుంది. వానినే అంబికా అక్షిత్రయము అని పిలుస్తారు.
అవే ౧) కామాక్షి ౨) మీనాక్షి ౩) విశాలాక్షి.

కామాక్షి స్పర్శద్వారా తన భక్తులను కాపాడుతూ ఉంటుంది, కామాక్షి అంటే ఆమె
కన్నుల యొక్క చూపులచేతనే కోరికలు తీర్చే తల్లి అని అందరూ అంటారు కదా మరి
స్పర్శ చేత ఎలా కాపాడుతుంది అన్న అనుమానం రావచ్చు. అందుకే జగద్గురువులైన
శంకరులు సౌందర్యలహరిలో శ్లోకం చేస్తూ
...శృతీనాం మూర్ధానో దధతి తనయౌ శేఖరతయా
మమాస్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌః...
అంటే "తల్లీ, నీ పాదాలను శృతి శిరస్సులు అని పిలవబడే ఉపనిషత్తులు దాల్చి
ఉంటాయి. అటువంటి నీ పాదములను నా శిరస్సుపై ఉంచి నన్ను అనుగ్రహించు." అని
ఆ తల్లి ఇచ్చే దీక్షాపూర్వక రక్షణను సూచించారు. అంటే ఆ తల్లి భక్తులను
స్పర్శ దీక్ష లేదా దానినే కుక్కుట దీక్ష అంటారు.

మీనాక్షి, ఈ అమ్మ మీన నేత్రములు కలది. చేపలు గుడ్లు పెట్టి ఆ గుడ్లను తమ
చూపులచే పొదుగుతాయి అని మన శాస్త్ర వచనం. దీనినే నయన దీక్ష లేదా వీక్షా
దీక్ష లేదా మత్స్య దీక్ష అంటారు. అంటే ఈ తల్లి తన పిల్లలను ఎక్కడ ఉన్నా ఆ
అమ్మ తన చూపులతో చూస్తూ కాపాడుకుంటుంది.

విశాలాక్షి. ఈ తల్లి కళ్ళు బహు విశాలమైనవి. ఆమె తన పిల్లలను స్మరిస్తూ
కాపాడుతుంది. విశాలాక్షి అంటే బాహ్యంలో అత్యంత విశాలమైన కళ్ళున్నవి అన్న
అర్థం ఉన్నా, ఆమె తన స్మరణచే అంతర్ముఖత్వంలో లోకంలోని ప్రతి ఒక్కరి
బాగును కోరుకుంటుంది అంత విశాలమైనవి ఎక్కడో ఒక్క చోట కూర్చోపెట్టి మనం
పూజించినా సమస్త లోకాలని చూస్తూ కాపాడుకుంటున్న తల్లి ఆతల్లి. దీనినే కమఠ
దీక్ష అంటారు. మన శాస్త్ర వచనం ప్రకారం తాబేలు గుడ్లు ఎక్కడో ఒడ్డు మీద
పెట్టి నీటిలోకి వెళ్ళిపోతుంది తరవాత తన గుడ్లను స్మరిస్తూ ఉంటుంది ఆ
స్మరణలచేత ఆ గుడ్లు పొదగబడి పిల్లలై రక్షింపబడతాయి. దీనినే స్మరణ దీక్ష
లేదా కమఠ దీక్ష అని అంటారు.

ఇలాంటి దీక్ష చేతనే ప్రపంచాన్ని రక్షించే మహాత్ములు కొందరుంటారు వారే
గురువులు లేదా ఆచార్యులు. వారూ ఇవే దీక్షలద్వారా తమ శిష్యకోటిని
రక్షిస్తూ ఉంటారు. జగన్మాత యొక్క అక్షిత్రయరూపమునకు కొనసాగింపే
గురుస్వరూపాలు. ఆమెయే గురుమండల రూపిణి. అందుకే ఆమె దీక్షావిధానములైన
స్పర్శ, నయన, స్మరణ దీక్షలద్వారా లోకాన్ని కాపాడుతుంది. ఏకంసత్
జ్ఙానాన్ని బోధించవలసినప్పుడు నాలుగవరూపమైన గురుస్వరూపాన్ని
శిష్యునివద్దకు పంపుతుంది.

సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు
[satsamgam group]

శ్రీ గురుభ్యోన్నమః

నమస్తే.
అంబికా అక్షిత్రయము, ౧) కామాక్షి ౨) మీనాక్షి ౩) విశాలాక్షి, మరియు త్రిదీక్షా విధానము గురించి చాలా వివరముగా తెలియచేసినందుకులకు
మీకు మా ధన్యవాదాలు తెలుపుకొంటూ. ఆ మహా తల్లులు లే కాదు మన తల్లులు కూడా అదే త్రి దీక్షా విధానముతో ఈ లోకములో తమ పిల్లలను సంరక్షిస్తూ వస్తున్నారు.
పిల్లలు దూరముగా వున్నప్పుడు గాని లేక విదేశములలో వున్నప్పుడు గాని, వారి తరపున పూజలు, వ్రతములు, స్తోత్రములు చేయాలంటే, వారికి ఆ ఫలితములు అతి శ్రీఘ్రముగా అందాలంటే మాతృ మూర్తులు తమ గర్భస్థ స్థానమున (పొత్తికడుపు) తమ చేతిని వుంచి చేస్తే, ఆ ఫలితములు తమ బిడ్డలకు అందుతాయి. కర్పూర హారతి కూడా ముందు తాము అద్దుకొని, తరువాత తమ గర్భస్థ స్థానమున కద్దితే అది పిల్లలకు అందుతుంది. ఇది నిక్కము. మాతృ మూర్తికి వున్న గొప్ప విశేషము ఇది. ఇలా చేయుట వలన తమ వంశము నిలబడుతుంది.

మీ
కామరాజుగడ్డ రామచంద్రరావు

Read more...

సంతాన సాఫల్యానికి సూర్యశక్తి

లండన్, జనవరి 30: ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్.. ఇది మన పూర్వులు చెప్పిన మాట. పాశ్చాత్య పరిశోధకులూ ఒప్పుకొన్న నిజం. ఇప్పుడింకో పరిశోధనలోనూ అదే తేలింది. సూర్యకిరణాల నుంచి లభించే డి విటమిన్.. పురుషుల్లోనూ, స్త్రీలలోనూ సంతాన సాఫల్య శక్తిని పెంచుతుందని మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ గ్రాజ్ (ఆస్ట్రియా) పరిశోధకుల అధ్యయనంలో తేలింది. డి విటమిన్ పురుషుల్లో వీర్యకణాల సంఖ్యను పెంచుతుందని, మహిళల్లో హార్మోన్ల అసమతౌల్యాన్ని సరిచేసి సంతాన సాఫల్య శక్తిని పెంచుతుందని వివరించారు. డి విటమిన్ లోపం కారణంగా సంతానభాగ్యం పొందలేకపోతున్నవారు ఖరీదైన చికిత్సల వెంట పరుగులు తీయకుండా... నిత్యం సూర్యకాంతిని పొందగలిగితే ఫలితం ఉంటుందని సూచించారు.

దీనివల్ల మహిళల సెక్స్ హార్మోన్లయిన ప్రొజెస్టిరోన్ 13 శాతం, ఈస్ట్రోజన్ 21 శాతం మేర పెరుగుతాయని, రుతుచక్రం సవ్యంగా ఉంటుందని విశ్లేషించారు. అదేవిధంగా ఎండలో కాసేపు గడపడం వల్ల పురుషుల సెక్స్ హార్మోన్ అయిన టెస్టోస్టీరాన్ స్థాయులు పెరుగుతాయట. అయితే, ఉదయపు ఎండలో కాసేపు ఇలా గడిపితే సరిపోతుందని, అదేపనిగా తీక్షణమైన ఎండలో ఎక్కువసేపు గడిపితే ఇతరత్రా సమస్యలు వస్తాయని హెచ్చరించారు. యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రైనాలజీలో వారి పరిశోధన ఫలితాలు ప్రచురితమయ్యాయి.


బీపీ.. రెండు చేతులకూ చూడాల్సిందే!

లండన్, జనవరి 30: ఒంట్లో బాగుండకపోతే వైద్యుడి దగ్గరకెళ్తాం. రోగ లక్షణాలు విన్నాక ఏ డాక్టరైనా ముందుగా చేసే పని బీపీ చెక్ చేయడం! ఒక చేతికి మాత్రమే ఇలా చెక్ చేయడం మనందరికీ తెలిసిన విషయమే. కానీ.. అలా ఒక చేతికి కాకుండా రక్తపోటును రెండు చేతుల్లోనూ కొలవాల్సిందేనని బ్రిటన్ పరిశోధకులంటున్నారు. ఇలా చేయడం వల్ల గుండె సంబంధిత జబ్బులను ముందుగానే పసిగట్టవచ్చని వారు చెబుతున్నారు.

యూనివర్సిటీ ఆఫ్ ఎక్సీటర్, పెనిన్సులా కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అండ్ డెంటిస్ట్రీకి చెందిన డాక్టర్ క్రిస్టోఫర్ క్లార్క్, బృందం చెబుతున్న ప్రకారం.. రెండు చేతులకూ బీపీ చెక్ చేసినప్పుడు సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్‌లో 10ఎంఎం తేడా ఉంటే కాళ్లకు, పాదాలకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు గట్టిపడుతున్నట్టు సూచన అని వారు వివరించారు. ఈ తేడా ఉన్న వారు గుండె జబ్బులకు గురయ్యే ముప్పు అధికమని హెచ్చరించారు. ఆ తేడా 15 ఎంఎం కంటే ఎక్కువ ఉంటే మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఇబ్బందులు ఉన్నట్టేనని తెలిపారు.

ఈ తేడా ఉందని ముందస్తుగా తెలుసుకోవడం వల్ల బాధితులకు ఆ ఇబ్బందిని అధిగమించేందుకు అవసరమైన సూచనలు చేసే అవకాశం వైద్యులకు ఉంటుంది. "నిజానికి బీపీ చెకింగ్ రెండు చేతులకూ చేయాల్సిందేనని ఇప్పటికే మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. కానీ, ఎవరూ చేయట్లేదు'' అని క్రిస్టోఫర్ క్లార్క్ అన్నారు. రోగికి ధూమపానం అలవాటు ఉంటే దాన్ని మానేయడం, రక్తపోటును తగ్గించే మందులు తీసుకోవడం వంటి ముందు జాగ్రత్తలతో గుండెజబ్బుల ముప్పును నిరోధించవచ్చని వివరించారు.


[ఆంధ్రజ్యోతి డైలీ]

Read more...

గృహస్థుకుండవలసిన లక్షణములు

నమస్తే
శ్రీగురుభ్యోన్నమః

కొన్ని రోజుల క్రితం గృహస్థు చేయవలసినవి ధర్మాలేవి అన్న చర్చ జరిగింది.
గృహస్థ ధర్మాలు గృహస్థుకుండవలసిన లక్షణములు సామాన్య ధర్మములు క్రింద
తెలుపబడ్డాయి, ఇక గృహస్థుకు సంబంధించి ఏ ధర్మమైనా చాలామట్టుక్కు
వీనిననుసరించే ఉంటుంది. ఒక సాధారణ గృహస్థు ఈ లక్షణాలను అలవర్చుకొని ఆ
పంథాలో నడుస్తే గృహస్థ జీవనం ధర్మపథంలో నడిపించుకుంటున్నట్టే (అని
నాభావన, ) ఇంతకన్నా ఎక్కువ ఉండవచ్చు (exceptional or which are uncommon
to normal gruhastha)

యథానదీనదాః సర్వేసాగరేయాంతి సంస్థితిం
తదైవాశ్రమిణః సర్వేగృహస్థేయాన్తి సంస్థితిం
అని అన్నట్లుగా నదీ నదాలు ఎలా సముద్రుని ఆశ్రయించి ఉంటాయో, ఇతర ఆశ్రమ
వాసులందరూ గృహస్థుని ఆశ్రయించి ఉంటారు కాబట్టి గృహస్థు శ్రేష్ఠుడు

తస్మాదేతాః సదాభ్యర్చా భూషణాచ్ఛాదనాశనైః
భూతకామైః నరైర్నిత్యం సత్కారే షూత్కవేషుచ
స్త్రీలనెప్పుడూ వస్త్రాభరణములచే గౌరవించాలి. సత్కారములు, ఉత్సవములు,
గౌరవము సంపదనాశించువారు స్త్రీలను ఎప్పుడూ గౌరవించవలెను.

దయాలజ్జాక్షమాశ్రద్ధాప్రజ్ఙత్యా

గః కృతజ్ఙతా
ఏతేయస్యగుణాస్సన్తి గృహస్థోముఖ్య ఉచ్యతే
ప్రతి గృహస్థు ఈ ఏడు ముఖ్య గుణములను కలిగి పెంపొందించుకుంటూ ఉండాలి
౧) దయ: సర్వ ప్రాణుల యందు దయ కలిగి సమ దృష్టి కలిగి ఉండాలి
౨) లజ్జ సిగ్గుపడుట, తనకేమీ తెలియదని తాను చేసిన గొప్ప పనులు కూడా
అందరికీ గొప్పగా మేలు చేయలేకపోతున్నాయనీ, చేస్తున్నదానికన్నా గొప్పగా
చేయలేకపోతున్నాననీ సిగ్గుపడాలి
౩) క్షమ: ఓర్పు ఏ కార్యాన్నీ తొందర పడి చేయకుండా, ఫలితము రాలేదని త్వరపడి
ఎవరేమన్నా ఓర్పు చెంది ఉండటం ముఖ్యము
౪) శ్రద్ధ చేసే ప్రతి కార్యమునందు సంపూర్ణ విశ్వాసముతో చేయగలగాలి లేకున్న
శ్రద్ధ తగ్గి కార్యం నెరవేరదు
౫) ప్రజ్ఙ: బుద్ధి విశేషము, బుద్ధివల్ల కలిగే ఊహలనే ప్రజ్ఙ అంటారు.
ప్రజ్ఙ దైవదత్తము, దైవానుగ్రహమున్నపుడే ప్రజ్ఙ భాసిస్తుంది. కాబట్టి మన
బుద్ధిని ప్రచోదనం చెయ్యమని భగవంతుని రోజూ ప్రార్థించాలి.
౬) త్యాగం: సంపాదించిన సంపాదనలో కొంత త్యజించుట, తనకున్న దానిలో లోభత్వము
లేకుండా దాన ధర్మాలు చేయడం.
౭) కృతజ్ఙత: చేసిన మేలును మరువక గుర్తుంచుకొని ప్రవర్తించుటను కృతజ్ఙత
అంటారు.

పై ఏడు గుణములు కలిగి ప్రవర్తించుట గృహస్థు ముఖ్యమైనవి, అలవర్చుకోవలసినవి

దయా సర్వభూతేషు క్షాన్తిరనసూయాశౌచమనా
యాసో మంగళమకార్పణ్యమస్పృహేత్యాదికుర్యాత్
న్యాయాగత ధనేన కర్మాణికుర్యాత్
విహితాకరణే ప్రతిషిద్ధసేవనే నరకపాతః
దయాగుణాన్ని అలవర్చుకోవాలి, క్షాంతి లేదా క్షమ లేదా
ఓర్పునుఅలవర్చుకోవాల్, ఇతరులలోని సద్గుణములకు అసూయ చెందరాదు., శారీరక
మానసిక శౌచముకలిగి ఉండాలి, శారీరకముగానూ మానసికముగానూ అనాయాసము కలిగి
కార్యోన్ముఖుడై ఉండాలి, శుభకరమైన మంగళ కరమైన పనులు చేయాలి, యోగ్యులకు
శక్తికొలదీ భక్తితో దానాదులు ఇచ్చుగుణము ఉండాలి, ఇతరుల సంపద యందు స్పృహ
లేక ఉండాలి.
న్యాయ మార్గమున సంపాదించిన ధనముచేతనే సత్కర్మలాచరించాలి
విహితకర్మలను వదిలి అవిహిత కర్మలను ఆచరించుట నరకహేతువు.

ఆయుర్విత్తం గృహచ్చిద్రం మంత్రమౌషధ సంగమం
దానమానావమానాని నవగోప్యాని కారయేత్
ఆయుష్షు, సంపద, ఇంటి బాధలు, తాను చేసే రహస్యమైన ఆలోచనలు, తాను వాడే
మందులు, భార్యాభర్తల సంగమ విషయాలు, చేయు దానములు, తనకు జరిగిన అవమానము
పొందిన గౌరవము అను తొమ్మిదింటిని గృహస్థుడైనవాడు వెల్లడి చేయారాదు.

ఇక గృహస్థుయొక్క గృహం అంటే భార్య కూడా అటువంటి గుణములతోనే గృహస్థుని
అనుసరించాలి
ధర్మోమిత్రం ప్రమీతస్య, విద్యామిత్రం ప్రవాసినః
భార్యామిత్రం గృహస్థస్య, దానం మిత్రం మరిష్యతః
భార్య గృహస్థునకు పరమ మిత్రురాలు, ఒక మిత్రుని లాగా యుక్తాయుక్తములెరిగి
అటువంటివిషయములను భర్తకు చెప్పగలిగినదై ఉండాలి.

అనుకూల్యం కళత్రస్య స్వర్గోభవతి నిశ్చితః
ప్రాతికూల్యం కళత్రస్య నర్కోనాత్ర సంశయః
పైన చెప్పిన మానసిక గుణములను అలవర్చుకున్నవారై అనుకూలవతి యైన భార్యకలవారి
జీవితము స్వర్గతుల్యంగా ఉంటుంది. ఇంకోటి చెప్పనేలా...........!!!!!!!


అనుకూలా సదాహ్రష్టా, దక్షా సాధ్వీ ప్రజాపతీ
ఏఖరేవ గుణైర్యుక్తాశ్రరేన స్త్రినసంశయః
దయ మొదలగు పైన చెప్పిన 8-9 గుణములు నేర్చినదై భర్తకు అనుకూలముగా ఉండి,
భర్త తన నిష్ఠ, ధర్మమునందు వైక్లవ్యము పొందకుండా కాపుకాస్తూ, తానూ తన
భర్తచేత అలానే కాపుకాయబడుతూ, ఎప్పుడూ సంతోషంతో ఉండి, మంచి నేర్పరియై,
సాధ్వియై ( తన భర్తకే చెంది, తన భర్త, వంశ ఉన్నతిని మాత్రమే
కాంక్షించునదై), సంతానవతియై యున్న స్త్రీ నిజముగ శ్రయనగ అగును అంటే
లక్ష్మీదేవియే అని కీర్తింపబడుతుంది. అప్పుడే ఆయింటి స్త్రీ గృహలక్ష్మి
అని పిలిపించుకొనుటకు అర్హత కలిగి యుండును.

మీ...
అయ్యంగారి సూర్యనాగేంద్రకుమార్

Read more...

చేసిన మంచే చివరకు మిగిలేది

>> Monday, January 30, 2012

చేసిన మంచే చివరకు మిగిలేది

ఈనాటి ప్రపంచంలో ఎటుచూసినా అవినీతి, బంధుప్రీతి, అన్యాయం, అధర్మం విలయతాండవం చేస్తున్నాయి. కింది స్థాయి నుండి పైస్థాయి వరకు సమాజంలోని ఏ రంగమూ దీనికి మినహాయింపు కాదు. కాలక్రమంలో వీటి నిరోధానికి అనేక చర్యలు చేపట్టడం జరిగింది. అయినా ఈ దుర్మార్గాల నిర్మూలన జరగలేదు. నేడు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మానవ సమాజం గణనీయమైన ప్రగతిని సాధించిన విషయం మనందరికీ తెలుసు.

కాని నైతికంగా మనం ఎక్కడున్నామన్నది ప్రధాన ప్రశ్న. నైతిక విలువలకు తిలోదకాలిచ్చి, మానవ విలువలను మంటగలిపి, ఆధ్యాత్మికతను భ్రష్టు పట్టించిన ఫలితంగానే మానవ సమాజం ఈ విధంగా అధోగతి పాలవుతోందన్న విషయాన్ని మనం గమనించడం లేదు. భౌతిక ప్రగతే అసలు ప్రగతి అన్న భ్రమలో పడి ప్రాపంచిక ప్రయోజనాల వెంట పరుగులు తీస్తున్న ఫలితమే ఈ అవినీతి, బంధుప్రీతి, అన్యాయం, అధర్మాలు.

అందుకే దైవ ప్రవక్త ముహమ్మద్(సం) అన్నారు. "మనిషి అంతా నాది నాది అంటాడు. కాని నిజానికి అతనిది ఏది? అతను తినికాజేసింది, తొడిగి చించేసింది, దైవ మార్గంలో వెచ్చించి రేపటికోసం(పరలోకం కోసం) కూడబెట్టుకున్నది. ఇదిగాక మిగిలిందంతా ఇతరులదే.'' అంటే ఈ మూడు మార్గాల్లో వెచ్చించిందే నిజానికి అతనిది. ఇక ఇదిగాక మిగిలిందంతా అతని వారసులదే.

అది ఏ విధంగానూ అతనికి ఉపకరించదు... ఇహలోకంలోనూ, పరలోకంలోనూ. అందుకని తనది కాని దాని కోసం మనిషి ఎప్పుడూ పాకులాడకూడదు. మనుషుల్లో ఈ స్పృహ జాగృత మైననాడు, సమాజంలో అవినీతికి, బంధుప్రీతికి, మనుషుల్లో ఆధ్యాత్మిక చైతన్యం రావాలి. తద్వారానే నైతిక, మానవీయ విలువలు వికసిస్తాయి.

ముహమ్మద్ ప్రవక్త(సం) ఇలా సెలవిచ్చారు. "అవినీతికి, అధర్మానికి పాల్పడి సంపాదించిన సొమ్ముతో పోషించబడిన శరీరం ఎట్టి పరిస్థితిలోనూ స్వర్గానికి పోజాలదు.'' అంటే అవినీతి, అధర్మ సంపాదనతో మూన్నాళ్ల ముచ్చటైన ఈ ప్రాపంచిక జీవితంలో తాత్కాలిక ఆనందం పొందవచ్చేమో కాని, శాశ్వతమైన పరలోక జీవితంలో మాత్రం నరక శిక్షను చవిచూడవలసి ఉంటుంది. అదీగాక ప్రాపంచిక జీవితంలో కూడా ధన సంపాదనతో ఆనందం దొరుకుతుందా అంటే దానికీ స్పష్టమైన హామీ లేదు. ఎందుకంటే, కోట్లు గడించిన వారు కూడా ఆనందానికి దూరమై, నిత్య దుఃఖం అనుభవించే వాళ్లూ ఉన్నారు.

కనుక కొన్నాళ్ల ప్రాపంచిక జీవిత ఆనందం కోసం, శాశ్వతమైన, అమరసుఖాల పరలోక జీవితాన్ని పణంగా పెట్టడం వివేకవంతుల లక్షణం ఎంత మాత్రం కాదు. ఎందుకంటే ఎన్నాళ్లు బ్రతికినా ఏదో ఒకనాడు ఇహలోకాన్ని వీడిపోవడం తథ్యం. అందుకని బ్రతికినన్నాళ్లు ఎలాంటి అవినీతికి, ధర్మానికి తావులేకుండా, నైతిక, ఆధ్యాత్మిక విలువలతో కూడిన జీవితం గడిపితే ఇటు ఇహలోక జీవితమూ గౌరవప్రదంగా, శాంతియుతంగా ముగుస్తుంది. అటు పరలోక జీవితంలో కూడా శాశ్వత సాఫల్యం మన సొంతమవుతుంది. దైవం అందరికీ సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం.
- యం.డి. ఉస్మాన్‌ఖాన్
[andhrajyothy.com]

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP