అంతరంగ సంస్కరణ
>> Sunday, January 23, 2011
- దానం శివప్రసాదరావు రాత్రి నిద్రించే సమయంలో ఒక్కసారి ఆరోజు దినచర్యలోని తమ ప్రవర్తనాదులను ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రతి ఒక్కరూ. తప్పొప్పులు, తొందరపాట్లు, హడావుడి నిర్ణయాలు, మాటా-మంతీ, ఆవేశకావేషాలు దినచర్యలో సాధారణంగా చోటుచేసుకుంటుంటాయి. అంతరంగంలో మనం వేసుకునే ప్రశ్నలు- వివేకంతో కూడిన జవాబులు మన ప్రవర్తనలోని లోటుపాట్లను ఎంచుతాయి. ఏది మంచో, చెడో మనసుకు తెలుసు. విశ్లేషించుకునే శక్తి ఉంది. ఈ విశ్లేషణతో తనను తాను తీర్చిదిద్దుకోగలిగితే కోరుకున్న సుఖవంతమైన వాతావరణం లభించినట్లే. ఇదే మనో సంస్కరణ. ఎప్పటికప్పుడు మనస్సును మంచిమార్గంవైపు సంస్కరించుకొంటూ పోవాల్సి ఉంటుంది. మనచుట్టూ 'ప్రతిరోజూ మంచి వాతావరణం ఏర్పడాలి' అంటూ కోరుకునే వేళ మనసును 'మార్పు' వైపు నడిపించుకోగలిగే వివేకమూ కలిగి ఉండాలి. నారాయణ భట్టు మహా పండితుడే. పాణిని వ్యాకరణాన్ని ఆమూలాగ్రం శోధించినవాడే. ఆ రోజున రాజాస్థానంలో శిరోమణి భట్టుతో పోటీలో తలపడ్డాడు. శిరోమణి భట్టుదే పైచేయి అయింది. రాజు సన్మానం, పల్లకి ఊరేగింపు శిరోమణి భట్టుకు దక్కాయి. తలవంపుగా భావించాడు నారాయణ భట్టు. అవమాన భారంతో కుతకుతలాడిపోయాడు. తన వాదనే సరైందన్నాడు. శిరోమణి భట్టు తనకు సరిసాటి కాదంటూ ఊగిపోయాడు. శిరోమణి భట్టు మందహాసం చేస్తూ ఉండిపోయాడు. ఆ రాత్రి నారాయణ భట్టు తనను తాను ప్రశ్నించుకున్నాడు. నిజానికి శిరోమణి భట్టుకు తన కంటే విద్వత్తు ఉంది. తాను జీర్ణించుకోలేకపోయాడు. 'నాలో ఈ అహం ఏమిటి? ఎందుకు? విద్వత్తుగల వారిని ప్రశంసించే గుణం నాలో లేకపోయిందే! ఓటమిని ఎందుకని ఒప్పుకోలేక పోయాను?' అని తలపోశాడు. అహం, ఈర్ష్య, అసూయ తన మనసుపై ముప్పేటదాడి చేశాయని గ్రహించాడు. ఆ మరుసటిరోజు రాజు సత్కారం అందుకున్న శిరోమణి భట్టు- పల్లకి ఎక్కుతుండగా 'మహాత్మా... నా అజ్ఞానాన్ని మన్నించండి... నిన్నటి సభలో నా ప్రవర్తనకు సిగ్గుపడుతున్నాను' అంటూ చేతులు జోడించి, 'పల్లకి మోసే బోయీని తప్పుకోమని తన భుజాన్ని ఆనించాడు. శిరోమణి భట్టు దిగ్గున పల్లకి దిగి 'మహానుభావా! మీతో శాస్త్ర చర్చలో పాల్గొనడమే గొప్ప అవకాశంగా భావించాను... నా గెలుపు మీరు పెట్టిన భిక్షే' అంటూ తన సరసన కూర్చోబెట్టుకుని గౌరవించాడు. మన ప్రవర్తనలో లోటుపాట్లు ఉన్నట్లయితే సవరించుకోవడం సంస్కరించుకోవడం మనో వికాసానికి, వివేకానికి నిదర్శనం. పొద్దున నిద్ర లేస్తూనే సమస్యలు, ఒత్తిళ్లు, అననుకూల వాతావరణాలే తప్పటం లేదు. ఏ రోజూ... ఈరోజు కూడానేమో! అంటూ డీలాపడిపోవడం సరికాదు. ఎవరో వచ్చి ఏవో అద్భుతాలు జరిగి మన పరిసర వాతావరణాన్ని స్వర్గం చేయరు. మనకు మనమే చేసుకోవాలి. ఇందుకు మనో సంస్కరణ అవసరం. మనలోని ఈ సంస్కరణ ఎదుటివారిలోనూ పరివర్తనకు శ్రీకారం చుడుతుంది. ఎక్కువకాలం జీవించాలంటే శారీరక, మానసిక ఆరోగ్యాలు రెండూ ముఖ్యమేనన్నది అందరికీ తెలిసిందే. బలహీనతలను అధిగమిస్తూ, జయిస్తూ ముందడుగు వేయడమే పరిపక్వతకు సూచిక. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాం. మనం మనసును కూడా పవిత్ర భావనలతో ఉంచాలన్న విషయాన్ని విస్మరించకూడదు. |
0 వ్యాఖ్యలు:
Post a Comment