సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వసంపద నాకు గర్వకారణము.
>> Tuesday, January 25, 2011
భారతదేశము నామాతృభూమి
తొమ్మిది నెలలు మోసే తల్లి గొప్పది.అంతకంటే పుట్టినప్పటినుంచి తనమట్టిలో కలిసేవరకు నన్నుభరించి లాలించి పాలించి సర్వంసమకూర్చిన నాతల్లి ఈదేశం.
భారతీయులందరు నా సహోదరులు.
ఈ దేశస్థులైన ప్రజలందరు ఈదేశమాత బిడ్డలందరు ఏకోదరులు కాన నాకుసోదర సోదరీమణులని వారి క్షేమము నాక్షేమమని విశ్వసిస్తున్నాను.
నేను నాదేశమును ప్రేమించుచున్నాను
నాతల్లిని ఎలాప్రేమిస్తున్నానో ! అంతకుమిన్నగా ఈనేల తల్లిని ప్రేమిస్తుంటాను.
సుసంపన్నమైన ,బహువిధమైన నాదేశ వారసత్వ సంపద నాకెంతో గర్వకారణము
ఈ నా మాతృభూమి నాకు ప్రసాదించిన విజ్ఞానము,సంస్కృతి,సంప్రదాయాలన్నీ ప్రపంచములోనో ఉన్నతమైనవి అని ప్రగాఢముగా విశ్వసించి బహువిధములుగా విలసిల్లిన ఈ సంపదను వారసత్వంగా పొందిన నేనెంతోధన్యుడనని గర్వపడుతున్నాను.
దీనికి అర్హుడనగుటకై సర్వదా నేను కృషిచేయుదును
మహామహులైన నాపూర్వీకులంతా ప్రసాదించిన ఈ వారసత్వాన్ని పొందటం అదృష్టం .అందుకుకూడా నాకు అర్హత ఉన్నదా లేదా అని నిరంతరం పరిశీలించుకుంటూ ఆ అర్హతపొందటానికై తపిస్తుంటాను.
నాతల్లిదండ్రులను,ఉపాధ్యాయులను,పెద్దలందరినీ గౌరవింతును
జన్మనిచ్చిన తల్లిదండ్రులను, అజ్ఞానమునుండి సుజ్ఞానమువైపు పయనించుటకు కారకులైన గురువులను, ఈవారసత్వాన్ని పరంపరాగనుగతంగా అందజేస్తున్న పెద్దలను గౌరవించటం నా జన్మకుసార్ధకత చేకూరుస్తుంది.
ప్రతి వారితోటీ మర్యాదగా నడుచుకొందును
నాకు ఏవిధమైన గౌరవమర్యాదలు కావాలనుకుంటానో అవి ఇతరులకు నానుంచి ఇవ్వటానికి ప్రయత్నిస్తుంటాను.
నా దేశము పట్లను, నాప్రజలపట్లను సేవానిరతి కలిగియుందునని ప్రతిజ్ఞచేయుచున్నాను .
నాదేశాన్ని,నాదేశప్రజలను సేవించుకునే అవకాశం మహద్భాగ్యం గా భావిస్తూ అందుకు సంసిద్ధుడనైయున్నాను
వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందమునకు మూలము
"తవసుఖేన మమ సుఖం" అనే సూత్రాన్ని నేర్పింది నా సంస్కృతి . భోగము ద్వారా కాదు త్యాగము ద్వారా మాత్రమే నిజమైన ఆనందం కలుగుతుందని చెప్పి ఆచరణాత్మకంగా నిరూపించిన పుణ్యభూమి ఇది . ఇది సత్యం ..సత్యం..సత్యం. అని ఎలుగెత్తి చాటుతున్నాను.
. [ఈ నేలపై పుట్టి ఈగాలి పీల్చి.ఈ నీరుతాగి, బిడ్డఎదగటానికి గుండెలపై కాళ్ళుచేతులూ తాడిస్తున్నప్పుడు ఆనందించే తల్లిలా మనకోసం సర్వంప్రసాదించిన ఈ నేలతల్లిని ,ఈ సంస్కృతిని ఉపయోగించుకుని కూడా అవన్నీమరచిపోయి ఈ పుణ్యభూమిని విమర్శిస్తూ,ద్వేషిస్తూ,ధూషించే అవమానిస్తూ,అంతచేయాలనుకునే నికృష్ట జీవులను మాత్రం నాకంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నా చివరిశ్వాస దాకా వ్యతిరేకిస్తాను, ఈ నామాతృభూమికోసమై .వేలవేలసార్లు మరణించి జన్మిస్తూనే ఉంటాను .]
వందేమాతరం .
2 వ్యాఖ్యలు:
one more great post from you sir!
చక్కగా వ్యాఖ్యానించారండి. ధన్యులము.
వందేమాతరం !
Post a Comment