శంకరాచార్యకృత అన్నపూర్ణాష్టకం
>> Thursday, October 27, 2011
శ్రీ గురుభ్యోన్నమః
శ్రీ గణేశాయ నమః
అన్నపూర్ణాష్టకం
జగద్గురువులైన శంకరులు, కాశీక్షేత్రంలోని అన్నపూర్ణమ్మను స్తుతి చేస్తూ చేసిన అష్టకమ్మిది. అమ్మవారి పూజలు, మంత్ర, యంత్ర, తంత్ర సహితంగా మనం చేయలేమని అమ్మ కృప పాత్రులవడానికి ఎన్నో సద్యఃఫలితాలనిచ్చే స్తోత్రాలనిచ్చారు. వాటిలో బహు ప్రాశస్త్యం పొందినది ఈ అన్నపూర్ణాష్టకం. అందునా తెలుగువారి నోట భోజనం చేసే ముందు ఈ స్తోత్రంలోని శ్లోకాలు తప్పక నాట్యమాడతాయి. అతి సులభంగా అత్యంత మనోహరంగా చిన్నపిల్లలకు కూడా గుర్తు ఉండేలా చాలా సులభంగా ఉంటుంది. నేటి నాగరికత వెర్రితలలు వేసి భోజన సమయంలో పఠించడం సంగతి పక్కన పెడితే అమ్మవార్ని తలుచుకోవడం కూడా పోయింది. ఈ స్తోత్రం చదువుతూ భోజనం చేయడం ద్వారా ఇహ పర సౌఖ్యాలను పొందవచ్చు. ముఖ్యంగా భోజనం చేసే సమయంలో దైవ నామ స్మరణ అన్నపూర్ణాష్టకం చదవడం వల్ల తినే పదార్థం ప్రసాదరూపంలో మనలో చేరి జీర్ణమవుతుంది. మన మనస్సుకు బలాన్ని మనం తినే ఆహారమే ఇస్తుంది. మన ఆహారంలో ఆరవ వంతు మనస్సుగామారుతుంది. ఈ స్తోత్రం చదువుతూ తినడం వలన చక్కని మనఃప్రవృత్తి ఏర్పడుతుంది. ఈ స్తోత్రం అవసరం లేదనే వారుండరు, చిన్నపిల్లల దగ్గర్నుంచీ వృద్ధులవరకూ అందరికీ ఈ స్తోత్రం శరణ్యమే.
రోజూ అన్నంతింటూ ఆ అన్నం ఇచ్చిన తల్లి అన్నపూర్ణను మరవడం ఎంత కృతఘ్నత! అందుకే మనం మన పిల్లలు మన కుటుంబం ఈ స్తోత్రాన్ని చదివి భోజనం చేద్దాం. మన భావితరాలకు మన సంస్కృతిని నిలబెట్టి అందిద్దాం.
శంకరులు ఈ స్తోత్రాన్ని కేవలం ఆకలితోఉన్నప్పుడు కడుపునింపి లౌకిక సుఖాన్నిచ్చే దేవతను కొలిచే విధంగా ఇవ్వలేదు. ఇది పరాశక్తి స్తోత్రం. వారడిగింది జ్ఙాన వైరాగ్యములను మోక్షంపొందడాన్ని భిక్షగా అడిగారు. అమ్మ కృపను భిక్షగా అడిగారు.
ముఖ్య గమనిక:
1) ప్రాచుర్యంలో రెండు మూడు పాఠాంతరాలున్నాయి, మీవద్దనున్న దానికి ఇక్కడ పొందుపరిచేది భిన్నంగా ఉండవచ్చు.
2) ఇంతకుముంది కనకధార గురించి చెప్పినట్టుగానే, ఈ క్రింద వివరణలే ఈ స్తోత్రం యొక్క పరమ అర్థములని వ్యాఖ్యానములనీ నేను ఏమాత్రమూ చెప్పట్లేదు. అలానే ఇది కేవలం చదువుతున్నప్పుడు అక్కడా ఇక్కడా విన్నవీ, చదివినవీ నాకు అర్థం అయ్యినంతవరకూ, ఆ అర్థం అయ్యిన విషయం నాలో స్థిరీకరించుకుని అమ్మవారి పాదాలు పట్టుకోవడానికి చేసే ప్రయత్నమే. పైగా నేను అర్థం చేసుకున్న భావం తప్పైతే పెద్దలు మీరు దిద్దుతారన్న భావంతోనే ఇక్కడ పొందు పరచడం జరుగుతోంది తప్ప ఇతర ఏ అన్య విషయాలకీ కాదని మనవి.
3) సహృదయంతో పెద్ద మనస్సుతో అర్థం చేసుకుని నన్ను సరిదిద్ది ఆశీర్వదించమని ప్రార్థన
అన్నపూర్ణాస్తుతిః
నిత్యానందకరీ వరాభయకరీ సౌన్దర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘొరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ|
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౧||
అర్థము: నిత్యమైన ఆనందము నిచ్చుదానవు, వరములను- అభయమును ప్రసాదించు దానవు, రాశీభూత సౌందర్యమనే సముద్రమైన దానవు, ఘోరమైన పాపముల నన్నిటినీ తీయగలిగినదానవు, ప్రత్యక్షముగా అందరికీ కనపడు మహేశ్వరుని పత్నివి, హిమవంతుని వంశమును పావనము చేసినదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయాంబునిధివి, అమ్మవు, ఐన ఓ అన్నపూర్ణేశ్వరి నాకు బిక్ష కృపచేయి.
అమ్మా! అన్నపూర్ణా! నీ భిక్షచే నిత్యానందము కలుగచేస్తావు, వరాలనిచ్చి అభయమిచ్చుదానవు. రాశీభూత సౌందర్యమునకు సముద్రము వంటి దానవు.( అమ్మవారి సౌందర్యాన్ని పొగడడమంటే సముద్రమంత గంభీరమైన, అంతటి ఆర్ద్రతతోకూడిన తల్లిప్రేమనకలదానవు అని కీర్తించడమే తప్ప జగజ్జనని సౌందర్యాన్ని ఎంచడం కాదు.). అమ్మా ఆ నీ పుత్రవాత్సల్యమైన ప్రేమతో ఇచ్చేభిక్ష తరగని అనంత రాశిగానున్న ఘోరమైన పాపరాశిని దగ్ధం చేసేది. అమ్మా నీ కరుణ ఎంతటిదమ్మా, కొండలలో ఒక కొండ ఐన హిమవంతుని వంశాన్ని పావనం చేసినదానవమ్మా నువ్వు. అమ్మా ప్రతి ఒక్కరికీ ప్రత్యక్షంగా కనపడే తల్లివి మహేశ్వరుని ఇల్లాలివి. అమ్మా కాశీపురాధీశ్వరీ.. అమ్మా అన్నపూర్ణేశ్వరీ.. నీ కృప అనే భిక్షపెట్టుము.
ప్రత్యక్షమాహేశ్వరీ....
ఎంతటి జ్ఙానికైనా, సామాన్యునికైనా, రాజుకైనా దొంగకైనా, తాను ప్రతిరోజూ ఆరోగ్యంతో ఆనందంతో ఉండేందుకు ప్రతిజీవీ తినే ఆహార స్వరూపంగా ప్రతి పూటా ప్రతి తినే పదార్థంలోనూ ప్రత్యక్షంగా యోగ్యతాయోగ్యతా విచారణలేకుండా వీడికి కనపడాలావద్దా అనిలేకుండా పెల్లుబికిన మాతృత్వంతో మనందరికీ అన్ని జీవరాసులకీ అన్నం రూపంలో ప్రత్యక్షదర్శనం ఇచ్చేతల్లి అన్నపూర్ణమ్మ.నానారత్నవిచిత్రభూషణకరీ హేమామ్బరాడమ్బరీ
ముక్తాహారవిడమ్బమానవిలసద్వక్షొ
కాశ్మీరాగరువాసితాఙ్గరుచిరా కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౨||
అర్థము: అమ్మా అన్నపూర్ణేశ్వరీ! వివిధ రత్నముల విచిత్రాభరణములను ధరించినదానవు, చిత్ర విచిత్రములైన ఆభరణములను చేత ధరించినదానవు, బంగారు వస్త్రములను కట్టుకున్న దానవు, కుంభముల వంటి వక్షస్థలముపైన/ మధ్యన ప్రకాశించు ముత్యాల హారములు ధరించిన దానవు, కుంకుమ పువ్వు- అగురులు ఇత్యాది అంగరాగములు పూసుకోవడం వల్ల వచ్చే సువాసనలు వెదజల్లు మేనున్నదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయాంబునిధివి, అమ్మవు, ఐన ఓ అన్నపూర్ణేశ్వరి నిన్ను స్తుతి చేయునాకు నాకు జ్ఙాన బిక్ష కృపచేయి.
వివరణ: అమ్మా అనేక చిత్రాతి చిత్రమైన రత్నాభరణములు దాల్చినదానవు, బంగారు పట్టుపుట్టములు కట్టినదానవు. కాశ్మీరాగరులు అంగరాగములు పూసుకొని చక్కని సుగంధములు వెదజల్లు మేను కలదానవు. ముత్యముల హారమును కుంభములవంటి లేదా కుంభస్థలములవంటి కఠినమైన వక్షద్వయము మధ్య అలంకరించుకొన్నదానవు. (అమ్మ సర్వమంగళ, చక్కని అంగరాగములు పూసుకుని చక్కని ఆభరణములు ధరించి ఉంటుంది. అమ్మ మేనునుండి చక్కని కుంకుమాది అంగరాగములయొక్క సుగంధముల వాసన వచ్చుచున్నది, ఆ తల్లి కేశపాశమునకు అగరు ధూపముల సుగంధము వచ్చుచున్నది అంటే అమ్మని అలా అలంకృతగా చూసి అమ్మశరీరం నుంచి వచ్చే సుగంధాన్ని కీర్తించడం కేవలం అమ్మ ఒళ్ళో పిల్లవాడిగా మారి ఆడుతూ ఉన్నప్పుడే సాధ్యం కదా...!!!! శంకరులు తాను తల్లి అన్నపూర్ణ వద్ద అనుభవించిన అమ్మ ప్రేమను మనకోసం ఈ స్తోత్రంలో అంగరాగాల సువాసనల రూపంలో అందించారు. అలానే కఠిన వక్షద్వయం కలిగి వానిపై ముత్యాల హారం వేసుకున్నదానవు అని స్తుతించారు. తల్లి వక్షద్వయం ఎప్పుడూ పిల్లలకు కావలసిన ఆహారంతో నిండి ఉంటుంది. ఆ జగజ్జనని మనకోసం మన పోషణార్థమై సూర్య చంద్రులను తన స్థనములుగా మార్చుకొని. సూర్యుని చే మనకు కావలసిన ఆహారాన్ని, చంద్రునిచే మనకు కావలసిన ఔషధాలను సమకూరుస్తుందట. అమ్మ ఒళ్ళో పసిపిల్లల్లా పారాడితే ఈ విషయాలన్నీ తెలుస్తాయి అనుభవానికొస్తాయి. ) అమ్మా అన్నపూర్ణవైన నీవు నాకు నీ కృపచే జ్ఙానభిక్షపెట్టి రక్షించు.
ముక్తాహారవిడ్మబమానవిలసద్వక్షో
ఇక్కడ ఏకకాలంలో అమ్మవారి అన్నపూర్ణాతత్వాన్నీ అలాగే అమ్మవారికి పరమభక్తులయినవారి యందు కల కారుణ్యాన్ని కీర్తించారు. అమ్మవారి వద్ద ఒక బిడ్డలా చేరి ఆడుకుంటుంటే తప్ప ఈ చమత్కారం మనకి గోచరించదు. సాధారణంగా అమ్మవారి యొక్క పోషణ శక్తిని కీర్తించటంలో అమ్మవారి కఠిన స్థనములను కీర్తించడం స్తుతించడం వంటివి చేస్తారు. అటువంటి స్తుతులలో అమ్మవారి స్థనములను సూర్యచంద్రులుగా కీర్తించటం లేదా చకోరపక్షులు రెండు ఒరుసుకుని కూర్చున్నట్టున్నాయని కీర్తించటం ముఖ్యంగా శంకరుల స్తోత్రాలలో చూస్తాం. కానీ ఇక్కడ చమత్కారం ఏమంటే ముత్యాల హారం అమ్మవారి వక్షములమీదుగా అమ్మవారి కఠినస్థనముల మధ్యనున్న కాళీ ప్రదేశంలో వేలాడేటట్టు వేసుకుని అలంకరించుకున్నది అని చెప్పబడింది. అలా ఎందుకు చెప్పబడిందో అలా అమ్మవారు ఎందుకు ముత్యాలహారాన్ని వేసుకుందో అమ్మవారి ఒడిలో కూర్చుని చూసి ధ్యానిస్తే దొరికేది దొరుకుతుంది. పైగా అమ్మవారికి అలా హారంగా వేసుకునే ఆభరణాలు ఎన్నో రకాలు ఉన్నాయి కదా రక రకాల రత్నాలు వజ్ర వైఢూర్యాలు ఇలా నవరత్నఖచిత హారాలు ఎన్నో ఉన్నాయి. అలానే అమ్మవారి గృహమే చింతామణులతో ఉన్నది వాటిని హారంగా వేసుకోవచ్చు లేదా ఎర్రని పద్మరాగమణులు ఇతరాలు ఎన్నో ఉన్నా ముత్యాలహారమే వేసుకుని అదీ వక్షద్వయం మధ్యలోంచి ఎందుకు అలంకరించుకుంది అమ్మవారు అని తరచి చూస్తే, వక్షముల మధ్య ఖాళీ స్థలం హృదయ స్థానం ముక్తాహారమంటే లౌకికంగా దొరికే ముత్యాల హారం కాదు. ఆ తల్లి అవ్యాజమైన పుత్రవాత్సల్యంతో పరాదేవత / భగవత్ హృదయాన్నీ అర్థం చేసుకుని జీవించిన ముక్తపురుషులైన తన భక్తులను వారి జీవితాలను హారంగా మలిచి తన గుండెలకు హత్తుకునేటట్టుగా తన గుండెలమీదగా ఆ హారం పడేటట్టుగా వక్షోజముల విడంబము మధ్యలో పెట్టుకుని సంతోషిస్తుంది. నా ప్రియ పుత్రులు ముక్త పురుషులు నాహృదయం దగ్గరే ఉంటారు సంకేతిస్తుంది.
కాశ్మీరాగరువాసితాఙ్గరుచిరా....
తల్లివంటి సువాసనను బిడ్డడేగదా అమ్మఒడిలో ఆడుతున్న వానికి తెలిసేది, అలాగే అమ్మవారి కేశపాశాల సువాసన అగరు సువాసనవలె ఉంటుందట ఇక్కడ ప్రత్యక్షంగా అమ్మవారి కేశపాశం గురించిన ప్రస్తావన లేకున్నా అమ్మవారి వద్ద వచ్చే కుంకుమ+ అగరు సువాసనల గురించి చెప్పారు, అంటే ఆ సగంధాన్ని మనమూ పీల్చాలంటే ధ్యానించి వంటికి కుంకుమ వాసన వస్తుందికానీ అగరు వాసన ఎక్కడిది అని తరచి తరచి ధ్యానిస్తే, ఆ సుగంధం అమ్మవారి కేశపాశం నుంచి వస్తున్నదిగా గోచరిస్తుంది. అగరు / సాంబ్రాణి ధూపాలు అమ్మవారు స్నానం చేసాక కేశపాశానికి వేసుకుంటుంది కాబట్టి అమ్మ వళ్ళో కూర్చున్న బిడ్డడిగా మనకీ అసలే సుగంధభరితమైన కేశపాశమున్న తల్లి ( సాధారణంగా అందరి జుట్టులోంచి దుర్గంధం వస్తుంది. నక్కీరోపాఖ్యానంలో స్వయంగా శివుడే చెప్తాడు అమ్మవారి కురులు సహజ సుగంధంతో ఉంటాయని), ఆ కేశపాశాల్లోంచి అగరు వాసనలు కూడా కలిసిన సుగంధం తెలుస్తుంది. ధ్యానంలో అటువంటి దర్శనం చేసిన వారికి అజ్ఙానంపోయి జ్ఙానం కలుగుతుంది అని పెద్దల వాక్కు కానీ అది ధ్యానంలో అందడం చాలా కష్టం. అందుకే బాల/ సువాసినీ పూజలలో ప్రత్యక్షంగా పూజచేసేటప్పుడూ జటాబంధనం అని ఒక గొప్ప సేవ చేయిస్తారు. అంటే అమ్మవారి జుట్టు ముడి వేయడం /అల్లడం / ఏ రబ్బరుబ్యాండు వంటిదో పెట్టడం వంటి సేవ దాని వల్ల ధ్యానంలో సులభంగా దొరకని అమ్మవారి కేశపాశాలని ఆ సేవ చేయడం ద్వారా ధ్యానంలో అందుకునే ఆవకాశం ఉంటుంది. నల్లని కురులున్న తల్లి కేశపాశం చూస్తే నల్లని అజ్ఙానం పోయి తెల్లని జ్ఙానం వస్తుంది. శంకరులు అమ్మవార్ని జ్ఙానభిక్షకోసం స్తుతించారు కాబట్టి ఈ విషయాన్ని దొరికీ దొరకనట్టుగా దాచి మనతో ధ్యానం చేయించి మనకీ ధ్యాన సిద్ధి, జ్ఙాన సిద్ధి కలుగించే అవకాశం ఇచ్చారుయోగానన్దకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ
చన్ద్రార్కానలభాసమానలహరీ త్రైలొక్యరక్షాకరీ|
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౩||
అర్థము: యొగమువల్ల కల్గు ఆనందమును కలిగించుదానవు, శత్రువులను నాశనం చేయు దానవు, ధర్మమునందే నిష్ఠను ఏర్పరచుదానవు, చంద్రుడు- సూర్యుడు- అగ్నులతొ సమానమైన కాంతి ప్రవాహమైనదానవు, మూడులొకములను రక్షించుదానవు, సమస్త్యైశ్వర్యములను ప్రసాదించుదానవు, తపస్సులకు ఫలమునిచ్చుదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయాంబునిధివి, అమ్మవు, ఐన ఓ అన్నపూర్ణేశ్వరి నాకు బిక్ష కృపచేయి.
వివరణ : ఉన్నది స్థిరముగా లుప్తమవకుండా ఉండడం క్షేమం. కొత్తది కలిసిరావటం యోగం. యోగములను కలిగించి తద్వారా ఆనందములను కలుగచేయు తల్లి అన్నపూర్ణ. శత్రువులని నిర్మూలించగలిగిన తల్లి అన్నపూర్ణ. చక్కని పదార్థములను సేవించటం వలన యోగములు కలిగి అంతః యోగంతో ఆధ్యాత్మికంగా ఎదిగి యోగసాధనలో కొత్తమెట్లెక్కించి ఆనందమిచ్చే తల్లి అన్నపూర్ణ, బాహ్యశత్రువులనే కాక అంతః శత్రువులైన అహంకార, మమకారాదులను క్షయం చేసి ధర్మ కార్యాచరణమందే నిష్ఠను పెంపొందించునది అన్నపూర్ణ. (ప్రసాదబుద్ధితో తీసుకునే ఆహారమే అధ్యాత్మికతలో కొత్త కొత్త యోగములలో ప్రవేశం కల్పించి తల్లికి దగ్గరచేస్తుంది., అలానే ఆ ప్రసాద సేవనమే అంతః శత్రువులప్రకోపాన్ని తగ్గించి ఇంద్రియ నిగ్రహాన్ని ఇస్తుంది. అటువంటి ఆహారమే ధర్మకార్యాచరణాన్ని పెంపొందించే బుద్ధిని ప్రసాదిస్తుంది.) తన మూడు కన్నులైన చంద్ర, సూర్య, అగ్నుల వెలుగులనే ప్రవాహముతో మూడులోకములను రక్షిస్తుంది. ఇహంలో సకల ఐశ్వర్యములనూ కలిగించి, సర్వ తపస్సులకూ సిద్ధినీ ఇస్తుంది. అటువంటి అమ్మను అమ్మా అన్నపూర్ణవైన నీవు నాకు నీ కృప అనేభిక్షపెట్టి రక్షించు అనికాక అడగడానికి వేరేముంది.
యోగానన్దకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ...
కేవలము లౌకికమైన యోగక్షేమాలే కాదు, ఒక సాధకునికి అష్టాంగ యోగంలో శివుని తెలుసుకోవడమనే ఆనందము కలుగజేయు తల్లి అన్నపూర్ణ. అంటే పరమాత్మ మాయ, ఆవిడే పరబ్రహ్మ మహిషి, ఏ మాయ తెరవేసిందో ఆ మాయే తెరతీసి తెర అవతల ఉన్న పరబ్రహ్మముతో జీవుని ఐక్యము చేయించు శక్తి అని కీర్తించారు శంకరులు ఇక్కడ.
యోగసాధనలో కలుగు విఘ్నములు అంతశ్శత్రువులవల్ల కలిగే విఘ్నములు, ఆ అంతశ్శత్రువులను దునుమాడి వాటి తీవ్రతను తగ్గించి మనోలయం చేయించగలిగిన శక్తి కల తల్లి. మనం తీసుకునే సాత్వికాహారంలోని 1/6 వ వంతు మనస్సుగా మారి ఇంద్రియ నిగ్రహం /ఇంద్రియ ప్రకోపానికి కారణమవుతుంది. అన్నపూర్ణ ప్రసాదంగా పదార్థం తీసుకున్న వారికి ఇంద్రియ నిగ్రహం కలిగి అంతశ్శత్రువులను క్షయం చేసేశక్తిని ఇచ్చేతల్లి అన్నపూర్ణమ్మ.
అంతశ్శత్రువుల ప్రకోపాన్ని తగ్గించి ధర్మకార్యాచరణముపై ఆసక్తి పెంచి నిషిద్ధ కర్మలవైపు మనసు మరలకుండా చేసి విహిత కర్మాచరణము ధర్మ వర్తనము కలుగునట్టు చేయు తల్లి అన్నపూర్ణమ్మ.
ఆతల్లి పాదాలు పట్టుకుంటే అంతశ్శత్రువుల ఆవేశమడిగిపోయి, ధర్మనిష్ఠ పెరిగి, సాధనలో ఒక్కో మెట్టూ పైకెక్కి చివరికి యోగంలో పరమాత్మనుచేరి జీవుడు ముక్తిని పొందుతాడు, ఇవన్నీ చేయగల తల్లి ఆ పరబ్రహ్మ మహిషి, జగజ్జనని, అన్నపూర్ణమ్మతల్లి.[ naagendrakumar ayyamgaari]
2 వ్యాఖ్యలు:
ఈ అష్టకంలో మొత్తం చెప్పవల్సింది ఆచార్యులవారు చివర్లో చెప్పేరు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకుని ఏమి కోరుకోవాలో చెప్తున్నారు చూడండి.
అన్నపూర్నే సదాపూర్నే శంకర ప్రాణ వల్లభే
జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్ధం బిక్షాం దేహీచ పార్వతీ
మాతాచ పార్వతీ దేవీ పితాదేవో మహేశ్వరః
బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం.
ఈ అష్టకంలో మొత్తం చెప్పవల్సింది ఆచార్యులవారు చివర్లో చెప్పేరు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకుని ఏమి కోరుకోవాలో చెప్తున్నారు చూడండి.
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే
జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్ధం బిక్షాం దేహీచ పార్వతీ
మాతాచ పార్వతీ దేవీ పితాదేవో మహేశ్వరః
బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం.
Post a Comment