శివుణ్ని మలిచే శిల్పి
>> Friday, January 28, 2011
ఒక కళాకారుడు శిలను శిల్పంగా మలుస్తాడు. సాధారణ శిలకు తన కళద్వారా ప్రాణంపోసి ఒక రూపాన్ని, జీవ చైతన్యాన్ని పొదుగుతాడు. హావభావాలను ప్రదానం చేస్తాడు. చిరునవ్వును చెక్కుతాడు. విశ్వామిత్రుడిలా సృష్టికి ప్రతిసృష్టి చేస్తాడు. పరమాద్భుతమైన మరో విషయం ఉంది. అది... ఒక భక్తుడు శిలలో సాక్షాత్ శివుణ్ని మలచుకుంటాడు. రాయిలో రాముణ్ని సృష్టించుకుంటాడు. నిర్జీవ వస్తువులోంచి నిటలాక్షుని వెలికితీస్తాడు. శిలలోంచి శిల్పం వస్తుంది. అది వస్తువుది కావచ్చు. మనిషిది కావచ్చు. దేవతామూర్తిదీ కావచ్చు. నిజమే. సహజమే. కానీ... శివుడు, కృష్ణుడు, రాముడు...!!! అదీ సాకారంగా, చిన్మయమూర్తిగా...!!! ఎంత అద్భుతం! ఇది ఎలా సాధ్యం!? భక్తి... భగవంతునిపట్ల అతిశయించిన ప్రేమ. పరమప్రేమ. ఆ నిరాకారుడు, ఆ నిర్గుణుడు ఆకారాన్ని దాల్చి రాముడిగా, కృష్ణుడిగా, దేవిగా భక్తుడి ముందుకు హఠం చేసి ఆ పసిబాలుడి ముందుకు నడచిరాక తప్పదు. నడయాడక తప్పదు. ఇందుకు ఏ అద్భుతమైన ఉలి కావాలి!? ఎలాంటి అపురూపమైన సుత్తి ఉండాలి!? ఇవేవీ అవసరం లేదు. ప్రేమ, భక్తి, సమర్పణ, శరణాగతి ఉంటే చాలు. తనకంటూ ఏమీ దాచుకోకుండా, తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా, తనదంటూ ఏమీ లేకుండా, చివరకు తనంటూ, నేనంటూ ఒక ఉనికి, ఒక 'అహం'భావం ఏమీ మిగలని ఆత్మస్వరూపంగా సర్వ సమర్పణ చేయాలి. అలాంటి శరణాగతుడు రాతిగుండులోని ఈశ్వరుణ్ని- అణువణువూ శోధించి, పరిశోధించి, సాధించి వెలికి రప్పిస్తాడు. ప్రత్యక్షం చేసుకుంటాడు. అయ్యేదాకా వదలడు. అయితే... కోరుకుంటే కాడు శివుడు. రమ్మంటే రాడు రాముడు. భక్తుడిలో ఆ భావం ఉండాలి. ఆ విశ్వాసం ఉండాలి. ఆ ఆర్తి, ఆ ఆవేదన, ఆ హఠం ఉండాలి. అణువణువునా ఆవరించి ఉన్న ఆ తత్వాన్ని గుర్తెరిగి ఉండాలి. ప్రేమతోపాటు భగవంతునితో ఆ చనువు, ఆ అధికారం, ఆ నమ్మకం శ్రుతి మించి ఉండాలి. మితిమీరి ఉండాలి. ఒక రాతి గుండుకు సొంత కళ్లు పెరికి అమర్చగల విశ్వాసం, స్తంభంలో తాను చూడటమే కాదు- తండ్రికీ చూపించగలననేంత ధీమత్వం, ఆయనను నమ్మి విషం కూడా తాగేంత నిర్భయత్వం, నీళ్లలోకి, నిప్పులోకి ఉరికేంత భయరాహిత్యం, మైమరచిపోయి అరటి తొక్కను ఎంగిలి పళ్లనూ తినిపించగలిగేంత మమేకత్వం... ఇవి ఉండాలి. ఇవన్నీ ఉండాలి. ఇంకా ఎన్నో ఉండాలి. భక్తుడికోసం భగవంతుడు శిలనో, అలనో చీల్చుకుని రావటం కాదు. పండుతింటాడు. పిండి విసురుతాడు. పల్లకీ మోస్తాడు. బంటు అవుతాడు. బందీ అవుతాడు. బంధనాలు తెంచుతాడు. భక్తుడికి, భగవంతుడికి మధ్య ఉన్న అనుబంధం ఏ బంధనాలకూ లొంగనిది. ఏ కఠిన పరీక్షలకూ వెరవనిది. ఏడ్చే బిడ్డ తంతు. బిడ్డదీ, భక్తుడిదీ కూడా. తల్లికోసం బిడ్డ ఏడ్చే ఏడ్పులో సిగ్గు, బెరుకు, సంకోచం, సందేహం ఏమీ ఉండవు. నీళ్లు, నిప్పు, పాము, పల్లం అడ్డమున్నవేవీ కనిపించవు. తల్లికీ అంతే. భక్తుడికీ, భగవంతుడికీ మధ్యా ఇదే! సిరికింజెప్పడు, శంఖ చక్రములన్ ధరియింపడు... భగవంతుడు! భగవంతుని చేరుకునే ఆత్మావలోకన మార్గంలో ఏ అవరోధమూ భక్తుణ్నీ ఆపలేదు. అడుసులో అనుంగు బిడ్డనైనా తొక్కేస్తాడు. ఏనుగులతో తొక్కించుకుంటాడు. ఇలాంటి బిడ్డను ఏ తల్లి నిరాదరిస్తుంది? ఇలాంటి భక్తుణ్ని ఏ దేవుడు నిరాకరిస్తాడు? శిలలోంచి శిల్పం కాదు. శివుడే నడిచి వస్తాడు. రాయిలోంచి రాముడే వేంచేస్తాడు. రాతిని నాతిని చేసిన రాముడు కాదు... రాతిలోంచి రాముణ్ని రమ్మని పిలిచి సాధించిన భక్తుడే ఘనుడు. ఘనాఘనుడు. అందుకే ఆంజనేయుడు- రాముని భక్తుని, ఆ భక్తుని భక్తుని, ఆ భక్తుని భక్తుని భక్తుని పాదదాసుణ్ని నేను' అన్నాడు. |
1 వ్యాఖ్యలు:
swamy chaala manchi vishyalanu chepparu.
Post a Comment