ఆనంద రసకేళి
>> Saturday, January 29, 2011
భక్తి, భగవన్మార్గం కేవలం నియమనిబంధనల సమాహారం కాదు. అదో అంతరంగ ఆనంద రసకేళి. రామకృష్ణ పరమహంస అన్నట్లు భక్తిభావన ఒక ఆట. 'ముక్తికై తారట్లాడకండి, ఆడుకోండి. ముక్తి అంటే ఆట ముగియటమే' అని. కేవలం కఠిన నియమ భయ కారణంగా ఆ ఆనంద రసాంబుధిలో ఓలలాడే భాగ్యాన్ని వదులుకోవటం అమాయకత్వమే. భక్తి సాధనల మధుర ఫలరసాల్ని గ్రోలలేకపోవటం దౌర్భాగ్యమే. నిర్విరామ జీవనపోరాటంలో సేదదీర్చే ఆ అద్భుతమైన ఆటను ఆస్వాదించలేకపోవటం దురదృష్టమే. ఇదంతా తెలియనంతవరకే. తెలిస్తే అదో పూలబంతులాట, కోలాట.
భక్తి, సాధన అంటే- నియమ రహితమా? పవిత్రాతి పవిత్రమైన భగవంతుణ్ని మలిన దేహంతో, నియమ రహిత జీవన విధానంతో కొలవవచ్చా? 'ఔను... కొలవవచ్చు'. భగవంతుని దృష్టిలో మాలిన్యమంటూ ఏదీ లేదు. పరమ 'ఆత్ము'డైన ఆయన దృష్టిలో, సృష్టిలో అంతా ఆత్మస్వరూపమే. ఏకాత్మ భావనలో లీనమైన ఎందరో మహాత్ములు మలాన్ని, మధురఫలాల్ని ఏకభావంతో స్వీకరించిన సందర్భాలే మనకు దృష్టాంతాలు. శబరి అర్పించిన ఎంగిలి పళ్లతో, కన్నప్ప పెట్టిన మాంస నైవేద్యాలతో, విదురుడు అందించిన పళ్లతొక్కల్లో- ఆయన చూసింది భక్తుడి హృదయాన్ని మాత్రమే. సమస్తాన్నీ ద్వైదీభావంతో, ఇంకా చెప్పాలంటే అనేక భావంతో చూసే మనకు మాత్రమే ఈ తేడాలు. వేరు భావాలు. భగవంతుడిది మాతృ హృదయం. అంతేనా! మాతృమూర్తినే సృష్టించిన ఆయనది మరెంత మార్దవ హృదయమై ఉండాలి! తల్లిబిడ్డను ఆ బిడ్డ ఉన్న స్థితిలోనే ప్రేమిస్తుంది. భగవంతుణ్ని ప్రేమించే భక్తుణ్ని ఆయనా ఆ భక్తుడి సహజస్థితిలోనే స్వీకరిస్తాడు. ఉన్నవాణ్ని ఉన్నట్లుగా అనుమతిస్తాడు. పూల సాంగత్యంతో దారంలా ఆ తరవాతే భక్తుడు సుగుణాల సౌరభాన్ని పులుముకొంటాడు. ఆకాశం నల్లనిదే అయినా పూర్ణ చంద్రుడి రాకతో పుచ్చపూవైపోతుంది. భక్తిరస లోలుడైన ఆ రాకా చంద్రుణ్ని మనమూ మన హృదయాకాశంలోకి ఆహ్వానిద్దాం. వెన్నెలలు పూయించుకుందాం.
శాస్త్రాలు, నియమాలు, కఠిన సాధనలు... ఇవన్నీ ఉండవలసిందే, ఉండి తీరవలసిందే. అయితే ఎప్పుడు? ఇప్పుడు... ఇప్పుడే... వాటికి భయపడినప్పుడే కాదు. ఆ కారణంగా ఆ పరమాత్మకు దూరమైనప్పుడు కాదు. ముందు మనమున్న స్థితిలోనే ఆయనను సమీపిద్దాం. ఆయనతో స్నేహం చేద్దాం. మంచి స్నేహితుడు మనలోని మాలిన్యాలను పట్టించుకోడు. దేవుడూ అంతే. తల్లి తన బిడ్డను ఉన్నతంగా చూడాలనుకుంటుంది. నిజమే... అయినా నీచస్థాయిలో, స్థితిలో ఉన్న బిడ్డను కూడా అమ్మ అక్కున చేర్చుకుంటుంది. అమ్మ బిడ్డ శుభ్రంగా ఉండాలనుకోవటం సహజమే. అయినా మాలిన్యాన్ని పులుముకుంటే ముందు దగ్గరకు తీసుకుంటుంది. ఆపై నిర్మాలిన్యం చేసి ముద్దు పెట్టుకుంటుంది. భగవంతుడూ అంతే. మనలోని లోక సహజ మాలిన్యాలకు ఆయన ప్రాధాన్యాన్నివ్వడు. ఆయన సామీప్యానికి వెళ్లే కొలదీ మన ప్రమేయం లేకుండానే అవి క్రమంగా తొలగిపోతాయి. గాలి వీచే చోటికి వెళ్లినప్పుడు మన బట్టలమీది దుమ్ము లేచిపోతుంది. చెమట ఆరిపోతుంది. చల్లని సమీరాలతో సేదదీరుతాం.
ముందు ఆ అపురూప అతిథికి మన హృదయంలో స్థానమిద్దాం. అందుకు ప్రాథమిక ప్రయత్నంగా ఆయన పవిత్రపాదాలవైపు అడుగులు వేద్దాం, చూపు సారిద్దాం. మనో హస్తాలతో వాటిని తాకే ప్రయత్నం చేద్దాం. చాలు. ఈ మాత్రానికే మనలోని భయాలన్నీ పటాపంచలైపోతాయి. ఆ తరవాత ఆయనకు సంబంధించిన ఊహ, ఆపై ఆయనమీద ఆసక్తి, దరిమిలా ఆయన గురించిన ఆలోచన ఆయన పట్ల అనురక్తి పెంచి మనకు తెలీకుండానే సాధనల వైపు అడుగులు వేస్తాం. క్రమేణా... నిండా మునిగిపోతాం... ఆయన అత్యంత అద్భుత ఆకర్షక ప్రేమాంబుధిలో కాకపోతే... ఆయన ప్రేమాంబుధిలో మనమా? మన ప్రేమాంబుధిలో ఆయనా? తెలీదు. ఎందుకంటే అప్పటికే చక్కెర బొమ్మలమై ఆ అమృతార్ణవంలో కరిగిపోయి ఉంటాం!!
2 వ్యాఖ్యలు:
చాలా బాగా చెప్పారు.
చాలా బాగుంది సర్
Post a Comment