భక్తిసోపానాలు
>> Monday, January 31, 2011
'ఏమిటో చెప్పండి స్వామీ... క్షణంలో పట్టుకొస్తా' 'భక్తుల పాదధూళి. అది తలపై చల్లుకుంటే నొప్పి పోతుంది' నారదమునీంద్రుడు నివ్వెరపోయాడు. తేరుకొన్న తరవాత వీధిలోకి అడుగుపెట్టాడు. గోపకాంతలు మహర్షిని చూశారు. నమస్కారాలు చేశారు. ఆయన దిగులుగా ఉండటం గమనించారు. కారణం అడిగారు. శ్రీకృష్ణుని తలనొప్పిని వివరించాడు నారద మహర్షి. అంతే. ఒకతె చటుక్కున నేలమీద చతికిలపడింది. చేతివేళ్లకున్న గోళ్లతో పాదాలకున్న మట్టిని తీస్తోంది. చెక్కపేడుతో మరొకతె మట్టె గోకుతోంది. అలా ఎవరికి వారు పనిలో మునిగిపోయారు. ఒక చేటనిండా మట్టి పోగుచేశారు. నారదులవారికిచ్చారు. 'ఈ మట్టిని స్వామి తలమీద నేను పోయలేను. పోస్తే పాపకూపంలో పడిపోతాను' 'ఎన్ని నరకాల్లో పడినా ఫర్వాలేదు. మా కిట్టయ్య తలనొప్పి తగ్గాలి' అంటూ చరచరా లోపలికి వెళ్లారు గోపికలు. జగన్నాటక సూత్రధారి కృష్ణ పరమాత్మ తన భక్తిని పరీక్షించాడని గ్రహించడానికి నారదునికి ఎంతోసేపు పట్టలేదు. భక్తి పండిన ప్రేమలో నారదాది మునీంద్రులకన్నా గోపికలు మెరుగని భాగవతం చెబుతోంది మనకు. బుట్టలో పాలు, పెరుగు, నెయ్యి పెట్టుకొని అమ్మడానికి వెళ్లింది ఓ గోపిక. శ్రీకృష్ణ పాద సమర్పిత చిత్తంతో ఉన్న గోపిక పాలు పెరుగు నెయ్యి కొంటారా అనడంలేదు. గోవిందా దామోదరా మాధవా అని స్మరిస్తోంది. పరమాత్మ ఎడబాటును ఏమాత్రం సహించలేకపోవడమే నిజమైన ప్రేమతత్వం. చిన్ని కృష్ణునికి యశోదమ్మ ఎన్నిసార్లు దిష్టితీసిందో చెప్పలేం. ప్రేమదశలో గుండెలోతుల్లోంచి వచ్చే భక్తి, తన్మయత్వం కొలిచేందుకు తూనికరాళ్లు లేవని చెప్పాలి. మన ప్రేమ, మన భక్తి అంతా- మన శరీరం, భార్యాబిడ్డలు, బంగారు ఆభరణాలు, బ్యాంక్ ఖాతాలు వంటివాటిపైనే ఉండటం సర్వసాధారణం. పూజామందిరంలో ఓ క్షణం శాంతంగా ఉండొచ్చు, తక్కిన సమయమంతా రుసరుసలాడుతూ ఉంటారు చాలామంది. దేవుడినీ ఆ గదికే పరిమితం చేస్తారు. బయటికి వచ్చాక సంసారసాగరంలో మునగానాం తేలానాం. అంతా నాదే అనేది మమతాభిమానం. నేను స్వతంత్రుణ్ని అన్న భావన అహంతాభిమానం. ఈ రెండు అభిమానాలూ పోవాలి. నేను పరతంత్రుడిని. సర్వస్వతంత్రుడు పరమాత్మ అన్న దృక్పథం కలిగితే ఆ రెండు అభిమానాలూ పోతాయి. ధారకం పోషకం భోగ్యం పరమేశ్వరుడే అని తలచినప్పుడు భగవత్ కటాక్షం లభిస్తుందంటారు. కష్టాలు నీవే ఇచ్చావు. సుఖాలు నీవే ఇచ్చావు. అంతా నీదే. నాదేంలేదు. ఈశావాస్యమిదం సర్వం కదా. పాలముంచినా నీవే, నీటముంచినా నీవే, భారం నీదే స్వామీ అంటూ ఉంటారు పెద్దలు. యుద్ధరంగంలో శరణాగతి చేస్తూ తలవంచాడు అర్జునుడు. వాని భారం తలపైకెత్తుకున్నాడు భగవానుడు. ప్రహ్లాద నారదాదుల గోపికల స్థాయి చేరలేం. కనీసం భగవద్గీత చెప్పినట్లు, పెద్దలు చెప్పినట్లు- శరణాగతి చేసి భగవదనుగ్రహప్రాప్తికి నోచుకోవాలి. పరమాత్మ కల్యాణగుణాలు స్మరించాలి. భగవానుల లీలలు కథలు కథలుగా వినాలి. సత్‌సంగంలో భాగస్వాములై పరమేశ్వరుని మీద బుద్ధి నిలిపితే విషయవాసనలు, దుర్బుద్ధులు నలిగి నశిస్తాయి. భగవత్‌ప్రాప్తి అనే శ్రద్ధ అసురశక్తుల్ని ధ్వంసం చేస్తుంది. 'నేను పరమాత్మకు చెందినవాడిని, ఇతరులకు బంధుమిత్రులకు కాదు. భగవత్ భాగవత ప్రీత్యర్థం పనులు చేస్తున్నాను. నేను ఆ స్వామి చేతిలోని ఒక పనిముట్టును' అని గ్రహించగలిగితే జన్మ చరితార్థమైనట్లే. |
0 వ్యాఖ్యలు:
Post a Comment