శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శ్రీకృష్ణామృతం

>> Saturday, January 22, 2011


భక్తి వైరాగ్యాలు భగవత్ప్రాప్తికి ముఖ్య సాధనాలు. మనిషికి మహాభాగ్యాలంటూ ఉంటే అది ఈ రెండే. ఇవి భగవంతుని అనుగ్రహం వల్లనే మనకు లభిస్తాయి. ధన సంపాదన మాత్రమే భాగ్యమనిపించుకోదు. ధనవంతులందరు భాగ్యవంతులు కాలేరు. భగవదనుగ్రహాన్ని మించిన భాగ్యం ఉండదు. ఎన్నటికీ తరగనిదీ, భగవంతునికి దగ్గర చేసేది భాగ్య సంపదే. భక్తిని వ్యాపారం ద్వారా సంపాదించలేము. వైరాగ్యమూ అంతే. భక్తి సాధకుని ద్వారా వెల్లడవుతుంది. కానీ, వైరాగ్యం గుండెల్లో గుప్తంగా, గూఢంగా ఉంటుంది. భక్తునికి సమాజపరమైన గౌరవం, ఆదరణ లభిస్తాయి. భగవద్భక్తులు భగవంతునిలాగే కీర్తించబడతారు. పూజించబడతారు.
ఈ కలియుగం దోషాలకు ఆలవాలం. ‘కలే దోహనిధే’ అన్నాడు శ్రీ శుకదేవుడు. కలియుగంలోని సకలమూ, లోప భూయిష్టాలు. ఆధ్యాత్మిక రంగమూ కలుషితమైపోయింది. ‘కుతార్కికులూ, కపటభక్తులూ, వేద బాహ్యలైన పాషండులూ అనేకులు దాపురించారు. ఆధ్యాత్మిక రంగం చాలావరకు వ్యాపారమయమై పోయింది.
భక్తి కూడా వైరాగ్యం లాగే నిగూఢంగా ఉండాలి. మనం భక్తులమని ఇతరులకు తెలియవలసిన అవసరంలేదు. ఎవరు భక్తులో, ఎవరు కారో భగవంతునికి తెలియదా? ప్రతిఫలాన్నిచ్చేది భగవంతుడే గానీ మరొకరు కాదుకదా! ఇతరులు తెలుసుకోవాలని భక్తిని ప్రదర్శించే దంభాచారులు, ఎల్లవేళలా మడిగట్టుకుని తిరుగుతూ ఉంటారు. వారి దైవపూజ, జపతపాలు, ప్రదర్శన కోసమే. తమ భక్తిని ఇతరులు గమనించాలనీ, ప్రశంసించాలనీ, తాపత్రపడుతూ ఉంటారు. పరుల సమక్షంలో వీరు ప్రదర్శించే భక్తిప్రపత్తులు, ఆచార వ్యవహారాలు ఏకాంత సమయంలో మటుమాయమైపోతాయి.
ధనంకోసం, సమాజపరమైన కీర్తిప్రతిష్టల కోసం, ఆరాటపడే వాడి భగవత్ స్మరణ భగవంతుని అనుగ్రహం కోసం మాత్రం కాదు. హృదయంలో స్వచ్ఛత లేనప్పుడు, హృదయమంతా ప్రదర్శనకు మాత్రమే కేటాయింపబడి కపట బుద్ధి పూరితమైనప్పుడు, అది ఎంతకాలం నిలుస్తుంది? కలిదోషం ప్రబలినప్పుడు పాషండుల సంఖ్య అధికమైనప్పడు, సాధకులు శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించక తప్పదు. ‘కృష్ణ ఏవ గతిర్మయ’ అంటూ భగవానుని ప్రాథేయపడకా తప్పదు. కలి దోషాలు ఎంతటివైనా మధుర భక్తి భావనతో శ్రీకృష్ణుని ఆశ్రయిస్తే సర్వం అదృశ్యమైపోతాయి. సకల దోషాలనుండీ-సర్వ పాపాలనుండీ విముక్తిని కలిగించేది. ఈ కలికాలంలో శ్రీకృష్ణుని ఆరాధించడమొక్కటే. మధుర భక్తి భావనతో ప్రేమించి పూజించుటమొక్కటే. శ్రీకృష్ణ భజనతో సర్వం మరిచిపోగలిగితే చాలు హృదయం నిర్మలమవుతుంది. అంతర్యామిని దర్శించగల స్థితి సంప్రాప్తిస్తుంది.
గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని ఉద్దేశించి- ‘నా భక్తుడు సమస్త యోగులకన్నా శ్రేష్ఠుడు. అతడు సాధకులలో ఉత్తమోత్తముడు. అతడు నిజమైన తపస్వి. పరమ జ్ఞాని. కర్మయోగి. అర్జునా నీవటువంటి యోగివి కావాలి’ అని ఆశీస్సులు అందచేస్తాడు.
భగవంతుని గుణగణాలను, దివ్య లీలా విశేషాలను మైమరిచి కీర్తించే భక్తులు, భక్తులలో శ్రేష్టులు. సిద్ధ పురుషులలో బ్రహ్మ జ్ఞానులలో శాంత చిత్తం కలవారు మరింత శ్రేష్టురు. నిష్కామ భక్తులు, శ్రీకృష్ణ దివ్య పాద సేవా తత్పరులూ సదా శాంత చిత్తులై ప్రశాంత అంతరంగం కలవారై ఉంటారు. ఐతేవారిని మనం గుర్తించడం దుర్లభం. ఎందుకంటే వారు విరాగులు. వైరాగ్య సంపన్నులు. భౌతిక వేషదారణకు ఏమాత్రము ప్రాధాన్యత నివ్వనివారు. శ్రీకృష్ణ ధ్యానామృతమే వారికి అన్నపానాలు. చూపరులకు పిచ్చివారిలా కన్పిస్తారు. కపట భక్తులు లక్షలాదిగా దర్శనమిస్తూ ఉండడం ఈ కలియుగంయొక్క ప్రత్యేకత. శ్రీకృష్ణుని ఆశ్రయించడాన్ని మించిన యోగం ఈ కలియుగంలో మరొకటి లేదు.
భగవంతుని లీలా కథానకం ఎవరి సాంగత్యంలో ఉంటుందో, ఎవరి వలన భగవత్పరమైన జ్ఞానం లభిస్తుందో, హృదయం పరిశుద్ధ మవుతుందో, బ్రహ్మానందం, దివ్యానందం, అమృతానందం అనుభవంలోకి వస్తుందో ఇంద్రియపరమైన విషయాసక్తి నశిస్తుందో అటువంటి శ్రీకృష్ణుని దివ్య సన్నిధిని, పరమాత్మపరంగా అందుకోవడానికి తగిన అర్హతను సంపాదించగలడాన్ని మించిన యోగమింకేముంటుంది?
శ్రీమద్భాగవతమును విన్నంత మాత్రానే శ్రీకృష్ణ్భగవానునిపట్ల ప్రేమ పొంగిపొరలుతుంది. మధుర భక్తి భావం తన్మయతను పెంచుతుంది. శోక మోహ భయాలను నశింపచేస్తుంది. నిరంతరం చిద్విలాస, చిన్మయానంద స్థితిని సొంతం చేస్తుంది.

[ డా. కె.వి కృష్ణకుమారిగారి వ్యాసం]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP