అర్హత లేకుండా ఢిల్లీ సింహాసనం మీద కూర్చుంటానంటే ?!
>> Wednesday, January 5, 2011
మాఊరి ప్రక్కనే తిమ్మాపురం అగ్రహారం ఉంది . దీనిని రాయనిభాస్కరుడు అనే మహాపండితునికి నాటి పాలకులు బహూకరించారట . అందుకనే దీన్ని రాయనిభాస్కరుని అగ్రహారం అన్నారు . ఈ అగ్రహారం లో ఆవంశంలో భాస్కరాచార్యులు అనే కాళి ఉపాసకుడొకాయన జన్మించాడు . మహా మంత్రవేత్త . దేశభక్తుడు. ఆరోజుల్లో తురష్కమూకలు సాగిస్తున్న అకృత్యాలను చూసి చలించపోయాడు. ఈ దుర్మార్గాలనుండి దేశాన్ని,ధర్మాన్ని రక్షించాలనే తపనతో కాళికాదేవి ప్రసన్నం కోసం తీవ్రతపశ్చర్యకు పూనుకున్నాడు . అయితే ఎంతసాధకుడైనా ఆవేశం పాలు కాస్త ఎక్కువైనప్పుడు అనర్ధాలు సంభవిస్తాయి.. ఈయన సాధన తీవ్రంగా సాగుతున్నది. అమ్మ దర్శనం ఆలస్యమయ్యే కొద్దీ ఈయనలో పట్టుదల కోపం రెండూ పెరుగుతున్నాయి.
ఇక భక్తపరాధీన అగు అమ్మకు దర్శన మివ్వక తప్పలేదు. అమ్మవారు ప్రత్యక్షమయ్యారు.
ఏం కావాలి నాయనా ? అని అడిగింది
తల్లీ ! భారతదేశానికి ఈనాడు పట్టుకున్న రుగ్మతలను బాపటానికి ,నూతన భారతాన్ని నిర్మించటానికి నాకు శక్తికావాలి. అందుకు నన్ను ఢిల్లీ సింహాసనం మీద కూర్చో బెట్టు అని కోరాడు.
అమ్మవారు చిరనవ్వు నవ్వి . ఎవరు ఎంతబరువు మోయాలో అంతే తలకెత్తుకోవాలి అంతేగాని అర్హతకు మించి కోరకూడదు అని చెప్పింది.
అంతే ఈయనలో తామసికశక్తి జూలు విదిల్చింది . సాక్షాత్తూ పరాశక్తినే నా ముందుకు రప్పించుకున్నవాణ్ణి ఢిల్లీ సింహాసనం మీదకూర్చోవటానికి అనర్హుడనా ? అనే అహం పెరిగింది. ఎదురుగా ఉన్నది ఎవరు అనే వి్షయం కూడా మరచిపోయాడు. తన సాధనపట్ల ,ఉపాసనపట్ల అపారనమ్మకం అహంగా పరిణమించి సాధకులకు ప్రమాదం కలుగుతుంది ఈ దశలో . అదిగో ! ఆపరిస్థితికి చేరుకుంది ఈయనమనస్సు.
హే కాళీ ! నిన్నే!దర్శించ గలవాణ్ని బోడి సీంహాసనాన్ని ఎక్కి రాజ్యాధికారాన్ని మోయలేనా ?? నన్ను చులకనచేస్తున్నావు . అని ఘీంకరించాడు.
అమ్మ కనుక పరిపరివిధాల చెప్పింది వద్దునాయనా ? ఇంకేదైనా కోరుకో అని .సృష్టి ధర్మానుసారంగా ఎప్పుడు ఎలా జరగాలో ఎవరిచేత ఏమార్పులు జరపబడాలో అవి నిర్ణయించబడి ఉంటాయి , ఆవేశపడి అన్నీంటినీ తామే సంస్కరించబూనటం అనర్ధహేతువు అని వివరించింది.
కానీ అహంతలకెత్తిన తరువాత యుక్తాయుక్తాలు తెలియవు. నిన్ను ఇంత కష్టపడి ఉపాశించాను .దేవతలు మంత్రాధీనులు . నామంత్రసాధనకు నీవు ప్రసన్నవయ్యావుకనుక నేనడిగినది ఇవ్వవలసినదే ఢిల్లీ రాజ్యాధికారాన్ని నాచేతిలో పెట్టవలసినదే అని భీష్మించాడు.
అంతేకాదు . నీవు నాయొక్క ఈ కోరికను మన్నించకుంటే మిరియాలతోను తామసిక తాంత్రికసాధనలతో నన్ను నేను క్షోభింపజేసుకుని నిన్ను వేధిస్తానని హెచ్చరికకూడా ్ చేశాడు .
ఇక వీనిని ఈమూర్ఖత్వం నుంచి కాపాడాలంటే క్రోధం వహించక తప్పదని నిర్ణయించుకున్నది అ మహాశక్తి.
సరే నాయనా ! బాగా ఆలోచించుకో ! అనువ్వు ఆబాధ్యతలను మోయగలవా ? అని మరోసారి ప్రశ్నించినది/
ఓ ! నాకాసామర్ధ్యముంది అని గర్వంగా పలికాడాయన .
సరే నువ్వా నీపట్టు వీడనంటున్నావు . కనుక నీకాసామర్ధ్య ముందని నిరూపించుకోవాలి . ముందు నాచేతిని నీతలపై ఉంచుకుని మోయగలిగితే నీకు రాజ్యాధికారాన్నిస్తాను అని పలికింది గంభీరంగా
తామసిక ఉపాసనలతో మితిమంచిన అహంకారంతో కళ్ళుమూసుకుపోయిన ఆయనకు జగన్మాత హెచ్చరిక అర్ధంకాలేదు .
ఓస్ ! అదెంతపని ? నీ పరీక్షకు నేను సిద్దం అని నిలబడ్డాడు.
అమ్మవారు తన వామహస్తాన్ని ఆసాధకుని తలపై ఉంచటం .ఆయన భూగర్భంలోకి దిగబడి పోవటం క్షణంలో జరిగిపోయాయి.
[ మహా సాధకులమనుకుని తమకు మించిన పని ,తమదికాని పని తలకెత్తుకుని లోకాన్ని సంస్కరింపబూనితే ,తీవ్రసాధనలకు దిగితే ఫలితం ఇలానే ఉంటుందని పెద్దలు చెప్పుకునేప్పుడు విన్నాను చిన్నతనంలో . జయజయ జగన్మాతృకే....]
0 వ్యాఖ్యలు:
Post a Comment