శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దళితుల్లో ఆత్మగౌరవం పెరగాలి

>> Tuesday, July 31, 2012

దళితుల్లో ఆత్మగౌరవం పెరగాలి
- పరిపూర్ణానంద స్వామి

'దళితులు ఏం చెయ్యాలి?' అనే కంచె ఐలయ్య వ్యాసం (జూలై 13, ఆంధ్రజ్యోతి)లో ప్రస్తావించిన ముఖ్యాంశాలు : అగ్రకులాలు, అణగారిన కులాలు. గ్రామస్థాయిలో మిలీషియాల ఏర్పాటు. ఒక్క వర్గానికే చెందిన హిందుత్వం హిందూ దేవతలు అగ్రకులాల వారికే పరిమితం. కొత్త దేవుడు కావాలి అనే అంశాలకు దీటైన సమాధానమే ఈ శీర్షిక. ఇది కేవలం సమాధానమే కాదు. కనువిప్పు కలిగించే నిప్పులాంటి నిజం కూడా. కారంచేడు, లక్షింపేటలలో జరిగిన ఉదంతాన్ని తీసుకుని దళితులు, అగ్రశూద్రకులాలు అని ఉటంకించిన విధానం వ్యాస రచయిత మనోగతాన్ని ఆవిష్కరించింది.

వారు సమ్యక్ దష్టితో కాకుండా, గంతలు కట్టుకుని ధార్తరాష్ట్రీకమైన దృక్పథంతో సమస్యను సత్యదూరంగా పరిశీలిస్తున్నారనేది తేటతెల్లంగా అర్థమౌతుంది. ఈ ప్రబోధాల వలన అణగారిన సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి వాటిని సమూలంగా భ్రష్టుపట్టించాలనే కుట్ర స్పష్టంగా బయటపడుతోంది. ఉక్రోషంతో, ఆక్రోశంతో నేడు సలసల మరుగుతున్న ఈ కులాల చిచ్చును ఇంకా రెచ్చగొట్టే వీరి రచనలు ప్రత్యక్షంగా మానవ సమాజాన్ని మారణహోమానికి సిద్ధం కావాలనే సంకేతాలిస్తున్నాయి. ఒక విద్యావేత్తగా, సామాజిక స్పృహ కలిగిన శాస్త్రవేత్తగా, సమాజంలో సమత్వాన్ని రచించాలనుకునే రచయితలో పొంగుకొచ్చిన ఈ కాలకూట భావజాలాన్ని ఏ సభ్యసమాజమూ హర్షించదు, స్వాగతించదు.

కుల వివక్ష దారుణాల వెనుక దాగున్న వాస్తవాలను తప్పక వెలికి తీసుకురావాలి. దానిని పరిష్కరించే మార్గంలో కొత్త కొత్త సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇటువంటి సంఘటనల వెనుక వ్యక్తుల స్వార్థము, రాజకీయ ప్రయోజనము, ఆర్థిక దురహంకారాలే కీలకమైన కారణాలుగా పనిచేస్తుంటాయి. ఒక నేరానికి సంబంధించిన దోషాన్ని, ఆ నేరస్థుడికే ఆపాదించాలి. దానిని కులానికి అంటగట్టకూడదు. శరీరానికి జబ్బుచేస్తే, ఆ జబ్బుని కులానికి ఆపాదిస్తామా? లేదే, అలాగే ఇదీ ఓ భయంకరమైన మానసికవ్యాధి, ఈ వ్యాధి ఏ వ్యక్తిలో పొడచూపుతుందో ఆ వ్యక్తినే నిలదీయాలి. అతనినే శిక్షించాలి. అంతేకాని, సమస్యను పక్కదారి మళ్ళించి, దానిని కులాలకు ఆపాదించి మొత్తం సమాజాన్ని రావణకాష్ఠం చేయాలనే ఈ రచనల వెనుక కూడా భయంకరమైన మానసిక జబ్బు దాగుందనే అంశం స్పష్టమౌతుంది.

ఏ నేరస్తుడిని తీసుకున్నా, అతడు ఏదో ఒక కులానికి చెందే ఉంటాడు. అలాంటప్పుడు ఒక బ్రాహ్మణుడు ఏదైనా తప్పు చేస్తే, దానికి బ్రాహ్మణ కులాన్ని తప్పుపట్టడం ఎంత ఉన్మాదమో, ఒక దళితుడు లేదా శూద్రుడు చేసిన తప్పుకి మొత్తం దళితులనూ లేదా మొత్తం శూద్రులనూ తప్పుపట్టడం కూడా అంతే ఉన్మాదం. లక్షింపేటలోని హంతకులను క్రూరులుగా, ఉన్మాదులుగా, అజ్ఞానులుగా, అనాగరికులుగా దూషించండి. కానీ, కులం పేరుతో అందరినీ ఒకే గాటన కట్టడం సమంజసమే కాదు, శోచనీయాంశం కూడా!

కులమనేది ఓ సాంఘిక వ్యవస్థ. నేరస్థుల్లో ఏర్పడ్డ కాలుష్యాలను కులానికి అంటగట్టి కుల వ్యవస్థను సమూలంగా దెబ్బతీసేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అందులో భాగమే దళితులు ఏం చెయ్యాలనే శీర్షిక. ఈ శీర్షిక చదివితే, వ్యాస రచయిత అంతరంగం బట్టబయలౌతుంది. సమస్యను దారిమళ్ళించి, పరిష్కారం చూపకుండా సమాజంలో వైషమ్యాలను సృష్టించాలనే వారి మనోభావం స్పష్టమౌతుంది. అసలు కులం అంటే ఏమిటి? కులం ప్రాధాన్యతలు, వాటివల్ల కలిగే ప్రయోజనాల గురించి విద్యావేత్తలకు, సామాజిక శాస్త్రవేత్తలకూ సమగ్రమైన అవగాహన ఉండాలి. వ్యక్తులలో దాగున్న లోపాలను, వ్యక్తులు చేసే నేరాలను కులానికి అంటగడితే! సమస్య పక్కదారి పట్టడమే కాక, సమాజంలో సమతుల్యత లోపిస్తుంది. కులపోరాటాలు తెర మీదకు వస్తాయి. సమస్యలు విలయతాండవం చేస్తాయి. ఈ సందర్భం కొరకు వేచి ఉన్న రాబందులకు ఇవి చాలా... చాలా... లబ్ధిని చేకూరుస్తాయి.

సంక్లిష్ట సమస్యలను చట్టం ఒక్కటే స్వతంత్రంగా పరిష్కరించలేదని సనాతన హిందూ నాగరికత శతాబ్దాల క్రితమే గుర్తించింది. సమస్య మూలం ఏ కోణంలో దాగి ఉందో, దానిని గుర్తించడం సంక్లిష్టమైనపుడు వివేకయుక్తమైన నివారణలను కూడా హైందవ వ్యవస్థ సిఫార్సు చేసింది. దీనికి ఉదాహరణ... ఆదిశంకరాచార్యులు అనుగ్రహించిన చక్కని తరుణోపాం సత్సంగమే. 'సత్సంగత్వే నిస్సంగత్వం! నిస్సంగత్వే నిర్మోహత్వం! నిర్మోహత్వే నిశ్చలతత్త్వం! నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః!' సత్సంగం ద్వారా వ్యక్తి దుస్సంగాల నుంచి వైదొలుగుతాడు. అట్టి వ్యక్తిలో క్రమేపీ మోహం తగ్గుతుంది. తద్వారా ఆ వ్యక్తి సత్యాన్ని, వాస్తవికతను దర్శించే మహనీయుడౌతాడు. అట్టి మహనీయులే ఒకప్పుడు ఈ భారతావనికి ఆదర్శమూర్తులయ్యారు.

ఈ సంస్కృతిలో వైద్యులు, విద్యావేత్తలు, న్యాయాధీశులు, మానసిక నిపుణులు సాధించలేని పరిష్కారాన్ని, ఆధ్యాత్మిక భావజాలంతో మహాత్ములు సాధించిపెట్టారు. ఇంతటి భాగ్యం మరే పౌరుడికి, ఏ జాతికి దక్కని విషయం నిర్వివాదాంశమే! కాబట్టి విజ్ఞులు పారదర్శకతతో లోకహితమైన శాంతిని ప్రబోధించాలే కానీ, వక్రభాష్యాలను కల్మషాలను కార్పణ్యాలను ప్రబోధించి రెచ్చగొట్టకూడదు. సద్గురువుల ప్రబోధాలను పెడచెవినపెట్టే సమాజం తప్పక అధోగతి పాలౌతుందనేందుకు శ్రీకాకుళం జిల్లా లక్షింపేట ఉదంతమొక్కటే చాలు. ఇక్కడో విచిత్రం!

కడుపునొప్పితో బాధపడుతున్న మగవాడిని గైనకాలజిస్ట్‌కు చూపించమనడం ఎంత హాస్యాస్పదమో, వ్యక్తులు చేసే నేరాలకు కులాలను రొంపిలోకి లాగడం అంతకన్నా అవివేకం వేరే ఉండదు. ఇదీ చాలదన్నట్లు ఈ నేరాలకు, సమస్యలకు హిందూ శాస్త్రాలు, హిందూ దేవతలే కారణమని విమర్శిస్తూ రాసిన రచనలో ఎంత కుటిలత దాగుందో సమాజం గుర్తిస్తూనే ఉంది. పటిష్ఠమైన భారతీయ వ్యవస్థపై, పవిత్రమైన హిందూ ధర్మంపై దుమ్మెత్తిపోస్తూ రాసిన శీర్షికను బహిరంగంగా ఖండిస్తున్నాము.

రోగాన్ని పరిశీలించిన వైద్యుడు క్యాన్సర్‌గా గుర్తించి కొన్ని పరీక్షలు చేసిన తరువాత కూడా కెమో, రేడియేషన్‌లు ఇచ్చే ముందు అప్రమత్తతను ప్రదర్శిస్తాడు. అలాగే, సామాజిక శాస్త్రవేత్తలుగా రచయితలుగా చలామణీ అయ్యేవారు ఇంకా, చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాకాక, బాధ్యతా రాహిత్యంతో గ్రామస్థాయిలో మిలీషియాలు తయారుకావాలని రాసిన రాతలు సమాజాన్ని ఎంత దిగజారుస్తుందో గమనించగలరు. ఇటువంటి ప్రబోధాలను తీసుకోవడానికి ఎంతమంది ముందుకు వస్తారో చెప్పమనండి? భయం ద్వారానే మానవత్వాన్ని మలచాలనుకునే రచయిత ఎలాంటి కొత్త మతాన్ని ప్రజలపై రుద్దాలనుకుంటున్నారు?

మానవత్వం ప్రతి ఒక్కరిలోనూ అవసరమే కదా! మరి ప్రతి ఒక్కరినీ భయపెట్టడానికీ, దేశసౌభాగ్యానికీ ఆయన అనుసరించదలచిన మార్గం ఏమిటి? ఇదే అర్థంకాని మిలియన్ డాలర్ ప్రశ్న. దళిత సోదరులు ఏం చేయాలనే సంగతికి వస్తే, నేను సూటిగా ఒక్కటే చెబుతాను. వారిలో ఆత్మగౌరవం పెరగాలి. ఇందుకు సరైన నామకరణం కావాలి. దురుద్దేశపూర్వకంగా దళితులనే శబ్దాన్ని పదే పదే ప్రయోగిస్తూ అణగారినవారు, అంటరానివాళ్ళు, పామరులుగా దానికి అర్థాన్ని ఆపాదించి దళితులను ఎప్పటికీ అణగద్రొక్కి ఉంచాలనే కుట్రను సోదరులు గమనించి తిప్పికొట్టాలి.

గుజరాత్ భూకంపం సమయంలో కట్టుబట్టలతో నడివీధిలో మిగిలినవారికి దుస్తులు లారీలకొద్దీ సహాయంగా వస్తే, వద్దని వారు తిప్పి పంపారు. మాకు మీ సాయాలు వద్దు. అప్పు ఇవ్వండి చాలు. తిరిగి సంపాదించి తీరుస్తాం అన్నారు. ప్రకృతి శక్తుల మీద పోరాటంలో అపారమైన ధైర్యాన్ని చూపించే దళితులు తమకు స్ఫూర్తిదాయకమైన పేరుని ఎందుకు కనుగొనలేకపోతున్నారు? దాని ద్వారా ఐక్యతను సైతం బాటలు వేసుకునే అవకాశాన్ని ఎందుకు అన్వేషించడం లేదు?

హిందూ దేవుళ్ళు నరసింహులైతే, వారిని అనుసరించేవారందరూ నరరూప రాక్షసులని విమర్శించే రచయితలో ఎంత క్రూరమైన మృగం దాగుందో గమనించవచ్చు. దీనినిబట్టి చూస్తే రచయితకు పాపం! మన పురాణాల గురించి ఓనమాలు కూడా తెలియదనే అంశం తేటతెల్లమౌతుంది. పురాణాల్లో దాగున్న మరో కోణాన్ని కూడా వివరిస్తాను! నరసింహుడు అగ్రవర్ణాల దేవుడని ఆయన భావిస్తున్నారేమో? నరసింహుడు వధించిన హిరణ్యకశిపుడు శక్తిమంతుడు, అగ్రవర్ణానికి చెందినరాజు. దళితుడు కానేకాడు. పైగా నరసింహుడు పెళ్లాడినది గిరిజన యువతి చెంచులక్ష్మిని. అన్నింటినీ మించి ఈనాటికీ అంతరం, అభ్యంతరం లేకుండా బడుగు బలహీన తెగలు మాత్రమే కాదు శూద్ర, కమ్మ, రెడ్డి, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణాది సమస్త హైందవ వర్ణాలు నరసింహుడుని దేవుడుగా కొలుస్తున్నాయి.

మన పురాణాల్లో భక్తులు జాబాలి, సత్యకాముడు, అరుంధతి, అంబరీషులు ప్రాతఃస్మరణీయులు. మన చరిత్రలో శబరి, కన్నప్ప, కనకదాసు, సంత్ రవిదాస్, సూరదాస్, తుకారాములు చిరస్మరణీయులు. సమకాలీన సమాజంలో నారాయణగురు, మళయాళస్వామి, మాతా అమృతానందలు వందనీయులు. వీరందరూ బడుగు బలహీన సామాజిక వర్గంలోనే అవతరించి తరించారు. లక్షలాదిమందిని తరింపజేశారు. ఇంతటి పారదర్శకత కలిగిన జాతి, ధర్మము, దేశము ఒక్క మన భారతమాతేనని సగర్వంగా చెప్పుకోవాలి. ఇక్కడ ప్రతీ హిందువు తలెత్తుకు తిరగాలి. కులపోరాటాలు, మిలీషియావాదాలు మన జాతివి కావు. ఇది వలస వచ్చినవారి దురాలోచనలని స్పష్టంగా బయటపడుతోంది.

దీనికి అమ్ముడుపోయినవారే ఈ భావాలను ఇంకా... ఇం...కా! సమాజంలో వ్యాపింపజేసి మనదేశాన్ని, మన సంస్కృతిని నాశనం చేయాలనే దురుద్దేశంతో కొత్త దేవుడి వాదనను తెరపైకి తెచ్చారు. ప్రస్తుత హిందూ దేవుళ్ళను మించిన కొత్తదేవుణ్ణి దళితుల మధ్య ప్రవేశపెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. దేవుడంటే సర్వాంతర్యామి, ఆదిమధ్యాంతరహితుడు, సర్వశక్తిమంతుడు, ఒకే ఒక్కడని సకల మతాలూ కట్టకట్టుకుని ఘోషిస్తుంటే, ఈయన ప్రబోధం మాత్రం మానవుడు కదపగలిగే పావుగా దేవుడిని చిత్రీకరిస్తున్నాడు. ఆయన కొత్త దేవుడిని ప్రవేశపెట్టే వింత ఏమిటో చూడాలని నాకూ ఆసక్తిగానే ఉంది. ఈ కొత్త దేవుడి పిచ్చివాదనను ఎవ్వరూ అంగీకరించరు. ఆహ్వానించరు కూడా. అందుకే, మనకు కొత్త దేవుడు వద్దు. మన భావాలలలో కొత్తదనం రావాలి. అప్పుడే మనదేశం పూర్వపు వైభవం సంతరించుకుంటుంది.

- పరిపూర్ణానంద స్వామి


 కంచె ఐలయ్య గారి విషపూరిత వ్యాసం ఇక్కడ చూడండి
 http://andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/jul/13/edit/13edit4&more=2012/jul/13/edit/editpagemain1&date=7/13/2012

Read more...

అందరితరపున అమ్మకు ఈరోజు జరిగిన అర్చనాకైంకర్యములు .

>> Friday, July 27, 2012

సకల కళ్యాణకారిణి అగు అమ్మ వరలక్ష్మీ మాతకు ఈరోజు శ్రావనశుక్రవారసందర్భంగా భక్తులందరి తరపున విశేషపూజలు జరుపబడ్డాయి .   ప్రభాతకాలంలో అమ్మవారికి పంచామృతాభిషేకములు , విశేషఅర్చనాకైంకర్యములు నిర్వహింపబడ్డాయి . ఈసందర్భంగా గోత్రనామాలు పంపిన భక్తులందరి తరపున కుంకుమ పూజలు జరుపుటజరిగినది.   
తదనంతరం   పీఠానికి చేరుకున్న సువాసినులంతా వరలక్ష్మీ వ్రతములు నిర్వహించుకున్నారు . కలశస్థాపనలు చేసి అమ్మను ఆహ్వానించి ,షోడశోపచారములతో పూజించి హారతులెత్తారు. వివిధఫల,ప్రసాదములు సమర్పించి వాయినములిచ్చుకున్నారు. 
అమ్మ అనుగ్రహాన మీ అందరిగృహములలో సర్వసౌభాగ్యాలుకొలువుండాలని ప్రార్ధిస్తున్నాము . జైశ్రీరాం




[ఈరోజు ఫోటోలు తీసేసమయంలేక కుదరనందున పాతఫోటో ఉంచుతున్నాను ఏమనుకోవద్దు.]

Read more...

శుభప్రదం వరలక్ష్మీవ్రతం

>> Thursday, July 26, 2012

శుభప్రదం వరలక్ష్మీవ్రతం

శ్రీ వరలక్ష్మీవ్రత కథా ప్రారంభం
శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి.

పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతిస్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనందసమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది.

అందుకా త్రినేత్రుడు ..దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీ వ్రతం. దానిని శ్రావణ మాసంలో రెండవ శుక్రవారంనాడు ఆచరించాలని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి.... దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతల్లో ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది.

కాత్యాయనీ...పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుని మితంగా సంభాషిస్తూ జీవిస్త్తూ ఉండేది.

వరలక్ష్మీ సాక్షాత్కారం
వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రిసమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ.. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి చాలా సంతోషించింది. హే జననీ! నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది... అని పరిపరివిధాల వరలక్ష్మీ దేవిని స్తుతించింది.

అంతలోనే చారుమతి మేల్కొని, అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజెప్పింది. వారు చాలా సంతోషించి, చారుమతిని వరలక్ష్మీ వ్రతమును చేసుకోవలసిందని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు.

చారుమతి తన గృహంలో మండపం ఏర్పరచి ఆ మండపంపై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్పవిధులతో సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్టించుకుంది. (శక్తికొలదీ బంగారు, వెండి, రాగి, మట్టి మూర్తులను ప్రతిష్టించుకోవచ్చు) అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు.

లక్ష్మీ కటాక్షం
మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు ఘల్లు ఘల్లున మోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచిత కంకణాలు దగద్ధగాయ మానమయ్యాయి. మూడవ ప్రదక్షిణము చేయగా అందరూ సర్వాభరణ భూషితలయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తువాహనములతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుంచి గజ తురగ రథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ల పొగుడుతూ ఆమె వరలక్ష్మీవ్రతంతో తామందరిని మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు.

వారంతా ప్రతీ సంవత్సరము వరలక్ష్మీ వ్రతం చేస్తూ సకల సౌభాగ్యములతో సిరిసంపదలు కలిగి, సుఖ జీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. మునులారా... శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీ వ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్యైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూతమహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు.

ఈ కథ విని, అక్షతలు శిరసుపె ౖఉంచుకోవాలి. ఆ తరువాత ముత్తయిదువలకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్ధ ప్రసాదాలు ఇచ్చి, పూజ చేసిన వారు కూడా తీర్ధ ప్రసాదాలు స్వీకరించాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని ఆరగించి, రాత్రి భోజనాన్ని పరిత్యజించాలి.
॥మంగళం మహత్॥



సకల సంపదలిచ్చే వరలక్ష్మీ వ్రతవిధానం

సర్వశుభాలను, సకల ఐశ్వర్యాలను ప్రసాదించే శ్రీ వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణమాసంలో ముత్తయిదువలంతా భక్తి ప్రపత్తులతో ఆచరిస్తారు. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ పూజ. ఈ సందర్భంగా నోము నోచుకొనే మహిళల కోసం సశాస్త్రీయమైన పూజా విధానం 'నవ్య' పాఠకులకు ప్రత్యేకం

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే

(అని ముందుగా గణపతిని ధ్యానించి, తదుపరి ఆచమనం చేయాలి)
ఓం కేశవాయ స్వాహాః (చేతిలో నీరు తీసుకుని స్వీకరించాలి)
ఓం నారాయణాయ స్వాహా ః (చేతిలో నీరు తీసుకుని స్వీకరించాలి)
ఓం మాధవాయ స్వాహా ః (చేతిలో నీరు తీసుకుని స్వీకరించాలి)
ఓం గోవిందాయనమః (చేతులు కడుక్కోవాలి)
ఓం విష్ణవేనమః (కళ్లు తుడుచుకోవాలి)
ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివ్రిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్దాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్ధనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః

ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః
యేతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే॥

(అనే శ్లోకాన్ని పఠిస్తూ నాలుగు అక్షతలను వెనక్కు వేసుకోవాలి. ఆ తరువాత ఈ కింది మంత్రం పఠిస్తూ ప్రాణాయామం చేయాలి.)

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః
ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్
సవితుర్వరేణ్యుం, భర్గో దేవస్య ధీమహి ధియోయోనః
ప్రచోదయాత్, ఓం మాపోజ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భవస్సురోమ్...

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే భరతవర్షే, భరతఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య....... (శ్రీశైలానికి వ్రతం చేసేవారి ఊరు ఏ దిక్కులో ఉందో, ఆ దిక్కుని చెప్పాలి) ప్రదేశే, కృష్ణా, కావేరీ మధ్య దేశే (ఏ నదుల మధ్య ప్రాంతంలో వుంటే ఆ నదుల పేర్లు చెప్పాలి.

సొంత ఇల్లయితే స్వగృహే అని అద్దె ఇల్లయితే శోభనగృహే అని చెప్పాలి) సమస్త దేవతా, బ్రాహ్మణ, హరిహర సన్నిధౌ, వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ నందన నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్ల పక్షే నవమ్యాం, లక్ష్మీ వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయం శుభతిథౌ, శ్రీమత్యాః .... గోత్రస్య.... శర్మణః ధర్మపత్నీ శ్రీమతీ... గోత్రవతీ (గోత్రంపేరు)... నామధేయవతి (పేరు చెప్పుకోవాలి). అస్మాకం సహకుటుంబానాం క్షేమ,స్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఐశ్వర్యాభివృద్యర్ధం, ధర్మార్ధ, కామమోక్ష చతుర్విధ ఫల పురషార్ధ సిద్యర్ధం, సత్సంతాన సౌభాగ్య ఫలాప్రాప్త్యర్ధం శ్రీ వరలక్ష్మీ దేవతాముద్దిశ్య, శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావచ్ఛక్తి ధ్యాన మావాహనాది షోషశోపచార పూజాం కరిష్యే (అంటూ కుడిచేతి మధ్య వేలుతో నీటిని తాకాలి).

కలశపూజ
(పూజకు మాత్రమే ఉపయోగించే ఒక గ్లాసును గానీ, పంచపాత్రను గానీ తీసుకుని అందులో నీరు పోసి, అక్షతలు, పువ్వులు, తమలపాకులను ఉంచాలి. దానికి బయట మూడు వైపులా గంధాన్ని రాసి, కుంకుమను పెట్టాలి. ఈ విధంగా చేసి, దానిపై కుడిచేయినుంచి కింది శ్లోకాన్ని పఠించాలి)

కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః
మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ ఃస్థితాః
కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః
అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః
ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాః గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి

నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు॥

అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పముతో ముంచి భగవంతుడిపైన, పూజాద్రవ్యములపైన, పూజ చేయువారు తలపైన చల్లుకోవాలి.

(గమనిక: పూజలో అవసరమైన సమయంలో ఈ కలశంలోని నీటినే ఉపయోగించాలి. ఆచమనం చేసేందుకు ఉపయోగించే జలాన్ని పూజకు ఉపయోగించరాదు. అలాగే కలశంలోని నీటిని ఆచమనమునకు ఉపయోగించరాదు. ఏ వ్రతంలోనైనా, పూజలోనైనా ఇది తప్పనిసరిగా పాటించవలసిన నియమం) కలశపూజ అనంతరం పసుపుతో గణపతిని చేసుకుని, మండపంలో తమలపాకు పైనుంచి, వ్రతం నిర్విఘ్నంగా జరగాలని ముందుగా గణపతిని పూజించాలి.

గణపతి పూజ:
అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥
ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన
పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥

గణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూ స్వామిపై పుష్పాలు ఉంచాలి.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.

(అనంతరం స్వామివారి ముందు పండ్లుగాని బెల్లాన్ని గాని నైవేద్యంగా ఉంచాలి)

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం, భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్... (నీరు నివేదన చుట్టూ చల్లుతూ) సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి... ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓం వ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహా గుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని వదలాలి). ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనం సమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి) ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి! అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీత సుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!

వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.

వరలక్ష్మీ పూజ ప్రారంభం
ధ్యానం: పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవమే గేహేసురాసురనమస్క­ృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధ్యాయామి (అమ్మవారి కలశం ముందు పుష్పాలు ఉంచి నమస్కరించాలి)

ఆవాహనం:
సర్వమంగళమాంగల్యే విష్ణువక్షస్థలాలయే అవహయామి దేవీత్వాం సుప్రీతా భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆవాహయామి
(కలశం ముందు అక్షతలు వేయాలి)

సింహాసనం:
సూర్యాయుతాని భస్పూర్తేస్ఫుర ద్రత్న విభూషితం సింహాసనమిదం దేవీ స్థియతాం సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి (అక్షతలు లేదా పుష్పాలు ఉంచాలి)

అర్ఘ్యం:
శుద్దోదకం చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామితేదేవీ గృహాణ సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః అర్ఘ్యం సమర్పయామి (ఉద్ధరిణెతో నీటిని అమ్మవారికి చూపించి ముందున్న అర్ఘ్య పాత్రలో వేయాలి)

పాద్యం:
సువాసితజలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవత్వం సర్వదేవ నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పాద్యం సమర్పయామి (అర్ఘ్య పాత్రలో ఓ ఉద్ధరిణెడు నీటిని వేయాలి)

ఆచమనీయం:
సువర్ణకలశానీతం చందనాగరు సంయుతం గృహాణాచమనం దేవీ మయాదత్తం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః శుద్ధాచమనీయం సమర్పయామి (అర్ఘ్య పాత్రలో ఓ ఉద్ధరిణెడు నీటిని వేయాలి)

పంచామృత స్నానం:
పయోదధిఘృతో పేతం శర్కరా మధుసంయుతం పంచామృతస్నానమిదం గృహాణ కమలాలయే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పంచామృతస్నానం సమర్పయామి (తమలపాకుతో కొన్ని చుక్కల నీటిని కలశం మీద చిలకరించాలి)

శుద్ధోదక స్నానం:
గంగాజలం మయానీతం మహాదేవ శిరఃస్థితం శుద్ధోదకస్నాన మిదం గృహాణ విధుసోదరి శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి (తమలపాకుతో కొన్ని చుక్కల నీటిని కలశం మీద చిలకరించాలి) స్నానాంతరం ఆచమనీయం సమర్పయామి. (అర్ఘ్య పాత్రలో ఓ ఉద్ధరిణెడు నీటిని వేయాలి)

వస్త్రం:
సురార్చితాంఘ్రియుగళేదుకూల వసనప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి (అక్షతలు లేదా పుష్పాలు ఉంచాలి)

ఆభరణం:
కేయూరకంకణే దివ్యేహారనూపురమేఖలాః విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆభరణాని సమర్పయామి. (పుష్పాలు ఉంచాలి)

ఉపవీతం:
తప్త హేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితం ఉపవీతం మిదం దేవి గృహాణత్వం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఉపవీతం సమర్పయామి (దూదితో చేసిన సూత్రం చివర్లలో గంధం రాసి కలశానికి హారంలా అంటించాలి)

గంధం:
కర్పూరాగరు కస్తూరీరోచనాది భిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగుహ్యతామ్ శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః గంధం సమర్పయామి (కలశంపై గంధం చిలకరించాలి)

అక్షతలు:
అక్షతాన్ ధవళాన్ దేవీ శాలియాన్ తండులాన్ శుభాన్ హరిద్రాకుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధి పుత్రికే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః అక్షతాన్ సమర్పయామి (అక్షత లు వేయాలి)

పుష్పం:
మల్లికా జాజి కుసుమై శ్చంపకై ర్వకుళై స్తథా శతపత్రైశ్చరైః పూజయామి హరిప్రియే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పుష్పైః పూజయామి (అమ్మవారి కలశం ముందు పుష్పం ఉంచాలి)

అధాంగపూజ:
(పుష్పాలు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి) చంచలాయై నమః - పాదౌ పూజయామి, చపలాయై నమః - జానునీ పూజయామి, పీతాంబరాయై నమః - ఉరుం పూజయామి, కమలవాసిన్యైనమః - కటిం పూజయామి, పద్మాలయాయైనమః - నాభిం పూజయామి, మదనమాత్రేనమః - స్తనౌ పూజయామి, కంబుకంఠ్యై నమః- కంఠం పూజయామి, సుముఖాయైనమః - ముఖంపూజయామి, సునేత్రాయైనమః - నేత్రౌపూజయామి, రమాయైనమః - కర్ణౌ పూజయామి, కమలాయైనమః - శిరః పూజయామి, శ్రీ వరలక్ష్య్మైనమః - సర్వాణ్యంగాని పూజయామి. (ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలి)

శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః
ఓం ప్రకృత్యై నమః, ఓం వికృతై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూత హిత ప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచ్యై నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం రమాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిణై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం క్రోధ సంభవాయై నమః, ఓం అనుగ్రహ ప్రదాయై నమః, ఓం బుద్ధ్యె నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దీపాయై నమః, ఓం తుష్టయే నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం లోకశోకవినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్ష్యై నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖియై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మ గంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రసాదాభిముఖీయై నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్రసహోదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్ర రూపాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం ఇందుశీతలాయై నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్ట్యె నమః, ఓం శివాయై నమః, ఓం శివకర్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం దారిద్ర నాశిన్యై నమః, ఓం ప్రీతా పుష్కరిణ్యై నమః, ఓం శాంత్యై నమః, ఓం శుక్లమాలాంబరాయై నమః, ఓం శ్రీయై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వ నిలయాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయై నమః, ఓం ఉదారాంగాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్యై నమః, ఓం సిద్ధ్యై నమః, ఓం త్రైణ సౌమ్యాయై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం నృపవేశగతానందాయై నమః, ఓం వరలక్ష్మ్యై నమః, ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓం హిరణ్యప్రాకారాయై నమః, ఓం సముద్రతనయాయై నమః, ఓం జయాయై నమః, ఓం మంగళాదేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః, ఓం ప్రసన్నాక్ష్యై నమః, ఓం నారాయణసీమాశ్రితాయై నమః, ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః, ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః, ఓం నవదుర్గాయై నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః, ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః, ఓం భువనేశ్వర్యై నమః

ధూపం:
దశాంగం గుగ్గులోపేతం సుగంధిం సుమనోహరం ధూపం దాస్యామి దేవేశి వరలక్ష్మీ గృహాణతమ్ శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధూపమాఘ్రపయామి ధూపందర్శయామి (అగరువత్తులు వెలిగించి ఆ ధూపాన్ని అమ్మవారికి చూపాలి)

దీపం:
ఘృతాక్తవర్తి సమాయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామితే దేవి గృహాణ ముదితా భవ శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. (దీపం చూపించి ఉద్ధరిణెతో కొంచె నీటిని అర్ఘ్య పాత్రలో వేయాలి)

నైవేద్యం:
నైవేద్యం షడ్రషోపేతం దధిమధ్వాజ్య సంయుతం నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి (ఉద్ధరిణెతో నీటిని అర్ఘ్య పాత్రలో ఉంచాలి)

పానీయం:
ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవీ శీతలం సుమనోహరమ్ శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పానీయం సమర్పయామి (ఉద్ధరిణెతో నీటిని అర్ఘ్య పాత్రలో ఉంచాలి)

తాంబూలం:
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూర చూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః తాంబూలం సమర్పయామి, (పండు, పుష్పంతో కూడిన తాంబూలాన్ని అమ్మవారి వద్ద ఉంచాలి)

నీరాజనం:
నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్తితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః నీరాజనం సమర్పయామి (ఘంటానాదం చేస్తూ కర్పూర హారతిని అమ్మవారికి చూపించాలి)

మంత్రపుష్పం:
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవీ సుప్రీతో భవసర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః మంత్రపుష్పం సమర్పయామి (పుష్పాలను అమ్మవారి ఎదుట ఉంచాలి)

ప్రదక్షిణ:
యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవం త్రాహిమాం కృపయాదేవి శరణాగత వత్సలే అన్యధా శరణంనాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష జగధారిణి శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః ప్రదక్షిణం సమర్పయామి (ప్రదక్షిణలు చేయాలి)

నమస్కారం:
నమస్తే లోక జననీ నమస్తే విష్ణువల్లభే పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ నమోనమః శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నమస్కారాన్ సమర్పయామి (అమ్మవారికి అక్షతలు వేసి నమస్కరించాలి)

తోరపూజ:
తోరమును అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ కింది విధంగా పూజించాలి. కమలాయైనమః - ప్రథమగ్రంథిం పూజయామి, రమాయైనమః - ద్వితీయ గ్రంథింపూజయామి, లోకమాత్రేనమః - తృతీయ గ్రంథింపూజయామి, విశ్వజనన్యైనమః - చతుర్థగ్రంథిం పూజయామి, మహాలక్ష్మ్యై నమః - పంచమగ్రంథిం పూజయామి, క్షీరాబ్ది తనయాయై నమః - షష్ఠమ గ్రంథిం పూజయామి, విశ్వసాక్షిణ్యై నమః - సప్తమగ్రంథిం పూజయామి, చంద్రసోదర్యైనమః - అష్టమగ్రంథిం పూజయామి, శ్రీ వరలక్ష్మీయై నమః - నవమ గ్రంథిం పూజయామి.

ఈ కింది శ్లోకములు చదువుతూ తోరము కట్టుకోవాలి
బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే
వాయనం ఇవ్వడం
వాయనం ఇచ్చేటప్పుడు ఈ కింది శ్లోకం చదవాలి.
ఏవం సంపూజ్యకళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః
దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హిద్విజాతయే
ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వైదదాతిచ
ఇందిరా తారకోపాభ్యాం ఇందిరాయై నమోనమః
(వాయనం ఇచ్చాక కథ చదివి అక్షతలు శిరసుపై వేసుకోవాలి)

కావలసిన వస్తువులు
పసుపు, కుంకుమ, వాయనానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికెవస్త్రం, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములకు దారము, టెంకాయలు, దీపపు కుందులు, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి, దీపారాధానకు నెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యము, శనగలు మొదలైనవి.

పూజకు సిద్ధంగా...
వరలక్ష్మీ వ్రతం ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపంపైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫొటో ఉంటే అక్కడ అందంగా అమర్చుకోవాలి. పూజా సామగ్రి అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి.

తోరం ఎలా తయారు చేసుకోవాలి?
తెల్లటి దారమును ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారమునకు ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారమును ఉపయోగించి, ఐదు లేక తొమ్మిది పువ్వులతో ఐదు లేక తొమ్మిది ముడులతో తోరాలను తయారు చేసుకుని, పీఠం వద్ద ఉంచి, పుష్పములు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఈ విధంగా తోరాలను తయారుచేసుకున్న అనంతరం పూజకు ఉపక్రమించాలి.







Read more...

త్రైలింగ స్వామి చరిత్ర -- 72 to 77

>> Tuesday, July 24, 2012

ఈ జగత్తు నీటి బుడగలాంటిది; ఎండమావి వంటిది. అలాంటి జగత్తును ఎవరు తుచ్ఛంగా భావిస్తారో, వారిని మృత్యువు తేరిపారచూడలేదు.
27.తరుముకు వచ్చే కష్టాలలాగా ప్రకోపించే కోపాన్ని అదుపు చేయగలవాడే నిజమైన సారధి. ఇతరులు కేవలము కాంతి కిరణాలను పట్టుకోవాలని వ్రేలాడేవారే!
28.ప్రేమద్వారా క్రోధమును జయించు. శుభముద్వారా అశుభమును జయించు. నిస్వార్థత ద్వారా స్వార్థతను జయించు. సత్యము ద్వారా అసత్యమును జయించు.
29.గురువు ఇచ్చే ఉపదేశాన్ని మనస్సుతో విని, దానిని పాటించాలి.
30.అనవసరమైన మాటలు మాట్లాడకు. ఎక్కువగా మాట్లాడేవారు అబద్ధాలు ఎక్కువ చెబుతారు. శాంతి కొరకు ఎంతవరకు అవసరమో అంతవరకే కొద్దిగా మాట్లాడాలి.
యోగశిక్షణకు అరణ్యవాసము, నిరాహారములు అక్కరలేదు. చిత్తవృత్తి నిరోధమే యోగము. చిత్తమునకు వశీభూతమైన ఇంద్రియములను ఇష్టసాధనకు నియోగించగల క్షమత గలవారికి ఈ జగత్తు అయినా అరణ్యమైనా ఒకటే. ఏకాగ్రతయే యోగమునకు ప్రాణము. ఏకాగ్రతలో జీవాత్మ- పరమాత్మలు ఒకటైప్పుడు, జీవాత్మ పరమాత్మలలో తేడా ఉండదు. అప్పుడే సాధకుడు అసలైన యోగి అవుతాడు. ఈశ్వరుని పొందటానికి యోగాంగ సాధన అవసరం లేదు. భక్తి ద్వారానే భగవంతుని పొందవచ్చును. భక్తుడు భక్తిద్వారా ఆయనను ప్రసన్నుని చేసికొని, ఆయనలో లీనమైపోవచ్చును. దాన్ని కూడా సమాధి అంటారు.
సమాధి అంటే బ్రహ్మలో మనస్సును స్థిరీకరించటం. జీవాత్మ పరమాత్మల ఏకీకరణం మొదలైనవి సమాధి యోగము యొక్క ఫలస్వరూపములు. చిత్తము వశీభూతమై ఇతర కార్యముల నుండి నిస్పృహమై, ఆత్మలో నిలిచినప్పుడు, దానిని సమాధి అంటారు. ఏ స్థితిలో విశుద్ధమైన అంతఃకరణ ద్వారా ఆత్మావలోకనం చేసి ఆత్మలోనే తృప్తి, బుద్ధిలాభము, అతీంద్రియత్వము వంటి ఆంతరంగిక సౌఖ్యములను పొందుతారో, ఏ స్థితిలో ఉండటంవలన ఆత్మతత్త్వ విచ్యుతి కలుగదో, ఏ స్థితిని పొందిన తరువాత సాధకుడు ఇతర లాభములను లాభములుగా భావించడో, ఏ స్థితిలో ఉండగా గురుతరములైన దుఃఖములు కూడా చలింపజేయలేవో, ఆ స్థితి పేరే యోగము. మనసును ఆత్మలో నిలిపి స్థిరమైన బుద్ధితో మెల్లిమెల్లిగా విరతిని అభ్యసించాలి. చంచలమైన మనస్సు ఏయే విషయాల కోసం చరిస్తూ ఉంటుందో, వాటిని గురించి ఆలోచించకుండా, దానిని పట్టి లాగి ఆత్మకు వశపరచాలి. రజోగుణ- తమోగుణ విహీనులైన యోగిగణము ఈ ప్రకారంగానే మనస్సును సర్వదా వశీభూతం చేసి, అనాయాసంగా బ్రహ్మ సాక్షాత్కారం పొంది, సర్వోతృష్ణ సుఖాన్ని పొందుతారు. అంతటా బ్రహ్మదర్శనం చేయగలవాడు, తన మనస్సును సమాహితం చేసి సకలభూతములలో ఆత్మను, ఆత్మలో సకల భూతములను దర్శిస్తాడు. నిష్కామంగా యోగాభ్యాసం చేసేవాడు మాత్రమే సమాధి స్థితికి లేదా మోక్షానికి అర్హుడవుతాడు. ఈశ్వరునిలో లీనమైన జీవాత్మ పరమాత్మతో లీనమవటమే ముక్తి.
సమాధి అంటే తన్మయభావము. ఎక్కడ జీవాత్మ- పరమాత్మ వేరనే భావం ఉండదో, ఎపుడు జీవుడు బాహ్య జ్ఞానశూన్యుడవుతాడో, ఎప్పుడు బాహ్యేంద్రియములు చలనము లేనివవుతాయో దానిని సమాధి అంటారు. మనస్సును ఇంద్రియాలకు వశం చెయ్యక, ఇంద్రియములను మనస్సుకు వశీభూతం చెయ్యటమే యోగాభ్యాసంలో ప్రధానోపాయము. మొదట ఇంద్రియాల నుంచి పుట్టిన చిత్తవృత్తులను నియంత్రించి, చిత్తమును వశీభూతం చేసుకోవాలి. ఆ తరువాత చిత్తమును చిత్తమునకు వశపరచి అంటే సంసారికమైన ఇంద్రియ వృత్తులకు వశీభూతమైన చిత్తమును నిష్కామమైన చిత్తంగా చెయ్యాలి. చిత్తమును వివిధలక్ష్యముల నుంచి మరల్చి, అభీష్ట లక్ష్యమునకు మార్గదర్శంగా చెయ్యాలి.
 వివిధ చింతనలనుంచి క్రమక్రమంగా నియంత్రించి ఎల్లప్పుడు ఆత్మ చింతనలోనే నియోగించాలి. యోగము రెండు రకాలు 1.సకామ యోగము. 2.నిష్కామ యోగము. సకామ యోగాభ్యాసము చేసేవాడు మోక్షమును పొందలేడు. నిష్కామ యోగాభ్యాసియే మోక్షాన్ని పొందుతాడు. నిష్కామ ధర్మపాలనమే యోగమునకు మూలము.
ఆత్మతత్త్వము యోగమునకు ఒక అంగము. అంతేకాక అది యోగము యొక్క ఫలస్వరూపము కూడా! తన్మయత్వభావము కలిగిన తరువాతే మరే అనుష్ఠానము అవసరం లేదు. తన్మయత్వభావమే యోగసిద్ధి. అలాంటి భావము లభించిన తరువాత దృష్టి అంతా కామ్యవస్తువుపైననే ఉంటుంది. మరే వస్తువుపైనా ఉండదు. అన్య చింతన ఉండదు. మనస్సులో కామ్య వస్తువు, కామ్య వస్తువుపై మనస్సు మాత్రమే ఉంటాయి. కామ్య వస్తువు మినహా జగత్తులోని మరే వస్తువు అతనికి కనబడదు. ఆ కామ్య వస్తువే మనస్సంతా నిండి ఉంటుంది. అప్పుడతను జగత్తులో ఉండి కూడా, జగత్తులోని మనిషి కాడు. అతని అస్తిత్వము కామ్య వస్తువే అవుతుంది. ఆ కామ్య వస్తువు లేనప్పుడు అతని అస్తిత్వమే ఉండదు. అట్లా కామ్య వస్తువులో కలిసిపోతాడు. దాని పేరే తన్మయత్వము. ఏదైనా పనిని చేసేటప్పుడు ఆ పనిలో తన్మయులు కావటం తప్పనిసరి. అట్లా చేస్తే ఆ పని విఫలము కాదు. ఆ పని తప్పక సిద్ధిస్తుంది. భావన ఎట్లా ఉంటుందో, సిద్ధి కూడా అట్లాగే ఉంటుంది. కోరిన దానిపట్ల ఎంతగా మనస్సు లగ్నమై ఉంటుందో, దాని ఫలితం కూడా అంత ఎక్కువగానే ఉంటుంది. ఏ పనియైనా సంపూర్ణంగా సిద్ధించాలంటే, దానిపట్ల సంపూర్ణ తన్మయత్వం పొందాలి. ఏకాగ్రత లేకుండా తన్మయత్వంరాదు. ఏ పనినైనా చేయటానికి, అది అవసరం కనుక, ముందుగా ఏకాగ్రతలో శిక్షణ పొందాలి. ఏకాగ్రత లేకపోతే ఆ పనిలో తన్మయత్వం కలుగదు. పనిలో విశ్వాసం లేకపోతే సిద్ధి కలుగదు. కార్యసిద్ధికి మూలం విశ్వాసమే! కనుక పనిపట్ల విశ్వాసాన్ని పెంచుకోవాలి. తన్మయత్వము, ఏకాగ్రత, ఫలసిద్ధి, వీటన్నింటికీ మూలం విశ్వాసమే.
సృష్టి చేసే సమయంలో భగవంతుడు అన్నిటికన్నా మొదట మాయను సృజించాడు. ఆ మాయ జ్ఞాత-జ్ఞాయము- జ్ఞానములలో కార్యకారణ రూపములలోను, సత్వ- రజ-స్తమో గుణములలోను, విశిష్టమై యున్నది. దానికి రెండు శక్తులు ఉన్నాయి. మొదటిది ఆవరణ శక్తి- అంటే మాయ చేత జీవుడు ఆచ్ఛాదింపబడి ఉండటం వలన నిత్య సత్య స్వరూపుడైన పరమాత్మను పొందలేక, అహంకారంతో తనను తాను స్వతంత్రుడనని భావిస్తాడు. రెండవది విక్షేపశక్తి- దీనివలన జీవుడు అసత్యమైన వస్తువును సత్యముగా భావించి జగత్తును నిత్యంగాను సత్యంగాను భావిస్తాడు. అంతేకాక భగవంతుని మరచిపోయి, అనిత్య విషయ వస్తువులోనే ఉండిపోతాడు.
తాంత్రిక విధానంలో షట్చక్ర భేదనము
సత్వరజస్తమో గుణ విశిష్టమైనది. చంద్ర సూర్యాగ్ని రూపమైనది, స్వచ్ఛమైనది అయిన సుషుమ్న నాడి ఇడ-పింగళ నాడులకు మధ్యలో ఉన్నది. చతుర్దళాకారంలో ఉన్న ఆ నాడి, మూలాధార పద్మం నుంచి శిరస్సులోని బ్రహ్మరంధ్ర పర్యంతము విస్తరించియున్నది. ఈనాటికి చుట్టబడి ఆసనము, లింగము, నాభి, హృదయము, కంఠము, భ్రూమధ్యము,శిరస్సులో వరుసగా మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞా, సహస్రారము అనే ఏడు పద్మాలు ఉన్నాయి. ఈ సుషుమ్ననాడి మధ్యలో మణిలాగా ప్రకాశించే వజ్రా అనే నాడి ఉన్నది. మరల దానిలో చంద్ర సూర్య అగ్ని రూపమైన, బ్రహ్మవిష్ణు శివులతో కూడిన చిత్రా (చిత్రిణి) అనే నాడి సాలెపురుగు దారములాగా ఉన్నది. నిర్మలమైన జ్ఞానోదయము లేకపోవటంవలన ఈ నాడిని ఎవరూ తెలుసుకోలేరు. మరల ఆ చిత్రానాడిలోపల అతి సూక్ష్మమైన విద్యున్మాలలాగా ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూ బ్రహ్మనాడి అనే మరొక నాడి ఉన్నది.
 ఈ బ్రహ్మనాడిలోని రంధ్రంద్వారా బ్రహ్మరంధ్రంలోని సహస్రార పద్మం నుండి సుధ ప్రవహిస్తూ ఉంటుంది. యోగులు ఆ సుధను మూలాధార పద్మంవద్దనున్న కుండలినీ శక్తి ద్వారా పానం చేసి, సిద్దానందమును అనుభవిస్తారు.
1.మూలాధార చక్రము ఆసనములో ఉన్నది. ఇది చతుర్దళములు, స్వర్ణకాంతి, అధోముఖముతో ఉండే పద్మము. సాధనకాలంలో సాధకుల ఊర్థ్వముఖులై చింతనచెయ్యాలి. ఈ చక్రపు నాలుగు దళములలో ‘‘వం, శం, షం, సం’’ అనే నాలుగువర్ణాలు ఉన్నాయి. మధ్యలో చతురస్రాకారంలో పృథ్వీచక్రం ఉన్నది. ఆ చక్రము ఉజ్జ్వలము, పీత, వర్ణము, అష్టశూల సంయుతము అయినది. దాని మధ్యలో ‘్భం’ అంటే ఫృథ్వీబీజం ఉన్నది. దానితో కలిసి లక్ష్మీబీజం ఉన్నది. ఆ చక్రానికి అధిదేవత ఇంద్రుడు. ఆయన ప్రక్కన చతుర్ముఖుడైన బ్రహ్మ చతుర్వేద పారాయణ చేస్తూ, భౌతిక పదార్థాలను సృష్టిస్తూ ఉంటాడు. ఆ చక్రంలో రక్తవర్ణము- చతుర్‌బాహువులు కలిగి, ద్వాదశాదిత్యులతో సమానమైన డాకినీ శక్తి ఉన్నది. వజ్రానాడి ప్రారంభంలో కామరూపమనే పీఠం ఉన్నది. ఆ పీఠం మీద త్రికోణ యంత్రం ఉన్నది. ఈ యంత్రం నుంచి బయటికి వచ్చిన కందర్పవాయువు జీవాత్మను పట్టుకొని ఉన్నది. ఈ త్రికోణ యంత్రంలో శరత్కాల చంద్రునిలాగా లింగరూపియైన స్వయంభువుడున్నాడు. ఆ లింగము వద్ద మూడున్నరసార్లు చుట్ట చుట్టుకొని ఉన్న బ్రహ్మనాడి ఉన్నది. ఆ బ్రహ్మనాడీ ముఖమును ఆనుకొని కుండలినీ శక్తి నిద్రాణమై ఉన్నది. అక్కడే విద్యుత్ రూపిణియైన మహామాయ తుమ్మెదలాగా మధురమైన గున గున శబ్దం చేస్తున్నది. అదే శబ్దజనని. శ్వాస- ప్రశ్వాసల ద్వారా ప్రాణులను రక్షించేది అదే! ఈ కుండలినీ శక్తి శరీరంలోని పరమ కళ. త్రిగుణాత్మకమైన అంశ రూపాత్మకమైన సమస్త బ్రహ్మాండమును ప్రకాశింపజేస్తున్నది.
2.స్వాధిష్టాన చక్రము లింగమూలమున ఉన్నది. ఇది షడ్దళ- అరుణవర్ణ పద్మము. దీని ఆరు దళములలో ‘‘బం, భం, మం, యం, రం, లం’’ అనే వర్ణాలు ఉన్నాయి. దానిలో పద్మాకారంలో ఉన్న వరుణ దేవతాచక్రం ఉన్నది. ఆ చక్రంలో శరత్కాల చంద్రకాంతి, తలలో అర్ధచంద్రధారి- మకరవాహిని- వం బీజరూపి అయిన వరుణ దేవత ఉన్నది. ఆ దేవత ప్రక్కన 24 లక్షణాలు కలిగి, పీతాంబరధారి అయిన నారాయణుడు ఉన్నాడు. ఆ చక్రానికి శక్తి లక్ష్మీరూపిణియైన రాకిణి.
3.మణిపూర చక్రము నాభిమాలములో ఉన్నది. అది దశదళ- నీలవర్ణ పద్మము. దాని పది దళాలలో ‘టం, డం, ణం, తం, థం, దం, ధం, నం, పం, ఫ’’ అనే పది వర్ణాలు ఉన్నాయి. దానికి సరిగ్గా మధ్యభాగంలో టం అకారాత్మక త్రికోణాకార అగ్ని బీజం ఉన్నది. దానిని ఆవరించి స్వస్తికాకార మండలం వున్నది. అక్కడ ఉన్న అగ్నిదేవత చతుర్బాహువై, మేగవాహనుడై, ఎఱ్ఱని సూర్యునితో సమానంగా ప్రకాశిస్తున్నాడు. ఆయన ప్రక్కన ఆయనకు ఇష్టదేవత- సంహారకారి అయిన మహాకాళుడు ఉన్నాడు. ఆ చక్రానికి శక్తి లాకిని. ఆమె నల్లని వర్ణము కలది.
4.అనాహత చక్రం హృదయంలో ఉన్నది. అది ద్వాదశ దళసింధూర వర్ణ పద్మము దాని పనె్నండు దళాలలో ‘‘కం, ఖం, గం, ఘం, ఙం, చం, ఛం, జం, ఝం, ఞం, టం, ఠం, అనే 12 వర్ణాలున్నాయి. దాని మధ్యలో షట్కోణాకారంలో ధూమ్రవర్ణంలో ఉన్న వాయుమండలం ఉన్నది. దానిలోపల యం అకారాత్మక వాయు బీజ దేవత ఉన్నది. అది కృష్ణవర్ణంలో, మృగవాహినియై ఉన్నది. ఆ బీజంలో హంసలాగా స్వచ్ఛమైన వర్ణములో అభయ వరదుడైన ఈశానుడు ఉన్నాడు. ఆ చక్రానికి శక్తికాకిని. ఆ శక్తిలో స్వర్ణవర్ణాత్మకమైన బాణలింగరూపంలో మహాదేవుడు ఉన్నాడు. ఆ పద్మంలో మరొక అష్టదళ పద్మం ఉన్నది. దానిమీద ఒక కల్పవృక్షం ఉన్నది. దాని క్రింది మణిపీఠంలో హంసరూపియైన జీవాత్మ ఉన్నది. సాధకుడు ఇక్కడ నిలిచి గురూపదిష్టమైన దేవతను ధ్యానించాలి. అట్లా చేస్తే ఆత్మదర్శనమవుతుంది.
 విశుద్ధచక్రం కంఠంలో ఉన్నది. ఇది ధూమ్ర వర్ణంలో ఉన్న షోడశ దళ పద్మము. దాని 16 దళములలో ‘‘అ, ఆ, ఇ,ఈ, ఉ, , ఋ, ఋ౎, ఎ, ఐ, ఓ, ఔ, అం, అః’’ అన్న 16స్వరములు ఉన్నాయి. ఆ పద్మకర్ణికలో తెల్లని ప్రకాశవంతమైన శరీరముగలవాడు, తెల్లని వస్తమ్రులు ధరించినవాడు, గోళాకార ఆకాశ చక్రధారి అయి ఏనుగు నధిష్ఠించి ఉన్నాడు. ఆ చక్రములో హంసాకారి, పాశాంకుశధారి, ద్విబాహువు, అభయవరదాత అయిన ఆకారబీజమున్నది. దాని ప్రక్కన పంచమఖములు, త్రినేత్రములు, దశభుజములు కలిగిన ఈశ్వరగౌరి ఉన్నది. దానిలోని చంద్రమండలం నుంచి సుధాపానంచేస్తూ, పీతవర్ణ చతుర్భుజ అయిన సాకినీ శక్తి ఉన్నది.
6.ఆజ్ఞాచక్రము భ్రూయుగ్మ మధ్యనున్నది. ఇది ధ్యానం చెయ్యవలసిన ప్రదేశము. అది తెల్లని ద్విదళపద్మము. దాని దళములలో ‘‘హ, క్ష’’ వర్ణములు ఉన్నాయి. ఈ ప్రదేశంలోనే ఇడ- పింగళనాడులు, వరుణ- అసినదుల రూపంలో కలిసి వారణాసీ తీర్థమును చేసినాయి.
ఆ పద్మంలో శుక్లవర్ణ షణ్ముఖి అయిన హాకీనీశక్తి ఉన్నది. ఆమె నాలుగు చేతులలో పుస్తకము, కపాలము, డమరుకము, జయమాల ఉన్నాయి. ఈ పద్మమును ధ్యానించటంవలన బ్రహ్మజ్ఞాని అవుతారు. ఈ పద్మంలో మనస్సు, కర్ణికలో త్రికోణ యంత్రము ఉన్నాయి. ఇక్కడ పరమలయస్థానం ఉన్నది. అక్కడ శుక్ల అనే పేరుగల మహాకాళుడు త్రినేత్రుడు అయిన సిద్ధలింగము ప్రకాశిస్తున్నది. ఈ శివుడు అర్థనారీశ్వరుడని ప్రఖ్యాతిగాంచినాడు. ఆజ్ఞాన చక్ర పరిజ్ఞానం కలిగిన తరువాత జీవునకు అద్వైత భావన కలుగుతుంది.
7.ఆజ్ఞాచక్రానికి కొద్దిగా పైభాగంలో శుద్ధము -జ్ఞానము-జ్ఞేయము - దీపశిఖవలె జ్యోతిర్మయము, ఓంకారాత్మకము అయిన అంతరాత్మ నిరంతరముగా ఉంటాడు.
దానిమీద అర్ధచంద్రాకారము, దానిపైన బిందువు రూపంలో ఓం అన్న నాదము, శక్తిరూపక సాకారాత్మక పూర్ణచంద్రునిలాగా ప్రకాశిస్తున్న ఉజ్జ్వల శివలింగము ఉన్నవి. ఆ ‘ఓం’ కారంపైన రెండుభుజములు కల మహానాదము అన్న పేరుగల శిఖాకార వాయువు యొక్క లయస్థానం ఉన్నది. ఆ ఆజ్ఞా చక్రంపైన శంఖిణి అన్న పేరుగల నాడికి ముందు ఆకాశంలో విసర్గ (:)లాంటి రెండు బిందువులున్నాయి. దాని క్రింద పూర్ణచంద్రునిలాగా శుభ్రవర్ణము, బాలసూర్య ప్రభాభాసమైన కేసరములతోనున్న సహస్రదళ పద్మము అధోముఖియై ఉన్నది.
దానిలో పంచాశత్ (50) మాతృకావర్ణములు యథాస్థానంలో ఉన్నాయి. ఆ స్థానంలో నిర్మలమైన కుందేలు చంద్రుడు ఉన్నాయి. ఆ చంద్రునిలో విద్యుదాకారంలో త్రికోణయంత్రం ఉన్నది. ఆ యంత్రంలో అతి రహస్యమైన చిద్రూపాకార స్థానం ఉన్నది. అక్కడ పరమాత్మ స్వరూపుడైన పరమశివుడు విరాజిల్లుతున్నాడు. అతడు యోగానందము- జ్ఞానము - శుభముల నొసగేవాడు. అతనినే పరమహంస అని కూడా అంటారు. ఇక్కడే శైవుల కైలాసము, వైష్ణవుల గోలోకము, శాక్తేయుల మహాశక్తి నివాసము ఉన్నాయి.
ఆ సహస్ర దళ పద్మంలోపల లేత సూర్యునివంటి ఎఱ్ఱని కాంతి, అతి సూక్ష్మము, విద్యున్మాలవంటి జ్యోతిర్విశేషము, శుద్ధము, నిర్వికారము, నిత్య ప్రకాశమానము, ఉదయాస్తమయ రహితము, అథోముఖి అయిన పూర్ణానంద పరంపర నుండి అమృతధార కురుస్తూ ఉంటుంది. దానిని ధరించేది ‘అమా’ అనే చంద్రకళ. దాని లోపల వెంట్రుక కొనలో వెయ్యోవంతు ఉండే అర్థచంద్రాకార ద్వాదశాదిత్య ప్రభావిశిష్టమైన, ప్రాణులకు ఇష్టమైన నిర్వాణకళ ఉన్నది. అది మహాకుండలిని అనే పేరుతో ప్రఖ్యాతమై ఉన్నది.
తిరిగి ఆ నిర్వాణకళలోపల కోటి సూర్య ప్రభాభాసమైన శివలింగమున కర్మ ఫలదాయినియైన నిర్వాణ శక్తి ఉన్నది. ఆ నిర్వాణ శక్తి మధ్యభాగంలో యోగి, మహాత్ములచే చింతన చేయబడేవాడు, పరమ సుఖమయమైన నిత్యానంద స్వరూపుడు అయిన తురీయ బ్రహ్మ ఉన్నాడు.
 యమ, నియమ, ఆసన, ప్రాణాయమ, ప్రత్యాహార, ధారం, ధ్యాన, సమాధి, తపస్సులతో యోగి దీర్ఘజీవనము, ఆకాశగమనము, అంతర్థాన శక్తి, పరకాయ ప్రవేశము, దూరదర్శనము, భూత భవిష్యత్ వర్తమాన త్రికాల దర్శనము, అణిమ, మహిమాచైవ గరిమా లఘుమాప్రాప్తి ప్రాకామ్యము- ఈశత్వము- వశిత్వము- కామావసాయిత్వము ఇత్యాది అష్టసిద్ధులను పొందుతాడు. అణిమ అంటే అణువులాగా చిన్న దేహమును ధరించే శక్తి. మహిమ అంటే బాగా బరువెక్కడం. లఘిమ అంటే తేలికగా అయిపోయి ఆకాశ గమనం చేయగలశక్తి. ప్రాప్తి అంటే ఈ విశ్వంలోని అన్ని వస్తువులనూ హస్తగతం చేసుకొనే శక్తి. ప్రాకామ్యమంటే యథేచ్చగా చేయగలశక్తి. ఈశత్వమంటే ప్రభుత శక్తి.
వశిత్వమంటే అన్నింటినీ తన వశంలో పెట్టుకోగల శక్తి. కామవసాయిత్వమంటే అన్ని కోరికలను తీర్చుకొని నిష్కాములు కావటం. భక్తి లేకుండా సాధకుడు తన పురుషకార సాధన ద్వారా ఎంత ఉన్నతిని పొందినా, అతనికి పతనావకాశం సిద్ధంగా ఉంటుంది.
తపస్సులో చివరి మెట్టుమీదికి వెళ్లినప్పటికి, దానిలో ఒక్కొక్కసారి అవిశ్వాసము నైరాశ్యము చోటుచేసుకొని ఉంటాయి. కానివాటితోపాటు భక్తికూడా ఉంటే, అవిశ్వాసం ఎప్పుడూ కలుగదు. అప్పుడు యోగి అనాయాసంగా ముక్తిని పొందగలుగుతాడు. ఆత్మలో పరమాత్మ సంయోగం చెందటమే తన్మయత్వము. ఏదైనా ఒక విషయం మీద మనస్సును లగ్నం చేసి ఇతర విషయాలపట్ల మనస్సు లాగకుండా ఉండటమే తన్మయత్వము. తన్మయత్వంవల్లనే బంధమోచనమై ముక్తి లభిస్తుంది.
కొన్ని సారోక్తులు
శిష్యుడు: భూమిని సృష్టించటానికి పూర్వం ఎవరున్నారు
గురువు:పంచభూతములు - ఈశ్వరుడు
శిష్యుడు: భూమిని జీవరాశిని ఎవరు సృష్టించారు?
గురువు: ఈశ్వరుడు
శిష్యుడు: సృష్టిని ఎవరు వృద్ధిపరుస్తారు?
గురువు: బ్రహ్మ
శిష్యుడు: బ్రహ్మ ఎవరు?
గురువు: ఈశ్వరుని శక్తి.
శిష్యుడు: సృష్టిని పాలించేది ఎవరు?
గురువు: విష్ణువులేదా నారాయణుడు
శిష్యుడు: విష్ణువు ఎవరు?
గురువు: ఈశ్వరుని శక్తి
శిష్యుడు: సృష్టిని లయము లేదా ధ్వంసము చేసేది ఎవరు?
గురువు: మహేశ్వరుడు- అంటే మహాదేవుడు
శిష్యుడు: మహాదేవుడెవరు?
గురువు: ఈశ్వరుని శక్తి
శిష్యుడు: బ్రహ్మణి ఎవరు?
గురువు:బ్రహ్మ యొక్క శక్తి
శిష్యుడు: లక్ష్మీ ఎవరు?
గురువు: విష్ణువు యొక్క శక్తి
శిష్యుడు: దుర్గ ఎవరు?
గురువు: మహాదేవునిశక్తి
శిష్యుడు సంసార సాగరాన్ని తరింపజేసేది ఎవరు?
గురువు: ఈశ్వరుడు
శిష్యుడు: బంధనమంటే ఏమిటి?
గురువు: విషయానురక్తి
శిష్యుడు: ముక్తి అంటే ఏమిటి?
గురువు: విషయముపట్ల విరక్తి చెంది ఈశ్వరునిలో లీనం కావటం
శిష్యుడు : ఘోరమైన నరకం ఏది?
గురువు: మనశరీరము
శిష్యుడు: స్వర్గం ఎక్కడ ఉన్నది?
గురువు: ఆశలు అంతరిస్తే ఈ భూమియే స్వర్గము
శిష్యుడు: సంసార బంధనం ఎట్లా తొలగిపోతుంది?
గురువు: ఆత్మజ్ఞానమువలన
శిష్యుడు: ఏమి చేస్తే ముక్తి లభిస్తుంది
గురువు: తత్త్వజ్ఞానమువలన
శిష్యుడు: నరకమునకు కారణమేది?

శిష్యుడు:స్వర్గప్రాప్తికి కారణమేమిటి?
గురువు:అహింస
శిష్యుడు:మనిషికి శత్రువు ఎవరు?
గురువు:అతని ఇంద్రియములే.
శిష్యుడు:మనిషికి మిత్రుడు ఎవరు?
గురువు:వశీకృతములైన ఇంద్రియాలు
శిష్యుడు:దరిద్రుడు ఎవరు
గురువు:చాలా లోభి అయినవాడు
శిష్యుడు:ఐశ్వర్యవంతుడు ఎవరు?
గురువు:ఎప్పుడూ సంతుష్టుడుగా ఉండేవాడు.
శిష్యుడు:జీవన్మృతుడు ఎవరు?
గురువు:ప్రయత్నమే చెయ్యని పురుషుడు
శిష్యుడు: మాయ అంటే ఏమిటి?
గురువు:అతి ప్రేమ
శిష్యుడు:మహా అంధుడెవరు?
గురువు:కామాతురుడు
శిష్యుడు:మృత్యువంటే ఏది?
గురువు:అపకీర్తియే మృత్యువు. మనుష్యుడు అమరుడు.
శిష్యుడు: చిరకాలముండే రోగమేది?
గురువు:సంసారము
శిష్యుడు:ఆ రోగమునకు మందేమిటి?
గురువు:నిర్లిప్తుడై ఉండటమే
శిష్యుడు:ప్రధాన తీర్థమేది?
గురువు: పవిత్రమైన మనస్సు
శిష్యుడు:త్యాజ్యమేది?
గురువు:అర్థము - దురాశ
శిష్యుడు: వినదగినదేది?
గురువు:గురుసన్నిధిలో వేదాంతబోధ
శిష్యుడు:బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి ఉపాయమేమిటి?
గురువు:సత్‌సాంగత్యము
శిష్యుడు:సాధువు ఎవరు?
గురువు:మోహము, అనురాగములు లేనివాడు
శిష్యుడు:జీవునికి జ్వరమేది?
గురువు:చింత
శిష్యుడు:మూర్ఖుడెవరు?
గురువు:అవివేకియైనావడు
శిష్యుడు:నాస్తికుడెవరు?
గురువు:ఈశ్వరుని అస్తిత్వమును ఒప్పుకోనివాడు.
శిష్యుడు:పండితుడెవరు?
గురువు:జ్ఞాని
శిష్యుడు:్ధర్మికుడెవరు?
గురువు:యథార్థ పండితుడు
శిష్యుడు: చేయవలసిన పని ఏమిటి?
గురువు:్భగవంతుని పట్ల భక్తి
శిష్యుడు:విద్య అంటే ఏమిటి?
గురువు:బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించేది
శిష్యుడు:లాభమంటే ఏమిటి?
గురువు:బ్రహ్మజ్ఞాన ప్రాప్తి
శిష్యుడు:జగద్విజేత ఎవరు?
గురువు:మనస్సును జయించినవాడు
శిష్యుడు:విషయమంటే ఏది?
గురువు:విషయము
శిష్యుడు:దుఃఖితుడు ఎవరు?
గురువు:వియానురక్తి కలవాడు
శిష్యుడు:సుఖవంతుడు ఎవరు?
గురువు:ఏరకమైన చింతలేనివాడు
శిష్యుడు:్ధన్యుడెవరు?
గురువు:పరోపకారి
శిష్యుడు:పూజనీయుడెవరు?
గురువు:తత్త్వజ్ఞానియైన వ్యక్తి
శిష్యుడు:కర్తవ్యం ఏమిటి?
గురువు:మోహము - పాపము
శిష్యుడు:బుద్ధిమంతుడెవరు?
గురువు:స్ర్తికి వశుడు కానివాడు
శిష్యుడు: ఉత్తమ వ్రతమేది?
గురువు:సత్పాత్రదానము
శిష్యుడు:సంకెల ఏది?
గురువు:స్ర్తిలోలత్వము
శిష్యుడు:లోకులకు తెలియనిది ఏది?
గురువు:స్ర్తి వయస్సు, స్ర్తి చరిత్ర
శిష్యుడు:ఎవరు పశువు?
గురువు:మూర్ఖుడు
శిష్యుడు:ఎవరితో సాంగత్యం చెయ్యకూడదు?
గురువు:మూర్ఖునితో, పాపితో, దుర్మార్గునితో నీచునితో
- ఇంకాఉంది


Read more...

శ్రీరమణాద్భుతం

>> Monday, July 23, 2012




శ్రీ రామచంద్రమూర్తి నామప్రభావం తెలియాలంటే మహేశ్వరుణ్ణి అడగాలి. రామ పాద ప్రభావం తెలుసుకోవాలి అంటే అహల్యను అడగాలి. శ్రీరామ పరాక్రమ ప్రభావం తెలియాలంటే సముద్రుణ్ణి అడగాలి.

ఇంత మందీ శ్రీరామాద్భుతాన్ని అంటే ఆయన అతిమానుష శక్తిని చవిచూసిన వారే. శ్రీకృష్ణ మహిమ తెలుసుకోవాలంటే భాగవతమంతా చదవాలి. దానినిండా పరుచుకున్నదంతా కృష్ణలీలా వైభవమే, మహిమా ప్రదర్శనే, సిద్ధుల నిరూపణే. భగవద్విభూతే.

మహిమ కాదు సహజమే
రాముడిది మాయా మానుషం. విధికి లోబడినట్లుగా సాగిన ప్రయాణం ఆయనది. పైగా రాముడు తనను మానవుడుగానే ప్రకటించుకున్నాడు. ఆయన నెరపిన ధర్మనిష్ఠ ఆయనను దైవంగా నిలిపింది. ఆదర్శమూ, ఆచరణ, ధర్మసంరక్షణ... ఇదంతా శ్రీరామమ్. అహల్యా శాపవిమోచనం, శివధనుర్భంగం, సేతునిర్మాణం రామచరితో అద్భుతాలు. శ్యాముడిదంతా లీలావాహిని. తనను దైవంగా ప్రకటించుకుంటూనే, సర్వజీవుల యందు తానున్నానని చెబుతూ, సమస్తాన్ని ఆయనపరంగా జరిగినవన్నీ మహిమలే అయినా, అద్భుతాలే అయినా, వాటిని అనుగ్రహంగా అనుభవించింది లోకం.

రాముడైనా, కృష్ణుడైనా, రమణులైనా, సత్యసాయి భగవానుడైనా సంకల్పరహితులే. కనుక వారు చూపే మహిమలు ప్రదర్శనగా కాక నిదర్శనగా ఉంటాయి. ఆ చూపటంలోనూ ఉన్నది సాక్షీభూత స్థితే. రోగనివారణ మొదలుగా మాంగల్యధారణ, ఋణవిముక్తి, ఉద్యోగప్రాప్తి, వ్యాపార విజయం వంటి సాధారణ సమస్యలకు గురువు ప్రత్యేకంగా ఏమీ చేయకుండానే పరిష్కారం చూపగలదు. దుఃఖం నివారింపబడగానే బాధితుడు దానినొక మహిమగా భావిస్తాడు. నిజానికి మానవుడికది మహిమ.

సిద్ధపురుషులకు, అవతార మూర్తులకు అది సహజం. ఏకకాలంలో అనేక ప్రదేశాలలో ఉండటం, ఎదురుగా ఉండి అదృశ్యం కావడం, మందులకు లొంగని రోగాలను నివారించడం, రాబోయే విపత్తుల నుంచి రక్షించడం, అనేక దేవీ దేవతా రూపాలుగా దర్శనమివ్వటం, మరణం అంచు నుంచి తప్పించి ప్రాణప్రసాదనం చేయటం, ఆస్తి జానెడై అవసరం బారెడవుతున్న వేళ ఆ స్థితిని సరిదిద్దడం, ప్రమాదపుటంచుల నుంచి తప్పించి ప్రమోద లహరిపై ఆడించడం, వస్తువులు నిండుకుంటున్నప్పుడు కావలసినంత నింపటం, కాలాన్ని స్తంభింపచేయటం, కాలాన్ని పొడిగించడం, దూరదర్శనం, దూరశ్రవణం... ఇవన్నీ జ్ఞానికి సహజశక్తులు. సాధారణ జీవుడికి మాత్రం మహాద్భుతాలు.

ఎవరి ప్రమేయమూ లేదు
"రామచంద్రా! భళా! శివధనస్సును విరిచి లోకాద్భుతం చూపించావు''అన్నది లోకం. "నాకేం తెలియదు. ముట్టుకున్న మరుక్షణం అదే విరిగింది. ఇందులో నాదేమున్నది?'' అన్నాడు మాయామానుషమూర్తి రామచంద్రమూర్తి. పూతన సంహారంతో ప్రారంభమై, మహాపరినిర్వాణం వరకు సాగిన కృష్ణలీలాతరంగిణిలో, అంతా నా వల్లనే జరుగుతున్నదని కృష్ణుడు ప్రకటించిన ఆ నేను, సర్వాత్మభావనకు చెందిన నేను. కనుక ఆయనదీ అకర్తృత్వమే. "భగవాన్! అంతా మీ అనుగ్రహమే. మీ దయే'' అని ఒకరు కృతజ్ఞత ప్రకటించినపుడు. " అది అలా జరగవలసి ఉన్నది.

ఇందులో ఎవరి ప్రమేయమూ లేదు'' అన్న రమణుల అకర్తృత్వము నిజానికి అద్భుతం. "బాబా! కష్టాలలో ఉన్నప్పుడు మీ దర్శనం చేసుకున్నాను. అవన్నీ తీరి ఇప్పుడు ఆనందంగా ఉన్నాను'' అన్నప్పుడు " నీ కష్టం తీరే సమయం, ఇక్కడకు వచ్చిన సమయం కలిసినాయి. నీ కష్టం నీవే అనుభవించావు. నీ ఆనందాన్ని నీవే తెచ్చుకున్నావ్. ఇదంతా కాలచలనంలో భాగమే'' అని సముదాయించిన సత్యసాయి భగవానుడూ కర్తృత్వమెరుగని కారుణ్యమూర్తే. మానవుడి ఊహకు, శక్తికి మించి జరిగేవన్నీ మహిమలుగా, అద్భుతాలుగా అనిపిస్తాయి. కానీ అవి భగవంతుని సహజ లీలలు. "అనుగ్రహమూ గురువే. అది దైవమే'' అన్న రమణ బోధన, శ్రీరమణాద్భుతం.

- వి.యస్.ఆర్. మూర్తి
ఆధ్యాత్మిక శాస్త్రవేత్త

Read more...

ఈ తామసిక పూజలు అవసరమా ? టపాకాయలు కాల్చలేనివారికి తుపాకులు ఇవ్వొచ్చా?

>> Sunday, July 22, 2012

ఈమధ్య కాలంలో  ప్రత్యేకపూజలపేరుతో తమప్రత్యేకతలను  తెలియజేయాలనుకునే పెద్దలచర్యలు వింతగొలుపుతున్నాయి .  ఎండుమిరపకాయలతో  మాగురువుగారు హోమము  చేస్తారు దెబ్బకు సకల సమస్యలు దూరమవుతాయనే   అనే పద్దతిలో వారి వారి శిష్యవర్గాలు, ప్రచారాలు సాగుతుండటం మనస్తాపం కలిగిస్తున్నది. పవిత్రమైన వైదికమార్గంలో పయనించే వారు  ఈరీతి దారి మల్లటం చూస్తుంటే  ఇక నాలాంటీ సామాన్యులు కలి మాయలో పడటమోలెక్కా అనిపిస్తున్నది . 
స్థాయీ బేధాలననుసరించి సోపానమార్గంలో  పరమపదాన్ని పొందటానికి మహర్షులు  వైదిక,పౌరాణిక రహదారులను నిర్మించి ఇచ్చారు. ధర్మరక్షణార్ధం  కొన్ని రహస్యవిద్యలను ఆటంకాలను తొలగించటానికి సూచించి ఉంచారు.అవీ రహస్యాతిరహస్యంగా ఉంచటమే కాక ఇవి భగవన్మార్గానికి ఆటంకమైన విద్యలను హెచ్చరికలు  చేశారు.   సమర్ధత లేనివారి చేజిక్కితే ఈ విద్యలు పిచ్చోడిచేతిలో కత్తిలా తయారవుతాయని వారికి తెలుసు. టపాకాయలు చేతులు కాలకుండాకూడా  పేల్చలేని వారికి బాంబుల నిర్మాణం నిర్మాణం ఇంటర్నెట్లో అందుబాటులో ఉంచితే ఏంజరుగుతుంది ? లోకవినాశనం . ఆవేశపరులు అనర్హులు ఇలాంటి తామసికారాధనలకు దిగకూడదనే వాటిని గుప్తంగా ఉంచిన మహర్షుల అలోచనలకు వ్యతిరేకంగా సామూహికంగా ఇలాంటి పూజలు ప్రయోగాలు తగవనేది నా భిప్రాయం .  నా అభిప్రాయాన్ని బలపరుస్తూ కొందరు పెద్దలు వెలిబుచ్చిన అభిప్రాయాలుకూడా క్రింద ఇస్తున్నాను . చదివి  మమ్చీచెడులు ఆలోచించుకోవాలని మనవి.




నేను ః నాదో చిన్న అనుమానం . ఈ మధ్య ఈ శక్తి మాతకు మిరపకాయలతో పూజ హోమాదులనేవి వింటున్నాను . అసలు మిరపకాయలు మన దేశానికి చెందినవి  కాదుకదా ! మరి శాస్త్రీయత వున్నదా ఈ ప్రక్రియలో   ....తెలిసిన పెద్దలు వివరించగలరు . 

-----------------------------------------------------------------------------------
 శ్రీ మాత్రే నమః...నా పేరు --------- .నేను 2008 నుంచి 2011 వరకు హైదరాబాద్  లో ఉన్న శ్రీ ప్రత్యంగిరా మందిరములో ప్రధాన అర్చకుడిగా ఆ జగన్మాత అనుగ్రహం తో చేశాను. వాళ్ళ  ధనాశ చూసి భక్తులను వాళ్ళు పీడించటం చూసినాకు నచ్చక
బయటికి వచ్చాను.శ్రీ శృంగేరి జగద్గురు పీథ పరంపర లో ఉన్న నేను మన వైదిక విద్యా అనుసారంగా శ్రీ ప్రత్యంగిరా హోమాలు చేయిస్తున్నాను .ఇది నా వ్యక్తిగత పరిచయము.      ఇక
మీరు అడిగిన ప్రశ్నకు వస్తే ,,,,,,,ప్రత్యంగిరా దేవి రాజస గుణముతో ప్రకాశించే శుద్ధ సాత్విక బ్రహ్మ విద్యా స్వరూపిణి.  ఈ దేవతకు <ఉగ్రా >అనే పేరు వున్నది.అనగా తీవ్రమైన కార్యములు చేయునది
అటువంటి దేవతకి క్షార గుణము కలిగిన ద్రవ్యములను సమర్పించాలి.. అటువంటి వాటిలో బ్రహ్మ సృష్టి లోనివి శ్రేష్ట్తమైనవి మిరియాలు ......వీటిలో నల్లవి,,,,,తెల్లవి 2 రకాలు. వీటితో పాటు మనము ఈ కార్యము ఉద్దేశించి  హోమాన్ని ఆచరిస్తున్నామో ఆ కామ్య సంబంధమైన ద్రవ్యములు ఉపయోగించాలి...అంతే కానీ మిర్చి అనగానే ఆ దేవతా పేరు తెలీని భక్తులకు కొత్తగా ,,వెరైటీగా ,,వున్నదని వస్తారు కాబట్టి ఆ దేవతా పేరు చెప్పి వాళ్ళు నిర్వహించే వ్యాపారము అది
-------------------------------------------------------------------------------------------
మరో పెద్దాయన[వీరు శ్రీ విద్యోపాసకులు]

శ్రీ ప్రత్యంగిరా దేవి
ఈ దేవి సింహ ముఖముతో సింహ వాహినియై అతి భయంకరముగా, క్రోధ భయంకర మూర్తియై వుంటుంది. ప్రత్యంగిరా విద్య అనేది త్రిప్పి కొట్టే విద్య. పర ప్రయోగములను త్రిప్పి కొట్టుట కొరకు, శత్రువుల మీద ప్రయోగములు చేయుట కొరకు, భూత, ప్రేత ఇతర అన్ని దుష్ట శక్తులను, మరియు కొన్ని రోగములను పార ద్రోలుటకు దీనిని ప్రయోగించేదరు.  దుష్ట గ్రహ, పిశాచ, రోగ భాధా నివారణ కోరకు ప్రత్యంగిరా హోమము చేయ బడును. సాధనలో గాని, ఉపాసన లోగాని, హోమము లోగానీ చాలా జాగ్రత్తలు తీసుకోన వలెను.సాధన చేసే వాడు తీవ్ర శక్తి గల వాడై వుంటాడు. మరి ఉపాసకుని గురించి చెప్పక్కర లేదు.  సామాన్యులు దీని జోలికి వెల్ల కుండా వుండటము చాలా మంచిది.
ప్రత్యంగిరా సాధన అతి ప్రాచీనమైనది. ఈ దేవత అధర్వణ వేదములో చాలా శక్తి వంతముగా మనకు కనిపిస్తుంది. పిప్పలాద శాఖీయమైన అధర్వ సంహితలో మరియు శౌనక సంహితలో ఈ ప్రత్యంగిరా ఋక్కులు గలవు.           ఏ శత్రువు ఎంతటి ప్రయోగము చేసినా దానిని నివారించటమే గాక తిరిగి వెళ్లి పంపిన వానినే చంపి వేసే లక్షణం ఈ విద్యలో కలదు. తప్పుగా, స్వార్ధముగా అమాయకుల పై ప్రయోగము చేస్తే, ప్రయోగము చేసిన వాడ్నే ఇది మ్రింగి వేయును. ఎవరైతే ప్రయోగము చేసినారో వాళ్ళ కుటుంబమును అంతటిని ఇది సర్వ నాశనము చేయును. నెత్తురు కళ్ళ చూడును. కాబట్టి నా సలహా పిచ్చిగా దీని జోలికి ఎవ్వరూ వెల్ల వద్దు. కొన్ని ప్రతేక సందర్భములో మాత్రమే దీని ప్రయోగము చేయ వలెను. మహావిద్య (వనదుర్గ) పారాయణ చేసే వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. ఇతరులు ఎంత మాత్రము కాదు. ఈమెను పూజించడానికి కూడా ఎంతో అర్హత కావాలి. ఇతర దేవతలను పూజించినట్లు గాదు ఈ దేవత పూజ. దీనికి గాను ప్రత్యేకమైన కల్పము కూడా వున్నది. ఏమాత్రము అశౌచము వున్నా ఈమె తన దగ్గరకు రానీయదు. అసలు ఈ దేవాలయములోనికి నేరుగా ఎవ్వరినీ చూడనివ్వరు. దూరముగా కిటికీలో నుంచి చూడ నిస్తారు. ఆమె ఉగ్ర స్వరూపమును చూచి తట్టుకో లేరని.
పర మంత్ర, పర యంత్ర, పర తంత్ర, పర కృత్యాది, సర్వ దుష్ట గ్రహ సర్వామయ నివృత్తి కొరకు, ప్రతికూల౦ నివృత్తి కొరకు ప్రత్యంగిరా ఋక్పారాయణము, జపము, హోమము చేయుట శాస్త్ర వచనము. ఇందులో హోమ ద్రవ్యములుగా కారపు దినుసులు వాడటము ప్రత్యేకత. కొన్ని చోట్ల మిరప కాయలు, మిరియాలు, ఉల్లిపాయలు వేయడము నేను చూచినాను.
భాగవతంలో కాశీ రాజు శ్రీకృష్ణుని మీద అభిచారిక హోమము చేయించి, కృత్యను ప్రయోగిస్తాడు. అలాగే మహాభారతంలో దుర్యోధనుడు అభిచారిక హోమము చేయించి, పాండవుల మీదకు మంత్ర ప్రయోగముతో కృత్యను పంపుతాడు. ఇలా చాలా చోట్ల ఈ ప్రయోగములు వున్నవి. ఇంతకు ముందు ఇది ఎక్కువగా తమిళనాడులో వున్నది. ఈ దేవి యొక్క దేవాలయాలు, పూజలు, యజ్ఞాలు ద్రవిడ దేశములో వున్నవి. ఇప్పడు మన దేశము (ఆంధ్ర) లో కూడా వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. ఈర్ష్యా ద్వేషములతో, అసూయలతో ఒకరి కొకరు ఈ మంత్రముతో ప్రయోగించుకొంటే ఏమౌతుంది? మారణాయుధాలు అందరి చేతిలో పడితే ఏ విధ్వంశమునకు దారి తీయునో ఈ సృష్టి, ఈ ప్రకృతి ఏ మగునో అని నాకు దిగులుగా వున్నది.
ఆత్మ రక్షా మంత్రములుగా దీనిని ఉపాసించ వచ్చును. ప్రత్యంగిరా సాధనలో దీనికి ప్రత్యేక యంత్రము, మంత్రము, తంత్రము విడిగా వున్నవి. శ్రీ ప్రత్యంగిరా కవచము కూడా వున్నది. ఉపాసకులు దీనిని రోజూ పఠించ వచ్చును.  ఆత్మశక్తి కొరకు, ఆత్మ రక్షణార్ధం ప్రత్యంగిరా ఋక్పారాయణము చేయుట సాధకులకు మంచిది.
సుదర్శనాస్త్ర మంత్ర సంపుటిత మైన ప్రత్యంగిరా మరియు నారాయణీ ప్రత్యంగిరా విశేష ప్రభావము గలవి.
విశ్వ శాంతి కొరకు వీటిని ఉపయోగిస్తాము. ఆపదలో వున్న వారిని రక్షించే నిమిత్తమై వీటిని ఉపయోగిస్తాము.
ఓం శాంతి:  శాంతి:  శాంతి:
మీ
------

-------------------------------------------------------------------------------------------
 దుర్గేశ్వర [నేను]


ధన్యవాదములు. నాకున్న అనుమానాలు పెద్దలద్వారా నిరూపించబడ్డాయి. ఇక ప్రత్యంగిరా హోమాలు పూజలు అంటూ టీవీలలో ఊదరగొడుతూ చెస్తున్న పనులేమిటి ? దీని ప్రయోజనమేమిటి .టపాకాయలు కాల్చటం కూడా చేతకానివాల్లకు తుపాకులిస్తే ఏమవుతుంది? పేరు తెచ్చుకోవాలనో ,ధనాశో,కీర్తికాంక్షయో తెలియదుగాని తామసిక పూజలకు  దిగుతున్న వైదికవిద్యావేత్తల ఆలోచనారాహిత్యం ఎంత ప్రమాదాలకు దారితీస్తుందో కదా ? ఎన్ని జీవితాలను అథఃపాతాళానికి త్రొక్కుతున్నారోకదా ?

తక్కువేమి మనకూ రాముడు ఒక్కడుండు వరకూ అని ...పెద్దలు చెప్పినమాట మనకు శ్రేయోదాయకము కదా >
------------------------------------------------------------------------



పెద్దాయన ః

 ఒక కత్తి చేతిలో వుంటే మామిడి పండ్లు కోసుకోవచ్చు లేదా ఎవరినైనా చంపనూ వచ్చు. ఎవరి బుద్ది ప్రకారము వారు చేస్తూ వుంటారు.
అలాగే అభిచారిక మంత్రములను త్రిప్పి కొట్టి మనలను మన శత్రువుల నుంచి రక్షించే దానికి ఈ ప్రత్యంగిర మంత్రములను ఉపయోగిస్తారు. ఎవరన్నా ఒకరి మీద ప్రయోగము చేసినారనుకోండి, వారి ప్రయోగమును దీనితో ఉప స౦హరించ వచ్చును. మంచి కొరకు దీనిని వాడ వచ్చును.
అయితే శత్రువులు ఎవరు అనేది ఆలోచించాలి. నీకు శత్రువు ఇంకొకరికి మిత్రుడు. కానీ నీకు మాత్రమే అతడు శత్రువు. లోకానికి కాదు గదా.
లోక కంటకుడైనప్పుడు సుదర్శన చక్రం ప్రయోగించాలి.
 కొన్ని రోగాలకు, జబ్బులకు పాషాణం లాంటి విష పదార్దములతో కూడిన మందులు వాడుతారు. అది తెలుసుకోకుండా సామాన్యులు ఆ మందులు వాడితే చనిపోతారు.
అలాగే కొన్ని పర ప్రయోగాలకు , భూత, ప్రేతములను, వశీకరణ శక్తులను పారద్రోల డానికి, కొన్ని దీర్గకాలిక మొండి జబ్బులను నయం చేయడానికి ఈ ప్రత్యంగిర మంత్ర ప్రయోగము చేస్తారు. ఒక్కోసారి ఎదుటి వాళ్ళను ఓడించడానికి, శత్రువులను సంహరించడానికి కూడా ఈ ప్రయోగము చేస్తారు. కొంత మంది రాజకీయ నాయకులు కూడా ఇలా చేయించిన దాఖలాలు వున్నాయి.
అయితే మన లాంటి వాళ్ళకు ఇది అక్కర లేదు. హాయిగా మన హనుమంతుడు వున్నాడు, మన దుర్గా దేవి వున్నది, మన నారసింహుడు వున్నాడు. వీళ్ళను పూజిస్తే మనకు తగిలిన రోగాలు, గాలి, దూలి తొలగి పోతాయి. వీటిల్ని మించి పోవడము అనవసరము.
కొన్ని ప్రత్యక మైన సందర్భంలో మాత్రమే ఈ ప్రయోగములను చేయ వలెను. అందరికీ పల్లేదు. మంచిది కాదు. ఇలా సామూహికంగా చేయడం మంచిది కాదు.
కొన్ని ప్రయోగాలను దూరంగా అడవులలో చేయ వలెను.
 

Read more...

శ్రావణమాస పూజలకు గోత్రనామాలు పంపండి

>> Friday, July 20, 2012

పరమశుభకరమైన "శ్రావణమాస" మున చేయు పూజలు శ్రీమన్మహాలక్ష్మీ మాతకు అత్యంత ప్రీతిపాత్రము. ఎల్లగృహములలో ఆతల్లి కరుణవలన సిరిసంపదలు ,అష్టైశ్వర్యములు వర్షిస్తూ ఉంటాయి . అమ్మలగన్న ఆయమ్మ అనుగ్రహం కోరుతూ లోకం అంతా ఈ మాసంలో  తల్లిని వివిధరూపాలుగా ఉపాసిస్తూఉంటారు.

  లోక శ్రేయస్సుకోరుతూ "శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం" భక్తజనుల తరపున  అమ్మకు  ఈ మాసమంతా వివిధ పూజాధికములను ,అర్చనలను నిర్వహిస్తున్నది . పీఠంలో కొలువైన అమ్మకు అలంకారములు అభిషేక,అర్చనలు జరిపించుకోవాలనుకునేవారు చేయవలసినది కేవలం గోత్రనామాలను పంపటమే . మీగోత్రనామాలను కుటుంబ సభ్యులపేర్లను  మెయిల్ లేదా ఫోన్ ద్వారా తెలియపరచండి చాలు . పూజలలో మీగోత్రనామాలతో సంకల్పం చెప్పబడుతుంది. దీనికోసం ఎవరికీ ఏమీ చెల్లించనవసరం లేదు. కానీ మీ గృహంలో దీపారాధన చేసుకుని ,శుక్ర,మంగళవారములలోనైనా కొద్దిగా "పాలు" అమ్మకు నివేదించి ప్రసాదంగా స్వీకరించండి. మీకు వీలైతే వారానికొకరిద్దరు ఆకొన్నవారికి ప్రేమపూర్వకంగా అన్నంపెట్టించండి .చాలు .అమ్మ కరుణ అపారంగా వర్షిస్తుంది మీపై.

 గోత్రనామాలు పంపవలసిన చిరునామా

durgeswara@gmail.com
9948235641.

Read more...

అరుణాచలంలో అవధూత శేషాద్రిస్వామి

>> Thursday, July 19, 2012


శేషాద్రిస్వామి వం శీకుల చరిత్ర అత్యంత పావనమైనది. ఆదిశంకరులు శ్రీవిద్యాపాసకులైన 30 కుటుంబాలను నర్మదా తీరం నుంచి కాంచీపురానికి పిలుచుకుని వచ్చారు. వీరు ్‌కామకోటి* వారుగా ప్రసిద్ధులైనారు. వీరు కంచి వరదరాజస్వామి అర్చకులై మడిమాన్యాలతో సంపన్నులుగా జీవనం సాగిస్తున్నారు. కొంత కాలానికి వైష్ణముచితమైన తప్తముద్రాంకితులైతే గాని అర్చకులుగా ఉండటానికి అర్హులు కారనే నిబంధన విధించారు. కామకోటి కుటుంబీకులు తప్తముద్రాంకితం తమకు సమ్మతం కాదన్నారు. ఫలితంగా మాన్యాలను కోల్పోయారు. శేషాద్రిస్వామి తల్లి మరకతం చిన్న వయసులోనే పంచకావ్యాలు నేర్చుకున్నది.

తండ్రి వరదరాజు శ్రీవిద్యోపాసకులు. లేకలేక వారికి 1870 జనవరి 22న కామాక్షి అమ్మవారి వరప్రసాదంగా శేషాద్రి జన్మించాడు. శేషాద్రికి మూడవ ఏటనే మూక పంచశతి శ్లోకాలు కొన్ని నేర్పారు. బాలశేషాద్రి తండ్రి చెంతనే పీట వేసుకుని పూజా గృహంలో తదేక దృష్టితో దైవస్తుతి చేస్తూ ఉంటే తల్లిదండ్రులు మురిసిపోయేవారు. ఎనిమిదవ ఏట శేషాద్రికి అక్షరాభ్యాసం జరిగింది. బడిలో శేషాద్రికి ఒక నెలలోనే అమరకోశం కంఠస్థమయింది. 3 సంవత్సరాలలో పంచకావ్యాలతో పాటు తమిళ గ్రంథాలు అవలీలగా నేర్చాడు. 8వ ఏట ఉపనయనం అయిన తర్వాత శేషాద్రి తర్క వ్యాకరణాదులతోపాటు ప్రస్థాన త్రయం నేర్చుకున్నాడు. వేద పాఠశాలలో చేరి వేదాధ్యయనంతోపాటు న్యాయశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు. దురదృష్టవశాత్తు శేషాద్రి 14వ ఏట తండ్రి మరణించాడు. తల్లి మరకతంబకు అవసాన కాలం సమీపించింది. అరుణాచల స్మరణతో శరీరం చాలించింది.

అరుణాచలేశ్వరుణ్ణి వెతుక్కుంటూ.. శేషాద్రికి అంత్య కాలంలో తల్లి స్మరించిన అరుణాచలమే పదేపదే స్ఫురించసాగింది. పంచ శిఖరములగు అరుణాచలేశ్వరుని ఊహించుకుని చిత్రాన్ని చిత్రించాడు. ఆ పటాన్ని పూజలో పెట్టుకుని పంచాక్షరి జపం చేయసాగాడు. నిరాహారియై దినములు గడుపుతున్న శేషాద్రిని పెద్దలు కట్టడి చేయగా అతడు రుద్రభూమి చేరాడు. ఒకనాడు ఒక గౌడ సన్యాసి కోవెలలో ఉండగా శేషాద్రి ఆయన దర్శనం చేసుకున్నాడు.

ఆయన పేరు బాలాజీ స్వామి. హరిద్వారం నుండి రామేశ్వరం పోతూ కంచిలో ఆగాడు. స్వామి శేషాద్రికి సన్యాస దీక్ష ఇచ్చి దేవీ మంత్రాన్ని ఉపదేశించాడు. శేషాద్రి తీవ్ర సాధన చేశాడు. 1882 నాటికి శేషాద్రి తిరువణ్ణామలై చేరాడు. అవధూత లక్షణాలతో అక్కడ సంచరించాడు.

రమణులతో సహవాసం ఏదైనా అంగడిలో ప్రవేశించి శేషాద్రి అందులోని వస్తువులను చెల్లాచెదురు చేస్తే వ్యాపారం లో యజమానికి విశేష లాభం వచ్చేది. ఏ అధికారినైనా దండిస్తే వానికి పదోన్నతి లభించేది. 1886లో అరుణాచలంలోని పాతాళలింగ గంగలో ధ్యానమగ్నుడై ఉన్న బ్రాహ్మణస్వామి(రమణ మహర్షి)ని ఆకతాయిలు పీడించగా శేషాద్రి ఆయనను కాపాడాడు. భగవాన్ విరూపాక్షలో ఉన్న కాలంలో తరచు శేషాద్రి అక్కడికి వెళ్లేవాడు. అరుణాచలవాసులకు రమణ శేషాద్రిలు సూర్యచంద్రులు.
రమణులు స్థిరంగా ఒకచోట ఉంటే శేషాద్రి ఎక్కడెక్కడో సంచరించేవాడు. భగవాన్ మౌనంగా ఉంటే శేషాద్రి అధికంగా మాట్లాడేవాడు. శేషాద్రిస్వామి 40 సంవత్సరాలు అరుణాచలంలో వాసం చేసి భక్తులెందరికో ధర్మమార్గాన్ని ఉద్బోధించారు. స్వల్ప అనారోగ్యంతో 1929లో తనువు చాలించారు. భగవాన్ రమణులు శేషాద్రి పార్థివ శరీరాన్ని సమాధిలో చేర్చేటంత వరకు కొన్ని గంటల పాటు సన్నిధిలో ఉండి పర్యవేక్షించారు. శ్రీ రమణాశ్రమం ఆనుకునే ఉండే శేషాద్రిస్వామి ఆశ్రమం తిరువణ్ణామలై యాత్రికులకు సందర్శనీయం.

- రావినూతల శ్రీరాములు

Read more...

ఇక్కడ డబ్బులు సమర్పించటానికి కూడా జనం తొక్కిసలాడుతున్నారెందుకు ?

>> Wednesday, July 18, 2012

స్వామి వారి అనుగ్రహం వలన వారి కరుణాపూరిత అనుమతి వలన మొన్న తిరుమల వెళ్ళి శ్రీవారి దర్శనంచేసుకున్నాను.  హనుమత్ రక్షాయాగం పూర్ణాహుతి కాగానే వెళ్లవలసినది ఆలస్యమైనది.  ఇకా ఆలస్యం చేస్తే వడ్డీ పెరిగే ప్రమాదముందికనుక హఠాత్తుగా బయలుదేరాను. ఇక నాకొక తోక ఉందికదా ,,నా భార్య  తానూ వస్తానని బయలుదేరినది . వారంరోజులక్రితం పాత్రలు తోముకుని ఎత్తుకునీ వస్తూ జారిపడి తీవ్రమైన కాలి నొప్పితో బాధపడుతూ ఉంది. కానీ మొండిగా స్వామి దర్శనానికి  రావాల్సినదేనని పట్టుబట్టింది, తీసుకెళ్లకతప్పలేదు ... నీకక్కడ నడిస్తేగాని  తెలియదు అని వెంటతీసుకుని బయలుదేరాను .   రెండవశనివారం ఆదివారం కావటం వలన భక్తులు పోటెత్తి ఉన్నారు  ,ముప్పైరెండు గదులలో వేచిఉన్నారు ,ఇప్పుడెందుకు ఇబ్బంది పడతారు అని మా తమ్ముడు వారించినా  మెండిగా వెళ్లాము . శనివారం రాత్రికి  తిరుపతి కి చేరుకుని శ్రీనివాసం డార్మెటరీలో విశ్రాంతి తీసుకుని ఆదివారం ఉదయాన్నే సుదర్శనం టిక్కట్లు తీసుకుని పైకి వెళ్లాము . ఆరాత్రికే మా చిన్నబ్బాయికూడా వచ్చి మాతో కలశాడు .   నాతో ప్రయణమంటే  కఠినంగా నియమాలుంటాయి . కాళ్లకు చెప్పులతో కొండ ఎక్కను .  నొప్పితోబాధపడుతున్న కాలు ఈడ్చుకుంటూనే మా ఆవిడ చెప్పులులేకుండా నడుస్తున్నది.  ఇక్కడ సుదర్శనం కౌంటర్లో  మూడుగంటలు నిలబడ్డాము పైన బసచేసిన మాధవం డార్మెటరీనుంచి  నడక మరలా దర్శనానికి క్యూలో మరో మూడుగంటలు నిలబడ్డా ఆవిడభక్తిముందు బాధ ఓడిపోయింది . ఇకదర్శనం చేసుకుని యోగనారసింహుని సన్నిధిలో కూర్చుని స్వామి వారి హుండిలో ముడుపులు చెల్లించమని మా అబ్బాయిని పంపాము. దర్శనంకోసం అంతసేపు వేచిఉన్నజనం హుండీలో డబ్బు సమర్పించడానికి ఎగబడి తొక్కిసలాడుకుంటున్నారు .  జనం డబ్బు ఎగగొట్టటానికి వందమార్గాలు వెతికే ఈరోజులలో    నీకు డబ్బు  చెల్లించటానికి  ఇంతలా తొక్కిసలాటలో తొదరపడుతున్నారెందుకు స్వామీ ? అని అశ్చర్యం పెరిగిపోతున్నది మనసులో . ఏమిటీ  చిత్రం ? నువ్వేమి చూడొచ్చావా  ! అని ఒక్కడు కూడా తప్పుకుపోవటం లేదు . ఎంత భయభక్తులతో   నీకు చెల్లించుకుంటూన్నారు కానుకలు ?  అని ఆలోచిస్తూ స్వామిని స్మరిస్తున్నాను . మొన్న విన్న శ్రీచాగంటిగారి ప్రసంగం గుర్తుకువచ్చి మనసు సంతోషంతో సమాధానపడింది . ఆప్రసంగం  ఇక్కడ వినండి
 http://thegoldenwords.blogspot.com/2012/07/blog-post_02.html


బయటకు వచ్చి మరలా బసకు రాగనే అప్పటిదాకా లేని కాలినొప్పి అప్పుడు మరలా  బాధపెట్టడం మొదలెట్టింది మా ఆవిడకు . నిజమే కర్మఫలితాలను ఎలా తొలగిస్తావో ప్రత్యక్షప్రమాణం గా చూపుతున్నావు కదా స్వామీ ! మాకు అనుకుని నమస్కరించుకుని బయలుదేరాము , చెప్పటం మరచాను  ఆదివారం ఉదయాన్నే అమ్మ అలమేలు మంగమ్మ సన్నిధానానికి వెళ్లి అక్కడ జరుగుతున్న శ్రీవారి కళ్యాణం కూడా చూసి బయటకు రాగానే ఎంతైనా అమ్మకదా ! బిడ్డల ఆకలి చూస్తుంది అన్నదానికి నిదర్శనంగా అన్నప్రసాదవితరణ టిక్కట్లు చేతిలో పెట్టించింది పిలచిమరీ .

ఆతరువాత సోమవారంరోజు  ఉదయాన్నే ఇక ఇంటికెళదామా అని మాట్లాడుకుంటూ తలెత్తిచూడగానే  అక్కడ డార్మెటరీలో టీవీలో  పరమశివుని దర్శనం అయింది [సౌండ్ వినిపించటంలేదు అక్కడ గోలకు] ఓహో ! ఇది అయ్యవారి  పిలుపా ? అనుకుని శ్రీకాళహస్తివెళ్ళి స్వామిని  దర్శించుకున్నాము   . అమ్మ సన్నిధానంలో ఒక అరగంటపాటు ఒకపక్కగా   చేతులు జోడించి నిలబడి లలితాసహస్రనామాలతో ప్రార్ధనచేసే సరికి ఎవరో వీఐపీల కు ప్రత్యేకంగా ఇచ్చిన అమ్మవారి ప్రసాదం కొద్దిగా తెచ్చి దోసిట్లో పెట్టారు . మధురమైన అమ్మ ప్రేమ ను తలచుకు పులకితులమవుతూ తిరుగు ప్రయాణమయ్యాము
 గోవిందాశ్రిత....గోకులబృందా... పావన జయజయ పరమానందా.......



Read more...

ఆధ్యాత్మికతే తరుణోపాయం

>> Tuesday, July 17, 2012

ఆధ్యాత్మికతే తరుణోపాయం

భారత కులవ్యవస్థ 'వర్ణాశ్రమ ధర్మం'పై ఏర్పడింది. దీనిలో నాలుగు ప్రాథమిక కులాలు ఉన్నాయి. అందులో ఒకటి శూద్ర కులం. వీరు దాసవృత్తుల్లో ఉండేవారు. వైశ్యులు వ్యాపార, వాణిజ్య వ్యవహారాలు నిర్వహించేవారు. క్షత్రియులు ప్రజారక్షణ, సామాజిక, దేశ పరిపాలన బాధ్యతలు నిర్వర్తించేవారు. బ్రాహ్మణులు విద్యావిషయ సంబంధిత బాధ్యతలు, ఆధ్యాత్మిక ప్రక్రియకు సంబంధించిన బాధ్యతలు చూసేవారు. బ్రహ్మ స్వరూపులమని తెలుసుకున్నవారే బ్రాహ్మణులు.

బాధ్యత యొక్క ఉత్తమోత్తమ భావనను, అందులోని అపరిమిత భావనను గ్రహించిన వాడే బ్రాహ్మణుడు. అపరిమిత బాధ్యతను గుర్తించిన వ్యక్తే విద్య, మత సంబంధిత విషయాలకు ప్రాధాన్యత వహించగలరు. ఎందుకంటే ఆ రెండు అంశాలూ ఏ సమాజానికైనా అతి ముఖ్యమైన అంశాలు. ఈ విధంగా కులవ్యవస్థ రూపొందింది. ఆ కాలానికి ఇది చక్కని ఏర్పాటు. కాలక్రమేణ వ్యక్తి బ్రాహ్మణత్వాన్ని సమర్థతను బట్టి గాక పుట్టుకను బట్టి నిర్ణయించడం మొదలుపెట్టాడు.

దాంతోనే సమస్యలు మొదలయ్యాయి. ప్రతి వ్యవస్థలోనూ ఇంతే. ఏ వ్యవస్థను మనం సృష్టించినా అది దోషరహితంగా ఉండేలా బాగా పనిచేసేలా మనం నిరంతరం దానిపై కసరత్తు చేస్తూ ఉండాలి. లేదంటే ప్రారంభంలో ఎంత చక్కగా ఉన్న వ్యవస్థ అయినా క్రమంగా దోపిడీకి ఆధారంగా మారుతుంది. కాలక్రమంలో మానవ సమాజాలు సమాజంలో ఉండే ప్రతి వ్యత్యాసాన్నీ వివక్షగా మార్చే ప్రయత్నం చేశాయి. వ్యత్యాసాలుంటే ఫర్వాలేదు. ఈ ప్రపంచం వైవిధ్యంగానే ఉంటుంది. ప్రపంచం వైవిధ్యంగా ఉంటేనే బాగుంటుంది. కానీ మనం ప్రతి వ్యత్యాసాన్నీ వివక్షగా మార్చడానికి ప్రయత్నిస్తాం. అది జాతి కావచ్చు.

మతం కావచ్చు. లింగభేదం కావచ్చు..దేన్నయినా వివక్షగా మార్చేస్తాము. ఇలా మన విచక్షణ కోల్పోయి ప్రతిదాన్నీ వివక్షాపూరితంగా మార్చడం మొదలుపెట్టినప్పుడే కుల వ్యవస్థ వికృతి వ్యవస్థగా అవతరించింది. ఒకప్పుడు సమాజంలో నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా ఉన్న మార్గం దురదృష్టవశాత్తు వివక్షాపూరితంగా, ప్రతికూలంగా, పనికిమాలినదిగా తయారయింది.

ఇల్లే శిక్షణ కేంద్రం ఐఐటీలు, ఐటీఐలు, వేరే ఏ శిక్షణా కేంద్రాలు లేనపుడు కుటుంబమొక్కటే శిక్షణ ఇవ్వడానికి మార్గం. ప్రత్యేకించి ఎటువంటి శిక్షణ కేంద్రాలు లేని అటువంటి రోజుల్లో కమ్మరి సంస్కృతిని, స్వర్ణకార సంస్కృతిని, చర్మకార సంస్కృతిని కొనసాగించడం చాలా ముఖ్యం అయింది. లేదంటే ఎటువంటి నైపుణ్యాలు ఉండేవి కావు. సమర్థతను బట్టి గాక ప్రత్యేకించి ఏ వృత్తికీ క్రమబద్ధమైన శిక్షణ కేంద్రాలు లేని సమయంలో ఈ మొత్తం కుల వ్యవస్థ ఏర్పడింది. తండ్రి కమ్మరి అయితే కొడుకూ కమ్మరి అయ్యాడు. తండ్రి కంసాలి అయితే కొడుకూ కంసాలి అయ్యాడు. ఈ విధంగా ప్రతి వృత్తికి సంబంధించిన శిక్షణ కేంద్రాలు ఆ కుటుంబ వ్యవస్థలోనే ఏర్పడ్డాయి. ఎందుకంటే ప్రత్యేకించి వేరే శిక్షణ కేంద్రాలు లేవు కాబట్టి. సమాజంలోని అన్ని చేతి వృత్తులు, వృత్తి నైపుణ్యం ఇలాగే వృద్ధి చెందాయి.

ఒక వ్యక్తి కమ్మరి అయి ఉంటే కమ్మరి పని మాత్రమే చేసేవాడు. స్వర్ణకార వృత్తికి ప్రయత్నించేవాడు కాదు. ఎందుకంటే సమాజానికి కమ్మరి అవసరం ఉండేది. జనాభా పెరిగి, వెయ్యి మంది కమ్మరులు అయినప్పుడు సహజంగానే వారికంటూ ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి. వారిదైన వివాహపు ఆచారాలు ఏర్పడతాయి. వారిదైన జీవనశైలి ఏర్పడుతుంది. ఆ విధంగా వారొక కులంగా ఆవిర్భవించారు. ఒక విధంగా చూస్తే ఈ రకమైన ఏర్పాటులో ఎటువంటి తప్పూ లేదు. అది కేవలం సమాజం వెసులుబాటు కోసం ఓ ప్రత్యేక ఏర్పాటు మాత్రమే. ఉపయోగించే సుత్తి, చేసే పని, ధరించే దుస్తుల దగ్గర్నుంచి తినే తిండి వరకు ప్రతి విషయంలోనూ సహజంగానే కమ్మరికి, కంసాలికి మధ్య తేడా ఉంటుంది. ఎందుకంటే వారి పనులు భిన్నం కాబట్టి.

కులం పేరిట దోపిడీ కాలక్రమేణా ఈ కులవ్యవస్థ దోపిడీకి సాధనంగా అవతరించింది. దేవాలయాన్ని నిర్వహించే వ్యక్తి, పాఠశాలను నడిపే వ్యక్తి కన్నా మెరుగు అని మనం అనడం మొదలుపెట్టాము. కమ్మరి దుకాణం నడిపే వ్యక్తి కన్నా పాఠశాల నడిపే వ్యక్తి మిన్న అని అంటున్నాము. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఈ తేడాలుంటాయి. కాలక్రమేణా ఈ తేడాలను వివక్షగా మార్చేశాము. పనిలో భేదాలను భేదాలుగా మాత్రమే ఉంచగలిగినట్లయితే మన సంస్కృతి చక్కగా, వైవిధ్యంగా ఉండేది. కానీ మనం దాన్ని వివక్షాపూరితంగా మార్చేశాం. మనుషులు ప్రతి భేదాన్నీ వివక్షగా మార్చేస్తారు. ఎందుకంటే ప్రతి మనిషీ ఇప్పుడు తానున్న స్థితి కంటే ఇంకా కొంచెం మెరుగ్గా ఉండాలని తీవ్రంగా కాంక్షిస్తాడు. ఇందుకోసం అతడు కనిపెట్టిన ఒక దురదృష్టకర మార్గం పక్కనున్న వ్యక్తిని అణిచివేయడం.

నిజానికి మనిషి కాంక్ష ఇంకా మెరుగ్గా ఉండాలని. కానీ అతనికి తనను తాను ఎలా వృద్ధి చేసుకోవాలో తెలియదు. అందువల్ల మరొకరిని తక్కువ చేసి చూడడం అతనికి ఉత్తమ మనిపిస్తుంది. అది అపరిపక్వపు బుద్ధి. కానీ మనం చాలా కాలంగా ఇలాగే వ్యవహరించాము. ఇలాగే వ్యవహరిస్తున్నాము. దాన్ని మార్చాల్సిన తరుణమిదే. కానీ పాత కులవ్యవస్థను తొలగించినంత మాత్రాన మార్పు రాదు. ఎందుకంటే అది వేల విధాలుగా రూపాంతరం చెందుతుంది.

ఉదాహరణకు న్యూయార్క్ నగరంలో కులవ్యవస్థ లేదనుకుంటున్నారా? విద్యాపరంగానో, ఆర్థిక సామర్థ్యం ఆధారంగానో మరో రకమైన కులవ్యవస్థ అక్కడ ఉంది. కాబట్టి మనిషి ఆలోచనలో విప్లవాత్మక మార్పు తీసుకురానంత వరకు మార్పు రాదు. వ్యక్తిగతంగా ఎవరిలోనూ కలుపుకునే భావన లేకపోతే వారు సృష్టించిన వ్యవస్థలు, వారు చేసే పనులు కలుపుగోలుతనానికి దారి తీయవు. వ్యక్తిగతంగా ఎవరూ ఈ కలుపుగోలుతనాన్ని అనుభూతి చెందకపోతే వారు పరిమిత విధానాలను సృష్టించడంతోనే ఆగిపోతారు. ఆధ్యాత్మిక ప్రక్రియలో ఇమిడి ఉన్న ప్రాథమిక అంశం ఏమిటంటే, అది వ్యక్తిని పూర్తి సంఘటిత మానవుడిగా మారుస్తుంది. అదే ఆ వ్యక్తిని మరింత సమర్థుడిగా, మరింత యోగ్యుడిగా, మరింత సమతుల్యంగా దాని ద్వారా అతనిని మరింత ఫలవంతునిగా తీర్చిదిద్దుతుంది.

Read more...

భగవాన్‌తో భాగవతుడు




భక్తుడు, భగవంతుని కీర్తనలో మనోనర్తనం చేస్తాడు. స్వానందుడై ఉన్మత్త స్థితికి చేరుకుని, అక్కడే నిలకడ చెంది, ఒక స్థితిలో కైవల్యానందం సిద్ధించుకుని, ఏదో ఒకనాడు ఏమీ అక్కరలేని నికామస్థితిలో సంస్థితుడౌతాడు. శ్రీకైవల్య పదం కోరి పోతన భాగవతాన్ని ఆంధ్రీకరించినా, జగద్ధితం కోరి నన్నయాదులు భారతాన్ని తెలుగు చేసినా లక్ష్యం ఒక్కటే! అది భగవంతుని అనుగ్రహం పొందటమే. జాతికి సంస్కృతిని, సంస్కారాన్ని, భావ సంపదను, భాషా వైదుష్యాన్ని వరదానం చేసిన వీరందరూ సద్భక్తులే.

వీరిలో ఏ ఒక్కరూ నేల విడిచి సాముచేయరు. లోకమును వీడి రసం లేదంటారు. వారి నుంచి వెలువడే ప్రతి అక్షరమూ స్వాదువుగా, సాధువుగా, మధువుగా పారుతుంది. పరవశమై పల్లవిస్తుంది. పరదైవం వైపు మనసును మళ్ళిస్తుంది.భాగవతుడు, భగవంతుడు ఏకమయ్యే మహాయోగాన్ని కల్పిస్తుంది. ఈ కోవకుచెందినవాడే, మహర్షితో మమేకమైన మురుగనార్, ఒక మహాభక్తుడు.

అరుణాచలం అన్న ఒక్కమాట ఎట్లాగైతే రమణులను తిరువణ్ణామలై వైపు నడిపించిందో , 'అరుణాచలపంచకం' మురుడనార్‌కి పరముక్తి ఫలాన్ని అనుగ్రహించే అరుణాచల రమణులవైపు నడిపించడం యాదృచ్ఛికం కాదు. పుస్తకం మస్తకాన్ని ప్రభావితం చేయడం ఒక అపురూప సన్నివేశం. సహజంగానే తమిళా భాషాభిమానం, భాషా ప్రావీణ్యం, కవితావేశం, అభివ్యక్తి, హృదయంగమస్థితి ఉన్న మురుగనార్, తమ ప్రథమ దర్శనంలోనే కమనీయ కవితాత్మక భావాన్ని ప్రకటించిన తీరు ఆయన మనోస్థితికి దర్పణం.

"రెప్పలార్పటమెరుగని, తన రెండు దివ్యనేత్రాంచలాలలోంచి ప్రసరించిన దివ్యకాంతి, నన్ను నా జీవితాన్ని కైవసం చేసుకన్నాయి''. ఈ బావమే మురుగనార్ చిరస్మరణీయ భక్తుడిగా కడదాకా నడిపించింది. మురుగనార్ తను ఏది రాసినా భగవాన్‌కి చూపటం ఒక నిత్యసాధనమైతే, కర్మాతీతులైన రముణులు దానిని సరిద్దిడం, మెరుగులు అద్దండం, అవసరమైన చోట్ల స్యయంగా రచించి, ఆ రచనకు శాశ్వతత్వాన్ని ఇవ్వడం భగవాన్ అనుగ్రహం.

రాసింది రాయకుండా ముప్ఫైవేల ముఖాలుగల మహర్షిదివ్యతాన్ని, సౌందర్యాన్ని, విశిష్టతను వేనోళ్ల కీర్తించడం మురుగనార్ భక్తి పారమ్యానికి పరాకాష్ట. 'ఉపదేశసారం' వంటిమహోత్కృష్ట రమణ బోదలోకానికి అందటానికి కారణం మురుగనార్. రమణనామం చెవి సోకినంతనే శరీర పులకలు తేలినా, రమణ తలపు మనసున మొలవగానే కనులలో ఆనందాశ్రువులు. పొంగి పొరలినా, రమణరూపం కళ్లెదుట కనిపించగానే మాటలెరుగని మౌనం ముంచెత్తినా... ఆ అనుభవం, అనుభూతి మురుగనార్ సొంతం.

అకర్తృత్వమే నిజమైన త్యాగమని, గురుభక్తే సర్వశక్తియని, శరణాగతిని మించిన వినయపూర్వక సమర్పణలేని స్థిరంగా నమ్మి ఆచరించిన సద్భక్తుడు మురుగనార్. అసంఖ్యాక గ్రంథాలు మురుగనార్ ఆధ్యాత్మనిష్ఠకు మాపెరుగని ముద్రలు. గురువు పట్ల అతనికున్న అనన్య అచల భక్తి పరిణామం చెంది అతన్ని ముక్తస్థాయికి చేర్చటమూ ఒక అనుభవమే. పరమేశ్వరుడనుగ్రహించిన కవితాశక్తిని భక్తితో జోడించి, గురురమణుల సన్నిధానంలో గురువే దైవం అన్న భావాన్ని అనుభూతిగా దర్శించుకున్న ముక్తుడు మురుగనార్. రమణుల మహాపరినిర్వాణానంతరమూ అతని భావనలో మార్పులేదు. భగవంతుడు స్వరూపమా, అరూపమా అన్న సంశయం అజ్ఞాన పరిధిలోనిది. మురుగనార్, భక్తిని జ్ఞానంగా మలచుకున్నవాడు. రమణులు శాశ్వతులన్న భావనలో నిలకడ చెందినవాడు.

"నాకేది మంచిదో, నాకేది చెడుపో నాకంటే బాగుగా, నా స్వామి కెరుక
అతని చేరిన వారికి, అతడాయె తల్లిదండ్రి అతని బిడ్డను నేను ఇతరము నాకేల?''అన్న సంపూర్ణ శరణాగతితో భగవాన్ దివ్య సన్నిధిని సాలోక్య, సామీప్య, సాన్నిధ్య, సాయుజ్య స్థితులలో పూర్ణానుభూతిని పొంది, విభూతిస్థితినందుకున్న మురుగనార్ పట్ల గురురమణుల దృష్టి ఏకదృష్టి, నిత్యదృష్టి, అచలదృష్టి, అమలదృష్టి, అనుగ్రహ మహావృష్టి. - వి.యస్.ఆర్.మూర్తి

Read more...

పూజమానావా ? మరి ఫలహారం మానలేదే ???

>> Monday, July 16, 2012

శ్రీ గురుభ్యోనమః
సభాయై నమః

ఒక శిష్యుడు దూరదేశంనుండి రైలు ప్రయాణం చేసి శృంగేరి వచ్చి అప్పటి
శృంగేరి పీఠాధిపతులైన జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర
భారతీ స్వామి వారిని దర్శించిన తరవాత వారి సంభాషణ ఇలా జరిగింది.

శ్రీ చరణులు : ఇంటినుంచి నేరుగా వస్తున్నావా? లేక మధ్యలో ఎక్కడైనా ఆగి
వస్తున్నావా ?
శిష్యుడు     : లేదు స్వామీ నేరుగానే వస్తున్నాను.
శ్రీ చరణులు : మొన్న భోజనం చేసి బయలుదేరి ఉంటావు. రాత్రి భోజనం చేయటానికి
వీలు లేదు మరి నిన్నటిమాటేమిటి?
శిష్యుడు     : జోలార్పేట స్టేషన్లో రెండుగంటల వ్యవధి దొరికింది. అక్కడే
తొందరగా స్నానం చేసి లఘువుగా జపం ముగించుకుని రెండు అరటి పళ్ళు మాత్రం
తిన్నాను.
శ్రీ చరణులు : ఓ స్నానం వదలక చేస్తావన్నమాట. మరి పూజ
శిష్యుడు     : స్టేషనులో పూజ సాంతం చేయడానికి వీలు లేదు.
శ్రీ చరణులు : ఔను. నిజమే స్టేషనులో పూజ సాంతం చేయడినికి కుదరదు. మరి
క్లుప్తంగా?
శిష్యుడు     : పూజచేయటానికి వ్యవధి ఎక్కడ?
శ్రీ చరణులు : మరి స్టేషనులో అరటిపండ్లు తినడానికి వ్యవధి ఉన్నది కదా?
శిష్యుడు     : పూజ అంత సులభంగా చేయడానికి వీలు లేదు కదా?
శ్రీ చరణులు : ఎందుకు కాదు? నువ్వు తెచ్చిన అరటిపళ్ళు తినడానికి ముందు
దేవతార్చనకు అర్పించి తరవాత ప్రసాదంగా స్వీకరించవచ్చును. కాదా?
శిష్యుడు     : నేను అలా చేయలేదు. మూర్తి పెట్టెలోపెట్టి నా మూటలో ఉన్నది
కదా.. బయటకు తీస్తే కదా నివేదనం చేసేది.
శ్రీ చరణులు : నీవు మూర్తి పెట్టెలో పెట్టి బుట్టలో ఉన్నందువల్ల నువ్వు
చేసే నివేదనం ఆ మూర్తి గ్రహించలేదని నీ భావన. నువ్వు ఉపాసించే దేవతను
గూర్చి నీకు తెలిసిందింతేనా?
శిష్యుడు     : మీరు చెప్తుంటే అర్థం అవుతోంది. నేను నివేదన చేసి
ఉండవచ్చు........
శ్రీ చరణులు : ఇంతా చెప్పడం......  మన స్థితి ఎటువంటిదైనా ఉన్నదానిలో మన
కర్తవ్యం చేయాలి అని. భగవంతుడు సర్వ వ్యాపి. విస్తారంగా పూజ చేయడానికి
వీలు లేనిచోట నిండు మనసుతో భగవంతుని స్మరిస్తే చాలు. ఆయన అపరిమిత
అనుగ్రహాన్ని వర్షిస్తాడు.


శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య పరమ హంస పరివ్రాజకాచార్య
చంద్రశేఖర భారతీ స్వామి పాదారవిందములకు నమస్సుమాంజలులతో

nagendrakumar ayyamgaari

Read more...

పంచ మహాయజ్ఞాలు

>> Friday, July 13, 2012


బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అను ఈ నాలుగు ఆశ్రమాల్లో గార్హస్థ్యం శ్రేష్ఠమైనదని అయితే గార్హస్థ్య ధర్మాన్ని నిర్వ ర్తిస్తున్న సమయంలో గృహస్థునకు ఐదు రకాల పాపం అంటుతుందని ఆ పాప నివారణ కొరకు గృహస్థుడు పంచ మహాయజ్ఞాలను చేయవలసి ఉంటుందని తెలుసుకున్నాం. యజ్ఞాలు, యాగాలు, హోమాలు అంటేనే అవేవో హిందువ్ఞలకు మాత్రమే సంబంధించినవి అనుకొంటారు. గృహస్థునిగా ఉండు వానికి వచ్చు పాపాలుగానీ, వాటి నివారణకై చేయవలసిన యజ్ఞాలు గానీ ప్రపంచంలోని మనుష్యులందరికీ సంబంధించినవే, అందరూ చేయవలసినవే, చేయగల్గినవే. వాటిని గూర్చి మహర్షి మళయాళ స్వాముల వారు, మహర్షి దయానంద సరస్వతి స్వాముల వారు అందరికీ అర్థమయ్యే భాషలో, సులభ శైలిలో వివరించారు. ఆ ఐదు యజ్ఞాలు   1. బ్రహ్మయజ్ఞం, 2. పితృయజ్ఞం 3. దైవ  యజ్ఞం 4. భూతయజ్ఞం 5. మనుష్యయజ్ఞం (అతిథి యజ్ఞం)
1. బ్రహ్మయజ్ఞం: దీనినే బుషి యజ్ఞమని కూడా అంటారు. వేదాది శాస్త్రములను చదువ్ఞట, చదివించుట, సంధ్యోపాసన, యోగాభ్యాసము. హిందువేతరులు వారి వారి మతగ్రంథాలను చదు వ్ఞట, చదివించుట, ప్రార్థించుట, ధ్యానించుట. వీనిలో ఏదైనా ఒకదానినైనా చేయక భుజింపరాదు.
2. పితృయజ్ఞం: తల్లితండ్రులను, జ్ఞానులను, యోగులను, బుషులను సేవించుట. పితృయజ్ఞం అంటే వృద్ధులైన తల్లితండ్రులకు, పెద్దలకు శ్రద్ధతో అన్నపానాదులు, వస్త్రాలు ఇచ్చి సేవించుట. వారు జీవించియున్నంత కాలము ఇలా సేవ చేయాలి. చనిపోయిన పెద్దలను గుర్తుచేసుకొని వారు ఎక్కడ  ఏరూపంలో నున్నా వారికి మంచి జరగాలనే తలంపుతో అన్నదానం, వస్త్రదానం సంఘంలోని పేదలకు చేయటం మంచిదే.
కానీ కొంతమంది బ్రతికియున్నంతకాలం తల్లితండ్రులను చూడ కుండా వారు చచ్చిన తర్వాత తద్దినాలు చేయక పోతే తమకు కష్టాలు, నష్టాలు వస్తాయని, సంఘానికి భయపడి ఏమేమో చేస్తారు. అలా చేయరాదు. అప్పుడప్పుడు ఆ పెద్దలను జ్ఞప్తికి తెచ్చుకోవటం, వారు అనుసరించిన మంచి పద్ధతులను గుర్తుకు తెచ్చుకొని ఆచరణలో పెట్టటం-ఇది జరుగువలసింది.
3. దేవయజ్ఞం: అగ్ని యందు వేల్చు హోమము. దీనిని ప్రాతః సాయం రెండు సమయములందు చేయాలి. ప్రాతఃకాలమున అగ్ని యందు హోమము చేయబడిన ద్రవ్యం వలన ఇంట్లో శుద్ధమైన వాయువ్ఞ సాయంకాలం వరకు బలమును, ఆరోగ్యమును ఇస్తుంది. అట్లే సాయంకాలం చేయు హోమము వలన మళ్లీ తెల్లవారే వరకు ఇంట్లో శుద్ధమైన వాయువ్ఞ లభి స్తుంది. ఏ మతం వారైనా, ఏ జాతివారైనా ఉదయం, సాయంత్రం మంచి వాసననిచ్చే అగరు బత్తీలనైనా ఇంట్లో వెలిగించాలి. తక్కువ ధరకు వచ్చే ఉత్త పుల్లలను కాదు. మంచి బత్తీలను వెలిగించటానికి వెనుకాడితే రోగక్రిములు వృద్ధి చెంది, రోగాలు వచ్చి వందల రూపాయలు మందులకు పెట్టవలసి వస్తుంది.
4. భూతయజ్ఞం: భోజన పదార్థాలన్నీ సిద్ధమై నపుడు కుక్కలు, పిల్లులు, కాకులు, చీమలు మొదలగు ప్రాణులకు కొంతపెట్టాలి. మనం వండుకొన్న  ఆహారం మనం మాత్రమే తింటే పాపం వస్తుందని పెద్దలు చెబుతారు. సాధార ణంగా అన్ని మతాల వారు దీన్ని ఆచరిస్తుంటారు. శ్రద్ధగా, క్రమంగా ఆచరిస్తే మంచిది.
5. అతిధి యజ్ఞం: (మనుష్య యజ్ఞం) తిథి నిశ్చితం లేని వ్యక్తి అతిథి. అతడు ధార్మికుడై ఉండాలి. సత్యాన్ని పలుకుతూ సత్యోపదేశకుడై ఉండాలి. అలాంటివాడు అకస్మాత్తుగా ఒకరి ఇంటికి వస్తే గౌరవంగా చూసి అన్నపానములను అందించాలి.
ప్రతి ఒక్కరూ ఇంతమంచి పనులను చేస్తే, పరోపకార పనులను చేస్తే పుణ్యం రాదా? పాపం నశించదా? భగవంతుడు ప్రీతి చెందడా? వర్తమాన కాలాన్ని ఇంత చక్కగా వినియోగించు కొన్నవారికి మంచి భవిష్యత్తు ఉంటుందనటంలో సందేహమేముంటుంది?
అందరి క్షేమాన్ని కాంక్షించే మన పెద్దలు ఈ యజ్ఞాలను నిర్ణయించారు గానీ ఏ ఒక్క కులానికీ, వర్గానికో మేలు చేయాలని కాదు. జాగ్రత్తగా గమనించి ఆచరించాలి.
- రాచమడుగు శ్రీనివాసులు
 

Read more...

>> Thursday, July 12, 2012

Read more...

త్రైలింగస్వామి చరిత్ర 62-67

పూర్వజన్మలో మనము ఏమేమి కర్మలు చేశామో, ఎలాంటి స్వభావంగల వ్యక్తులమై ఉన్నామో, ఆ కర్మలఫలాన్ని అనుసరించి, వాటి ప్రమాణాలను బట్టి, తరువాతి జన్మలో వర్తమాన శరీరం నిర్మించబడింది. వర్తమాన జన్మలో మనం చేస్తున్న మంచి చెడు కర్మలు మనకు చక్కగా తెలుసు. మంచి పని చేస్తే మంచి ఫలము, చెడు పనులు చేస్తే దుష్ఫలము అనుభవించవలసి వస్తుంది. దీనిని అందరూ అంగీకరించాలి. వర్తమాన జన్మలో మనము ఎలాంటి మనుష్యులంగా తయారవుతున్నామో, ఈ పనుల వలన భవిష్యజ్జన్మలో ఎలాంటి స్వభావంకల వ్యక్తులము అవుతామో తెలుస్తుంది. చక్కగా ప్రయత్నం చేస్తే మనంతట మనమే అదంతా తెలుసుకోగలము. ఇతరుల సహాయం అక్కరలేదు.
వర్తమన జన్మ యొక్క ఇహలోకమే పూర్వజన్మ యొక్క పరలోకము. అలాగే వర్తమాన జన్మ యొక్క పరలోకము భవిష్యత్ జన్మ యొక్క ఇహలోకము. ఈ స్థూల శరీరంలోపల మరొక శరీరం కూడా వున్నది. దాని పేరే సూక్ష్మశరీరము. దానిలోపల మరొక శరీరం ఉన్నది. అ కారణ శరీరము. అరటి చెట్టులోని పొరలలాగా ఒకదానిలో ఒకటిగా ఉన్న ఈ త్రివిధశరీరమే సంసార ప్రవాహంలో ప్రకాశిస్తున్నది. మానవశరీర నిర్మాణము- ఆకృతి, వర్ణము, స్వభావము, పండితుడు లేదా మూర్ఖుడు, కఠోర స్వభావుడు లేదా నమ్రస్వభావము, పండితుడు లేదా అధర్మవర్తి, సాధువు లేదా అసాధువు, సరళస్వభావుడులేదా కుటిలుడు, రాజులేదా జమిందారు, మధ్య తరగతివాడు లేదా పేదవాడు, ఉన్నత వంశస్థుడు లేదా నిమ్న వంశస్థుడు వంటివి అన్నీ పూర్వజన్మ కర్మానుభవంవలన వర్తమాన శరీరంగా ఏర్పడినవి. అదేవిధంగా తిరిగి ఈ జన్మ యొక్క ఫలాన్ని అనుసరించి, భవిష్యత్ జన్మ యొక్క శరీరము తయారవుతుంది.
జన్మనుంచి మృత్యువువరకూ ఉన్న కాలమును ఆయువు అంటారు. ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే జీవుని ఆయువు అనంతమైనది. జీవుడు అక్షరుడు, అపరుడు. జీవుడు నశించిన తరువాతనే ఆయన ఉపకరణములు నశిస్తాయి. జీవుడు ఎంత పుణ్యాత్ముడైతే అతని ఆయువు కూడా అంత ఎక్కువగా ఉంటుందని, అతడు అంత ఎక్కువ కాలం జీవిస్తాడని సాధారణంగా నమ్ముతారు. కాని అది పొరపాటు. జీవుడు ప్రపంచానికి ఎంతోదూరంగా ఉంటాడు. ఆయనను పాపము స్పృశించదు. జీవుడు కర్మఫలాన్ని అనుభవించటానికి ఈలోకానికి వస్తాడు. ఎందుకంటే ప్రపంచము కర్మఫలమును అనుభవించే స్థానము. పుణ్యాత్ములైనవారు ఎప్పుడు కర్మఫలమును అనుభవించలేరు.
అందువల్లనే జీవుడు కర్మఫలమును పూర్తిగా అనుభవించిన తరువాతనే పాపములనుండి విముక్తుడవుతాడు. అంతవరకూ అతడు ప్రపంచంలోనే ఉండవలసి వస్తుంది. పుణ్యాత్ములైనవారు చాలారోజుల వరకు ప్రపంచంలో ఉండవలసి వస్తుంది. పుణ్యాత్ములైనవారు చాలా రోజులవరకు ప్రపంచంలో ఉండాలి. అలాగే పాపాత్ములైన వారు కూడా ఈ ప్రపంచంలోనే ఉండి తమ కర్మఫలాన్ని అనుభవించాలి. కర్మఫలము సమాప్తమైన వారు ఈ ప్రపంచం నుండి విముక్తులవుతారు. జీవితము ఎంత తొందరగా లయించిపోతే అతడు అంత పుణ్యాత్ముడు. పాపంనుండి విముక్తుడయ్యాకనే ఈశ్వరునిలో లయమవుతాడు. అప్పుడు అతని ఆయువు అనంతమై, భగవంతుని సంకల్పం ఉన్నంతవరకూ అతని శక్తి ఉంటుంది. మనిషి ఈ విధంగా పాపపుణ్యాల ఫలాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అందువల్లనే కర్మఫలము పరిసమాప్తము కాకపోతే మళ్లీ మళ్లీ ఈ ప్రపంచంలో పుట్టవలసి వస్తుంది. పంచ భూతముల ప్రతిమ అయిన ఈ మానవుడు మృతి చెందిన తరువాత ఎక్కడికి వెళతాడు. లేక మృత్యువే చివరిదా? అని అడిగితే మనుష్యులు తమ కర్మఫలమును ఈ జన్మలోనే అనుభవిస్తారని, మృత్యువే చివరిదని ఇంగ్లీషు వారంటారు. ఆ విధంగా అనటం అన్ని విధాలా పొరపాటని చెప్పనవసరం లేదు. ఈశ్వరుడు ఉన్నాడంటే పరజన్మకూడా ఉన్నదని తప్పకుండా స్వీకరించాలి.

ఒకవేళ ఈశ్వరుడు ఉన్నాడంటే మనుష్యుని ఆత్మకూడా ఉన్నదని ఒప్పుకోవాలి. ఈశ్వరుని నశింపజేయలేనప్పుడు, ఈశ్వరుని శక్తిని, మనిషిని, ఆత్మను నశింపజేయలేము. ఒకవేళ పరజన్మ లేదంటే ఈశ్వరుని దయామయుడని ఎప్పుడూ అనలేము. అందుకు కారణము ఈ జీవితంలో ఒకడు రాజుగా, ఒకడు ప్రజగా ఒకడు ధనవంతుడుగా, ఒకడు దరిద్రుడుగా, ఒకడు పెద్ద ఇంట్లోను మరొకడు చిన్న ఇంట్లోను ఎందుకు పుడతారు? పూర్మజన్మలో చేసిన కర్మప్రకారము దాని ఫలము పూర్తికాకపోతే మిగిలిన కర్మఫలము ననుసరించి మరొక శరీరము ధరిస్తారు.
అందుకు స్పష్టమైన ప్రమాణము పుట్టకతో గ్రుడ్డివారైనను ఈ జన్మలో ఏమీ చూడలేరు. కాని మిగిలినవారందరూ చక్కగా చూడగలుగుతున్నారు గదా! దానికి కారణం ఏదైనప్పటికీ పూర్వజన్మ పాపఫలాన్ని అనుభవిస్తున్నామని మాత్రం ఒప్పుకోరు. ఈ జన్మలో లభించిన శరీరము, ఆకారము, స్వభావము, జ్ఞానము మొదలైనవన్నీ పూర్వజన్మ కర్మఫలము వలననే సంభవించినాయని నమ్మాలి. ఈ జన్మలో దొంగతనం వృత్తిగా స్వీకరించి జీవనము గడుపుతున్నవాడు పూర్వజన్మలో కూడా వాని ఆకారము, స్వభావము, రాక్షసునివలె కఠినమై ఉండి ఉంటుంది. అలాగే ఈ జన్మలో ధర్మాచరణముతో జీవితము గడుపుతున్నవాని ఆకార స్వభావములు పూర్వజన్మలో కోమలంగా ఉండి ఉంటాయి.
ఒకడు తన జీవితాన్ని సంపూర్ణంగా ధర్మాచరణతో గడుపుతూ ఉన్నప్పటికీ సుఖంగా లేడు ప్రపంచంలో నానా రకాలైన కష్టాలనూ పొందుతున్నాడు. మరొకడు అతి గర్హితములైన పనులు చేస్తూ లంపటుడై రాక్షస ప్రవృత్తిలో తన జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాడు. ఇదంతా పూర్వజన్మకు ప్రమాణము మాత్రమే. కాని ఒకడు జీవితంలో ధర్మాచరణ చేసినా సుఖమును పొందటంలేదు. అయినప్పటికీ అతడు ఎప్పుడో ఒకప్పుడు సుఖమును పొందవచ్చును. కాని ఈ జన్మలో కష్టపడుతున్నాడంటే అదంతా పూర్వజన్మ కర్మఫలమనే చెప్పవచ్చును. వాటిని అనుభవించే సమయం ఆసన్నమైనా, అతడు కష్టాలను పొందుతున్నాడు. రెండో వ్యక్తి పూర్వజన్మలో చేసిన సుకృతమునకు అనుభవించటానికి సమయం ఆసన్నమైనది కనుక అతడు సుఖ జీవనం గడుపుతున్నాడు. కాని దాని తరువాత అతడు ఎన్నో కష్టాలను అనుభవించవలసి వస్తుంది. పాప కర్మలు అనుభవించటం ఈశ్వరునివల్లనే అని, అట్లాగే పుణ్యకర్మలు అనుభవించటమూ ఈశ్వరుని దయే అని కొందరు అనుకొంటారు. ఇదంతా అజ్ఞానంతో కూడిన అభిప్రాయము.
మన ప్రవృత్తులు, ఇంద్రియములు మంచి చెడులను చేయిస్తాయి. కోపపడితే అనిష్టం జరుగుతుంది. కామం ఉంటే కావాలనే కోరిక నెరవేరవచ్చును. లోభం ఉంటే ఇతరుల ద్రవ్యాలను అపహరించే చేష్టలు జనిస్తాయి. అహంకారంవలన ఇతరులకు అనిష్టం చేసే ఆలోచన కలుగుతుంది. ఇట్లా ఏది దేని ధర్మమో, అది ఆ పని చేయిస్తుంది. అందువల్లనే భగవంతుడు మనిషికి హితాహిత విచక్షణా శక్తినిచ్చి, జీవరాశిలో శ్రేష్టునిగా చేశాడు. మృత్యువుతో ఆత్మ నశించదు. అట్లా కాకపోతే ఈశ్వరునకు ప్రతిరోజూ అనేక ఆత్మలను సృష్టించవలసి వచ్చేది. దానివలన భగవంతుని పని ఎంతో పెరిగిపోయేది. అది సర్వశక్తిమంతమైనది.
శరీరం నశించిపోయినా ఆత్మకు ఎలాంటి హానీ కలుగదు. ఇల్లు నాశనమైపోయినా ఇంటిలోని ఆకాశానికి ఎలాంటి క్షితీ కలుగదు కదా! ఆత్మ దేనినీ చంపదు. దేని చేతనూ చంపబడదు. ద్వేషము సంతాపనమునకు, సంసార బంధమునకు కారణము.
ద్వేషమునకు మృత్యువునకు సంబంధము. అందువలన బలవంతంగానైనా ద్వేషమును త్యజించాలి. సుఖ దుఃఖములు మనస్సుకు ఉంటాయి. కాని ఆత్మకు ఉండవు. ఆత్మ వాయువులాగా నిర్మలము, నిర్లేపము. అయినా ఈశ్వరమాయచే మోహితులమై మనము సుఖముదుఃఖములను అనుభవిస్తూ ఉంటాము. విశ్వమోహిని- అనాది- అవిద్యా అనే వాటి పేరే మాయ. కేవలం పుట్టక చేతనే ఆ అవిద్య లేదా మాయతో జీవునకు సంబంధం ఏర్పడుతుంది.
అప్పుడది సంసార బంధమవుతుంది. మనస్సు, బుద్ధి, అహంకారములు జీవునకు సహకరిస్తాయి. ఎవరు చేసిన కర్మఫలాన్ని వారే అనుభవించాలి. అంటే ఎవరి కర్మఫలం ఎట్లా ఉంటుందో, వారు అలాంటి ఫలానే్న అనుభవిస్తారు. తిరిగి జన్మించినప్పుడు జీవుడు మనస్సు మొదలైన వాటన్నింటితో సంబంధంకలిగి శరీర ధారణ చేసే బాధ్యత వహిస్తుంది. జీవుడు ముక్తుడు కానంతవరకూ అదే ప్రకారం పరిభ్రమించవలసి ఉంటుంది.
శరీరమే మనస్తాపమునకు మూలము. శరీరమే సంసార కారణము. కర్మఫలము వల్లనే ఈ శరీరము పుట్టినది. కర్మ రెండురకాలు: పాపము, పుణ్యము అనేవి. పాపపుణ్యముల ననుసరించియే శరీరధారికి సుఖదుఃఖాలు కలుగుతాయి. ఎంత పాపంచేస్తే అంత దుఃఖము, ఎంత పుణ్యం చేస్తే అంత సుఖము లభిస్తాయి. రాత్రి పగళ్లుగా అవి ఒకదాని తరువాత ఒకటి వస్తాయి. ఈ అనుభవములు పూర్తి కానంతవరకూ ముక్తి లభించదు.
జీవుని శరీరమునకు కర్త ఆత్మ. ఆత్మహీనమైన శరీరానికి సుఖదుఃఖములు కలుగవు. శబ్ద స్పర్శ రూప రస గంధములలో దేనికీ జ్ఞానం ఉండదు. ఆత్మ శరీరమునకు కర్త అని నిశ్చయమైంది. సుఖ దుఃఖముల అనుభవము శరీరమునకు ఆత్మ లేకుండా కలుగవు. ఆత్మ ఏకాకిగా వెళ్లిపోతుంది. శరీరము దాని వెంట పోదు. అందువలన కేవలము ఆత్మను శిక్షించటం అసంభవము. ప్రతి ఒక్క శరీరంలోను భగవంతుడు ఆత్మ రూపంలో ఉన్నాడు. జీవాత్మ పరమాత్మ యొక్క అంశ మాత్రమే! పాపము అనేక రకాలు అయినట్లు, వాని శిక్ష కూడా అనేక రకాలుగా ఉంటుంది. అట్లాగే పుణ్యముకూడా అనేక రకాలు. దానివలన కలిగే ఆనందం కూడా అనేక రకాలుగా ఉంటుంది. చేసినపాపానికి శిక్ష పరితాపమే. అట్లాగే చేసిన పుణ్యానికి పురస్కారము ఆనందము. పాప పుణ్యములను నిర్ణయించటానికి మానవ హృదయమే ఒక త్రాసు పుణ్యంవలన సంతోషము, పాపంవలన పరితాపము అనేవి మానవ హృదయంలోనే జన్మించి, అతను చేసిన కర్మకు తగిన ఫలాన్ని ఇస్తాయి. ఈ పరిణామాలను గ్రహించినవారు బుద్ధిమంతులై, పాపము నుంచి తమను తాము మరల్చుకొంటారు. ఆ విధంగా పాప పుణ్యములను గురించి ఆలోచన, వాటి ఫలభోగము ఈ జగత్తులోనే అవుతాయి. పంచ భూతములు కేవలం పరమాణువుల సమాహారమే. పరమాణువు అవినాశకము. అందువలన పంచభూతములు కూడా అవినాశకములే. మృత శరీరము పంచభూతములు కూడా అవినాశకములే. మృత శరీరము పంచభూతాలలో కలిసిపోతుంది. ఈనాడు నీ ముందున్న శరీరము పూర్వజన్మలోని ఏదో జీవి యొక్క శరీర పరమాణువుల చేత నిర్మితమైనది. అందువలన ఒకప్పుడు ఉండిన జీవి యొక్క పూర్వజన్మ ఫలమే నీ ముందున్న మానవుడు.
ఏ ఆత్మ ఎంత పరిమాణంలో పాపం నుంచి విముక్తి పొందుతుందో, ఏ ఆత్మ విషయభావనా శూన్యమైనదో, ఆ ఆత్మ అంత గొప్పది. ధార్మికుని ఆత్మ పాపి యొక్క ఆత్మ కంటెగొప్పది. ఆ ఉన్నత ఆత్మ శరీరాన్ని త్యజించినప్పటికీ అది ఉన్నతమైన ఆత్మగానే ఉంటుంది. ఆత్మ పురుషుడు; శరీరము ప్రకృతి. ఆత్మ- ప్రకృతికి సమీపం కానంతవరకూ అది వాసనాత్మకమై ఉంటుంది. అది శరీరమును త్యజించగానే పూర్వస్థితిని పొందుతుంది. ఆత్మ ప్రారంభ దశలో నిర్గుణమైనప్పటికీ, శరీరస్థమైనప్పుడు సగుణ సంపన్నమవుతుంది. అది పాపం నుంచి విముక్తిని పొందనంతవరకూ పాపఫలమును అనుభవిస్తూనే ఉంటుంది.
పశు శరీరము నుంచి మనుష్య శరీరాన్ని ధరించటానికి, దాని స్వభావంలో మార్పు తీసుకొని రావటానికి ఎంతో ప్రయత్నం చేయవలసి ఉంటుంది. పశువు నుంచి మనుష్యుడు కావటం ఎంత కష్టమో, మనిషి నుంచి పూర్ణ మనుష్యత్వం పొందటం అంత కష్టము. మనిషి నుంచి దేవత్వం పొందటం ఎంత కష్టమో, మనిషి నుంచి ఉత్తమ మనుష్యత్వం పొందటం అంతకన్నా కష్టము. శుభకార్యములను అనుష్ఠించచి మనుష్యుడు దేవుడు కావచ్చు కాని అనాయాసంగా నిజమైన మనుష్యుడు మాత్రం కాలేడు.

సమస్త భోగాలమీది ఆశలను త్యజిస్తే కాని ముక్తి మందిరంలో చేరలేడు. సకామమైన శుభకార్యముల వల్లముక్తి మార్గం మరీ దుర్లభమైపోతుంది. స్వర్గలోక భోగములను అనుభవించటం పూర్తి అయిన తరువాత జీవుడు తిరిగి మర్త్యలోకంలో ప్రవేశించటానికి యోగ్యమైనది అవుతుంది. అందువలన మహాపురుషులు ఎప్పుడూ స్వర్గలోకమును కోరుకోరు.
ఎందుకంటే - కర్మఫల భోగము తప్ప, స్వర్గముకూడా చిరస్థాయియైనది కాదు. అసలైన మనుష్యత్వాన్ని పొందటానికి ఇంద్రియాల విజృంభణను అరికట్టాలి. అరిషడ్వర్గ వశీకరము, అంతఃకరణ విశుద్ధీకరణ, అన్నింటియందును సమదృష్టి, అభిమాన త్యాగముమొదలైనవి మనుష్యత్వసిద్ధికి ప్రధాన మార్గములు. అవేకాక- శవము, దమము, తితిక్ష, సమాధానము శ్రద్ధ, ఉపరతి వంటి గుణాలు కూడా మానవునిలో ఉండాలి.
మనుష్యత్వం పొందినప్పటికీ మానవునికి సహజంగా ముక్తిమీద కోరికుండదు. విషయ భోగాలలో ఎంతవరకూ కష్టం అనుభవించడో, అంతవరకూ జీవుడు మహా జితేంద్రియుడు- యోగీంద్రుడు అయినప్పటికీ మోక్షమును సాధించలేడు. మోక్షమును సాధించటానికి ప్రధానోపాయము వాసనలను త్యజించటమే. ముక్తి కావాలనుకొన్నా ముక్తి కూడా లభించదు. మహాత్ముల సత్సాంగత్యంవలన తొందరగా ముక్తి లభిస్తుంది. జీవునికి తన సుకృతంవలననే ఆ సత్సాంగత్యం లభిస్తుంది. సాధువులు సాధారణంగా నిర్జన ప్రదేశాలలో ఉంటారు. వారు సహజంగా కనిపించినా వారిని మనము గుర్తించలేము.
ఒకవేళ మనం వారిని గుర్తిస్తే, వారు మనను తమ సమీపంలో ఉండనివ్వరు. ఒకవేళ వారికి సమీపంలో ఉండగలిగే అధికారం సంపాదించుకొన్నా వారి నిర్మల హృదయ సహాయమును సాధించలేము. ఒక సాగరమును తరించటనికి నావ సహాయం అవసరమైనట్లుగానే, ఈ సంసార సాగరాన్ని తరించటానికి మహాత్ముల నిర్మల హృదయ సహాయం అవసరము. సత్సాంగత్యమువలన అంతా సులభం అవుతుంది. ధార్మికుని ఆత్మ ధర్మబలంచేత క్రమంగా ఉన్నతిని పొంది, ఆ తరువాత మోక్షమును పొందుతుంది. అలాంటి ఉన్నతి ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో సాధ్యం అయ్యేది కాదు. ఎంతోకాలం ప్రయత్నం చేస్తే కాని మోక్షం లభించదు. దానికి వ్యతిరేకంగా పాపాత్ముని ఆత్మ అధోగతిని పొందుతుంది. స్వర్గనరకములు ఏవీ లేక, ఆత్మకు ఉన్నతి- అవనతి మాత్రమే ఉంటాయి. ఆత్మౌన్నత్యము. ఆత్మ అవనతుల ననుసరించి వివిధ అవస్థలను పొంది మానవుడు జన్మిస్తాడు.
ఈ విశాల ప్రపంచంలో ఎవరు ఎక్కడ జన్మిస్తారో పరిశోధించి తెలుసుకోలేము. అందువలననే మానవులు పునర్జన్మను విశ్వసించరు. పునర్జన్మను కాని, పూర్వజన్మను కాని మనము చూడలేము. పునఃజన్మించిన వారెవ్వరూ వచ్చి చెప్పలేదు. కేవలము అనుమానము- యుక్తుల చేత మాత్రమే నమ్మవలసి ఉంటుంది. లేకపోతే- ధర్మాధర్మములకు, పాపపుణ్యములకు ఎలాంటి తేడా ఉండదు. మనుష్యుడు పాపం చెయ్యటానికి ఎందుకు భయపడతాడు? అందుకు కారణము పరజన్మ మీది విశ్వాసమే! పరజన్మలో ఘోరమైన నరకయాతనలు అనుభవించవలసి వస్తుందనే భయమే అందుకు కారణము.
ఈ జీవితంలో ఒకరు విద్వాంసుడు, ఒకరు మూర్ఖుడు, ఒకరు పండితుడు, ఒకరు జ్యోతిష్యుడు, ఒకరు గొప్ప గాయకుడు, ఒకరు గొప్ప వాద్య నిపుణులు కావటానికి కారణము వారు పూర్వజన్మలో అందులో సంపాదించిన నైపుణ్యమే. ఈ శరీరములోని ఆత్మ అదే కాని శరీరము మాత్రం భిన్నమైనది.
అందువలన వారికి ఆ విషయాలు సహజంగా లభిస్తాయి. అంతేకాని నేర్చుకోటానికి ప్రత్యేకంగా కృషి చేయనక్కరలేదు. కర్మఫలం లేకపోతే అలాంటి భేదాలు ఉండవు. మంచి కర్మలకో, చెడు కర్మలకో అతడు ఇంత కష్టపడవలసిన అవసరం ఉండదు. మంచి పనులు చేస్తే ఉచ్చదశ లభిస్తుంది. చెడ్డ పనులు చేస్తే నీచ దశ లభిస్తుంది
.ఆత్మబోధకు అర్థము- మనను మనం తెలిసికొనటం. మనను మనం తెలుసుకోగలిగితే భగవంతుని కూడా తెలుసుకోగలము. మనను మనం తెలుసుకోలేనంత వరకూ భగవంతుని తెలుసుకోవాలని ప్రయత్నించినా తెలుసుకోలేము. మనమేమిటో తెలుసుకోవాలంటే ఆత్మ- మనస్సు - బుద్ధి అన్న మూడింటి తత్త్వాన్ని తెలుసుకోవలసిన అవసరం ఉన్నది.
సూర్యుడు భూమికి ఎట్లా కర్తో, అట్లాగే ఆత్మ శరీరానికి ప్రధాన వస్తువు, యజమాని, కర్త. సూర్యుని కిరణాల ప్రసరణవల్లనే, అన్ని జీవులు తమ తమ కార్యాలను చేసుకోగలుగుతున్నాయి. వాస్తవానికి సూర్యుడు ఏమీ చెయ్యడు. అలాగే మనుష్య శరీరంలో ఆత్మయే సూర్యునిలాగా కర్తయై ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ప్రకాశంవల్లనే ఇంద్రియాలు పనిచేస్తాయి. అంతేకాని ఆత్మ నిజంగా ఏమీ చెయ్యదు. ఇప్పుడు ఆత్మ సాకారమా నిరాకారమా అని తెలుసుకోవాలి. అంతేకాక శరీరంలో ఏ స్థానంలో, ఎట్లా అది ఉన్నదో తెలుసుకోవాలి. ఆత్మ అని చెప్పబడే దానికి హద్దులున్నాయి. కాని దానికి దేనితోనూ పోల్చగల ఆకారం లేదు. మన ఆత్మ- ఇతరుల ఆత్మ రెండూ ఒకే రకమైనవి. ఒక కాగితం మీద నానా రకాల చిత్రాలు చిత్రింబడినప్పటికీ వాటన్నింటికీ ఆ కాగితమే ఆధారమైనట్లు, జగత్తులోని అన్నింటి ఆత్మ ఒక్కటే! ఆత్మను గురించి మనం కొన్ని రోజులు మననం చేసినప్పుడు, ఆ ఆత్మ అగ్నికణంలాగా ప్రకాశిస్తున్నదని నిశ్చయంగా తెలుసుకొంటాము. ఆత్మ ఉన్నది కనుక పరమాత్మకూడా ఉన్నట్లే. అదే ఈశ్వరుడు. ఆత్మయొక్క విశిష్ట రూపమే ఈశ్వరుడు. అందువలన ప్రయత్నం చేస్తే అది తప్పక కన్పిస్తుంది. ఎందరో మహాపురుషులు దానిని చూశారు. ఇంకా ఎందరో చూస్తారు. కనుక ఆత్మ సాకారమైనదనటంలో సందేహం లేదు. ఆత్మను తెలుసుకొంటే పరమాత్మను తెలుసుకోవచ్చు. అట్లాగే పరమాత్మను తెలుసుకొంటే భగవంతుని లేదా ఈశ్వరుని తెలుసుకోవచ్చు. ఆత్మ పరమాత్మ యొక్క అంశమే అనేది నిశ్చయమైన విషయము. అందువలన, ఆత్మను తెలుసుకొంటే పరమాత్మను తెలుసుకోవచ్చు.
మనస్సు- బుద్ధి సకారములా, నిరాకారములా అని తెలుసుకోవాలని చాలామందికి కోరిక ఉంటుంది. మనస్సు విశ్వవ్యాప్తి కాదు. అది కొన్నిపరిధులు వరకే పరిమితమై ఉంటుంది. కనుక మనస్సు ఒక వస్తు విశేషమే అని నిశ్చయమవుతుంది. కొంతమంది ఇది మా మనస్సు, ఇది నీ మనస్సు అని అంటారు. ప్రతి మనిషీ చేసే పనులు వేరు వేరుగా ఉంటాయి. అట్లాగే మనస్సు చేసే పనులు కూడా వేరు వేరుగా ఉంటాయి. ఇదికూడా ఆలోచిస్తే తెలుస్తుంది. అందువలననే మనస్సు కూడా సాకారమైనది. ఒకవేళ మనస్సు స్థానవ్యాపకతా రూపమైన ధర్మమును స్వీకరించకపోతే, దానిని వస్తువు అనరాదు. అప్పుడు మనస్సును ఏదో ఒక ప్రకారమైన స్థానవ్యాపకతా ధర్మ విశిష్ట వస్తువు యొక్క గుణమని అనాలి. సామాన్యంగా స్థూల ఇంద్రియాల సహాయం లేకుండా, ఏ ద్రవ్యమూ ఆకారమును పొందదు. కనుక మనస్సు యొక్క ఆకారము ఏ రూపంలో ఉన్నదో అర్థం కాదు. ఆకార శబ్దపు యదార్థ అర్థం తెలిస్తే ఎవరికీ ఏ రకమైన ఇబ్బందీ ఉండదు. ఒక్కసారి ఆలోచించి చూడు- నీ మనస్సు నీ శరీరం కన్న సంపూర్ణమైన భిన్న వస్తువుగా ఉండి కూడా, నీ శరీరంలోని ఏ భాగంలోను లేదు. అట్లా ఉండటం కూడా ఎప్పుడూ జరుగదు. కనుక మనస్సు సాకారమైనదని నిశ్చయమవుతుంది. అంతేకాక దానిని బట్టి మనస్సు యొక్క కార్యములు కూడా విభిన్నములని తెలుస్తుంది.
బుద్ధి జగద్య్వాపి కాదు. కాని దానికి ఏదో ఒక హద్దు ఉన్నదనేది నిశ్చయమైన విషయము. కనుక బుద్ధికూడా ఒక వస్తు విశేషమే. అందరికీ బుద్ధిసమానంగా ఉండదు. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎవరికి బుద్ధి తక్కువగా ఉంటుందో వారిని బుద్ధిహీనులని అంటారు. బుద్ధి ఒక స్థానాన్ని ఆశ్రయించి ఉన్నప్పుడు అది సాకారమైనదనటంలో సందేహం లేదు. బుద్ధి మంచి చెడులను విచారిస్తుంది అనేది తెలిసిన విషయమే.
 మనస్సు - బుద్ధి రెండూ తలలో ఉంటాయిని సహజంగా తెలుసుకోవచ్చును. జీవశరీరంలో బుద్ధి అద్దంలాగా ఉంటుంది.
ఒక్క ప్రణవ మంత్రంవల్లనే ఈ జగత్తులో సృష్టి స్థితి లయ కార్యములు జరుగుతున్నాయి. ఆ ప్రణవ మంత్రాధి దేవత అగ్ని. ఈ అగ్నిలోని శక్తివల్లనే జగత్ చక్రం తిరుగుతున్నదని హిందువులు అనుకొంటారు. కాని అగ్నిగత శక్తి చైతన్యవంతమైనదని వారు భావించరు. హిందువులకు ప్రణవమంత్ర లక్ష్యం అగ్నిగతశక్తి. అది బ్రహ్మ. దాని గుణము చైతన్యము.
మన వ్రేలు మన చేతితో కలిసి ఉన్నంతవరకూ అది చైతన్యవంతమై ఉంటుంది. ఆ వ్రేలిని కోసి దానిని మన నుంచి వేరు చేస్తే దానిలో చైతన్యం ఉండదు. అది అచేతనమైన జడపదార్థం అయిపోతుంది. ఈ సమస్త జగత్తు చేతనామయుడైన ఒక పురుషుని శరీరము మాత్రమే. అది భిన్న భిన్న శక్తులకు ఆధారము. అగ్ని, వాయువు, నదులు, పర్వతములు, మట్టి మొదలైనవన్నీ ఆ శరీరముయొక్క అంగములు. అగ్ని అచేతనామయ పురుషునికన్న భిన్నము కాదని తెలిస్తే అందులో చైతన్యం ఉన్నట్లు తెలుస్తుంది. అచేతనామయ పురుషునితో అగ్నికి సంబంధం లేదనుకొనేవాడు అగ్ని జడపదార్థం అనుకొంటాడు.
ఆత్మ ఎల్లప్పుడు అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ అది అన్నిచోట్లా ప్రకాశించదు. అది నిర్మల బుద్ధియందు మాత్రమే ప్రకాశిస్తుంది. ఇంద్రియాలు తమ తమ పనులో నిమగ్నమై ఉండటంవల్ల ఆత్మయే అన్ని పనులలోనూ నిమగ్నమై ఉన్నట్లు అవివేకులు అనుకొంటూ ఉంటారు. ఉదాహరణకు మేఘములు పరిగిడుతూ ఉండటం వలన చంద్రుడు పరిగిడుతూ ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. సూర్య కిరణముల ఆధారంగా మనుష్యులు తమ తమ పనులు చేసుకొంటూ ఉన్నట్లు, శరీరము- ఇంద్రియాలు- మనస్సు - బుద్ధి అనేవి చైతన్య స్వరూపమైన ఆత్మను ఆశ్రయించి తమ తమ పనులు చేస్తూ ఉంటాయి.
అనురాగము, కోరిక, సుఖము, దుఃఖము మొదలైన వృత్తులు బుద్ధిలోనే కలుగుతాయి. ఆత్మలో కాదు. కారణమేమిటంటే- సుషుప్తి అవస్థలో ఆత్మ ఉంటుంది, కాని బుద్ధి ఉండదు. కనుక, ఆ సమయంలో రాగము- కోరిక వంటివి ఉండవు. ఏ విధంగా సూర్యుని లక్షణము ప్రకాశము, జల లక్షణము శీతలత్వము, అగ్ని లక్షణము ఉష్ణత అయి ఉన్నాయో, అట్లాగే సత్యము, చైతన్యము, ఆనందము, నిత్యత, నిర్మలతలు ఆత్మస్వభావములు. ఆత్మ యొక్క అస్తిత్వము, చైతన్యపు అంశ, బుద్ధివృత్తుల సంయోగంవల్లనే అవివేకులైన వారిలో ‘మాకు తెలుసు, మేము చేస్తున్నాము’ వంటి ప్రవృత్తులు కలుగుతున్నాయి.
ఆత్మకు ఎలాంటి వికారమూ లేదు. ఏ పరిస్థితులలోను బుద్ధి ఆత్మను ప్రబోధించలేదు. అందువలన జీవుడు ఆ సంయోగ వస్తువును తెలుసుకొని, ‘మేము జ్ఞానులము, మేము ద్రష్టలము’ అన్న జ్ఞానంతో ముగ్ధులవుతున్నారు. ఎట్లాగంటే-త్రాడులో సర్పభ్రాంతి కలిగినప్పుడు, సర్పభయం కలుగుతుంది. కాని అది త్రాడు అని తెలిసిన తరువాత ఆ భయం ఉండదు. అట్లాగే జీవునిలో ఆత్మకు జీవజ్ఞానమున్నట్లు భావిస్తే భయం కలుగుతుంది. మనము జీవులము కాము, మనము పరమాత్మయే అనుకొన్నపుడు ఇక భయం ఉండదు.
మనస్సు, బుద్ధి, మొదలైన ఇంద్రియాలను ఆత్మ ప్రకాశింపచేస్తుంది. అచేతనమైన బుద్ధి మొదలైన ఇంద్రియాలను ఆత్మను ప్రకాశింపజేయలేవు. ఎట్లాగంటే- దీపం అన్ని వస్తువులనూ ప్రకాశింపజేస్తుంది. కాని దీపాన్ని ఏ వస్తువూ ప్రకాశింపజేయలేదు. దీపానికి దాని స్వరూపమైన ప్రకాశం ఉండగా మరొక దీపం యొక్క అవసరం లేనట్లు, ఆత్మకు కూడా తన స్వరూపము తెలిసిన తరువాత మరొక జ్ఞానము యొక్క అవసరం ఉండదు.
అవిద్యవలన ఉత్పన్నములైన దృశ్య వస్తువులన్ని నీటి బుడగలలాగా నశించిపోయేవే! ఈ సమస్త వస్తువులకూ పైన ఏ నిర్మల బ్రహ్మమున్నదో అదే మనమని తెలుసుకోవాలి. ఇది మన శరీరము కాదు.
- ఇంకాఉంది
[ తెలుగు అనువాదం: ఆచార్య హరిశివకుమార్ ఆచార్య రేగులపాటి మాధవరావు]



Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP