శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శ్రీరమణాద్భుతం

>> Monday, July 23, 2012




శ్రీ రామచంద్రమూర్తి నామప్రభావం తెలియాలంటే మహేశ్వరుణ్ణి అడగాలి. రామ పాద ప్రభావం తెలుసుకోవాలి అంటే అహల్యను అడగాలి. శ్రీరామ పరాక్రమ ప్రభావం తెలియాలంటే సముద్రుణ్ణి అడగాలి.

ఇంత మందీ శ్రీరామాద్భుతాన్ని అంటే ఆయన అతిమానుష శక్తిని చవిచూసిన వారే. శ్రీకృష్ణ మహిమ తెలుసుకోవాలంటే భాగవతమంతా చదవాలి. దానినిండా పరుచుకున్నదంతా కృష్ణలీలా వైభవమే, మహిమా ప్రదర్శనే, సిద్ధుల నిరూపణే. భగవద్విభూతే.

మహిమ కాదు సహజమే
రాముడిది మాయా మానుషం. విధికి లోబడినట్లుగా సాగిన ప్రయాణం ఆయనది. పైగా రాముడు తనను మానవుడుగానే ప్రకటించుకున్నాడు. ఆయన నెరపిన ధర్మనిష్ఠ ఆయనను దైవంగా నిలిపింది. ఆదర్శమూ, ఆచరణ, ధర్మసంరక్షణ... ఇదంతా శ్రీరామమ్. అహల్యా శాపవిమోచనం, శివధనుర్భంగం, సేతునిర్మాణం రామచరితో అద్భుతాలు. శ్యాముడిదంతా లీలావాహిని. తనను దైవంగా ప్రకటించుకుంటూనే, సర్వజీవుల యందు తానున్నానని చెబుతూ, సమస్తాన్ని ఆయనపరంగా జరిగినవన్నీ మహిమలే అయినా, అద్భుతాలే అయినా, వాటిని అనుగ్రహంగా అనుభవించింది లోకం.

రాముడైనా, కృష్ణుడైనా, రమణులైనా, సత్యసాయి భగవానుడైనా సంకల్పరహితులే. కనుక వారు చూపే మహిమలు ప్రదర్శనగా కాక నిదర్శనగా ఉంటాయి. ఆ చూపటంలోనూ ఉన్నది సాక్షీభూత స్థితే. రోగనివారణ మొదలుగా మాంగల్యధారణ, ఋణవిముక్తి, ఉద్యోగప్రాప్తి, వ్యాపార విజయం వంటి సాధారణ సమస్యలకు గురువు ప్రత్యేకంగా ఏమీ చేయకుండానే పరిష్కారం చూపగలదు. దుఃఖం నివారింపబడగానే బాధితుడు దానినొక మహిమగా భావిస్తాడు. నిజానికి మానవుడికది మహిమ.

సిద్ధపురుషులకు, అవతార మూర్తులకు అది సహజం. ఏకకాలంలో అనేక ప్రదేశాలలో ఉండటం, ఎదురుగా ఉండి అదృశ్యం కావడం, మందులకు లొంగని రోగాలను నివారించడం, రాబోయే విపత్తుల నుంచి రక్షించడం, అనేక దేవీ దేవతా రూపాలుగా దర్శనమివ్వటం, మరణం అంచు నుంచి తప్పించి ప్రాణప్రసాదనం చేయటం, ఆస్తి జానెడై అవసరం బారెడవుతున్న వేళ ఆ స్థితిని సరిదిద్దడం, ప్రమాదపుటంచుల నుంచి తప్పించి ప్రమోద లహరిపై ఆడించడం, వస్తువులు నిండుకుంటున్నప్పుడు కావలసినంత నింపటం, కాలాన్ని స్తంభింపచేయటం, కాలాన్ని పొడిగించడం, దూరదర్శనం, దూరశ్రవణం... ఇవన్నీ జ్ఞానికి సహజశక్తులు. సాధారణ జీవుడికి మాత్రం మహాద్భుతాలు.

ఎవరి ప్రమేయమూ లేదు
"రామచంద్రా! భళా! శివధనస్సును విరిచి లోకాద్భుతం చూపించావు''అన్నది లోకం. "నాకేం తెలియదు. ముట్టుకున్న మరుక్షణం అదే విరిగింది. ఇందులో నాదేమున్నది?'' అన్నాడు మాయామానుషమూర్తి రామచంద్రమూర్తి. పూతన సంహారంతో ప్రారంభమై, మహాపరినిర్వాణం వరకు సాగిన కృష్ణలీలాతరంగిణిలో, అంతా నా వల్లనే జరుగుతున్నదని కృష్ణుడు ప్రకటించిన ఆ నేను, సర్వాత్మభావనకు చెందిన నేను. కనుక ఆయనదీ అకర్తృత్వమే. "భగవాన్! అంతా మీ అనుగ్రహమే. మీ దయే'' అని ఒకరు కృతజ్ఞత ప్రకటించినపుడు. " అది అలా జరగవలసి ఉన్నది.

ఇందులో ఎవరి ప్రమేయమూ లేదు'' అన్న రమణుల అకర్తృత్వము నిజానికి అద్భుతం. "బాబా! కష్టాలలో ఉన్నప్పుడు మీ దర్శనం చేసుకున్నాను. అవన్నీ తీరి ఇప్పుడు ఆనందంగా ఉన్నాను'' అన్నప్పుడు " నీ కష్టం తీరే సమయం, ఇక్కడకు వచ్చిన సమయం కలిసినాయి. నీ కష్టం నీవే అనుభవించావు. నీ ఆనందాన్ని నీవే తెచ్చుకున్నావ్. ఇదంతా కాలచలనంలో భాగమే'' అని సముదాయించిన సత్యసాయి భగవానుడూ కర్తృత్వమెరుగని కారుణ్యమూర్తే. మానవుడి ఊహకు, శక్తికి మించి జరిగేవన్నీ మహిమలుగా, అద్భుతాలుగా అనిపిస్తాయి. కానీ అవి భగవంతుని సహజ లీలలు. "అనుగ్రహమూ గురువే. అది దైవమే'' అన్న రమణ బోధన, శ్రీరమణాద్భుతం.

- వి.యస్.ఆర్. మూర్తి
ఆధ్యాత్మిక శాస్త్రవేత్త

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP