అరుణాచలంలో అవధూత శేషాద్రిస్వామి
>> Thursday, July 19, 2012

తండ్రి వరదరాజు శ్రీవిద్యోపాసకులు. లేకలేక వారికి 1870 జనవరి 22న కామాక్షి అమ్మవారి వరప్రసాదంగా శేషాద్రి జన్మించాడు. శేషాద్రికి మూడవ ఏటనే మూక పంచశతి శ్లోకాలు కొన్ని నేర్పారు. బాలశేషాద్రి తండ్రి చెంతనే పీట వేసుకుని పూజా గృహంలో తదేక దృష్టితో దైవస్తుతి చేస్తూ ఉంటే తల్లిదండ్రులు మురిసిపోయేవారు. ఎనిమిదవ ఏట శేషాద్రికి అక్షరాభ్యాసం జరిగింది. బడిలో శేషాద్రికి ఒక నెలలోనే అమరకోశం కంఠస్థమయింది. 3 సంవత్సరాలలో పంచకావ్యాలతో పాటు తమిళ గ్రంథాలు అవలీలగా నేర్చాడు. 8వ ఏట ఉపనయనం అయిన తర్వాత శేషాద్రి తర్క వ్యాకరణాదులతోపాటు ప్రస్థాన త్రయం నేర్చుకున్నాడు. వేద పాఠశాలలో చేరి వేదాధ్యయనంతోపాటు న్యాయశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు. దురదృష్టవశాత్తు శేషాద్రి 14వ ఏట తండ్రి మరణించాడు. తల్లి మరకతంబకు అవసాన కాలం సమీపించింది. అరుణాచల స్మరణతో శరీరం చాలించింది.
అరుణాచలేశ్వరుణ్ణి వెతుక్కుంటూ.. శేషాద్రికి అంత్య కాలంలో తల్లి స్మరించిన అరుణాచలమే పదేపదే స్ఫురించసాగింది. పంచ శిఖరములగు అరుణాచలేశ్వరుని ఊహించుకుని చిత్రాన్ని చిత్రించాడు. ఆ పటాన్ని పూజలో పెట్టుకుని పంచాక్షరి జపం చేయసాగాడు. నిరాహారియై దినములు గడుపుతున్న శేషాద్రిని పెద్దలు కట్టడి చేయగా అతడు రుద్రభూమి చేరాడు. ఒకనాడు ఒక గౌడ సన్యాసి కోవెలలో ఉండగా శేషాద్రి ఆయన దర్శనం చేసుకున్నాడు.
ఆయన పేరు బాలాజీ స్వామి. హరిద్వారం నుండి రామేశ్వరం పోతూ కంచిలో ఆగాడు. స్వామి శేషాద్రికి సన్యాస దీక్ష ఇచ్చి దేవీ మంత్రాన్ని ఉపదేశించాడు. శేషాద్రి తీవ్ర సాధన చేశాడు. 1882 నాటికి శేషాద్రి తిరువణ్ణామలై చేరాడు. అవధూత లక్షణాలతో అక్కడ సంచరించాడు.
రమణులతో సహవాసం ఏదైనా అంగడిలో ప్రవేశించి శేషాద్రి అందులోని వస్తువులను చెల్లాచెదురు చేస్తే వ్యాపారం లో యజమానికి విశేష లాభం వచ్చేది. ఏ అధికారినైనా దండిస్తే వానికి పదోన్నతి లభించేది. 1886లో అరుణాచలంలోని పాతాళలింగ గంగలో ధ్యానమగ్నుడై ఉన్న బ్రాహ్మణస్వామి(రమణ మహర్షి)ని ఆకతాయిలు పీడించగా శేషాద్రి ఆయనను కాపాడాడు. భగవాన్ విరూపాక్షలో ఉన్న కాలంలో తరచు శేషాద్రి అక్కడికి వెళ్లేవాడు. అరుణాచలవాసులకు రమణ శేషాద్రిలు సూర్యచంద్రులు.
రమణులు స్థిరంగా ఒకచోట ఉంటే శేషాద్రి ఎక్కడెక్కడో సంచరించేవాడు. భగవాన్ మౌనంగా ఉంటే శేషాద్రి అధికంగా మాట్లాడేవాడు. శేషాద్రిస్వామి 40 సంవత్సరాలు అరుణాచలంలో వాసం చేసి భక్తులెందరికో ధర్మమార్గాన్ని ఉద్బోధించారు. స్వల్ప అనారోగ్యంతో 1929లో తనువు చాలించారు. భగవాన్ రమణులు శేషాద్రి పార్థివ శరీరాన్ని సమాధిలో చేర్చేటంత వరకు కొన్ని గంటల పాటు సన్నిధిలో ఉండి పర్యవేక్షించారు. శ్రీ రమణాశ్రమం ఆనుకునే ఉండే శేషాద్రిస్వామి ఆశ్రమం తిరువణ్ణామలై యాత్రికులకు సందర్శనీయం.
- రావినూతల శ్రీరాములు
1 వ్యాఖ్యలు:
Mahaatmula paricayam kaavincinanduku dhanyavaadamulu. 1986 kaadandi 1886.
Post a Comment