శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఆధ్యాత్మికతే తరుణోపాయం

>> Tuesday, July 17, 2012

ఆధ్యాత్మికతే తరుణోపాయం

భారత కులవ్యవస్థ 'వర్ణాశ్రమ ధర్మం'పై ఏర్పడింది. దీనిలో నాలుగు ప్రాథమిక కులాలు ఉన్నాయి. అందులో ఒకటి శూద్ర కులం. వీరు దాసవృత్తుల్లో ఉండేవారు. వైశ్యులు వ్యాపార, వాణిజ్య వ్యవహారాలు నిర్వహించేవారు. క్షత్రియులు ప్రజారక్షణ, సామాజిక, దేశ పరిపాలన బాధ్యతలు నిర్వర్తించేవారు. బ్రాహ్మణులు విద్యావిషయ సంబంధిత బాధ్యతలు, ఆధ్యాత్మిక ప్రక్రియకు సంబంధించిన బాధ్యతలు చూసేవారు. బ్రహ్మ స్వరూపులమని తెలుసుకున్నవారే బ్రాహ్మణులు.

బాధ్యత యొక్క ఉత్తమోత్తమ భావనను, అందులోని అపరిమిత భావనను గ్రహించిన వాడే బ్రాహ్మణుడు. అపరిమిత బాధ్యతను గుర్తించిన వ్యక్తే విద్య, మత సంబంధిత విషయాలకు ప్రాధాన్యత వహించగలరు. ఎందుకంటే ఆ రెండు అంశాలూ ఏ సమాజానికైనా అతి ముఖ్యమైన అంశాలు. ఈ విధంగా కులవ్యవస్థ రూపొందింది. ఆ కాలానికి ఇది చక్కని ఏర్పాటు. కాలక్రమేణ వ్యక్తి బ్రాహ్మణత్వాన్ని సమర్థతను బట్టి గాక పుట్టుకను బట్టి నిర్ణయించడం మొదలుపెట్టాడు.

దాంతోనే సమస్యలు మొదలయ్యాయి. ప్రతి వ్యవస్థలోనూ ఇంతే. ఏ వ్యవస్థను మనం సృష్టించినా అది దోషరహితంగా ఉండేలా బాగా పనిచేసేలా మనం నిరంతరం దానిపై కసరత్తు చేస్తూ ఉండాలి. లేదంటే ప్రారంభంలో ఎంత చక్కగా ఉన్న వ్యవస్థ అయినా క్రమంగా దోపిడీకి ఆధారంగా మారుతుంది. కాలక్రమంలో మానవ సమాజాలు సమాజంలో ఉండే ప్రతి వ్యత్యాసాన్నీ వివక్షగా మార్చే ప్రయత్నం చేశాయి. వ్యత్యాసాలుంటే ఫర్వాలేదు. ఈ ప్రపంచం వైవిధ్యంగానే ఉంటుంది. ప్రపంచం వైవిధ్యంగా ఉంటేనే బాగుంటుంది. కానీ మనం ప్రతి వ్యత్యాసాన్నీ వివక్షగా మార్చడానికి ప్రయత్నిస్తాం. అది జాతి కావచ్చు.

మతం కావచ్చు. లింగభేదం కావచ్చు..దేన్నయినా వివక్షగా మార్చేస్తాము. ఇలా మన విచక్షణ కోల్పోయి ప్రతిదాన్నీ వివక్షాపూరితంగా మార్చడం మొదలుపెట్టినప్పుడే కుల వ్యవస్థ వికృతి వ్యవస్థగా అవతరించింది. ఒకప్పుడు సమాజంలో నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా ఉన్న మార్గం దురదృష్టవశాత్తు వివక్షాపూరితంగా, ప్రతికూలంగా, పనికిమాలినదిగా తయారయింది.

ఇల్లే శిక్షణ కేంద్రం ఐఐటీలు, ఐటీఐలు, వేరే ఏ శిక్షణా కేంద్రాలు లేనపుడు కుటుంబమొక్కటే శిక్షణ ఇవ్వడానికి మార్గం. ప్రత్యేకించి ఎటువంటి శిక్షణ కేంద్రాలు లేని అటువంటి రోజుల్లో కమ్మరి సంస్కృతిని, స్వర్ణకార సంస్కృతిని, చర్మకార సంస్కృతిని కొనసాగించడం చాలా ముఖ్యం అయింది. లేదంటే ఎటువంటి నైపుణ్యాలు ఉండేవి కావు. సమర్థతను బట్టి గాక ప్రత్యేకించి ఏ వృత్తికీ క్రమబద్ధమైన శిక్షణ కేంద్రాలు లేని సమయంలో ఈ మొత్తం కుల వ్యవస్థ ఏర్పడింది. తండ్రి కమ్మరి అయితే కొడుకూ కమ్మరి అయ్యాడు. తండ్రి కంసాలి అయితే కొడుకూ కంసాలి అయ్యాడు. ఈ విధంగా ప్రతి వృత్తికి సంబంధించిన శిక్షణ కేంద్రాలు ఆ కుటుంబ వ్యవస్థలోనే ఏర్పడ్డాయి. ఎందుకంటే ప్రత్యేకించి వేరే శిక్షణ కేంద్రాలు లేవు కాబట్టి. సమాజంలోని అన్ని చేతి వృత్తులు, వృత్తి నైపుణ్యం ఇలాగే వృద్ధి చెందాయి.

ఒక వ్యక్తి కమ్మరి అయి ఉంటే కమ్మరి పని మాత్రమే చేసేవాడు. స్వర్ణకార వృత్తికి ప్రయత్నించేవాడు కాదు. ఎందుకంటే సమాజానికి కమ్మరి అవసరం ఉండేది. జనాభా పెరిగి, వెయ్యి మంది కమ్మరులు అయినప్పుడు సహజంగానే వారికంటూ ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి. వారిదైన వివాహపు ఆచారాలు ఏర్పడతాయి. వారిదైన జీవనశైలి ఏర్పడుతుంది. ఆ విధంగా వారొక కులంగా ఆవిర్భవించారు. ఒక విధంగా చూస్తే ఈ రకమైన ఏర్పాటులో ఎటువంటి తప్పూ లేదు. అది కేవలం సమాజం వెసులుబాటు కోసం ఓ ప్రత్యేక ఏర్పాటు మాత్రమే. ఉపయోగించే సుత్తి, చేసే పని, ధరించే దుస్తుల దగ్గర్నుంచి తినే తిండి వరకు ప్రతి విషయంలోనూ సహజంగానే కమ్మరికి, కంసాలికి మధ్య తేడా ఉంటుంది. ఎందుకంటే వారి పనులు భిన్నం కాబట్టి.

కులం పేరిట దోపిడీ కాలక్రమేణా ఈ కులవ్యవస్థ దోపిడీకి సాధనంగా అవతరించింది. దేవాలయాన్ని నిర్వహించే వ్యక్తి, పాఠశాలను నడిపే వ్యక్తి కన్నా మెరుగు అని మనం అనడం మొదలుపెట్టాము. కమ్మరి దుకాణం నడిపే వ్యక్తి కన్నా పాఠశాల నడిపే వ్యక్తి మిన్న అని అంటున్నాము. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఈ తేడాలుంటాయి. కాలక్రమేణా ఈ తేడాలను వివక్షగా మార్చేశాము. పనిలో భేదాలను భేదాలుగా మాత్రమే ఉంచగలిగినట్లయితే మన సంస్కృతి చక్కగా, వైవిధ్యంగా ఉండేది. కానీ మనం దాన్ని వివక్షాపూరితంగా మార్చేశాం. మనుషులు ప్రతి భేదాన్నీ వివక్షగా మార్చేస్తారు. ఎందుకంటే ప్రతి మనిషీ ఇప్పుడు తానున్న స్థితి కంటే ఇంకా కొంచెం మెరుగ్గా ఉండాలని తీవ్రంగా కాంక్షిస్తాడు. ఇందుకోసం అతడు కనిపెట్టిన ఒక దురదృష్టకర మార్గం పక్కనున్న వ్యక్తిని అణిచివేయడం.

నిజానికి మనిషి కాంక్ష ఇంకా మెరుగ్గా ఉండాలని. కానీ అతనికి తనను తాను ఎలా వృద్ధి చేసుకోవాలో తెలియదు. అందువల్ల మరొకరిని తక్కువ చేసి చూడడం అతనికి ఉత్తమ మనిపిస్తుంది. అది అపరిపక్వపు బుద్ధి. కానీ మనం చాలా కాలంగా ఇలాగే వ్యవహరించాము. ఇలాగే వ్యవహరిస్తున్నాము. దాన్ని మార్చాల్సిన తరుణమిదే. కానీ పాత కులవ్యవస్థను తొలగించినంత మాత్రాన మార్పు రాదు. ఎందుకంటే అది వేల విధాలుగా రూపాంతరం చెందుతుంది.

ఉదాహరణకు న్యూయార్క్ నగరంలో కులవ్యవస్థ లేదనుకుంటున్నారా? విద్యాపరంగానో, ఆర్థిక సామర్థ్యం ఆధారంగానో మరో రకమైన కులవ్యవస్థ అక్కడ ఉంది. కాబట్టి మనిషి ఆలోచనలో విప్లవాత్మక మార్పు తీసుకురానంత వరకు మార్పు రాదు. వ్యక్తిగతంగా ఎవరిలోనూ కలుపుకునే భావన లేకపోతే వారు సృష్టించిన వ్యవస్థలు, వారు చేసే పనులు కలుపుగోలుతనానికి దారి తీయవు. వ్యక్తిగతంగా ఎవరూ ఈ కలుపుగోలుతనాన్ని అనుభూతి చెందకపోతే వారు పరిమిత విధానాలను సృష్టించడంతోనే ఆగిపోతారు. ఆధ్యాత్మిక ప్రక్రియలో ఇమిడి ఉన్న ప్రాథమిక అంశం ఏమిటంటే, అది వ్యక్తిని పూర్తి సంఘటిత మానవుడిగా మారుస్తుంది. అదే ఆ వ్యక్తిని మరింత సమర్థుడిగా, మరింత యోగ్యుడిగా, మరింత సమతుల్యంగా దాని ద్వారా అతనిని మరింత ఫలవంతునిగా తీర్చిదిద్దుతుంది.

2 వ్యాఖ్యలు:

anrd July 17, 2012 at 11:50 PM  

చక్కటి పోస్టును అందించినందుకు కృతజ్ఞతలండి.

GKK July 18, 2012 at 5:58 AM  

ఈ వ్యాసం చాలా బాగుంది. నెనర్లు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP