శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దళితుల్లో ఆత్మగౌరవం పెరగాలి

>> Tuesday, July 31, 2012

దళితుల్లో ఆత్మగౌరవం పెరగాలి
- పరిపూర్ణానంద స్వామి

'దళితులు ఏం చెయ్యాలి?' అనే కంచె ఐలయ్య వ్యాసం (జూలై 13, ఆంధ్రజ్యోతి)లో ప్రస్తావించిన ముఖ్యాంశాలు : అగ్రకులాలు, అణగారిన కులాలు. గ్రామస్థాయిలో మిలీషియాల ఏర్పాటు. ఒక్క వర్గానికే చెందిన హిందుత్వం హిందూ దేవతలు అగ్రకులాల వారికే పరిమితం. కొత్త దేవుడు కావాలి అనే అంశాలకు దీటైన సమాధానమే ఈ శీర్షిక. ఇది కేవలం సమాధానమే కాదు. కనువిప్పు కలిగించే నిప్పులాంటి నిజం కూడా. కారంచేడు, లక్షింపేటలలో జరిగిన ఉదంతాన్ని తీసుకుని దళితులు, అగ్రశూద్రకులాలు అని ఉటంకించిన విధానం వ్యాస రచయిత మనోగతాన్ని ఆవిష్కరించింది.

వారు సమ్యక్ దష్టితో కాకుండా, గంతలు కట్టుకుని ధార్తరాష్ట్రీకమైన దృక్పథంతో సమస్యను సత్యదూరంగా పరిశీలిస్తున్నారనేది తేటతెల్లంగా అర్థమౌతుంది. ఈ ప్రబోధాల వలన అణగారిన సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి వాటిని సమూలంగా భ్రష్టుపట్టించాలనే కుట్ర స్పష్టంగా బయటపడుతోంది. ఉక్రోషంతో, ఆక్రోశంతో నేడు సలసల మరుగుతున్న ఈ కులాల చిచ్చును ఇంకా రెచ్చగొట్టే వీరి రచనలు ప్రత్యక్షంగా మానవ సమాజాన్ని మారణహోమానికి సిద్ధం కావాలనే సంకేతాలిస్తున్నాయి. ఒక విద్యావేత్తగా, సామాజిక స్పృహ కలిగిన శాస్త్రవేత్తగా, సమాజంలో సమత్వాన్ని రచించాలనుకునే రచయితలో పొంగుకొచ్చిన ఈ కాలకూట భావజాలాన్ని ఏ సభ్యసమాజమూ హర్షించదు, స్వాగతించదు.

కుల వివక్ష దారుణాల వెనుక దాగున్న వాస్తవాలను తప్పక వెలికి తీసుకురావాలి. దానిని పరిష్కరించే మార్గంలో కొత్త కొత్త సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇటువంటి సంఘటనల వెనుక వ్యక్తుల స్వార్థము, రాజకీయ ప్రయోజనము, ఆర్థిక దురహంకారాలే కీలకమైన కారణాలుగా పనిచేస్తుంటాయి. ఒక నేరానికి సంబంధించిన దోషాన్ని, ఆ నేరస్థుడికే ఆపాదించాలి. దానిని కులానికి అంటగట్టకూడదు. శరీరానికి జబ్బుచేస్తే, ఆ జబ్బుని కులానికి ఆపాదిస్తామా? లేదే, అలాగే ఇదీ ఓ భయంకరమైన మానసికవ్యాధి, ఈ వ్యాధి ఏ వ్యక్తిలో పొడచూపుతుందో ఆ వ్యక్తినే నిలదీయాలి. అతనినే శిక్షించాలి. అంతేకాని, సమస్యను పక్కదారి మళ్ళించి, దానిని కులాలకు ఆపాదించి మొత్తం సమాజాన్ని రావణకాష్ఠం చేయాలనే ఈ రచనల వెనుక కూడా భయంకరమైన మానసిక జబ్బు దాగుందనే అంశం స్పష్టమౌతుంది.

ఏ నేరస్తుడిని తీసుకున్నా, అతడు ఏదో ఒక కులానికి చెందే ఉంటాడు. అలాంటప్పుడు ఒక బ్రాహ్మణుడు ఏదైనా తప్పు చేస్తే, దానికి బ్రాహ్మణ కులాన్ని తప్పుపట్టడం ఎంత ఉన్మాదమో, ఒక దళితుడు లేదా శూద్రుడు చేసిన తప్పుకి మొత్తం దళితులనూ లేదా మొత్తం శూద్రులనూ తప్పుపట్టడం కూడా అంతే ఉన్మాదం. లక్షింపేటలోని హంతకులను క్రూరులుగా, ఉన్మాదులుగా, అజ్ఞానులుగా, అనాగరికులుగా దూషించండి. కానీ, కులం పేరుతో అందరినీ ఒకే గాటన కట్టడం సమంజసమే కాదు, శోచనీయాంశం కూడా!

కులమనేది ఓ సాంఘిక వ్యవస్థ. నేరస్థుల్లో ఏర్పడ్డ కాలుష్యాలను కులానికి అంటగట్టి కుల వ్యవస్థను సమూలంగా దెబ్బతీసేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అందులో భాగమే దళితులు ఏం చెయ్యాలనే శీర్షిక. ఈ శీర్షిక చదివితే, వ్యాస రచయిత అంతరంగం బట్టబయలౌతుంది. సమస్యను దారిమళ్ళించి, పరిష్కారం చూపకుండా సమాజంలో వైషమ్యాలను సృష్టించాలనే వారి మనోభావం స్పష్టమౌతుంది. అసలు కులం అంటే ఏమిటి? కులం ప్రాధాన్యతలు, వాటివల్ల కలిగే ప్రయోజనాల గురించి విద్యావేత్తలకు, సామాజిక శాస్త్రవేత్తలకూ సమగ్రమైన అవగాహన ఉండాలి. వ్యక్తులలో దాగున్న లోపాలను, వ్యక్తులు చేసే నేరాలను కులానికి అంటగడితే! సమస్య పక్కదారి పట్టడమే కాక, సమాజంలో సమతుల్యత లోపిస్తుంది. కులపోరాటాలు తెర మీదకు వస్తాయి. సమస్యలు విలయతాండవం చేస్తాయి. ఈ సందర్భం కొరకు వేచి ఉన్న రాబందులకు ఇవి చాలా... చాలా... లబ్ధిని చేకూరుస్తాయి.

సంక్లిష్ట సమస్యలను చట్టం ఒక్కటే స్వతంత్రంగా పరిష్కరించలేదని సనాతన హిందూ నాగరికత శతాబ్దాల క్రితమే గుర్తించింది. సమస్య మూలం ఏ కోణంలో దాగి ఉందో, దానిని గుర్తించడం సంక్లిష్టమైనపుడు వివేకయుక్తమైన నివారణలను కూడా హైందవ వ్యవస్థ సిఫార్సు చేసింది. దీనికి ఉదాహరణ... ఆదిశంకరాచార్యులు అనుగ్రహించిన చక్కని తరుణోపాం సత్సంగమే. 'సత్సంగత్వే నిస్సంగత్వం! నిస్సంగత్వే నిర్మోహత్వం! నిర్మోహత్వే నిశ్చలతత్త్వం! నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః!' సత్సంగం ద్వారా వ్యక్తి దుస్సంగాల నుంచి వైదొలుగుతాడు. అట్టి వ్యక్తిలో క్రమేపీ మోహం తగ్గుతుంది. తద్వారా ఆ వ్యక్తి సత్యాన్ని, వాస్తవికతను దర్శించే మహనీయుడౌతాడు. అట్టి మహనీయులే ఒకప్పుడు ఈ భారతావనికి ఆదర్శమూర్తులయ్యారు.

ఈ సంస్కృతిలో వైద్యులు, విద్యావేత్తలు, న్యాయాధీశులు, మానసిక నిపుణులు సాధించలేని పరిష్కారాన్ని, ఆధ్యాత్మిక భావజాలంతో మహాత్ములు సాధించిపెట్టారు. ఇంతటి భాగ్యం మరే పౌరుడికి, ఏ జాతికి దక్కని విషయం నిర్వివాదాంశమే! కాబట్టి విజ్ఞులు పారదర్శకతతో లోకహితమైన శాంతిని ప్రబోధించాలే కానీ, వక్రభాష్యాలను కల్మషాలను కార్పణ్యాలను ప్రబోధించి రెచ్చగొట్టకూడదు. సద్గురువుల ప్రబోధాలను పెడచెవినపెట్టే సమాజం తప్పక అధోగతి పాలౌతుందనేందుకు శ్రీకాకుళం జిల్లా లక్షింపేట ఉదంతమొక్కటే చాలు. ఇక్కడో విచిత్రం!

కడుపునొప్పితో బాధపడుతున్న మగవాడిని గైనకాలజిస్ట్‌కు చూపించమనడం ఎంత హాస్యాస్పదమో, వ్యక్తులు చేసే నేరాలకు కులాలను రొంపిలోకి లాగడం అంతకన్నా అవివేకం వేరే ఉండదు. ఇదీ చాలదన్నట్లు ఈ నేరాలకు, సమస్యలకు హిందూ శాస్త్రాలు, హిందూ దేవతలే కారణమని విమర్శిస్తూ రాసిన రచనలో ఎంత కుటిలత దాగుందో సమాజం గుర్తిస్తూనే ఉంది. పటిష్ఠమైన భారతీయ వ్యవస్థపై, పవిత్రమైన హిందూ ధర్మంపై దుమ్మెత్తిపోస్తూ రాసిన శీర్షికను బహిరంగంగా ఖండిస్తున్నాము.

రోగాన్ని పరిశీలించిన వైద్యుడు క్యాన్సర్‌గా గుర్తించి కొన్ని పరీక్షలు చేసిన తరువాత కూడా కెమో, రేడియేషన్‌లు ఇచ్చే ముందు అప్రమత్తతను ప్రదర్శిస్తాడు. అలాగే, సామాజిక శాస్త్రవేత్తలుగా రచయితలుగా చలామణీ అయ్యేవారు ఇంకా, చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాకాక, బాధ్యతా రాహిత్యంతో గ్రామస్థాయిలో మిలీషియాలు తయారుకావాలని రాసిన రాతలు సమాజాన్ని ఎంత దిగజారుస్తుందో గమనించగలరు. ఇటువంటి ప్రబోధాలను తీసుకోవడానికి ఎంతమంది ముందుకు వస్తారో చెప్పమనండి? భయం ద్వారానే మానవత్వాన్ని మలచాలనుకునే రచయిత ఎలాంటి కొత్త మతాన్ని ప్రజలపై రుద్దాలనుకుంటున్నారు?

మానవత్వం ప్రతి ఒక్కరిలోనూ అవసరమే కదా! మరి ప్రతి ఒక్కరినీ భయపెట్టడానికీ, దేశసౌభాగ్యానికీ ఆయన అనుసరించదలచిన మార్గం ఏమిటి? ఇదే అర్థంకాని మిలియన్ డాలర్ ప్రశ్న. దళిత సోదరులు ఏం చేయాలనే సంగతికి వస్తే, నేను సూటిగా ఒక్కటే చెబుతాను. వారిలో ఆత్మగౌరవం పెరగాలి. ఇందుకు సరైన నామకరణం కావాలి. దురుద్దేశపూర్వకంగా దళితులనే శబ్దాన్ని పదే పదే ప్రయోగిస్తూ అణగారినవారు, అంటరానివాళ్ళు, పామరులుగా దానికి అర్థాన్ని ఆపాదించి దళితులను ఎప్పటికీ అణగద్రొక్కి ఉంచాలనే కుట్రను సోదరులు గమనించి తిప్పికొట్టాలి.

గుజరాత్ భూకంపం సమయంలో కట్టుబట్టలతో నడివీధిలో మిగిలినవారికి దుస్తులు లారీలకొద్దీ సహాయంగా వస్తే, వద్దని వారు తిప్పి పంపారు. మాకు మీ సాయాలు వద్దు. అప్పు ఇవ్వండి చాలు. తిరిగి సంపాదించి తీరుస్తాం అన్నారు. ప్రకృతి శక్తుల మీద పోరాటంలో అపారమైన ధైర్యాన్ని చూపించే దళితులు తమకు స్ఫూర్తిదాయకమైన పేరుని ఎందుకు కనుగొనలేకపోతున్నారు? దాని ద్వారా ఐక్యతను సైతం బాటలు వేసుకునే అవకాశాన్ని ఎందుకు అన్వేషించడం లేదు?

హిందూ దేవుళ్ళు నరసింహులైతే, వారిని అనుసరించేవారందరూ నరరూప రాక్షసులని విమర్శించే రచయితలో ఎంత క్రూరమైన మృగం దాగుందో గమనించవచ్చు. దీనినిబట్టి చూస్తే రచయితకు పాపం! మన పురాణాల గురించి ఓనమాలు కూడా తెలియదనే అంశం తేటతెల్లమౌతుంది. పురాణాల్లో దాగున్న మరో కోణాన్ని కూడా వివరిస్తాను! నరసింహుడు అగ్రవర్ణాల దేవుడని ఆయన భావిస్తున్నారేమో? నరసింహుడు వధించిన హిరణ్యకశిపుడు శక్తిమంతుడు, అగ్రవర్ణానికి చెందినరాజు. దళితుడు కానేకాడు. పైగా నరసింహుడు పెళ్లాడినది గిరిజన యువతి చెంచులక్ష్మిని. అన్నింటినీ మించి ఈనాటికీ అంతరం, అభ్యంతరం లేకుండా బడుగు బలహీన తెగలు మాత్రమే కాదు శూద్ర, కమ్మ, రెడ్డి, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణాది సమస్త హైందవ వర్ణాలు నరసింహుడుని దేవుడుగా కొలుస్తున్నాయి.

మన పురాణాల్లో భక్తులు జాబాలి, సత్యకాముడు, అరుంధతి, అంబరీషులు ప్రాతఃస్మరణీయులు. మన చరిత్రలో శబరి, కన్నప్ప, కనకదాసు, సంత్ రవిదాస్, సూరదాస్, తుకారాములు చిరస్మరణీయులు. సమకాలీన సమాజంలో నారాయణగురు, మళయాళస్వామి, మాతా అమృతానందలు వందనీయులు. వీరందరూ బడుగు బలహీన సామాజిక వర్గంలోనే అవతరించి తరించారు. లక్షలాదిమందిని తరింపజేశారు. ఇంతటి పారదర్శకత కలిగిన జాతి, ధర్మము, దేశము ఒక్క మన భారతమాతేనని సగర్వంగా చెప్పుకోవాలి. ఇక్కడ ప్రతీ హిందువు తలెత్తుకు తిరగాలి. కులపోరాటాలు, మిలీషియావాదాలు మన జాతివి కావు. ఇది వలస వచ్చినవారి దురాలోచనలని స్పష్టంగా బయటపడుతోంది.

దీనికి అమ్ముడుపోయినవారే ఈ భావాలను ఇంకా... ఇం...కా! సమాజంలో వ్యాపింపజేసి మనదేశాన్ని, మన సంస్కృతిని నాశనం చేయాలనే దురుద్దేశంతో కొత్త దేవుడి వాదనను తెరపైకి తెచ్చారు. ప్రస్తుత హిందూ దేవుళ్ళను మించిన కొత్తదేవుణ్ణి దళితుల మధ్య ప్రవేశపెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. దేవుడంటే సర్వాంతర్యామి, ఆదిమధ్యాంతరహితుడు, సర్వశక్తిమంతుడు, ఒకే ఒక్కడని సకల మతాలూ కట్టకట్టుకుని ఘోషిస్తుంటే, ఈయన ప్రబోధం మాత్రం మానవుడు కదపగలిగే పావుగా దేవుడిని చిత్రీకరిస్తున్నాడు. ఆయన కొత్త దేవుడిని ప్రవేశపెట్టే వింత ఏమిటో చూడాలని నాకూ ఆసక్తిగానే ఉంది. ఈ కొత్త దేవుడి పిచ్చివాదనను ఎవ్వరూ అంగీకరించరు. ఆహ్వానించరు కూడా. అందుకే, మనకు కొత్త దేవుడు వద్దు. మన భావాలలలో కొత్తదనం రావాలి. అప్పుడే మనదేశం పూర్వపు వైభవం సంతరించుకుంటుంది.

- పరిపూర్ణానంద స్వామి


 కంచె ఐలయ్య గారి విషపూరిత వ్యాసం ఇక్కడ చూడండి
 http://andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/jul/13/edit/13edit4&more=2012/jul/13/edit/editpagemain1&date=7/13/2012

8 వ్యాఖ్యలు:

Jai Gottimukkala July 31, 2012 at 11:47 PM  

కారంచేడు, లక్శింపేట వగయిరా సంఘటనలో జరిగిన దాడులు వ్యక్తిగతమయినవా? కులం పేరు మీద జరిగిన అత్యాచారాన్ని ఒక వ్యక్తి చేసిన నేరంగా చిత్రీకరించడం విడ్డూరం కాదా?

మన భావాలలో కొత్తదనం రావాలన్నారు. బాగుంది, అదేంటో కూడా చెబితే ఇంకా బాగుంటుంది.

దళితులలో ఆత్మవిశ్వాసం మరియు ఆత్మగౌరవం పెరిగినందుకే ప్రతిఘటన మొదలయింది. Your advice is therefore redundant.

durgeswara August 1, 2012 at 7:31 AM  

ఆత్మగౌరవం పెరిగినందుకు ప్రతిఘటన ఎదురైందని మీరు తీర్పు ఇవ్వటం కాక . మాఱుతున్న కాలంతో పాటూ పెరుగుతున్న సమ్స్యల విభిన్న కోణాలను కూడా పరిశీలించాలనేది పరిపూర్ణానంద వారు వ్రాసిన ఈవ్యాసంలో భావం అని గమనించాలి .

Jai Gottimukkala August 2, 2012 at 12:06 AM  

The attacks happened because of caste. What is the point in advising the victims to look beyond caste? What is his advice to the aggrssors? Why does he not condemn the perpetrators of the outrage?

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) August 2, 2012 at 2:53 AM  

అసలు ఐలయ్య గారి వ్యాసం నేను చదవలేదు. పరిపుర్ణానందం గారు అనుకొన్నట్టుగా వ్యాసం ఉంతే ఈయన ఖండన కూడా బానే ఉంది. ఆయన వ్యాసం గురించీ ఈయన ఖండన గురించీ నాకేమీ అభ్యంతరరాలు లేవు.

కాకపోతే ఏదో వ్యాసాన్ని ఖండించే క్రమంలో పరిపూర్ణానందం గారు తమ సొంత ఆలోచనలని కొన్నింటిని చెప్పారు. వాటి విషయంలో మాత్రం నేను ఆయనతో అంగీకరించలేని.

>>"దళిత సోదరులు ఏం చేయాలనే సంగతికి వస్తే, నేను సూటిగా ఒక్కటే చెబుతాను. వారిలో ఆత్మగౌరవం పెరగాలి. ఇందుకు సరైన నామకరణం కావాలి. దురుద్దేశపూర్వకంగా దళితులనే శబ్దాన్ని పదే పదే ప్రయోగిస్తూ అణగారినవారు, అంటరానివాళ్ళు, పామరులుగా దానికి అర్థాన్ని ఆపాదించి దళితులను ఎప్పటికీ అణగద్రొక్కి ఉంచాలనే కుట్రను సోదరులు గమనించి తిప్పికొట్టాలి"

దళితుల్లో ఆత్మ గౌరవం పెరగాలి అని ఈయన చెప్పడం మాత్రం కొంచెం దురహంకార పూరితంగా ఉంది. కొన్ని జాతులకీ, వర్గాలకీ ఆత్మ గౌరవం పెంచుకుమ్మనీ తగ్గించుకొమ్మనీ ఉద్భోద చేస్తాడన్నమాట ఈయన :(

durgeswara August 2, 2012 at 10:27 AM  

సరే ! ఆయన దళితులు ఆత్మగౌరవం పెమ్చుకోవాలనుకోవటం తప్పుగా మీకనిపిస్తే మరి తెల్లవారిలేస్తే దళిత దళితేతర నాయకులు పదెపదే ఈమాటే ప్రవచిస్తుంటారు గదా అది మీకు తప్పుగాతోచటం లేదా ? కోడిగుడ్డు మీద వెంట్రుకలపీకాలనుకోవటమనే సామెత గుర్తొస్తుంది .

Anonymous August 2, 2012 at 6:20 PM  

కుల కొట్లాటలకు పరిష్కరంగా కొత్త దేవుడిని పెట్టుకుంటే తీరుతాయనుకోవడమంత మూర్ఖత్వం మరోటి వుండదు. ఈ ఎదవలకు సున్నీ, షియాల, అహమ్మదీ, మొహాజిర్ల మధ్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయని అర్థమయితే ఇలా వాగేవారా?

ఆత్మగౌరవం పెంపొందిచుకోవాలనే సలహాలో తప్పు లేదు. దాన్ని ఆయన వెనక్కు తీసుకోవాలంటే "ఆత్మన్యూనత పెంచుకోండి" అనో , ' అసలు ఆత్మలుంటేగా గౌరవాలుండేదానికి' అని చెప్పాల్సి వస్తే అది బాగోదు.

Jai Gottimukkala August 2, 2012 at 11:04 PM  

@Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్):


మీరు ఐలయ్య గారి వ్యాసం చదవండి. ఐలయ్య రాసినది కులహింస గురించి కానీ పరిపూర్ణానంద స్వామి గారు దాన్ని వ్యక్తిగత హింసగా వక్రీకరించి భాష్యం చెప్పారు.

Swamyji is reinterpreting the events in a way that will further his own agenda.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) August 3, 2012 at 12:28 AM  

సామెతల దేముందిలెండి. మనకిష్టమొచ్చినట్టు గుర్తుకు తెచ్చుకోవచ్చు. దళితులైనా వేరేవరైనా వాళ్ళ ఆత్మ గౌరవానికి భంగం కలిగే సందార్భాలొచ్చినప్పుడు గొంతెత్తుతారు. అందులో నాకేమీ తప్పు కనపడదు.

పరిపూర్ణానందం గారు మనుషులు ఆత్మ గౌరవంతో ఉండాలీ దాన్ని కాపాడుకోవాలి అని చెప్తే ఎవరీకీ ఏమీ అభ్యంతరం ఉండదండీ. ఒకవర్గం మొత్తానికీ ఆత్మ గౌరవం లేనట్టూ వాళ్ళకి ఈయన ఉద్భోద చెయ్యనూనడం లాంటి విషయాలు చూస్తేనే దళితులకైనా ఎవరికైనా అనుమానాలొస్తాయి మరి.

ఈయన ఇదే వ్యాసంలో చెప్పినట్టు, ఆత్మ గౌరవం లేని వాళ్ళూ, ఉన్న వాళ్ళూ అన్ని వర్గాల్లోనూ, ఉంటారు. దాన్ని ప్రత్యేకంగా కొన్ని వర్గాలకీ , కులాలకీ అంటగట్టడం దురహంకారమే అని చాలా మందికి అనిపిస్తుందండీ.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP