పంచ మహాయజ్ఞాలు
>> Friday, July 13, 2012
బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అను ఈ నాలుగు ఆశ్రమాల్లో గార్హస్థ్యం శ్రేష్ఠమైనదని అయితే గార్హస్థ్య ధర్మాన్ని నిర్వ ర్తిస్తున్న సమయంలో గృహస్థునకు ఐదు రకాల పాపం అంటుతుందని ఆ పాప నివారణ కొరకు గృహస్థుడు పంచ మహాయజ్ఞాలను చేయవలసి ఉంటుందని తెలుసుకున్నాం. యజ్ఞాలు, యాగాలు, హోమాలు అంటేనే అవేవో హిందువ్ఞలకు మాత్రమే సంబంధించినవి అనుకొంటారు. గృహస్థునిగా ఉండు వానికి వచ్చు పాపాలుగానీ, వాటి నివారణకై చేయవలసిన యజ్ఞాలు గానీ ప్రపంచంలోని మనుష్యులందరికీ సంబంధించినవే, అందరూ చేయవలసినవే, చేయగల్గినవే. వాటిని గూర్చి మహర్షి మళయాళ స్వాముల వారు, మహర్షి దయానంద సరస్వతి స్వాముల వారు అందరికీ అర్థమయ్యే భాషలో, సులభ శైలిలో వివరించారు. ఆ ఐదు యజ్ఞాలు 1. బ్రహ్మయజ్ఞం, 2. పితృయజ్ఞం 3. దైవ యజ్ఞం 4. భూతయజ్ఞం 5. మనుష్యయజ్ఞం (అతిథి యజ్ఞం)
1. బ్రహ్మయజ్ఞం: దీనినే బుషి యజ్ఞమని కూడా అంటారు. వేదాది శాస్త్రములను చదువ్ఞట, చదివించుట, సంధ్యోపాసన, యోగాభ్యాసము. హిందువేతరులు వారి వారి మతగ్రంథాలను చదు వ్ఞట, చదివించుట, ప్రార్థించుట, ధ్యానించుట. వీనిలో ఏదైనా ఒకదానినైనా చేయక భుజింపరాదు.
2. పితృయజ్ఞం: తల్లితండ్రులను, జ్ఞానులను, యోగులను, బుషులను సేవించుట. పితృయజ్ఞం అంటే వృద్ధులైన తల్లితండ్రులకు, పెద్దలకు శ్రద్ధతో అన్నపానాదులు, వస్త్రాలు ఇచ్చి సేవించుట. వారు జీవించియున్నంత కాలము ఇలా సేవ చేయాలి. చనిపోయిన పెద్దలను గుర్తుచేసుకొని వారు ఎక్కడ ఏరూపంలో నున్నా వారికి మంచి జరగాలనే తలంపుతో అన్నదానం, వస్త్రదానం సంఘంలోని పేదలకు చేయటం మంచిదే.
కానీ కొంతమంది బ్రతికియున్నంతకాలం తల్లితండ్రులను చూడ కుండా వారు చచ్చిన తర్వాత తద్దినాలు చేయక పోతే తమకు కష్టాలు, నష్టాలు వస్తాయని, సంఘానికి భయపడి ఏమేమో చేస్తారు. అలా చేయరాదు. అప్పుడప్పుడు ఆ పెద్దలను జ్ఞప్తికి తెచ్చుకోవటం, వారు అనుసరించిన మంచి పద్ధతులను గుర్తుకు తెచ్చుకొని ఆచరణలో పెట్టటం-ఇది జరుగువలసింది.
3. దేవయజ్ఞం: అగ్ని యందు వేల్చు హోమము. దీనిని ప్రాతః సాయం రెండు సమయములందు చేయాలి. ప్రాతఃకాలమున అగ్ని యందు హోమము చేయబడిన ద్రవ్యం వలన ఇంట్లో శుద్ధమైన వాయువ్ఞ సాయంకాలం వరకు బలమును, ఆరోగ్యమును ఇస్తుంది. అట్లే సాయంకాలం చేయు హోమము వలన మళ్లీ తెల్లవారే వరకు ఇంట్లో శుద్ధమైన వాయువ్ఞ లభి స్తుంది. ఏ మతం వారైనా, ఏ జాతివారైనా ఉదయం, సాయంత్రం మంచి వాసననిచ్చే అగరు బత్తీలనైనా ఇంట్లో వెలిగించాలి. తక్కువ ధరకు వచ్చే ఉత్త పుల్లలను కాదు. మంచి బత్తీలను వెలిగించటానికి వెనుకాడితే రోగక్రిములు వృద్ధి చెంది, రోగాలు వచ్చి వందల రూపాయలు మందులకు పెట్టవలసి వస్తుంది.
4. భూతయజ్ఞం: భోజన పదార్థాలన్నీ సిద్ధమై నపుడు కుక్కలు, పిల్లులు, కాకులు, చీమలు మొదలగు ప్రాణులకు కొంతపెట్టాలి. మనం వండుకొన్న ఆహారం మనం మాత్రమే తింటే పాపం వస్తుందని పెద్దలు చెబుతారు. సాధార ణంగా అన్ని మతాల వారు దీన్ని ఆచరిస్తుంటారు. శ్రద్ధగా, క్రమంగా ఆచరిస్తే మంచిది.
5. అతిధి యజ్ఞం: (మనుష్య యజ్ఞం) తిథి నిశ్చితం లేని వ్యక్తి అతిథి. అతడు ధార్మికుడై ఉండాలి. సత్యాన్ని పలుకుతూ సత్యోపదేశకుడై ఉండాలి. అలాంటివాడు అకస్మాత్తుగా ఒకరి ఇంటికి వస్తే గౌరవంగా చూసి అన్నపానములను అందించాలి.
ప్రతి ఒక్కరూ ఇంతమంచి పనులను చేస్తే, పరోపకార పనులను చేస్తే పుణ్యం రాదా? పాపం నశించదా? భగవంతుడు ప్రీతి చెందడా? వర్తమాన కాలాన్ని ఇంత చక్కగా వినియోగించు కొన్నవారికి మంచి భవిష్యత్తు ఉంటుందనటంలో సందేహమేముంటుంది?
అందరి క్షేమాన్ని కాంక్షించే మన పెద్దలు ఈ యజ్ఞాలను నిర్ణయించారు గానీ ఏ ఒక్క కులానికీ, వర్గానికో మేలు చేయాలని కాదు. జాగ్రత్తగా గమనించి ఆచరించాలి.
- రాచమడుగు శ్రీనివాసులు
0 వ్యాఖ్యలు:
Post a Comment