శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అమ్మ

>> Monday, January 30, 2017


తెలియకపోతే తెలుసుకోండి.......
ఈ రోజో...నిన్ననో పుట్టిన బిడ్డ బాగా ఏడుస్తూనే ఉండటం మనం
చూస్తూనే ఉంటాము.....ఈ బిడ్డ ఎందుకు ఏడుస్తుందో అని తెలుసుకోవాలని
ఉన్నా ఏవో కారణాల వలన తెలుసుకోలేకపోయి ఉండవచ్చు......
నిజంగా ఓ బిడ్డ పుట్టగానే ఎందుకు ఏడుస్తుంది అంటే........
అమ్మ కడుపులో ఉన్న ఆ 10 నెలలు లయబద్ధకంగా వినపడే గుండె చప్పుడును
వింటూ తన్మయం చెందుతూ ఉంటుంది.......ఆ చప్పుడులో తనను తాను
మరచిపోయి ఆ చప్పుడే తనకు రక్షణగా భావిస్తూ ఉంటుంది...
బయటి ప్రపంచంలోకి రాగానే ఆ చప్పుడు దూరమై తనకు ఏదో అవుతోంది
అని భయంతో వెక్కి వెక్కి ఏడుస్తుంది ఆ బిడ్డ,,,,,,,,,ఆ ఏడుపు ఆ తల్లి
ఒడిలోకి చేరగానే ఆపేస్తుంది గమనించండి.......తల్లి తనను దగ్గరకు
తీసుకోగానే మళ్ళి ఆ గుండె చప్పుడు విని తనకు ఏమీ భయం లేదని
ఆ బిడ్డకు తెలిసిపోతుంది.......
నిజంగా తల్లిమీద ఆ పసికూనకు ఎంత నమ్మకమో కదా! అమ్మ ప్రేమకు
అనురాగానికీ సాటి లేదు.......చివరికి తన గుండె చప్పుడు కూడా ఆ బిడ్డకే అంకితం చేసే అమ్మతననికి నా శాతకోటి వందనాలు!
నాకు ఈ ప్రపంచం లో అమ్మ తరువాతే ఎవరైనా.......
ఫ్రెండ్స్ అమ్మ తిట్టిందనో,కొట్టిందనో,నాకేది చేయలేదనో అమ్మను దూరం చేసుకోకు మిత్రమా మనకు ఆమె జన్మనివ్వడం ఒక్కటి చాలు మనం జీవితాంతం ఆమెకు ఋణపడి ఉండడానికి..........
So friends అమ్మ మనల్ని చూసుకొన్నంతగా కాకపోయినా దానిలో అణువంతయిన చూస్తారని భవిస్తూ.........
Thank you మిత్రమా.....

Read more...

మీ అమ్మ మారిపోయిందమ్మా!

మీ అమ్మ మారిపోయిందమ్మా!



(శ్రీమతి గన్నవరపు సరోజినీ సత్యనారాయణమూర్తిగారి స్మారక కథలపోటీలో మొదటి బహుమతి గెల్చుకున్న కథ )


మీ అమ్మ మారిపోయిందమ్మా!


   “మీ అమ్మ మారిపోయిందమ్మా..”అన్న నాన్నగారి మాటే నా చెవుల్లో గింగుర్లెత్తుతోంది. ఈ మాట ఆయన నాలుగునెలలక్రితం ఫోన్ లో అన్నారు. “అమ్మ మారడమేంటి నాన్నా!” అనడిగితే “ఏమోనమ్మా! నాకలా అనిపిస్తోంది..” అని అక్కడితో ఆపేసారు. మళ్ళీ నెల్లాళ్ళ తర్వాత అదే మాట. “ఏం జరిగింది నాన్నా!” అంటే “ఇదివరకులా లేదమ్మా.. ఇదివరకు అస్సలు యిల్లు కదిలేది కాదా! ఇప్పుడు అస్తమానం ఎక్కడికో అక్కడకి వెడుతోంది.” అన్న నాన్నగారి మాటలకి హోస్.. అంతేనా అనిపించింది. “పోనీ, వెళ్ళనీ నాన్నా.. ఇప్పటికి కదా అమ్మకి కాస్త వెసులుబాటయిందీ..ఇన్నాళ్ళూ యిల్లు పట్టుకునే వుంది కదా..!” అని తేలిగ్గా తేల్చేసాను. అప్పటికి వూరుకున్నారు నాన్న. మొన్న మళ్ళీ ఫోన్ చేసినప్పుడు “ఏవిటోనమ్మా! మీ అమ్మ యిదివరకులా లేదు. ఎప్పుడూ లేనిది డబ్బు లెక్కలు కూడా అడుగుతోంది.” అన్నారు. ఈ మాటకి కాస్త ఆశ్చర్యం వేసింది నాకు. ఎందుకంటే అమ్మ డబ్బు విషయం యెప్పుడూ పట్టించుకునేది కాదు. ఆ విషయాలన్నీ నాన్నగారే చూసుకునేవారు. అమ్మకి యెంతసేపూ యిల్లే కైలాసం, పతియే ప్రత్యక్ష్యదైవం అనే ధోరణిలో వుండేది. నాన్నగారికి యిబ్బందవుతుందని యేవైనా పెళ్ళిళ్ళుంటే తప్పితే పుట్టింటికి కూడా యెక్కువ వెళ్ళేది కాదు. అలాంటి అమ్మ డబ్బులెక్కలు అడుగుతోందంటే కాస్త వింతగానే అనిపించింది.

   ఈ సంగతేమిటో తెలియాలంటే ఒకసారి రాజమండ్రీ వెళ్ళాల్సిందే అనుకున్నాను. అమ్మానాన్నల్ని చూసి వచ్చి కూడా అప్పుడే ఆర్నెల్లయిందని గుర్తు చేసుకుంటూ పనికట్టుకుని హైద్రాబాదునుంచి రాజమండ్రీ వచ్చాను. రైలు దిగి ఇంటికి వెడుతున్నంతసేపూ దారి పొడుగునా కనిపిస్తున్న చిన్నప్పటి జ్ఞాపకాలను మించిపోయాయి మా నాన్నగారు అమ్మని గురించి ఫోన్‍లో చెప్పిన మాటలు.

  గేట్లోకి అడుగు పెట్టగానే ఇంటిముందు చుక్కలతో పెట్టిన మెలికలముగ్గు ముద్దుగా స్వాగతం చెప్పింది. అటువంటి మెలికలముగ్గు ఎన్నిసార్లో అమ్మ దగ్గర నేర్చుకుందామని ప్రయత్నించి విఫలురాలినయ్యాను. ముచ్చటగా ముగ్గును చూస్తూ ఇంటి వరండాలో అడుగు పెట్టిన నాకు నాన్నగారికి కాఫీ అందిస్తున్న అమ్మ కనిపించింది. నన్ను చూడగానే ఇంతమొహం చేసుకుని, “రా రా..ఒక్కదానివే వచ్చావా? పిల్లలు రాలేదా?”  అంటూ అక్కున జేర్చుకుంది. అదేమిటో అమ్మ దగ్గరికి రాగానే చిన్నపిల్లనయిపోయినట్టనిపిస్తుంది. “నీ కాఫీకోసం వచ్చానమ్మా..” అన్నాను నవ్వుతూ. “రా అమ్మా.. రా..” అన్న నాన్నగారి పిలుపు విని అటు నడిచాను. పక్క కుర్చీ చూపిస్తూ, “పిల్లలూ, అతనూ బాగున్నారామ్మా?” అనడిగారు. మేమిద్దరం క్షేమసమాచారాలు చెప్పుకుంటూనే వున్నాం అమ్మ కమ్మటి కాఫీ అందించింది చేతికి.

 అదేమిటో పుట్టింటికి వెళ్ళగానే యెక్కడలేని బధ్ధకం వచ్చేస్తుందేమో టైమ్ యెనిమిదవుతున్నా నాన్నగారూ, నేనూ అలా కబుర్లు చెప్పుకుంటూ అక్కడే కూర్చున్నాం. ఇంతలో అక్కడికి అమ్మ వచ్చింది. చూసి ఆశ్చర్యపోయాను. ఎప్పుడు స్నానం, పూజా చేసుకుందో, యెప్పుడు వంట చేసిందో, యెప్పుడు తయారయిందో తెలీదు కానీ శుభ్రమైన ఇస్త్రీచీర కట్టుకుని, చేతిలో ఒక చిన్న సంచీలాంటిది పట్టుకుని చెప్పులు వేసుకుంటూ మాతో అంది. “వంటంతా చేసి టేబుల్‍మీద పెట్టేనమ్మా. నువ్వూ, మీ నాన్నగారూ కబుర్లయాక స్నానం చేసి, భోంచెయ్యండి. నాకు చిన్న పనుంది. వెళ్ళొస్తాను..” అంటూ జవాబు కోసమైనా చూడకుండా వెళ్ళిపోయింది.

    నాన్నగారి మొహం చిన్నబోయినట్తైపోయింది. “చూసేవామ్మా.. ఇదిగో, ఇదీ వరస. రోజూ యెక్కడికోక్కడికి వెడుతుంది. మళ్ళీ మూడుగంటలు దాటితేకానీ రాదు. అంత మొగుడికి అన్నంకూడా పెట్టకుండా చేసే రాచకార్యాలేంటో మరి?” కాస్త బాధగానూ, మరికాస్త నిష్ఠూరంగానూ అన్న నాన్నగారి మాటలకి ఓదార్పుగా అన్నట్టు ఆయన చేతిమీద చెయ్యివేసి, “నేను కనుక్కుంటానుగా నాన్నా..” అన్నాను. “అదేనమ్మా. అందుకే నీకు ఫోన్ చేసేను..” అన్నారాయన.

  నేనక్కడున్న నాలుగురోజులూ అమ్మని బాగా గమనించాను. నిజమే. అమ్మ యిదివరకులా లేదు. యేదో తేడా కనిపించింది. తేడా అంటే ఆరోగ్యం విషయం కాదు. అలాంటి సమస్యలేవీ వున్నట్లు లేవు. కానీ యిదివరకులా ప్రతి చిన్న విషయం నాన్నని అడగడం, యెక్కడికైనా వెళ్ళాలంటే నాన్నగారి భోజన సమయాలూ అవీ కాకుండా చూసుకోవడం లాంటివేమీ లేవు. ఆఖరికి నాన్నగారిని మంచినీళ్ళు కూడా ముంచుకోనివ్వని అమ్మ గబగబా యేదో వండి అక్కడ పడేసి బైటకి వెళ్ళిపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అదేమిటో అమ్మని అడగాలని ఈ నాలుగురోజుల్లోనూ ప్రయత్నించాను కానీ అడగలేకపోయాను. యేమని అడగగలను? సంసారం యెంత గుట్టుగా నడుపుకోవాలో నాకు చెప్పిన అమ్మని, భర్త మర్యాద నలుగురిలో యెలా కాపాడాలో పాఠాలు చెప్పిన అమ్మని, పిల్లలని యెంత బాధ్యతగా పెంచాలో ఉదాహరణలతో సహా చెప్పిన అమ్మని “నాన్నని ఒక్కరినీ అలా వదిలేసి బైటకి యెందుకు వెడుతున్నావమ్మా..”అని యేమని అడగగలను? అడగాలనుకున్నది అడగకుండానే హైద్రాబాదు తిరుగుప్రయాణం అవ్వాల్సొచ్చింది.

  ఆటోలో స్టేషన్‍కి వెడుతున్న నేను టక్కున తలకి తగిలిన దెబ్బకి అమ్మానాన్నల గురించి ఆలోచనల్లోంచి ఒక్కసారి ఈ లోకంలో కొచ్చాను. ఆటో సడన్‍బ్రేక్ వెయ్యడంతో తల ఆటో ముందురాడ్‍కి కొట్టుకుంది. “అమ్మా..” అంటూ నుదురు తడుముకున్నాను. ఆటోవాలా రాంగ్‍రూట్‍లో వచ్చిన స్కూటర్‍వాడిని తిట్టుకుంటూ మళ్ళీ ఆటో స్టార్ట్ చేసాడు. ఇంకా స్టేషన్ ఎంతదూరమా అనుకునేలోపే స్టేషన్‍లో ఆపేడు ఆటోని. బాగ్ చేతిలోకి తీసుకుని, ఆటోకి డబ్బిచ్చి ప్లాట్‍ఫామ్ మీదకి వచ్చేటప్పటికి గౌతమి అప్పటికే ఆగి వుంది. పరుగెడుతున్నట్టే ఎస్8 బోగీ వెతుక్కుంటూ వెళ్ళి, బోగీకి అతికించిన ఛార్ట్ లో నా పేరు, బెర్త్‍నంబరూ చూసుకుని, లోపలకెళ్ళి బెర్త్ మీద బేగ్ పెట్టి కూర్చుని, “హమ్మయ్య..” అనుకున్నాను. కిటికీకి ఆనుకుని కూర్చున్న నాకు మళ్ళీ అమ్మానాన్నల గురించిన  ఆలోచనలు మొదలయ్యాయి.

   నాన్నగారన్న మాట నిజమే. అమ్మ యిదివరకులేని పనులు చాలా కల్పించుకుంది. వారంలో రెండురోజులు నాలుగు వీధులవతలవున్న స్కూల్‍కి వెళ్ళి, అందులో పిల్లలకి కథలు చదివి విన్పించి వస్తుంది. మరో రెండ్రోజులు కాస్త దూరంలో వున్న అదేదో సంఘానికి వెళ్ళి, అక్కడ మిగిలినవారితో కలిసి కౌన్సిలింగ్‍లాంటిదేదో చేస్తుంది. ఇంకో రెండ్రోజులు పక్క వీధిలో వున్న గుడికి వెళ్ళి పూలమాలలూ అవీ కట్టిచ్చి వస్తూంటుంది. యిలాగ యేదో పని కల్పించుకుని వూరు పట్టుకు తిరుగుతోందని నాన్నగారి అభియోగం. అన్నీ వండి పెట్టే వెడుతున్నాను కదా అని అమ్మ అంటుంది. “వండి పడేస్తే చాలా..నేనొక్కణ్ణి యెలా వుండగలననుకున్నావ్?” అని నాన్నగారి ప్రశ్న. “కాసేపే కదా వెడుతున్నాను. మీరు కూడా మీ కాలక్షేపమేదో చూసుకోండి..” అని అమ్మ జవాబు. నాకైతే అంతా అయోమయంగా అనిపించింది. యిన్నాళ్ళు లేని వ్యాపకాలు అరవయ్యేళ్ళు వచ్చేక యిప్పుడు అమ్మ యెందుకు కల్పించుకున్నట్టు? హాయిగా యిద్దరూ వేళకింత వండుకుని, తిని, ఒకరికొకరుగా వుండక లేనిపోని గొడవలు కోరి తెచ్చుకోవడమెందుకు? ఈ నాలుగురోజుల్లోను ఈ మాట అమ్మని అడుగుదామని చాలా ప్రయత్నించాను కానీ అడగలేకపోయాను.

  నా ఆలోచనల్లో వుండిపోయి ట్రైన్ యెప్పుడు బయల్దేరిందో కూడా గమనించనేలేదు. టీసీ వచ్చి టికెట్ అడిగేటప్పటికి మళ్ళీ ఈ లోకంలో కొచ్చాను.  టీసీకి టికెట్ చూపించి మళ్ళీ దానిని బేగ్‍లో పెట్టుకుంటుంటే అందులో యేవో కాగితాల మడతల్లాంటివి కనిపించాయి. ఇవేం కాగితాలు..నేనేం పెట్టలేదే అనుకుంటూ మడతలు విప్పగానే  మొదటి పదమే “అమ్మలూ..” అంటూ అమ్మ చేతివ్రాత. ఒక్కసారి ఒళ్ళు జల్లుమంది. అమ్మ ఉత్తరం అది. అమ్మ ఉత్తరం రాసి నా బేగ్‍లో పెట్టింది. అంత ఉత్తరం రాసి చెప్పవలసిన విషయాలు యేమున్నాయా అన్న ఆతృతతో నా కళ్ళు ఆ అక్షరాల వెంట పరుగెత్తాయి.

  “అమ్మలూ, పిల్లల పరీక్షల ముందు నువ్వు అమ్మనీ నాన్ననీ చూడడానికి యింత ఆతృతగా యెందుకొచ్చావో అర్ధం చేసుకోగలనమ్మా.. నా బంగారుతల్లీ, మామీద నీకున్న అభిమానానికి యెంత సంతోషంగా వుందో చెప్పలేను. నువ్వు నన్ను అడగాలనుకున్న ప్రశ్నలు నీ గొంతులోనే ఆగిపోయాయని తెలుసుకోలేనిదాన్ని కాదు. ఈ వయసులో నాన్నగారిని దగ్గరుండి చూసుకోకుండా నేను చేసే ఘనకార్యాలు నీకు మింగుడు పడలేదు కదూ! అవునమ్మా.. నిజమే.. మీ నాన్నగారికి డెభ్భైయేళ్ళు. నాకు అరవైయేళ్ళు దాటాయి. ఇదివరకంతా నాన్నని నీడలాగా కనిపెట్టుకుని వున్న అమ్మ ఈ పెద్ద వయసులో ఆయనని ఒక్కరినీ వదిలేసి బైట చేస్తున్న రాచకార్యాలకి కారణమేమిటో తెలుసుకోవాలని వుంది కదా తల్లీ. చెపుతాను విను.

 అమ్మలూ, నీకూ తెలుసు.. నిన్నూ, చెల్లెల్నీ యెలా కళ్ళల్లో పెట్టుకుని పెంచానో. మీరు కాలేజీ చదువులు చదువుతున్నప్పుడు కూడా మీ చేత యింట్లో యే ఒక్క పనీ చేయించలేదు సరి కదా.. మీ యిద్దరికీ అన్నం కూడా కలిపి నోట్లో పెట్టేదాన్ని. అలాగ మీకు ఒక్కపనీ నేర్పకుండానే, అందరూ అమ్మలాగే వుంటారని చెపుతూనే మీకు పెళ్ళిళ్ళు చేసి పంపించాను. అలాగ పువ్వుల్లాగ పెరిగిన మీరిద్దరూ పూల కన్న ముళ్ళే యెక్కువగా వున్న ఈ సమాజంలో మీ సౌరభాన్ని నిలబెట్టుకుందుకు  మీరు పడ్డ కష్టం మీకు తెలియనిది కాదు. ఆ భగవంతుని దయవల్ల యిద్దరూ మీమీ కుటుంబాల్లో యిమిడిపోయి మంచిపేరు తెచ్చుకున్నారు. మీరిద్దరూ అన్నీ మీ మీ అనుభవాలమీదే నేర్చుకున్నారు. ఒక ఐదారు సంవత్సరాలు మీరు శ్రమ పడినా మిగిలిన జీవితమంతా మీరు మీకు అనుకూలంగా మలుచుకున్నారు.  కానీ ఒకరిమీద ఒకరం పూర్తిగా ఆధారపడ్డ నాకూ, మీనాన్నగారికీ మా రాబోయే జీవితం గడపడానికి అలాగ అనుభవం మీద నేర్చుకునే టైమ్ యిప్పుడు లేదమ్మా. ఇద్దరం జీవితం చరమాంకానికి వచ్చేసాం.

    అమ్మలూ, నీకు తెలుసు కదా! యింట్లో మీ యిద్దరితో సమానంగా నాన్నగారిని చూసుకునేదాన్ని. పొద్దున్న లేచిందగ్గర్నుంచీ ఆయన తిండితిప్పలూ, అలవాట్లూ, చిరాకులూ అన్నింటినీ ఆయన కూడా ఒక పిల్లాడే అనుకుని నిభాయించుకుని వచ్చేదాన్ని. మీలాగే ఆయనకూడా నామీద పూర్తిగా ఆధారపడిపోయారు. మీరు బైటకి వెళ్ళి నాలుగూ నేర్చుకున్నారేమో కానీ, నాన్నగారు మటుకు మీరు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళాక నా మీద ఆధారపడడం మరీ యెక్కువైపోయింది. నాకూ అది ఆనందంగానే అనిపించేది. యెందుకంటే మీ నాన్నగారంటే నాకున్న యిష్టం వల్ల. కానీ, తల్లీ.. ఆరునెల్లక్రితం జరిగిన ఒక సంఘటన నాలో యిదివరకు లేని ఆలోచనను తట్టిలేపింది.

  నీకు మన దయానందం  తెల్సుకదా.. ఆయన భార్య హఠాత్తుగా పోయింది. పాపం దయానందం. భార్య వున్నన్నాళ్ళు మంచినీళ్ళు కూడా ముంచుకుని యెరగడు. పిల్లలు  యెవరి సంసారాలు వాళ్లవి. వాళ్ల దగ్గరికి వచ్చి వుండమన్నా కూడా యిల్లూ, పెన్షనూ వచ్చినన్నాళ్ళు యెవరి దగ్గరికీ వెళ్లలేరు కదా! అలాగ ఒక్కడే వుంటున్నాడు. వంట మాట అలా వుంచు..ఉదయం లేచి కాఫీ పెట్టుకోడం కూడా రాదు. ఎవరిని యేమడగాలో తెలీదు. అది చూసి నాకు ఒక్కసారి భయంలాంటిది వేసింది. అనుకోడానికి యిష్టమున్నా లేకపోయినా  పునర్జన్మ సిధ్ధాంతం నమ్మినవాళ్లం మనం. ఆ భగవంతుడి పిలుపు యెప్పుడోప్పుడు  రాకతప్పదు. అందరం యెప్పుడో అప్పుడు పైకి వెళ్ళవలసినవారమే! యెవరు ముందో యెవరు వెనకో యెవరికి తెలుసు? ఒకవేళ నేను ముందు వెళ్ళిపోతే మీ నాన్నగారికి కంచంలో అన్నం యెవరు వడ్డిస్తారు? టేబిలు మీదున్న గిన్నెల్లో ముందుది వేసుకుని, వెనకది చూసుకోని మీ నాన్నగారి పరిస్థితి యేమిటి? ఆయనకి మంచినీళ్ళు యెవరు అందిస్తారు? మేం లేమా అంటారు మీరిద్దరూ. కానీ, ఆయనింట్లో ఆయనుంటే వున్న గౌరవం మీ యిళ్ళకొచ్చి వుంటే వుండదు కదా! అయినా చిన్నప్పట్నుంచీ యెవరింటికీ వెళ్ళని మనిషి కూతురింట్లో యెలా వుంటారు? మీరు మీ సంసారాలని వదిలి ఆయన దగ్గరకొచ్చి వుండలేరు కదా! యెల్లకాలమూ నేను ఆయన పక్కన వుండలేనని నాన్నగారికి తెలియాలి. చిన్న చిన్న పనులైనా ఆయనంతట ఆయన చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నేను యింట్లో వున్నంతసేపూ మీ నాన్నగారు అలా చెయ్యరు. అందుకనే నేను బైటకి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. కావాలని వ్యాపకాలు పెంచుకున్నాను. ఆయన ఆకలి ఆయనకి తెలియాలనీ, ఎక్కడెక్కడేమున్నాయో చూసుకుని కావలసినవి తీసుకుని తినడం తెలుసుకోవాలనీ అనుకున్నాను. నేను బైటకి వెడితే మధ్యాహ్నం టీ పెట్టుకోవడం యెలాగో చెప్పాను. యివన్నీ చెపుతున్నప్పుడు నాలో నేను యెంత మథనపడ్డానో తెలుసా తల్లీ.. కానీ అంతకన్న దారిలేదు. వంటమనిషిని పెట్టి వండించుకున్నా, లేకపోతే బైటనుంచి భోజనం తెప్పించుకున్నా రేపు నేను వెళ్ళిపోయాక కనీసం టేబిలు మీదున్నవయినా వడ్డించుకు తినే అవకాశముంది. మొన్నమొన్నటివరకూ మీ నాన్నగారు పూర్తిగా నామీద ఆధారపడేవారు. నాకు అదెంత సంతోషంగా అనిపించేదో!  కానీ, దయానందాన్నిచూసాక ఒకవేళ నేను ముందు వెళ్ళిపోతే మీ నాన్నగారి పరిస్థితి యెలా వుంటుందోనని భయపడి యిలా చెయ్యవలసివచ్చింది. ఒక్క విషయం చెప్పనా తల్లీ..మనం ఆడవాళ్ళం.. ప్రతి ప్రసవానికీ మరణం అంచులదాకా వెళ్ళొస్తాం కనుక మన గుండె కొంచెం గట్టిగా వుంటుంది. కానీ, మగవాళ్ళు యెంత పెద్దవాళ్ళైనా పసిపిల్లలేనమ్మా.. వాళ్ళని యెప్పుడూ అమ్మో, భార్యో, కూతురో చూస్తూండాలి.

 అమ్మలూ,  యిదంతా చదువుతుంటే నీకు యింకో ప్రశ్న రావచ్చు. తప్పులేదు.. యెవరు ముందో యెవరు వెనకో యెవరు చెప్పగలరు? ఒకవేళ నేనే ఒంటరిదాన్నయిపోతేనో.. అవును.. ఆడవాళ్ళు వొంటరిగా మిగిలిపోతే వారి బాధ వేరుగా వుంటుంది. అందుకే యెప్పుడూ పట్టించుకోని నేను మీ నాన్నగారిని డబ్బు విషయాలు అడగడం మొదలుపెట్టాను. మన శాంతి తెలుసు కదా.. వాళ్ళమ్మ..పాపం యిలాగే ఒంటరి దయిపోయింది. వాళ్లాయనకి యే బేంక్‍లో యెంత డబ్బుందో ఆవిడకి అస్సలు తెలీదు. పక్కన వున్న ఆవిడకే తెలీకపోతే యెక్కడో ఉద్యోగాల్లో వున్న పిల్లలకి మాత్రం యెలా తెలుస్తుంది? అందుకే మీ నాన్నగారిని ఏ బాంక్‍లో ఎంత డబ్బుందో చెప్పమన్నాను. అలా అడిగానని ఆయనకి కోపం కూడా వచ్చింది. కానీ నా భయం నన్నలా అడిగించింది తల్లీ.

 యిన్ని విషయాలు తెలిసున్నదానివి ఈ నాలుగురోజులూ నాన్నగారితోనే గడపకుండా ఆయన్ని ఒంటరిగా వదిలి బైటకి యెందుకు వెడుతున్నాననుకుంటున్నావేమో.. చెపుతాను విను.. అమ్మలూ, నాకు పెళ్ళయి వచ్చినప్పటినుంచీ మీ నాన్న చుట్టూ తీగలా అల్లుకుపోయాను. ఆయనలేని జీవితాన్ని ఊహించలేని స్థితికి వచ్చేసాను. మీ నాన్న తప్పితే అంత ఆసరా మరింక యెవ్వరూ యివ్వలేరు. అందుకే ఆయన చుట్టూనే ముడులూ, బ్రహ్మముడులూ వేసేసుకున్నాను. కానీ, ఒక్కసారి శాంతివాళ్ళమ్మ పరిస్థితి చూసేసరికి నన్ను వెన్ను మీద యెవరో చరిచినట్లయింది. యిప్పటినుంచీ ఆ ముడులను విప్పుకుని, నా అంతట నేను నిలబడలేకపోతే మూలమే కదిలిపోయి నేలమీదపడి అందరి కాళ్ళకిందా నలిగిపోతాను. అందుకే నా మనసుని నేను గట్టి చేసుకున్నాను. కనీసం పగలు రెండుగంటలైనా మీ నాన్నగారు ఒంటరిగా వుండేలా చెయ్యాలనుకున్న నేను, నాకు కూడా ఈ యిల్లు కాక మరో ఆసరా కావాలనిపించింది.

  తల్లీ, ఒక్క మాట చెప్పనా.. మనిషి బ్రతికున్నన్నాళ్ళు తిండీ, బట్టా కనీసావసరాలు. మన ఆకలికి తిండి తినడం తప్పనిసరి యెల్లాగో అలాగే ఎదుటి మనిషికోసం బట్ట కట్టుకోవాలి. లేకపోతే మనలను పిచ్చివాళ్ళకింద జమకడతారు. కానీ, ఈ రెండింటితోపాటు మనసన్నది కూడా ఒకటుంటుంది కదమ్మా. దానికి సరైన ఆలోచన లేకపోతే అది దెయ్యమై పీక్కు తింటుంది. అందుకని నా మనసుకి తృప్తి కలిగించుకుందుకు నేను ఆ వ్యాపకాలు పెట్టుకున్నాను.

  ఇంకోవిషయం చెప్పనా తల్లీ.. బాల్యం మనకి తెలీకుండానే ఆనందంగా గడిచిపోతుంది. యవ్వనం మనం కావాలని ఆనందిస్తూ గడుపుతాం. మధ్యవయసు సంతోషంగా చేసే బాధ్యతల బరువుతో నడుస్తుంది. యివన్నీ ఆనందంగా స్వీకరిస్తున్న మనం వానప్రస్థాన్ని మటుకు అంతే ఆనందంగా యెందుకు స్వీకరించకూడదు? వార్ధక్యం అంటే భయమెందుకు? అన్నింటికీ ఆ భగవంతుడే వున్నాడనుకుంటూ తామరాకుమీది నీటిబొట్టులా గడపడానికి యెందుకు ప్రయత్నించకూడదూ అన్నదే నా ప్రశ్న. నేను అందుకే డిటాచెడ్ గా వుండడానికి ప్రయత్నిస్తున్నాను. ఇలా చెయ్యడం నాకూ చాలా కష్టంగానేవుంది కానీ తప్పదుగా మరీ!..

తల్లీ, పండితులొకరు వానప్రస్థమంటే యేమిటో విడమరిచి చెప్పారు. మనని మనం ఈ సంసారబంధాలకు గట్టిగా కట్టేసుకున్నాం. వానప్రస్థమంటే ఆ బంధాలను వదులుకోవడం కాదుట. గట్టిగా కట్టుకున్నబంధాలు కాస్త వదులవడానికి ఆ కట్టుపైన మరోకట్టు యింకా గట్టిగా కట్టడంట. అప్పుడు ముందు కట్టినకట్టు కాస్త వదులవుతుందన్నమాట. అంటే సంసార బంధాలను కాస్త తగ్గించుకుని, ఆధ్యాత్మికతవైపుకానీ, సామాజిక సమస్యలవైపు కానీ మరో బంధం యేర్పరచుకోవడం. అందుకే నేను నాకున్న పరిథిలో కొన్ని వ్యాపకాలను యేర్పరచుకున్నాను.

  తల్లీ, నువ్వు నన్ను అడగబోయి మానుకున్న ప్రశ్నలకి సమాధానాలు దొరికేయనుకుంటాను. యిప్పుడిదంతా  యింత వివరంగా యెందుకు రాస్తున్నాననుకుంటున్నావేమో..దానికి  ముఖ్యకారణం ఒకటుంది. నేను మీ అక్కచెల్లెళ్ళిద్దరినీ ఒక్క కోరిక కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు నన్నొక్కదాన్నీ వుంచితే మీరు ఫోన్ చెయ్యడం కాస్త ఆలస్యమైనా మీ సంసారబాధ్యతలు తెలిసినదాన్ని కనుక అర్ధం చేసుకోగలను. కాని అలా కాకుండా నాకే ఆయన పిలుపు ముందుగా వస్తే కనక మీ నాన్నని వారం, పదిరోజుల కొక్కసారైనా ఫోన్‍లో కాస్త పలకరిస్తూండండి. మీ దగ్గరనుంచి ఫోన్ రావడం నాలుగురోజులు దాటిన దగ్గర్నుంచీ మీరెలా వున్నారోనని ఆయనలో ఆతృత మొదలౌతుంది. అది రోజురోజుకీ పెరిగి మరో నాలుగురోజులయ్యేటప్పటికి యింక అదే ధ్యాసలో పడిపోయి, మీ గురించి లేనిపోనివి ఊహించేసుకుని బెంగ పెట్టేసుకుంటారు. అందుకని నువ్వూ, చెల్లీ కూడా మీ నాన్నకి వారానికోసారి ఫోన్ చేస్తామని ఈ అమ్మకి మాటిస్తారు కదూ...

…. మారిపోయిన మీ అమ్మ..

చేతులమధ్య నలిగిపోతున్నకాగితం  చివర వున్న “అమ్మ” అన్న మాటను చదవడానికి నాకు కళ్ళనిండుగా వున్న నీళ్ళు అడ్డం వచ్చేయి.

 JANUARY 18, 2017 సారంగ-సాహిత్యవారపత్రికవారి సౌజన్యంతో..

Read more...

ఆదిత్యహృదయం

>> Sunday, January 29, 2017

📌*ఆదిత్య హృదయం* ....!!🌞

*తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం*
*రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం*
*దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం*
*ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః*

రామరావణ యుద్ధాన్ని చూడడానికి దేవతలతో కలసి అగస్త్య మహర్షి కూడా వస్తాడు. యుద్ధంలో అలసివున్న రాముడిని చూసిన అగస్త్య మహర్షి "రామా! ఈ సందర్భంగా నీకు వేదంవలె నిత్యమైనదీ, మంగళకరమైనదీ, పురాతనమైనదీ, ఆరోగ్యప్రదాయకమైనదీ, ఆయుర్వృద్ధిని చేసేదీ, అత్యంత ఉత్తమమైనదీ, అతి రహస్యమైనదీ, అత్యంత లాభదాయకమైన ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తాను" అని పలికి, ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు.

అగస్త్య ఉవాచ:

*రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం*
*యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి*

ఓ రామా! గొప్ప బాహువులు గల రామా! ఈ రహస్యమును విను. నీకు యుద్ధంలో విజయం కలుగును గాక!

*ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం*
*జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం*

ఈ ఆదిత్య హృదయం వలన పుణ్యం, శత్రు నాశనం కలుగును. దీనిని చదువుట వలన జయం, శుభం, పరము కలుగును.

*సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం*
*చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం*

ఇది అత్యంత శుభకరమైనది, మంగళకరమైనది, అన్ని పాపములను నాశనం చేయునది. చింత, శోకం, ఒత్తిడిలను తొలగించి ఆయుర్వృద్ధి కలిగించును.

*రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం*
*పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం*

ప్రకాశకుడైన, దేవాసురులచే పూజింపబడిన, తన ప్రకాశంతో లోకాన్ని ప్రకాశింపజేస్తున్న ఆ భువనేశ్వరున్ని పూజింపుము.

*సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః*
*ఏశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః*

ఈ ఆదిత్యుడు సకలదేవతలకు ఆత్మయైనవాడు. గొప్ప తేజం కలవాడు. తన కిరణాలతో లోకాలను రక్షిస్తుంటాడు. తన కిరణాలను ప్రసరింపజేయడం ద్వారా ఎండావానలను కలిగించి దేవదానవులను, సకలజనులను కాపాడుతున్నాడు.

*ఏశ బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః*
*మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః*

ఇతడు సమస్త శరీరాలు గలవాడగుటచే, ఇతడే బ్రహ్మా, విష్ణువు, కుమారస్వామి, ప్రజాపతుల రూపం, దేవేంద్రుడు, కుబేరుడు, కాలుడు, యముడు, చంద్రుడు, వరుణుడు.

*పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః*
*వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః*

ఇతడే పితృదేవతలు, వసువు, పంచభూతాలు, ప్రజలు శరీరంలోని ప్రాణవాయువు. ఋతువులను కలిగించే ప్రభాకరుడు.

ఆదిత్య స్తోత్ర ప్రారంభం :
*ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్*

*సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః*
నీవు అదితి కుమారుడవు. నీవు సూర్యుడవు. నీవు ఆకాశంలో సంచరించేవాడివి. వర్షంతో జగాన్ని పోషించేవాడవు. పసిడి కిరణములు కలవాడవు. బంగారు తేజస్సు కలవాడవు. భానుడవు, హిరణ్యం రేతస్సుగా కలవాడవు. నీవు దివాకరుడవు.

*హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్*
*తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండ అంశుమాన్*

నీవు ఆకుపచ్చ గుఱ్ఱములు కలవాడవు. సహస్ర కిరణములు కలవాడవు. చీకటిని సంహరించేవాడివి. శుభములు కలుగజేసేవాడివి. బ్రహ్మాండాన్ని మరలా జీవింపజేయువాడవు. ప్రకాశవంతమైనవాడవు.
*హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః*
*అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనః*

నీవు హితమనే రమణీయ మనస్సు కలవాడవు. చల్లనివాడవు. అగ్నిగర్భుడవు. అదితిపుత్రుడువు. సాయంకాలంలో శమించువాడవు. మంచును పోగొట్టేవాడవు.

*వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్ యజుస్సామ పారగః*
*ఘనవృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః*

ఆకాశానికి నాధుడవు. చీకటిని పోగొట్టేవాడవు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదంల పారంగుడవు. గొప్ప వర్షాన్ని కురిపించేవాడవు. నీటికి మిత్రుడవు. ఆకాశామార్గమున శీఘ్రంగా పోయేవాడవు.

*ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః*
*కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః*

ఎండ నిచ్చేవాడవు. గుండ్రనివాడవు. మృత్యువువి. ఉదయాన్నే లేతకిరణంలు కలవాడవు. మద్యాన్నం సర్వాన్ని తపింపజేయువాడవు. కవివి. మహాతేజుడవు. సమస్త కార్యాలకు కారణభూతుడవు.

*నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః*
*తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే*

నక్షత్రాలకు గ్రహాలకు నాయకుడవు. నీవే ఈ విశ్వ ఉనికికి కారణం. అన్ని తేజస్సుల కంటే తేజస్సును ఇచ్చువాడవు. ద్వాదశాదిత్యులలో అంతర్యామివైన నీకు నమస్కారం.

*నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః*
*జ్యోతిర్గణానాం పతయే దినధిపతయే నమః*

తూర్పుకొండతో కూడినవాడికి నమస్కారం. పడమటకొండతో కూడినవాడికి నమస్కారం. జ్యోతిర్గణాలకు అధిపతివైన నీకు నమస్కారం. పగటిని కలిగించే నీకు నమస్కారం.

*జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః*
*నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః*

జయుడకి నమస్కారం. జయభద్రునికి నమస్కారం. పచ్చని గుఱ్ఱములు గల నీకు నమస్కారం. సహస్రాంసునకు నమస్కారం.

*నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః*
*నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః*

ఉగ్రునకు నమస్కారం. వీరునకు, వేగంగా పయనించే నీకు నమస్కారములు. కమలములను వికసింపజేయు నీకు నమస్కారం. మార్తుండునికి నమస్కారం.

*బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యోదయాదిత్యవర్చసే*
*భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః*

బ్రహ్మా, విష్ణు, మహేశుల అధిపతికి నమస్కారం. ఆదిత్య వర్చస్సుతో ప్రకాశించువానికి నమస్కారం. సర్వభక్షకునికి నమస్కారం.

*తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే*
*కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః*

చీకటిని పోగొట్టువానికి నమస్కారం. శత్రువులను వధించేవానికి నమస్కారం. గొప్ప తేజస్సు గలవానికి నమస్కారం. స్వయంప్రకాశం గలవానికి నమస్కారం. దేవునికి, జ్యోతిషపతికి నమస్కారం.

*తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే*
*నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే*

బంగారుకాంతివంటి కాంతి కలవాడు, అగ్నిరూపునకు, జగత్తుకు కారణమైనవాడికి నమస్కారం. విశ్వకర్మకు నమస్కారం. ప్రకాశాస్వరూపునకు నమస్కారం. లోకసాక్షికి నమస్కారం.

*నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః*
*పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః*

ఈ ఆదిత్యుడే మహా ప్రళయకాలంలో ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. తిరిగి తానే జగత్తును సృష్టిస్తాడు. నాశకాలం తప్ప, తక్కిన కాలంలో చక్కగా పరిపాలిస్తాడు.ఇతడు కిరణాలతో శోశింపజేస్తాడు, ఎండా, వానలను ఇస్తాడు.

*ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః*
*ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం*

సకల జీవులు నిద్రిస్తుండగా, వాటిలో అంతర్యామిగా మేల్కొని ఉంటాడు. అగ్నిహోత్రం, అగ్నిహోత్రఫలమూ ఇతడే.

*వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ*
*యాని కృత్యాని లోకేషు సర్వన్యేషు రవి: ప్రభుః*

వేదాలు, యజ్ఞాలు, యజ్ఞఫలమూ ఇతడే. లోకంలోగల సర్వకార్యములకు ఈ రవియే ప్రభువు.

*ఏనమాపత్సు కృచ్చేషు కాంతారేషుభయేషు చ*
*కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవః*

రామా! ఆపదలలో, భయంకలిగించే ప్రదేశాలలో, ఈ స్తోత్రంతో సూర్యుడిని కీర్తించేవాడు అన్ని ఆపదలనుండి రక్షింపబడతాడు.

*పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్*
*ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి*

నువ్వు మనస్సును ఏకాగ్రంచేసి ఆ దేవదేవుడు జగన్నాధుడైన సూర్యున్ని ఆరాదించు. ముమ్మార్లు ఈ స్తోత్రాన్ని జపిస్తే యుద్ధంలో విజయం నీకే.

*అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి*
*ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్*

మహాపరాక్రమశాలీ! నువ్వు ఈ క్షణాన్నే రావణుని సంహరిస్తావు' అని రామునితో అగస్త్య మహర్షి చెప్పి అక్కడినుండి నిష్క్రమిస్తాడు.

*ఏతచ్చ్రుత్వా మహాతేజా నష్టశోకోభవత్తద
*ధారయామాస సుప్రీతొ రాఘవః ప్రయతాత్మవాన్*

అప్పుడు మహాతేజోవంతుడైన రాముడు ధైర్యంతో ఆనందమును పొంది, నిర్మల హృదయంతో ఆదిత్య హృదయంను జపించాడు.

*ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరంహర్ష మవాప్తయాన్*
*త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్*

రాముడు అలా ఆదిత్య హృదయమును జపించి మహదానందభరితుడయ్యాడు. తర్వాత ముమ్మార్లు ఆచమనం చేసి, మిగుల పరాక్రమముతో విల్లు ధరించాడు.

*రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్*
*సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోభవత్*

శ్రీరాముడు రావణున్ని చూసి ఉత్సాహంతో యుద్ధం చేయడం ప్రారంభించాడు. రావణున్ని సంహరించాలని ధృడంగా నిశ్చయించుకున్నాడు.

*అథ రవి రవదన్నిరీక్ష్య రామం
ముదితమన్యాః పరమం ప్రహృష్యమాణః*
*నిశిచరపతి సంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి*

అలా తనను జపించుతున్న శ్రీరామున్ని చూసి, రాక్షసరాజు వినాశనంను గ్రహించి, చాలా ఆనందంతో 'నీవింక రావణుని వధింప త్వరపడమని, నీకు విజయం తధ్యమ'ని సూర్యభగవానుడు రామునితో చెప్పెను.

*ఇతి ఆదిత్య హృదయం సంపూర్ణం* ....,.✍ లోకాస్సమస్తాస్సుఖినోభవంతు .

Read more...

శ్రీ వారికి పరమభక్తులైన ఓ ముస్లిం కుటుంబం సమర్పించిన అష్టదళ పాదపద్మారాధన సేవ

>> Sunday, January 22, 2017

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆఫీసు 
*****************************
 పి వి ఆర్ కే ప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు executive officer గా పనిచేస్తున్నారు..సరిగ్గా అవే రోజుల్లో దేవస్థానం వారు కూడా తమ స్వర్ణోత్సవపు సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రలోనే ఎప్పటికీ నిలిచి పోయేటట్లుగా ఏదన్నా కొత్త పని మొదలు పెడితే బావుంటుందన్న ఆలోచనలో వున్నారు..

వారంతా ఆలోచనయితే చేసారు గానీ ఎన్ని దఫాలుగా ఎన్ని మీటింగులు పెట్టి ఎంత చర్చించినా ఆ ఆలోచనని ఆచరణలో పెట్టటంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక పోయారు..సమయం దగ్గర పడుతోంది..ఏం చేయాలో దిక్కు తోచని స్థితి..వెంటనే ఏదో ఒకటి ప్లాన్ చెయ్యకపోతే అభాసుపాలు అవుతామేమోనన్న భయం అందర్లోనూ ఏ మూలో ఉంది….



అక్కడున్న వారిలో TTD బోర్డు మెంబర్లుగా ఉన్నకొద్ది మంది పేరొందిన ప్రముఖులతో పాటు మరి కొంత మంది ముఖ్యమైన ఆలయ అధికారులు కూడా ఉన్నారు..అప్పుడక్కడ వేడిగా వాడిగా చర్చ జరుగుతోంది..చర్చ అయితే జరుగుతోంది కానీ తమ స్వర్ణోత్సవ సంవత్సరం సందర్భంగా స్వామి వారికి కొత్తగా ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయంలో మాత్రం అక్కడున్న పెద్దలు ఒక perfect అవగాహనకు రాలేక పోతున్నారు..

సమయం  గడుస్తున్నకొద్దీ EO పీ వీ ఆర్ కే ప్రసాద్లో అసహనం ...

సరిగ్గా అదే సమయంలో తలుపు తోసుకొని ఆఫీస్ అటెండర్ మెల్లిగా ప్రసాద్ దగ్గరికి వచ్చాడు..అసలే చిరాగ్గా ఉన్న ప్రసాద్ గారు  టైం గాని టైం లో వచ్చిన ఆ అటెండర్ని చూస్తూ ‘ఏంటయ్యా” అని మరింత చిరాకు పడిపోతూ అడిగారు..కంగారు పడ్డ ఆ అటెండర్ తన నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుంటూ ఆయన ముందుకొంగి “సార్ మిమ్మల్ని కలవటం కోసం గుంటూరు నుండి ఎవరో భక్తుడు వచ్చాడు.. ” అని మెల్లిగా చెప్పాడు..

చిర్రెత్తుకొచ్చింది ప్రసాద్ కి.. “..ఎవరయ్యా అతను..ఇప్పుడింత అర్జెంటుగా మీటింగులో ఉంటే నన్ను డిస్టర్బ్ చేసి మరీ చెప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది..కాసేపుండమను…”మరి కాస్త చిరాకు పడిపోతూ అన్నారు ప్రసాద్…”చెప్పాను సార్..కానీ ఏదో అర్జెంటుగా మీతో మాట్లాడాలట..అతని పేరు షేక్ మస్తాన్ అని చెప్తున్నాడు..” కొద్దిగా భయపడుతూ చెప్పాడు అటెండర్..

“.. షేక్ మస్తానా…” అని ముందు కాస్త ఆశ్చర్య పోయినా..”ఎవరో ముస్లిం భక్తుడు ఏదో రికమండేషన్ లెటర్ తో వచ్చి ఉంటాడు.. మా వాళ్ళు నా దగ్గరికి పంపించుంటారు..మళ్ళీ బయటకు పోవటం ఎందుకు..ఏదో రెండు నిమిషాలిక్కడే మాట్లాడి పంపించేస్తే సరిపోతుంది కదా ” అని మనసులో అనుకుంటూ.. “.. సర్లేవయ్యా..ఇక్కడికే రమ్మను..” ..అని అటెండర్ తో చెప్పి పంపించేసారు  ప్రసాద్..

అప్పుడు దురద్రుష్టవసాత్తు ప్రసాద్ కి గానీ అదే రూం లో ఉన్నఏ ఇతర బోర్డు మెంబర్లకి గానీ తెలినీ విషయం ఏమిటంటే కాసేపట్లో తమ ముందుకు రాబోతున్న ఆ ముస్లిం భక్తుడు కేవలం ఒక భక్తుడు మాత్రమే  కాదని స్వయంగా తమ స్వామి వారు పంపిస్తే తమ దగ్గరికి వస్తున్నాడని .అంతేకాకుండా అతని ద్వారానే తాము ఇన్నాళ్లుగా తలలు బద్దలు కొట్టుకుంటున్న తమ స్వర్ణోత్సవ సంవత్సర సమస్యకు కూడా గొప్ప పరిష్కారం దొరకబోతోందని..

ఇవేమీ తెలీని ఆ పెద్దలంతా ఆ రూంలో వెయిట్ చేస్తుంటే ఆ ముస్లిం భక్తుడొక్కడూ బయట వెయిటింగ్ హాల్లోవెయిట్ చేస్తున్నాడు.. సరిగ్గా అప్పుడే అటెండర్ బయట కొచ్చిఆ ముస్లిం భక్తుడి దగ్గర కెళ్ళి చెప్పాడు “సార్..మా సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు” అని..

అప్పటిదాకా తను కూర్చున్నచెక్క కుర్చీ లోంచి లేచి ఆ అటెండర్ కి థాంక్స్ చెప్తూ ఆ ముస్లిం భక్తుడు ఒక్కో అడుగూ వేసుకొంటూ బోర్డు రూం లోపలికి మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళాడు..వెళ్తూనే రెండు చేతులు జోడించి అక్కడున్నవారందరికీ ఎంతో వినమ్రంగా నమస్కారం చేసి ఆ తరువాత మెల్లిగా ప్రసాద్ గారి  వైపు తిరిగి ఇలా చెప్పటం మొదలు పెట్టాడు..

“.. అయ్యా.. నా ఏరు షేక్ మస్తాన్..మాది గుంటూరు జిల్లా..మాది చాల పెద్ద కుటుంబం..అన్నదమ్ములందరం కలిసి ఉమ్మడిగా ఒకే  ఇంట్లో ఉంటాం..మా కుటుంబానికక్కడ ఓ చిన్న పాటి వ్యాపారముంది..ఎన్నోతరాలుగా మేమంతా స్వామి వారి భక్తులం..”

“..మా తాత ముత్తాతల కాలం నుండీ కూడా మా కుటుంబ సభ్యులమంతా చిన్న పిల్లలతో సహా ఒక పద్ధతి ప్రకారం పొద్దున్నేలేచి స్వామి వారి ముందు నిలబడి శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం పఠిస్తాం..అట్లాగే ఏ మాత్రం తప్పులు పోకుండా శ్రీ వేంకటేశ్వర  ప్రపత్తి, మంగళాశాసనం కూడా పఠిస్తాం..నా మటుకు నేను శ్రీనివాస గద్యం మొత్తం పొల్లుపోకుండా అప్పజెప్పగలను..”

“తరతరాలుగా మా ఇంట్లో మరో ఆచారం కూడా ఉంది..అదేమిటంటే మేమంతా కలిసి ప్రతి మంగళ వారం పొద్దున్నే లేచి మా పెరట్లో పూచే రకరకాల పూలతో స్వామి వారి 108 నామాలూ ఒక్కొక్కటిగా పటిస్తూ ఒక్కో నామానికి ఒక్కో పువ్వు చొప్పున సమర్పిస్తూ శ్రీ స్వామి వారికి అష్టోత్తర శత నామ పూజ చేస్తాం..”

“అయ్యా ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిమిటంటే..మా తాతగారు అంటే మా తండ్రి గారి తండ్రి గారు తన చివరి రోజుల్లో స్వామి వారికి తన స్వార్జితంతో 108 బంగారు తామర పూలు చేయించి శ్రీవారి ఆలయంలో సమర్పిస్తానని మొక్కుకున్నారు..మొక్కయితే మొక్కుకున్నారు గానీ పాపం వారి ఆరోగ్యమూ అంతంత మాత్రమే ఆర్ధిక స్తోమతా అంతంత మాత్రమె కావటం చేత కొద్ది మాత్రం బంగారు తామర పూలు మాత్రమే చేయించ గలిగారు..”

“..ఆ తరువాత తండ్రి గారి మొక్కు తీర్చే బాధ్యత తనది కూడా అవుతుంది కాబట్టి మా తండ్రిగారు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక్కో రూపాయి కూడ పెట్టి మరికొన్ని బంగారు పూలు చేయించారు..అంత కష్టపడీ చివరికా మొక్కు తీర్చకుండానే మా తండ్రి గారు కూడా వారి తండ్రి గారి లాగానే తమ చివరి రోజుల్లో ఎంతో బాధపడుతూ స్వామి వారి పాదాల్లో ఐక్యమై పోయారు..”

“..మరి మా తాతగారిది తండ్రిగారిది మొక్కు తీర్చాల్సిన బాధ్యత ఇంటికి పెద్ద కొడుగ్గా నా మీద కూడా వుంటుంది కాబట్టి నా ఆర్ధిక పరిస్థితి కూడా పెద్దగా సహకరించక పోయినా నేను కూడా ఎంతో కష్టపడి నా వంతు ప్రయత్నంగా ఆ మిగతా బంగారు పూలు కూడా పూర్తి చేయించాను..ఈ మధ్యనే కరెక్టుగా 108 పూల లెక్క పూర్తయ్యింది..ఎంతో భక్తితో అవి స్వామి వారికి సమర్పించాలని మా కుటుంబ సభ్యుల మంతా మొత్తం 54 మందిమి కలిసి ఇందాకే కాలి బాటన కొండెక్కి పైకి చేరుకున్నాం..”

అంటూ కాసేపాగి అందరివేపు ఒక్క నిమిషం తదేకంగా చూసాడు షేక్ మస్తాన్..ఆ తరువాత మెల్లిగా అసలు విషయం బయట పెట్టాడు…

“అయ్యా..ఇప్పటికే మీ అమూల్యమైన సమయం చాలా తీసుకున్నాను..కానీ చివరగా పెద్దలందరికీ నాదొక చిన్న విన్నపం.. మూడు తరాలుగా మా కుటుంబ సభ్యులంతా ఎంతో శ్రమపడి ఈ బంగారు తామర పూలు చేయించాం..ఇవి ఒక్కోటి 23 గ్రాముల బరువుంటాయి..”

“..కాదనకుండా మీరు వాటిని స్వీకరించి ఏదో రూపేణా స్వామి వారి కైంకర్యంలో ఉపయోగిస్తే మా కుటుంబం మొత్తానికి కూడా గొప్ప సాయం చేసిన వారవుతారు..మా తండ్రీ తాతగారి ఆత్మలు కూడా శాంతిస్తాయి..ఇది విన్నవించు కుందామనే మీ దగ్గరకు వచ్చాను ..ఇక మీ ఇష్టం..నిర్ణయం మీకే వదిలేస్తున్నాను..”

అంటూ వినమ్రంగా అందరికీ రెండు చేతులెత్తి మరోసారి నమస్కారం చేసి అప్పుడు మెల్లిగా తన చేతిలో ఉన్న ఒక బరువైన సంచీని తీసి ప్రసాద్ ముందున్న టేబుల్ మీద పెట్టాడు షేక్ మస్తాన్ అనబడే ఆ అతి గొప్ప ముస్లిం భక్తుడు..

నిశ్శబ్దం..నిశ్శబ్దం..నిశ్శబ్దం..

గుండెలు పిండేసే నిశ్శబ్దం.. రాతిని కరిగించే నిశ్శబ్దం.. బరువైన నిశ్శబ్దం.. గుండె చెరువైన నిశ్శబ్దం.. నిర్వేదమైన నిశ్శబ్దం… నిలువెల్లా మనిషిని నివ్వెర పరిచే నిశ్శబ్దం.. మనసంతా నిశ్శబ్దం.. మనసుని కలవర పరిచే నిశ్శబ్దం.. గతి తప్పిన నిశ్శబ్దం.. మనసుని గతి తప్పించే నిశ్శబ్దం.. నిశ్శబ్దం.. నిశ్శబ్దం.. నిశ్శబ్దం..

కొన్ని క్షణాల పాటక్కడ ఇంతకంటే వర్ణించటానికి వీలుకాని నిశ్శబ్దం తాండవించింది..అక్కడున్నవారందరూ ఓ మహాశిల్పి చెక్కేసి గదిలో వొదిలేసిన మహాత్ముల శిలా విగ్రహాల్లాగా freeze అయిపోయి కూర్చున్నారు..అక్కడ గది మూలల్లో ఏర్పాటు చేసిన pedestal fans తిరుగుతూ చేసే శబ్దం తప్ప ఆ సమయంలో అక్కడ మరే ఇతర శబ్దం వినిపించటంలేదు..

ఎంతో సాదా సీదాగా కనపడుతూ తమ మధ్యన మామూలుగా నిలబడి ఎన్నో అద్భుత విషయాలు చెప్పిన ఆ గొప్ప శ్రీవారి ముస్లిం భక్తుడి మాటలకు చేష్టలుడిగి పోయి ఉన్నారంతా.. అందరికంటే ముందు తేరుకున్నవాడు పీ వీ ఆర్ కే ప్రసాద్..

“దివినుండి దేవ దేవుడే దిగి వచ్చినాడా..”

అన్న ఒక్క అతి చిన్న అనుమానం లిప్త పాటు కాలంలో ఓ మహోగ్ర రూపం దాల్చిఆయన మనసంతా ఆక్రమించింది..ఇంకొక్క ఉత్తర క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఒక్క ఉదుటున లేచి షేక్ మస్తాన్ దగ్గరికి చేరుకున్నారు  ప్రసాద్..

కళ్ళనుండి ధారగా కన్నీళ్లు కారిపోతుండగా షేక్ మస్తాన్ రెండు చేతులు పట్టుకొని ఎంతో ఆర్థ్రతతో,”మస్తాన్ గారూ..మమ్మల్ని దయచేసి క్షమించండి..మీరెవరో తెలీక ఇంతసేపూ మిమ్మల్ని నిలబెట్టే మాట్లాడించాను..రండి ..” అంటూ ముందు తన కుర్చీ దగ్గరికి తీసుకెళ్ళి తన పక్కనున్న కుర్చీలో కూర్చోపెట్టుకుని ఆ తరువాత మెల్లిగా ఇట్లా అన్నారు..

“మస్తాన్ గారు..ఇక్కడున్న మేమంతా మా సర్వీసులో ఎంతో మంది గొప్ప గొప్ప భక్తుల్ని చూసాం..కానీ మీ అంతటి అద్వితీయమైన  భక్తుడ్నిమాత్రం ఇప్పుడే చూస్తున్నాం..ఒక రకంగా మిమ్మల్ని చూడగలగటం మా పూర్వజన్మ సుకృతం అనుకోండి..బహుశా మిమ్మల్ని ఆ శ్రీనివాసుడే మా దగ్గరికి  పంపించాడేమో..ఎవరికి తెలుసు..”

“..కానీ నాదొక విన్నపం..ఈ అమూల్యమైన బంగారు తామర పూలను TTD తరఫున ఒక బాధ్యత కలిగిన ఆఫీసర్ గా నేను తప్పకుండా స్వీకరిస్తాను..కానీ వీటిని స్వామి వారి సేవలో వెంటనే ఉపయోగిస్తామని మాత్రం ఈ క్షణం లో మీకు మాటివ్వలేను.. ఎందుకంటే పేరుకి మేము కూడా శ్రీవారి సేవకులమే అయినా ప్రభుత్వం తరఫున బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం కాబట్టి మాకు కొన్ని పరిమితులుంటాయి.. వాటిని అధిగమించటానికి మాకు చాలానే సమయం పడుతుంది..”

“అయినా సరే.. ప్రయత్నలోపం లేకుండా నా వంతు కృషి చేసి వీలున్నంత తొందరగా మీ పని పూర్తి చేసి మీకు కబురు పెడతాను.. ఏం చేస్తాననేది మాత్రం ఇప్పుడే చెప్పలేను..మీరు మీ అడ్రస్సు ఫోన్ నెంబర్  మాకిచ్చి వెళ్ళండి..మిగతా విషయాలు నేను చూసుకుంటాను..అంతవరకూ కాస్త ఓపిక పట్టండి..”

 అంటూ షేక్ మస్తాన్ రెండు చేతులూ పట్టుకొని ప్రసాద్ ఇట్లా అన్నారు..

” మస్తాన్ గారు.. చివరగా ఒక్క మాట.. ప్రస్తుతం మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడ మా వాళ్ళు దర్శనం వసతి ఏర్పాటు చేస్తారు..హాయిగా  మీ స్వామి వారిని దర్శించుకొని వెళ్ళండి..thank you very much..”

ఉపసంహారం

ఆ తరువాత పనులన్నీ చకచకా జరిగిపొయినయి.. ఇంకో రెండు మూడు మీటింగుల తర్వాత చివరికి శ్రీ వారికి ఒక కొత్త అర్జిత సేవను ప్రవేశ పెట్టాలని TTD బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించింది..ఆ సేవలో భాగంగా స్వామి వారికి వారానికొకసారి అష్టోత్తర శతనామ పూజ జరపబడుతుంది..

ఆ పూజలో స్వామి వారి 108 పేర్లను ఒక్కొక్కటిగా పఠిస్తూ షేక్ మస్తాన్ కుటుంబం సమర్పించిన ఒక్కొక్క బంగారు తామర పూవును పూజారులు స్వామి వారి పాదాల మీద ఉంచుతారు..TTD ఈ ఆర్జిత సేవను 1984 లో స్వామి వారికి తమ స్వర్ణోత్సవపు కానుకగా ప్రవేశ పెట్టింది..

శ్రీ వారి పట్ల షేక్ మస్తాన్ కుటుంబానికున్న గొప్ప భక్తి వలన స్వామి వారికి ఒక కొత్త ఆర్జిత సేవ ప్రారంభం అవటమే కాకుండా అదే కుటుంబం వలన TTD బోర్డుకి కూడా తమ స్వర్ణోత్సవ సంవత్సరాన్ని తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరుపుకొనే ఒక గొప్ప సదవకాశం లభించింది..

గత 30 సంవత్సరాలకు పైగా ప్రతి మంగళవారం స్వామి వారికి జరపబడే ఈ సేవలో ఇప్పటికీ షేక్ మస్తాన్ ఇచ్చిన బంగారు తామర పూలనే వాడతారు..కాలక్రమేణా ఈ సేవ భక్తుల్లో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది..మొదట్లో ఈ సేవను “అష్టదళ స్వర్ణ పద్మ పూజ” అని పిలిచినా ఇప్పుడది “అష్టదళ పాద పద్మారాధన సేవ” గా మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.......

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Read more...

శ్రీ చాగంటి గారి ప్రవచనాలు కొనసాగుతాయి అని తెలుస్తున్నది. అందరికీ ధన్యవాదములు

>> Saturday, January 21, 2017

Read more...

పూర్వజన్మలో చేసిన పాపం పరిహారం

>> Friday, January 20, 2017

పూర్వజన్మలో చేసిన పాపం పరిహారం.....................!!

కొంతమంది పాపపు పనులు చేసి దాన్ని సమర్థించుకోవడానికి అదేదో లోకోపకారం కోసమో, మరో మంచి పనికోసమో చేస్తున్నామని, దానివల్ల తమకు పాపం అంటదని అంటుంటారు. కానీ అలా అనడం చేసిన తప్పును అప్పటికి కప్పిపుచ్చుతుందే తప్ప, దాని ఫలితాన్ని మాత్రం ఎవరైనా, ఎప్పటికైనా అనుభవించి తీరాల్సిందేనన్న సామాజిక సత్యాన్ని నిరూపించే కథ మత్స్య పురాణం ఇరవై అయిదో అధ్యాయంలో ఉంది.
పూర్వం కౌశికుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. కురుక్షేత్రంలో ఆయనను మించిన ధర్మాత్ముడు లేడని ఆ రోజుల్లో అంతా అంటూ ఉండేవారు. అలాంటి మహర్షికి స్వనృపుడు, క్రోధనుడు, హింస్రుడు, పిసునుడు, కవి, వాగ్దుష్టుడు, పితృవర్తి అనే ఏడుగురు కుమారులుండేవారు. వారంతా సార్ధక నామధేయులు. మొదటివాడు తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుండేవాడు. రెండోవాడు క్రోధ స్వభావంతో ఉండేవాడు. మూడోవాడు అకారణంగా ఎదుటివారికి బాధ కలిగిస్తుండేవాడు. నాలుగోవాడు చాడీలు చెపుతుండేవాడు. అయిదోవాడు ఉన్నవీ లేనివీ కల్పించి కవిత్వం అల్లుతుండేవాడు. ఆరోవాడికి నోరుతెరిస్తే చెడుమాటలే వచ్చేవి. ఏడోవాడు మాత్రం తండ్రి మీద భక్తితో నడుచుకుంటూ ఉండేవాడు. ఈ ఏడుగురిని గర్గమహాముని వద్ద విద్యాభ్యాసం చేయమని కౌశికుడు పంపాడు. అయితే ఆ ఏడుగురికి గురువు ఎంతగా విద్య నూరిపోస్తున్నా వారు తమ సహజమైన బుద్ధులను మాత్రం మానుకోలేదు. కానీ బుద్ధులెలా ఉన్నా వారు మంచి తపోధనులుగానే పేరుతెచ్చుకున్నారు. ఇలా ఉండగా ఓ రోజున ఆ ఏడుగురూ గర్గమహాముని పాడి ఆవును, దూడను గురువు ఆజ్ఞను అనుసరించి అడవిలో మేపసాగారు. అలాంటి సమయంలో హింస్రుడు, క్రోధనుడు లాంటివారికి ఓ ఆలోచన వచ్చింది. ఆ ఆవును చంపి తింటే బాగుండునన్న దురాలోచన తట్టింది. దానికి ఏడుగురూ సిద్ధపడ్డారు. అయితే చివరివాడైన పితృవర్తి మాత్రం కొంత ధర్మబుద్ధితో ఆలోచించాడు. గోహత్యాపాపం అంటకుండా తమ కోర్కె తీరాలంటే ఆ గోవు మాంసాన్ని పితృదేవతలకు శ్రద్ధతో శ్రాద్ధంగా పెడితే సరిపోతుందన్నాడు. ఆ సూచన మిగిలిన అందరికీ నచ్చింది. అలా చేసిన తర్వాత సాయంత్రానికి ఒక్క దూడను మాత్రమే వెంటబెట్టుకుని ఏడుగురూ గురువు వద్దకు చేరారు. అడవిలో ఆవును, దూడను మేపుతుండగా ఓ పెద్దపులి వచ్చి ఆవును చంపి తిని వెళ్ళిందని అబద్ధం చెప్పారు. గురువు కూడా అదే నిజమని నమ్మాడు. కొంతకాలం అలా వారు విద్య నేర్చుకుంటూనే తమ బుద్ధులకు తగినట్లుగా దుర్మార్గపు పనులు చేశారు. వాటివల్ల వచ్చే పాపాన్ని పోగొట్టుకోవడానికి రకరకాల పూజలలాంటివి చేసుకుంటూ పోసాగారు. అలా జీవితం గడిచి ఆ ఏడుగురూ మరణించారు. వారుచేసిన మహాపాపకార్యాల ఫలితం వారిని అంటిపెట్టుకునే వచ్చింది. గోహత్య చేసి పితృశ్రాద్ధం లాంటివి పెట్టి పాపం పోయిందిలే అనుకున్నా.. తపస్సు చేసి పాపం అంటదులే అని ధైర్యంగా ఉన్నా.. మరుసటి జన్మలో వారి పాపానికి తగినట్లుగా జంతువులను హింసించి తినే బోయవాడి కుమారులుగా జన్మించారు. మహాధార్మికులైన మహర్షి కుమారులు, గొప్ప పేరున్న గర్గముని శిష్యులు అంతో ఇంతో తపశ్శక్తి సంపన్నులు అయినప్పటికీ వారికి అలాంటి జన్మ లభించింది. వారుచేసిన కొద్దిపాటి పుణ్యంవల్ల పూర్వజన్మ స్మృతి మాత్రం నిలిచి ఉంది. ఒకప్పటి తమ ఉత్తమ జన్మను వృధా చేసుకుని ప్రస్తుతం అచ్చంగా హీనమైన జీవితాన్ని గడపాల్సి వచ్చినందుకు అనుభవించిన మనోవేదన అంతా ఇంతా కాదు. అప్పటికే వారిలో వైరాగ్యం చోటుచేసుకుంది. ఇకమీదటనైనా మంచి జన్మ ప్రాప్తించాలని నిరాహారవ్రతం చేసి పరమేశ్వరుడి సన్నిధిలో జ్ఞాన వైరాగ్యాలతో ధర్మమార్గంలో జీవించి కాలాంతరంలో మరణించారు.
ఆ తర్వాత పూర్వజన్మ స్మృతితోనే లేళ్ళుగా జన్మించారు. ఆ జన్మలోనూ నిరాహారవ్రతం చేసి దేహత్యాగం చేశాక అప్పుడు మానస సరోవరంలో చక్రవాక పక్షులుగా జన్మించి యోగమార్గాన్ని అనుసరించారు. అప్పటికి కానీ మళ్ళీ వారికి మానవ జన్మ లభించలేదు. ఒకరు రాజ కుమారునిగా జన్మించాడు.మిగిలిన వారు వేరు వేరుగా జన్మించి పూర్వజన్మ స్మృతి వల్ల అందరూ కలుసుకుని హిమాలయాలకు తపస్సుకు వెళ్ళిపోయారు.(మత్స్య పురాణం) ఈ ఎంత మహోన్నతమైనదో తెలుసుకుని జాగ్రత్తగా అప్పుడు మసలసాగారు. కౌశిక మహర్షి కుమారుల ఈ కథ మానవ జన్మ ఔన్నత్యం తెలపడంతోపాటు, తప్పుచేసి దేవుడికి పరిహారం చెల్లించవచ్చనో, మరో మంచిపని చేసి పాపం పోగొట్టుకోవచ్చనో భ్రమించి పాప కార్యాలవైపు పరుగులు తీసేవారికి ఓ కనువిప్పులా కనిపిస్తుంది.
"ఒకరికి మంచి చేయకపోయినా ఫర్వాలేదు... చెడు మాత్రం చేయవద్దు" అని పెద్దల వచనం. ఇలా అకారణంగా పూర్వజన్మలో చేసిన పాపం ఈ జన్మలో పట్టిపీడిస్తుందన్నారు.
అంతేకాదు గత జన్మలో చేసిన ఇటువంటి పాప ప్రక్షాళనకు ఈ జన్మలో ఆ సర్వేశ్వరునికి త్రికరణశుద్ధితో పూజలు చేయాలని చెప్పారు. అయితే కొందరు మాత్రం గత జన్మలో చేసిన పాపాలకు ఇప్పుడు పూజలు చేయటమేమిటని ప్రశ్నిస్తుంటారు.
దీనికి పెద్దలు ఇలా చెప్పారు... పాప ప్రక్షాళనకు భగవంతునికి చేసే పూజలు, వ్రతాలు వంటివన్నీ రోగమొస్తే మాత్ర వేసుకోవటం వంటివి. తలనొప్పి దానిపని అది చేస్తూ వుంటే మాత్ర దానికి సమాంతరంగా తన పని అది చేసుకుంటూ పోతుంది. చివరికి ఒక దశలో దాని ప్రభావం ఎక్కువై తలనొప్పి తగ్గిపోతుంది.
అలాగే పూర్వ జన్మలో చేసిన పాపాల ప్రభావం, వాటికి విరుగుడుగా చేసే పూజలు, వ్రతాలు శాంతులు సమాంతరంగా సాగుతుంటాయి. ఎప్పుడైతే ఆ భగవంతుని ప్రభావం ఎక్కువవుతుందో పూర్వ జన్మలో చేసిన పాపాలు పటాపంచలవుతాయి.

Read more...

ఆచమనం అంటే .....?

>> Wednesday, January 18, 2017

📌ఆచమనం అంటే .....?

పూజలు, వ్రతాల్లో ''ఆచమనం'' అనే మాట చాలాసార్లు వింటాం. కానీ ఆ పదానికి అర్ధం చాలామందికి సరిగా తెలీదు. అందుకే ''ఆచమనం'' అంటే ఏమిటో, దాని వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆచమనం అనే ఆచారం అపరిమితమైనది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ రోజులో అనేకసార్లు చేయొచ్చు, చేయాలి. ముఖ ప్రక్షాళన అయిన తర్వాత, స్నానం చేసిన తర్వాత, పూజకు ముందు, సంధ్యావందనం చేసే సమయంలో పలుసార్లు, భోజనానికి ముందు, తర్వాత, బయటకు ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత ముఖం, కాళ్ళూచేతులూ కడుక్కున్న తర్వాత – ఇలా ఎన్నిసార్లు అయినా ఆచమనం చేయొచ్చు.

ఆచమనం ఎవరైనా, ఎపుడైనా చేయొచ్చు కానీ, చేసే వ్యక్తి శుచిగా, శుభ్రంగా ఉండాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉద్ధరణి చొప్పున మంత్రయుక్తంగా మూడుసార్లు చేతిలో నీరు పోసుకుని తాగాలి. ఆచమనం గురించి సంస్కృతంలో ''గోకర్ణాకృతి హస్తేన మాషమగ్న జలం పిబేత్'' అని వర్ణించారు. అంటే, కుడి అరచేతిని ఆవు చెవి ఆకారంలో ఉంచి, ఇందులో మూడు ఉద్ధరణిల నీటిని (ఒక మినపగింజ మునిగేంత పరిమాణంలో నీళ్ళు) పోసి, వాటిని తాగాలి. చేతిలో పోసే నీళ్ళు అంతకంటే ఎక్కువ కానీ, తక్కువ కానీ ఉండకూడదు. నీరు కొలత అంతే ఉండాలి కానీ, ఎన్నిసార్లు అయినా చేయొచ్చు.

ఆచమనం ఎన్నిసార్లు అయినా చేయొచ్చు అని చెప్తున్నారు.. బాగానే ఉంది. అసలు ఆచమనం ఎందుకు చేయాలి? నీటిని అరచేతిలో పోసుకుని తాగడం వల్ల ప్రయోజనం ఏమిటి? అలా ఎందుకు తాగాలి? ఉద్ధరణితో తిన్నగా నోట్లో పోసుకుని ఎందుకు తాగకూడదు? మూడు ఉద్ధరణిల నీరు మాత్రమే ఎందుకు తీసుకోవాలి? నీరు కొంత ఎక్కువో తక్కువో అయితే ఏమవుతుంది? “కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా...” అని మాత్రమే ఎందుకు చెప్పాలి? - ఇలాంటి సందేహాలు కలగడం సహజం. దేవుడు, ఆచారాల పట్ల నమ్మకం లేని నాస్తికులు అయితే వీటిని అపహాస్యం చేస్తారు కూడా.

అందుకే ఆచమనం చేయడంలో పరమార్థం ఏమిటో విపులంగా తెలుసుకుందాం.

మన గొంతు ముందుభాగం లోంచి శబ్దాలు వస్తాయి. దీన్ని స్వరపేటిక అంటాం. దీనిచుట్టూ కార్టిలేజ్ కవచం ఉంటుంది కనుక కొంతవరకూ రక్షణ లభిస్తుంది. అయినప్పటికీ, ఇది ఎంత అద్భుతమైనదో, అంత సున్నితమైనది. ఈ గొంతు స్థానంలో చిన్న దెబ్బ తగిలినా ప్రమాదం. స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోవచ్చు, ఒక్కోసారి ప్రాణమే పోవచ్చు. స్వరపేటిక లోపలి భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి. ఇవి ఇంగ్లీషు అక్షరం 'V' ఆకారంలో పరస్పరం కలిసిపోయి ఉంటాయి. ఈ తంత్రులు సూక్ష్మంగా ఉండి, ఎపెక్స్ ముందుభాగంలో పాతుకుని ఉంటాయి. స్వరపేటిక కవాటాలు పల్చటి మాంసపు పొరతో ముడిపడి ఉంటాయి.

ఈ శరీర నిర్మాణం గురించి చెప్పుకోవడం ఎందుకంటే, మన భావ వ్యక్తీకరణకు కారకమైన స్వరపేటిక మహా సున్నితమైనది. ముక్కు, నోరు, నాలుక, పెదవులు, పళ్ళు, గొంతు నాళాలు, అంగిలి, కొండనాలుక, గొంతు లోపలి భాగం, శ్వాస నాళం, అన్ననాళం, స్వర తంత్రులు, వాటి చుట్టూ ఉన్న ప్రదేశం ఇవన్నీ ఎంతో నాజూకైనవి. వీటికి బలం కలిగించడమే ఆచమనం పరమోద్దేశం.

ఆచమనంలో మూడు ఉద్ధరణిల నీరు మాత్రమే తాగాలి అని చెప్పుకున్నాం కదా! గొంతులోంచి శబ్దం వెలువడేటప్పుడు అక్కడున్న గాలి బయటికొస్తుంది. ఇలా లోపలినుండి గాలి బయటకు వస్తున్నప్పుడు అందులో వేగం ఉండకూడదు.శబ్దం సులువుగా, స్పష్టంగా రావాలి. ఇలా కొన్ని నీటిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని, అంతే జాగ్రత్తగా మెల్లగా తాగడం అనే అలవాటు వల్ల మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధ, జాగ్రత్త అలవడుతుంది. రోజులో ఆచమనం పేరుతొ అనేకసార్లు మెల్లగా నీరు తాగడంవల్ల గొంతు, ఇతర అవయవాలు వ్యాయామం చేసినట్లు అవుతుంది.

“కేశవాయ స్వాహా" అన్నప్పుడు అది గొంతునుండి వెలువడుతుంది. “నారాయణాయ స్వాహా" అనే మంత్రం నాలుక సాయంతో బయటకు వస్తుంది. చివరిగా "మాధవాయ స్వాహా" అనే మంత్రం పెదవుల సాయంతో వెలువడుతుంది. ఆచమనం అనే ఆచారాన్ని పాటించి ఈ మంత్రాలను ఉచ్చరించడం వల్ల గొంతు, నాలుక, పెదాలకు వ్యాయామం లభిస్తుంది. పైగా ఇవి పరమాత్ముని నామాలు కనుక, భక్తిభావంతో ఉచ్చరించడం వల్ల మేలు జరుగుతుంది.

ఇక ఉద్ధరణితో తిన్నగా ఎందుకు తాగకూడదు, చేతిలో వేసుకునే ఎందుకు తాగాలి అంటే, మన చేతుల్లో కొంత విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. చేతిలో నీళ్ళు వేసుకుని తాగడం వల్ల ఆ నీరు విద్యుత్తును పీల్చుకుని నోటిద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసి శరీరం అంతా సమానత్వం ఉండేలా, సమ ధాతువుగా ఉండేలా చేస్తుంది.

ఒక ఉద్ధరణి చొప్పున కొద్దికొద్దిగా నీరు సేవించడం వల్ల ఆ కొద్దిపాటి విద్యుత్తు పెదాలు మొదలు నాలుక, గొంతు, పెగులవరకూ ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజపరుస్తాయి. ఈ ప్రయోజనాలే కాకుండా ఒక పవిత్ర ఆచారంగా భావిస్తూ రోజులో అనేకసార్లు పాటించడం వల్ల మనసు దానిమీద కేంద్రీకృతమై, లేనిపోని బాధలు, భయాలు తొలగుతాయి.

ఏదో అలవాటుగా పాటించే ఆచారాల వెనుక ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శాస్త్రీయత ఉంది....✍ లోకాస్సమస్తాస్సుఖినోభవంతు .

Read more...

వికెట్ పడిపోతేనే దేశం ఓడిపోతుందని భయపడే దేశ భక్తా

>> Tuesday, January 17, 2017

రైతులు నాటౌట్ గా నిలవాలి .
*
వికెట్ పడిపోతేనే దేశం ఓడిపోతుందని భయపడే
దేశ భక్తా x
దేశానికి అన్నం పెట్టే దేహాలెన్నో పడిపోతున్నాయ్
పట్టించుకుంటున్నావా దేశభక్తా ?
*
ఇష్టమయిన క్రికేటరెవరో
వంద పరుగులు చెయ్యాలని దేవుణ్ణి మొక్కుకున్నట్లు
నీకు తెలిసిన రైతు ఎవరైనా
వంద బస్తాలు పండించాలని
ఎప్పుడైనా మనసారా కోరుకున్నావా దేశ భక్తా ?
*
రెండు గంటలు బ్యాటు పట్టుకోని ఆడినతను గాడ్ అయితే
నీకు జీవితాంతం బువ్వ పెట్టే రైతన్న కే పేరు పెడుతావ్ దేశ భక్తా ?
*
దేశాన్ని గెలిపించడానికి
కొన్ని బంతులే ఉన్నాయని తెలిస్తేనే ,
టెన్షన్ పడి గొంతు తడుపుకుంటావ్.
దేశాన్ని బతికించే
నదులు చెరువులు కొన్ని మాత్రమే నీళ్ళతో ఉన్నాయ్
అనే ఆందోళన నీకుందా దేశ భక్తా ?
*
నీకు సంతోషం ఇచ్చే ఆటగాళ్ళను
నీకు ఇష్టమయిన రీతిలో ఎంకరేజ్ చేస్తుంటావ్
నిన్ను బతికించే రైతులకెవరూ
ఎంకరేజ్ చెయ్యడం లేదని తెలుసా దేశ భక్తా ?
*
నీకు ఏ స్టేడియం లో పిచ్ ఎలా ఉంటదో తెలుసు కానీ
నీ ఊరిలో మార్కెట్టు యార్డు అసలెక్కడుందో
ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసా దేశ భక్తా?
*
అన్నం తింటూ కూడా ..
పాకిస్తానీ టీం ని దేశం లో రానియ్యాల వద్దా అని
నీకు తెలిసిన గొప్పలు ప్రదర్శిస్తావ్ .
అసలు నీ చేతిలో ఉన్నది స్వదేశి బియ్యమో
విదేశి దిగుమతి బియ్యమో తెలుసా దేశ భక్తా?
*
ఇండియన్ క్రికేట్ బోర్డో , క్రికేట్ టీమో
చేసే తప్పోప్పులన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటావ్
వ్యవసాయానికి పెట్టింది పేరయినా దేశం లో
ప్రభుత్వాలు చేసే తప్పోప్పుల్ని
అసలెప్పుడయినా పట్టించుకున్నావా దేశభక్తా ?
*
ఎవరు ఎప్పుడు ఎంత స్కోర్ చేసారో తెలిసిన
నీకు
రోజెక్కడెక్కడ ఎంతమంది రైతులు చస్తున్నారొ తెలుసా దేశ భక్తా?
*
అసలు ,
అసలయిన పరుగులు తియ్యడం అంటే
ఏమిటో నీకు తెలుసా దేశభక్తా ?
ఎప్పుడయినా ,
గిట్టు బాటు ధరలకోసమో ,విద్యుత్తుకోసమో పోరాటం చేస్తూ ,
లాఠీ దెబ్బలు తింటూ పరిగెత్తే రైతన్నలను చూసావా దేశభక్తా?
*
ఏ దేశం బౌలరు ఎలా బాల్ వేస్తాడో తెలిసిన నీకు
ఎవరు ఎలా రైతులను మోసం చేస్తున్నారో తెలియకుండా ఉంటుందా
దేశ భక్తా?
*
పిల్లలకు స్టేడియాలకు తీసుకెళ్ళినట్లు,
చెక్క తో బ్యాట్ మాత్రమే కాదు
నాగలి పనిముట్లు కూడా చేస్తారు అని
ఎప్పుడయినా పోలాలకు తీసుకెళ్ళి చెప్పావా దేశ భక్తా ?
*
క్రికేటర్లు
బూస్టులో కూల్ డ్రింకు లో తాగి
ఆరోగ్యంగా ఆడుతున్నారని
నువ్వు అన్నం తినకుండా బతకగ్గలవా దేశభక్తా?
*
కామెంట్రీలు వింటూ టీవి లకు అతుక్కోపోయినట్లు
రైతుల గురించి చర్చా కార్యక్రమాలు చూసావా దేశ భక్తా ?
*
ఎప్పుడు ఎలా ఆడితే
దేశం గెలుపోటముల అవకాశాలున్నాయో
చెప్పగలవ్ కదా దేశ భక్తా !
మరి ఎప్పుడు ఎలా
దేశం ఆహార పంటల విషయం లో గెలుస్తుందో చెప్పలేవా?
*
పది మంది ఆడే ఆటకోసం లక్షల మంది ఒక్కటౌతున్నాం
కోట్లమంది ఆకలి తీర్చే రైతుల కోసం ఏం చేస్తున్నాం దేశ భక్తా?
*
ఇండియాని గెలిపించే వాళ్ళను కూడా
బతికించే వాళ్ళ గురించి ఆలోచించు దేశ భక్తా.
*
ఇండియా గెలవాల్సింది స్టేడియాల్లో కాదు
పచ్చని పోలాల్లో దేశ భక్త .
అందుకు
రైతులు నాటౌట్ గా నిలవాలి
మనం చీర్ లీడర్స్ కావాలి. (Y)

Read more...

కనుమ పండుగ ! జంతువులను పూజించే పండుగ !!*

>> Sunday, January 15, 2017



*జనవరి 15, 2017, ఆదివారం - #కనుమ పండుగ ! జంతువులను పూజించే పండుగ !!*

*వేదం జంతువులు మనుషులకు సోదరసమానమైనవని చెప్పింది.* మానవులారా! జంతువులు వధించకూడనవి, వాటిని చంపరాదు అంటుంది *యజుర్వేదం.*

*పాశూన్సత్రాయేతం - #యజుర్వేదం 6.11 పశువులను/ జంతువులను రక్షించండి అని అర్దం.*

ఎద్దు ధర్మస్వరూపం. ఆవు తల్లి. వ్యవసాయ పనుల్లో నిత్యం రైతుకు సాయం చేసేది ఎద్దు. ఆవులు, గేదెల పాలు అమ్ముకోవడం ద్వారా అవి సాయం అందిస్తున్నాయి. ఆట్లాగే పూర్వాకాలం మన భారతీయ రైతులు గోమూత్రం, గో పేడతో చేసిన సహజ ఎరువులని వాడి పంటలను పండించేవారు. ఇవి భూసారాన్ని చాలా అధికంగా పెంచాయి. అందుకే తెల్లదొరలు భారతదేశం మీదపడి దోచుకునే ముందు వరకు, మనం దేశంలో ఒక్క ఆకలిచావు కూడా లేదు. 

ఈ రోజు మనిషి ప్రకృతి నుంచి దూరమయ్యాడు కానీ, రైతులు ఏనాడు పశుసంపదను తమ నుంచి వేరుగా చూడలేదు. వాటిని కుటుంబంలో ఒకరిగా భావిస్తారు. వీడు మా రాముడు, మా శివుడు అంటారు, ఇది మా లక్ష్మీ అంటారు కాని ఇది మా ఎద్దు, ఇది ఆవు అనరు. అవి వారికి జంతువులు కావు.

మరి ఇంత సాయం చేసే వాటిని గౌరవించేందుకు, వాటికంటూ ప్రత్యేకంగా ఒక రోజు (పండుగు) ఉండాలన్న ఆలోచనతో మన పూర్వీకులు ఏర్పాటు చేసిన పండుగే కనుమ. కనుమ సమయానికి పంట చేతికోచ్చి అందరు ఆనందంగా ఉంటారు. పంట బాగా పండడంలో సహాయపడ్డ పశువులకు, రైతులకి ఇప్పుడు కాస్త విశ్రాంతి. అందుకే వాటికి కృతజ్ఞతగా జరుపుకునే పండుగే కనుమ. కనుమ రోజు పశువులను కడిగి వాటిని అలంకరిస్తారు. వాటి కొమ్ములకు రంగులు వేస్తారు. మనకు సాయం చేసే #జీవులకు మన కుటుంబంలోనూ, మనసులోనూ స్థానం కల్పించాలి, వాటి పట్ల ప్రేమ, అనురాగం కలిగి ఉండాలన్న గొప్ప సందేశం ఇచ్చే పండుగ కనుమ. ఇది మన పూర్వీకుల గొప్పతనం. మనం కూడా వారిని అనుసరిద్దాం. వారి సందేశాన్ని యావత్ ప్రపంచానికి  తెలియజేద్దాం.

చాలా మంది కనుమ రోజున మాంసం తినాలి అనుకుంటారు. *అది తప్పుడు అభిప్రాయం.* *కనుమ పశువుల ప్రాముఖ్యాన్ని తెలియపరిచే రోజు.* 💡 *ఆ రోజున పశువులను పూజించాలి, కనీసం గుడ్డు కూడా తినకూడదు.* కనుమ రోజు తప్పకుండా మినుములు తినాలి. మినుములు చాలా శక్తివంతమైన ఆహారం. అందుకే తెలుగునాట గారెలు, ఆవడలు తినే సంప్రదాయం ఉంది.🙏🙏🙏

Read more...

వేదాంత విప్లవమూర్తి "స్వామి వివేకానంద".*

>> Thursday, January 12, 2017

.            

*వేదాంత విప్లవమూర్తి "స్వామి వివేకానంద".*

భారత ఉపఖండం చీకటి ఖండమైన కాలమది. బ్రిటిష్ పాలనలో
భారతీయులు బానిస మనస్కులై నిర్వీర్యమైపోతున్న యుగమది.
మూఢాచారాలే మతంగా, తంత్రమూ మంత్రమే మోక్షంగా,
సాటివారిని హీనంగా చూడటమే కులంగా, మెట్టవేదాంతమే
తత్త్వశాస్త్రంగా, పాశ్చాత్యులే గొప్పవారుగా చలామణీ అవుతున్న
శతాబ్దమది. అలాంటి స్తబ్దమైన సంఘాన్ని తట్టిలేపిన వైతాళికుడు
వివేకానందుడు.

భారతదేశాన్ని ప్రేమించడమెలాగో, ఉద్ధరించడమెలాగో నేర్పిన మహనీయుడు. ‘‘ఓ తేజస్వరూపా! జననమరణాలకు అతీతుడా! మేలుకో. బలహీనతల్ని తొలగించుకో. పౌరుషాన్ని ప్రసాదించుకో. మనిషిగా మసలుకో. లే. లెమ్ము’’ అంటూ యువతను జాగృతం చేసిన వేదాంతభేరి స్వామి వివేకానంద!
1863 జనవరి 12, సోమవారం! ఉదయం 6 గంటల 49 నిమిషాలు. కలకత్తాలో భువనేశ్వరీదేవి పండంటి మగబిడ్డను కన్నది. తండ్రి విశ్వనాథ్ దత్తా ఆ పిల్లాడికి నరేంద్రనాథ్ అనే పేరు పెట్టారు. నరేన్ అల్లరి గడుగ్గాయి. గిన్నెలు, చెట్లు, రాళ్లు - అన్నీ ఆ చిచ్చరపిడుగుకి ఆటవస్తువులే!

పిల్లల్లోని అంతర్గత అనంత శక్తే అల్లరిగా ఎగదన్నుకొస్తుంది. ఆ దివ్యశక్తిని వెలికి తీయడమెలాగో భువనేశ్వరికి తెలుసు. రెచ్చిపోయే నరేన్ నెత్తిపై శివ శివ అంటూ బిందెడు నీళ్లు గుమ్మరించేది. బుద్ధిగా ఆ పిల్లాడిని కూచోబెట్టేది. రామాయణ భారత శ్లోకాల్ని వల్లె వేయించేది. అందుకే ‘‘నాలోని మానసిక అభ్యుదయానికి, ధార్మిక శక్తికి, సంస్కారానికి మా అమ్మే కారణం’’ అనేవారు స్వామి వివేకానంద.

ఈశ్వరచంద్ర విద్యాసాగర్ నెలకొల్పిన బడిలో 1870లో నరేన్ ఒకటో తరగతిలో చేరాడు. చిన్నప్పుడే వేణీగుప్త, ఉస్తాద్ అహ్మద్‌ఖాన్ దగ్గర సంగీతం నేర్చుకున్నాడు. హార్మోనియం, ఫిడేల్‌పై పట్టు సాధించాడు. న్యాయవాది అయిన విశ్వనాథ్ దత్తా తన కొడుక్కి న్యాయశాస్త్రం, సైన్సు పుస్తకాల్ని ఉద్దేశపూర్వకంగా ఇస్తూండేవారు. ఉపనిషత్తుల్ని, పురాణాల్ని చదివిస్తూండేవారు. ఆయా విషయాలపై కావాలని వాదనపెట్టి చర్చిస్తూండేవారు.
ఏ విషయాన్నయినా తర్కంతో హేతుబద్ధంగా పరిశీలించే శక్తి నరేన్‌కి అలవడింది ఈ శిక్షణ వల్లనే!
చిన్నప్పటినుంచీ నరేంద్రుడికి ధ్యానం ఓ నిత్యక్రీడ. పద్మాసనం వేసుకుని కళ్లు మూసుకుని ధ్యానంలోకి వెళ్లిపోతే సమస్త ప్రపంచాన్నీ మరచిపోయేవాడు. అత్యంత తీక్షణమైన ఏకాగ్రత వివేకానందుడికి అబ్బింది ఈ ధ్యానం వల్లనే.

ఏవేవో ప్రశ్నలు...
1879లో 16 యేళ్ల నరేన్ ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాడు.
రోజూ వ్యాయామం చేసేవాడు. వస్తాదులా ఉండేవాడు. కర్రసాము, గుర్రపుస్వారీ, కుస్తీ, పడవ నడపడం, పరిగెత్తడం, ఈతకొట్టడం... ఒకటా రెండా అన్నింటిలోనూ ప్రవేశించడం, అంతు చూడటం... ఇదీ వరస! చివరకు పాకశాస్త్రంలో కూడా గరిటె తిప్పిన చెయ్యి నరేన్‌ది!
మరోపక్క హెర్బర్ట్ స్పెన్సర్, జాన్ స్టువర్ట్ మిల్, అగస్టె కామ్టె, అరిస్టాటిల్, డార్విన్ లాంటి పాశ్చాత్యుల గ్రంథాల్ని అధ్యయనం చేశాడు. దేశ చరిత్రల్ని, ప్రాక్పశ్చిమ తత్త్వశాస్త్రాల్ని, తర్కం, క్రైస్తవ మహ్మదీయ బౌద్ధమత గ్రంథాల్ని ఆకళించుకున్నాడు. వివిధ దేశాల్లో వివిధ పరిస్థితుల్లో మానవ సమాజాలు ఎలా పరిణామం చెందాయో అవగతం చేసుకున్నాడు.
అయితే భారతీయ సంస్కృతి, మతం, తత్త్వ చింతనలపై మమకారం ఓ వైపు; ఆధునిక విజ్ఞాన శాస్త్రాలు, హేతువాదం పట్ల మక్కువ మరోవైపు - ఈ రెంటి మధ్య నలిగి మధనపడ్డాడు. భగవంతుడు లేడనీ భౌతిక దృగ్విషయాలే సత్యాలనీ చెప్పే పాశ్చాత్య సైన్సులో లోపం ఉందని హృదయానికి అనిపించేది. సనాతన భారతీయ భావజాలం భౌతిక దృష్టి కొరవడి వక్రీకరణకు గురైందని బుద్ధికి తోచింది.
తత్ఫలితంగా ఏవో ఏవేవో ప్రశ్నలతో వేగిపోయేవాడు. ఏవో ఏవేవో ఘోషలతో ఊగిపోయేవాడు. సమాధానాల కోసం బ్రహ్మ సమాజంలో చేరాడు. అయినా సంతృప్తి లేదు.
నిర్వికల్ప సమాధి...

1881లో స్కాటిష్ చర్చి కాలేజీలో బీఏలో చేరాడు నరేంద్రుడు.
ఓ రోజు క్లాసులో ప్రిన్సిపాల్ విలియం హేస్టీ - వర్డ్స్‌వర్త్ కవిత ‘ది ఎక్స్‌కర్షన్’ గురించి చెబుతున్నారు. ఆ మాటల్లో ‘సమాధి అవస్థ అనే ఆత్మానందాన్ని అనుభవిస్తున్నది తనకు తెలిసి రామకృష్ణ పరమహంస’ అని హేస్టీ అన్నారు. నరేన్‌కి మెరుపులాంటి ఆలోచనొచ్చింది. వెంటనే కలకత్తాకి దగ్గర్లోని దక్షిణేశ్వరం వెళ్లాడు.
ఉసిరిచెట్టు కింద మాసిన గడ్డంతో ఒంటిపై ఒక్క అంగవస్త్రం తప్ప మరే ఆచ్ఛాదనా లేని అలౌకిక ధ్యానముద్రలో పరమహంస... దివ్యోన్మాదంతో కాళికాదేవి సాక్షాత్కారం కోసం నేలపై దొర్లి ఏడ్చి చివరకు భగవద్దర్శనం పొందిన పరమహంస... ప్రతిరోజూ గంగలో వెండి నాణాల్ని విసిరేసి ధనవ్యామోహం వదిలించుకున్న పరమహంస... బ్రాహ్మణుడే అయినా పంచముల ఇళ్లకు వెళ్లి, వారు చూడని సమయాల్లో వారి పాయిఖానాల్ని వొట్టి చేతులతో శుభ్రం చేసిన పరమహంస... సన్నిధిలోకి అడుగుపెట్టాడు నరేన్.
                                             
ఆయన పాడమంటే - కనులు మూసుకుని బాహ్య ప్రపంచాన్ని మరచిపోయి తన్మయీభావంతో గాన ధ్యాన సమాధ్యవస్థలో ‘‘మన్ చలో నిజనికేతన్’’ (మనసా! మన చోటుకి వెళ్లిపోదాం) అన్న కీర్తన పాడాడు. పాట వింటూ పరవశులైపోయారు పరమహంస.
హఠాత్తుగా నరేన్ చెయ్యి పట్టుకుని గదిలోకి తీసుకెళ్లి తలుపులేసేశారు. కళ్లల్లో ఆనంద భాష్పాలతో ‘‘ఇన్నాళ్లకు వచ్చావా?’’ అంటూ నరేన్‌ను స్పృశిస్తూ ఆర్ద్రమైపోయారు. అంతటి తాదాత్మ్యతలోనూ నిశ్శబ్దాన్ని చీలుస్తూ నరేంద్రుడు సూటిగా వదిలిన ప్రశ్నాబాణం - ‘‘మహాశయా! మీరు దేవుణ్ని చూశారా?’’ ఏమాత్రం తడుముకోకుండా ‘‘చూశాను’’ అన్నారు రామకృష్ణులు.

సంభ్రమాశ్చర్యానందాలతో నరేన్...
ఇన్నాళ్లుగా ఎందరెందరినో ఉన్మత్తుడిలా అడిగిన ప్రశ్న అది.
ఎన్నాళ్లుగానో చకోరంలా ఎదురుచూస్తున్న జవాబది.
మళ్లీ రామకృష్ణులు ‘‘నిన్ను చూస్తున్నట్లే భగవంతుణ్ని చూశాను. నేను నిన్ను ఇప్పుడు ఎలా చూస్తున్నానో అలాగే మనమూ భగవంతుణ్ని చూడొచ్చు’’ అన్నారు.
ఈ సంఘటన నరేన్ మనసులో గొప్ప విప్లవాగ్ని రగిలించింది.
గదులు, తలుపులు, కిటికీలు, చెట్లు, సూర్యచంద్రులు, నక్షత్రాలు - అన్నీ ఎగిరిపోతున్నట్లు, తునాతునకలై అణువులు పరమాణువులుగా విడిపోయి ఆకాశంలో లీనమైనట్లు అనిపించింది. నేను అనే మాయ మాయమై విశ్వ చైతన్యమే నేనుగా భాసించింది.
నరేంద్రుడు వివేకానందుడిగా మారడం మొదలైందప్పుడే! అప్పటినుంచి పరమహంస వద్దకు నిత్యం ఏవో ప్రశ్నలతో వెళ్తుండేవాడు. అప్పుడప్పుడు గురువుతో వాదించేవాడు. ఓ దశలో తానూ నిర్వికల్ప సమాధిని పొందాలన్నంత ఆవేశవశుడయ్యాడు.
కష్టాలెన్నో...

అంతలో 1884లో తండ్రి విశ్వనాథ్ దత్తా మరణించారు. అంతవరకు బాగా బతికిన కుటుంబం వీధినపడింది.
పెద్ద కొడుకుగా నరేన్‌పై ఇంటి భారం పడింది. ఆకలితో ఉత్తకాళ్లతో మండుటెండలో కాళ్లు బొబ్బలెక్కినా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన దీన స్థితి. ఇంటిలో అన్నం ఉండదని తెలిసి స్నేహితుల ఇళ్లల్లో తినేశానంటూ కన్నతల్లికే అబద్ధం చెప్పాల్సిన హీన స్థితి. డబ్బు సాయం చేస్తామంటూ ఒకరిద్దరు సంపన్న స్త్రీలు అతి జుగుప్సాకర ప్రతిపాదన చేస్తే ఛీకొట్టిన ధీర స్థితి.
చివరకు ఓ న్యాయవాది దగ్గర అనువాదం చేసే ఉద్యోగం దొరికింది - బొటాబొటీ జీతానికి! కానీ తాను జన్మించింది ఇందుకోసం కాదని తెలుసు. అలాగని బాధ్యతల నుంచి తప్పుకోలేననీ తెలుసు. సరిగ్గా అదే సమయంలో 1885లో రామకృష్ణులు గొంతు క్యాన్సర్‌కి గురయ్యారు. ఆయన నిర్యాణం చెందడానికి ముందురోజు నరేన్‌తో, ‘‘నేను ఇచ్చిన శక్తితో ప్రపంచానికి సేవ చెయ్యి’’ అన్నారు.

22 యేళ్ల లేత వయసులో ఉన్న నరేన్‌కి ఆ మాట రామబాణమైంది. తనవారిని విడిచిపెట్టేశాడు. తోటి శిష్యులతో కలిసి బారానగర్‌లో ఓ పాడుబడిన ఇంటిలో ‘రామకృష్ణమఠం’ స్థాపించారు. జపం, ధ్యానం, వేదాంత చర్చ, ఉంటే తిండి, లేకుంటే పస్తులు, చింపిరి దుస్తులు, కటిక నేలపై నిద్ర, యోగసాధన - రెండేళ్ల పాటు ఇదే జీవితం!
ఆపై సన్యాసం స్వీకరించి స్వామీ వివిదిశానందగా పేరు మార్చుకున్నారు. కాషాయవస్త్రాలు, నడుముకు దిట్టచేల, తలకు పాగా, ఓ చేతిలో కమండలం, మరో చేతిలో భగవద్గీత... ఇంతే! 1888 నుంచి 5 ఏళ్లపాటు భిక్షాటనంతో దేశాటనం. ఎన్నెన్ని ప్రాంతాలు తిరిగారో... పట్టణాల్లోని మురికివాడల్లో, పల్లెల్లోని పేదల గుడిసెల్లో... ఎక్కడెక్కడ సంచరించారో! వాస్తవ విషాద భారతదేశాన్ని కళ్లారా చూశారు.

వివేకవాణి...
చివరకు 1892 డిసెంబరు 25న కన్యాకుమారి చేరారు.
అది మూడు సముద్రాల కూడలి. భారతదేశపు చిట్టచివరి కొన... సముద్రంలో దూరంగా కొండ... సాగరాన్ని ఈది ఆ గుట్టను చేరారు స్వామి. అక్కడ విశాల వినీల ఆకాశం కింద ప్రశాంతంగా మౌనంలో ధ్యానంలో సాగర తరంగాల నిర్ణిద్ర సంగీతం వింటూ మూడు రోజులు గడిపారు.

ఆ కొండపై మాతృభూమికి అభిముఖంగా నిలబడితే ఎదురుగా వేదోపనిషత్తులకు, ధార్మికతకు, నైతికతకు పుట్టినిల్లయిన పునీత భారతదేశం... పారతంత్య్రం, దుర్భర దారిద్య్రం, కులమత విభేదాలు, అంతులేని అజ్ఞానం, నిస్తేజమైన యువత తనకోసం బతకడమే బతుకు అని భ్రమిస్తూ నిర్వీర్యమైపోతున్న భరతజాతి... తలచుకుంటే స్వామికి గుండె తరుక్కుపోయింది. నయనాలు రెండూ అశ్రుసాగరాలయ్యాయి.
తన విధ్యుక్త ధర్మం తెలిసొచ్చింది.

‘‘పేదల్లో పీడితుల్లో అంధుల్లో కుష్టురోగుల్లో ప్లేగు బాధితుల్లో... భగవద్దర్శనం అయ్యింది. ప్రాచీన భారతీయంలో దాగిన పటిష్ఠ నైతిక సూత్రాల్ని, ధార్మికతలోని శీల నిర్మాణాన్ని ఈ దేశంలోనే కాదు ప్రపంచ శిఖరాగ్రాన నిలబడి ఎలుగెత్తి చాటాలి. వేదాంత శంఖం పూరించాలి. ఇదే నా జీవిత కార్యం’’ అని అనుకున్నారు స్వామీజీ.

చికాగో (అమెరికా)లో జరగబోయే విశ్వమత సదస్సును ప్రథమ వేదిక చేసుకున్నారు. వివేకానందుడిగా పేరు మార్చుకుని 1893 మే 31న బొంబాయి తీరంలో బయలుదేరారు. ఆగస్టు 20కి చికాగో చేరుకున్నారు.

1893 సెప్టెంబర్ 11. విశ్వమత మహా సభాప్రాంగణం.
వేదికపై స్వామి వివేకానంద.
అయిదడుగుల ఎనిమిదంగుళాల పొడగరి. విశాలమైన నుదురు, వెడల్పయిన నేత్రాలు. తీక్షణమైన చూపులు. బలమైన ఛాతి. నిండైన విగ్రహం. మళ్లీ మళ్లీ చూడాలనిపించే రూపం. రాజఠీవి. దర్పం. సరస్వతీదేవికి నమస్కరించి, ‘‘అమెరికా సోదర సోదరీమణులారా’’ అంటూ ప్రసంగం ప్రారంభం. అంతే. ఆ ఒక్క పిలుపుతోనే 7000 మంది ఒక్కసారిగా లేచి నిలబడి రెండు నిమిషాల పాటు కరతాళ ధ్వనులతో పులకించిపోయారు.
ఆ క్షణం నుంచి ఏడేళ్ల పాటు వివేకానందుడు అమెరికా, ఇంగ్లండ్, భారత్... ఇంకా అనేకానేక ప్రాంతాల్లో వివేకవాణి వినిపించారు. 1902 జూలై 4 శుక్రవారం రాత్రి 39వ యేట తనువు చాలించారు. ‘కాలక్రమంలో ఎందరో వివేకానందులు ఉద్భవిస్తారు’ అన్నది ఆయన ఆఖరిమాట. స్వామీ! ఈ దేశంలోని యువతీ యువకులందరి కండరాల్లోని ప్రతికణంలోనూ నీ దేహపు ప్రత్యణువునీ ప్రవహించనీ. నిప్పు కణికలై ప్రజ్వరిల్లనీ. అపుడే... నీ స్వప్నం నిజమవుతుంది. ఈ స్వర్గం రుజువవుతుంది.

రామకృష్ణ పరమహంస వద్ద నాలుగేళ్ల శుశ్రూషలో నరేంద్రుడు నేర్చుకున్నవి ఎన్నో! ప్రాచీన కాలపు గ్రీసులో సోక్రటీసు గొప్ప గురువు. ప్లేటో గొప్ప శిష్యుడు. మళ్లీ మానవ చరిత్ర పరిణాహంలో గురువంటే రామకృష్ణుడు. శిష్యుడంటే వివేకానందుడు. భారతదేశాన్ని చదవాలంటే వివేకానందుణ్ని చదివితే చాలు. శ్రద్ధ, నిస్వార్ధమే శిష్యరికానికి గీటురాళ్లని, దరిద్ర నారాయణసేవే పరమధర్మమని ఆయన అన్నారు.
కర్మ, భక్తి, రాజ, జ్ఞాన యోగాలపై ఆయన చేసిన రచనలు ఆత్మశక్తిని వెలికితీసే ఆయుధాలు. గాంధీ లాంటి అహింసామూర్తులకూ, సుభాష్ చంద్రబోస్, అరవింద్ ఘోష్, జతిన్‌దాస్‌లాంటి అతివాదులకూ వివేకానందుడి మాటలే బాటలయ్యాయి.

Read more...

మనుషులు పిచ్చోళ్లవుతున్నారు. ఫోన్లు స్మార్ట్ అవుతున్నాయి.

>> Friday, January 6, 2017

🙏21వ శతాబ్దానికి స్వాగతం🙏

మన ఫోన్లు ................వైర్‌లెస్

మన వంటలు ................ ఫైర్‌లెస్

మన కార్లు ................ కీలెస్

మన తిండి ...............ఫ్యాట్‌లెస్

టైర్లు .............. ట్యూబ్‌లెస్

డ్రెస్సులు ............... స్లీవ్‌లెస్

యూత్ ..................జాబ్‌లెస్

లీడర్లు ...................షేమ్‌లెస్

రిలేషన్‌షిప్ ...............మీనింగ్‌లెస్

యాటిట్యూడ్ .....................కేర్‌లెస్

ఎడ్యుకేషన్ ...............వ్యాల్యూలెస్

ఫీలింగ్స్ ...................హార్ట్‌లెస్.

ఎందుకంటే ఇది మొబైల్ వరల్డ్.!

మొబైల్ వచ్చింది.. ....కెమెరా పోయింది.
మొబైల్ వచ్చింది.. ....వాచ్ పోయింది.
మొబైల్ వచ్చింది.. ....టార్చ్ పోయింది.
మొబైల్ వచ్చింది.. ....రేడియో పోయింది.
మొబైల్ వచ్చింది.......అక్షరాలు పోయాయి.
మొబైల్ వచ్చింది.. ....కంప్యూటర్ పోయింది.
మొబైల్ వచ్చింది.. ....మనశ్శాంతి పోయింది.

మనుషులు పిచ్చోళ్లవుతున్నారు.
ఫోన్లు స్మార్ట్ అవుతున్నాయి.
               -yours
             SARFARAZ

Read more...

ఆహా ! ఎంతటి గొప్ప వారు ..ఈ " రామనామీలు "

>> Thursday, January 5, 2017

కొన్ని యుగాల క్రితం రామ నామానికి పరవశించే ఒక మారుతి ని “ఏమోయ్ ఎప్పుడు రాముడూ రాముడూ అంటావు!! ఆయన ఎక్కడ? నీలో ఉన్నాడా?”అని అడిగితే తన గుండెను చీల్చి, లోపల కొలువై ఉన్న 'రామ లక్ష్మణుల'ను  చూపించాడట. 
***I
నూట ఇరవై మూడేళ్ళ క్రితం ఒక వర్గాన్ని కొంత మంది పెద్ద మనుష్యులు “మీకు రాముని గుడిలో ప్రవేశం లేదు. రామ నామాన్ని సైతం ఉచ్చరించ కూడదు” అని కట్టడి చేశారు. ..
..
ఆ వర్గం ఎటువంటి వివాదాలకి దిగకుండా ‘రామ’ నామాన్ని పచ్చబొట్టుగా శరీరం లో అంగుళమయినా విడవ కుండా, ఆఖరికి అరచేతి లో సహా రామ నామాలంకరణ చేసుకున్నారు. ..
..
పెద్ద మనుష్యుల 'కాపీ రైట్' కి గండి పడింది. 
ఆ వర్గాన్ని స్వయానా వాళ్ళే “రామ నామీలు” గా సంభోదించడం మొదలయ్యింది..
...
త్రేతాయుగం లో ‘రామ భక్త హనుమాన్’, కలియుగం లో ‘రామ నామీ’లు
.. 
చత్తీస్ ఘడ్ రాష్ట్రం లోని బిలాస్ పూర్, రాజ్ ఘడ్, రాయపూర్ జిల్లాలలో మహానది ఒడ్డున ఉన్న గ్రామాల్లో నివసించే ‘రామ నామి’ ల జనాభా సుమారు అయిదు లక్షలు. ప్రభుత్వ లెక్కల ప్రకారం షెడ్యూల్ కులాల వర్గీకరణ లో ఉన్నారు. 
**
ఇదంతా రాయగడ్ జిల్లా లోని చపారా గ్రామానికి చెందిన పరుశురామ్ అనే వ్యక్తి కారణంగా మొదలయ్యింది. 1894 ప్రాంతం లో అతనికి రాముడే స్వయంగా కనిపించి మీ శరీరం రామమయం చేసుకుని తికరణశుద్దిగా రామ నామాన్ని జపించమని మార్గదర్శనం చేశాడట. ..
అప్పటి నుండి పరుశురామ్ రామ నామీ అయ్యాడు. 
ఊరూరా తిరిగి రామ నామాన్ని ప్రచారం చేయసాగాడు. 
గుండెల్లోంచి వెల్లువై పెల్లుబికిన రామభక్తి ఆ నిర్భయులని ఒకటిగా చేసి, రామ నామ సంపదతో ముంచేసింది. రామ నామం ఒక మహా ఉద్యమమయిపోయింది. 
కాపీ రైట్ తమదే అనే భావించే పెద్దలకి ఇది మింగుడు పడలేదు. వారి మూఢ భక్తి  అర్ధం కాలేదు. 
బ్రిటిష్ అదికారులకు  అర్జీలు పెట్టుకున్నారు. రాయపూర్ హై కోర్ట్ కి మొరపెట్టుకున్నారు. ఏళ్ల తరబడి వాదనలు నడిచాయి. 
1911 లో రాముడే గెలిచాడు. రామ నామాన్ని ఉచ్చరించడమే కాదు, పచ్చ బొట్టు గా పొడిపించుకునే హక్కు అధికారం అందరికీ ఉన్నాయని కావాలంటే నాలుకపై కూడా రామ నామం ముద్రించుకోమని తీర్పు చెప్పింది. 
అప్పటి నుండి రామ నామీలు తమ శరీరాన్నే రామకోటి పుస్తకంగా మార్చేసుకున్నారు. నడిచే రామకోటి అవటం కోసం వాళ్ళంతా సూదులతో పొడిపించుకునే వారు. ఇది మొత్తం 18 రోజుల పాటు నియమ నిష్టలతో జరిగే కార్యక్రమం.
ఈ రామ నామీలు తోటి రామ నామిలని పరమ భక్తులుగా భావించి ఆతిద్యం ఇస్తారు. ఊరు పేరు అవసరం లేదు. పచ్చబొట్లే బందుత్వం, ‘ రాం రాం ‘ లే పలకరింపులు. రామనామిల ఒంటి పై ఉండే శాలువా కూడా రామ నామాల తో అలంకరింపబడి ఉంటుంది. వాటి మీద రామ నామాల అద్దకం కూడా 18 రోజుల పాటు సాగుతుంది. 
రామ నామిల దేవాలయాలు కూడా ప్రత్యకమయినవి. వాటిలో విగ్రహాలు ఏమి ఉండవు. కేవలం రామ నామమే ఉంటుంది. 
రామనామీలు చిన్న బుద్దుల పెద్దవారికి చెంప దెబ్బ లాటిది. వారు దేవుడు అందరి సొత్తు అని చెప్పే పరమ భాగవతోత్తములు. 
గుడిలోకి రావద్దన్న సాకును చూపి మతం మార్చే వారి డొల్లతనాన్ని ఈ వర్గం సవాలు చేస్తుంది. 
వారందరికి మనం “జై శ్రీరాం” లతో అభినందనలు తెలుపుదాం.

Read more...

📌శ్రీ రుద్రం విశిష్టత .....!!

>> Wednesday, January 4, 2017

శ్రీ రుద్రం విశిష్టత .....!!

శత రుద్రీయం యజుర్వేదంలో భాగం. ఇది మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం. జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేది మరల దానిని తీసుకుపోయేది కూడా ఆ పరమాత్మే నని తెలియజేస్తుంది. శ్రీ రుద్రాన్ని రుద్రప్రశ్న అని కూడా అంటారు. వేద మంత్రాలలో ఎంతో ఉత్కృష్టమైనది. శ్రీ రుద్రం రెండు భాగాలలో ఉంటుంది. “నమో” పదం వచ్చే మొదటి భాగం. దీనిని నమకం అంటారు. రెండవ భాగంలో “చమే” అన్న పదం మరల మరల రావటం వాళ్ళ దీనిని చమకం అంటారు. నమకం
చమకం  చైవ పురుష సూక్తం తథైవ చ |
నిత్యం త్రయం ప్రాయునజనో బ్రహ్మలోకే మహియతే ||
నమకం చమకం ఎవరైతే మూడు మార్లు పురుష సూక్తంతో ప్రతీ దినం చదువుతారో వాళ్లకు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.
నమకం విశిష్టత :
నమకం, చమకం 11 భాగాలు ఉంటాయి. ఒకొక్క భాగాన్ని “అనువాకం” అంటారు. మొదటి అనువాకంలో పరమశివుడిని తన రౌద్ర రూపాన్ని చాలించి , తన అనుచరులను, ఆయిదాలను త్యజించమని ప్రసన్నము చేసుకుంటూ ప్రార్ధించేది. శాంతించిన స్వామిని దయతల్చమని ప్రార్ధించు భావం ఉంది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేయు విధానాలు కూడా కనిపిస్తాయి.
అనువాకం – 1:
తమ పాపాలను పోగొట్టి, ఆధిపత్యాన్ని, దైవం యొక్క ఆశీర్వచనం పొందేట్టుగా, చేసి, క్షామం, భయం పోవునట్టు చేసి, ఆహార, గోసంపద సమృద్ధి గావించి, గోసంపదను చావునుండి, ఇతర జంతువులనుండి, జబ్బులనుండికాపాడుతుంది. జ్వర బాధ, జబ్బులు, పిండ-మరణాలు, చెడు కర్మ, నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనంచేస్తుంది.
అనువాకం – 2 :
ప్రకృతిలో, సర్వ ఔషధములలో సర్వాంతర్యామి అయిన రుద్రుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్ధన.. శత్రు వినాశనానికి, సంపద మరియు రాజ్యప్రాప్తికి, జ్ఞాన సాధనకు ఈ అనువాకాన్ని చదువుతారు.
అనువాకం – 3:
ఈ అనువాకంలో రుద్రుడిని ఒక చోరునిగా వర్ణిస్తుంది. అతడు సర్వాత్మ. ఈ విషయంలో మనిషి ఆ మహాస్వరూపాన్ని అర్ధం చేసుకోక నిమిత్త బుద్ధిని అలవార్చుకున్టాము, ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి జ్ఞానం అనే వెలుగును మనలో ప్రతిష్టించుతాడు. ఈ అనువాకం వ్యాధి నివారనణ కు కూడా చదువుతారు.
అనువాకం – 4:
ఇందులో రుద్రుడు సృష్టి కర్త. కారకుడు. చిన్న పెద్దా ప్రతీది అతడు చేసిన సృష్టే, ఈ అనువాకాన్ని క్షయ, మధుమేహం, కుష్టు వ్యాధి నివారణకై చదువుతారు.:
అనువాకం – 5:
ఈ అనువాకంలో రుద్రుడు పారు నీట ఉండే రూపంగా కొనియాడబడుతాడు. అతడి పంచ తత్వాలు వర్ణించబడతాయి అనగా – సృష్టి  జరపడం, పరిరక్షించడం, నశించడం, అజ్ఞానంలో బంధింపబడడం మరియు మోక్షప్రదానం.
అనువాకం – 6:
ఇందులో రుద్రుడు కాలరూపుడు. అతడు అన్ని లోకాల కారణం, వేద రూపం మరియు వేదాంత సారం.
ఐదు ఆరు అనువాకాలు ఆస్తులు పెంపుకు, శత్రువులమీద విజయానికి, రుద్రుని వంటి పుత్రుడిని కోరుకుంటూ, గర్భస్రావం నివారించడానికి, సుఖ ప్రసవానికి , జ్యోతిష పరమైన ఇబ్బందులను నివారించడానికి, పుత్రుల పరిరక్షనకు కూడా చదువుతారు.
అనువాకం – 7:
నీటిలో, వానలో, మేఘాలలో, ఇలా అన్ని రూపాలలో ఉన్న రుద్రుని వర్ణిస్తుంది. ఈ అనువాకాన్ని తెలివితేటలకు, ఆరోగ్యానికి, ఆస్తిని , వారసులను పొందడానికి పశుసంపద, వస్తాలు, భూములు, ఆయుష్షు, మొక్షంకోసం కూడా చదువుతారు.
అనువాకం – 8:
ఇందులో శివుడు ఇతర దేవతలా కారకుడుగాను, వారికీ శక్తి ప్రదాతగాను వర్ణింపబడ్డాడు. యితడు అన్ని పుణ్య నదులలో ఉన్నవాడు, అన్ని పాపాలను పోగొట్టేవాడు. శత్రువులను నాశము చేసి, సామ్రాజ్యాన్ని  సాధించడానికి ఈ అనువాకాన్ని చదువుతారు.
అనువాకం –9:
ఈ అనువా కంలో రుద్రుని శక్తి, ప్రకాశం సకల దేవతలకు శక్తిని ఇచ్చేవిగా ప్రస్తుతించబడ్డాయి. సృష్టిలో సర్వ శక్తులను శాసించే శివ శక్తి ని మించి ఇంకొకటి లేదు. ఈ అనువాకాన్ని బంగారముకోసం, మంచి సహచారికోసం, ఉద్యోగం, ఈశ్వర భక్తుడైన పుత్రుని కోసం చేస్తారు.
అనువాకం – 10:
ఈ అనువాకంలో మల్ల రుద్రుడిని తన ఘోర రూపాన్ని ఉపసమించి, పినాకధారియైనా, అమ్బులను విడిచిపెట్టి, వ్యాఘ్ర జీనాంబరధారియై ప్రసన్నవదనంతో, దర్శనమివ్వవలసిందిగా ప్రార్ధన ఉంటుంది. ఈ అనువాకాన్ని ఐశ్వర్యం కోసం , వ్యాధినివృత్తికై, శక్తిమంతులతో వైరం పోగొట్టుటకు, భైరవ దర్శనార్ధమై, అన్నిరకముల భయములను పోగొట్టుటకు, అన్ని పాపాలను పోగొట్టుటకు చదువుతారు.
అనువాకం – 11:
ఈ అనువాకంలో రుద్రుని గొప్పతనాన్ని ప్రస్తుతించి, అతని కరుణా ప్రాప్తికై నిర్బంధమైన నమస్సులు అర్పించబడుతాయి. ఈ అనువాకాన్ని తమ సంతాన సౌఖ్యంకోసం, ఆయురారోగ్యవృద్ధి కోసం, పుణ్య తీర్తి దర్శన ఆకాంక్షతో, పూర్వ, ప్రస్తుత, వచ్చేకాలం యొక్క జ్ఞానానికి చదువుతారు.
చమకం విశిష్టత:
నమకం చదివిన తర్వాత, భక్తుడు తనే శివ రూపంగా భావించి దేవదేవుడిని తనకు సర్వం ప్రసాదించమని ప్రార్ధన చేసేది చమకం. ఇది ప్రతీ ఒక్కరికి పనికి వచ్చేది. జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గములో ప్రతీ పనిని మనిషి ఆస్వాదించి, చివరకు అంతులేని ఆనందం కలగచేసే మంత్రం. సృష్టి కర్తకు ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణికి విభేదం లేదు . సమస్తం అతనినుండి  ఉద్భవించినది కనుక, మోక్ష కాంక్ష దైవత్వమునకు సూచనే ......✍

 లోకాస్సమస్తాస్సుఖినోభవంతు .

Read more...

రామదండు బృందం తిరుమలలో సేవా కార్యక్రమాలలో

>> Tuesday, January 3, 2017

 డిసెంబర్ నెల  21 నుండి    27  వరకు రామదండు  బృందం  తిరుమలలో సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంది .  అనుగ్రహంతో  అక్కడ  విభాగాలలో   సేవలనందించినది . స్వామి అనుగ్రహం వలన మూడుసార్లు   సన్నిధిలో డ్యూటీ  ఇవ్వబడింది .   గజగజ వణికించే చలిలో సహితం  మన సభ్యులు నియమము  తప్పకుండా  తమ సేవలనందించారు. . మరొకసారి స్వామి సేవాభాగ్యం  వేడుకుంటూ   ప్రయాణమయ్యారు.



Read more...

భగవంతుడికి మన విన్నపం



భగవంతుడికి మన విన్నపం

భగవంతుడికి మనం ఒక విన్నపం చేయాలి. ‘నిన్ను కలుసుకునే అవకాశం రావడం నాకు చాలా కష్టం. కనీసం నీ భక్తుల్ని కలుసుకునే అవకాశమైనా ఇవ్వు’ అని కోరాలి. ‘నీ కోసం పరితపించే నిజాయతీ కలిగిన నీ సేవకుల్ని కలుసుకునే భాగ్యం నాకు కల్పించు. వారితో నేను కలిసి తిరుగుతాను. ఆ సత్సంగం నాకు కావాలి. వారితో కలిసి ఉండటంవల్ల ఆ భక్తిలో లవలేశమైనా నాకు లభిస్తే, అదే పరమానందం... ఆ వరాన్ని ఇవ్వు ఈశ్వరా!’ అని అడగాలి. అలా ఆయన భక్తుల్ని కలుసుకోవాలన్న తహతహ మనలో ఉండాలి.

ఎందుకంటే, భగవంతుణ్ని నిరూపించే భక్తుడే ఆయన కంటే గొప్పవాడు. భక్తుణ్ని కలుసుకోవడం దైవాన్ని కలుసుకోవడం లాంటిది. వేరే మాటల్లో- అన్నమయ్యను కలిస్తే పరోక్షంగా వేంకటేశ్వరుని చూసినట్లే. త్యాగయ్యను కలిస్తే శ్రీరాముని దర్శించినట్లే. పురందరదాసును చూస్తే శ్రీకృష్ణుని తిలకించినట్లే!

దేవుడి కంటే ముందు, సరైన భక్తుణ్ని మనం వెతుక్కోవాలి. ప్రేమతో వెతకాలి. సేవతో వెతకాలి. అతణ్ని కలుసుకోవడంలో స్నేహం, వినయం వ్యక్తం కావాలి. అతడు గొప్ప భక్తుడని రుజువు కాగానే, చేతులెత్తి మనస్ఫూర్తిగా నమస్కరించడానికి సంశయించకూడదు.

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP