శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఆహా ! ఎంతటి గొప్ప వారు ..ఈ " రామనామీలు "

>> Thursday, January 5, 2017

కొన్ని యుగాల క్రితం రామ నామానికి పరవశించే ఒక మారుతి ని “ఏమోయ్ ఎప్పుడు రాముడూ రాముడూ అంటావు!! ఆయన ఎక్కడ? నీలో ఉన్నాడా?”అని అడిగితే తన గుండెను చీల్చి, లోపల కొలువై ఉన్న 'రామ లక్ష్మణుల'ను  చూపించాడట. 
***I
నూట ఇరవై మూడేళ్ళ క్రితం ఒక వర్గాన్ని కొంత మంది పెద్ద మనుష్యులు “మీకు రాముని గుడిలో ప్రవేశం లేదు. రామ నామాన్ని సైతం ఉచ్చరించ కూడదు” అని కట్టడి చేశారు. ..
..
ఆ వర్గం ఎటువంటి వివాదాలకి దిగకుండా ‘రామ’ నామాన్ని పచ్చబొట్టుగా శరీరం లో అంగుళమయినా విడవ కుండా, ఆఖరికి అరచేతి లో సహా రామ నామాలంకరణ చేసుకున్నారు. ..
..
పెద్ద మనుష్యుల 'కాపీ రైట్' కి గండి పడింది. 
ఆ వర్గాన్ని స్వయానా వాళ్ళే “రామ నామీలు” గా సంభోదించడం మొదలయ్యింది..
...
త్రేతాయుగం లో ‘రామ భక్త హనుమాన్’, కలియుగం లో ‘రామ నామీ’లు
.. 
చత్తీస్ ఘడ్ రాష్ట్రం లోని బిలాస్ పూర్, రాజ్ ఘడ్, రాయపూర్ జిల్లాలలో మహానది ఒడ్డున ఉన్న గ్రామాల్లో నివసించే ‘రామ నామి’ ల జనాభా సుమారు అయిదు లక్షలు. ప్రభుత్వ లెక్కల ప్రకారం షెడ్యూల్ కులాల వర్గీకరణ లో ఉన్నారు. 
**
ఇదంతా రాయగడ్ జిల్లా లోని చపారా గ్రామానికి చెందిన పరుశురామ్ అనే వ్యక్తి కారణంగా మొదలయ్యింది. 1894 ప్రాంతం లో అతనికి రాముడే స్వయంగా కనిపించి మీ శరీరం రామమయం చేసుకుని తికరణశుద్దిగా రామ నామాన్ని జపించమని మార్గదర్శనం చేశాడట. ..
అప్పటి నుండి పరుశురామ్ రామ నామీ అయ్యాడు. 
ఊరూరా తిరిగి రామ నామాన్ని ప్రచారం చేయసాగాడు. 
గుండెల్లోంచి వెల్లువై పెల్లుబికిన రామభక్తి ఆ నిర్భయులని ఒకటిగా చేసి, రామ నామ సంపదతో ముంచేసింది. రామ నామం ఒక మహా ఉద్యమమయిపోయింది. 
కాపీ రైట్ తమదే అనే భావించే పెద్దలకి ఇది మింగుడు పడలేదు. వారి మూఢ భక్తి  అర్ధం కాలేదు. 
బ్రిటిష్ అదికారులకు  అర్జీలు పెట్టుకున్నారు. రాయపూర్ హై కోర్ట్ కి మొరపెట్టుకున్నారు. ఏళ్ల తరబడి వాదనలు నడిచాయి. 
1911 లో రాముడే గెలిచాడు. రామ నామాన్ని ఉచ్చరించడమే కాదు, పచ్చ బొట్టు గా పొడిపించుకునే హక్కు అధికారం అందరికీ ఉన్నాయని కావాలంటే నాలుకపై కూడా రామ నామం ముద్రించుకోమని తీర్పు చెప్పింది. 
అప్పటి నుండి రామ నామీలు తమ శరీరాన్నే రామకోటి పుస్తకంగా మార్చేసుకున్నారు. నడిచే రామకోటి అవటం కోసం వాళ్ళంతా సూదులతో పొడిపించుకునే వారు. ఇది మొత్తం 18 రోజుల పాటు నియమ నిష్టలతో జరిగే కార్యక్రమం.
ఈ రామ నామీలు తోటి రామ నామిలని పరమ భక్తులుగా భావించి ఆతిద్యం ఇస్తారు. ఊరు పేరు అవసరం లేదు. పచ్చబొట్లే బందుత్వం, ‘ రాం రాం ‘ లే పలకరింపులు. రామనామిల ఒంటి పై ఉండే శాలువా కూడా రామ నామాల తో అలంకరింపబడి ఉంటుంది. వాటి మీద రామ నామాల అద్దకం కూడా 18 రోజుల పాటు సాగుతుంది. 
రామ నామిల దేవాలయాలు కూడా ప్రత్యకమయినవి. వాటిలో విగ్రహాలు ఏమి ఉండవు. కేవలం రామ నామమే ఉంటుంది. 
రామనామీలు చిన్న బుద్దుల పెద్దవారికి చెంప దెబ్బ లాటిది. వారు దేవుడు అందరి సొత్తు అని చెప్పే పరమ భాగవతోత్తములు. 
గుడిలోకి రావద్దన్న సాకును చూపి మతం మార్చే వారి డొల్లతనాన్ని ఈ వర్గం సవాలు చేస్తుంది. 
వారందరికి మనం “జై శ్రీరాం” లతో అభినందనలు తెలుపుదాం.

1 వ్యాఖ్యలు:

విసుకి వాడి మనస్సె ఒక విశ్వం... January 5, 2017 at 2:45 AM  

Really awesome.. I'm sharing your link to my friends with your kind permission sir!

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP