సుప్రభాతంలో ఈ వర్ణన ఏమిటి?
>> Friday, March 25, 2011
శ్రీవేంకటేశ్వర సుప్రభాతంలో అశ్లీలం ఉందట. మరి దాన్ని ఎందుకు టీవీలు, రేడియోల్లో ప్రసారం చేస్తున్నారు?
- శ్రీరాపు శ్రీనివాసరావు, శృంగవరపుకోట.
మన పూర్వీకులు కావ్య ప్రబంధాల్లో ఆరు రుతువుల వర్ణనలతో పాటు, నవరసాల మేళవింపు కూడా తగుమాత్రంగా ఉండడం ఒక శాస్త్ర మర్యాదగా ఉండేది. ఈ సత్సంప్రదాయాన్ని బట్టే శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళశాసనాల్లో మూడు శ్లోకాల్లో మాత్రమే అమ్మవారి, స్వామివారి లావణ్య, సౌందర్య ప్రస్తావన వచ్చింది. అతి కొద్దిమంది మాత్రం బూతుగా వేలెత్తి చూపే 'కమలా కుచ చూచుక కుంకుమతో' అనే శ్లోక పాదం శ్రీ వేంకటేశ్వర సుప్రభాతంలోనిది కాదు. అది శ్రీ వేంకటేశ్వర స్తోత్రంలోనిది.
కమలాకుచ చూచుక కుంకుమతో
నియతారుణి తాతుల నీలతనో
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే
అంటే శ్రీ మహాలక్ష్మి యొక్క చనుమొనలపై గల కుంకుమతో ఎల్లప్పుడూ ఎర్రగా ఉండే అందమైన నీలదేహం కలవాడా! తామర రేకుల వలే విశాలములైన కన్నులు కలవాడా! లోకప్రభూ! వేంకటేశ్వరా! నీకు విజమగుగాక! అని అర్థం. దయా స్వరూపిణి అయిన లక్ష్మీదేవి ఎల్లప్పుడూ స్వామి వక్షస్థలంలోనే ఉంటూ లోక రక్షణకై స్వామిలోని కల్యాణ గుణాలను ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ఇక బూతుగా భ్రమపడే మరొక శ్లోకపాదం శ్రీ వేంకటేశ్వర ప్రపత్తిలోకి వస్తుంది.
'మాతుస్తనా వివశిశోరమృతాయ మానౌ' అంటే శ్రీ వేంకటేశ్వరా! బిడ్డకు తొలిగా తెలిసే తల్లి స్థనముల వలే అమృత తుల్యములుగా ఉన్న నీ పాదములనా శరణు పొందుతున్నాను అని అర్థం. ఈ రెండింటి అర్థాలు చూశారు కదూ? వీటిలో బూతు ఎంత ఉన్నదో మీకే అర్థం అవుతుంది. ప్రపంచంలో ఎందరో, ఎన్నో విషయాలు చెబుతూ ఉంటారు.
వినదగునెవ్వరు చెప్పిన.. అన్నీ వినండి. కానీ అన్నీ తలకు ఎక్కించుకోకండి. మీ వివేకానికి పదును పెట్టండి. శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం మున్నగు స్తోత్రాలు ప్రమోదాన్ని, ప్రశాంతతను ఇచ్చే పవిత్ర స్తోత్రాలుగా భావిస్తాం. వీటి గురించి విపరీతార్థాలు తీసేకంటే నడివీథుల్లో జరుగుతున్న దుర్మార్గాలను అటకట్టించేందుకు ప్రయత్నిద్దాం. మన భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడదాం.
- ఆదర్శాచార్య చిత్రకవి ఆత్రేయ
4 వ్యాఖ్యలు:
చక్కగా వివరించారు. ధన్యవాదాలు.
" కాటుక కంటి నీరు " చను కట్టు పయిన్ పడనేల " ఏడ్చెదో ? " అన్నారు పోతనా మాత్యులు. నిజానికి ఇలాంటి పదాలు అమ్మవారిని గురించి చాలా చోట్ల వర్ణనలకి కవులు ఉపయోగిం చారు. మరవన్ని బూతులను కోవాలా ? "
బూతు అవునా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే "చనుమొనలపైగల ఎరుపువంటి కుంకుమతో మెరిసే వాడా...." లాంటి వర్ణనలు జోడించుట కవులకు సర్వసాధారణం & అది వారి చాతుర్యం గా ప్రసిద్ధి.
అందువల్ల కోడిగుడ్డుపై ఈకలు పీకాల్సిన అవసరంలేదు.
Post a Comment