సకల పాపహరణం... గుప్తేశ్వరుని దర్శనం
>> Tuesday, August 4, 2009
సకల పాపహరణం... గుప్తేశ్వరుని దర్శనం
సీతారాములు నడయాడిన పుణ్యస్థలమది. దట్టమైన అడవిలో... ప్రకృతి అందాల నడుమ... పుణ్య శబరి నది ఒడ్డున... కొండ శిఖరాన... త్రేతాయుగంనాటి స్వయం భూలింగం గుప్తేశ్వరుని దర్శనం చేసుకున్నవారెవరైనా భక్తి పారవశ్యంలో మునిగి తేలాల్సిందే.
ప్రకృతి అందాలకు నెలవైన ఆ అరణ్యమార్గంలో రామగిరి నుండి పది మైళ్లు ప్రయాణిస్తే ఎతై ్తన సున్నపురాతి కొండ కనిపిస్తుంది. ఆ కొండ శిఖర గుహ ముందు భాగంలో... ఆరడుగుల ఎత్తు, పదడుగుల వెడల్పున్న శివలింగమే... గుప్తేశ్వరుడు. స్వామివారిని దర్శిస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయనే నమ్మకం ఉంది.
గుప్తేశ్వరుడు త్రేతాయుగంలో ఆవిర్భవించినా త్రేతాయుగం, ద్వాపర యుగాలు గడచి... కలియుగం వచ్చే వరకూ గుప్తంగానే ఉండి పదిహేడవ శతాబ్దంలో బహిర్గతమయ్యారు. స్వామివారున్న గుప్తేశ్వరాన్ని ఎంత వర్ణించినా తక్కువే. ఒరిస్సాలోని కొరాపుట్ జిల్లా, జయపురం నగరానికి అరవై కిలోమీటర్ల దూరంలో, రామగిరికొండ సమీపంలో ఈ గుహ ఉంది. కొండ మట్టం నుంచి శిఖరం వరకూ మెట్లు, వాటికిరువైపులా చంపక వృక్షాలు. వాటి నీడలో వెళ్తే పదడుగుల ఎతై ్తన పెద్ద గుహ వద్దకు చేరుకోవచ్చు. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాసమేతంగా అరణ్యవాసానికి పంచవటికి వెళ్తూ, మార్గమధ్యంలో ఈ అడవిలో కొంతకాలం ఉన్నారట.
గుప్తేశ్వరుని లింగాకారం
ఆ సమయంలో రాముడు తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యారట. అరణ్యవాస దీక్ష నిర్విఘ్నంగా నెరవేరుతుందని, సమీప పర్వతం రామగిరిగా కీర్తి పొందుతుందని పలికారట. తానక్కడే లింగాకారంలో వెలసి గుప్తంగా ఉంటూ కలియుగంలో భక్తులచే పూజలు అందుకుంటానని వరమిచ్చిన శివుడు... రాముని సమక్షంలోనే లింగాకారం దాల్చారట. శివుడు చెప్పిన విధంగా ద్వాపర, త్రేతాయుగాలు ముగిసి కలియుగంలోని పదిహేడవ శతాబ్దం వరకూ ఆ లింగం ఉనికి ఎవరికీ తెలియలేదు. ఆ పర్వతాల చుట్టూ దట్టమైన అడవి ఉండటం, ఆ ఆడవిలో క్రూర మృగాలు సంచరిస్తూ ఉండటం వల్ల అక్కడికెవరూ చేరలేకపోయారు.
స్థలపురాణం...
గుప్తేశ్వరం గురించి అక్కడి ప్రజల్లో ఓ కథ నానుడిలో ఉంది. 17వ శతాబ్దిలో మహారాజు వీరవిక్రమదేవ్ జైపూర్ సంస్థానాన్ని పాలించాడు. సంస్థానాధీనంలోని రామగిరికి ఠాణాదారునిగా గొడియా పాత్రో ఉండేవాడు. అతనికి మాంసాహారమంటే మక్కువ. ఆ ప్రాంతానికి చెందిన సవరజాతి (గిరిజన) వ్యక్తి వేట చేసి, జంతు మాంసాన్ని పాత్రోకి ఇచ్చేవాడట. ఓ రోజు ఆ గిరిజనుడు ఓ లేడిని వేటాడేందుకు బాణం విసరగా అది కాస్తా లేడి కడుపులో గుచ్చుకుంది. ఆ లేడి శివలింగం ఉన్న గుహలోకి పరుగున వె ళ్లింది. దాన్ని వెంబడించిన గిరిజనుడికి గుహలో శివలింగం, రుషి, పక్కనే లేడి కనిపించాయి.
వెంటనే అతడు రుషికి నమస్కరించి వచ్చి, వేట మానేసి, జరిగిందంతా పాత్రోకి వివరించాడు. పాత్రో మరికొందరు సవరలను వెంటబెట్టుకుని లింగం ఉన్న గుహకు వెళ్లగా శివలింగం తప్ప ఎవరూ కనిపించలేదు. విషయాన్ని మహారాజుకు వివరించగా... శివలింగాన్ని దర్శించుకుని, యుగాలుగా గుప్తంగా ఉన్న లింగానికి గుప్తేశ్వరుడని నామకరణం చేశాడు. నాటి నుంచీ ప్రతి శివరాత్రికీ గజాదిదళాలు, వందలాది భక్తులతో వచ్చి గుప్తేశ్వరునికి ప్రత్యేక పూజలు చేయనారంభించారు.
యాభై యేళ్లపాటు ఒక్క శివరాత్రి పర్వదినాన మాత్రమే గుప్తేశ్వరుని దర్శనం లభించేది. రానురాను రహదారి ఏర్పడి క్రూరమృగాల సంచారం తగ్గింది. అప్పట్నుంచీ కార్తీక మాసాల్లో దర్శనం దొరికేది. ఆ తరువాత కొన్నాళ్లకు ప్రతి సోమవారం కొందరు భక్తులు దర్శించుకోవడానికి వెళ్లనారంభించారు. ప్రస్తుతం రాకపోకలకు వీలు కలుగడంతో భక్తులు స్వామిని నిత్యం దర్శించుకుంటున్నారు. శివరాత్రి రోజు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల నుంచి కూడా వేలాదిమంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. వారంతా ఈ ప్రాంతాన్ని గుప్త కేదారిగా పిలుస్తూ, స్వామికి మొక్కులు చెల్లిస్తారు. గుప్తేశ్వరుని ఆరాధిస్తే దీర్ఘవ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం.
గుప్తేశ్వరుని గుహకు సమీపంలో మరికొన్ని గుహలు ఉన్నాయి. అన్ని గుహల్లోకీ కామధేను గుహకు ప్రాశస్త్యం ఉంది. ఈ గుహలో గోవు పొదుగు రూపంలో ఉండే శిలల నుంచి అడపాదడపా నీటి బిందువులు పడుతుంటాయి. చేయి చాచినపుడు, ఆ నీటి బిందువు అరచేతిలో పడితే కోరిన కోర్కెలు తీరుతాయని ఇక్కడివారు నమ్ముతారు. సమీపంలోనే సీతాగుండాన్ని దర్శించవచ్చు. అరణ్యవాసంలో అక్కడకు వచ్చిన సీతమ్మ స్నానమాచరించిన కొలనే సీతాగుండం. అతి ఎత్తయిన కొండ పై భాగాన స్వచ్ఛమైన నీటితో ఎల్లప్పుడూ నిండుగా ఉంటుంది.
ఒరిస్సా రాష్ట్ర దేవాదాయ శాఖ ఈ క్షేత్ర నిర్వహణను చూస్తోంది. రహదారులు, రవాణా సౌకర్యాలు, యాత్రికులు ఉండేందుకు ఇంకా ఏర్పాట్లు కల్పించాల్సి ఉంది. దీని ప్రాశస్త్యాన్ని మరింత ప్రచారం చేస్తే, గుప్తేశ్వరుని క్షేత్రానికి సముచితమైన గుర్తింపు లభించడమే కాక, పర్యాటక కేంద్రంగా విరాజిల్లే అవకాశమూ ఉంది.
- శ్రీశైలం శ్రీనివాస్, న్యూస్‌లైన్, శ్రీకాకుళం
0 వ్యాఖ్యలు:
Post a Comment