హతవిధీ ! ఏమి దౌర్భాగ్యం దాపురించినది వేదవిదులకు .
>> Monday, June 1, 2009
హతవిధీ ! ఏమి దౌర్భాగ్యం దాపురించినది వేదవిదులకు .
మహిమాన్వితములైన దివ్యశక్తి ప్రసారితములైన వేద విద్యలనభ్యసించి న వేదవిదులలో కొందరి ఆచరణ ఎంతో బాధాకరముగానున్నది. అపౌరుషేయములైన వేదములు మహిమాన్వితములు. పరమాత్మ కొరకు , ఆ దైవశక్తిని లోకశ్రేయస్సు కొరకు ప్రార్థించేందుకు వేదగానం చేస్తారు. ఎవరి మెప్పుకోసము ,ధనము కోసము వేదగానము చేయరాదని ఆదివ్య విద్యలను అపహాస్యం చేసే వారి ముందు ఎట్టి పరిస్థితులలోనూ వేదగానము చేయరాదని వారి గురువులు విద్యాభ్యాస సమయము లో హెచ్చరిస్తుంటారు. ఎంతో పవిత్ర భావనతో వేదాభ్యాసము చేసి మహాశక్తి వంతులై వెలుగొందే నాటి వేద పండితులు భువిలో దేవతలవలె మన్నన పొందారు. ఎంతటి చక్రవర్తులైనా వేదవిదుల పట్ల వినయ విధేయతలను చూపేవారు. వారికి ఆగౌరవము వారి భౌతిక శక్తివలననో భౌతిక సంపదలవలననో రాలేదు . కేవలము వేదాభ్యాసము వలన వచ్చిన శక్తి అది.
నేటి పరిస్థితి ఏమిటి. రాజకీయ నాయకులు వస్తుంటె చాలు ,పరుగులెత్తి వెళ్ళి వారి ముందు వేదగానము చేయటము జరుగుతున్నది. డబ్బు పడేస్తే చాలు వాళ్ళే మంత్రాలు చదువుతారనే చులకనభావము ఏర్పడినది. ఎందుకు? ఎందుకంటె అటువంటి భావనను కలిగించుకొనుటలో పోటీపడి పనిచేస్తున్నకొందరివలన.
చూడండి .వేదపండితులు శ్రద్దా శక్తులు లేకుండా ఆలయాలకువచ్చే మంత్రులకు, రాజకీయ నాయకులకు చేస్తున్న మర్యాదలు హడావుడి టీవీలలో చూస్తుంటే ఎంతబాధ కలుగుతుందో . ఇక ఈధర్మము పట్లగాని ,ఈ వేదవిద్యలపట్లగాని ఏమాత్రం శ్రద్ధాసక్తత లేని పాలకుల దగ్గరకు పరిగెత్తి మరీ చేస్తున్న వేదగానం వీరికి విద్యలను చెప్పిన మహానుభావులకు ఎంతవేదన కలగజేస్తోందో. గతములో హైదరాబాద్ లో ఆశ్వమేథ యాగము చేస్తున్న పండితులు అక్కడకు చెప్పులు కూడా విడవకుండావచ్చిన రాజకీయనాయకుని కనీసంవారించటం కాదు,ఆశీర్వచనాలతో ముంచెత్తినవైనం టీవీలలో చూసి ఆస్థికులు తల్లడిల్లారు.
ఇక మంత్రివర్గ ప్రమాణ స్వీకారాలలో చూడండి . ప్రస్తుత స్థితి. పాపం పాలకులకు ఈ ధర్మం పట్ల ఏమాత్రం గౌరవం లేదు. వేదవిదులు వేదగానం చేసి ఆశీర్వదించినా నమస్కారం చేయటముగాని లేచినిలబడి అభివాదము చేయటముగాని చేయరు. కాని వారికి నమ్మకమైన మతగురువులు వచ్చినప్పుడు ఎంతో భక్తి శ్రద్దలతో లేచినిలబడి ఆశీస్సులందుకుంటారు. ఇది తప్పుకాదు.అది వారి విశ్వాసము. విశ్వాసము లేనివారి కొరకు వేదమంత్రాలను పఠించవలసిన ఖర్మ మనకెందుకు పట్టినదా ?అని.
తిరుమల లాంటి పవిత్ర సన్నిధానానికొచ్చినా అక్కడ శ్రీవారి పట్ల తమకు నమ్మకమున్నదని తాము విజిటర్స్ పుస్తకంలో సంతకం చేయరు. కాని ఆయనెవరో డాలర్ శేషాద్రట పరిగెత్తు కెళ్ళి ప్రసాదాలిస్తుంటాడు కెమెరాలకు అడ్దంబడి మరీ. ఇక శ్రీవారిని నిరంతరం సేవించుకునే భాగ్యం కలిగిన అర్చకులు సహితం ఆయనపట్ల నమ్మకమేలేనివారికి ఇల్లకెళ్ళీ మరీ ప్రసాదాలివ్వటం ఎంతవిచారకరం? వారికి అభిమానముంటే వ్యక్తి గతంగా వెళ్ళొచ్చు. కాని వీళ్ళకు తెలుసు వ్యక్తిగతంగా శ్రీవారి పేరు చెప్పుకోకుంటె తమను గడపకూడా తొక్కనివ్వరని . మరి ఇంత దివ్యభాగ్యాన్నిచ్చిన శ్రీవారి ప్రసాదాన్ని నమ్మకం లేని వారికిచ్చి అపవిత్రం చేయటం తగునా.
ఈ నాయకులు ,ధనవంతులు పుడతారు పోతారు. కాని అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని స్తుతించే వేదవిద్యలను ఈ విధముగా దుర్వినియోగం చేయుట పాడియా ? ఆలోచించాలి పెద్దలు.
వచ్చేవారు ఏమతానికి చెందినవారైనా ఆవేద విద్యల పట్ల నమ్మకముంటే మీరు వారికొరకు ఆదివ్యవిద్యలతో పరమాత్మను ప్రార్ధించవచ్చు. కాని జరుగుతున్నదేమిటి? వీరి ఆదరణ లతోటె మన జన్మ గడవటము లేదు. ఈనాటి స్థితిని మీకు ఈ మానవులివ్వటము లేదు .అవిదైవమిచ్చినవిద్యలు.అనర్హులముందు వేదగానము చేసి శక్తిహీను లైనమిమ్మల్ని ఎవరూ గౌరవించరు. దైవకోపానికి గురవుతారు .
పాలకులు కూడా ఆలోచించాలి. మీరంతా వేదవిద్యలను నమ్మమని ,వాటి ప్రకారం ఆచరించమని కోరటం లేదు . మీ విశ్వాసాలకు అనుగుణముగా మీరు దైవప్రార్ధనలను చెసుకోండి. తప్పులేదు. మీకు నమ్మకం లేని మత కేంద్రాలకు వెళ్ళి అక్కడ నటన చేసి [అది ఆలయం ,చర్చి.మసీదు ఏదైనా కావచ్చు] దైవ ప్రార్ధనలను వ్యాపారం చేయవద్దు.
సొమ్ముకోసము గర్వించి వేదవిద్యలను ధర్మ వ్యతిరేకంగా వినియోగించటము ఏఫలితాన్నిస్తుందో :శ్రీగురుచరిత్రలో" మనకు ప్రమాణాత్మక అనుభవాలు కనపడతాయి.మీకు తెలియనిది కాదు. కలి పురుషుని ప్రభావం చే వర్ధిల్లుతున్న ఈ అనాచారాలను ,నశింపజేయాలని
ఎన్ని జన్మల పుణ్యఫలితంగానో లభించిన ఈ దివ్య గానాన్ని పరమాత్మ కోసము మాత్రమే చేయాలనే సద్బుద్ధి ,అందరి లో కలుగజేయాలని పరమ గురువు ఆదత్తాత్రేయుని ప్రార్ధిస్తున్నాము. ఎవరి మతధర్మము పట్ల వారు శ్రద్దాసక్తులుగలిగి పరధర్మములపట్ల గౌరవాభిమానాలను మామనస్సులలో పెంపొందించమని ఆపరమగురువు చరణారవిందములకు ప్రణమిల్లుతున్నాము.
11 వ్యాఖ్యలు:
నిజము నిజమ్ము. నేడిటుల నీచప్రవృత్తిని పండితోత్తముల్
విజయముఁబల్కుమూర్ఖులకు.వేదముతో నెదురేగి తెచ్చు.రా
రాజయినన్ మదాంధునకు రక్షణ గోరుట మేలు కాదు. యీ
రోజులు వింత గొల్పు.కనరో!మది మీదగు బాధనెన్నుచున్.
ఎంతటి మూర్ఖ వృత్తి?పరమేశ్వరునెన్నెడువేద మంత్రముల్.
సుంతయు గౌరవంబు పొడసూపని మూర్ఖులఁగొల్వజెప్పుటే
మంతటి గౌరవంబనియొ? అర్చక స్వాములు భట్టురాజులై
గొంతుక చించుకొంటఁగన కోపము కల్గక నెట్టులుండనౌన్?
హిందువులంతా దేవుడి మతాన్ని వదిలి డబ్బుమతంలోకి, అహంభావ ధర్మంలోకి మారారు.తమ డబ్బుకు, హోదాకి మతం కూడా తమ ముందు సాగిలపడాలని కోరుకునేంత దిగజాఱిపోయారు. అసలైన ధర్మశాస్త్రాలూ, సదాచారాలూ మఱుగున పడి అహంభావులైన హిందువుల అహంకారాన్ని సంతృప్తిపఱిచే విధంగా కొత్తకొత్త ఆచారాలు పుట్టుకొస్తున్నాయి.ఇహ హిందూ స్త్రీజనం తమ సొంత ప్రజ్ఞతో సృష్టించే ఆచారాలు సరేసరి !
మన పురోహితులూ, పూజారులూ డబ్బు కోసం శాస్త్రాలకి ద్రోహం చెయ్యడానికీ, డబ్బున్నవాడి ఇష్టానికి అనుగుణంగా అన్నీ మార్చెయ్యడానికీ వెనుకాడ్డంలేదు. ఈ వెధవపనులకి బ్రాహ్మలే అవసరం లేదు. ఎవరైనా పనికొస్తారు. లేకపోతే పాతికేళ్ళకి ఉపనయనాలు, పెళ్ళికూతురిని హోటళ్లలో చూడ్డం, ట్రెయిన్ లో చూడ్డం, శోభనాలు కూడా హోటళ్ళలో ఏర్పాటుచెయ్యడం - ఏమిటీ అంకఛండాలమంతా ?
శివ శివా ! క్రైస్తవులకి ఆశీస్సులిచ్చేవాళ్ళు వీళ్ళేం వేదవిదులో నాకు తెలియదు.
sir , excellent what you are said ie correct. all the behaviour of dollar seshadri and like these fellow are doing wrong. god observe all these non sense he will give punishment to him.
డాలర్ శేషాద్రి గారు తి.తి.దే.లో సాధారణ ఉద్యోగి.పదవీవిరమణ తర్వాత కూడా గుడిలో స్థానం సంపాదించారు. ఎలా? రాజకీయనాయకులకు ఇలాంటి మర్యాద చేయడంవల్లేకదా! దేవుని డాలర్ల అపహరణ విషయంలో దోషి ఆయనే అయినా రాజకీయనాయకుల అండతో మళ్ళీ పెత్తనం సాగిస్తున్నారు.ఆయనకు ఆశ్రీనివాసునిపై భక్తి కన్నా రాజకీయనాయకులపైనే భక్తి.వాళ్ళు కనిపిస్తే ఆయనకు తనపైనుండే బట్టలు కూడా జారిపోతుంటాయి అంత మైమరచి పోతుంటారు.గుడిలో చూడాలి ఆయన ఆర్భాటం.శ్రీనివాసుని ఏ విడియో కార్యక్రమం గానీ ఫోటోల్లో గానీ ఆయనే ప్రత్యక్ష్యం. ఏదో ఒకనాడు తిరుమలను ప్రభువుకు నిలయం చేసినా చేసేస్తాడు. ఈయన దరిద్రం శ్రీనివాసునికెప్పుడు వదలుతుందో ఏమో?
దేవాలయాలు ప్రభుత్వ అధీనం లో ఉండటం దీనికి ముఖ్య కారణం.
పేద పూజారులు దేవ సన్నిధిలో ఉన్నా వారి పిలకలు దేవస్థానం ఆఫీసర్ల చేతులో , మంత్రుల చేతులో ఉన్నాయి.
హిందూ దేవాలయాల్లో హిందువులు కాని వారు పని చేస్తున్నారన్న స్పృహ ఎవరికైనా ఉన్నదా?
హిందూ మతం అంటే బ్రాహ్మలు మాత్రమె కాదు. మిగిలిన వారు, బ్రాహ్మలు కూడా బ్రహ్మల్నే తప్పు పడితే ఎలా?
మిగిలిన వారికి ఏమీ పట్టదా?? మన దేవాలయాల్ని ప్రభుత్వం చేతుల్లో నించి తీసుకొనే చేవ ఎ హిందువుకూ లేదా?
ఈ విషయాలకు డబ్బు, అధికారం వల్ల వచ్చిన మదం ఒక కారణమైతే, ప్రతి విషయాన్ని వ్యాపార పరంగా ఆలోచించేట్లుగా ప్రోగ్రాం చేయబడటం ఇంకొక కారణం.
దేవుడిపై, మతంపై విశ్వాసం వ్యక్తిగతం. అయితే, తమకు నమ్మకం లేనిచోటికి వెళ్ళి అక్కడి పవిత్రతను భ్రష్టుపట్టించటం క్షమించరాని నేరం.
దేవాలయాలు మనదేశపు సాంస్కృతిక చారిత్రక వారసత్వాలు. వాటిని వ్యాపారాత్మకం చేసి, కలుషితం చేయడం దేశద్రోహం.
లక్షలు కోట్లు దిబ్బెనలలో వేస్తున్న వ్యాపారులు ఆ డబ్బు ఎవరికీ జీతాలు గా, లంచాలుగా వెళ్ళ బడుతోందో తెలుసుకొంతున్నారా?
ప్రతి చిన్న గుడిలో దర్సనానికి టికెట్ ఎందుకో ఎవరైనా అడిగారా?
చిన్నప్పటినుండి వేదాలు కష్ట పడి నేర్చుకొని వల్లె వేసి భుక్తి కోసం ఈ ఉద్యోగాలు చేస్తున్న పూజారుల జీతాలు ఏంటో తెలుసా?
దేవాదాయ శాఖ ఆదాయం ఏంటో ఎలా కర్చు పెడుతోన్నారో ఎవరైనా అడిగారా , తెలుసుకొంనారా?
అసలు దేవాదాయ శాఖలో హిందువులు కాని ఉద్యోగులు పై స్తాయి నుండి కింది స్తాయి దాకా ఎంత మంది ఉన్నారో తెలుసా??
పరోక్షంగా నేషనలైజ్ అయిపోయిన మత కేంద్రాలు గుళ్ళుమాత్రమే. మతంతో సంబంధం తెంచుకోవలసిన ప్రభుత్వం దేవాదాయధర్మాదాయ శాఖ పేరుతో ఆర్థిక బంధాల్ని తెగ పెంచుకుంది.
ఈ తంతుకు ప్రభుత్వాల బాధ్యత ఎంతుందో సంఘటితం కాలేని హిందువుల బలహీనతా అంతే ఉంది. అధికారం,ధనదాహం మాత్రమే క్రైటీరియాగా రాజకీయ ఆధిపత్యం దేవాలయాల్ని దోచుకోవడాన్ని వ్యతిరేకించే చేవ హిందువులకు రాదు. ఎందుకంటే మనం మనలో మనం కొట్టుకోవడంలో,అగ్రం-నిమ్నం అంటూ విడదీసి పబ్బాలు గడుపుకోవడంలో చాలా బిజీ.
చక్కని వివరణఇచ్చారు .ధన్యవాదములు..
దైవం మీద నమ్మకమునవానికి మానవుల పొగడ్తలు,అభిమానాలపట్ల ఆసక్తి వుండదు. అదికోల్పోయి ఇలా నాయకుల భజంత్రీలుగా మారితే ఆవేదవిద్యలద్వారా లోకానికి చేయగలిగి మేలు ,చేసే శక్తి వుండదు.
నాకు ఆశ్చర్యం కలిగించే విషయమేవిటంటే, ఇదంతా చూస్తూ కూడా ఇంతమంది భక్త జనం తండోపతండాలుగా ఎందుకు తిరుపతికి వెళుతున్నట్టు! ఒక్క తిరుపతే కాదు, ప్రముఖ ఆలయాలన్నిటా ఇదే రకమైన వాతావరణం. దీన్ని చూసే నేను పుణ్యక్షేత్రాలకి వెళ్ళే ఉద్దేశమే మానుకున్నాను!
మొన్నీ మధ్యనే ఎప్పుడూ వెళ్ళలేదని భద్రాచలం వెళ్ళాను. చాలా నిరాశనే మిగిల్చింది. ఎక్కడా ప్రశాంతత, పవిత్రత ఉన్న వాతావరణమే లేదు! అంతటా వ్యాపార సంస్కృతే.
ఎక్కడ తీపి ఉంటుందో అక్కడికే చీమలు చేరతాయి. అలాగే ఆస్తులు ఉన్న గుళ్ళకే రాజకీయ నాయకులు వచ్చేది. ఆస్తులు లేని మామూలు గుళ్ళని ఎవరూ పట్టించుకోరు.
కాకపోతే భద్రాచల రాముడిని నమ్మని వాళ్ళు వేరెవరిచేతనైనా ముత్యాల తలంబ్ర్రాలు పంపించవచ్చుగదా. అందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకు?
కామేశ్వర రావు గారు, ఇవన్నీ చూస్తూ తిరుమలకి ఎందుకు వస్తున్నారు అని అడుగుతున్నారు? మనం తిరుమల వెళ్ళేది ఇవన్నీ చూడడానికి కాదు కదా. మనం మన దారిలో దేవుని దర్శించుకోవడానికి మాత్రమే.
Post a Comment