"శ్రీవారి "ని గూర్చి ప్రధానార్చకులు రమణదీక్షితులు గారి మాటలలో......
>> Tuesday, February 23, 2016
సప్తగిరులపై
వెలసిన ఆ వేంకటేశుడిని ఒక్క క్షణం దర్శించుకుంటే జీవితం తరిస్తుందని
అనుకుంటారు. అలాంటిది దేవదేవుని సన్నిధిలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా
ప్రధాన అర్చకత్వం చేస్తూ తరిస్తున్నారు రమణ దీక్షితులు. స్వామివారి
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయనిచ్చిన ఇంటర్వ్యూ.
మా తండ్రిగారు వేంకటపతి దీక్షితులు. తల్లి సౌభాగ్యలక్ష్మి. వారికి నేన్కొకడినే సంతానం. నాన్నగారు తిరుమల ప్రధానార్చకులుగా చేశారు. నేను పుట్టింది, పెరిగింది తిరుపతి, తిరుమలలోనే. అప్పట్లో తిరుపతి చిన్నగ్రామం. నాకు ఊహ తెలిసినప్పటికి తిరుపతిలో రెండు కార్లు, నాలుగు స్కూటర్లు ఉండేవి. రెండు సినిమా థియేటర్లు ఉండేవి అంతే.
అందుకే వెళ్లలేదు..
తిరుపతి మున్సిపల్ హైస్కూలులోనే చదువుకున్నా. ఇక్కడి ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో మాలిక్యులర్ బయాలజీలో పీజీ, పీహెచ్‌డీ చేశాను. చిన్నప్పటి నుంచి నేను అర్చకునిగా వస్తానని తెలుసు. మా తల్లిదండ్రులు క్రమశిక్షణతో పెంచారు. నేను అలాగే పెరిగాను. ఆహార నియమాల్లో కఠిన నియమాలు పాటిస్తుంటాను. అన్నం తినను. కాయగూరలు మాత్రమే భుజిస్తాను. నేను పీజీలో ఉన్నప్పుడు మా నాన్నగారు వైకుంఠప్రాప్తి చెందారు. దీంతో ల్యాబ్ వదిలి ఆలయానికి వచ్చేశాను. పీహెచ్‌డీ తర్వాత హ్యూమన్ క్యాన్సర్ మీద పరిశోధన చేయడానికి అమెరికాలోని సౌత్ కెరొలినాకు రమ్మని పిలిచారు. సముద్రం దాటితే స్వామివారి కైంకర్యాలకు దూరం కావాల్సి వస్తుందని వెళ్లలేదు. ఇంకా ల్యాబ్‌లో ఏదో చేయాలనే తపన మాత్రం అలాగే ఉంది.
సైన్స్ ఉపయోగపడింది..
సైన్స్, ఆధ్యాత్మిక రంగం విరుద్ధమైనవనే భావన తప్పు. మేధావుల దృష్టిలో ఆధ్యాత్మికత కూడా సైన్సే. మన వేదాల్లో సైన్స్‌కు అందని ఎన్నో విషయాలు ఉన్నాయి. రాజకీయాలు, వైద్యం, ఆయుధాలు, యుద్ధవ్యూహాలు, ఆయుర్వేదం, శస్త్ర చికిత్సలు ఇవన్నీ వేదాల్లోనూ ఉన్నాయి. ఆగమ శాస్త్రాలు, వేదాల్లోని చిన్న అంశాల విశ్లేషణే సైన్స్. నేను చదువుకున్న సైన్స్.. వేదాల్లోని సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. అర్థం కాని చాలా ప్రశ్నలకు ధ్యాన ముద్రలో స్వామివారిని అడిగి సమాధానం తెలుసుకున్నా..!
ఆకాశమంత కనిపించారు..
మూలవరులకు, నాకు ప్రశ్నలతోనే పరిచయం మొదలైంది. 1967లో స్వామివారిని మొట్టమొదటిసారి స్పృశించాను. దానిని పాదసేవ అంటారు. అది చేస్తే గాని స్వామిసేవకు అర్హత పొందలేం. ఆ రోజు స్వామివారిని చూసి భయపడ్డాను. పాదాల చెంత కూర్చుని శ్రీవారిని చూస్తే.. ఆకాశమంత కనిపించారు. కొంత భయమేసింది. 1974లో రక్షాబంధనం కట్టుకొని బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నా. పీహెచ్‌డి పూర్తయ్యాక 1977లో పూర్తిస్థాయిలో ప్రధాన అర్చకత్వం స్వీకరించాను. స్వామివారి కైంకర్యాలు అర్థం కావడానికి రెండేళ్లు పట్టింది. స్వామివారికి ఎందుకు ఆరాధన చేయాలి..? ఇది నా మొదటి ప్రశ్న. నా సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి పెద్దలను సంప్రదించాను, పుస్తకాలు చదివాను.. అయినా జవాబు దొరకలేదు. స్వామివారి ముందు ధ్యానంలో ఉండగా నాకు సమాధానం దొరికింది.
కోరికలు గుర్తుకురావు
స్వామివారి మూలమూర్తికి సంబంధించి చాలా మంది భక్తులు సందేహాలు అడుగుతుంటారు. స్వామివారిది దృవబింబం. ఉదయం వేళలో బాల్యంలో, మధ్యాహ్నం యవ్వనంలో, రాత్రిపూట వృద్ధాప్యంలో ఉన్నట్టుగా కనిపిస్తుంటారు. ఉదయం పూట స్వామిని దర్శించుకున్నవారికి విద్య ప్రాప్తితో పాటు ఆయుష్షు పెరుగుతుంది. మధ్యాహ్నం వేళలో దర్శించుకున్న వారికి దేహదారుఢ్యం, తేజస్సు, సౌభాగ్యం సిద్ధిస్తుంది. సాయంత్రం దర్శించుకున్నవారికి దివ్యమైన జ్ఞానం, మోక్షప్రాప్తి లభిస్తాయని ఆగమాలు చెబుతున్నాయి. అలాగే ‘ఎన్నో కోర్కెలతో కొండకు వచ్చి స్వామివారిని దర్శించుకోగానే ఏమీ కోరుకోకుండానే వచ్చేస్తాం’ అనే సందేహాలు వ్యక్తమవుతుంటాయి. భక్తులకే కాదు, గంటల తరబడి స్వామి సన్నిధిలో ఉండే అర్చకులదీ ఇదే పరిస్థితి. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించడంతో కోరికలు మరచిపోతాం. శ్రీవారి గర్భాలయం శక్తి నిలయం. స్వయంభువుగా వెలసిన మహావిష్ణువును సేవించాలని ఎందరో దేవతలు గర్భాలయాన్ని ఆశ్రయించి ఉంటారు. వారందరి మహత్యంతో గర్భాలయం శక్తివంతమైన వలయంగా ఉంటుంది. ఈ శక్తి ముందు మానవ మేధస్సు ఎంత..? ఏదీ ఆలోచించలేదు. స్వామివారిని చూసి తరించడం తప్ప మరే ఆలోచనలకూ అక్కడ చోటుండదు.
అందరికీ అదే భావన..
స్వామి అలంకరణలో మా ప్రమేయం ఏమీ ఉండదు. ఆయనకు నచ్చినట్టుగా మాచేత అలంకారాలు చేయించుకుంటాడు. అలంకరణ పూర్తయి గర్భాలయం నుంచి బయటకు రాగానే స్వామి రూపం చెదిరిపోతుంది ఆగమాల్లో శ్రీవారి గురించి చెబుతూ ‘అతృప్తి రూపాయా’ అన్నారు. ఎంత చూసినా తనివితీరని రూపం అది. గంటల తరబడి స్వామి వద్ద గడిపిన అర్చకులకు, గంటపాటు అభిషేక సేవలో స్వామిని దర్శించుకునే భక్తులకు, క్షణకాలం దర్శన భాగ్యంతోనే వెనుతిరిగే భక్తులకు.. ఎవరికీ ఈ విషయంలో తేడా లేదు. మళ్లీ స్వామి వారి దర్శనం ఎప్పుడనే తపన తప్ప.. తనివితీరా చూసేశామన్న తృప్తి మిగలదు.
ఎన్ని జన్మల పుణ్యఫలమో స్వామివారి సేవకునిగా పనిచేసే భాగ్యం దక్కింది. ఈ జన్మకిది చాలు. నాకు ముగ్గురు కుమారులు. ముగ్గురు స్వామివారి సన్నిధిలో అర్చకత్వం చేస్తున్నారు. వీరే కాదు.. మా వంశం ఉన్నంత వరకు స్వామి సేవలో తరించే భాగ్యం ప్రసాదించమని ఆ శ్రీహరిని కోరుకుంటాను.
విగ్రహంగా చూడొద్దు
మూలవరుల విగ్రహానికి సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. మూలమూర్తిని తాకితే మనిషిని తాకినట్లే ఉంటుందని, గోళ్లు పెరుగుతాయని, తలపై పొడవాటి కురులు ఉన్నాయని చెప్పుకుంటారు. ఇవన్నీ అసత్యాలు. ఇవి మానవ లక్షణాలు. నశించే దేహానికి ఉండే లక్షణాలు. శ్రీ వేంకటనాధుని దర్శించే సమయంలో మనుష్య రూపంలో ఊహించుకోకూడదు. ఆ మూలమూర్తిని 9.5 అడుగుల విగ్రహంగా చూడకూడదు. ఆ స్వరూపాన్ని బ్రహ్మాండాలను దాటి ఉన్న మహాస్వరూపంగా భావించాలి.
0 వ్యాఖ్యలు:
Post a Comment