శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

త్రైలింగస్వామి చఠిత్ర 80-- 85

>> Friday, August 3, 2012

ఆలోచించి చూస్తే పాదము నుంచి మస్తకము వరకూ ఉన్నవాటిలో ‘మనము’ అనేది ఏదీ లేదు. జ్ఞానస్వరూపమే మనము. కేవల విశుద్ధ చైతన్యమే ‘మనము’ అనే రూపంలో ప్రకాశిస్తుంది. శరీరము, ఇంద్రియములు, మనస్సు, చైతన్యములు ఒకే రకమైన భావము కలవి అయినప్పటికీ వాటికి పరస్పర సంబంధము ఏదీ లేదు. అన్ని అంగాలూ ఉన్నప్పటికీ శవదర్శన- స్పర్శనాదులు ఎందుకు చేయకూడదు? శరీరము- శవములు ఒకే రకమైన పదార్థములే కదా! మనలో చైతన్యము ఉన్నది కనుకనే మనము చూడగలుగుతున్నాము, వినగలుగుతున్నాము. కనుక మనము శరీరము కాదు. దానిలో ఎలాంటి సందేహములు కలుగరాదు. కనుక మనము శరీరము కన్నా భిన్నులము, నిత్యులము, స్వయం ప్రకాశులము అయి ఉన్నాము. ఎక్కడ ఆత్మ ఉంటుందో అక్కడ మనస్సు ఇంద్రియములు ఆత్మ మొదలైనవి ఏమీ ఉండవు. రాజు ప్రక్కనే సామాన్య వ్యక్తి నిలువలేడు. తిలల నుంచి తైలము తీసివేసిన తరువాత తెలకపిండికి తిలలకు ఎలాంటి సంబందమూ ఎట్లా ఉండదో, అట్లాగే శరీరము- మనస్సు ఇంద్రియములతో మనకు ఎలాంటి సంబంధమూ లేదు. మనస్సూ మనము కాదు. జీవమూ మనము కాదు. ఎందుకంటే అవన్నీ చైతన్యము చేతనే తెలుసుకోబడతాయి. జీవునకు తనదైన స్వతంత్ర ఏమీ లేదు. అది కేవలము సాక్షి మాత్రమే. ముత్యాలహారములోని ముత్యాలు దారం చేత ఎట్లా గ్రుచ్చబడి ఉన్నాయో, అట్లాగే భగవంతుని రూపమైన ఆత్మ పదార్థంలో జీవ పదార్థములన్నీ గ్రుచ్చబడి ఉన్నాయి. దారానికి ముత్యాలకూ ఏమీ సంబంధము లేదు. అట్లాగే శరరానికి ఆత్మకూ ఏమీ సంబంధం లేదు. శరీరము జడపదార్థము. కాని మనము అమరులము. జీవుడు మృతుడా, జీవితుడా అన్నది కేవలం భ్రమ మాత్రమే. మనము అంటేనే ఆత్మకన్న భిన్నమైనది మరేదీ లేదు. ఇది జ్ఞానోదయమయిన తరువాత తెలుస్తుంది.
బాహ్య జగత్తు మనము కాదు. అనిత్యమైన శరీరము మనము కాదు. పంచప్రాణములు కాని, వాయువు కాని మనము కాదు. ఎందుకంటే అవన్నీ అచేతనములు. మనము చైతన్యము కలవారము. పంచజ్ఞానేంద్రియములు మనము కాము. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు మనము కాము. అయితే మన మెవరము? మనము ఆలోచనలకు మించిన నిర్మల శాంత- విశుద్ధ- చేతన స్వరూపములము. బాహ్య అభ్యంతర స్థానాలలో వ్యాపించి ఉన్నవారము. మనము దీపంలాగా అన్ని పదార్థములను ప్రకాశింపజేస్తున్నాము. మనము అన్నింటిలో ఉండే ఆత్మ స్వరూపులము. దీపం సహాయంతో చీకటిలో ఉన్న తెల్లని - నల్లని వస్తువులు ఎట్లా తెలుస్తాయో, అట్లాగే మనలోని ఆత్మ పదార్థం వలన అన్ని వస్తువుల పరిజ్ఞానం మనకు కలుగుతుంది. అద్దంలో అన్ని వస్తువులూ ఏ విధంగా ప్రతిబింబిస్తాయో, అట్లాగే జాగృతమైన అన్ని వస్తువులకు మనము అనుభవస్థానము. అనాది- అనంతము- సర్వాంతర్యామి- చిన్మయము అయిన ఆత్మయే మనము. స్థావర జంగమములైన పదార్థ సముదాయమే మన శరీరము. ఇంత పెద్ద పరిమాణం ఉన్నా, దానికి ఉనికి లేదు. ఎప్పటినుంచీ ఉన్నది, ఎప్పటివరకు ఉంటుంది అనే హద్దు కూడా లేదు. అంతకాక, ఎంత దూరం వ్యాపించి ఉన్నది అనే పరిమాణం కూడా లేదు.
మనము స్వయంప్రకాశులము. పుష్పంలో పరిమళము, బీజములో వృక్షము, జలములో శీతలత, అగ్నిలో తేజస్సు, సూర్యునిలో కిరణము, దీపములో ప్రకాశము, కాంతిలో రూపము, రూపములో అనుభవము అయి ఉన్నాము. పాలలో నెయ్యి, నీటిలో రసము, చక్కెరలో తీపితనము ఉన్నట్లే, మనం కూడా అన్ని పదార్థాలలోనూ శక్తి రూపంలో ఉన్నాము. మనము ఆత్మ కనుకనే ఎవరి ప్రార్థనా లేకుండా ఈ విశాలమైన జగత్తంతా వ్యాపించి ఉన్నాము. నీవు మనము- మనది అనేవి అన్నీ మిథ్యాభ్రమలే!
మనస్సు:మనస్సుకు ఎక్కడా ఏమీ దొరకదు. అందువలననే దూర దూరాంతరాలలో త్రోవ తప్పి తిరుగుతూ ఉంటుంది.
 మనస్సు యొక్క వృత్తి తరంగాలలాగా చంచలమైనది. మనస్సు యొక్క తేజస్సు అగ్ని కన్న కూడా అధికమైనది. దానిని అతిక్రమించుటం పర్వతములను అతిక్రమించటంకన్నా కష్టతరమైనది. మనుస్సును వశపరచుకొనటం- సముద్రాన్ని ఆపోశన పట్టటం కన్నను, సుమేరు పర్వతం ఎత్తటం కన్నను, అగ్నిభక్షణం కన్నను చాలా కఠినమైనది. కాని మనస్సు క్షీణిస్తే, అంటే వాసనా శూన్యమైతే, జగత్తు నష్టమవుతుంది. అనంతమైన సుఖదుఃఖాలు ఈ మనస్సునుంచే పుడుతున్నాయి. అలాంటి మనస్సు వివేకం వలన క్షీణించితపోతే, సుఖ దుఃఖాలన్నీ వినష్టమైపోతాయి. మనస్సు నటునిలాగా అన్ని విషయాలలోను క్షణికానందము, క్షణిక విషాదము, క్షణిక ప్రసన్నతలనుభవిస్తుంది. నిర్మల బుద్ధియోగంతో ఇప్పుడే ఆ మనసుకు తగిన మందు వెయ్యకపోతే, దానికి ప్రతీకారం చేసే సమయం ఎప్పుడు వస్తుంది? మనస్సు యొక్క శక్తివలననే దృశ్యమాన వస్తువుల దర్శనం కలుగుతుంది. మనోచ్ఛేదము వలన దృశ్య దర్శనోచ్ఛేదము కూడా కలుగుతుంది.
మనస్సే జగత్‌కర్త. మనస్సే పురుషుడు. మనో నిశ్చయంవలన సంపాదితమయ్యేది మనస్సు యొక్క ప్రతిబింబమే అవుతుంది. ఈ ఆకాశము విస్తృతమైనది, అనంతమైనది. చిదాకారమైన ఈ విస్తృత మనస్సులోని ఏ అంశంలో చైతన్య ప్రతిబింబింబం పడుతుందో, అంశం ప్రకాశితమై, స్థిరత్వాన్ని పొందుతుంది.
మనస్సు యొక్క శక్తి ఎంత ప్రబలమైనదంటే, ఏకీకృత మనస్సుతో ఏది చేస్తే అది తప్పక సఫలమవుతుంది. చివరకు బ్రహ్మవరకూ అన్నీ పొందవచ్చును. మనస్సు చైతన్య శక్తి నుంచి చైతన్య భావమును పొంది, బ్రహ్మ భావాపన్నము అవుతుంది. మనస్సు - శరీరములు అభిన్నములు. ఆత్మయే మనస్సు- శరీరములను ప్రకాశింపజేస్తూ ఉండటంవల్ల మనస్సు శరీరముల అన్ని చేష్టలు కూడా సఫలములవుతాయి. మనస్సు ఏ వస్తువును వెతుకుతుందో అది తప్పక లభిస్తుంది. మనస్సు ద్వారానే మనను మనమే పవిత్ర మార్గంలో పెట్టుకోవాలి. మనస్సు దేనికి అనుసంధానమవుతుందో కర్మేంద్రియములు దానికి అనుగుణంగా స్పందిస్తాయి. మాలిన్యయుక్తమైన మనస్సునే చిత్తమనవచ్చు. మనస్సు చిత్తములు ఆత్మ యొక్క క్రియా స్వరూపములే. దానికన్న భిన్నమైనది ఏదీ లేదు. వాసనలు చిత్తము యొక్క అంశ మాత్రమే. మనస్సు తన వినాశన క్రియను తనలోనే చేసుకొంటుంది. అన్ని దుఃఖములనుండీ దూరము కావటానికి మూలము మనోనాశనమే. వివేకంతో శోధించటంవలన మనోనాశము అవుతుంది.
మనస్సు ఎంత శక్తిని ధారణ చెయ్యగలదనే విషయాన్ని తేలికగా స్పష్టం చెయ్యవచ్చును. నీ మనస్సు ఒకవేళ వేరే విషయం మీద లగ్నమై ఉంటే, నీవు తినే పదార్థాల రుచి కూడా నీకు తెలియదు. మనస్సు అన్యత్ర లగ్నమైతే నీకేమీ కనపడదు; వినపడదు. శరీరం వరకూ నిశే్చష్టితం అవుతుంది. మనస్సు చిత్తములు రెండూ పరస్పర సాకారులు కనుక రెండూ సమానమైనవి.
అయినా మనస్సు ఆ రెంటిలో ఉత్కృష్టమైనది. ఎందుకంటే మనస్సు నుంచే చిత్తము యొక్క క్రియ పుట్టినది; అంతేకాని చిత్తము నుంచి మనస్సు పుట్టలేదు. సుఖమును దుఃఖమని భావించటము, దుఃఖమును సుఖమని భావించటము కేవలము మనస్సు యొక్క పని. మనస్సు దర్శించని వస్తువనేది లేదు. గింజ నుండి వృక్షము, లత, పత్రము, పుష్పములు పుట్టినట్లు మనస్సు నుంచే జగత్తు స్వప్నము, వాసన, చింత, విలాసములు అన్నీ పుడతాయి.
నాట్యశాలలో ఒకే నటుడు నానా ప్రకారములైన వేషాలు ధరించి, నానా రకాల భావాలను ఎట్లా ప్రదర్శిస్తాడో అట్లాగే మన మనస్సు కూడా జాగ్రత్ - స్వప్న రూపాలలో పుట్టి, అన్ని సమయాలలోనూ నానా రకాల ఆలోచనలు చేస్తుంది. మనస్సు స్వయంగా నిరాకారం అయినప్పటికీ ఎప్పుడూ తాత్కాలిక సాకారమైనది కావటంవలన జీవుడు ఎప్పుడూ పుడుతూ చస్తూ ఉంటాడు.

తిలలో తైలము ఉన్నట్లు, మనస్సులో సుఖ దుఃఖములు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. సమయాన్ని బట్టి అప్పుడప్పుడు తగ్గటం, అప్పుడప్పుడు పెరగటం జరుగుతుంది. ఎవరి మనస్సు నిశ్చలము, ఒకే విషయము మీద లగ్నము కాగల శిక్షణను పొందుతుందో, అదే పరబ్రహ్మ యొక్క ధ్యానం చెయ్యటంలో సమర్థవంతమైనది అవుతుంది.
మనో సంయమనంవలన సంసారిక విలాసాలలో శాంతి లభిస్తుంది. ఉద్వేగ రహితమైతే మనోజనం లభిస్తుంది. మనస్సును జయించినవారికి త్రిలోక విజయం కూడా తుచ్ఛమైనదిగానే అనిపిస్తుంది. మనోజయమంటే తాను తన భావంలో అంటే పూర్ణబ్రహ్మంలో స్థిరంగా ఉండటమని అర్థము. చంచలత్వము మనస్సు యొక్క రూపము. అగ్ని యొక్క ధర్మము ఉష్ణత అయినట్లు, మనస్సు యొక్క ధర్మము చంచలత. స్పందన లేకుండా వాయువు యొక్క శక్తి అనుభవంలోనికి రానట్లు, చంచలత్వం లేకపోతే మనస్సు యొక్క ఉనికి తెలియబడదు.
చంచలత్వము లేని మనోస్థితియే మోక్షము. మనోనాశమైతే దుఃఖమునకు శాంతి లభిస్తుంది. మనస్సు యొక్క చంచలత్వమును, అవిద్యావాసనలను వాటి వివేచన ద్వారా వదిలిపెడితే మోక్షం లభిస్తుంది. సత్ అసత్తుల మధ్యనుండేది చిన్మయత్వము. చిన్మయత్వ - జడత్వముల మధ్యనున్న అవస్థను మనస్సు అని అంటారని తెలిస్తే జడత యొక్క అభ్యాసంవలన మనస్సు జడముగాను, వివేకము యొక్క అభ్యాసమువలన మనస్సు చైతన్య రూపంగాను మారిపోతాయి. భావనాయుతమైన అస్థిర మనస్సును వివేకయుతమైన మనస్సుతో ఉద్ధరించాలి. రాజు తప్ప మరెవ్వరూ ఇతర రాజును జయించలేనట్లు, మనస్సును మనస్సే తప్ప మరేదీ జయించలేదు.
ఆత్మకు ముక్తి కలగటానికి, మనస్సును జయించటం తప్ప వేరే ఉపాయం లేదు. మనస్సే కర్మఫలమును అనుభవిస్తుంది. మనస్సులోనే అనంతమైన సుఖదుఃఖములు కలుగుతాయి. శరీరంలో ఏమీ కావు. జడ శరీరము సుఖ దుఃఖములను అనుభవించలేదు. మనస్సు కర్త. అందుకే మనస్సును మానవునిగా గుర్తించాలి.
మనస్సు యొక్క ఆద్యంతములు నశించిపోయేవే అయితే, దాని మధ్య భాగములను కూడా అసత్ అనే చెప్పాలి. మనస్సు యొక్క ఈ అసత్ రూపం ఎవరికి తెలియదో వారికి దుఃఖానుభవము అనివార్యము అవుతుంది. మనస్సు దేనిని చేస్తుందో అదే అవుతుంది. దేనిని చేయదో అది కానే కాదు. ఈ విశ్వము మనోవృత్తి స్వరూపము. మనస్సే అన్ని కర్మలకు, అన్ని చేష్టలకు, అన్ని భావాలకు, అన్ని గతులకు బీజము. ఈ మనస్సు పరిత్యజించగలిగితే, అన్ని కర్మలూ పరిత్యక్తవౌతాయి. అదే అన్ని దుఃఖాలకూ లక్ష్యం అవుతుంది. అన్ని కర్మలకూ భయహేతువవుతుంది.
పట్టు పురుగు తాను ఉండటానికి గూడు కట్టుకొన్నట్లే మనస్సు కూడా తాను ఉండటానికి ఈ శరీరాన్ని నిర్మించుకొన్నది. పట్టుపురుగు గూడు ఆ పట్టుపురుగు కన్న వేరు కానట్లు మనస్సు - శరీరాలలో తేడా లేదు. మనస్సే శరీరమునకు ఉపాదానము. అంతేకాక మనస్సులోనే అన్నీ సంభవిస్తాయి. మనస్సులో పుట్టని శక్తి అనేది ఏదీ లేదు. చిత్‌ప్రతిబింబ స్వరూపమైన మనస్సే జీవుడై, తానే కల్పించుకొన్న భూత భవిష్యత్ వర్తమాన కాలాత్మకమైన జగత్తు యొక్క నిర్మాణ పరివర్తన- వినాశములకు కర్తయై, స్వయం వ్యక్తమవుతుంది. ధాన్యంలో బియ్యం ఉన్నట్లుగా ఈ ప్రపంచమంతా బ్రహ్మలోనే ఉన్నది. ఈ జడ జగత్తును అస్తిత్వము లేదు. దుఃఖము- సంతోషము అనేవి ఆత్మ కృతములే! తిరిగి అవి ఆత్మలోనే లయమవుతాయి.
మనస్సు పురుషుడు కనుక, అది మంచి మార్గంలో ముందు నడవాలి. చిత్తము ప్రకృతి స్వరూపము. మనస్సు ధర్మ విశిష్టమవవుతుంది. అది దర్శన ధర్మాన్ని పొందినప్పుడు కళ్లుగాను, శ్రవణ ధర్మాన్ని పొందినప్పుడు చెవులుగాను అవుతుంది. అందువలన మనము మనస్సును కర్మబీజమనవచ్చును.
 ప్రస్తుత శరీరంలో మనస్సు అన్ని వస్తువులలోను ఉండి, నరుడనే పేరుతో వ్యక్తమవుతున్నది. మనస్సే జీవము. మనస్సే నిర్మలత్వాన్ని పొంది పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతుంది. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు.
మనుష్యుడు అంటే మనోమయము. అంతకు తప్ప మరేమీ లేదు. ఈ సంసారంలో మనస్సే పుడుతుంది. బాగా ఆలోచించి చూస్తే మోక్షము మనస్సుకే కలుగుతుంది. మనస్సే ప్రకృతిరూపంలో ఉన్న సంసారి. జరామరణములు మనస్సుకే! మనస్సే అన్ని సమయాలలో అన్నింటినీ సర్వనాశనం చేస్తున్నది. జ్ఞానోదయమైతే మనస్సు నశిస్తుంది. అద్దం ముందుంచిన వస్తువును ప్రక్కకు జరిపినప్పుడు దాని ఛాయ ఎట్లా కన్పించదో, అట్లాగే ప్రాణశక్తులను నిరోధించినప్పుడు మనోనాశనము అవుతుంది. ఎందుకంటే మనస్సు ప్రాణము యొక్క రూపాంతరమే! ప్రాణమే తన స్పందన శక్తి ద్వారా దేహాంతరములైన అన్ని వస్తువులను హృదయంగమము చేసుకొని దాని అనుభవమును పొందుతుంది. ఆ విధంగా మనస్సు తయారవుతుంది. రాతిలో మండే శక్తి లేనట్లుగానే, మనస్సుకు అనుభవ శక్తి ఉండదు. అనుభవ శక్తి ప్రాణవాయువులో ఉన్నది. ప్రాణవాయువు- ఆత్మ అనే ఉభయ శక్తుల సంయోగానే్న మనస్సంటారు. మనస్సే కర్త. మనస్సు దేనిని సంకల్పిస్తే అదే అవుతుంది. ఎక్కడ మనస్సు ఉంటుందో అక్కడ ఆశ -సుఖదుఃఖాలు ఉంటాయి. ‘మన్’ అంటే మననము చేసేది అని అర్థము. కల్పించగల సామర్థ్యం కలిగినది కావటంవల్ల మనస్సు అనిపించుకొంటుంది. మనస్సు, చైతన్యము జడముల మధ్యన ఉండి, జీవవృద్ధి, చిత్తము మొదలైన వాటితో కలిసి అభిహితమవుతూ ఉంటుంది. మనోనాశము అయ్యేవరకు వాసనాక్షయము కాజాలదు.
చిత్తము:చిత్తము యొక్క స్వాభావిక ధర్మము విషయానురాగము. ఒడ్డున ఉన్న చెట్టును నది గ్రసించినట్లుగానే వృత్తిశాలియైన చిత్తము మనుష్యుని గ్రసిస్తూ ఉంటుంది. జల ప్రవాహము ఆనకట్టలతో బంధింపబడినట్లు మనుష్యుడు చిత్తము చేత బంధింపబడతాడు. వ్రేలాడు త్రాడు పైకి క్రిందకీ వ్రేలాడునట్లు, మనుష్యుడు కూడా చిత్తము మనస్సుల ద్వారా ఒకసారి ఊర్థ్వగామి మరొకసారి అధోగామి అవుతాడు. గ్రద్ద హఠాత్తుగా చేపను పట్టుకొన్నట్లు, చిత్తము యొక్క సాహసమువలన విషయములందు ఆసక్తి కలుగుతుంది. చంచలచిత్తముగల మనుష్యులు విషయం మీదా ఏకాగ్ర చిత్తులు కాలేరు. బుద్ధిలో ఉన్న ఆత్మయే చిత్తము. చిత్తము యొక్క వాసనలు క్షణిక క్రియాదశలో ఉన్నప్పుడు, చిత్తము జీవి అనబడుతుంది. అది భ్రమించినప్పుడు శరీరము అనబడుతుంది. చిత్తము యొక్క కల్పన శాంతించినప్పుడు అది పరబ్రహ్మమని గ్రహించాలి.
విషయ వాసనలతో కప్పబడిన చిన్మాత్రలో ఉన్నది, వికల్పముల చేత కలుషితమైనది అయిన చిత్-తత్త్వమే జీవుడని చెప్పబడింది. చిత్తము యొక్క స్వరూపమే ఈ ప్రపంచమంతా నిండిన దృశ్యము. యోగాసక్త చిత్తము ఏ కర్మనూ చేయకపోయినప్పటికీ కర్త అవుతున్నది. చిత్తమునుంచే సంసారం వచ్చింది. ఈ సంసారము చిత్తమయము. చిత్తమునందే ఈ సంసారము నిలిచియున్నది. చిత్తము ఎట్లా ఉంటే పురుషుడు కూడా అట్లా ఉంటాడు. ఆత్మయే చిత్తము. అదే చిత్తమునకు కారణము. ఆ చిత్తము ద్వారానే కర్మమయములు, వాసనామయములు, మనోమయములు అయిన అన్ని శక్తులు సంచరిస్తూ ఉంటాయి. దృశ్యమానమవుతాయి. అనుభవము ద్వారా తెలుస్తాయి. వాస్తవానికి అన్ని జీవములు, అన్ని పదార్థములు బ్రహ్మనుంచే పుడుతున్నాయి. అందులోనే విలీనమైపోతున్నాయి.
మోహము వలన జర, మృత్యువు వలన చిత్తము బాధింపబడతాయి. ఆత్మ యొక్క ఇచ్ఛావికృతియే చిత్తము. అది తన ఉత్పత్తికి కారణమైన ఆత్మ పదమును మర్చిపోయి, కల్పనా ప్రసూతములైన అనర్థములకు కారణమవుతున్నది. ఆత్మ తేనెటీగలాగా బంధనములలో చిక్కుకుపోతుంది.

 శబ్దాది తన్మాత్రల సమూహము దాని అవయవ స్వరూపము. జరామృత్యువులచే చుట్టబడిన విషవృక్ష సదృశమైనది చిత్తము. చిన్న గింజలో మహాకాండమున్న వటవృక్షము ఉన్నట్లే, ఆశాపాశములను తయారుచేసే అఖిల సంసారము చిత్తములోనే వ్యవస్థితిమై యున్నది. అదే చిత్తము. అగ్నికీలలో దగ్ధమై, కోశరూపమైన కొండచిలువ ద్వారా చర్వితమై, కామతరంగములచే కొట్టబడి, ఆత్మరూపుడైన పితామహుని (మూలకారణుడు) మర్చిపోతుంది. శోకము చేత విలుప్తమైన చైతన్యము విషయాగ్నిలో దగ్ధమవుతూ ఉంటుంది. అలాంటి చిత్తము వర్తమాన శరీరమును వదలవలసి వచ్చినప్పుడు, దాని విచ్ఛేదమునకు ఎక్కువ భయపడుతుంది. ఎందుకంటే అది దేహము. ఇంద్రియములనే శత్రువులలో ఎట్లా విశ్వాసంతో ఉంటుంది? ఈ దృశ్య ప్రపంచమయ లక్షణమే చిత్తస్వరూపము. అది తప్ప దానికి వేరే స్వరూపం లేదు. ఈ జగత్తు- ప్రపంచము అన్నీ కేవలము ఆత్మయే. అట్లా తెలుసుకోకపోతే ఈ దృశ్య జగత్తంతా దుఃఖప్రదమే అవుతుంది. తెలుసుకోగలిగితే మోక్ష సుఖాన్ని ప్రసాదిస్తుంది. ద్రష్ట దృశ్యములకు మధ్యవర్తియైన అవస్థయే చైతన్యము.
చిత్తము కల్పనమీద ఆధారపడి ప్రకాశించినప్పుడు అది తన చిత్తస్వభావమును మర్చిపోయి, జడత్వం చేత చుట్టబడుతుంది. బొమ్మలోని రాజు ఆకారము భయంకరమైన యుద్ధము చేయలేనట్లు, మృతదేహము ఎక్కడికీ పోలేనట్లు, శిలాఖండము మధురగీతాన్ని ఆలాపించలేనట్లు, కృత్రిమ సూర్యుడు చీకటిని పొగొట్టలేనట్లు, మిథ్యాభ్రమతో మునిగిన చిత్తము ఏపనీ చేయలేదు. వాస్తవంలో ఏదో చేస్తున్నట్లు కన్పించేది ప్రాణాది వాయువుల క్రియయే!
చీకటిలోకి వెలుగు రేఖ ప్రకాశించినప్పుడు చీకటి దూరమైపోయినట్లు, పరమాత్మ సాక్షాత్కరం కాగానే చిత్తము యొక్క అస్తిత్వం ఉండదు. అందువలననే చిత్తప్రకాశము విడిగా ఉండదు. మనమే ఆత్మ, మనమే జీవము, అనే జ్ఞానము పేరే చిత్తము. అంతేకాక, అలాంటి చిత్తము అనాది అనంతము అయిన దుఃఖమును విస్తరింపజేస్తుంది. చిత్తమును నాశనము చేయదలిస్తే, మొదట చిత్తవృత్తులను నాశనము చెయ్యాలి. అప్పుడు చిత్తము సహజంగానే నాశనమవుతుంది.
ఘటంలో ఘటాకాశం ఉన్నట్లే, చిత్తము లోపల సంసారమున్నది. ఘటము నాశనము కాగానే ఘటాకాశము ఉండనట్లే, చిత్తనాశము కాగానే సంసారము కూడా ఉండదు. చిత్తనాశనమునకు పెద్ద ప్రయత్నము చేయనక్కరలేదు. అజ్ఞానము అంతరిస్తే చిత్తనాశనము అవుతుంది. చిత్తము అజ్ఞానముతో ఎప్పటివరకూ కప్పబడి ఉంటుందో, అప్పటివరకూ అది ఘనీభవించి ఉంటుంది. ఎలా ఎలా జ్ఞానానుభవం కలుగుతూ ఉంటుందో, అలా అలా చిత్తము కూడా క్షీణిస్తూ పోతుంది. చిత్తము ఒట్టి మిథ్య. అందువలన ఉపదేశములతో దానికి ఏమీ కాదు. కేవలము ఆలోచన ద్వారానే దానిని నాశనము చేయవచ్చును. చిత్తము చేసేదానినే నీవు అనుభవిస్తావు. చిత్తము చెయ్యనిదానిని నీవు అనుభవించలేవు. చిత్తము యొక్క కలయిక వలననే మనము స్వస్థాన లాభమును పొందలేకపోతున్నాము. పక్షులు భ్రాంతి చేత వలలో తగులుకొన్నట్లుగానే, మనం కూడా చింతాజాలముతో తగులుకొంటున్నాము.
వాసన:విషయాత్మికమైన అంతఃస్థిత మనోవృత్తియే వాసన. మనుష్యుడు ఏదైనా కార్యమును చేసినా చెయ్యకపోయినా, అతని మనస్సులోని కోరికను బట్టియే స్వర్గ్ఫలమో నరక ఫలమో కలుగుతుంది. తత్త్వజ్ఞానము కలిగినవానికి వాసనలు శిథిలమైపోతాయి. అంతేకాక అతడు తన సర్వకర్మ ఫలమైన ఆత్మకంటె భిన్నమైన అనుభవమును పొందుతాడు. వాసనలోనే జగత్‌జాలమంతా ఉన్నది. వాసనలతో దృఢమైన చిత్తము తనలో ఎవరిని చూడలేదు. వాసనలు శాంతించినచో, చిత్తము మూడు లోకాలను తృణప్రాయంగా చూస్తుంది. వాసనలు క్షీణించకపోతే, ఏ స్థితిలోను చిత్తవృత్తులను నిరోధించలేదు. వాసనలు నశించకపోతే తత్త్వజ్ఞానలాభం కలుగదు.

మరి తత్త్వజ్ఞానము, చిత్తనాశము, వాసనాక్షయము- ఇవన్నీ పరస్పరము ప్రకాశించటానికి చాలా కష్టమును కలిగిస్తాయి. వాసనాక్షయము, చిత్తనాశము, తత్త్వజ్ఞానము ఇవన్నీ ఒకే సమయంలో కోరిన ఫలాన్ని ఇస్తాయి. అందువలననే ఈ మూడింటిని ఒకేసారి నాశనం చేసే ప్రయత్నం చెయ్యాలి.
బుద్ధి:బుద్ధి జగద్వ్యాపికాదు. కాని అది కొన్ని పరిధులు ఉన్న స్థానాలలో వ్యాపించి ఉంటుందనేది నిశ్చయము. కనుక బుద్ధి ఒక వస్తు విశేషము. అంతేకాక అది ఒక విలక్షణమైనది. ప్రతివారికీ ఇంతో అంతో బుద్ధి ఉంటుంది. కాని ఎవరికి బుద్ధి ఒక పరిమితి వరకే వ్యాపించి ఉంటుందని విశదమవుతుంది. కనుక బుద్ధి సాకారమైనదే కదా! అందులో ఎలాంటి సందేహమూ లేదు. బుద్ధియే మంచి చెడులను గురించి ఆలోచిస్తుంది. ఉత్కృష్టమైనదో నికృష్టమైనదో కోరేది కూడా బుద్ధియే. అంతేకాక, నానా విధములైన నూతన వస్తువులనూ ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఎవరైనా ఒకరు విద్యలేనివాడైన్పటికీ, బుద్దిగలవాడయితే, అతడు తన పనులన్నీ చేసుకోగలుగుతాడు. కాని బుద్ధి లేకపోయినా విద్య లేకపోయినా గట్టి పరిశ్రమను చేసి కొంత విద్యను సంపాదించినా అది విశేష కార్యం కాదు. బుద్ధి జీవ శరీరంలో అద్దంలాంటిది.
తృష్ణ:తృష్ణ మనుష్యుని ఎంతగా దహిస్తుందంటే, ఆ మంటను అమృతం కూడా ఆర్పలేదు. తృష్ణయే మనిషిని భయభ్రాంతుని, దుఃఖితుని, గ్రుడ్డివానిని చేస్తుంది. తృష్ణయే అలభ్యమైన వస్తువుమీద ఆసక్తిని కలిగిస్తుంది. దొరకదని తెలిసి కూడా, ఆ విషయాన్ని ఆకాంక్షిస్తుంది. అంతేకాక ఒక చోట అది స్థిరంగా ఉండదు. అంతఃపురంలో ఉండేవారిని కూడా అతి కష్టమైన ప్రదేశాలకు అది తీసుకొనిపోతుంది. ఈ తృష్ణయే ఆత్మతత్త్వాన్ని ఆచ్ఛాదించి, మనిషిలో ఎక్కువ అజ్ఞానాన్ని సృష్టిస్తుంది. తృష్ణలోనే మనస్సు చిక్కుకొని ఉన్నది. తృష్ణయే మోహంతో నిండిన ఏనుగును కూడా బందిస్తుంది. తృష్ణయే జరామరణ దుఃఖములకు కారణము.
చింత:చింతన త్యజించగలిగితే మనుష్యుడు సమస్త దుఃఖాలను తరించగలుగుతాడు. చింత అనంతకాలం వరకూ అన్ని విషయాలలోనూ ఆసక్తిని కనబరుస్తుంది. చింతన ఛేదించటం దుస్సాధ్యమన పనే అయినప్పటికీ జ్ఞానులు వివేకమనే ఖడ్గంతో దానిని ఛేదిస్తారు. తత్త్వజ్ఞానోదయం కానంత వరకూ చింత వదిలిపోదు. అట్లాగే చింత శాంతించనంతవరకూ తత్త్వజ్ఞానం కలుగదు. చింతకు సొంత సోదరుడు ధనము. మనం ఎట్లా ధనవంతులం అవుతాము? ఏ ఉపాయాన్ని అవలంభిస్తే ధనోపార్జన అవుతుంది? ఇలాంటి చింతలతోనే మనుష్యులంతా జీర్ణించిపోతున్నారు. చింత అన్ని సమయాలలోనూ అస్థిరంగానే ఉంటుంది. ఒక చింత తరువాత మరొక చింత ఎక్కడి నుంచి వస్తుందో సరిగ్గా చెప్పలేము. అందువలననే చింతకు అంతం లేదు. చింతాశూన్యుడైన మనిషీ లేడు. మనిషి ఎలాంటి చింతా లేకుండా గడిపిన రోజు ఏ ఒక్కటీ ఉండదు. చింతవలన శరీరము జీర్ణించిపోతుంది. అట్లాగే చింత సమాప్తికాగానే ముక్తిమార్గం సుగమమవుతుంది.
మాయ:మాయ జగత్తు యొక్క ఉత్పత్తికి కారణము. ఈ మాయ చేతనే వివేకము కప్పబడి ఉంటుంది. ఈ మాయ ఏమిటనేది తెలుసుకోలేని విషయము. ఈ జగత్తు అత్యద్భుతమైనది. వివేకంతో నడవకపోతే మాయ వృద్ధి చెందుతుంది. అట్లాగే వివేక దృష్టితో చూస్తే ఏమీ ఉండదు. ఈ మాయా స్వరూపం అవగతం కాకపోవటంవలన దాని మాహాత్మ్యమును అనుభవించలేము. సంసార బంధనం కోసం ఈ మాయ ఆశ్చర్యజనకమైన పనులు చేస్తుంది. ఎందుకంటే, ఈ మాయ ఎప్పుడూ అసత్యమైనదే అయినా, అది సత్యంలాగానే అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. ఈ సంసార రూపమైన మాయ పరమ పదమునకు భిన్నంగా ప్రవర్తిస్తుంది. ఈ మాయకు పారమార్థిక సత్తా లేదు. ఒకవేళ నీవు ఏకాగ్ర చిత్తుడవై భావనాబలంతో ఆత్మయొక్క వాస్తవిక స్వరూపాన్ని తెలుసుకోగలిగితేఅప్పుడు నీకు అన్ని విషయాల మర్మములు అవగతమవుతాయి.
- ఇంకాఉంది

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP