శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఇలా పెంచకండి పిల్లల్ని ...డబ్బు చేకూరితే..... నేలమీదున్నామని మరచిపోతున్నారేమిటిది ????

>> Tuesday, August 7, 2012

ఈమధ్య మా పక్క ఊరు గాంధీనగర్ లో ఓపాత విద్యార్థి పెళ్ళి జరిగింది . వాడు అమెరికాలో ఉంటున్నాడు . పరవాలేదు బాగానే సంపాదిస్తున్నాడు . వాళ్లన్నయ్య  నన్ను పెళ్ళికి పిలవటానికొచ్చాడు . ఇక మాటలసందర్భంలో పెళ్ళి పనులగూర్చి చెప్పుకొచ్చాడు . వంటంతా బాస్మతీ బియ్యం తో చేపిస్తున్నమండీ .    మినరల్ వాటర్  తెప్పిస్తున్నాము . వంటకు కూడా అవే . అన్నాడు . నాకు కొద్దిగా ఆశ్చర్యం  వేసింది . వంటకు మన బోర్ నీల్లు బానే ఉంటాయి కదా ? అన్నాను . అబ్బే ! ఎందుకండీ బియ్యానికే అంత ఖర్చు పెడుతున్నాము ..నీళ్ళకోసం వెనక్కు తగ్గుతామా అన్నాడు . ఇక  విందు ఏ స్థాయిలో చేయాలనుకున్నామో చెబుతున్నాడు. 
నాకైతే అతనిమాటలు వింటుంటే  డబ్బు రాగానే లోకం మామూలుగా కనపడదా అని ఆశ్చర్యం వేసింది . 
 ఒక ఆరేడు  సంవత్సరాలక్రితం వరుసగా  మూడేళ్ళు వానలు లేవు . కాలువలకు నీరులేక పంటలు లేక  ఇతని కుటుంబం కూడా రేషన్ బియ్యంతో కాలం గడపిన సంగతి నాకు తెలుసు .  ప్రతి రైతుకుటుంబం పిల్లల ఫీజులు కట్టటానికి కూడా ఎన్ని సార్లు లేవని నాదగ్గర చెప్పుకున్నారో . 
పెళ్ళి అనేది జీవితంలో ఒక ముఖ్యవేడుక కాదనను . చక్కగా విందు ఇవ్వవలసినదే .బంధుమితృలతో పెళ్ళి మండపాలు కళకళ లాడాల్సినదే .
కానీ  ఆపేరుతో వృధాఖర్చు ... గొప్పలకోసం అనవసర వ్యయం.
చక్కగా తాటాకు పందిరి వేసి పెళ్ళిచేసిన ఇళ్ళు నెలలలతరబడి కళకళ లాడుతూ కనిపించేది. ఇప్పుడు వేలు లక్షలఖర్చుతీ సెట్టింగులు వేసినా తెల్లారేసరికి ఎవడివివాడు పీక్కెళితే ఆఈంట్లో ఏ కార్యం జరిగిందో కొత్తగాచూసినవాడికెవడికి గుర్తుంటుంది. ఆమాత్రం ఒక్కరాత్రికి అంత ఖర్చా ?
 ఇప్పుడు  వాడ్నిచూసి ఇంకొకడు ఇంకా గొప్పగాచేయాలని పోటీపడి చేస్తున్న   వృధావ్యయం నాకైతే   నచ్చటం లేదు. సమకూరిన డబ్బుతో ఎన్ని మంచి కార్యక్రమాలు చేయొచ్చు. 


 బాగాడబ్బున్నవారి పెళ్లిళ్ళు చూస్తుంటే   డబ్బుకూడా పెద్ద జబ్బేమోననిపిస్తుంది . ఆమధ్య మన సినిమా కుర్రవాళ్ల పెళ్ళిల్లలో మూడూ నాలుగొందల రకాల ఆహారపదార్థాలట ,; మనిషన్నవాడు  అన్ని ఐటమ్ లను కొద్దికొద్దిగానైనా వడ్డించుకుని తినగలడా ?  ఎంత వృధా అయ్యుంటుంది ? 
పోనీ ఇంతవండీ ,,, ఆకలైనవాడికేమన్నా పెడతారా ! అదీ లేదు . కడుపు పట్టని వాన్నే రానిస్తారక్కడికి . ఇంకేంలాభం వండుకుని . అన్నదానం చేసిన పుణ్యమెలా లభిస్తుంది ? 
ఆ సినిమా హీరోలు ఆఖర్చుతో  పేదలకు కనీసం వాళ్లఫీల్డ్ లో పనిచేస్తూ ఆకలితోమాడుతున్నవారికి నెలల తరబడి  కడుపునింపవచ్చునే ? ఈ డబ్బు లేకే కదా! వాళ్ళు చేయుచాపేస్తాయిలోను, ఉన్నవాడు పెట్టేస్థితిలో ఉంది .

 ఆతల్లి లక్ష్మీదేవి పూర్వజన్మసుకృతం వలన ఇచ్చిన డబ్బు పూర్తిగాదాచుకోమని కాదు ..సరైన రీతిలో ఖర్చు పెట్టాలనే ఆశిస్తుంది. మనమో !అవసరంలేనంత దాచుకోవటమో అనవసరమైన విధంగా ఖర్చుచేయటమో చేస్తుంటే మరలా ఎన్ని కష్టాలు పడాలో భవిష్యత్తులో .
సంపాదించటం పెద్ద గొప్పేంకాదు .దాన్ని సవ్యంగా ఖర్చుపెట్టటమే గొప్ప . అందుకే ముందు  మీ పిల్లలకు  ఆకలి విలువ తెలపండి. డబ్బు విలువ చెప్పండి . అనుభవపూర్వక జ్ఞానం వాడికి జీవితంలో రక్షణ అవుతుంది.


నా చిన్ననాటి సంఘటన ఒకటి చెబుతాను . 
మాకు వినుకొండకు మధ్యలో గుండ్లకమ్మ అనే నది ఉంది . వర్షాకాలమొస్తే మహా వుధృతంగా ఉంటుంది ప్రవాహం. అప్పట్లో తిరిగే ఒక్కబస్సు నదిలోనుంచే రావాలి అప్పటికి బ్రిడ్జి లేదు మరి.
మానాన్నగారు నరసరావు పేట దగ్గర ఉద్యోగం చేస్తున్నారు , నాకప్పుడు ఎనిమిది తొమ్మిదేళ్ళుంటాయి. ఇక్కడ  మాజేజినాయన గారిదగ్గరే ఉన్నాను . మా బాబాయి కి  పెళ్లయి మాపిన్ని కొత్తగాకాపురానికొచ్చినరోజులు .  వర్షాకాలం. మా తాతగారు ,బాబాయి,నానమ్మ వినుకొండ వెళ్లాక వర్షం  జోరున మొదలైంది. ముసురు పట్టింది . తల బయటపెట్టడానికి లేదు . ఇక ఖర్మ కాలి మా పిన్ని నెలసరి వచ్చి బయట ఉండాల్సొచ్చింది . ఆవిడ చెబుతుంటే నేనే వంట. [అప్పటికి మాఊర్లో వరి అన్నం మాఇంట్లోనే . అందరూ జొన్న సజ్జన్నమ్మే ..అవే మరి పంటలు] రెండోరోజుకే బియ్యం అయిపోయాయి . వరద  ఉధృతి వల్ల అటువాళ్ళు ఇటొచ్చే అవకాశం లేదు . సాయంత్రం మిగిలిన బియ్యం పోసి వండితే నీల్లెక్కువై అన్నం మెత్తగా అయింది.ఉన్న ఒక్క కొబ్బరి చిప్పలో కొబ్బరి పచ్చిమిరపకాయలు చింతపండు కలిపి పచ్చడి నూరాను . ఆవిడకు కొద్దిగా పెట్టీ నేను కూడా కొద్దిగా తిని మిగతాది దాచి పెట్టాను. మరునాడు పొద్దుటకు పాచి పోయి ఉంది . వర్షం తగ్గలేదు. అదీ గాక ఈవిడ కొత్తకోడలు బయటకువెళ్ళి ఎవర్నీ అడగలేదు పోనీ ఎవరన్నా ఇచ్చినా ఆసజ్జలు జొన్నలు వండటం మా చేతకాదు . అసలు వర్షం తెరిపీయటం లేదు
ఇకచూడండీ మాతంటాలు . ఆ పాచినఅన్నం లో నీళ్ళు పోసుకుని మజ్జిగలా కలుపుకుని ఒకపూట తిన్నాం . పాచిపోయి వాసనొస్తున్నా మిగిలిన కొద్దిగా రాత్రికీ తిన్నాం . మరుసటిరోజు   ఎండిపోయిన కొబ్బరి పచ్చడీ నాక్కుని మంచినీళ్ళు తాగాం . నాలుగోరోజు సాయంత్రానికి బస్సు రావటం బియ్యం సరుకులమూటలతో మా బాబాయి  దిగటంతో ప్రాణం లేచొచ్చింది.
ఆరోజునుంచి నాకు అన్నం వృధాచేసే వాళ్లను చూస్తే కడుపులో మడుతుంది. చదువుకునేప్పుడు బీసీ హాశ్టల్ లో అన్నం విసురుకునే వాళ్లను పారవేసే వాళ్లతో వాదన పెట్టుకునే వాడిని . ఆ ఒక్కముద్ద అన్నంకోసం లోకంలో ఎన్ని జీవులు అల్లల్లాడిపోతున్నాయో ప్రతిక్షణం నాకు గుర్తొస్తుంది . 

ఆ..!!!! మనం పాటించినా  ఈ కాలం పిల్లలకేం చెప్పగలం అనకండి . మనం ఆచరించేది మన పిల్లలు  నేర్చుకుంటారు.

  మా చిన్నబ్బాయి ఆమధ్య ఇంటికొచ్చినప్పుడు వాడితో పాటు చదివిన  సుదర్శన్ రెడ్డి అనే గాంధీనగర్ పిల్లవాడొచ్చాడు , వాడు మావాడి వద్దవున్న  సెల్ చూసి  పవనూ! ఏం ఫీచర్లు లేవు   నాటు లా ఉన్నావే ? పాత సెల్ఫోన్ జేబులోవేసుకుని తిరుగుతున్నావన్నాడు . 
అప్పుడు మావాడు . ఒరే ! సెల్ఫోన్  అమ్మానాన్నలతో స్నేహితులతో మాట్లాడుకోవటం కోసం మాత్రమే నాకవసరం ,. అంతేగాని సొల్లుకబుర్లకు  దానిమీద కాల క్షేపానికి కాదు  నాకంత ఆసక్తి లేదు . ఇదిచాలు నాకు అన్నాడట.  అది విన్న మావిడ చెబుతుంటే చాలాసంతోషం వేసింది. 
పెద్దవాడు మొన్ననే హైదరాబాద్లో జాబ్ లో చేరాడు .  పెద్దవాడు కార్పోరేట్ కాలేజీలలో కాక గవర్ణమెంట రెసిడెన్షియల్ కాలేజ్,నాగార్జునసాగర్ లో చదివి ఇంజనీరింగ్ కూడా పూర్తి చేయగా  ,చిన్నవాడు మద్దిరాల నవొదయ అక్కడనుండీ త్రిబుల్ ఐటీ నూజివీడులో సీట్లు సంపాదించుకుని చదువుకుంటూన్నాడు. ఐ ఏ ఎస్  కావాలని పట్టుదలగా ఉన్నాడు .పిల్లలిద్దరూ బట్టలవిషయం నుండి చేతి ఖర్చులవరకు భేషజాలకు పోరు నా పిల్లలు .పీనాసి తనం నేర్పలేదుకాని అనవసర వృధా చేయరు. అవసరమైతే ఎవరికన్నా సాయంచేయాలంటే పాకెట్ మనీతో నైనా సహాయం   చేస్తారు. 
నాదగ్గర చదువుకున్న కొంతమంది విద్యార్థులు  చిన్నవయస్సులోనే ఎంతో కష్టపడి పైకొస్తూ డబ్బు పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండటం ,అవసరమైనచోట సత్ర్కియలకు ఖర్చుపెట్టటం చూసి చాలా ఆనందంకలుగుతున్నది .
ఇదంతా స్వోత్కర్ష గా చెప్పుకోవటం లేదు. మనం మనపిల్లలకు మంచి సంస్కారాలను ,మంచి అలవాట్లనూ నేర్పవచ్చు అనే దానికి ఉదాహరణగాచెబుతున్నానంతే .అలాగే పిల్లలను వాస్తవదృష్టితో  ఆలోచించగలిగి సామాన్యంగా బ్రతకటం నేర్పిన వారెందరో నాకు తెలుసు . కనుక మనం మనపిల్లలకు ఏం నేర్పాలో అది నేర్పుదాం. అతి ముద్దు వద్దు. ఆడంబరాలు నేర్పొద్దు. 
జైశ్రీరాం

11 వ్యాఖ్యలు:

Kottapali August 7, 2012 at 9:58 AM  

పిల్లలకు చక్కని అలవాట్లు అబ్బినందుకు సంతోషం.
నిజమే, ఎందుకో గొప్పలు అర్ధం కాదు.
ఈ ఆర్భాటం ఖర్చులు చూసినప్పుడు ఒకందుకు సంతోషిస్తుంటా - ఖర్చు అంటూ పెట్టారంటే ఆ డబ్బు ఏదో ఒక బిజినెస్ కి ముడుతోంది, తద్వారా, ఆ వ్యాపారం, ఆ వ్యాపారంలో పనిచేసే వాళ్ళయినా వృద్ధి పొందుతున్నారు అని.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు August 7, 2012 at 12:59 PM  

డబ్బు ఇచ్చే కిక్కు అంతా ఇంతా కాదు మరి.

చిలమకూరు విజయమోహన్ August 7, 2012 at 4:07 PM  

వివాహాల్లో చాలా మందిని చూశాను తాము మధుమేహ వ్యాధిగ్రస్తులైనప్పటికీ అన్ని రకాల తీపి పదార్థాలను పెట్టించుకుని కాస్త రుచి చూసి మిగిలింది వదలివేయడం.నిషిద్దమయినవాటిని పెట్టించుకోకుండా ఉండవచ్చుకదా అంటే రుచి చూడడంకోసమని సమాధానం.తిన్నదానికన్నా వదలివే్సేదే ఎక్కువ.అన్నం పరబ్రహ్మస్వరూపం ఆ బ్రహ్మస్వరూపాన్ని ఇలా వృథా చేయడం చాలా దారుణం.మధుమేహవ్యాధిగ్రస్తులేకాదు చాలామంది ఇలానే వదలివేస్తుంటారు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी August 7, 2012 at 6:42 PM  

చక్కటి అంశం. అందరూ దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

anrd August 7, 2012 at 10:34 PM  

చక్కటి పోస్ట్.

sravan August 7, 2012 at 10:58 PM  

బాగుంది మాస్థరు గారు మీ ఆలొచనలు మెము కూడా క్రూషి చెస్థము

SJ August 7, 2012 at 11:22 PM  

chaala bagaa chepparu..

Lokahitam August 8, 2012 at 5:19 AM  

చాలా బాగా వ్రాశారు. ఇది చాలా మంచి విషయం. నా సెల్ ఫోన్ లో కూడా కేవలం నంబర్లు మాత్రమే కనబడతాయి. నా స్నేహితులూ, చుట్టుప్రక్కల వాళ్ళూ ఎగతాళి చేస్తుంటారు. దానికి నేను కూడా మీ చిన్న అబ్బాయి చెప్పిన సమాధానమే చెప్తుంటాను.

ఆత్రేయ August 9, 2012 at 7:07 AM  

చక్కని సూచన ఇచ్చారు.
ఈ ఆడంబరాలు ఎక్కువ శాతం మొదటినుంచీ డబ్బున్న కుటుంబాల్లో కాక,
కొత్తగా డబ్బు చేసిన వాళ్ళకే ఉండటం గమనార్హం.
మీ వాదన తో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
మంచి టపా.

మోహన్ కిషోర్ నెమ్మలూరి August 11, 2012 at 12:19 AM  

నమస్తే మాష్టారు!

చాలా ముఖ్యమైన విషయం గురించి ప్రస్తావించారు. మీ గత అనుభవం చదువుతూ ఉంటే కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి... నిజమే అన్నం ఎంత విలువైనదో కదా... అది లేని నాడు తెలుస్తుంది.. సద్గురువు వెంకయ్య స్వామి వారు అన్నారు..."ఆకలేసిన వాడికి పెట్టండయ్యా, కడుపునిండిన వాడికి కాదు" అని.

మీ పిల్లలిద్దరూ చక్కని ప్రయోజకులైనందుకు హౄదయపూర్వక అభినందనలు. పొద్దున లేచిన మొదలు నిరంతరం అమ్మ ధ్యానంలో ఉండి, అమ్మ సేవకై మీ శారీరక, మానసిక, ఆర్ధిక వనరులను వెచ్చిస్తున్న మీకు అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం ఉన్నది మాష్టారు, అమ్మ యొక్క ఆ ప్రసన్నతయే మీ పిల్లల వృధ్ధి. మీ పిల్లలు ఇంకా ఇంకా పైకి ఎదిగి, ఫలానా దుర్గేశ్వరా మాస్టారి పిల్లలు వీళ్ళు... అని లోకం కొనియాడే స్థాయికి వెడతారు... ధర్మబధ్ధముగా మీ ఆశయాలకు అనుగుణంగా మీకు మీ వంశానికి కీర్తి తెస్తారు.
జై శ్రీరాం

Aruna December 24, 2020 at 3:50 PM  

Wish more people think like this otherwise karma will come back anyway if not in this life in many lives to come.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP