శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సంగీతం- ఆధ్యాత్మికత

>> Thursday, August 2, 2012



భారతదేశంలో పుట్టిన వారికి తాము పుట్టింది మొదలు ఈ జనన మరణ చక్రాల నుంచి బయటపడడమే పరమార్థంగా భావిస్తారు. ఒకసారి మానవ జన్మ ఎత్తిన తర్వాత ముక్తిని చేరుకోవడమే సర్వోత్కృష్టంగా నమ్ముతారు. కుటుంబం, వృత్తి, వ్యాపారం ఇలా మిగతా అన్ని అంశాలు జీవితంలో ఒక భాగం మాత్రమే, అసలు లక్ష్యం మాత్రం ముక్తే. ఇక్కడి సంస్కృతిలో సంగీతం, నాట్యం లాంటి కళలు వినోదం కోసమే కాదు ఆధ్యాత్మిక సాధనలో కూడా ఇవి భాగం. శాస్త్రీయ సంగీతంలోని శబ్దాలు, స్వరాలు, రాగాలు వీటిలో మీరు మమేకం అయితే అవే మిమ్మల్ని ధ్యానావస్థలోకి తీసుకువెళతాయి. నాట్యం కూడా వినోదానికి కాదు. భంగిమ ముద్ర సరిగా ఉంటే అవి కూడా ధ్యానావస్థలోకి తీసుకువెళతాయి. శాస్త్రీయ సంగీతంలో పూర్తిగా మునిగిపోయిన వారిని చూస్తే వారు ఒక సాధువులా కనిపిస్తారు. సంగీతం అతనిని ధ్యానావస్థలోకి తీసుకువెళుతుంది కాబట్టే ఆయన ఒక యోగిలా అవుతాడు.

సంగీతం అంటే కేవలం వినోదం కోసం కనిపెట్టినది కాదు. మనిషి చేసే ప్రతి పని అతనిని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేర్చే ప్రక్రియ. నిలబడడం, కూర్చోవడం, తినడం అన్నీ ఒక సాధనే. మీరు వినగలిగితే మొత్తం సృష్టి అంతా సంగీతమే. మీ శరీరం కూడా ఒక సంగీతమే. అంతా సంగీతమే, ఎందుకంటే ఈ జగత్తు అంతా ఒక స్పందనే. స్పందన ఎక్కడ ఉంటే అక్కడ ధ్వని ఉండి తీరుతుంది. మొత్తం సృష్టి అంతా ఈ శబ్దాల సమ్మేళనం. ఈ ధ్వనులను మామూలుగా వింటే కర్ణ కఠోరంగా ఉంటాయి. ఇవే ధ్వనులను వినాల్సిన విధంగా వింటే అద్భుతమైన సంగీతంగా, శ్రవణానందంగా ఉంటాయి. ధ్వని సంపూర్ణత తెలియని వారికి ఇది ఒక శబ్దం. ఎందుకంటే అతను వినేది ముక్కలుగానే కాబట్టి. సృష్టి సంపూర్ణత తెలిసిన వారికి సంగీతం కానిది ఏదీ లేదు. మీరు వినగలిగితే, ఈ శరీరమే మధుర సంగీతంగా స్పందిస్తున్నది.

ధ్వని అంటే? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం ధ్వనిని కొలిచే పరికరంలోకి ధ్వనిని ప్రవేశపెడితే పౌనఃపున్యం, కంపన పరిమితిని బట్టి ఒక రూపం ఏర్పడుతుంది. అంటే ప్రతి ధ్వనికి ఒక రూపం, అలాగే ప్రతి రూపానికి ఒక ధ్వని ఉంటుంది. ఈ విశ్వం అంతా శక్తి యొక్క ప్రకంపనలే అని నేటి సాంకేతిక శాస్త్రం నిరూపిస్తున్నది. అరవై, డెభ్బై సంవత్సరాల క్రితం వరకూ సృష్టిని ఒక పదార్థంగా పరిగణించారు, కాని ఇప్పుడు కాదు. ఆధునిక శాస్త్ర రీత్యా పదార్థం అనేది లేదు. అది కేవలం 'ఉన్నట్లు అనిపిస్తుంది' అంటున్నది. చివరకు యదార్థమేమిటంటే సృష్టి అంటే ఒక ప్రకంపన. ప్రకంపన ఎక్కడ ఉంటే అక్కడ ధ్వని ఉంటుంది. అందుకే యోగాలో మనం సృష్టి అంతా శబ్దమే అంటాము. దాన్నే మనము నాదబ్రహ్మ అంటాము. అంటే సృష్టి, సృష్టికర్త అంతా శబ్దమే అని అర్థం.

శబ్ద తరంగాలు వినలేమా? అంతా ధ్వని రూపంలో సంక్షిప్తమై ఉంటే మరి నేను ఎందుకు వినలేకపోతున్నాను అన్నదే కదా మీ ప్రశ్న? మీరు వినలేరు. ఎందుకంటే మీ చెవులకు ఉన్న శబ్దగ్రహణ శక్తి చాలా పరిమితమైనది. మీ గ్రహణ శక్తికి తక్కువ లేదా ఎక్కువ పౌనఃపున్యంతో ఉన్న శబ్దాలను మీరు వినలేరు. ఉదాహరణకు రేడియో ప్రసారాలకు సంబంధించిన శబ్ద తరంగాలు అంతటా ఉంటాయి. కాని మీరు వాటిని నేరుగా గ్రహించలేరు. ఈ విశ్వమంతా ధ్వని స్వరూపమే. అయితే మీ గ్రహణశక్తి చాలా పరిమితంగా ఉండడంతో ఆ శబ్దాలను వినలేకపోతున్నారు. మీరు యోగాలో పట్టుసాధించి "రితంబర ప్రజ్ఞ'' స్థాయికి చేరుకున్నప్పుడు ఏ వస్తువును చూసినా, ఆ రూపంలో నిక్షిప్తమై ఉన్న శబ్దాన్ని వినగలుగుతారు.

అంశీభూతాలే సప్తస్వరాలు ఏ ఏడు ప్రాథమిక అంశీభూతాలతో మానవ శరీరం నిర్మితమైందో వాటికి సంబంధించిన ధ్వనులే సప్తస్వరాలుగా నేడు ప్రపంచంలో సంగీతానికి మూలాలయ్యాయి. అయితే సంగీతాన్ని రూపొందించే వారికి ఈ అనుభూతి కలగకపోవచ్చు. కాని సంగీతంలో మీరు నిమగ్నమైనప్పుడు, సప్తస్వరాలు మానవ శరీరంలోని ఏడ అంశీభూతాల పరిధిలోకి వస్తాయని తెలుసుకుంటారు. ఇక మానవ శరీరంలోని ఏడు చక్రాలు సృష్టిలోని ప్రాథమిక అంశీభూతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. చక్రాలంటే శక్తి ప్రసరణ వ్యవస్థలో ఒక రకమైన కూడలి ప్రదేశాలని అర్థం. అంటే ట్రాఫిక్ సిగ్నల్ లాంటివి అన్నమాట. ఒక్కో చక్రాన్ని ఓ పెద్ద కూడలిగా భావించవచ్చు. సాధకుడు తనలో తాను పరిపూర్ణంగా శాంత చిత్తుడైనపుడు తన శరీరాన్నే ధ్వనిగా అనుభూతి చెందవచ్చు. సంగీతానికి మూలమైన సప్తస్వరాలు ఇలాంటి దశలోనే రూపొందించబడ్డాయి. యోగలో సృష్టి అంతా ఈ సప్తస్వరాల సమ్మేళనమే అంటాము. అందుకే యోగ, సంగీతమూ రెంటికీ సంబంధమూ ఉన్నదని అంటాము. ం సద్గురు

1 వ్యాఖ్యలు:

Unknown April 6, 2020 at 1:17 AM  

Chala మంచి ఆధ్యాత్మిక విశయాన్ని చెప్పారు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP