ఏదీ మీరు కాదు
>> Thursday, September 13, 2012
ఏదీ మీరు కాదు
ద్వైతం అంటే ఏమిటని నన్ను చాలా మంది అడుగుతుంటారు. ఈ ప్రశ్నను మీరు అడుగుతున్నారంటే అది ద్వైతస్థితే. ఎందుకంటే, ఇక్కడ మీరు-నేను అని ఇద్దరం ఉన్నాం కనుక. ఈ ద్వంద్వంత్వం ఉన్నది కనుకనే ప్రశ్న... దానికి జవాబు సాధ్యం. మీరు మిమ్మల్ని, నన్ను కూడా చూస్తున్నారు కనుకనే అసలు ఈ ప్రశ్న సాధ్యం. ఈ ప్రశ్నకు మీకు నచ్చిన రీతిలో నేను జవాబివ్వకపోతే, ఆ జవాబుతో మీరు బాధపడతారు. ప్రతి సంబంధంలోనూ ఇలానే ఉంటుంది. మీరు ఆశించిన రీతిలో ఇతరులు ప్రవర్తించకపోతే మీరు బాధపడతారు. ఫ్రెంచి తత్వవేత్త జీన్ పాల్ సార్త్రే ఈ విషయాన్నే 'ఇతరం అనేది ఓ నరకం' అన్నారు.
కుటుంబం రక్షాకవచం
మీరు యోగ స్థితిలో ఉంటే తప్ప- 'ఈ నరకం' అనేది తప్పించుకోలేరు. యోగం అంటే అన్నీ ఒకటిగా అయిపోవడమే. ఈ నరకం తక్కువగా ఉంటుందా లేక హెచ్చుగా ఉంటుందా అనేది జీవితాన్ని మీరు నడిపించే సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. అంతేకాని బాధ అనేది పూర్తిగా తప్పించుకోలేనిది, ఎందుకంటే "ఇతరమంతా ఓ నరకం'' కనుక. ఈ కారణంగానే మనుషులు తమకు రక్షణ కవచాలను నిర్మించుకుంటున్నారు.
ప్రపంచంలో కుటుంబం అనేది చాలా ప్రధానమైన వ్యవస్థగా రూపుదిద్దుకోవడానికి ఇదే కారణం. అది చాలా భద్రమైన గూడు కావడమే. మీరు ఎంత ఎక్కువగా అభద్రతతో ఉంటే మీ కుటుంబం అంత ఎక్కువ విలువైనది అవుతుంది. ఇతరులను తప్పించుకోవడం కోసం మన మనసుల్లో, హృదయాంతరాలలో లెక్కకు మించిన గోడలను ఏర్పరుచుకొని మన కుటుంబ వ్యవస్థను చాలా కట్టుదిట్టంగా, పటిష్టంగా ఏర్పరచుకొన్నాం. మీరు లోతుగా ఆలోచించినట్లయితే కుటుంబంలో కూడా, మిగతావాళ్లంతా ఇతరులే కదా. వెలుపలి నుంచి సమస్య ఎదురైనప్పుడు అందరూ ఒక్కటవుతారు. సమస్య మన కుటుంబానికే పరిమితమైనప్పుడు మనమంతా ఒకరికొకరం ఇతరులమే.
నాది అనుకుంటేనే సమస్య
చాలాసార్లు సమస్యలే మనుషులను ఏకం చేస్తాయి. సమస్యలు పట్టించుకోవడం మొదలుపెడితే ఇక వారి సమస్యలకు అంతే ఉండదు. సమస్యలకు మీరు ప్రాధాన్యం ఇవ్వటం ప్రారంభించారంటే, మీకు తెలియకుండానే మీరు సమస్యలను సృష్టించుకుంటూ పోతారు. పరిమితమైన మీ 'దేహాన్నే' మీరుగా భావించడం వల్లే(ఈ దేహంతో మీరు తాదాత్మ్యం చెందడం వల్లే) మీకు సమస్య ఎదురైంది.
ఏ మాత్రం పరిజ్ఞానం ఉన్న వాళ్లెవరైనా దేహం ఈ భూమికి చెందినదని మళ్లీ మళ్లీ అది ఇలా పుడుతూ, మరణిస్తూ ఉంటుందని తెలుసుకుంటారు. 'నాది' అని మీరు అనుకుంటున్నదంతా ఎప్పుడూ వచ్చి, పోతూ ఉంటుంది. ఈ పునరావృతిని మీరు ఆపలేరు. మీరు మరణించే ఆఖరి క్షణంలోనే కాదు, ప్రతి క్షణమూ ఈ దేహంలో ఏదో మారుతూనే ఉంటుంది. మీరు ఈ దేహాన్ని అంటిపెట్టుకుని ఉండడం సాధ్యం కాదు. ఈ విషయాన్ని కేవలం మానసికంగానే తెలుసుకోవడం కాకుండా, అసలు వాస్తవాన్ని మీరు గ్రహించగలిగితే సహజంగానే ఈ దేహమే మీరు అని అనుకోరు.
జీవితం పునరావృతం
ఇలా నిరంతరం వచ్చి పోయే వాటిని మీకు ఆపాదించుకోగలిగినపుడు ఈ భూగోళం మొత్తం మీరే అని అనుకోవడంలో సమస్య ఏమిటి? ప్రతిదీ పునరావృతమయ్యేటప్పుడు ఈ మొత్తం విశ్వం అంతా మీరే అని ఎందుకు అనుకోరాదు? జీవితం ఎప్పుడూ పునరావృతిగా సాగుతుంటుంది. ఇదంతా నిరంతరం సాగే ప్రక్రియ. ఇదంతా పునరావృతమయమని ఓ అనుభవపూర్వకంగా మీరు గమనించగలినట్లయితే 'నేను' అని మీరు అనుకునే ఈ జీవితశక్తి, 'నేను' అని అనుకునే ఈ దేహం, 'నేను' అని అనుకునే ఈ మనస్సు, ఇవన్నీ పునరావృతిగా సాగుతూనే ఉంటాయి. అటువంటప్పుడు మీరు దేనిని ఆపాదించుకోగలరు?
ద్వంద్వం మిథ్య
మీరు అసలు ఏ ఆనవాలు లేకుండా ఉండండి లేదా ప్రతిదీ మీరుగానే భావించండి. మీరు రూపులేకుండా శూన్యం అవండి, లేక అనంతం అవండి. అంతేకాని మధ్యస్తం ఓ పెద్ద అబద్ధం. అదే ద్వంద్వ ప్రవృత్తి కల్పించే మాయ. శూన్యంలో ద్వంద్వం లేదు. అలాగే అనంతంలోనూ ద్వంద్వత్వం లేదు. సున్నాను మీరు తయారు చేయలేదు. అది కనుగొనబడింది. అలాగే అనంతం కూడా మీ సృష్టి కాదు. అది కూడా కనుగొనబడింది. అందువల్ల ద్వంద్వమనేది పెద్ద అబద్ధం(మిథ్య).
దీనిని మీరు పరిశోధించాలనుకుంటే కొన్ని రోజులపాటు ఆహారం మానివేయండి. అప్పుడు మీ దేహం నుంచి బయటకు పోయేదేమిటో మీరు గమనించగలుగుతారు. నెమ్మదిగా మీరు నీరసించిపోతారు. మీరు శరీరాన్ని శిథిలం చేయనక్కరలేదు.నాశనం చేయనక్కరలేదు. తెలివితేటలతో అర్థం చేసుకోగలిగింది కాదు ఈ శరీరం. ఈ దేహం మీరు ఎక్కిన మరో వాహనం అని మీరు అనుభవంతో గ్రహించగలిగినప్పుడు ఈ జీవితం ఒక ఆట అని, ఆడటాని కి సంకోచించవలసిన అవసరం లేదని తెలుసుకుంటారు. హాయిగా ఆడుకుంటారు.
- సద్గురు
0 వ్యాఖ్యలు:
Post a Comment