మహర్షి మహితబోధ!
>> Sunday, September 9, 2012
మహర్షి మహితబోధ!
భగవద్వాణి చతురోక్తి, లోకజ్ఞత, సద్యస్ఫురణ, బోధ, సూచన, హెచ్చరిక, స్పష్టత, తాత్విక చింతన, స్వీయానుభవం, హాసం హాస్యం, అలతి మాటలలో అనల్పభావన, వాత్సల్యము, యిముడ్చుకున్న నిత్య స్మరణీయ, నిరంతర మననీయ భావసంపద మానవీయ దృష్టి...కలబోసుకున్న పదరమ్యత మహర్షివాక్కు.
ఎందరో మహానుభావులు. అందరికీ వందనం అనటం అలవాటయిన వారితో భగవాన్ "అందరూ వేరు, తాను వేరు అనుకోవటం అజ్ఞానమే. అంతా, అందరూ ఒక్కటే అనుకోగలిగితే అది జ్ఞానమే'' అన్నారు.
వస్తువు పోయిందనుకుని వెదకటం ప్రారంభిస్తాం. దొరకక విసుగు చెందుతాం. వస్తువు దొరకగానే, దొరికిందని సంబరపడతాం. ఇంతకీ పోయింది వస్తువా? అది ఎక్కడున్నదో అక్కడే ఉంది. జారిపోయింది మన జ్ఞాపకమే.
కాకులు, కుక్కలు, కోతులు, అంతెందుకు సమస్త జంతువులూ సాధనలో ఉన్నవే. ఆ సాధనంతా మానవ జన్మ కోసమే. దాని ద్వారా దైవదర్శనం కోసం. విచిత్రమేమంటే మానవజన్మ పొందిన తర్వాత భగవంతుణ్ణి నమ్మటం మానేస్తాం.
ఇదీ నారాయణసేవే...
ఇంటి ముంగిట రంగువల్లులు తీర్చిదిద్దటంలో ఒక కళ ఉన్నది. ముగ్గువేయటం ప్రజ్ఞ. అది వేసినవారికి తృప్తినీ, చూస్తున్నవారికీ కనువిందుని కలిగిస్తుంది. అసలు విషయం అది కాదు. బియ్యపు పిండిలో వేసే ముగ్గు క్రిమికీటకాదులకు ఆహారం. అంటే నిద్రలేస్తూనే నారాయణసేవ ప్రారంభమన్నమాట.
ఎవరో దోచుకు వెళ్లారనీ, వారు దొంగలేనని ఎందుకు బాధపడటం? ఇన్నాళ్లు వస్తువులను మన దగ్గర ఉండనిచ్చినందుకు ఆనందంగా ఉండాలి. మన ఆస్తి అనుకుంటున్న మన దేహాన్ని, మనని దొంగిలించుకుని యముడు వెళ్తుంటే ఎప్పుడైనా, ఎవరికైనా ఫిర్యాదు చేశామా? ఇన్నాళ్లుంచినందుకు ఇప్పటికైనా తీసుకువెళ్లినందుకు ఆయనకు కృతజ్ఞతలు! ఎవరూ దొంగిలించలేని ఆత్మే మనం కదా? చఅందరూ మనకు నమస్కరిస్తున్నారంటే, వారికి మన నమస్కారాలు ముందే అందినయ్యన్నమాట.
జ్ఞానికి జాతకాలు ఉండవు గ్రహస్థితులన్నిటినీ దాటి, భగవదనుగ్రహాన్ని మిగుల్చుకున్న జ్ఞానికి రాబట్టుకొనటం, పోగొట్టుకోవటమంటూ ఏమీ లేదు. ఉండటమే ఉన్న స్థితి. అదే సహజస్థితి.
అక్షరజ్ఞాన మెరుగనివాడు, మతి స్థిమితం లేనివాడు, ఏమీ తోచనివాడు, ఏవేవో చేస్తుంటాడు. ఎందుకు చేస్తున్నావని అడిగితే 'ఏమీ లేదు' అంటాడు. 'ఏమీ లేదు' అనుకోవటమే తెలిసినతనం.
కట్టెకు కట్టె ఆసరానా?
శరీరం స్వస్థత కోల్పోయినపుడు, నడవలేని స్థితి ఏర్పడినపుడు, కర్ర ఆధారంతో నడుస్తాం. అంటే కట్టెకు, కట్టె ఆధారమన్నమాట. ఇంతకీ ఈ రెండు కట్టెలనూ నడిపిస్తున్న ఆత్మ సంగతేమిటి?
చదేహమనే పూరిగుడిసెలో, ఆత్మ అనే ఏనుగును కట్టినట్లే, దేహంలో జరిగే కదలికలు, మెదలికలు అన్నీ ఆత్మవే. దేహం తనంత తానుగా కదలగలగదా?
అందరం విగ్రహారాధకులమే. శరీరమూ విగ్రహమే. ఎందుకని మనం దానికి స్నానం చేయిస్తున్నాం, బట్టలు తొడుగుతున్నాం, అలంకారం చేస్తున్నాం? అవసరం కనుక, ఆనందాన్నిస్తుంది కనుక! విగ్రహారాధన అంతే! విగ్రహాన్ని రాయిగా భావిస్తున్నవారు, ఎప్పుడైనా తమ దేహాన్ని తోలుబొమ్మ అనుకోగలిగారా?
అచ్చుకాక ముందున్నది కాగితమే. అద్దిన తర్వాత అక్షరాలు కనపడుతున్నాయి. అంతే! కాగితం ఎక్కడికి పోయింది? కనపడుతున్న దేహంలో వున్నదీ, ఆత్మే!
దొంగలకు దొంగతనం వృత్తి. దొంగతనమంటే బయలుదేరే ముందు, వస్తువులు దొరకాలలని, తామెవరికీ దొరకకూడదని దేవుడికి మ్రొక్కుకుని, దొరికిన దానిలో కొంత దేవుడికిస్తామంటారు. ఇస్తారు కూడా. దొరలుగా చెలామణి అయ్యేవారు దొరికినది దోచుకుంటారు. మ్రొక్కుతారు. కానీ మొక్కు చెల్లించరు. దైవాన్నైనా సరే అడగటం దీనత్వం కదా!
నది మధ్యలో ఉండి, దాహం దాహం అంటూ కేకలు వేయటం ఎంత అవివేకం! ఉన్నదంతా అనుగ్రహమే అయినపుడు మళ్లీ మళ్లీ అడగటం అవసరమా?
మనిషి మరణించినపుడు పోయినాడంటున్నారు. ఎక్కడికి వెళ్లాడనుకుంటున్నారంటే, జవాబు లేద. వాడు వచ్చిందీ లేదు, ఎక్కడికో వెళ్లిందీ లేదు. ఉండటమే నిజం. అదొక స్థితి అంతే!
శాస్త్రమంటే జ్ఞాపకమే
పండితులకు శాస్త్రాలు అక్కరలేదు. పామరులకు అవి అర్థం కావు. అవి తెలుసుకోవాలనకునేవారి ఆసక్తిని తీరుస్తయ్. అంతే! ఆచరణకు నోచని శాస్త్రాలు ఎవరికి అక్కరకొస్తాయ్? శాస్త్రమంటే జ్ఞాపకమే!
వెలుగుకి చీకటికి అతీతమైనది బ్రహ్మము. మనమనుకంటే అవి ఉన్నయ్. గమనించటం ఆపేస్తే మనవరకు అవి లేవ. ఉన్నది బ్రహ్మమే.
సంయమనమున్న వాడే సమన్వయం చేయగలడు. సంఘర్షణ అంటే సమన్వయం లేకపోవటమే.
కూచున్నవాణ్ణి తానే తీసుకువెళ్తున్నట్లు పల్లకీ, తెరచాప కొయ్యమీద వాలిన పక్షి, తాన పడవను నడిపిస్తున్నాం అంటూ ఎంతగా భ్రమపడుతుంటయ్యో, మానవుడు కూడా అన్నీ తానే చేస్తూన్నట్లు అహంకరిస్తుంటాడు. మోస్తున్న బోయీలు, నడుపుతున్న సరంగులు, చేస్తున్నా ననుకుంటున్నవాడు గమనించవలసినదొక్కటే! చేయిస్తున్న వాడు ఒకడున్నాడని!
సన్యాసం స్వీకరించటమంటూ ఉన్నదా? సన్యాసిగా ఉండటం ప్రధానం. భగవాన్ రమణుల వాక్కులన్నీ శుద్ధ చైతన్యం నుండి వెలువడినవే. అహం తొలగితే అంతా స్పష్టం. అహం స్ఫురణ కలిగితే అంతా విస్పష్టం.
- వి.యస్.ఆర్. మూర్తి
ఆధ్యాత్మిక శాస్త్రవేత్త
[from andhrajyothy.daily
0 వ్యాఖ్యలు:
Post a Comment