శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఆదిత్య హృదయం లో అద్భుత రహస్యాలు

>> Friday, May 11, 2018

ఇది మిత్రులు శ్రీమాన్ రాయపెద్ది అప్పాశేషశాస్రి గారి అత్యద్భుతమైన విశ్లేషాత్మక రచన. కాదు పరిశోధన వ్యాసం.
ఇది ఆద్యంతము చదివి మిత్రులందరూ ఆదిత్య హృదయ పారాయణ లోని పూర్తి విశేష్యాంశములు తెలుసుకోనదరుగాక !!
ఆదిత్య హృదయ స్తోత్రము--ఒక శ్రీరాయపెద్ది అప్పా శేష శాస్త్రి ,సౌజన్యంతో-
మన మహర్షులు ద్రష్టలు (seers). ’కవి’ అన్న శబ్దం వారి పట్ల సార్థకమైనది.వ్యాస, వాల్మీకి మహర్షులు కేవలం తపశ్చర్యలకు, ఆత్మోద్ధరణకే పరిమితము కాకుండా సమస్త మానవాళికి ధర్మపథాన్ని చూపించేవి, మానవజాతిని ఉద్ధరించగలిగేవి అయిన పురాణేతిహాసాలను రచించి మనలనందరినీ అనుగ్రహించారు. ఈ పురాణేతిహాసాలను కేవలం కథను తెలుసుకోవడానికే ఎవరూ చదవరు. యుద్ధంలో పాండవులు గెలిచారా, లేక కౌరవులు గెలిచారా అన్న ఉత్కంఠతో గానీ, ఆంజనేయుడు సీతను కనుగొన గలిగాడా లేదా, రామ రావణ యుద్ధంలో ఎవరు గెలిచారు అన్న ఉత్కంఠతో గానీ, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను అన్వేషిస్తూ గానీ ఎవ్వరూ పురాణాలను చదవరు
మహర్షుల దృష్టిలో ఉత్కంఠ అన్నది చాలా క్షుద్రమైన విషయం. కనుకనే పాఠకులు ఉత్తమమైన ధర్మ సంగ్రహదృష్టితో పురాణసాహిత్యాన్ని చదివేలాగా జాగ్రత్త తీసుకొని, కథను పూర్తిగా ముందుగా వివరించి ఆతరువాత మిగతా రచనకు ఉపక్రమించారు.అలాకాకుండా, కథ ఎలా సాగుతుంది అన్న దృష్టితోనే వీనిని చదవడం జరిగిఉంటే, ఈపురాణేతిహాసాలు ఎప్పుడో అంతరించి ఉండేవి.
రాశీభూతమైన వేదసంపద మానవరూపాన్ని ధరించి అవతరించిన శ్రీరామచంద్రుని చరిత్రను రామాయణ కావ్యంగా రచించిన వాల్మీకి మహర్షిగానీ, శ్రీకృష్ణరూపం ధరించి మన మధ్య నడయాడిన పరబ్రహ్మతత్వాన్నిమహా భాగవత పురాణంగా గ్రంథ రూపంలో మనకందించిన వ్యాస భగవానులు గానీ మహత్తర ప్రయోజనాన్నిఆశించి రామాయణ, భారత, భాగవతాది పురాణాలను రచించారు. కలియుగంలోని అల్పఙ్ఞులు, అల్పాయుష్కులు, మందబుద్ధులైన సామాన్యప్రజానీకానికి కూడా వేదాలను, ఉపనిషత్తులను అర్థమయ్యేరీతిలో మిత్రసమ్మితంగా తెలియచేస్తూ, ఆదర్శ జీవనవిధానాన్ని, ఆదర్శ మానవ సంబంధాలను ప్రబోధిస్తూ, క్రమంగా సామాన్యులను కూడా ఆధ్యాత్మిక పథంలో పయనింపజేయడమే మహర్షిశ్రేష్టులైన పురాణకర్తల పరమోద్దేశ్యం.
వేదమంత్రాలను సస్వరంగా, సుస్వరంగా, అర్థ ఙ్ఞానంకలిగి ఉచ్చరించగలిగితే దేవతాశక్తులను ప్రసన్నం చేసుకోవడం అవశ్యం సాధ్యమే. కానీ ఆ శక్తి ఎంత మందికి ఉంటుంది? మరి మార్గాంతరం ఏమిటి? దైవానుహగ్రం సాధించడానికి పామర జనులకు కూడా సాధ్యమయ్యే పద్ధతి స్తోత్ర పారాయణం. వేదాంతర్గతమైన మంత్రాలని, వాని జీవ లక్షణాలైన బీజాక్షరాలతో అనుసంధానం చేస్తూ స్తోత్రాలను పురాణేతిహాసాలలో చేర్చడం జరిగింది. భారతాంతర్గతమైన సూర్య స్తోత్రము, దుర్గాస్తోత్రము, భీష్మునిచేత బోధిoచ బడిన శ్రీవిష్ణు సహస్రనామస్తోత్రము, శ్రీకృష్ణ ఉపమన్యు సంవాద రూపంలో లభించే శివసహస్రనామ స్తోత్రము, బ్రహ్మాండ పురాణ ములో హయగ్రీవ అగస్త్య సంవాదరూపంలో లభించే లలితాసహస్రనామ స్తోత్రము మొదలైనవి ఆధ్యాత్మిక రహస్య భాండాగారాలు; ఆధ్యాత్మిక ఔన్నత్యానికి చేర్చే సోపానాలు. ఈ కోవకు చెందినదే శ్రీమద్రామాయణాంతర్గతమైన ’ఆదిత్యహృదయ’ స్తోత్రరత్నము.
ఈ స్తోత్రాన్ని గూర్చి చెప్పుకొనేముందు ప్రాచీనకాలంనుంచీ ఆర్యావర్తంలోని సూర్యోపాసనగురించి చెప్పుకోవాలి. ఋగ్వేదంలొ 64సూక్తాలతో కూడిన మహాసౌరము, యజుర్వెదములోని అరుణప్రశ్న, అక్ష్యుపనిషత్తు, అథర్వణవేదంలోని సూర్యోపనిషత్తు ప్రధానంగా సూర్యవైభవాన్ని కీర్తించే మంత్రరత్నాలు. ఆంజనేయులవారికి శ్రీరామచంద్రులు ఉపదేశించిన మౌక్తికోపనిషత్తులో 108 ఉపనిషత్తులు పేర్కొనబడ్డాయి. అందులో ఈ అక్ష్యుపనిషత్తు, సూర్యోపనిషత్తులు 72, 73 స్థానాలలో పేర్కొనబడ్డాయి. ఇలా ఆర్యావర్తంలోఅత్యంత ప్రాచీన పరంపర సూర్యోపాసన.
శ్రీమద్రామాయణంలో యుద్ధకాండలో రావణుణ్ణి శీఘ్రంగా వధించమని ప్రబోధిస్తూ శ్రీరామునికి అగస్త్య మహర్షి ఉపదేశించిన స్తోత్రం ’ఆదిత్యహృదయము. సూర్యవంశ సంజాతుడైన శ్రీరామునికి తన వంశకర్త ఐన సూర్యభగవానుని గురించి చెప్పడం ఒక విశేషం. దీనికి రెండు స్థాయిలలో వివరణ ఇచ్చుకోవచ్చు. కేవలం ప్రాపంచిక దృష్టిచో చూచినట్లయితే, వంశంలోని మహా పురుషుల, వంశకర్తల గొప్పదనాన్నిగురించి చెప్పడం ద్వారా శ్రోతలో నూతన చైతన్యాన్ని, శక్తి యుక్తులను నింపి, బలమైన విజయకాంక్షను జాగృతం చేయడం ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. ఇంకా కొంచెం లోతుకు వెళ్ళి చూచినట్లైతే మార్మికమైన అర్థాలు గోచరిస్తాయి.
రావణునికి బ్రహ్మఇచ్చిన వరాలు నిజం కావాలంటే శ్రీరామచంద్రుడు తాను శ్రీమహావిష్ణువునన్న ఎరుక కలిగినట్లు ఉండరాదు. అప్పుడే నరులు వానరుల చేత మాత్రమే రావణుడు మరణించగలడన్న బ్రహ్మ పలుకులు సత్యమవుతాయి. అందుకే రామాయణమంతటా శ్రీరాముడు తనను తాను దశరథాత్మజునిగా మాత్రమే చెప్పుకొంటాడు. ఆంజనేయుడు, నారదుడు, వశిష్టుడు, విశ్వామిత్రుడు, భరద్వాజుడు మొదలైనవారు పరబ్రహ్మతత్వం మానవ రూపం ధరించి శ్రీరామునిగా అవతరించిందని ప్రస్తుతించారే గానీ రాముడూ మాత్రం " మాం దశరథాత్మజం విద్ధి" అని వినమ్రంగా, చల్లగాపలుకుతాడు.
ద్వాదశాదిత్యస్వరూపుడూ,మార్తాండమండలాంతర్గతుడైన శ్రీమహావిష్ణువు చైతన్యాన్ని రామునిలో రగుల్కొల్పడానికి అగస్త్య మహర్షి చేసిన ప్రబోధమే ఆదిత్య హృదయస్తొత్రము. తన సేవకులైన జయ, విజయులను అనుగ్రహించడానికి, మరియు సనక సనందనాదుల వాక్కులు నిజం చేయడానికి అవతరించిన మహావిష్ణుస్వరూపమే గదా శ్రీరాముడు? బాహ్యాకాశంలో సూర్యునిగానూ, అంతరాకాశంలో నారాయణుడుగానూ ప్రకాశిస్తున్నశ్రీసూర్యనారాయణుని స్తొత్రం చేయడంద్వారా విష్ణుసన్నిధిలో, విష్ణు స్తొత్రము చేసే అవకాశం పొందిన ధన్యుడు అగస్త్యుడు.
ఆకాశం ఆకాశం లాగానే ఉన్నట్లు సముద్రం సముద్రం లాగానే ఉన్నట్లు రామ రావణ యుద్ధం, రామ రావణ యుద్ధం లాగానే ఉన్నదని అంటాడు వాల్మీకి మహర్షి. అంత భీకర సంగ్రామాన్ని పోల్చడానికి ఉపమానాలు లేవు మరి. ఆ యుద్ధాన్ని తిలకించడానికి దేవతాగణాలతో సహా విచ్చేస్తాడు అగస్త్య మహర్షి. శ్రీరాముని లో విష్ణు చైతన్య స్ఫురణ రగుల్కొల్పవలసిన అవసరాన్ని గుర్తించి శ్రీరాముని సమీపానికి చేరి రావణ వధా కార్య క్రమాన్ని శీఘ్రంగా పూర్తి చేయ వలసిన సమయం ఆసన్నమయిందని చెపుతూ, అగస్త్యుడు ఇలా అంటాడు. "మహాబాహుడవైన శ్రీరామచంద్రా, ఇప్పుడు నేను చెప్పే ఈ గుహ్యమైన, సనాతనమైన సర్వశత్రు సంహారకమైన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని విను. (’ముమ్మార్లు ఆచమనం చేసి శుద్ధుడవై దీన్ని జపించు) దీన్ని జపించిన తరువాత సర్వశత్రువులను సమరంలో సులభంగా జయించవచ్చు". అగస్త్య మహర్షి ఈ పలుకులతో ఆదిత్య హృదయస్తోత్రము ఆరంభమౌతుంది.
మూడవ శ్లోకము ’ ఏనసర్వానరీన్ వత్సా సమరే విజయిష్యసి’ అనీ నాలుగవ శ్లోకం ప్రారంభo లో ’ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం’ అనీ వరుసగారెండు మార్లు శత్రు నాశన ప్రస్తావన రావడం గమనార్హం. రెండు మార్లు శత్రు నాశనం అని చెప్పడం అంతఃశత్రు, మరియూ బహిఃశత్రు వినాశనాన్ని సూచిస్తున్నది. పాపాచరణ, పాపాచరణ సంకల్పం రెండూ కూడా సమానమైనవే. పాపాచరణకు బీజం పాపాచరణ సంకల్పం.
పాపాచరణ సంకల్పం అంతఃశత్రువులైన అరిషడ్వర్గము ప్రేరణతో జరుగుతున్నది. అంతశ్శత్రు (అరిషడ్వర్గము) నిర్మూలనం ద్వారా పాపసంకల్ప నిర్మూలనం జరుగుతుంది. తద్వారా పాప కార్యాచరణ అంతమౌతుంది. ఫలితంగా పుణ్యం మాత్రమే మిగులుతుంది. .ఈ సూచన ’ఆదిత్య హృదయం పుణ్యం’ అన్న మాటల్లో కనిపిస్తుంది.
ఆదిత్య’ శబ్ద వ్యుత్పత్తిలోనే "అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత:" అని చెప్పబడిన విష్ణు స్వరూప వివరణ ఉన్నది." ఆదత్తే భాసేతి" అంటే తాను వెలుగుతూ అన్నింటినీ ప్రకాశింపచేశేవాడు. ఈ పద్ధతిలో వివరణ ఇస్తే బహిరాకాశంలో ప్రకాశించే సూర్యుడు స్ఫురిస్తాడు. "ఆదత్తే రసాన్" అన్న పద్ధతిలో వివరణ ఇస్తే అన్ని రసాలను స్వీకరించేవాడు అని అర్థము. ఈ ప్రకారంగా చూస్తే అంతరాకాశంలో ప్రకాశించే నారాయణుడని అర్థం వస్తుంది. రెండింటి కలయికే సూర్య నారాయణ తత్వం. బాహ్యాకాశంలోని సూర్యుడు మంచి ఆరోగ్యాన్నీ, మంచి చూపునూ ప్రసాదిస్తే, అంతరాకాశంలోని సూర్యుడు మానసిక శాంతినీ ఉత్తేజాన్నీ కలిగిస్తాడు.
’ఐదవ శ్లోకంలో "చింతా శోక ప్రశామనం ఆయుర్వర్ధనముత్తమం" అన్న మాటలు కూడా లోతుగా ఆలోచింపదగినవి. ఆధునిక వైద్య శాస్త్రం ప్రాణాంతకమైన రక్త పోటు, గుండె నొప్పి, మధు మేహం వంటి వ్యాధులకు కారణం ప్రధానంగా ఆందోళన, ఒత్తిళ్ళు, చింతలు అని చెపుతుంది. చింతలను, శోకాన్ని నశింపజేస్తే ఆయుష్షు వృద్ధి చెందుతుంది ఆదిత్య హృదయ పారాయణ ద్వారా పొందగలిగిన ప్రాపంచిక ప్రయోజనాల్లో ఇది కూడా అతి ముఖ్యమైనది. అందుకే "ఆరోగ్యం భాస్కరాదిఛ్ఛేత్" అని ఆర్యోక్తి. అత్యంత తీవ్రమైన వ్యాధులను కూడా వేదోక్తమైన అరుణపారాయణద్వారా నశింపచేసుకోవచ్చున్నది ఎందరికో అనుభవంలోని విషయమే. మయూర మహా కవి "సూర్య శతకం" అన్న అత్యంత క్లిష్టపదగుంభనతో కూడిన సుందరమైన రచనద్వారా కుష్టు వ్యాధిని నశింపచేసుకొన్న విషయం ప్రసిద్ధమైనది. ఇలాంటి కఠినమైన అనుష్ఠానాలను అందరమూ చేయలేము కదా? అందుకే సూర్యోపాసనకు సామాన్యులకు కూడా అందుబాటులో ఉన్న సులభమైన మార్గంగా ఆదిత్య హృదయ పారాయణ చెప్పబడింది.
దేవాసురుల ఛెత నమస్కరింప బడే భువనేశ్వరుడు, ప్రకాశసముపేతుడైన వివస్వంతుని పూజింపుమన్న ప్రబోధం ఆరవ శ్లోకం లోని విషయం. ఏడవ శ్లోకంలో అతనే సర్వదేవాత్మకుడు, తేజోవంతుడు మరియు తన కిరణజాలంచేత సర్వులనూ కాపాడేవాడు అని చెప్పబడుతున్నది. ఈ శ్లోకం నుంచే శ్రీ మహావిష్ణుస్వరూపుడైన సర్వాంతర్యామిత్వాన్ని గురించిన విస్తృతమైన వివరణ ప్రారంభమవుతున్నది.
దేవశబ్దానికి దానాత్, ద్యోతనాత్ దేవా: ఇతి అన్న రీతిగా వివరించుకొంటే అన్నింటినీ ఇచ్చేవారు, మరియూ అన్నింటినీ వెలిగించే (ప్రకాశింపచేసే) వారు అన్న అర్థాలు వస్తాయి. జగచ్చక్షువై సమస్తాన్ని దర్శింపజేసే పరమాత్మమరియూ సకల చరాచర జీవ, నిర్జీవ ప్రపంచానికి సృష్టికర్త కూడా ఆసూర్యభగవానుడే కదా? Big Bang అని చెప్పబడే మహా విస్ఫోటనపరిణామ ఫలితంగా తారామండలాలు, గ్రహ గోళాల రూపకల్పన ఆరంభమై నిరంతరంగా కొనసాగుతున్న ప్రక్రియ ఫలితమే మన సౌరకుటుంబంలోని గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు, గ్రహశకలాలు, ఉల్కలు వంటి నభోమూర్తుల (astronomical bodies) ఆవిర్భావం. ఈ మహావిస్ఫోటన ఫలితంగ విపరీతమైన వెగంతో విరజిమ్మబడిన పదార్థం (ద్రవ్య రాశి) క్రమంగా ఘనీభవించి నక్షత్రాలు మరియు భూమ్యాది గ్రహాలుగా ఆవిర్భవించింది. కనుకనే "దానాత్ దేవాః" అన్న అర్థంతో అన్నింటినీ ఇచ్చే(సృష్టించే) దేవతాస్వరూపుల అంతర్యామి సూర్యభగవానుడు అన్న వివరణ చక్కగా సరిపోతుంది.
ఎనిమిద్, తొమ్మిదవ శ్లోకాలలొ బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులు, కుమారస్వామి, ప్రజాపతులు, మహేంద్రుడు, కుబేరుడు, యముడు,సోముడు, వరుణుడు, వసువులు, అశ్వినులు, మరుద్గణాలు, మనువులు, వాయువులు,అగ్ని వీరందరి స్వరూపుడూ సూర్యభగవానుడే. అలాగే ఋతువులకు కారకుడు సూర్యుడే అని కూడా చెప్పడం జరిగింది.
సూర్యుడి నుండీ వేయి కిరణాలు వెలువడుతున్నవి. అవి మూడు రకాలుగా ప్రసరిస్తున్నాయి. 400 కిరణాలు, (ఒక్కొక్కటీ 80కిరణాలు కలిగిన 5గుత్తులుగా) ఊర్ధ్వ ముఖంగా ప్రసరిస్తున్నాయి. ఇవి వర్ష, శరదృతువులకు కారణమవుతున్నాయి, (ఒక్కొక్కటీ 150 కిరణాలు కలిగిన రెండు గుత్తులుగా ప్రసరిస్తూ) 300కిరణాలు వసంత, గ్రీష్మ ఋతువులను కలిగిస్తున్నాయి. అధోముఖంగా ప్రసరిస్తూ (ఒక్కొక్కటీ 150 కిరణాలు కలిగిన రెండు గుత్తులుగా) 300కిరణాలు హేమంత, శిశిర ఋతువులను కలిగిస్తున్నాయి. ఈవిధంగా సనాతన సంప్రదాయం ప్రకారం భాస్కరుడు ఋతుకర్తగా చెప్పబడుతున్నాడు.
ఆధునిక శాస్త్రీయ వివరణననుసరించి, భూమి అక్షము నిటారుగా కాకుండా 23 డిగ్రీలు ఏటవాలుగా ఉండటంవల్ల,ఏటవాలుగా పడుతున్న సూర్య కిరణాలు ఋతువులను కలిగిస్తున్నాయి. ఈవిధంగా ప్రభాకరుడు ఋతుకర్త అవుతున్నాడు. సహస్రార్చి, సహస్రాంశు మొదలైన నామాల్లో మనం చర్చించుకొన్న సూర్యుని ఋతుకారకాలైన సహస్ర కిరణాల ప్రస్తావన ద్యొతకమవుతుంది.
పదకొండవ శ్లోకంలోని ‘మార్తాండ’ శబ్దం విశేషార్థాన్ని సూచించేదీ, మరియూ మన ప్రాచీన ఋషుల వైఙ్ఞానిక అవగాహనకు అద్దం పట్టేది. ’మృతండస్య అపత్యం పుమాన్ ఇతి మార్త్తండః" అని అర్థమ్ చేప్పుకోవాలి. మృతండః అన్నది ఒక ఋషి పేరుగానో, ఒక దేవుని పేరుగానో అర్థం చెప్పుకోవడంకన్నా, మహా విస్ఫోటన (Big Bang) వల్ల (రూపాంతరం చెందటమన్న) మృతిని పొందిన ఆది మహా అండం అని చెప్పుకోవడము సముచితంగా ఉంటుంది. ఇంతక ముందు వివరించినట్లు సకల నక్షత్ర గణాల ఆవిర్భావానికి కారణం ఈ ఆది మహా విస్ఫోటనమే. దీన్నే మన పెద్దలు "ఏకుడనుగా ఉన్న నేను అనేకుడను అగుదును గాక" అన్న సంకల్పము పరబ్రహ్మములో ఉదయించడముగా ఉపనిషత్తుల్లో వివరించారు.
సువర్ణ సదృశః, తప్తచామీకరాభః, పింగళః అన్న నామాల్లో సూర్యుని అరుణ వర్ణం అనగా కరిగిన బంగారు వర్ణం ప్రస్తావించ బడుతున్నది. ఏమిటీ ఈ అరుణ వర్ణం ప్రత్యేకత?సృ సృష్టి కి పూర్వం శుద్ధ సత్వ రూపుడుగా ఉన్నప్పుడు పరబ్రహ్మ రూపం ధవళ వర్ణంతో శోభిల్లుతుంటుంది. సృష్టిగా పరిణామం చెందినపుడు, అరుణ వర్ణుడవుతున్నాడు. అరుణ వర్ణం రజోగుణాన్ని సూచించేది. రజోగుణం సృష్టికి కారణం కనుకనే సృష్టికారకుడుగా అరుణవర్ణశోభితుడైన సూర్య భగవానుడు, సకలవర్ణ సమ్మిశ్రణమైన శ్వేతవర్ణంతో కూడా దర్శనమిస్తున్నాడు. మారుతున్న (అంటే పరిణామశీలమైన) జగత్తుగా ఉంటూనే దాని అంతర్యామిగా నిశ్చలమైన మార్పులేని తత్వంగా పరమాత్మ ఉంటాడని గ్రహించవలసిన సత్యం.
యజురారణ్యకం తృతీయ ప్రపాఠకం లోని చిత్తి పన్నం లో"ఏకో అశ్వో వహతి సప్త నామాః" అన్న మంత్ర్ం కూడా ఇదే భావాన్ని తెలియచేస్తుంది. "జ్యోతిర్గణానాం పతయే దినాధి పతయే నమః" అన్నది 18వ శ్లోకంలోని మొదటి పాదం. ఇందులోని "జ్యోతిర్గణానాం పతి" అన్నది విశేషం గా ఆలోచింపచేసే నామం. మనకు కనిపించే అన్ని కాంతి రూపాలకూ ఆయనే అధిపతి. జ్యోతి అంటే చీకటిని తొలగించేది. ఙ్ఞానం ఉదయిస్తే అఙ్ఞాన తిమిరం నశిస్తుంది. ఙ్ఞానం అనేకాంతికి ఆయనే అధినాధుడు. అలాగే మనం రాత్రిసమయంలో చీకటిని తొలగించుకోవడానికి ఉపయోగించే అన్ని రకాలైన దీపాలకూ అవసరమైన ఇంధన రూపమైన శక్తి సూర్యుని నుంచే లభిస్తుంది.
విద్యుచ్చక్తి, అన్ని రకాలైన ఇంధన తైలాలు, బాటరీలరూపంలో లభిస్తున్న రసాయన పరివర్తిత విద్యుత్తు ఇలా ఏ రకాలైన ఇంధనాలు గానీ, బొగ్గు మొదలైన శిలాజ ఇంధనాలుగానీ అన్నీ భూమి, సూర్యునినుండి స్వీకరించి, నిలువ చేసుకొని, మనకు అందిస్తున్న శక్తి రూపాలే. సంప్రదాయేతర ఇంధన వనరులైన సౌర శక్తి, వాయు శక్తి, తరంగ శక్తి, భూకేంద్రం వద్ద ఉన్న ఉష్ణంతో ఉత్పాదన చేయబడే శక్తి వంటి అన్ని శక్తిరూపాలకూ సూర్యుడే ఆధారము. అంతవరకూ ఎందుకు? భూమి మీద ప్రసరిస్తున్న సూర్య కాంతిని నిలువచేసుకోగలిగిన విద్యుచ్చక్తి గా మార్చుకోగలిగితే, ఒక్క రోజు భూమి మీద పడె సూర్య కాంతిని శక్తిగా మార్చుకొని, ఉపయోగించుకోగలిగితే కొన్ని లక్షల సంవత్సరాల వరకు విద్యుత్ కొరత లేకుండా జీవించగలము. అన్నమయ్య అన్నట్లు "నీ వలన కొరతే లేదు, నీరు కొలది తామరవు". భగవంతుడు మన మీద నిరంతరం ప్రసరిస్తున్న కరుణకు గానీ, శక్తికి గానీ కొరతే లేదు. దాన్ని గ్రహించగలిగే, స్వీకరించగలిగే సామర్థ్యాన్ని మనం సాధించగలిగితే ఎల్లెడలా దైవ భావనే విలసిల్లుతుంది.
’ఆదిత్య’ శబ్దానికి చెప్పుకోదగిన ఇంకొక అర్థమైన "అదితేః పుత్రః" (అదితియొక్క కుమారుడు) అన్న పలుకులు పన్నెండవ శ్లోకంలో ప్రస్తావించ బడుతున్నది. "ఋగ్యజుస్సమ పారగః" అన్న నామాన్ని 13వ శ్లోకంలో చెపుతున్నాడు అగస్త్యుడు. "వేదాశ్చ క్రతవశ్చైవ" అన్న భావన 24వ శ్లోకంలో కనిపిస్తుంది. దీనిని గురించి కొంత సవివరంగా చర్చించుకోవాలి. సూర్యోపనిషత్తు లోని 4వ మంత్రం
"నమస్తే ఆదిత్య
త్మమేవ ప్రత్యక్షం బ్రహ్మకర్తాసి, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి
త్మమేవ ప్రత్యక్షం విష్ణురసి, త్వమేవం ప్రత్యక్షం రుద్రోసి
త్మమేవ ప్రత్యక్షమృగసి,
త్మమేవ ప్రత్యక్షం యజురసి
త్మమేవ ప్రత్యక్షం సామసి
త్మమేవ ప్రత్యక్షం అధర్వసి
త్మమేవ ప్రత్యక్షం ఛందోసి
ఈ మంత్రం శ్రీ సూర్యభగవానుని త్రిమూర్తిత్వాన్ని, చతుర్వేదస్వరూపత్వాన్ని నిర్ద్వంద్వంగా నిరూపిస్తున్నది. కవి, విశ్వ అనే నామాలు 14వ శ్లోకంలో కనిపిస్తాయి. విష్ణుసహస్ర నామాల్లో కూడా కనిపించే ఈ నామాలు సూర్యనారాయణస్వామికి విష్ణువుకు అభేదమన్న విషయాన్ని చెబుతున్నాయి.
సర్వ భవోధ్బవ, విశ్వ భావనః అన్న నామాల్లో సూర్యుని నుండి సకల విశ్వం ఆవిర్భవించిందన్న సత్యం తెలియ జేయడం జరిగింది. ఇదే విషయాన్ని సూర్యోపనిషత్తులోని ఐదవ మంత్రం ఇలా చెబుతున్నది
"ఆదిత్యాద్వాయుర్జాయతే
ఆదిత్యాద్భుమిర్జాయతే
ఆదిత్యాదాపో్జాయంతే
ఆదిత్యాద్జోతిర్జాయతే
ఆదిత్యాద్వ్యోమ దిశోర్జాయంతే
ఆదిత్యాద్దేవో జాయంతే
ఆదిత్యాద్వేదార్జాయంతే" అలాగే సూర్యోపనిషత్తు లోని తొమ్మిదవ మంత్రము ఏమి చెబుతున్నదో చూద్దాము
"సూర్యాద్భవంతి భూతాని
సూర్యేన పాలితానిచ
సూర్యే లయం ప్రాప్నువంతి
యస్సూర్యోస్సోహమేవచ"
ఆదిత్య హృదయంలోని 23వ శ్లోకంలో సూర్యున్ని గూర్చి ఇలా చెప్పబడుతున్నది ;
"నాశయత్యేష వై భూతం, తదేవ సృజతి ప్రభుః, పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః"
అతనే నాశకుడు, అతనే మరలా దానినంతటినీ సృష్టిస్తున్నాడు. తన కిరణాలతో కాపాడే వాడూ, తపింప జేసేవాడూ అతనే. సృష్టి కర్తా, రక్షకుడూ, ప్రళయ కాలంలో సర్వాన్నీ హరించి లయం చేసేవాడూ అతనే అన్న భావం ఉపనిషన్మంత్రంలోనూ, ఆదిత్య హృదయశ్లోకం లోనూ ఏక రూపంగా కనిపిస్తుంది. అందుకే వేదాలలో, ఉపనిషత్తుల్లోనూ చేప్పబడిఒన విషయాలను సర్వజన గ్రాహ్యంగా పురాణేతిహాసాల్లో మునులు అందించారు అని మనము చెప్పుకొన్నాము.
నిద్రిస్తున్న సమయంలో కూడా సర్వ భూతాల (ప్ర్రాణీ కోటి)లోనూ తాను జాగృతుడై ఉండే ఆత్మస్వరూపుడు శ్రీ సూర్యనారాయణస్వామి అన్నై విషయం 23వ శ్లోకంలోని "ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్టితః" అన్న వాక్యంలో మనకు దర్శనమిస్తుంది. సృష్టిగా పరిణమించిన తరువాత సృష్టింప బడిన సకల పదార్థాలు జనన మరణాలు కలిగినవై పరిణామ శీలమైనవై ఉంటాయి. అట్టి సృష్టి తానే, అందులోని నిశ్చల పరిణామరహిత పరబ్రహ్మమూ తానే అయి ఉంటాడు శ్రీసూర్యనారాయణస్వామి అన్న బావన ఇందులో గోచరమౌతుంది.
"వేదాశ్చ" అన్న మాటను శ్రీ సూర్యనారాయణస్వామిని వేదస్వరూపునిగా నిరూపించే వివరణగా స్వీకరించాలి. దీన్నిగురించి ఇంతకు ముందే చెప్పుకొన్నాము. "క్రతవశ్చైవ"అంటే క్రతువులు కూడా అతనే "క్రతూనాం ఫలమేవచ" అంటే క్రతువులూ వాటి ఫలముగూడా అతనే అంటే క్రతువుల వలన పొందదగిన ఫలాలన్నీ ఆతని స్వరూపమే, అనగా క్రతువుల ద్వారా సాధించుకొనే దైవానుగ్రహ ప్రాప్తి అతని ద్వారానే లబిస్తుందని లేదా క్రతువుల ద్వారా పొందదగిన పరబ్రహ్మ గూడా సూర్యభగవానుడేనని దీని భావము.
క్రతువు అన్న మాటకు యఙ్ఞం అని అర్థం. ఆదిత్య మండలాంతర్వర్తి ఐన పరబ్రహ్మగా శీసూర్యనారాయణుడు లోక రక్షణార్థమై యఙ్ఞాలు (క్రతువులు) చేస్తున్నాదు. అవి బహిరాకాశంలో ప్రకాశిస్తున్న సూర్య స్వరూపుడుగా ఐదు, అలాగేఅంతరాకాశంలో ప్రకాశిస్తున్న ఆత్మస్వరూపుడుగా ఐదు. అవేవో చూద్దాము.
బహిరాకాశంలో ప్రకాశిస్తున్న సూర్యుడుగా చేస్తున్న పంచ క్రతువులు ఇవీ: ఆకాశమనే హోమగుండంలో తనను తాను హోమద్రవ్యంగా సమర్పించుకొంటూ, ప్రజ్వలిస్తూ ఉండటం మొదటి యఙ్ఞం. నీటీని హోమద్రవ్యంగా వ్రేల్చి ఆవిరిగా మార్చి భూమిపై వర్షంగా కురిపించడం రెందవ యఙ్ఞం.వర్షానికి తడిసిన భూమి తనలోని సారాన్ని హోమద్రవ్యంగా మార్చి పురుషుడు భుజించడానికి ఆహారంగా సమర్పిస్తుంది. ఇది మూడవ యఙ్ఞం. పురుషుడు తాను భుజించిన ఆహారాన్ని హోమద్రవ్యంగా సమర్పించి, బీజ రూపంలో స్త్రీకి సమర్పిస్తున్నాడు. ఇది నాల్గవ యఙ్జం. స్త్రీ తాను భుజించిన ఆహార సారాన్ని,పురుషుని నుంచి స్వీకరించిన బీజానికి హోమద్రవ్యంగా సమర్పించి బిడ్డగా తయారు చేసి బయటకు పంపుతున్నది. ఇద్ ఐదవ యఙ్ఞం. ఇలా ప్రాణి రూపంలో ఆత్మ బయలు వెడలుతున్నది.
అంతరాకాశంలో ప్రకాశిస్తున్న నారాయణ స్వరూపుడుగా చేస్తున్న యఙ్ఞాలు ఇక్కడనుంచీ ఆరంభమవుతాయి. ప్ర్రాపంచిక విషయాలను ఆహుతులుగా ఙ్ఞానేంద్రియాలకు సమర్పించుకొంటూ చేసే యఙ్ఞంద్వారా ప్రపంచ ఙ్ఞాన్నీ, ఆనందాన్నీ జీవునకు అందజేస్తున్నాడు. ఇలా ఙ్ఞానాన్ని పొందిన జీవుడు తన సుఖానికి కావలసిన ద్రవ్యాలను సమగ్రంగా సృష్టించుకొంటున్నాడు. ఇదే పర్జన్యం (పరిజనం రూపంలో) కొత్తగా తయరైన ప్రపంచం పంచేంద్రియాలకు ఆహారం అవుతున్నది. దానిని స్వీకరించుతున్న ప్రాణి ప్రపంచానికి ఆత్మ అవుతున్నాడు. ఈ ఆత్మ ప్రపంచాన్ని నిలబెడుతూ, అనుభవిస్తూ ఉన్నది.
ఈ జీవ, జగత్తుల యఙ్ఞం కోట్లాది సంవత్సరాలుగా కొన సాగుతున్నది. దీన్ని నిరంతరంగా జరుపుతున్న ఆత్మ, పరమాత్మ సూర్యుడే. అతడే యఙ్ఞము, పర్జన్యము, అన్నము, జీవుడూ మరియూ సర్వమున్నూ,
విష్ణు సహస్ర నామ స్తోత్రం లోని యఙ్ఞకృత్, యఙ్ఞభృత్, యఙ్ఞీ, యఙ్ఞాంగో, యఙ్ఞ సాధనః అన్న నామాలు, అలాగే లలితా సహస్ర నామ స్తోత్రంలోని యఙ్ఞ ప్రియా, యఙ్ఞకర్త్రీ అన్న నామాలు ఇదే భావాన్ని ధ్వనిస్తు న్నాయి.
24వ శ్లోకంలోని "యాని కృత్యాನಿ లోకేషు సర్వ ఏష రవి ప్రభుః" లోకములో ఏ ఏ కృత్యములైతే ఉన్నాయో, అవి అన్నీ రవిప్రభువే అన్న పాదం ఇదే భావాన్ని తెలియ జేస్తున్నది.
తాను సృష్టించి, పాలించిన లోకాన్ని ప్రళయ కాలమందు తనలోనే విలీనం చేసుకొంటాడు. "ఎవ్వనిచే జనించు, జగమెవ్వని లోపలనుండు, లీనమై ఎవ్వని యందు డిందు" అన్న భాగవత వాక్యం ఈభావాన్ని సూచించేదే. "భాస్వతే సర్వ భక్షాయ, రౌద్రాయ వపుషే నమః" అన్న వాక్యము 18వ శ్లోకములోని చివరి పాదం. సర్వమునూ భక్షించేవాదుగా మారిన సమయాన ప్రకాశవంతముగా ఉంటూ రుద్రుడుగా ఉండేవానికి నమస్కారమని దీని భావము. ఆశ్చర్యమేమిటంటే ఆధునిక ఖగోళ శాస్త్రం కూడా ఇదేవిషయాన్ని చెపుతున్నది.
సూర్యుని స్థాయిలో పదార్థ పరిమాణం కలిగిన నక్షత్రాలు తమలోని పదార్థంలొ అధిక భాగాన్ని విశ్వాంతరాళం లోనికి శక్తి రూపంలో విరజిమ్మిన తరువాత, ఆ నక్షత్రం అరుణ బృహత్తర (Red Giant)గా మారడం ఆరంభిస్తుంది. విస్తారంగా వ్యాకోచించడం ఆరంభించి అరుణ వర్ణాన్ని సంతరించుకొంటుంది. సూర్యగోళం వ్యాకోచం కొనసాగిస్తూ తనలోనుంచి వెలువడిన గ్రహగోళాలను, ఇతర నభోమూర్తులను తనలోనే లీనం చేసుకొటుంది. ఇది మన సౌరకుటుంబానికి ఆఖరిదశ.
ఈ వివరణ మన సనాతన భావనకెంత దగ్గరగా ఉందో గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మహర్షుల సర్వఙ్ఞత్వం మనకు అంతుచిక్కని నిబిడమైన రహస్యంగా భాసిస్తుంది.
అనంతకోటి బ్రహ్మాండాలు అన్న మాటకు అర్థం తెలియకుండా, మనము పూజాసమయంలో "అనంతకోటి బ్రహ్మాండ నాయకా" అని తేలికగా వాడేస్తున్నాము. కానీ లోతుగా ఆలోచిస్తే ఇది సముద్రం కన్నా లోతైన మాట. అత్యంత శక్తివంతమైన రేడియో టెలిస్కోపు లాంటి సాధనాలను ఉపయోగించి మనము గుర్తించగలిగిన భౌతిక ప్రపంచపుటంచులు 78వేల బిలియన్ల కాంతి సంవత్సరాలవరకు వ్యాపించి ఉన్నాయి. ఇందులో 78X1022 నక్షత్రాలు ఉండవచ్చని అంచనా. (కాంతి ఒక సెకనులో 1,86,00 మైళ్ళు ప్రయాణిస్తుంది. కనుక కాంతి సంవత్సరం అంటే 1,86,000x60x60x24x365 మైళ్ల దూరం) మరి 78వేల బిలియన్ల కాంతి సంవత్సరాల దూరము అనిఅంటే ఎంత దూరము అన్నది ఊహకు కూడా అందనంత విస్తారమైన దూరము
ఈ ప్రపంచపు ఆవలి అంచులో ఏమున్నది? ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయి? అన్న విషయాలు నేటికీ జవాబు దొరకని ప్రశ్నలే. ఈ నక్షత్ర బ్రహ్మాండాలన్నీ ఆదిత్య స్వరూపాలే. "లోకంబులు, లోకేశులు, లోకస్థులు తెగిన తుది పెంజీకటికవ్వల" వెలిగే పరతత్వాన్ని భావించారు ద్రష్టలైన మహర్షులు. "అనంతకోటి బ్రహ్మాండాలు" అన్నది విశ్వపు విస్త్రుతినీ, వైశాల్యాన్నీ, అనంతత్వాన్నీ తెలియజెప్పగలిగే బృహత్పదం, మహద్వాచకమైన శబ్దం.
ఈవిధంగా రామునికి ఆదిత్యహృదయ స్తోత్రాన్ని వినిపించిన తర్వాత అగస్త్యమహర్షి 25వ శ్లోకం నుంచీ ఫల శృతి చెపుతాడు. ఆపదల్లో, కష్టాల్లో, అరణ్యాల్లో, భయం కలిగిన సందర్భాల్లో ఎవ్వడైతే ఈ నామాలతో ఆదిత్య్ని కీర్తిస్తాడో, అతను వీటిని తేలికగా తప్పించుకోగలుగుతాడు (వీటిని పొందడు). ఏకాగ్రచిత్తుడవై, ఆ జగత్పతిని, దేవదేవుడైన సూర్యుని స్తోత్రం చేసే ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ముమ్మార్లు జపించు. తక్షణమే రావణుని వధింపగలవు అని పలికి అగస్త్య మహర్షి నిష్క్రమిస్తాడు.
అగస్త్యుని మాటలను విన్న శ్రీరాముడు పరమానంద భరితుడై, సూర్యుని చూచి ముమ్మార్లు ఆచమనం చేసి స్తోత్రాన్ని జపించాడు. ప్రమ తేజస్సును పొంది ధనుస్సును స్వీకరించాడు.మహత్తరమైన యత్నంతో రావణవధా కార్యక్రమంలో నిమగ్నమయ్యాడు.ఉపదేశించిన వాడు తపస్సంపన్నుడైన అగస్త్య మహర్షి గనుక, ఉపదేశం పొందిన వాడు అవతారపురుషుడైన శ్రీరామచంద్రుడు గనుకా తక్షణమే మంత్ర సిద్ధి లభించింది. పరమానందం చెందిన సూర్యభగవానుడు దేవతాగణ సమేతుడై దిగి వచ్చి, రావణునికి క్షయించే కాలం సమీపించిందనీ, త్వరగా రాక్షస సంహారం చెయ్యమనీ శ్రీరామునితో అనడంతో ఆదిత్య హృదయ స్తోత్రం ముగుస్తుంది.
ఉపోద్ఘాతంగా నాలుగు శ్లోకాలు, ఉపసంహారం రూపంగా ఏడు, మొత్తం పదకొండు శ్లోకాలు తీసివేసి చూస్తే 31లో 20 మాత్రమే స్తొత్రం యొక్క ప్రధాన పాఠంగా మిగులుతాయి. ఇరవై శ్లోకాల్లో ఉపనిషత్తుల, వేదముల సారభూతమైన పరతత్వాన్ని ఇమిడ్చి రచించడం మహర్షియైన వాల్మీకికే సాధ్యం. వేదవేద్యమైన పరబ్రహ్మ తత్వం శ్రీరాముడైతే, వేదరాశి నిలువెత్తు రూపం ధరించి వాల్మీకిమహర్షిగా అవతరించిందనిపిస్తుంది.
మంత్రాధిష్ఠాన దేవత సూర్య భగవానుడు సాక్షాత్కరించి కామితఫలాన్ని ప్రసాదించడం ఈ స్తోత్రంలోని మరొక ప్రధానమైన, విశేషమైన లక్షణం. ఇటువంటి లక్షణం కలిగిన, మంత్ర ప్రతిరూపాలైన స్తోత్రాలు శీఘ్ర ఫలదాయకాలని పెద్దలవలన వినిన మాట. దీనిని అనుష్ఠించి అందరమూ లబ్ధిని పొందాలని ఆకాంక్షిద్దాము
ఇతి శం

[జాజి శర్మ గారి ఫేస్బుక్ పోస్ట్ ]     

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP