ఇంద్రియనిగ్రహం ఎలా?
>> Wednesday, March 9, 2011
ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలని వుంది. ఎలాగో చెప్పండి?
- యహనా, జనగామ.
ముందుగా మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఒకటుంది. ఆధ్యాత్మిక జీవన పునాదులు మన లౌకిక జీవనం మీదే ఆధారపడి ఉన్నాయి. నేల విడిచిన సాము పనికి రాదు. మనిషి తన జీవనాన్ని మూడు విధాలుగా నడపడానికి చూస్తాడు. అంటే అతడి జీవన విధానం మూడింటిపై ఆధారపడుతుంది. మొదటిది- కనీసావసరాలు, తప్పనిసరి అయ్యేవి. అవే నెసిసిటీస్. రెండోది- ఉంటే బాగుంటుంది అనుకునేవి.అవే ఫెసిలిటీస్.
మూడోది-విలాసాన్ని కల్పించేవి. లగ్జరీస్. ఇంద్రియ నిగ్రహం లగ్జరీస్‌ను వదలడంతో ప్రారంభమవుతుంది. ఫెసిలిటీస్‌ని 'ఛీ' అనగలగడంతో ముగుస్తుంది. అంతేనా! అనడం సులభమే. ఆచరించడం కష్టం. ఎలాగైనా ఇంద్రియ నిగ్రహాన్ని సాధించాలనుకున్నవాడు మొదట తన లగ్జరీస్‌ను గుర్తించి వదిలివేస్తాడు. తరువాత ఫెసిలిటీస్‌ని క్రమంగా విడుస్తాడు. ఇంతవరకు వచ్చిన సాధకుడు చిత్తశుద్ధితో ఆలోచించి ఆ క్షణం వరకు నెసిసిటీ అనిపించిన వాటిలో కూడా ఫెసిలిటీస్, లగ్జరీస్ ఉన్నాయేమో అని పరిశీలించడం ప్రారంభించి అలా తోచిన వాటిని క్రమంగా విడవడం మళ్లీ ప్రారంభిస్తారు.
ఇలా తన జీవనవిధానంలోని సకల వ్యాపారాలను(కార్యాలను)ఎంత కనీస స్థాయిలో ఉంచితే సరిపోతుందో, ఆ స్థాయికి తీసుకొని రావాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. అంటే ఆ వ్యక్తి శరీరం ఆ కాలంలో, ఆ పర్యావరణంలో తన అయిదు జ్ఞానేంద్రియాలకి ఎంత 'ఆహారం'అందిస్తే అది నిలిచివుంటుందో అక్కడి వరకు చిత్తశుద్ధితో ప్రయత్నించి విజయం సాధించినవారు ఇంద్రియ నిగ్రహ పరాకాష్ఠకు చేరుకున్నట్లే. సమాజంలో కీర్తి ప్రతిష్ఠల కోసం కాకుండా, తనకోసమని, తన ఆత్మదర్శనం కోసమని చేస్తేనే దానిని ఇంద్రియ నిగ్రహ పరాకాష్ఠ అంటారు. లేకపోతే దానిని 'మిథ్యాచారం ' అంటారు. సంపూర్ణంగా ఇంద్రియ నిగ్రహ పరాకాష్ఠను సాధించాలంటే దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం కూడా సాధిస్తే ఆత్మ, పరమాత్మలను దర్శించి ధన్యుడవుతాడు.
[ఆంధ్రజ్యోతి నుండి]
0 వ్యాఖ్యలు:
Post a Comment