శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అన్నమయ్య పదసిరులు భక్తి భావ ఝరులు

>> Wednesday, May 22, 2013

అన్నమయ్య పదసిరులు భక్తి భావ ఝరులు

తాళ్లపాక అన్నమయ్య... శ్రీ వేంకటేశ్వరుని ఖడ్గమైన నందకాంశ సంభూతునిగా వినుతికెక్కిన భాగవతోత్తముడు. తెలుగు పాటను మహోన్నతంగా పల్లవింపజేసి శ్రీనివాసుని చరణారవిందాలకు భక్తి భావసుమాలుగా సమర్పించిన స్వామి ప్రియభక్తుడు, అవతార పురుషుడు.
కృతయుగంలో దానయోగ పరమగు జ్ఞానము చేతను, త్రేతాయుగంలో యజ్ఞం చేతనూ, ద్వాపరయుగంలో అర్చన చేతనూ ఏ ఫలాన్ని పొందుతారో ఆ ఫలాన్ని కలియుగంలో నామ సంకీర్తనతతో పొందగలరు.నవవిధ భ క్తిమార్గాల్లో అన్నమయ్య ఆత్మనివేదనా మార్గాన్నే ఎంచుకున్నాడు. విశిష్ఠాద్వైత ప్రవర్తకులైన శ్రీ భగవద్ రామానుజుల వారు ప్రపత్తి మార్గాన్ని లోకానికి ప్రబోదించారు. అన్నమాచార్యుల వారు రామానుజుల వారి సిద్ధాంతాన్నే అనుసరించి పునీతులైనారు. ఈయన పదాల్లో దీర్ఘ శరణాగత తత్వం ఎక్కువగా చోటుచేసుకుంది.
అన్నమయ్య నేటి కడప జిల్లా రాజంపేట తాలూకాకు చెందిన తాళ్లపాక గ్రామంలో లక్కమాంబ, నారాయణ సూరి దంపతులకుశ్రీ వేంకటేశ్వర వరప్రసాదంగా నందకాంశంతో కీ.శ. 1408న వైశాక మాసం, విశాఖా నక్షత్రాన జన్మించాడు. వీరిది పండిత వంశమని ప్రతీతి.ఈరు రుగ్వేద శాఖీయులు, అశ్వాలాయన సూత్రులు, భరద్వాజ గోత్రులు. వీరు స్శార్త బ్రాహ్మణులుఅన్నమాచార్యులు నందక (ఖడ్గం) అంశతో జన్మించినట్లు కథనం. తాను జన్మించిన 16 ఏళ్లకు తిరువేంగల నాథుడు ప్రత్యక్షమై, ఆ స్వామి ఆదేశానుసారం రోజుకొక్క సంకీర్త చొప్పున 32 వేల సంకీర్తనలు రచించి ఆ స్వామికే అంకితం చేసిన కారణజన్ముడు.
పన్నిద్దాళ్వరుల్లో ముఖ్యులైన నమ్మాళ్వరు (శఠకోపయతి)లకు, అన్నమాచార్యులకు అనేక విషయాల్లో సాదృశ్యం కనిపిస్తోంది.న మ్మాళ్వారు వేదసారాన్ని ద్రవిడ భాషలో చెబితే, అన్నమయ్య ఆంద్రంలో రంగరించాడు. ఇద్దరూ వైశాఖమాసం విశాఖ నక్షత్రంలో జన్మించడం, పదహారవ ఏటి నుంచి ఆయన ద్రావిడ కీర్తనలు, అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరునిపై పదాలు రచన ప్రారంభించడం... శఠకోపయతి కౌస్తుభాంశంతో జన్మిస్తే, అన్నమయ్య నందకాంశంతో జన్మించడం వీరువురికీ ఉన్న సాదృశ్యాలు. అన్నమయ్య అహోబిల మఠ జీయర్ అయిన ఆదివన్‌శఠకోపయతి వద్ద పన్నెండేళ్లువేదాంత రహస్యాలను, నాలాయిర దివ్య ప్రబంధ రహస్యాలను అద్యయనం చేశాడు.
అహోబిల నృసింహస్వామి తానే గురువై... త్రిడండమును, మంత్రమునుశఠగోపయతికి అనుగ్రహించి సన్యాసాశ్రమాన్ని స్వీకరింపచేసినాడు స్వామి.గురువు నృసింహోపాసకులు కనుక, ద్వాత్రిశాక్షరీ నృసింహ మంత్రము అన్నమయ్య స్వీకరించిన... అక్షరానికివేయి చొప్పున 32 లక్షరాలకు 32 వే సంకీర్తనలు రచించాడని చెప్పవచ్చు.
తన గురువైన శఠకోపయతి దొరముని యనియు, సకల ప్రాణకోటికి నిలువ నీడ కల్పించినవాడనిముక్తికి సోపానమని, విరజానదిని తరించడానికి నావ అని లోకులకుజ్ఞానదీపమని, పాపాలను కడిగి పరమాత్మ సన్నిధిని నింపే గురువనియు శ్రీ వైష్ణవులకు ముఖ్యమైన నాలుగు దివ్య క్షేత్రాలతో సంబంధం ఉన్నది. శ్రీరంగపతినికంబివరదునివేంకటాచలపతిని అహోబిల నృసింహుని మదిలో నిలుపుకుని మానవ కళ్యాణ యజ్ఞులు నిర్వహించిన తన గురువు శఠకోపయతి భక్తసులభుడని స్తుతించాడు అన్నమయ్య. శ్రీ వేంకటేశ్వర స్వామి , ఘనవిష్ణువనే యతికికలలో కనిపించి, అన్నమయ్యకు పంచ సంస్కారం చేయమని ఆదేశించాడు.
అన్నమయ్య ఆయన వద్ద పంచసంస్కారం పొందెను.అన్నమయ్య సంతతి వారందరూకవి, భక్తాగ్రేసరులై వర్థిల్లారు.అన్నయ్య కుమారుడైన పెద తిరుమలాచార్యులు కూడా కవి. విశేషించి పరమభక్తుడు. దాత.ఆయనకు శ్రీ మద్వేదమార్గ ప్రతిష్ఠాపనాచార్య', 'శ్రీ రామానుజ సిద్ధాంత స్థాపనాచార్య' ' వేదాంతాచార్య' అనే బిరుదులు ఉన్నాయి. ఈయన అన్నామాచార్య సంకీర్తనలన్నింటినీరాగిరేకుల మీద రాయించి, తిరుమల కొండపైన సంకీర్తనా భాండారంలో భద్రపరిచాడు. అన్నమయ్య వైష్ణవం స్వీకరించిందే తడవుగా, సంధ్యావందనం గురించి స్తుతించాడు. సహజ వైష్ణవాచారవర్తనులతో సఖ్యంగా ఉండటమే మా సంధ్య. నిత్యం విష్ణునామ సంకీర్తనాన్ని మనం చేయడం, భగవత్ రామానుజ వారి భక్తులను సేవించడం, లక్ష్మీవల్లభుని మహిమలను భక్తితో శ్రవణం చేయడమే మా సంధ్య అని నిత్యం తిరుమంత్రమను జపించి, చరమ శ్లోక, ద్వయార్థములు ఎరిగి తరించాడు అన్నమయ్య. అన్నమాచార్యుల వారు 95 సంవత్సరాలు జీవించి దుంధుభి నామ సంవత్సర ఫాల్గుణ బహుళ ద్వాదశి అనగా కీ.శ. 1503న పరమపదము చేరారు. - డా. సిహెచ్. మురళీకృష్ణారావు
శ్రీ వేంకటేశ్వరుని తత్వాన్ని, మాహాత్మ్యాన్ని, వైభవాన్ని, విలాసాన్ని తనదైన ఘనమైన శైలిలో ఆధ్యాత్మ, శృంగార సంకీర్తనలుగా పొందుపర్చిన స్తవనీయుడు. తన పదహారవ యేట శ్రీ వేంకటేశ్వరుని సాక్షాత్కారాన్ని పొందిన అన్నమయ్య, స్వామి ఆదేశంలో సంకీర్తనా రచనకు శ్రీకారం చుట్టి ఆ నాటి నుంచి తన జీవితాంతం వరకు రోజుకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా తన సంకీర్తనల రచనను సాగించిన సాహితీ హాలికుడు. భావ వైవిధ్యం, భాషా సౌందర్యం ఉత్కృష్టమై విరాజిల్లిన సాహిత్యం అన్నమయ్య సొంతం. తెలుగు పద సాహిత్యానికి అన్నమయ్య చేసిన సేవను ఎంత కొనియాడినా తక్కువే. పల్లవి, చరణాలతో కూడిన తెలుగు పాటకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన పద కవితా పితామహుడిగా, 32,000 సంకీర్తనలను లిఖించిన సాహితీ ప్రకాండునిగా అన్నమయ్యకు సాటి మరెవ్వరూ లేరు.
'వేంకట' పద ముద్రతో తన సంకీర్తనలను లిఖించిన ఈ వాగ్గేయ శిరోమణి, భాషా పటిమతో, భావ గరిమతో మహిమోపేతమైన సంకీర్తనలను సృజించాడు. అన్నమయ్య సంకీర్తనలు అణువణువునూ పులకింపజేసే ఆపాత మధురాలే కాదు, ప్రతి పదంలోనూ అనల్పమైన భావాన్ని నింపుకున్న ఆలోచనామృతాలు కూడా. భక్తి, సంగీత, సాహిత్య విలసిత త్రివేణి సంగమంలా అన్నమయ్య సంకీర్తనలు వాసికెక్కాయి.
వైవిధ్యభరితమైన సంకీర్తనలకు అన్నమయ్య సంకీర్తనలే నిజమైన చిరునామా. ఇదే, భావి వాగ్గేయకారులకు ఆయన అందమైన నమూనా. వారి సాహిత్య ధోరణికి వైవిధ్యం ఆవశ్యమని ఆయన రాసిన వీలునామా.. కవికి లేదా వాగ్గేయకారునికి ఒకే రకమైన బాణిలో కాకుండా, స్వేచ్ఛాయుతంగా రాసే ప్రాతిపదిక అవసరమని ఆరు శతాబ్దాలకు పూర్వమే ఎరిగిన సాహితీ మేధోనిధి అన్నమయ్య. భాషనే తీసుకుంటే అన్నమయ్య సంకీర్తనల్లో గ్రాంధిక సంకీర్తనలూ ఉన్నాయి, శిష్ట వ్యావహారికంలోనూ, పల్లె పట్టుల్లోని గ్రామీణలు పాడుకునే మధురమైన జానపదాలు ఉన్నాయి.
పండితులకే అర్థమయ్యే సంస్కృత సంకీర్తనలూ కోకొల్లలుగా ఉన్నాయి. అలతి పదాలతో అనల్ప భావాన్ని అనన్య సామాన్యంగా ప్రకటింపజేయడం అన్నమయ్యలో ఉన్న గొప్పదనం. 'వినరో భాగ్యము విష్ణు కథ' అంటూనే వెనుబలమిదివో విష్ణుకథ అంటూ మనలిన ముందుకు నడిపేది, వెన్నుదన్నుగా నిలిచేది విష్ణుభక్తి. ఆ చిరంతనునిపై ఉన్న ఆసక్తే సుమా అన్న విషయాన్ని భక్తి స్పోరకంగా ప్రకటిస్తాడు. అపారమైన విష్ణుభక్తి నిలయాలైన అన్నమయ్య సంకీర్తనలకు కేంద్ర స్థానం కలియుగ వైకుంఠమైన తిరుమలే! తన జీవితకాలంలో ఎన్నో వైష్ణవ క్షేత్రాలను సందర్శించిన అన్నమయ్య ఆ క్షేత్రాల ఘనతను తన సంకీర్తనల్లో అసమానమైన రీతిలో వెలయించాడు. అయితే, అన్నమయ్య ఏ దైవాన్ని తిలకించినా, భక్తితో పులకించినా ఆ మూర్తిని శ్రీ వేంకటేశ్వరునిగానే దర్శించాడు. ఆ స్వామిని తన 'వేంకట' పదమనే శక్తివంతమైన భక్తిపాశంతో బంధించాడు.
వేదాల సారాన్ని, భగవద్గీతామృత బోధనలను తన సంకీర్తనల్లో పొందుపర్చి మోక్షసాధకులకు అందంగా అందించాడు అన్నమయ్య. వేద వేదాంత వేద్యుడైన స్వామి వారి దశావతారాలను అన్నమయ్య ఎన్నో సంకీర్తనల్లో ఉటంకించాడు.
సంకీర్తనలో ప్రస్తావించిన చిన్న చిన్న పదాల్లోనే దశావతారాలు ప్రస్తావించబడి అన్నమయ్య కల్పనాశక్తికి అద్దం పడతాయి. శ్రీ వేంకటేశ్వరుని వేదమయునిగా, యజ్ఞమూర్తిగా, అభయదాయకునిగా ఎన్నో సంకీర్తనలు మనకు అన్నమయ్య సంకీర్తనా వారాశిలో లభ్యమవుతాయి. తన మధుర భావామృతంలో వెలువడిన జోలపాటలతో అన్నమయ్య స్వామికి లాలితమ్యం నిండిన పదాలతో లాలి పాడాడు. కోలాటం పాటలతోనూ శ్రీనివాసునిపై తనకున్న మోమాటం లేని ఆరాటాన్ని ప్రకటించాడు.
తిరుమల వైభవం అన్నమయ్య సంకీర్తనల్లో అగ్రగణ్యమైన రీతిలో భాసించింది. కట్టెదుర వైకుంఠము కాణాచైన కొండ. తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ అని తిరుమల కొండను చూసి పరవశించాడు. పదివేల పడగల మయమైన ఆ దివ్యధామాన్ని 'అదివో అల్లదివో శ్రీహరివాసమూ' అంటూ వినుతించాడు. వాడుక భాషకు సాహిత్య గౌరవాన్ని కట్టబెట్టి, భాష యొక్క నిజమైన అర్థాన్ని, పరమార్థాన్ని గుర్తించిన వాడు అన్నమయ్య. 'ఏలే ఏలే మరదలా' 'రావే రావే కోడలా' వంటి జానపద సంకీర్తనలు జనబాహుళ్యంలో ఎంతో ప్రచారాన్ని పొందాయి. జాజర పాటలతో సందడి చేసిన ఘనత అన్నమయ్యదే. 'పొదలె నిండు కళల పున్నమ నేడు. అదను తప్పక జాజరాడుదువు రావయ్యా ' "జగడపు చనవుల జాజర' వంటి పాటలు తెలుగు సాహితీ నందనంలో గుబాణించిన పారిజాత సుమాలు. శ్రీవారి బ్రహ్మోత్సవ సోయగాన్ని, తిరుమల ఆలయంలో జరిగే సేవల వైశిష్ట్యాన్ని అనన్య సామాన్యమైన రీతిలో అన్నమయ్య మన కనుల ముందుంచాడు. 'తిరువీధుల మెరసీ దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను' అంటూ శ్రీవారి బ్రహ్మోత్సవాలను అందులోని వాహన సేవలను లిఖించాడు. ఆదిశేష వాహనం, అశ్వవాహనం, ఇలా...విభిన్న వాహన సేవలను వేరు వేరుగానూ తన సంకీర్తనల్లో ప్రస్తావించాడు అన్నమయ్య. జీవాత్మ, పరమాత్మల ఐక్యాన్ని చాటే అమలిన శృంగారాన్నీ తన సంకీర్తనల్లో అందంగా పొందు పర్చాడు అన్నమయ్య.
ఇక అన్నమయ్య తత్వాలు జీవనరీతిని చాటే మహత్తత్వాలు. మానవులకుండే దురాశను అన్నమయ్య 'ఒడలి లోపలి రోగ మొనర పరితాపంబు కడుపు లోపలి పుండు కడలేని యాస' అంటూ వర్ణించి ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే చిన్న కడుపు కోసం పడని పాట్లనెల్లా పడే మానవులను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసే విధం మనకు ద్యోతకమవుతుంది. ' కడుపెంతతా కుడుచు కుడుపెంత దీనికై పడని పాట్ల నెల్ల పడి పొరలనేలా' అంటాడు. అలాగే మరో సంకీర్తనలో 'తెలియ చీకటికి దీపమ్తెక పెద్ద వెలుగు లోపలికి వెలుగేలా' అంటూ తత్వ బోధ చేస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే, అన్నమయ్య మధుర గీతికల్లోని స్నిగ్ధ మనోహరమైన భావవాహిని మన ముందు పరవళ్లతో నిరంత రంగా ప్రవహిస్తూనే ఉంటుంది. శ్రీనివాసునిపై భక్తి, తెలుగు భాషపై ఆసక్తి ఉన్నన్నాళ్లూ అన్నమయ్య సంకీర్తనలు శ్రీనివాసునికి హారతి పట్టి దివ్య దీపికల్లా వెలుగుతూనే ఉంటాయి. తెలుగు జాతిచే నిత్యమూ నవ్య నీరాజనాలు అందుకుంటూనే ఉంటాయి.
వ్యాఖ్యాన విశారద
వెంకట్ గరికపాటి
తాళ్లపాక పద సాహిత్య విశ్లేషకులు

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP