శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అమ్మ అనుగ్రహాన్ని సంపూర్ణంగా ప్రసాదించగల అష్టాదశ శక్తిపీఠాలు

>> Monday, December 27, 2010


అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకునే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుంది. శక్తిస్వరూపిణిగా భక్తుల కోరికలను నెరవేర్చే అమ్మవారిని అష్టాదశ శక్తిపీఠాల్లో దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం.

ఈ అష్టాదశ పీఠాలు ఎలా వెలశాయంటే..? పూర్వం అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి సతీదేవిరూపంలో ఉన్నప్పుడు తండ్రి దక్షుడు మహాయజ్ఞం తలపెట్టాడు. ఈ మహాయజ్ఞానికి ముల్లోకాల్లోని దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. కానీ ఇష్టంలేని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన కుమార్తె పార్వతీదేవిని, అల్లుడు పరమేశ్వరునిని ఆహ్వానించడు.

కానీ తండ్రి చేపట్టిన యజ్ఞానికి వెళ్లాలని ఈశ్వరునిని సతీదేవి వేడుకుంటుంది. అయితే పిలవని పేరంటానికి వెళ్లడానికి పార్వతీ పరమేశ్వరుడు అంగీకరించడు. కానీ పరమేశ్వరుని మాటను కాదని పుట్టింటిమీదిప్రేమతో వెళ్ళిన లోకమాతకు అక్కడ అవమానం ఎదురవగా ఆతల్లి యోగాగ్నితో తనశరీరాన్ని త్యజిస్తుంది. కోపంతో పరమేశ్వరుడు వీరభద్రుని సృష్టించి యజ్ఞధ్వంసం చేసి సతీదేవిశరీరాన్ని భుజానవేసుకుని ఉన్మత్తుని లా తిరుగుతూ ఉంటే సృష్టి శ్రేయస్సుకోసం చక్రి ఆశరీరాన్ని పద్దెనిమిది భాగాలుగా ఖండిస్తాడు.. ఆ శరీర భాగాలు భూలోకంలో 18 చోట్ల పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. అవే అష్టాదశ శక్తిపీఠాలుగా వెలశాయి.

అష్టాదశ పీఠాల్లో ప్రథమ పీఠం "శ్రీ శాంకరీ దేవి పీఠం" శ్రీలంకలో ఉందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ అమ్మవారి కాలి గజ్జెలు పడ్డాయని పండితులు అంటున్నారు. రావణుని స్తోత్రాలకు ప్రసన్నమైన పార్వతీదేవి లంకలో అవతరించింది. రావణుని సీతాపహరణ దోషం వల్ల ఆ తల్లి అంతర్ధానమైంది. రావణ సంహారానంతరం తిరిగి లంకలో మహర్షులు చేత ప్రతిష్ఠించబడింది. ఇదీ ఈ శక్తి పీఠం యొక్క పురాణగాథ.

శ్రీ పురుహుతికా దేవి:
అష్టాదశ శక్తి పీఠాల్లో రెండోది శ్రీ పురుహుతికా దేవి క్షేత్రం రాష్ట్రంలోని పిఠాపురంలో ఉంది. ఇక్కడ అమ్మవారి ఎడమ హస్తం పడిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. పూర్వం ఏలుడు అనే ఋషి గంగ కోసం శివుని గురించి తపస్సు చేసి, శివుని అనుగ్రహం పొందాడు. ఏలుని తపస్సుతో సంతృప్తి చెందిన పరమేశ్వరుడు తన జటాజూటంలోని గంగలోని ఒక పాయను వదిలిన శివుడు... వెనక్కి తిరిగి చూడకుండా పోయినంతసేపూ, గంగ వస్తుందని ఏలునితో చెప్పాడు.

కానీ శివుని అనుగ్రహానికి ఆనకట్టగా నిలవాలని ఇంద్రుడు కోడి పుంజులా మారి కూశాడు. ఏలుడు వెనక్కి చూశాడు. గంగ ఆగి అక్కడ ఏలానదిగా మారింది. శివుడు కుక్కుటేశ్వరుడుగా మారాడు. ఇక్కడ అపరకర్మలు చేస్తారని ఆలయ పండితులు చెబుతున్నారు.

శ్రీ శృంఖళా దేవి:
అష్టాదశ శక్తి పీఠాల్లో మూడోది శ్రీశృంఖలా దేవి క్షేత్రం. ఇది బెంగాల్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి ఉదర భాగం పడిందని చెబుతారు. త్రేతాయుగంలో ఋష్యశృంగమహర్షి దేవీ ఉపాసన చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాడు. ఆయన తపస్సు శృంగగిరిపై సాగింది. అక్కడ ప్రత్యక్షమైన శృంగదేవి శృంఖళా దేవిగా మారిందని ఒక గాథ. ఋష్యశృంగుని తపశ్శక్తితరంగాలను ఆది శంకరులు ఆవాహన చేసి శారదాపీఠాన్ని ఏర్పాటు చేశారని పురాణ గాథలు చెబుతున్నాయి.

ఇక అష్టదశ పీఠాల్లో ముఖ్యమైన శ్రీ చాముండేశ్వరీ దేవి పీఠం కర్ణాటకలోని మైసూర్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి శిరోజాలు పడినట్లు ఆలయ పురాణాల ద్వారా తెలిసింది. మహిషాసురుని సంహరించిన చాముండేశ్వరి సర్వదేవతల తేజస్సులతో ఆవిర్భించిన ప్రాంతం ఇదేనని చెబుతున్నారు. సముద్ర మట్టానికి 3500 కి.మీ ఎత్తున చాముండేశ్వరి కొండపై ఈ శక్తి పీఠం ఉంది. ఈ శక్తిపీఠంలోనే ప్రతి ఏడాది దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి.

అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదోది "శ్రీ కామాక్షీ దేవి" క్షేత్రం. ఇది తమిళనాడు, కాంచీపురంలో ఉంది. ఇక్కడ అమ్మవారి వీపు భాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి. కాత్యాయనమహర్షి తపస్సు చేసి గౌరీదేవిని కూతురుగా పొందాలని వరం కోరుకున్నాడు. కామాక్షి ఏకామ్రనాథుని అర్చించి కంచిలో వెలసిందని పండితులు చెబుతున్నారు.

ఇక అష్టాదశ పీఠాల్లో ఆరోది శ్రీ మహాలక్ష్మీ దేవి ఆలయం. ఈ పీఠం మహారాష్ట్రలోని కొల్హపూర్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి మూడు కళ్ళు పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి. మహాలక్ష్మి అంటేనే విష్ణుపత్ని లక్ష్మి అనుకో కూడదు. 18 భుజాలతో రజోగుణంతో విలసిల్లుతున్న మహాశక్తి పార్వతీదేవి అని పండితులు అంటున్నారు. ఇక్కడ అమ్మవారి పాదాలపై ఏడాదికి మూడుసార్లు సూర్యకిరణాలు పడతాయి. అలా సూర్యకిరణాలు పడే రోజులలో కిరణోత్సవాలు వైభవంగా జరుగుతాయి.

అలాగే ఏడో అష్టాదశ పీఠం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా అలంపురంలో ఉంది. ఇక్కడ అమ్మవారిని శ్రీ జోగులాంబా దేవి అని పిలుస్తారు. అమ్మవారి దంతపంక్తి పూర్వం హలంపురం అని పిలుపబడే అలంపురంలో పడిందని పండితులు చెబుతున్నారు. పంచారామక్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలానికి పశ్చిమ ద్వారంలో ఉన్న ఈ క్షేత్రంలో బ్రహ్మదేవుని ఆలయం కూడా ఉండటం విశేషం.
ఇదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌, శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికాదేవి ఆలయాన్ని ఎనిమిదో అష్టాదశ పీఠంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మ వారి మెడ భాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు గాయత్రీ జపంతో బ్రహ్మను ప్రసన్నం చేసుకోని, స్త్రీపురుషుల చేతిలో చావులేకుండా వరాన్ని పోందాడు. అందరిని హింసించడం మొదలుపెట్టాడు. గర్వంతో గాయత్రి మంత్రాన్ని విడిచిపెట్టాడు. దానితో అతడిలో స్త్రీ మోహం మొదలైంది. అప్పుడు అమ్మవారు. సౌందర్య దేవతగా ఆ రాక్షసుడికి ప్రత్యక్షమైంది. ఆ దేవి ముఖారవిందంపై వాలిన తుమ్మెదల గుంపు ఆ రాక్షసుడిపై దాడి చేయటంతో ఆ రాక్షసుడు మరణించాడు. ఆ తల్లి భ్రమరాంబికగా వెలసి, మల్లికార్జునుని వరించి శ్రీశైలంపై కొలువైందని పురాణాలు చెబుతున్నాయి.

అష్టాదశ శక్తి పీఠాల్లో తొమ్మిది శక్తి పీఠం ఒరిస్సాలోని వైతరణీ నదీతీరంలో వెలసింది. ఇక్కడ వెలసిన అమ్మవారిని శ్రీ గిరిజా దేవి అని పిలుస్తారు. ఒరిస్సాలో వైతరణీనదీతీరంలో జాజ్‌పూర్‌ రోడ్డుకు 20 కి. మీ.దూరంలో ఈ శక్తి పీఠం ఉంది. ఇది అమ్మవారి నాభి బాగం పడిన చోటుగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ గిరిజాదేవిని శ్వేతవరాహమూర్తి రూపంలో విష్ణుమూర్తి అర్చిస్తుంటాడు. సింహవాహణిగా దర్శనమిచ్చే గిరిజా దేవి, ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో మహిషాసురుని తోక పట్టుకుని ఉంటుంది. ఈమెను శక్తిత్రయరూపిణి కొలుస్తారని ఆలయ పురాణాలు చెబుతున్నాయి.

ఇక శ్రీ ఏకవీరా దేవి శక్తి పీఠం మహారాష్టల్రోని నాందేడ్‌ జిల్లా కేంద్రానికి 128 కి.మీ. దూరంలో దత్తాత్రేయుని జన్మక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మహోర్‌లో ఉంది. ఇది అమ్మవారి కూడి హస్తం పడిన చోటు. ఇక్కడ అమ్మవారి శిరస్సు మాత్రమే దర్శన మవుతుంది. ఇక్కడ మూడు కొండలు ఉన్నాయి. ఒక దానిపై అత్రి- అనసూయలు, రెండవ దానిపై దత్తాత్రేయుడు, మూడవ దానిపై ఏకవీరాదేవి ప్రతిష్ఠితిమయ్యారు. అమ్మవారి ముఖం గర్భాలయపుపై కప్పును తాకేంత పెద్దదిగా ఉంటుంది. జమదగ్ని రేణుఖా దంపతులకు చెందిన కథ ఇక్కడ జరిగిందని చెపుతారు. పరశురాముని చేత ఖండితమైన తల్లి శిరస్సే ఈ దేవత. ఈ తల్లినే ‘ఛిన్నమస్త’ అనికూడాఅంటారు.

అష్టాదశ శక్తిపీఠాల్లో 11వ శ్రీ మహంకాళీ దేవి క్షేత్రం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది. ఇది అమ్మవారి పై పెదవి పడిన చోటు. విక్రమార్క మహారాజు చరిత్ర ఉజ్జయినితో ముడిపడి ఉంది. ఇక్కడి నది సిప్ర. కుజునికి ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఆలయం ఉంది. భూమినుంచి కుజుడు విడిపోయిన ప్రాంత ఇదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కుజుడు అంటే భూమికి జన్మించిన వాడని అర్థం. ఇక్కడ త్రిపురాసురుణ్ని వధించిన మహాకాలుని ఆలయం ఉంది. ఆ స్వామికి ఆధారమైన శక్తి మహంకాళి. ఆ మహంకాళి శక్తి పీఠం ఇది.

శ్రీ మాధవేశ్వరీ దేవి పీఠం: ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌లో ఉంది. అమ్మవారి హస్తాంగుళి పడిన చోటుగా దీన్ని పిలుస్తారు. శక్తిత్రయస్వరూపిణి పీఠమైన ఈ ప్రాంతంలో బ్రహ్మదేవుడు ఇక్కడ వరుసగా ఎన్నో యాగాలు చేసినందున ప్రయాగ్‌గా మారింది. ఈమెను కృతియుగంలో బృహస్పతి అమృతంతో అభిషేకించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా ఈ క్షేత్రాన్ని అమృత తీర్థం అని అంటారు. త్రేతాయయుగంలో రాముడు, ద్వాపరంలో శ్రీకృష్ణుడు ఈ తల్లిని పూజించారని పండితులు చెబుతున్నారు. అలాగే సూర్యుడు పూజించడం వలన ఈ క్షేత్రాన్ని భాస్కరక్షేత్రం అని కూడా పిలుస్తారు.

శ్రీ సరస్వతీ దేవి శక్తి పీఠం: కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు 40 కి.మిదూరంలో ఉన్న ఈ క్షేత్రంలో అమ్మవారి దక్షిణ హస్తం పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ సరస్వతీ దేవీని కీరవాణి అని పిలు స్తారు. పార్వతీపరమేశ్వరులు విశ్వకర్మతో అందమైన ఇల్లు కట్టించుకుని గృహప్రవేశానికి సిద్దమౌతారు. శివభక్తుడైన రావణుని పురోహితునిగా నియమిస్తారు. గృహప్రవేశం పూర్తయిన తరువాత దక్షిణం కోరుకొమ్మంటుంది పార్వతీదేవి. ఆ ఇంటినే తనివ్వమంటాడు రావణుడు. ఆడిన మాట తప్పలేక ఇచ్చేస్తుంది పార్వతీదేవి. తన పుట్టింటికి బాధపడుతూ వెళుతుంది. దారిలో సరస్వతి కనిపించి తనను ఓదారుస్తుంది. వారిద్దరూ కలిసిన ప్రదేశమే ఈ శక్తి పీఠంగా వెలసిందని ఆలయ గాథలు చెబుతున్నాయి. ఈ ఆలయం చెరువులో ఉంటుంది.

శ్రీ కామరూపీ దేవి శక్తి పీఠం:
అస్సాం గౌహతి సమీపంలోని నీలాచలపర్వతశిఖరంపై ఈ శక్తిపీఠం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది ఆషాడమాసంలో స్రవించే జలధార ఎర్రగా మారుతుంది. అది స్ర్తీత్వానికి ప్రతీక అంటారు. పరశురాముని మాతృ హత్యాదోషాన్ని ఈ తల్లి పోగొట్టిందని, శివుని కంటి మంటకు దహనమైన మన్మథుణ్ని జీవింపచేసిన తల్లిగా ఈమె ప్రఖ్యాతి చెందిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ అమృతేశ్వర్‌, కోటిలింగ, సిద్ధేశ్వర, కామేశ్వర శివాలయాలున్నాయి.

శ్రీ మాంగల్యగౌరీ దేవి శక్తి పీఠం:
అమ్మవారి వక్షోజాలు ఇక్కడ పడ్డాయని చెబుతారు. ఈ పీఠం బీహార్‌లోని గయాలో ఉంది. తనను తాకిన ప్రతి జీవికీ మోక్షం వచ్చేలా విష్ణుమూర్తి వరం పొందిన గయాసురుడు పర్వతాకారంలో ఉన్న ప్రాంతమిది. గయాసురుడు శరీరాన్ని విపరీతంగా పెంచి అందరికీ మోక్షాన్ని ఇచ్చే సందర్భంలో, అతని శరీరం పెరగకుండా ధర్మవతశిలను అతని శిరస్సుపై ఉంచి, దాని పైకి విష్ణువును ఆవాహన చేసినట్లు ఒక పురాణగాథ ఉంది. విష్ణుమూర్తి సహోదరి అయిన మాంగల్యగౌరి ఈ క్షేత్రరూపిణి అని పండితులు చెబుతున్నారు. శ్రాద్ధకర్మలు ఇక్కడ ఎక్కువగా జరుగుతాయి.

శ్రీ మాణిక్యాంబా దేవి:
అష్టాదశ శక్తి పీఠాల్లో 16వ శక్తి పీఠమే ఆంధ్రప్రదేశ్‌లోని ద్రాక్షారామం. ఇక్కడ అమ్మవారిని శ్రీ మాణిక్యాంబా దేవిగా పిలుస్తారు. ఇది అమ్మవారి ఎడమ చెక్కిలి పడిన చోటుగా అభివర్ణిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ త్రిలింగం అనడానికి మూలమైనా త్రిలింగాలలో ద్రాక్షారామలింగం ఒకటి. ఆలయం లోపల గోడలకు రత్న దీపాలుండేవని ప్రతీతి. గర్భాలయంలోని చీకటి కోణాన్ని అవి వెలుతురుతో నింపేవని చెబుతారు. ఇది దాక్షాయణి ఆత్మాహుతి చేసుకున్న చోటని పురాణాలు చెబుతున్నాయి. ఈ శివాలయం పంచారామాలలో ఒకటి కావడం విశేషం.

అష్టాదశ శక్తి పీఠాల్లో 17వ క్షేత్రం పుణ్యక్షేత్రం కాశీలో ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో వెలసిన అమ్మవారిని శ్రీ విశాలాక్షీదేవిగా ప్రార్థిస్తారు. ఇది అమ్మవారి మణికర్ణిక పడిన చోటు. శివుని కన్నులు మూసి లోకాన్ని చీకటి చేసిన పాపానికి నల్లగా మారిన గౌరి, అన్నదానపుణ్యంతో తిరిగి బంగారు వర్ణంలోకి మారిన క్షేత్రం కాశి. వ్యాసునికి కడుపార భోజనం పెట్టిన తల్లి అన్నపూర్ణ తిరుగాడిన క్షేత్రం కాశిగా పురాణాలు చెబుతున్నాయి. హిమాలయాలపై ఉండడం ఇష్టం లేక తన కోసం అమ్మవారు నిర్మించుకున్న పట్టణం కాశిగా పరిగణించబడుతోంది.. శివుని వైభవాన్ని విశాల నేత్రాలతో చూసిన తల్లి శక్తిపీఠంగా వెలసినదే విశాలాక్షి పీఠమని పురాణాలు చెబుతున్నాయి.

ఇకపోతే.. అష్టాదశ శక్తి పీఠాల్లో చివరిది శ్రీ వైష్ణవి దేవీ క్షేత్రం. ఇది హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లో హిమపర్వతం నడమ పఠాన్‌కోటలో జ్వాలాముఖి రైల్వేస్టేషన్‌కు 20 కి.మి. దూరంలో ఈ శక్తి పీఠం ఉంది. అమ్మవారి శిరస్సు పడిన చోటుగా విరాజిల్లుతున్న శ్రీ వైష్ణవీ దేవి శక్తి పీఠం జమ్మూలో కాట్రాకు సమీపంలో ఉంది.

అష్టాదశ పీఠాల్లో పద్దెనిమింటిని దర్శించుకోవడం అసాధ్యం. అందుచేత అష్టాదశ పీఠాల్లో ఏదేని ఒక క్షేత్రాన్ని దర్శించుకున్నా 18 క్షేత్రాలు దర్శించుకున్న పుణ్యఫలం సిద్ధిస్తుందని పురోహితులు అంటున్నారు.

1 వ్యాఖ్యలు:

lakshman December 28, 2010 at 4:32 AM  

great article & very useful information to every one.

I am expecting these kind of post from you. We know so many gods but don't know the background.

Please write these kind of posts on all gods such that every one will get the background.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP