శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

చార్వాక హేతువాదాల జంతర్ మంతర్ లు

>> Wednesday, December 29, 2010

సమాజం యొక్క ఆథ్యాత్మిక అభ్యుదయానికి ఆథ్యాత్మికతతోపాటు హేతువాద నాస్తిక ,చార్వాక వాదాలుకూడా అవసరం .మనదేశంలో అనాదిగా ఈరెండువాదాలకు ఆదరణలభిస్తూనే ఉంటుంది . దశరథుడుచేసిన అశ్వమేథయాగంలో "కర్మాంతరే తదా విప్రా హేతువాదాన్ బహూనపిప్రాహుశ్చ వాగ్మినో ధీరా: పరస్పర జిగీషయా" మధ్యమధ్య యాగవిరామ సమయంలో పండితులైన విప్రులు ఒకరినొకరు ఓడించాలనే పట్టుదలతో [వినోదార్ధం ]హేతువాదాలుచేశారని వాల్మీకి వ్రాశాడు . ఆరోజుల్లో వినోదార్ధం చేసుకునే చదరంగం ఆటల్లాగా క్రాస్ వర్డ్ పజిల్ లాగా మెదడుకు మేతగా పనికొచ్చేవి ఈ యుక్తివాదాలు .

పూర్వం బృహస్పతి బోధించాడని కాదు,చార్వాకుడనేవాడు బోధించాడని చెప్పబడే ఈబుద్ధివాదానికి ప్రామాణికమైన గ్రంథం ప్రస్తుతం లభ్యంకావటంలేదు ..ఇతరదర్శనాల్లో చార్వాకాన్ని ఖందించడం కోసం చేసినవాదాల్లో లేకప్రస్తావనరూపములో మాత్రమే ఇదిమనకు దర్శనమిస్తుంది. . ఈబుధ్ధివాదం"పశుశ్చేన్నిహత స్వర్గం ! జ్యోతిష్టోమే గమిష్యతి ! స్వపితా యజమానేన!తత్ర కస్మాన్హింస్యతే " అంటే జ్యోతిష్టోమాది యాగాలతో చంపబడ్డ పశువు స్వర్గానికి పోతుంది అనికాదా మీరనేది ?అయితే అజమాని తనతండ్రినే యాగపశువుగా బలియిచ్చి నేరుగా స్వర్గానికి పంపవచ్చునే? అట్లా ఎందుకు చేయకూడదు ?] వంటి యుక్తివాదాలతో "యావజ్జీవం సుఖం జీవేత్ !ఋణం కృత్వా ఘృతం పిబేత్ !భస్మ భూతస్య దేహస్య ! పునరాగమనం కృతు " [బ్రతికినన్నాళ్ళూ సుఖంగా బ్రతకాలి . అప్పుచేసైనా నేతిభోజనాలు చేయాలి. ఇవన్నీ దేహమున్నంతవరకే కదా ! అదికాస్తా బూడిదైనాక మళ్ళీరవతం ఎక్కడ ? ] అంటు కమ్మని బోధలతో మనసును మభ్యపెట్టి ఇంద్రియలోలత్వానికి,విశృంఖల జీవనానికి ప్రలోభ పెడుతుంది. చార్వాకం అనేపదానికి అర్ధం మధురమైన మాట అని. ఈచార్వాకపు తర్క కుతర్క జల్పకల్పవికల్పాలకుచెక్కుచెదరక నిలవడం లోనే సాధకుని బుద్ధి స్థైర్యం,వివేకం వెల్లడవుతాయి . అందుకే సాధకునికి స్వాధ్యాయం తోపాటు దర్శనాల అధ్యయనం కూడా విధించారు .ఈ దర్శనాలలో తర్కం,చార్వాకం కూడా ఉన్నాయి .ఈ దర్శనాలు వాస్తవాన్ని వివిధకోణాలనుండి మనచే దర్శింపజేపించి పరిపూర్ణసత్యాన్ని మనహృదయంలో ప్రతిష్టింపజేస్తాయి.
మనశరీర తత్వానికి సరిపడని పదార్ధాన్నేదైనా తింటే ఆరోగ్యం పాడవుతుంది . మామూలువైద్యుడు ఆ సరిపడని పదార్ధాన్ని తినొద్దని పథ్యం పెడుతూ వైద్యం చేసి అనారోగ్యాన్ని తాత్కాలికంగా పోగొడతాడు . కానీ నిజమైన వైద్యుడు అంతటితో తృప్తిపడడు. ఏపదార్థాన్ని తింటేఅనారోగ్యం కలిగిందో ఆపదార్ధాన్ని తిన్నా చెడని దేహస్వస్థతను కలిగింపజూస్తాడు. అలాగే హేతు,నాస్తిక వాదాలకు బలహీనులబుధ్ధి స్థైర్యం బలయ్యేది నిజం . కానీ నిశితమైన విశ్లేషణ ,వివేకం,సత్య జిజ్ఞాసలనే వైద్యంతో యుక్తివాదాల వెలితినిగ్రహిస్తే సాధకుని ఆథ్యాత్మిక ఆరోగ్యం చెక్కుచెదరదు. ఈ యుక్తివాదాల అంటువ్యాధి మనసుకు సోకకముందే నిరోధించడం కోసం విధ్యాభ్యాసం లోనే దర్శన శాస్త్రాధ్యయనాన్ని విధించారు. వేక్సినేషన్లలాగా ! . ధర్మనిరతితో రాజ్యభోగాలను త్యజించి వనవాసానికి బయలుదేరిన రామునితో చార్వాక యుక్తివాదాన్నిచేస్తాడు జాబాలి మహర్షి. కానీ మహర్షి పరీక్షలకు లొంగక తనధర్మనిరతిని నిరూపించుకుంటాడు శ్రీరామచంద్రుడు.
వివేకవంతులకు మంచి విజ్ఞానవినోదాన్నందివ్వగల ఈ హేతువాదం ఈనాడు సరై్న ఆథ్యాత్మిక అవగాహననందించేవారూ ,అందుకునేవారూలేక వెయ్యి వెర్రితలలు వేసి ,ఆస్తికులగుండెలపై విలయతాండవం చేస్తున్నది.తమ హింసావాదానికి విప్లవలక్ష్యాలకు అడ్డుగా ఉన్న ఆథ్యాత్మికపుకంచుకోటను భేధించటానికి ఈ చార్వాకవాదాలు కొన్ని వామపక్ష రాజకీయ వాదులకు అయుధాలుగా ఉపయోగపడుతున్నాయి. ఈనాడు సమాజంలో అసలైన ఆథ్యాత్మిక విలువల బోధన,సాధన ఆవగింజైనట్లే ,ఈచార్వాక హేతువాదాల్లోని పస నేతిబీరకాయలోని నెయ్యయింది. .ఈ హేతువాదుల సవాళ్లకు సమాధానం చెప్పలేక లోలోన సతమతమవుతూ పైకిమాత్రం మేకపోతు గాంభీర్యంతో "ఆస్తి-నాస్తి"విచికిత్సమనకొద్దు .కళ్ళుమూసుకుని భగవద్భజన చేసుకుంటేచాలు ! అని ఉద్భోధిస్తున్నారు చాలామంది మనగురుస్వాములు . ఈ తాత్విక పలాయనవాదం వలన వారు వారి సంస్థలు తాత్కాలికంగా తప్పుకున్నా.జనబాహుళ్యం మీద ముఖ్యంగా యువతరం మీద ఈ యుక్తివాదాలప్రభావం తప్పటం లేదు. అయితే వీరిపుణ్యమా అని ఆథ్యాత్మిక పేరుతో సాగుతున్న దొంగస్వామీజీల దోపిడి కొంతవరకు దమించబడిందనే చెప్పాలి . బూజుపట్టిన భౌతికవాదాన్ని యుక్తివాదంలోని బండారాన్ని ఆధునిక సైన్స్ విజ్ఞానంతో,తార్కికవిశ్లేషణలతో ఎదుర్కొంటున్న బహుకొద్ది మందికి ఈ "హేతు" వాదులతో వీరివెనుకుండి నడిపిస్తున్న రాజకీయపక్షాలతో విరోధం తప్పటం లేదు. .సిధ్ధాంత సత్యాన్ని ఎదుర్కోలేక [కు]యుక్తి వాదాలతో,నీచమైన వ్యక్తిధూషణలతో,రంజైన బూతువ్యాఖ్యానాలతో,మ్యాజిక్ ప్రదర్శనలతో అసలుసమస్యనుండి ప్రజలను పక్కదారిపట్టించి బ్రెయిన్ వాష్ చేస్తున్న ఈచార్వాక హేతువాదాల అంటురోగాన్ని విజ్ఞులు త్వరగా గుర్తించి దాని నిర్మూలనకు నడుముబిగించాలి.

[ఆచార్య ఎక్కిరాల భరద్వాజ్ గారి రచన ...సాయిబాబా పత్రికనుండి]

1 వ్యాఖ్యలు:

Rajasekharuni Vijay Sharma January 1, 2011 at 5:49 AM  

చాలా చక్కని విషయాలు తెలియపరిచారు. విఙ్ఞులైన వారు ఈ చార్వక వాక్యాలను ఖండించి సమాజాన్ని ఆధ్యాత్మిక మార్గం వైపు పయనింపచేసే ప్రయత్నం ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలి.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP