శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దైవానికి చేసే షోడశోపచారపూజలలోని అంతరార్థం ఏమిటి ?

>> Wednesday, February 17, 2010

నిత్యము భక్తి శ్రద్దలతో ఆలయ దర్శనం చేస్తూ ఇంటివద్ద నిత్యానుష్ఠానం ,పూజ పారాయణం చేస్తూఉంటే క్రమంగా మన లౌకిక మైన విధులన్నింటినీ నిమిత్తమాత్రంగాను,భగవంతుడు మనకప్పగించిన బాధ్యతలన్న దైవీభావనతోనూ చెయ్యగలుగుతాము. అనివార్యమని భగవద్గీతాదులు చెప్పిన కష్ట సుఖాదులను సమభావం తో ఓర్పుతో ఎదుర్కొనటం అలవడుతుంది. క్రమంగా మన దేహము మనస్సు వాక్కు భగవత్సేవకంకితమైన పనిముట్లుగా ,పాత్రలుగా భక్తుడు తలుస్తాడు. బాహ్యంగా మందిరాన్ని శరీరమెలా దర్శిస్తుందో అలానే అంత:కరణ మన దేహాన్ని దేవాలయంగా భావించి పవిత్రంగా ఉంచుకోవడం నేర్చుకుం టుంది. అలా నడుచుకోగలిగితేనే మనం దేవాలయన్ని దర్శించినట్లు. ఆలయం లోని ఇంటిలోని పూజాపాత్రలను స్వంతమైనవిగా భావించిలౌకికమైన అవసరాలకెలా వాడుకోలేమో ! అలానే మన త్రికరణాలను - అంటే దేహంమనస్సు వాక్కులను అయోగ్యమైన రీతిన అంటే దైవీభావం తో మేళం గాని విధంగా వాడుకోలేము. అది మన భక్తి వాస్తవమవడానికి గుర్తు. మనం సాధనవాస్తవంగాచేస్తున్నమనడానికి గుర్తు.ఇలా పరిశుధ్ధమొనర్చబడిన త్రికరణాల రూపమైన సుక్షేత్రం లోనే భగవన్నామ స్మరణ ,ధ్యానము,పూజ అనబడు ఉత్తమ బీజాలు మొలకెత్తి వృద్ధిపొందుతాయి.

ఈభావాన్ని మన మనస్సులమీద నిత్యము బలంగా ముద్రించుకోవడానికనువుగా మనపెద్దలు కొన్ని ఆచారాలనందించారు ,వాటి అంతరార్ధం దేహాన్ని దేవాలయంగా ,అవయవాలను,త్రికరణాలను పవిత్రమైన పూజాసామాగ్రిగా రూపొందించుకొనమని ,అయోగ్యమైన రీతిలో వాటినుపయోగించి అపవిత్రం చేసుకొనవద్దని సందేశం. దీనిని కొంచెం వివరిస్తాను.

ఇంట్లో పూజగదిలోకి గాని.దేవాలయం లోకిగాని ప్రీతితో ఈ దేహాన్ని దానితోపాటు భక్తియుక్తమైన మనస్సును ఎలాప్రవేశ పెడతామో ! అలానే పూజలో ఇష్టదైవాన్నీ ఆహ్వానం [ఆవాహన] చేస్తాము. దైవం సర్వగతుడుకదా ! ఆయన వెరే ఎక్కడో ఉంటేగదా మనం ఆవాహన చేయగలిగేది ! సర్వగతుడైన ఆయన ప్రత్యక్ష సాన్నిధ్యంలో ఉన్నామన్న గుర్తును బలంగా హృదయంలో ప్రతిష్టించుకోవడమే ఆవాహన. ఆసన సమర్పణ. అలాగే మనశరీరం గూడా మన ఇష్టదైవం ఎదుటకూర్చుంటుంది. పూజారంభం లో ఆచమనం చేసి, అలానే తరువాత దైవానికీ ఆచమనీయం సమర్పిస్తాము. దైవానికి సమర్పించిన పాద్యం [పాదాలు నీటితో కడగటం] వలెనే మనం కూడా మొదట ఇంట్లోకిరాగానే కాళ్ళు కడుక్కుంటాము .-అక్కడక్కడ లౌకిక కార్యాలకోసం సంచరించి రజోగుణాత్మకమైన భావాలతో [రజస్సు అంటే ధూళి అనికూడా అర్ధం దేహానికన్వయించుకుంటే] మలినమైన మనస్సును భక్తి భావనతో క్షాళనం చేసుకున్నట్లే ! ఇష్టదైవానికి ఆత్మసమర్పణ చేసినట్లే , మన జీవితము, సాధనలను మన హృదయస్థమైన ఆత్మకొరకే అర్పణ చేస్తాము. భక్తుడు స్నాన,తిలక,గంధ ధారణాదులన్నీ తనదేహాన్ని దైవభావంతో చూడటమేనని గుర్తించాలి .కేవలం అలంకార ప్రాయంకాదు.

అలానే పారాయణ స్తోత్రపాఠాలతో పవిత్రమైన వాక్కును వ్యర్ధము తుచ్ఛము అయిన సంభాషణలతో ఎలా అపవిత్రం చేయడం ? ధ్యాన భగవల్లీలా చింతనలతో పవిత్రం చెసుకున్న మనస్సు ను రాగద్వేష,అసూయాది భావనలతో ఎలా భ్రష్టం చేసుకోగలం ? ఇట్టి పవిత్రభావన నిర్మిస్తేనే పూజలో మనం చెసే ఆతమసమర్పణ వాస్తవము,సార్ధకము అవుతుంది. దానిని సుప్రతిష్ఠం చేసుకోవడానికే ఇలాంటి బాహ్యాచారలను పెద్దలు ఏర్పరచారు. ఇలానిలుపుకుంటేనే మనం చేసే ఆలయదర్శనం గానీ,ఇంటిలోని పూజామందిరాలలోని నిత్యపూజలుగానీ నిజంగా పవిత్రము శక్తివంతము కాజాలవు.

ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారి ఉపన్యాసం ....సాయిబాబా మాసపత్రికనుండి]


3 వ్యాఖ్యలు:

Sumani's English February 17, 2010 at 1:38 PM  

అధ్భుతమైన ఆథ్మాత్మిక విషయం తెలియజేశారు. మీకు మా ధన్యవాదాలు. కృతజ్ఞతలు. సదా భగవంతుని సేవలో మీరు చేయుచున్న కార్యక్రమాలు సఫలం అగునట్లు ఆ దైవం మీకు అపార శక్తినిచ్చుగాక. ఓం తత్ సత్. శుభం భూయాత్.

చింతా రామ కృష్ణా రావు. February 18, 2010 at 5:17 AM  

ప్రాచీనులు ఏర్పాటు చేసిన మన ఆచార వ్యవహారాలన్నీ కూడా మానవ మనుగడకు మంచిని చేకూర్చడానికేనన్న సత్యాన్ని మర్చిపోతూ యాంత్రికంగా పూజాదులుచేసే వారికి మీరు మరొకసరి గుర్తు చెసినందుకు ధన్యవాదాలు.

durgeswara February 18, 2010 at 8:05 AM  

ఈ విజ్ఞానాన్ని మరలా మనకు గుర్తుచేసినవి ఆచార్య ఎక్కిరాల భరద్వాజ్ గారి రచనలేనండి .ఇదంతా వారి అనుగ్రహమే

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP