గురువు ను గుర్తించటానికి దివ్యమైన మార్గం "గురుచరిత్ర " పారాయణం.
>> Tuesday, June 30, 2009
ఆథ్యాత్మిక మార్గం బహు క్లిష్టమైన దారి. దానిలోనుండి ప్రయాణించాలంటే అడుగడుగునా ఆపదలు కలగజేస్తూ మనలను పతనం చేయబూనే అరిషడ్వర్గాలనే ముష్కరులను ఎదుర్కోవాలి. మనము ఏచిన్న పొరపాటుకు ,కొద్దిగా ఏమరి పాటుకు గురైనా పూర్తి ప్రయత్నం వ్యర్ధమవుతుంది. కనుక ఈ మార్గం లో మనకు మార్గదర్శకుడు తోడుంటే ప్రయాణము సులభతరము. ఆమార్గదర్శకుడు,సర్వజ్ఞుడు,సర్వవ్యాపి ,సర్వ సమర్ధుడు అయిన వాడైతే సులభంగా ,నిశ్చింతగా ఆ మార్గాన్ని తరించగలము. ఆయనే సద్గురువు. అటువంటి పూర్ణగురుని ఆశ్రయాన్ని ఎలాపొందగలము? ముందు మనం ఆయనను వెతకాలి. పరిశీలించాలి .పరీ్క్షించుకోవాలి . ఆతరువాత ఆయనను నమ్మి సర్వస్వము ఆయనపై భారం వేసి ప్రాణాలు పోయినా ఆయన పాదాలను వదలకుండా పట్టు కోవాలి.అప్పుడు తల్లి పసిబిడ్డను పొత్తిల్లలో దాచుకుని సాకి రక్షించుకున్నట్లు గురుదేవుడు మనబాధ్యతలను తనపై వేసుకుంటాడు గనుక ఇక నిశ్చింతమే.
ఇక్కడే వున్నది చిక్కంతా . అసలు గురువును పరీక్షించి ఎన్నుకోవటం లోనే మన అజ్ఞానం అడ్డుపడుతుంది . మనం అజ్ఞానం లోవున్నాము కనుక సరైన నిర్ణయం చేయలేక సరైన గురువుని గుర్తించలేక ఆథ్యాత్మిక జిజ్ఞాసతో ఎవరినిపడితే వారిని గురువుగా ఎంచుకుంటే పరిస్థితి ప్రమాదకరం గా వుంటుంది. ఏ చమత్కారాలకో మాయలకో భ్రమసి సమర్ధులు కానివారిని స్వయంగా తామే తరించని వారిని ఆశ్రయిస్తే గుడ్డివాడి చేయి మరొక గుడ్డివాడు పట్టుకుని నదిని దాటాలని ప్రయత్నించిన చందంగా తయారవుతుంది స్థితి. అసలు మన గురువు దయ మనపై ఎప్పుడూవుంటుంది .కాని ఆయన కృపను మనం పొందగలిగే సంస్కారాల ఆచరణ లోపంతో మనం ఆయనకు దూరంగావున్నాము. అందుకే అంటారు శ్రీరామకృష్ణులవారు. గురువు అనుగ్రహాన్ని పొందే అర్హత నువ్వు సాధించుకుంటే దూడదగ్గరకు ఆవు పరిగెత్తు కొచ్చినట్లు ఆయనే మనలను వెతుక్కుంటూ వస్తారు అని. ఆ అర్హత సాధించటమెలా?.
దీనికి సులభమైన మార్గం మహాత్ముల చరిత్రల పారాయణం . ఆ దివ్య చరితలు చదువుతూవుంటే మన మనస్సు శుద్ధమై గురువు అనుగ్రహాన్ని గ్రహించడానికి వీలయినంతగా తయారయి సద్గురువు ను మనవేపుకు పరుగులు పెట్టిస్తుంది. కనుక గురు కథా చరిత్ర లలో కెల్లా వుత్తమమైన శ్రీ గురు చరిత్రను పారాయణాము చేస్తూ వుంటే మన ఆచరణ సంస్కరించబడి ఆయన ప్రేమకు పాత్రమవుతాము. వీతితోపాటు వీరబ్రహ్మేంద్రులు,సాయినాథులు ,రాఘవేంద్రులు,స్వామి సమర్ధ ఇలా... మహాత్ముల చరిత్రలను చదువుతూ వుంటే ఆమహనీయుల దయతో మనమనస్సు మరింతశుద్ధమై గురువును సులభంగా చేరగలము తప్పిపోయిన బిడ్డ తల్లిని చేరినట్లు.
జులై ఏడవతేదీ గురు పౌర్ణమి గనుక సద్గురువుల చరిత్రలను పారాయణము చేసి మీమీ గురువుల అనుగ్రహాన్ని పొందాలని మనవి.[వాస్తవానికి గురువొక్కడే ,కాని మన మనోభావలననుసరించి ఆయన మనకు భిన్నంగా గోచరిస్తున్నాడు .భిన్నమ్గా దర్శనమిస్తున్నాడు.]
శ్రీదత్తాయ నమ: శ్రీశ్రీపాద శ్రీ వల్లభాయనమ: శ్రీనృసింహ సరస్వత్యై నమ:
0 వ్యాఖ్యలు:
Post a Comment