గురు పౌర్ణమిని ఇలా సద్వినియోగం చేసుకుందాము
>> Thursday, June 25, 2009
ఒకే కాలంలో ఎందరుజ్ఞానులైన గురువులున్నా ,వారి శిష్యులమధ్య ఎట్టి వైరుధ్యాలుఉ,ప్రాచీన కాలం లో రాకపోవటమే ఆశ్చర్యం. ఒకానొక ఉత్తమ సాంప్రదాయమే అందుకు కారణం .తేనెటీగవేరువేరు పువ్వులనుండి తేనెను సేకరించినట్లు ,జ్ఞానప్రియుడైనశిష్యుడు కూడా అనేక మంది గురువులనుండి జ్ఞానమార్జించాలని గురుగీత చెబుతున్నది. ప్రతిజ్ఞానీ తన శిష్యులను ఇతర గురువులనుండి గూడా జ్ఞానమార్జించాలని ఆదేశించేవారు. శ్రీకృష్ణుడు అర్జునుని [4:34] భగవద్గీతలో అలానే ఆదేశించారు. రఘువంశగురువైన వశిష్ఠుడు రాముణ్ణి విశ్వామిత్రుని తో పంపాడు .వ్యాసుడు శుకుణ్ణి జనక మహారాజ్ వద్దకు పంపాడు. రాముడూ అరణ్యం లో ఋషులందరినీ సేవించాడు. భాగవతం లో [11వస్కంధం] అవధూత 24 మంది గురువులనుంచి జ్ఞానమార్జించినట్లు చెప్పుకున్నాడు.. ఇందువలన వేరు వేరు గురువుల రూపాలు విధానాలు వేరు జాతుల పువ్వులలాగా స్థూలదృష్టికిభిన్నంగా కనిపించినప్పటికి వారందరి లో వున్న జ్ఞానమనే తేనె ఒక్కటేనన్న వివేకం శిష్యులకు కల్గుతుంది. అప్పుడె సాంప్రదాయ బేధాలు,తగవులు వుండవు. "ఆనోభద్రా:క్రతవోయన్తు విశ్వత:" ఉత్తమమైన భావాలు మాకు అన్ని దిక్కులనుండి లభించుగాక !అన్నదే వేదఋషుల ప్రార్ధన .
ఇలా అనేక మంది మహనీయులను సేవించగలగాలంటె మొదట ఈసూత్రమెంత ప్రశస్తమైనదో తెలుసుకుని,దాని పట్ల అత్యంత శ్రధ్ధకలగాలి. తరువాత పూర్ణులైన మహనీయులెలా వుంటారో తెలుసుకోగలగాలి. లేకుంటే ఆథ్యాత్మికవిద్యమీద ఆశతో ,మహనీయులమై చెప్పుకునే ప్రతివారినీ ,నమ్మి సేవించి అన్ని విధాలా ప్రక్కదారి పట్టే ప్రమాదముంది. అందుకే ఇలాంటి సంస్కారాలు ధృఢంగా నాటుకోవడానికి వ్యాసుడు "భాగవతం లో ’ అనేకమంది మహనీయుల చరిత్రను పొందుపరచాడు. తమిళ దేశంలో "పెరియపురాణ"మనే గ్రంథం లో అరవై ముగ్గురు శైవసిధ్ధులను గూర్చి చదువుతారు. అలానే ఆళ్వారులు అనే పన్నెండు మంది మహాత్ముల చరిత్రలు పారాయణం చేస్తారు. మహనీయులు మరణానికి అతీతులు గనుక ,వారి చరిత్ర భక్తితో పారాయణం చేసేవారికివారి అనుగ్రహం నేటికి కూడా లభిస్తున్నది. ఇక ఏదురోజులలో మరణిస్తాడనుకున్న పరీక్షత్తుకు అందుకే శుకయోగి వేరే సాధన చెప్పక భాగవత శ్రవణం మాత్రమే చేయించాడు. విజయానందుడనే సన్యాసి మరణించనున్న రోజులలో శిరిడీ సాయి బాబా కూడా తరింపుకు భాగవత పారాయణ మే చేయించారు.
ఈఉత్తమ సత్యాని గుర్తించకుంటే శుకుడు ,సాయి బాబా లకంటే మనకే ఎక్కువ తెలుసనుకుని భ్రమించి అనేమంది మహనీయుల చరిత్రపారాయణమనే సాటి లేని సాధనమును మనం అలక్ష్యం చేస్తాము. మహాత్ముల చరిత్రలు,బోధనలను శ్రద్దగా పారాయణం చేయటం వారి ప్రత్యక్ష్యసాన్నిధ్యం తో సమానం. శ్రీ రమణ మహర్షి కూడా ఇలా సూచించారు. వెంకయ్య స్వామి వారు కూడా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రులవారిచరిత్ర చదవమని తన భక్తులతో చెప్పారు. వీర బ్రహ్మం గారు కూడా తాము దత్తావతారమని కాలజ్ఞానం లో చెప్పారు. రెండవ దత్తావతరమైన శ్రీ నృసింహ సరస్వతి తమగురించి శ్రీగురుచరిత్ర రూపములో తామే వుంటామని ,అది పారాయణ చేసినవారికి ఇహపర శ్రేయస్సు ,తమ అనుగ్రహం కలుగుతాయని ప్రమాణం చేసి చెప్పారు. ఇతర మతాలలో గూడా ఈ సాంప్రదాయమే వున్నది. బైబిల్,మరియు ఖురాన్ లలో ఎక్కువ భాగం ఆయా జాతులలో వెలసిన మహనీయుల చరిత్రలుంటాయి.అందుకే ఆయా మతస్థులు వాటిని శ్రద్ధగా చదవాలని విధించారు. అందుకే రానున్న గురు పూర్ణిమకు[జులై 7 ] అరమరికలు లేక అందరూ మహాత్ముల చరిత్రలు పారాయణ చేసుకోండి. .
జయగురుదత్తా
[ఆచార్య భరద్వాజ గారి రచనలనుండి]
0 వ్యాఖ్యలు:
Post a Comment