ఈ తల్లిదండ్రుల దుఃఖాన్ని తొలగించు స్వామీ !
>> Monday, June 22, 2009
దు:ఖం మనిషి వివేకాన్ని నాశనం చేస్తుంది. దు:ఖసమయాన తన సర్వ శక్తులను కోల్పోయినట్లు గా భ్రమపడి మనిషి పతనమవుతున్నాడు. దీనిని మనిషి గమనించు కోవాలి .లేకుంటె ఆపదలు అవసరము లేదు కేవలము దు:ఖమే మనిషిని చ్యుతుని గావిస్తుంది. ఈవిషయాన్ని గమనించమనే పురాణేతిహాసాలు అనేక ఉదాహరణలతో ఆమనలను హెచ్చరిస్తున్నాయి.
నావద్దకిప్పుడొక చిన్న సమస్య వచ్చినది. దాన్ని పరిష్కరించాలంటే ఆ సమస్యకు గురైనవారు మెలకువగా వుండాలి. కాని దు:ఖముతో వారికి చీకట్లు కమ్మినట్లై వున్నది. దానినుండి బయట పడాలంటే వారి ప్రయత్నమే ఆధారము .కాని దు:ఖాతిరేకముతో వారి మనస్సు చంచలమై వున్నది .మామూలు మాటలతో వారిని సంతృప్తపరచలేము. మాయమాటలు చెప్పి వారిని పక్కదారి పట్టించనూ లేను. నాకిదొక సమస్య.
విషయమేమిటంటే మావూరిలో ఒక యువ దంపతులకొక సమస్య వచ్చిపడింది. వాల్ల పెద్దబాబు మానసికంగా కొద్దిగా అమాయకంగా వున్నట్లగుపిస్తాడు. ఇద్దరు పిల్లలను వినుకొండలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చేర్పించి చదివిస్తున్నారు. వారం రోజులక్రితం పెద్దవాడు అక్కడనుండి ఎటో వెళ్ళి పోయాడు. తెల్లవారాక చిన్నపిల్లవాడు తన అన్న కనపడటం లేదని చెప్పినదాకా ఆ పాఠశాలనిర్వాహకులకు విషయం తెలియదు. ఇక వాళ్లబంధువులంతా అన్ని వైపులకు వెళ్ళి వెతుకుతున్నారు . అటు నెల్లూరు నుంచి ఇటు హైదరాబాద్ వైపుకు గుంటూరునుంచి నంద్యాలవరకు తిరుగుతూనే వున్నారు. ఆపిల్లవాని తండ్రి మా తమ్మునకు బాగా స్నేహితుడు కనుక మావాడు కూడా వారం రోజులుగా శెలవు పెట్టి రాత్రింబవళ్ళు తిరుగుతునే వున్నారు.
ఆతల్లి దండ్రి దు:ఖం చూడనలవి కాకుండావుంది. పాపం ఆకుర్రవాడు [శ్రీనివాసరెడ్డి] ఒకవైపు వెతుకుతూనే మరొకవైపు ఎక్కడ ప్రశ్నలు చెబుతారంటె అక్కడకు ,ఎక్కడ కాస్త శాశ్త్రజ్ఞానంతో పరిష్కారాలు చెప్పేవారుంటే అక్కడకు పరుగులు పెడుతున్నాడు. అన్ని మొక్కులు మొక్కుతున్నాడు . కాని చేయవలసినది మాత్రం గమనించలేకున్నాడు. దు:ఖం బుద్దిని కమ్మేసింది . ఆలోచనారహితుడవుతున్నాడు.
ఆపదలు చుట్టుముట్టినప్పుడు మానవ ప్రయత్నాన్ని మాత్రమే నమ్ముకునే వాడు అమాయకత్వం లో వున్నాడనేది నాఅభిప్రాయం. ఈపిల్లవాడు ఇప్పుడు ప్రతిగుడికి వెళ్ళి మొక్కుతున్నట్లుగా కనీసం వారానికొకసారైనా గుడికెళ్ళి భగవంతుని ఆశ్రయించ లేక పోయాడు ఎందుకని. సరే ! ఆపదవచ్చినప్పుడే లేక దెబ్బతగిలినప్పుడే అమ్మా అని కేక అప్రయత్నంగా నోటినుంచి వస్తుందిలే అని సరి పెట్టుకుందామనుకున్నా ఆ నమ్మకమైనా స్థిరమైనదా అంటే అదీకాదు. అనన్యమైన భక్తితో నన్నశ్రయించినవారి యోగ క్షేమాలు నేనే స్వయంగా చూసుకుంటానని పరమాత్మ శపథం చేసారు గీతలో ,ఐనా మనం సంపూర్ణంగా విశ్వసించం. అదేమన బలహీనత. ప్రతి చోటుకు వెళ్ళి వస్తున్నావు కానీ కనీసం నీకు నమ్మకమైన రూపాన్ని అనన్యంగా చింతనచేయవెందుకో అర్ధంకాదు . ఏం ఈ ఆపదలను బాపే శక్తి నీవునమ్మిన స్వామికి లేదని అనుమానమా ? లేక నీకు విశ్వాసం లేదా ?
చిత్రంగా ఇది రాస్తున్నాను ఇప్పుడే అతను గుడివద్దకు వచ్చాడు. నాకోసం. మొహమాటం లేకుండా ఈమాటలన్నీ అడిగాను అతనిని. నువ్వు వందమంది దగ్గరకెళ్ళి నీసమస్యను చెప్పుకుంటే ఎవరివల్లనన్నా అయినదా ? లేదుకదా ? వీళ్లనడిగినట్లు దీనంగా జాలి గొలిపేలా నీ ఇష్టదైవాన్నెప్పుడైనా అడిగావా ? అని. ఆపిల్లవాడు ఏమీ చెప్పలేక పోతున్నాడు.
నాకు తెలిసిన ఒకే మార్గం చెబుతాను .నీకిష్టమైతే ఆచరించు. ఇంతమందిని ఆశ్రయించినట్లుగా స్వామినినే ఆశ్రయించి చూడు ఆయన నీపట్ల ఎందుకు దయతలచరో ! ఎందుకు నీసమస్య పరిష్కారం కాదో ! చూద్దువుగాని . మాలాంటి మనుషులము ఏమీ చేయలేకపోయినా మాటలతో నిన్ను మోసగించి కాలం గడపవచ్చు . కాని స్వామి మోసగించడు. రేపటి నుండి [మంగళవారం } హనుమాన్ చాలీసా రోజుకు పదకొండు సార్లుపారాయణం చేయి . రేపు మాత్రం ఒకే ఆసనం లో కూర్చుని నూటఎనిమిది సార్లు పారాయణం చేయి .తప్పనిసరిగా ఆయన నీదు:ఖాన్ని తొలగిస్తాడు . నీబిడ్ద ను క్షేమంగా నీ ఇంటికి చేరుస్తాడు అని ఇప్పుడే చెప్పాను. అతను కూడా కొద్దిగా సత్యాన్ని అర్ధం చేసుకున్నట్లుగా వుంది రేపు తెల్లవారు ఝామున వచ్చి పారాయణానికి కూర్చోవాలనని అనుకుంటూ వెళ్ళాడు.
అసాధ్యాలను సాధ్యం చేసే స్వామి . ఈ తల్లీదండ్రీ దు:ఖాన్ని తప్పని సరిగా తొలగిస్తాడని సంపూర్ణంగా నమ్ముతూ ,ఆబిడ్ద క్షేమంగా తల్లి దండ్రుల వద్దకు చేరాలని కోరుతూ స్వామిని వే్డుకుంటున్నాను. మంచి మనసుగల మీరందరూ కూడా ఈవిషయమై స్వామికి మీప్రార్ధనల ద్వారా నివేదించాలని కోరుతున్నాను.
2 వ్యాఖ్యలు:
సీతమ్మ జాడ రాములవారికితెలిపినట్లు పిల్లవాడి జాడ తల్లిదండ్రులకు తెలియచేయమని ఆ రామభక్త హనుమాన్ను ప్రార్థిస్తున్నాను.
నేను కూడా,
Post a Comment