శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఆథ్యాత్మికత అప్రతిహతం

>> Saturday, June 13, 2009

అన్ని ప్రాణులకులాగానే మానవునికి కూడా జీవించడమే లక్ష్యం అంటే. ఎలాగైనా మరణం నుండి తప్పుకోజూడటమే.అందువల్లనే జీవితము అన్నింటికంటె ప్రియమని తలుస్తాము.కాని ఇది నిజమా? మానవుడు జీవించడం తో మాత్రమే తృప్తి పడగలిగితేనే అలా తలచడం సాధ్యం .వాస్తవానికి కేవలం జీవించడం మాత్రమే కాక కొరతలేని తృప్తి .శాంతులతో జీవించాలని తలుస్తాము. మనం ధనమూ,కీర్తీ,పదవి,హోదాలను పొందటానికి యత్నిస్తున్నామంటే వాటిద్వారా తృప్తి శాంతి లభిస్తాయన్న ఆశే కారణం.అందుకే వాటి కోశం మానవుడు ఎన్ని కష్టాలకైనా ఓరుస్తాడు.కాని ఎన్ని సాధించినా ప్రతివాడూపొందవలసినదేదో తనకింకా లభించలేదన్న కొరతకు గురవుతాడు. ఇంకా ఏదో సాధస్తే దానిద్వారా తృప్తి,శాంతి లభించవచ్చని భ్రమిస్తూ మరణించేదాకా కాలం గడిపేస్తాడు. కాని ఎన్ని కోట్లమంది మానవులు ఎన్ని యత్నాలు చేసినా ఎన్నింటిని సాధించినా వారికింకా ఇట్టి కొరత మిగిలిండటమే చిత్రం.
ఇలా అని కొరతలేని తృప్తనేది ఒక ఊహా కల్పన మాత్రమేనని .అట్టిదసంభవమని భావించి ఊరుకొగలమా? అట్టినిశ్చయం ఏర్పడిననాడు జీవితం అర్థరహితమనిపించి మానవుడు ఆత్మహత్యకు గానీ ,ఉన్మాదానికి గాని ,మత్తు పదార్ధాలకు గాని పాల్పడతాడు. .అంటే కొరతలేని తృప్తి పొందటం జీవించటం కంటే కూడా మానవునికి ముఖ్యమన్నమాట. కాని అట్టితృప్తి ఇంతమంది లో ఎవరికీ కలగక పోయినా అందరూ జీవించాలని తాపత్రయపడటానికి రెండు కారణాలున్నాయి. ఒకటి అట్టితృప్తి ,శాంతి ఎవరికీ లభ్యం కాలేదన్న ఎరుక కలగక తమకు లేనిదానిని పొందితే అవి లభిస్తాయన్న భ్రాంతి,రెండు అంతకంటె బలీయమైన కారణం మృత్యువంటే భయం.

కాని మృత్యువంటే ఎందుకు భయం? దాని నిజరూపం తనకేమి తెలిసిమానవుడు భయపడతాడు.? మృత్యువులో తనకేమి జరుగుతుందో తెలియదు.అలా తెలియక పోవటమే భయానికి కారణం.
అట్టి మృత్యుభీతివలన జీవితానికంటిపెట్టుకుని వుంటాడే గాని,తీరా జీవించబోతే కొరత ,అసంతృప్తి మాత్రమే ఎదురౌతాయి. చావుకు పెడితే లంఖణానికొప్పుకున్నట్లు ,ఏమీ తెలియని మృత్యువుకంటే ఎంత అసంతృప్తిగావున్నా కొంతవరకైనా తనకు పరిచయమైన జీవితమే మేలనుకుంటాడు.మానవుడు. "ఏడవలేక నవ్వుతూ " వున్నట్టు చావలేక బ్రతుకుతాడు. అట్టి జీవితం లోని కొరతను ,అసంతృప్తిని ఎలా అతిక్రమించాలో తెలియక దానిని విస్మరింపజూస్తాడు.సినిమాలు ,నవలలు మొ// కాలక్షేపాలన్నీ అసంతృప్తి కరమైన అనుభవాల పరంపరలుగా గడిచే కాలగతిని మరిచే యత్నాలు మాత్రమే . వైద్యులిక తగ్గదని నిర్ణయించిన రోగబాధను మత్తుమందులతో మరుగు పరుచుకోజూట్టం లాంటిదే కాలక్షేపం. నానాటికీ ఆమత్తుమందుల ఆమత్తు మోతాదు పెరగవలసి వచ్చినట్లే కాలక్షేపాల మోతాదు కూడా పెరగవలసి వస్తుంది. కాని వాటిననుభవించాలంటే డబ్బు అవసరం. ఎక్కువ డబ్బుసంపాదించాలంటే అదికంగా శ్రమింఛాలి . కాని కాలక్షేపం మత్తుమందులకు అలవాటు పడినవాడు చిత్తశుద్ధితో శ్రమించలేడు. అట్టివాడు అవినీతికి పాల్పడాల్సివుంటుంది. తృప్తినీ ,శాంతినీ ప్రసాదించేవిగా తోచే కీర్తి ధనము పదవి ,హోదాలను పొందాలన్నా అట్టివారికి అవినీతే సులభమైన మార్గమనిపిస్తుంది. ఇదే సమాజం లో అవినీతికంతకూ మూలం .వీటికి తోడు వ్యక్తులలోని బలహీనతలను వినియోగించుకుని లాభాలను గడించే వారు అంటే మనకు కాలక్షేపాన్నందించేవారు ,ఈదౌర్భల్యానికి మరీ. దోహదం చేస్తారు.

కనుక ఇంత అస్తవ్యస్తానికి దారితీసే కాలక్షేపాలు జీవిత సమస్యకు నిజమైన పరిష్కారాలు కావు .కాలగతిలో సామాజిక ధర్మాన్ని తారు మారు చేసి జీవితం దుర్భరమయ్యేలా చేసేవి పరిష్కారాలెలా అవుతాయి ? కేవలం సమస్యనుండి పారిపోవటం అవుతాయి.మృత్యువును నుండి తప్పుకోజూడటానికి కారణం భీతి అనీ ,భీతికికారణం మృత్యువంటే ఏమిటో తెలియక పోవడం అని గుర్తించాము. కాలక్షేపాలద్వారా మానవుడు జీవితానుభవాలనుండి తప్పుకోజూడ్డం వలన అతనికి జీవితమన్నా భయమేనని అంగీకరించాలి.జీవితమంటే ఏమిటో తెలియక పోవటమే అట్టి భయానికి కారణం కాగలదు. జీవితమంటే అనుభవాలను గుర్తించే ఎరుక .దానినే "నేను" అంటాం .నేను "అంటే ఏమిటో దాని తత్వమేమిటో మనకు స్పష్టంగా తెలియకపోవటమే మనం కాలక్షేపాల మాటున దాక్కోజూట్టానికి కారణమన్నమాట.మరణ భీతిచేత జీవితానికంటిపెట్టుకుంటాం.తృప్తి కోసం ఆజీవితాన్నుండి కాలక్షేపాలచాటుకు తప్పుకోజూస్తాం.

కాని గాఢనిద్రలో నున్నపుడు కొరతలేని తృప్తిని ,శాంతిని ప్రతివాడు అనుభవిస్తాడు. అందరికీ ఒకేరీతిలో అనుభవమవుతుంది కాబట్టె, ఈజగత్తు సత్యమని మనం అంగీకరించినట్టే ,గాఢనిద్రలో తృప్తీ,శాంతి సత్యమని మనం అంగీకరించాలి. జీవితం లో ఎన్ని కోట్లమంది ఎట్టి శాంతిని తృప్తిని ఆశించి నిరంతరం< యత్నిస్తారో ,కానీ పొందలేరో అట్టిది గాఢనిద్రలో ఎక్కడనుండివస్తుంది .? అది తెలిస్తే దాన్ని మెలుకువలో సహితం పొందవచ్చు. మనకు జీవితం లో లభించే కష్టాలు ,సుఖాలు ఇంద్రియాలద్వారా మెలకువలో లభిస్తాయి. కానీ మనస్సు ఇంద్రియాలు గాఢనిద్రలో కట్టుబడతాయి. కనుక ఆస్థితిలోని తృప్తీ శాంతి మనకు వేరొకలభించేవి కావన్నమాట. అంటే మనలోనే స్వతహాగా వున్నవన్నమాట. అమ్తే కాదు గాఢనిద్రలో ,శాంతి వేరుగానూ,దానిననుభవించేమనం వేరుగను వుండం. అట్టి శాంతేమనమయ్యుంటాం. ! మనలోనేవున్న తృప్తిని శాంతిని గమనించక దానికై బాహ్యవస్తువులలో వెతికితే ఎలా లభిస్తుంది? ఇదే జీవిత కొరతకు కారణం. చంకలో మేకపిల్లనుంచుకుని ఊరంతా వెతికితే దొరుకుతుందా? మనలో కొరతలేనితృప్తీ శాంతీ వుంటే మనకవి మెలకువలోకూడ అనుభవానికిరావాలికదా? ఈప్రశ్నకు దృష్టాంతంగా చూడండి. ఒక తొట్టిలో నీరుపోశామనుకోండి . ఆనీరు నిశ్చలంగా వున్నప్పుడు అడుగు స్పష్టగా కనపడుతుంది. కానీ నీరు కలతజెందినప్పుడు తొట్టిడుగు స్పష్టంగా కనపడదు. మరుగున పడుతుంది. మానవుడు తొట్టివంటివాడు. మనస్సేనీరు .తొట్టిఅడుగే గాఢనిద్రలో అనుభవమయ్యే తృప్తీ,శాంతి , ఆ నీటి సంచలనమే చిత్తచాంచల్యంతో కూడిన మెలుకువ. కాబట్టి మెలకువలో మనస్సును నిశ్చలమ్ చేస్తే ప్రతివారికీ తామనుక్షణం కోరుకునే తృప్తి,శాంతి లభిస్తాయన్నమాట. అందుకవసరమైన క్రమశిక్షణే ఆథ్యాత్మికత అంతా. కానీ ఆథ్యాత్మిక మానవుని నిష్క్రియాపరునిగా చేయదు. సైకిల్ తొక్కటం నేర్చుకునేటప్పుడు ఎవరైనా పలకరిస్తే దిగవలసిన ఆవస్యకత వుంటుంది. . కారణం మనస్సు ఆమాటలపైన పనిచెస్తే సైకిల్ తొక్కటం పైఅ పనిచేయదు కనుక వాడు పడిపోయేప్రమాదం వుంది. కాని సైకిల్ తొక్కటం పూర్తిగా వస్తే సంభాషిస్తూ కూడా తొక్కుతాడు. అలానే ధ్యానంలో నిలకడ కుదిరాక జీవిత కర్తవ్యాన్ని కొనసాగిస్తూకూడా ఆంతర్యం లో తృప్తిని,శాంతిని అనుభవించగలుగుతాడు. ఆస్థితినే జీవన్ముక్తి అన్నారు. జీవించివుండగనే అసంతృప్తి రూపమైన దు:ఖాన్నుండి విముక్తి పొందుతాడు. ఆదు:ఖానికి కారనమైన తానేమిటో తెలియని అజ్ఞానం నుండి విముక్తుడౌతాడు. తృప్తే,శాంతే తానని ప్రత్యక్షంగా తెలుసుకుంటాడు. కనుక తృప్తి శాంతులకోసం నాడు బాహ్యంగా అన్వేషించాల్సిన అవసరం వుండదు. శరీరం తన ప్రవృత్తి ననుసరించి తనను తానే పోషించుకునే కృషిని చేస్తుంది. అట్టివ్యక్తి సమాజం లో అవినీతిపరుడు కాజాలడు. నీతికీ ,ధర్మానికీ దోహదమౌతాడు. గాఢనిద్రలో అంటేపరిపూర్ణమైన శాంతిలో ,తానంటె ఈదేహమేనన్న భ్రాంతి తొలగినట్టే జీవన్ముక్తుడికీ( తొలగుతుంది. కనుక మరణభీతి తొలగుతుంది. కనుక జఇవితాన్నంటిపెట్టుకోవలసిన ఆవస్యకత వుండదు. జీవించినంతకాలం తృప్తీ శాంతీ తానై జీవిస్తాడు. ఆతరువాత నిర్భయంగా మరణిస్తాడు. అంతేకాదు, జనన జీవన ,మరణాలు కాలబద్దమైనవి .కాలం గాఢనిద్రలో అవాస్తవమైనట్లు జీవన్ముక్తుడికి కాలంతోపాటు జననమరణాలు కూడా అవాస్తవమవుతాయి .కనుక అతను మరణిస్తాడనటం కూడా అతనిదృష్టిలో వాస్తవం కాదు. ఆథ్యాత్మికత అంటే ఇట్టిదని గుర్తించక ,దానిపేరిట ప్రపంచంలో చలామణి అయ్యే మూఢనమ్మకాలను విమర్శిస్తూ ,ఆథ్యాత్మికతనే అసత్యమని నిరూపించినట్లు నేటి నాస్తికులు భ్రమిస్తున్నారు.డబ్బుకోసం ప్రపంచంలో జరిగే అన్యాయాలను చూసి సమాజంలో డబ్బే వుండకూడదనే కుతర్కం వంటిదే వీరివాదం. ఆథ్యాత్మికతే అవసరం లేదనేవారు ,సర్వజీవులూ ఏతృప్తికోసం అన్వేషిస్తున్నాయో దానినే అవసరం లేదంటున్నారు. అప్పుడు తమ నాస్తికవాదాన్ని మాత్రం చెప్పటమెందుకు.? దేన్నాసించి చెప్పాలి? పదార్ధవాదులు చైతన్యమేలేదంటున్నారు.ఆధునిక భౌతిక రసాయన శాస్త్రాదులలో దాని యొక్క ఆస్తిక్యం నిరూపించబదలేదంటున్నారు . కానీ అట్టి శాస్త్రీయ పరిశోధన చేయాలన్నా ,అట్టి నిర్ధారణ చెయ్యాలన్నా చైతన్య మావశ్యకంకదా! అట్తి చైతన్యమే నిజంగాలేకుంటె ,సమాజానికి సత్యాన్ని బోధించాలని తలచేది ఎవరు? అట్టిచైతన్యం గలవ్యక్తులే లేకుంటే ఎవరికి బోధిస్తారు? చైతన్యమేలేని భౌతిక రూపాలకు మనుగడ చేకూర్చడమేమిటి? కనుక వారి వాదం పైవారికి విశ్వాసముంటె వారెవరికీ ఏమీబోధించకూడదు. చైతన్యమే లేదంటే దాని కనుభవమయ్యే తృప్తీ,శాంతి లేనేలేవన్నమాట. ఈసూత్రాన్ననుసరించి వారు నిత్యజీవితాన్ని కొనసాగించగలిగితే వారి సిద్ధాంతంపై వారికి విశ్వాసమున్నట్లు. కాని అలాచేయాలన్నా చైతన్యమావ శ్యకమే ! అంటే ! ఆథ్యాత్మికవాదం అప్రతిహతమన్నమాట.


----------ఆచార్య ఎక్కిరాలభరద్వాజ గారి రచనలనుండి

[ ఇది ఆథ్యాత్మికతకు భరద్వాజ మాష్టర్ గారు ఇచ్చిన అద్భుత నిర్వచనం .దానిని ఎక్కువమందికి అందించాలనే మరలా ఇస్తున్నాను.]

1 వ్యాఖ్యలు:

అహ్మద్ June 13, 2009 at 10:41 AM  

మీకు శత కోటి దన్యవాదాలండి.
అద్యత్మక జీవన విధానం ఒక్క సంపుర్ణమైన జివన విధానం .దిని వలన మనస్సుకి ప్రశాంతత లభిస్తుంద.మరింతా సమచారం కావలని కోరుతు మరొసారి దన్యవాదాలు

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP