శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మంత్రాలు చదివేవాడికి బలం అక్కరలేదా? గుడ్డు తింటే తప్పేమిటి?

>> Thursday, February 8, 2018

మంత్రాలు చదివేవాడికి బలం అక్కరలేదా? గుడ్డు తింటే తప్పేమిటి?

గాడిదగుడ్దేమి కాదు? దేవుని సృష్టిలో జీవులు స్వేదజాలు, అండజాలు, జరాయుజాలు, ఉద్భిజాలు అని చతుర్విధ ప్రాణులు. వీటిలో21 లక్షల జీవజాలాలు అండజాలు అంటే గుడ్డు రూపంలో వాటి సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటాయి. ఆ గుడ్లను పొదిగి రెక్కలు కప్పి వాటిని ప్రేమగా చూసి వాటినుండి బయటకు వచ్చే ఆ చిన్న చిన్న ప్రాణులను సాకుతాయి. ఒకడు గుడ్డు తింటున్నాడు అంటే ఒక జీవాన్ని ప్రపంచంలోకి రానివ్వకుండా దాన్ని అంతం చేస్తున్నాడని లెక్క. అలాగని గుడ్లు పోషకాహారాలు. అవి ఎవరు తింటారు అంటే బలం కావలసిన వాళ్ళు, ఆ బలంతో సంఘాన్ని కాపాడేవాళ్ళు, చాలా శక్తి తో కూడుకున్న కాయకష్టం చేసేవారు వారికి అవి తినక తప్పదు. మాంసాహారం ఇతరత్రా ఆయా వర్ణాలవారికి అనుమతింపబడ్డ ఆహారం. ఎవరైతే సత్త్వసాధన చేస్తున్నారో వారికి మంత్రోపదేశం జరుగుతుంది, వారు మాత్రమె ఆ సత్వగుణం వలన యజ్ఞయాగాదులు చెయ్యడానికి అర్హత పొందినవారు. వారు కొన్ని నియమాలు పాటించకతప్పదు. వారికోసం చెప్పిన విషయం. ఒక విప్రపుట్టుక పుట్టాక ఆ వర్ణాన్ని అనుష్టించేవాడు ఆ వర్ణానికి సంబంధించిన పద్ధతులు నేర్చుకుని ఎల్లవేళలా పాటించాలి. ఒక బ్రాహ్మణునికి కొన్ని విధినిషేధాలు విధించారు, ఎందుకంటె వాడికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పింది సనాతనం, అందులో కొన్ని నియమాలు వాడు తినే తిండి, మాట్లాడే భాష, వాడి సంగం అన్ని చెప్పింది. ఎవడైతే బ్రాహ్మణ్యం పాటించాలన్న స్థిరసమబుద్ధితో ఉంటాడో వాడికి ఇవన్నీ నియమాల కన్నా సోపానాలగా కనబడతాయి.

ఇక ఎందుకు ఈ నియమాలు అంటే దానికొక పెద్ద తర్కం వుంది. ఒక బ్రాహ్మణుడు సాత్వికాహారం పరిశుద్ధంగా తీసుకుని తనలోని సాత్త్విక శక్తిని ఉద్దీపింపచేసుకోవాలి. మడిగా వంట చెయ్యడం కూడా ఒక యజ్ఞం, ఇంటి ఇల్లాలు శుచి శుభ్రత పాటిస్తూ తనను, తన పరిసరాలను శుచిగా ఉంచుతూ ఆ అగ్నిభట్టారకుని సహాయంతో ధర్మంగా సంపాదించిన దినుసులతో, కూరగాయలతో వంట చేస్తుంది. మడిగా ఉంటూ కేవలం భగవదారాధన తన మనస్సంతా నింపుకుని చేసిన వంట ముందుగా ఆ భగవంతునికి నివేదించి వీరు తింటారు. వంట చేసేవారి మానసిక స్థితి ఆ తినే వారి మానసిక స్థితిమీద ప్రభావం చూపుతుంది అని నిన్న మొన్న ఒక గొప్ప university వారు కనుక్కున్నారు. ఇది మనం ఎప్పటినుండో ఆచరిస్తున్న ఒక సదాచారం. ఇక ఆ భోజనాన్ని భుజించేవాడు కూడా తాను తింటున్న ఆహారాన్ని లోనున్న ఆత్మారాముని సంతృప్తి పరుస్తున్నానని, లోన అగ్ని రూపంలో ఉన్న వైశ్వానరుడికి యజ్ఞం (మనం మామూలుగా యజ్ఞం చేస్తున్నప్పుడు కూడా ! అదితే కానుమన్యస్వ! అనుమతే కానుమన్యస్వ! సరస్వతేకా నుమన్యస్వ! దేవ సవితః ప్రసువ  అంటూ చేస్తున్న మనస్సుహోమగుండం చుట్టూ నీటితో పరిషేచన చేసి అగ్నిదేవునికి స్వాహాకారాలతో యజ్ఞం చేసినట్టు) తో పరిషేచన చేసి భోంచేస్తాడు. వాడు తింటున్న ఆహారం కూడా ఒక పూజ, ఒక యోగం. ఏది పడితే అది తింటే వాటి ప్రభావం కూడా అలాగే వుంటుంది.

ఒకడికి ఏదైనా రోగం వచ్చింది అనుకుందాం. ఇప్పుడు మనకు తెలుసు కదా అని నోటికొచ్చినట్టు ఏది పడితే అది మనం మెడికల్ షాపులకెళ్ళి తెచ్చేసుకుని వేసుకుంటే 100% అందరూ లాభపడతారా అంటే అది అనుమానమే. ఉదాహరణకు జ్వరం కోసం క్రోసిన్ కొన్నాడు అనుకుందాం, ఒక రెండు రోజులకు ఇంకా తగ్గకపోతే అమొక్ష్య్కిల్లిన్ తెచ్చుకుంటాడు, కానీ దానివల్ల లివర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి pantop వేసుకోవాలి అని వాడికి తెలియదు, మొత్తానికి ఒక రోగానికి మందేస్తే మరొక నాలుగు రోజులు ఇంకొక రోగంతో బాధపడతాడు, అదే ఒక వైద్యుని వద్దకు వెళ్తే వీడి ఒంటికి ఏది పడుతుందో ఏది పడదో తెలుసుకుని సరైన మోతాదులో సరైన మందిస్తాడు. అలాగే ఒకడు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నప్పుడు ఏ మంత్రం వాడు అనుష్టానం చెయ్యగలడో, వాడికెంత శక్తి వుందో తెలుసుకుని ఒక యజ్ఞం, యాగం చేసేముందు ఏ మూల మంత్రాలు అనుష్టించాలో, ఏ ఉపవాసం చెయ్యాలో, ఏ ఏ తిండి, ఇతరత్రా నియమాలు పాటించాలో చెబుతుంది శాస్త్రం. దాన్ని పాటించినవాడికి శ్రేయస్సు లేదంటే వాడికి సంబంధం లేని మరొక తలనొప్పి సంపాదించి తెచ్చిపెట్టుకోగలడు. ఒక యాగఫలం సంపూర్ణంగా రావాలంటే యజమాని మాత్రమె అనుష్టిస్తే సరిపోదు ఆ యాగంలో పాల్గొన్న వారు, చేయించే వారు పాటించాల్సిన నియమాలు పాటిస్తేనే ఆ యజ్నఫలం దక్కుతుంది. కాబట్టి అటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మరొక ప్రాణిని హింసించి చేసే కార్యాలు త్యజించాలి. ఈ హోమాలు, యాగాలు, యజ్ఞాలు చేసేవారు ఖచ్చితంగా ఈ విషయం పాటించాలని పూజ్యగురువులు చెబితే ఎందుకు చెప్పారో ఆలోచించాలి కానీ ప్రతీదాన్ని విమర్శచెయ్యనవసరం లేదని మనం తెలుసుకోవాలి.

For those who still say Egg is vegetarian : please watch https://www.youtube.com/watch?v=yWvUkIW8SGk

!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ  వేంకటేశ్వరార్పణమస్తు !!

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP