శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

జాగృతం చేసే రాత్రి

>> Sunday, February 28, 2016

జాగృతం చేసే రాత్రి
25-02-2016 23:55:05

చాంద్రమాన పంచాంగంలో అమావాస్యకు ముందు వచ్చే ‘చతుర్దశి’ని శివరాత్రిగా పరిగణిస్తారు. మనం ‘శివ’ అన్నప్పుడు.. ఒక కోణంలో చూస్తే, ఆదియోగి గురించి మాట్లాడుతున్నాం. ఇంకొక కోణంలో ‘శివ’ అంటే ‘ఏది లేదో అది’ అని అంటున్నాం.
ఏదైతే ఉందో అది సృష్టి. సృష్టి అంతా ‘శూన్యం’ నుంచి వచ్చిందని, ఈ రోజున ఆధునిక శాస్త్రం కూడా చెబుతున్నది. ప్రతిదీ శూన్యం నుంచి వచ్చి తిరిగి శూన్యంలో లయమైపోతుంది. శూన్యం అనేది సృష్టికి ఆధారం. అందుకని మనం శివుడిని సృష్టికి ఆధారంగా భావిస్తాం. అంటే ఏది లేదో, అదే ఉన్నదానికి ఆధారం.
సంవత్సరంలోని ఈ 12 శివరాత్రులలో మహా శివరాత్రి చాలా విశిష్టమైనది. ఈ రాత్రి ఉత్తర భూగోళంలో మానవ వ్యవస్థలోని శక్తులు సులువుగా ఊర్థ్వముఖంగా పయనిస్తాయి. ఈ రోజు మనం ఆధ్యాత్మికంగా పురోగమించడానికి, ఉన్నత శిఖరాలను చేరడానికి ప్రకృతి మనకు సహకరిస్తుంది. ఇది రాత్రంతా జరుపుకునే పండుగ. మనం ఈ రాత్రంతా మేల్కొని, వెన్నుముక నిటారుగా ఉంచి స్థిరంగా కూర్చోవాలి. దానితో పాటు ఈ రోజు ఉప్పొంగే శక్తులను మరింతగా ఉపయోగించుకోవడానికి ఒక సాధన ఉన్నది. అదే మంత్రసాధన.
ఈ మహాశివరాత్రి నాడు మనం ఒక మంత్రాన్ని ఉచ్ఛరిస్తాం. మంత్రం అన్నప్పుడు మంత్రార్థం కంటే మంత్ర మూలాన్ని తెలుసుకోవాలి. మంత్ర మూలం శబ్దం. అంటే ‘ప్రకంపనలు’. ఆ ప్రకంపనలే మనకు ముక్తిని ప్రసాదిస్తాయి. ఈ ప్రకంపనలే మనల్ని మన ప్రస్తుత శారీరక మానసిక స్థితుల నుంచి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి. మంత్ర మహిమ నిజంగా తెలియాలంటే, మన శరీరంలోని అణువణువూ ఈ మంత్ర ప్రకంపనలతో ప్రతిధ్వనించాలి. ఆ మంత్రశక్తి మనలో నిండిపోవాలి.
పళనిస్వామి అనే యోగి జీవితంలో జరిగిన సంఘటన ఇందుకు చక్కని ఉదాహరణ. ఆయన తన జీవితమంతా ‘శంభో’ అనే మంత్రసాధనతో గడిపేవాడు. అన్ని వేళలా చివరికి కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు కూడా ఆయన ‘శంభో’ మంత్రోచ్ఛారణ చేస్తున్నాడని ఒకరు గ్రామపెద్దలకు తెలియజేశాడు. దీంతో కోపోద్రిక్తులైన గ్రామ పెద్దలు పళనిస్వామిని గ్రామ సభకు పిలిచి ఇకపై ఆయన ‘శంభో’ అనే మంత్రాన్ని ఎక్కడా, ఎప్పుడూ ఉచ్ఛరించరాదని శాసించారు. దీంతో ఆ స్వామి ‘శంభో’ అనడం మానేశాడు. అయినా ఆ శబ్దం ఆగిపోలేదు. ఆ ప్రదేశమంతా ‘శంభో’ శబ్దంతో మార్మోగిపోయింది. అప్పుడు గ్రామస్థులు గమనించగా పళనిస్వామి దేహంలోని అణువణువు నుంచీ ‘శంభో’ శబ్దం ప్రతిధ్వనించడం గమనించారు. ఆ స్వామి పాదాలపై పడి ‘ఇలాంటి నియమాలు సామాన్యులకే గానీ, మానవాతీతులైన మీకు కాదు. మీ ఇష్టం వచ్చినప్పుడు మంత్రోచ్ఛారణ చేసుకోండి’ అని చెప్పారు. ఈ ఉదాహరణ వలన మంత్రోచ్ఛారణతో మన శరీరంలోని అణువణువూ నిండిపోతే, దాని శక్తి ఎలా ఉంటుందో తెలుస్తుంది.ఈ మహా శివరాత్రి కేవలం మెలకువతో ఉండే జాగరణ రాత్రి మాత్రమే కాకుండా మిమ్మల్ని జాగృతం చేసే రాత్రి కావాలని, ప్రకృతి ఈ రోజు ఇచ్చే ఈ మహత్తర అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. మీరందరూ
ఈ రాత్రి మంత్ర సాధన చేసి, ఉప్పొంగే శక్తుల సహాయంతో ‘శివ’ అన్న శబ్దంలోని పారవశ్యాన్నీ,
రమణీయతనూ తెలుసుకుంటారని ఆశిస్తున్నాను.
ప్రేమతో, సద్గురు
ఇషా ఫౌండేషన్

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP