నాదోపాసన
>> Monday, February 1, 2016
ఉపాసన శాస్త్రాల ప్రకారం- నాభి, హృదయం, కంఠం, రసన అనే శరీరాంగాలు మూలాధార చక్రంతో సంబంధం కలిగి ఉంటాయి. త్యాగయ్య ‘స్వరరాగ సుధారస’ (శంకరాభరణం) కీర్తనలో- మూలాధారజ నాదమే మోక్షానికి మార్గమన్నారు. ‘మోక్షము గలదా... భువిలో జీవన్ముక్తులుగాని వారలకు’ (సారమతి) అని ముముక్షువులను ప్రశ్నించారు. కుండలినీ చక్రం నుంచి నాదం ఉద్భవించాలని, అది శబ్దమై, కంఠం నుంచి భావమై వెలువడాలని వర్ణించారు. అలౌకిక అనుభూతులు ఆ నాదప్రక్రియ వల్లే కలుగుతాయి. సంగీత స్వరాల్ని చక్కని శ్రుతితో గానం చేయడం ద్వారా, భగవంతుడికి- సాధకుడికి సంబంధం ఏర్పడుతుందన్నాడు సారంగదేవుడు. అదే మూలాధార నాదాన్ని అనుభూతి చెందుతూ గానం చేయాలని త్యాగయ్య తన శిష్యులకు చెప్పేవారు. ‘నాదోపాసన లేని సంగీత సాధన వల్ల దివ్యానుభూతి కలగదు’ అనేవారు. స్వరాల్లో మనసు సంచరిస్తూ ఉంటేనే నాదోపాసన పరిపూర్ణమవుతుందని ఆయన భావం.
శ్రీరామభక్తిని ప్రదర్శించిన త్యాగయ్య- నాదోపాసనలోని సంప్రదాయాలే మానవులకు పవిత్రత కల్పిస్తాయనేవారు. విశ్వం నుంచి ఉద్భవించినవారు తిరిగి ఆ విశ్వంలో లీనం కావడమే ముక్తి. ఆ గమ్యం చేరేందుకే నాదయోగులు తపిస్తుంటారు. స్వరరాగ సుధారస (శంకరాభరణం), రాగసుధారస (హిందోళం), నామ కుసుమములచే పూజించెడి (శ్రీ) వంటి కీర్తనలు ఆయన నాదయోగ సాధనను వ్యక్తపరుస్తాయి. త్యాగయ్య సంపూర్ణ నాదయోగి.
ఆయన సంస్కృతం, తెలుగు భాషల్లో మేటి. పందొమ్మిదో శతాబ్దంలోని పలు తెలుగు నుడికారాల్ని తన కవిత్వం ద్వారా ప్రస్ఫుటం చేశారు. ప్రహ్లాద భక్తి విజయంలో ఆయన రాసిన పద్యాలు ఆణిముత్యాలు. కందం, సీస పద్యాలతో సహా ఉత్పలమాల, ద్విపదాలు, శార్దూల విక్రీడితం వంటి పద్య ప్రయోగాలతో సాహితీ వైభవం చాటారు. ‘సీతారామ విజయం’ అనే పద్యనాటకాన్ని ఆయన రాసినట్లు చెబుతారు. కనుగొంటినీ శ్రీరాముని నేడు ఇనకులమందు ఇంపుగా బుట్టిన (బిలహరి) వంటి కీర్తనలు అందులోనివే అని కొందరి అభిప్రాయం. గంధము పుయ్యరుగా (పున్నాగ వరాళి) వంటి కీర్తనల్లో ఆయన భావుకత తొంగిచూస్తుంది. నవరసాలూ ఆ రచనల్లో ఒదుగుతాయి. ముఖారి రాగాన్ని నాదోపాసకులు శోకరసానికి వినియోగించారు. త్యాగయ్య తన కీర్తన ‘చింతిస్తున్నాడే యముడు...’లో ఆ రాగాన్ని హాస్యరసానికి సైతం ఉపయోగించారు. భక్తి లేని పూజల వల్ల ఆయన ఫలితం ఉండదన్నారు. భావహీన మానసం వల్ల నాదసాధన జరగదనీ స్పష్టీకరించారు!
- అప్పరుసు రమాకాంతరావు
0 వ్యాఖ్యలు:
Post a Comment