శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

"సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు-6

>> Monday, March 18, 2013

Inline image 1

19. తల్లితండ్రుల గొప్పతనం

ఒక ఆచార్యుడు పదిమంది ఉపాధ్యాయుల కంటే గొప్ప. నూరుగురు ఆచార్యుల కంటే తండ్రి గొప్ప అని మనుస్మృతి చెబుతున్నది. తల్లికి ఇంకా విశిష్ట స్థానము. తల్లి వేయిమంది తండ్రులకన్నా గొప్ప!!

యాజ్ఞవల్క్య మహర్షి కాలంలో ఉపనయనం, తండ్రియైనా సోదరుడైనా చేసేవారు. వీరిద్దరూ లేకపోతే ఇతరులు. లేకపోతే తండ్రీ, సోదరుడూ మృతులైనారు అని కాదు అర్ధం, వీరికి తగిన యోగ్యత లేకపోతే ఉపనయనం ఇతరులు చేసేవారు. తండ్రికానీ, సోదరుడు కానీ వేదములలో ఒక శాఖనైనా అధ్యయనం చేసి ఉండాలి. అధ్యాపనం చేసి ఉండాలి. బ్రాహ్మణునికి అనుచితమైన వృత్తులలో వాళ్ళుండరాదు. ఈ ప్రమాణాన్నిబట్టి ఈ కాలంలో ఏ తండ్రికీ తన పుత్రునికి ఉపనయనం చేసే యోగ్యత లేదు.

కొన్ని స్మృతులలో పెద్దలకూ పూజ్యులకూ, గురువనే అభిదానమున్నట్లు చెప్పబడినది. తండ్రి, తాత, సోదరుడు, తండ్రి తల్లి యొక్క సోదరులు, చెల్లెండ్ర మామగారు, రాజు, విద్యావంతులు, శీలపరులు అయిన బ్రాహ్మణులు, తల్లి, ఆచార్యపత్ని, మేనత్తలు, పిన్నమ్మలు, జ్యేష్టసోదరి - అందరూ గురువులే. ఇంతమందీ గురువులైనా ఆచార్యునికొక విశిష్ట స్థానం, విద్యాదానము చేయుటచేత అతడు పితృ సమానుడు. అతనికి గౌరవం అధికం. గురువుకు సంబంధించినదే గౌరవము.

ధర్మ శాస్త్రములూ, ఆత్మ విద్య చెప్పేవాడు కాదు గురువు. ఏ విద్య చెప్పినా అతడు గురువే అని మనువు అంటున్నాడు.  ఇక సద్విద్య బోధించే గురువు యొక్క మహత్త్వమెట్లు చెప్పుట అని ఆయన ఆశ్చర్యచకితుడౌతున్నాడు.

20. వృద్ధాః శిష్యాః గురుర్యువా

ఆచార్యుడు వయస్సులో చిన్నవాడైనా అతనిని పెద్దవానిగా చూడాలని ధర్మశాస్త్రముల నిర్దేశము. అందుచే అతడు గురువు. మనకంటే చిన్నవారి వద్ద మనం శాస్త్రపఠనం చేయడంలో నిషేధమేమీలేదు. జ్ఞానానికి, ఆత్మోపలబ్ధికి వయసు అడ్డురారాదు. ఇందులకు ఉపష్టంభకముగా మనువు ఒక కథ చెబుతున్నాడు.

అంగీరస మహర్షి పుత్రుడు తన చిన్నాయనలకు ఆచార్యునిగా ఉండేవాడు. విద్యాభ్యాసకాలంలో ఆయన వారిని 'వత్సలారా' అని సంబోధించాడట. పినతండ్రులు కోపగించుకొని దేవతలతో ఫిర్యాదు చేశారు.

దేవతలన్నారటః "మీరు ఫిర్యాదు చేయడం సరికాదు, మీకు విద్య అంటే ఏమో తెలియదు. మీ అన్న కుమారుని వద్ద మీరు విద్యోపదేశం పొందుతున్నారు అమ్టే మీరు పసివారు, అతడు వృద్ధుడు అని అర్ధం. వయసు ముదిరి వెంట్రుకలు తెల్లనైనందున ఒకడు వృద్ధుడు కాడు. వేదవిజ్ఞానం కలవాడే వృద్ధుడు."

చిక్కిశల్యావస్థలో ఉన్న వయోవృద్ధులు, యోగులు దక్షిణామూర్తి స్వామి వద్ద ఆయన మౌన వ్యాఖ్య చేస్తూ ఉంటే తమ సంశయములను పోగొట్టుకుంటున్నారు.

చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా
గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తుఛ్చిన్నసంశయాః


డబ్బున్న వారికి మనం గౌరవం ఇస్తాం. అత్తలు, మామలు, వదినలు మనకంటే చిన్న వారైనా వారికి వృద్ధులకిచ్చే గౌరవం ఇస్తాము. వయస్సుతో నిమిత్తం లేకుండా యజ్ఞాయాగాదులు చేసిన వారిని పెద్దలని గౌరవిస్తాము. కట్టకడపట విద్వాంసుడు, వయోవృద్ధుడు కాకపోయినా, జ్ఞానవృద్ధుడైనందువలన మనం గౌరవిస్తాము. ఈ కడపట చెప్పిన వానికి అతిశయ గౌరవం ఇవ్వాలని శాస్త్రములు చెబుతున్నవి.

21. తల్లి, తండ్రి, ఆచార్యుడు

ఈ ముగ్గురూ ఈశ్వరాంశములగా మనం గౌరవించాలి. కొన్ని ధర్మశాస్త్రములు తల్లితండ్రులకంటే ఆచార్యునికి ఒక విశిష్ట స్థానం ఏర్పరచినవి. మాతృభక్తిచేత ఇహలోకములోనూ, పితృభక్తి చేత అంతరిక్షముననూ, ఆచార్యభక్తిచేత బ్రహ్మలోకమునూ పొందగలరని మనువు అంటూన్నాడు. వీరియందు నెరిపే భక్తి ఎంత శ్రేష్తమో వీరియందు చేసే అగౌరవము అంత పాపకరము.

(సశేషం ......)

సర్వం శ్రీగురుచరణారవిందార్పణమస్తు.

------


Inline image 1
22. అధ్యాపకుడు

ఒక శిష్యుణ్ణి ఆచార్యుడు మూడువిధములుగా దిద్దగలడు. ఒకటి బోధ, రెండవది అనుగ్రహము. మూడవది మంత్రోపదేశము. వేద సంస్కారములు, అనుగ్రహం గురించి శాస్త్రములు ఏమీ చెప్పలేదు. ఒకటి గురువు మంత్రోపదేశము చేసియు, వైదిక సంస్కారముల మూలముగానూ, శిష్యుని శుద్ధి చేసి, పూర్ణవిద్యలనిచ్చుట. రెండవది సంస్కారముల ప్రసక్తి లేక విద్యను మాత్రం బోధించుట.

ఆచార్యుడే సంస్కారములను చేసి విద్యాబోధచేసి వేదాంత తత్పరునిగా చేయుటకూడా కలదు. వీరిరువురూ అధ్యాపకులే. వేతనమును గ్రహించువానిని ఉపాధ్యాయుడని అంటారు.

23.ఉపాధ్యాయుడు

జీవనోపాధికై కాక విద్యాబోధనే లక్ష్యంగా ఉంచుకున్న ఆచార్యుల సంఖ్య తగ్గుతూ రాగా ఉపాధ్యాయులు ఏర్పడ్డారు. ఉత్తర భారత దేశంలో వేదాధ్యాపనం చేసేవారు. తమని ఉపాధ్యాయులమని పిలుచుకోవడం ప్రారంభించారు. అందులో న్యూనత ఉందని వారనుకోలేదు.

బెంగాలులో ఛటర్జీ, బెనర్జీ, ముఖర్జీలు ఉన్నారు, వారిలో కొందరు తమను ముఖోపాధ్యాయులు, చతురోపాధ్యాయులు, వందోపాధ్యాయులు (బందోపాధ్యాయులు) అని వివరముగా వ్యవహరించుకుంటూన్నారు. ముఖమంటే వేదం. వేదాలు ముఖంలోనించే వస్తాయి. ముఖోపాధ్యాయ ముఖర్జీ అయినది. చతురోపాధ్యాయ చతుర్వేదములకు అధ్యాపకుడు. అతడు ఛటర్జీ అయినాడు. రామకృష్ణపరమహంస ఛటోపాధ్యాయ వంశములో పుట్టినవారు. ఆయన భార్య శారదా దేవి ముఖోపాధ్యాయ వంశమునకు చెందినవారు. వంద్యోపాధ్యాయ అంటే వందనీయుడైన్ ఉపాధ్యాయుడు. వంద్య బంద్య గా మారి, బెనర్జీ అయినది. ఈ పదాలకన్నిటికీ గౌరవార్ధకమైన 'జీ' తగిలింపబడినది.

ఉపాధ్యాయులు గౌరవనీయులు. బ్రిటిష్ ప్రభుత్వంలో గొప్ప పండితులకు 'మహామహోపాధ్యాయ' అనే బిరుదు ఉండేవి. వీరికి ఆచార్యుడికి ఉండవలసిన లక్షణములు, గుణములూ ఉండేవి. వారు గురుకులమును నడిపేవారు. కొందరు తమ స్వార్జితాన్ని కూడా ఖర్చు చేసి ఈ గురుకులాలను నడిపేవారు.

24. విద్యాదానమే ఈశ్వరార్చన
ప్రజలు జీవనానికై ఎన్నో వృత్తులను అవలంబించుచున్నారు. ఆ వృత్తులు తప్పు అనో, తక్కువ అనో వాళ్ళు అనుకోవడం లేదు. కానీ పూర్వం డబ్బు కోసం ఈశ్వరుని పూజా, కూలికి విద్యచెప్పడం చాలా హీనంగా పరిగణించేవారు. దీనికి కారణం ఆత్మతృప్తికి, ఆనందానికీ చేయవలసిన పనిని ఉదరపోషణార్ధం చేయటం సముచితము కాదని. అంటే వాళ్ళు విద్యాదానం భగవదారాధన కింద లెక్కకట్టేవారు.

శాస్త్రములు ప్రతిఒక్కరూ తమ కులధర్మాన్ని పాటిస్తూ జాతికి విధించిన వృత్తితో ధనార్జన చేయాలని విధించినవి. బ్రాహ్మణుడు చేయవలసిన వృత్తి ఏది? తమిళంలో బ్రాహ్మణులని 'ఆరుతొళిలర్' అని అంటారు. అతడు ఆరు విధాలైన వృత్తిని అవలంబించవచ్చు అని అర్ధం. బ్రాహ్మణుడు షట్కర్మ నిరతుడు. అవి ఏవి? ఒకటి అధ్యయనం, రెండవది అధ్యాపనం, ఇవికాక ఇతర వృత్తులలో అతడు కుశలత సంపాదించి వానిని ఇతరులకు నేర్పాలి. అంటే బ్రాహ్మణుడు అన్ని వృత్తులను తెలుసుకొని ఉండాలి అని కాదు. తన అధ్యాపక వృత్తికి భంగం లేకుండా, అనుష్టానాలకు నిరోధం కాక నాలుగైదు వృత్తులలో కౌశల్యం సంపాదించి ఇతరులకు వానిని నేర్పాలని భావం. బ్రాహ్మణులు ఈ విధంగా ఉండేవారని ఇతిహాసాలూ, పురాణాలూ చెబుతున్నాయి. బ్రాహ్మణులు, ఆయుర్వేదము, అర్ధశాస్త్రము, నాట్యశాస్త్రము, ధనుర్వేదము మొదలైనవాటిని నేర్చి ఇతరులకు బోధించేవాళ్ళు.

ఆయా జాతులకు తగిన వృత్తిని నేర్పాలే కానీ ఆ వృత్తులను అతడు అవలంబించరాదు. ఆ విద్యను ధనార్జనకు కానీ, జీవనోపాయమునకు కానీ అతడు వినియోగించరాదు. శిష్యులిచ్చే దక్షిణతో అతడు తృప్తి పడాలి. అతని ధ్యేయం అధ్యాపకమే కానీ ఆర్జన కాదు. అతని కులమునకు ఉచితమైన వృత్తి ఇతరులకు విద్యను బోధించుటే. అధీతిబోధారణలు, ఈశ్వరప్రణిధానము బ్రాహ్మణునకు విధించిన కర్మ.

కొందరు దీనిని తెలుసుకోకుండా బ్రాహ్మణులను నిందిస్తారు. అత్మార్ధం, లోకసంగ్రహం కోసం బ్రాహ్మణునికి ఎన్నో విధులు, అనుష్టానాలు, అననుకూలాలూ ఉన్నాయి. కష్టాలు, క్లేశాలు లెక్కచేయక బ్రాహ్మణుడు లోకక్షేమార్ధమే తన కాలాన్ని వినియోగించాలి.

25. ప్రతిగ్రహం

బ్రాహ్మణుడు ఆరు వృత్తులు అవలంబించవచ్చని చెప్పాం. (అంటే పరమాచార్య స్వామి వారి వాక్కు ఈ మాట...). రెండిటిని అధ్యయనం, అధ్యాపనం గురించి మనం చర్చించాము. మిగతా నాలుగు, యజ్ఞం, యాజనం, దానం, ప్రతిగ్రహం. యజ్ఞం ఆత్మార్ధం చేసుకొనేది. యాజనం ఇతరుల కోసం చేసేది. యజ్ఞం, దానంలో రాబడి లేదు. ఖర్చే. యాజమానముల, ప్రతిగ్రహనలో (తీసుకొనుత) రాబడి ఉన్నది. కానీ ఒక ముఖ్య విషయం ఏమిటంటే యాజక, ప్రతిగ్రహాల్లో దాతయొక్క పాపాలు గ్రహీత అనుభవించవలసి వస్తుంది.

దానాలు తీసుకొనే పక్షంలో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. దానికొక పెద్ద చిట్టా ఉంది. ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రాయశ్చిత్తం ఉన్నది. బ్రాహ్మణులకు భీతి కలిగించేటందుకు కాదు ఈ విధిని ఏర్పరిచినది. ఈ శాస్త్రములను వ్రాసినదీ బ్రాహ్మణులే. యాజనం కంటే యజ్ఞమే శ్రేష్టం. అది ఆత్మార్ధం చేసేది. దక్షిణకోసం కాదు. కానీ యాజన కూడా అతని విధియే. అందుమూలముగా వచ్చిన దక్షిణను అతను పుణ్యకార్యాలకై వెచ్చించాలి.

కాబట్టి బ్రాహ్మణునికి ఆరు వృత్తులున్నా అందులో ఆదాయానికి ఆస్పదం లేదు. యాజన ప్రతిగ్రహాల్లో వచ్చే ధనం ధర్మకార్యాలకై వినియోగం చేయాలి. అధ్యాపనలో రాబడి ఉన్నా విద్యను దానం చేయాలే కానీ దాని మూలముగా ఆర్జన చేయరాదు. అట్లు చేస్తేనే అది ఈశ్వరార్చన అవుతుంది. ఆచార్యుడు అట్లా దక్షిణ తీసుకున్నా శిష్యుడు తాను చెప్పిన విద్య పూర్తిగా గ్రహించినాడన్న నమ్మకము కలిగిన మీదటనే దక్షిణ తీసుకునే వారు.

జనకుడు యాజ్ఞవల్క్యునికి శిష్యుడు. ఒక్కొక్క ఉపదేశము పూర్తికాగానే జనకుడు గురువునకు దక్షిణలు ఇస్తున్నాడు. దక్షిణ ఇచ్చినప్పుడల్లా, యాజ్ఞవల్క్యుడు దక్షిణను తిరిగి జనకునికే ఇచ్చేసేవాడు. "నా తండ్రి అభిప్రాయం ఏమంటే ఉపదేశం పూర్తిగా ఇచ్చినపిదపే దక్షిణని గ్రహించాలి", అని యాజ్ఞవల్క్యుడు జనకునితో చెప్పాడు. ఈ బృహదారణ్యకోపనిషత్తు నాలుగవ అధ్యాయం మొదటి బ్రాహ్మణములో చెప్పబడియున్నది.



(సశేషం ......)

సర్వం శ్రీగురుచరణారవిందార్పణమస్తు.

-----------------------------
 Inline image 1

26. ఇతర దేశాలలో లేని వ్యవస్థ

ఇతరదేశాలలో బోధకులు (టీచర్) ఉండవచ్చును. కానీ మన గురు, ఆచార్య సాంప్రదాయాలకూ వానికీ అజగజాంతరము. ఇతర దేశాలలో గురువును ఈశ్వర భావంతో చూసే పద్ధతి లేదు. అతడు ఈశ్వర ప్రతినిధి అన్న భావం లేదు. సర్వసంగపరిత్యాగం చేసి అతని వద్దకు వెళ్ళాలన్న నియమమూ లేదు. 'అతడు చక్కగా బోధ చేస్తాడు,అతనికి అనేక విషయములు తెలుసు, ఆ విషయములను ఇతరులకు అందముగా చెప్పగలడు." ఆ దేశాలలో విద్యార్ధికి దీనికి మించిన భావము లేదు. ఆ బోధకులూ తమను ఆ విధంగానే భావించుకొంటూ తదనుసారం ఉంటే చాలని నిలిచిపోతారు.

మనదేశాల్లో అట్లా కాదు.......... "గురు లక్షణములు ఉన్నతముగా ఉండాలి. అతనికి యోగ్యత, ఆత్మానుభవం ఉండాలి. అతడు కుశాగ్రబుద్ధిగానూ, శాస్త్రసంపన్నుడిగానూ, విశేషజ్ఞుడిగానూ ఉండవలసి ఉంటుంది. అంతేకాదు తనకు తెలిసిన దానిని ఇతరులకు తెలుపగలిగిన బోధనశక్తి, శీలసంపదా, ఆచార అనుష్టానాలు కలిగి ఉండవలెను".

అనగా ఆచార్యునికి మూడు లక్షణములు ఉండవలెను. ఒకటి శాస్త్ర సిద్ధాంతములను అతను చక్కగా తెలుసుకొని ఉండవలెను. "అచినోతిః శాస్త్రార్ధం". రెండు, తెలుసుకొని స్వయంగా ఆచరించవలెను. "స్వయం ఆచరేత్". మూడవది, తాను తెలుసుకొని ఆచరిస్తున్న ఆచారములను ఇతరులచే అనుష్టింప చేయవలఎను. "ఆచారేస్థానయత్యపి".

ఒక శాస్త్రం చక్కగా తెలుసుకొన్న వాడు విద్వాంసుడు మాత్రమే. వానికి ఆచార్య స్థానం లేదు. జీవితం శాస్త్రబద్ధముగా నడుపుకున్న నాడే అనుష్ఠాత. మరొక మెట్టుదాటినాడంటే, అతడు అనుభవి అవుతాడూ. అప్పటికీ అతను ఆచార్యుడు కాలేడు.  అతను తాను నేర్పిన శాస్త్రములను ప్రచారం చేసి ఇతరులను అనుష్టింపచేస్తేనే ఆచార్యుడౌతాడు. అందుచేత ఆచార్యుని అనుష్టానమూ, అనుభవమూ, ప్రచారకత్వమూ మూడూ ఉండాలి.

మనం నేర్చుకొనే విద్య నిర్దుష్టంగా ఉండవలెను. మన జీవితము కూడా ఆ విద్యను అనుసరిస్తూ నిర్వద్యముగా ఉండవలెను. అందుచే ఆచార్యుడు తాను నేర్చుకొన్న దానిని ఆచరించి ఇతరులచే ఆచరింపచేయవలెను. ఈ విధమైన ఆచార్యులు మన దేశంలో పూర్వం ఎంతో మంది ఉండేవారు.

"అర్ధసంపద లేని వారికి ఈ లోకం లేదు" అని మహాత్ముడైన తిరువళ్ళువారే చెప్పారు. కానీ మనపూర్వాచార్యులు అర్ధాన్ని అర్ధించకుండా విద్యాదానం చేసేవారు. విద్యాభివృద్ధియే వారి ధ్యేయం. జీవిత లక్ష్యం. వారు స్వార్ధత్యాగులు, నిష్కామముగా ఉండేవారు. ఇట్టి త్యాగమున్నందునే వారికి అసమానమైన ఆధ్యాత్మిక సంపత్తి ఉండేది. తైత్తరీయం 'త్యాగేనైకే అమృతత్వమానశుః" అని అంటున్నది.

ఈ దేశంలో ఆచార్యునికి ఎనలేని గౌరవం ఉండేది. అర్ధసంపత్తి లేకపోయినా చిత్తశుద్ధి కల ఆచార్యుని ఎవరు గౌరవించరు? అతడు ఒక పర్ణశాలలో అవిరళ విద్యాదానం చేస్తూ తన జీవితాన్ని భవ్యంగా గడిపేవాడు. "సర్వసంగపరిత్యాగం చేసి ఆచార్యుని అనుసరించు" అని అంటే అతనికి ఎంత విశిష్టత ఉండవలె? ఆచరణ లేని శాస్త్రకౌశల్యం మాత్రం ఉంటే చాలునా?. అతని జీవితం అనవద్యంగానూ, ఆదర్శంగానూ ఉంటేకానీ, శిష్యునికి అతనిలో ఈశ్వర భావం రాదు. అట్టి ఆచార్యుడే - ఆచార్యదేవోభవ - దేవుడౌతాడు.

(సశేషం .....)



సర్వం శ్రీగురుచరణారవిందార్పణమస్తు.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP