ఆత్మ దర్శనం!
>> Friday, January 8, 2016
జాగ్రదవస్థలో అంటే మేలుకొని ఉన్న వేళలో- మనిషి తన చుట్టూ ఉన్న వాటిని, పదార్థాలను తెలుసుకోవటానికి సూర్యుడు, దీపం, ఇంద్రియాలు, బుద్ధి తోడ్పడతాయి. అవి లేకుంటే మనిషి ఏ పదార్థాన్నీ చూడలేడు. తెలుసుకోలేడు.
కలలు కంటున్నప్పుడు- ఆ కలల్లో కనిపించే వస్తువుల్ని, దృశ్యాల్ని బుద్ధి గ్రహిస్తుంది. మేల్కొన్న తరవాత కూడా, తాను కలలో చూసిన వాటిని బుద్ధి గుర్తుంచుకొంటుంది. అందుకే ‘కలలో ఆ దృశ్యాలు చూశాను’ అని మేల్కొన్న తరవాత మనిషి చెబుతాడు. కలలో కనిపించేవన్నీ యథార్థాలు కావు కానీ, అవి నిజంగా ఉన్నట్లే బుద్ధికి అనిపిస్తాయి. ప్రతినిత్యం బుట్టలోని పూలను చూసే మనిషి, ఏదో ఒకరోజు అందులో పూలు లేకున్నా దాన్ని ‘పూల బుట్ట’ అని గుర్తిస్తాడు. కలలో చూసిన వాటి విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది.
సుషుప్తి అంటే నిద్ర. ఈ అవస్థలో మనిషి బుద్ధి- అజ్ఞానంలో దేన్నీ గుర్తించలేని స్థితిలో ఉంటుంది. నిద్రావస్థలో ప్రాణమనే పదార్థం పనిచేస్తుంటుంది. అదే లేకుంటే మనిషికి శరీరం ఎక్కడిది?
ఆత్మను తెలుసుకోవాలంటే జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థల్ని వదిలి వేయాలని వేదాంతులు ఉపదేశిస్తారు. ఆ మూడు దశల తరవాత నాలుగో దశలోనే ఆత్మను దర్శించడం సాధ్యపడుతుంది. అందువల్ల ఆత్మ ‘తురీయం’ (నాలుగోది లేదా చిట్టచివరిది) అని శాస్త్రజ్ఞులంటారు.
మసక చీకటిలో నేలపై పడి ఉన్న తాడును నిజమైన జ్ఞానదృష్టితో చూడనందువల్ల అది పాముగా, కర్రగా, పూలదండగా బుద్ధికి తోచవచ్చు. దీపం వెలుగులో చూసినప్పుడు అది పాము కాదని, తాడు అని తెలియడం యథార్థం అవుతుంది. అలా యథార్థంగా తెలుసుకోవాల్సి ఉన్నదే ‘ఆత్మ’స్వరూపం!
మేలిమి బంగారం ముద్దలో- పైకి చూసినా, లోపల చూసినా కనిపించేది శుద్ధమైన బంగారమే. అలాగే పైన, లోపల ఎక్కడ చూసినా అన్నిచోట్లా యథార్థంగా కనిపించేది ‘ఆత్మ’. అందులో ఎలాంటి మార్పూ ఉండదు. దాన్ని తెలుసుకుంటే చాలు. అన్నీ తెలుసుకున్నట్లే.
శరీరధారణ ద్వారా సంక్రమించిన జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలను మనిషి తన ప్రమేయం లేకుండా పొందుతూనే- ఆత్మ స్వరూపం తెలుసుకోవడానికీ ప్రయత్నించాలి. ఆత్మశోధన లేకుండా కేవలం తినటం, నిద్ర, కలలకే పరిమితం కావడం మనిషి చేయాల్సిన పనులు కావు. ఆత్మ శోధనలోనే యోగులు తరించారు. మనిషికి, ఆ మాటకొస్తే సమస్త ప్రాణికోటికి చివరి గమ్యం ‘ఆత్మ దర్శన’మే. అది సంభవమైనప్పుడు, లోకంలో ఇంకేదీ అవసరం ఉండదు!
-
డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ
from eenadu daily
from eenadu daily
0 వ్యాఖ్యలు:
Post a Comment