ఆప్త బంధాలు
>> Saturday, January 9, 2016
భగవంతుడు ఒక్కడైనా, బహు రూపాల్లో కనిపిస్తాడంటుంది వేదవచనం. అదే తత్వాన్ని ఆయన బుద్ధిజీవులైన మానవులకూ కల్పించాడు. మనిషి ఎప్పుడూ ఒక్కడు కాదు. ఒంటరి అంతకన్నా కాదు. వివిధ ప్రాకారాలున్న కోటలో అతడు నివసిస్తున్నాడు. చుట్టూ పరివారం. అదొక ఆనందానుభూతుల ప్రపంచం. దానికి తోడుగా, రక్షక కవచంగా ధర్మ సంస్కృతి ఉంటుంది. ఆ బహు బంధాల బలిమి వల్లనే అతడు శక్తిశాలిగా ఉంటాడు.
జీవితంలో మనిషి ఎన్నో పాత్రలు పోషిస్తాడు. కుటుంబ యజమాని, భర్త, తండ్రి, తాత, అన్న, తమ్ముడు, బంధువు, గురువు, శిష్యుడు, మిత్రుడు, హితుడు... ఇలా అనేక రూపాలు ధరిస్తాడు. తనను ఆశ్రయించినవారికి నీడనిచ్చే వృక్షంగానూ ఉంటుంటాడు. తాను ఒక్కడైనా, కనిపించే కోణాలు బహువిధాలు. అతడు ఎంతవరకు ధర్మాన్ని ఆచరిస్తాడో ఆ మేరకే ఫలితం పొందుతాడు. మనిషి కేవలం ఆహారపానీయాల వల్లనే బతకడు. అనుభూతులు, బంధాలు అతణ్ని ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉంచుతాయి. అభిమానం, మమకారం పంచే గుణం ఉంటుంది కనుక ఆ మేరకు వాటిని ఇతరుల నుంచి పొందుతాడు మనిషి. అదే అతడి బలసంపన్నత.
బలానికి పునాది, కేంద్రస్థానం మనిషి కుటుంబమే. భారతీయ కుటుంబ వ్యవస్థ ధర్మసంప్రదాయాలపైనే నిర్మితమైంది. అది ఒక గొప్ప సంస్కార నిలయం. వ్యక్తుల్ని రుజువర్తనులుగా, కార్యదక్షులుగా తీర్చిదిద్దేది కుటుంబమే. ఉమ్మడి తత్వానికి అదే మూలం. అన్నింటికన్నా గృహస్థాశ్రమమే అత్యుత్తమం. కుటుంబసభ్యులు తమ బంధాలతో పాటు సామాజిక అనుబంధాల మాధుర్యాన్నీ చవిచూస్తుంటారు. సమష్టి బలం వల్లనే మానవుడు అజేయుడిగా ఉండగలడు. సాధకుడిగా ఉత్తమ ఫలితాలు పొందగలడు. విశ్వ శ్రేయోభావన అతడికి కుటుంబం నుంచే లభిస్తుంది. సామాజిక, మానసిక పరిణామాల ప్రభావంతో ఒక్కోసారి బంధాలు విస్మరించి బలహీనుడిగా మారుతున్నాడు. అందుకే అతడికి ఆత్మావలోకనం అవసరం.
ఉమ్మడి కుటుంబాల స్థానంలో చిన్నపాటి కుటుంబాలు వచ్చాయి. అనేక కారణాలతో దూరాలు పెరిగి, మనిషి బలం కోల్పోతున్నాడు. చక్కని, ఆరోగ్యకరమైన కుటుంబవ్యవస్థ మాత్రమే ప్రతి సభ్యుణ్నీ ఆహ్లాదకర వాతావరణంలో ఉంచుతుంది. శ్రీమద్రామాయణం కుటుంబ బంధాల మాధుర్యాన్ని తేటతెల్లం చేస్తుంది. ఆదర్శ దాంపత్యం, అన్నదమ్ముల అనుబంధం, గురువులు, తల్లిదండ్రుల పట్ల చూపాల్సిన పూజ్యభావం, స్నేహధర్మం, పౌరధర్మం, పాలన ధర్మం- అన్నింటినీ వివరిస్తుంది. కాబట్టే, రామాయణం నేటికీ ఉత్తమ ప్రామాణిక గ్రంథంగా నిలుస్తోంది. బంధాల్ని విచ్ఛిన్నం చేసుకుంటే కలిగే దుష్ఫలితాల్ని మహాభారతం వివరిస్తుంది. మన ఇతిహాసాలన్నీ నాగరికతను ప్రతిబింబించేవే.
కుటుంబమే దేవాలయం అనుకుంటే, ఆ బంధాల్ని దృఢతరం చేసుకోవడమే దేవీదేవతల ఉపాసన. ఆ ఉపాసన తత్వమే మనిషి ప్రగతిపథంలో సాగేందుకు చోదక శక్తిగా ఉపకరిస్తుంది!
- దానం శివప్రసాదరావు
eenadu daily
0 వ్యాఖ్యలు:
Post a Comment