శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఆధ్యాత్మిక ప్రయాణం

>> Thursday, January 7, 2016

ఆధ్యాత్మిక ప్రయాణం
మానవత్వం నుంచి దివ్యత్వానికి చేరుకోవడమే ఆధ్యాత్మికమన్నారు విజ్ఞులు. అది మానవ హృదయాన్ని వికసింపజేస్తుంది. సచ్చిదానందాన్ని ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మికత అంటే పూజలు, జపాలు, తీర్థయాత్రలు అనే భావన కొంతమందిలో ఉంది. నిజానికి అవన్నీ ఆ జీవనానికి సోపానాలు మాత్రమే. మనసును నిగ్రహించుకొని, దృష్టిని అంతర్ముఖం చేయాలి. అప్పుడే మనిషి ఆత్మజ్ఞాన సంపన్నుడిగా మారతాడు. ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు. భక్తులు నవ విధ మార్గాల ద్వారా భగవంతుణ్ని ఆరాధిస్తారు. ప్రసన్నం చేసుకుంటారు. జ్ఞానులు నిరంతరం దైవాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేస్తుంటారు. ముక్తిమార్గం కోసం అన్వేషిస్తుంటారు.
కోరికలతో నిండిన మనసే దుఃఖానికి కారణం. అజ్ఞానానికి అదే మూలం. దాని నుంచి బయటపడి మనిషి ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. అప్పుడే కోరికలు నశిస్తాయని రుగ్వేదం బోధిస్తోంది. ‘నశించే శరీరం కోసం నశించే భోగాల్ని ఆహ్వానిస్తున్నాడు మనిషి. అతడు ఆత్మకన్నా శరీరానికే ఎక్కువ ప్రాముఖ్యమివ్వడం అజ్ఞానం. ఆత్మ అసాధారణమైనది. అది వెలకట్టలేని జ్ఞానరాసులతో నిండి ఉంటుంది’ అనేవారు శంకరాచార్యులు.
మనిషి అంటే శరీరం కాదు, ఆత్మ అని తెలియజేసేదే ఆధ్యాత్మిక విజ్ఞానం. ఆ మార్గంలో ప్రయాణించే మనసు మబ్బుల్లేని ఆకాశంలా నిర్మలంగా ఉంటుంది. మనిషిలోని దుర్గుణాలు, చెడు అలవాట్లు పూర్తిగా దూరమవుతాయి. క్షమ, సేవాగుణం, ధర్మం వంటి దైవీ గుణాలు సాధకుడిలో ప్రవేశిస్తాయి. అతడి మనసు ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగుతుంది. భగవంతుడి నివాసంగా రూపొందుతుంది. సాధారణంగా లౌకిక అవసరాలకు ఎప్పుడూ ఎవరో ఒకరిపై ఆధారపడుతుంటాం. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేటప్పుడు, గురువును ఆశ్రయించడానికి సందేహి స్తుంటాం. అది తగదు. లక్ష్యసాధనకు సద్గురువును ఆశ్రయించాల్సిందే. అక్షర జ్ఞానానికే కాదు- ఆత్మ సాక్షాత్కారానికీ గురువుల ఉపదేశం తప్పనిసరి.
బ్రహ్మజ్ఞాన సాధనకు అజ్ఞానమే ప్రతిబంధకం. దాన్ని గురువే తొలగించగలడని వేదాలు, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఆయన హృదయపూర్వక సమర్పణను ఆకాంక్షిస్తాడు. శిష్యులను జ్ఞానమార్గం వైపు నడిపిస్తాడు. అందుకే గురువుల ఉపదేశాల్ని వినమ్రతతో స్వీకరించాలి.
తత్వచింతన నిండిన శ్రీరామకృష్ణ పరమహంస సంతకమైనా చేయలేరు. రమణ మహర్షి- తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిపోయారు. అయినా వారు మహనీయులు. సమస్త జీవరాశుల్ని సమదృష్టితో చూసినవారు. అందరికీ ప్రేమను పంచిన ధన్యులు. నిష్కల్మషమైన జీవితం గడపడం వల్ల వారు లోకంలో ఎందరెందరికో ఆదర్శప్రాయులయ్యారు.
అటువంటి గురువుల మహోపదేశంతో సాధకుడికి సృష్టి మొత్తం ఓ అద్భుతంగా గోచరిస్తుంది. ‘ఇందుగలడందు లేడని...’ పోతన భాగవతంలో చెప్పినట్లు, వారికి అంతటా భగవంతుడి రూపం సాక్షాత్కరిస్తుంది. స్థితప్రజ్ఞులుగా మారతారు. అన్నింటిలో, అందరిలో భగవంతుణ్ని దర్శిస్తారు.
మనిషిని మనీషిగా, భోగిని యోగిపుంగవుడిగా, సామాన్యుడిని మహాత్ముడిగా మార్చి అలౌకిక ఆనందాన్ని అందించేది ఆధ్యాత్మికమే. దాని ప్రభావంతో గాఢమైన ప్రాపంచిక ఆకర్షణలన్నీ సాధకుడి అంతరంగం నుంచి తొలగిపోతాయి. అతడిలోని రాగద్వేషాలు, అహంకారాలు అంతరిస్తాయి. అందరూ ఆత్మీయులేనన్న భావన కలుగుతుంది. మనిషి మాధవుడిగా మారడమంటే అదే!
- విశ్వనాథ రమ
 
from   eenadu daily

1 వ్యాఖ్యలు:

Zilebi January 7, 2016 at 4:01 PM  



చాలా విలువైన మాట చెప్పారు రమ గారు !

మనిషి అంటే శరీరం కాదు, ఆత్మ అని తెలియజేసేదే ఆధ్యాత్మిక విజ్ఞానం. ఆ మార్గంలో ప్రయాణించే మనసు మబ్బుల్లేని ఆకాశంలా నిర్మలంగా ఉంటుంది

జిలేబి

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP