శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అతితెలివి సిద్ధాంతాలు

>> Wednesday, January 8, 2014

ఆచరణ కొరవడిన సిద్ధాంతాలే ..............

పని ఎగవేయడానికి లేదా తగ్గించుకోవడానికి సోమరులు వేయని ఎత్తు లేదు.  చెప్పని సాకు లేదు.  అలాంటి ఓ శిష్యుడు గురుకులంలో చేరాడు.  గురువుగారికేమో మడి, ఆచారం.  ఈ శిష్యుడికేమో ఒళ్లంతా బద్ధకం.  గురువు గారు సంచారానికి వెళ్ళినప్పుడు నీటి కోసం చెలమల మీద ఆదారపడ వలసి వచ్చేది.  అక్కడ ఇసుక నేలను తవ్వి, గుంట చేసినప్పుడు దానిలో ఊరే నీటితో అవసరాలు తీర్చుకునే ఆచారం.  గురువు గారు మూడు గుంటలు తవ్వుకుంటూ ఉండే వారు.  ఒక గుంట లోని నీటిని కాల కృత్యాలు తీర్చుకునేందుకు ఉపయోగించే వారు.  ఇక ఆ నీరు వంటకి, స్నానానికి వాడే వారు కాదు.  రెండో గుంటలోని నీటితో స్నానపానాలు చేసే వారు.  ఇక మూడో గుంటలో ఊరిన నీటిని దేవుడి అభిషేకానికి, ప్రసాదానికి ప్రత్యేకంగా ఉపయోగించే వారు.  అది గురువు గారు అనుసరించే క్రమం.  ఈ శిష్యుడిని వెంట బెట్టుకుని వెళ్ళిన గురువు, రాత్రి పడుకోబోయే ముందు, ఆ ప్రకారమే మూడు గుంటలు తవ్వవలసిందని ఆదేశించారు.  ఈ బద్ధకస్తుడు ఒక్క గుంట మాత్రమె తవ్వాడు.  పొద్దున్నే గురువు గారు, “ఏరా! ఒక్క గుంటే తవ్వావు?” అని ప్రశ్నిస్తే, “మూడు గుంటలు తవ్వడం అనవసరమండీ!” అని జవాబిచ్చాడు.  “అదేమిట్రా!” అని గురువు గారు ఆశ్చర్యంగా చూశారు.  “గురువు గారూ....! తమరు మొదట దేవతార్చనకు ఈ నీళ్ళు వాడండి.  తర్వాత ఆ గుంటలోని నీటితో స్నానం చేయండి.  ఆ తర్వాత దంతధావనం, కాలకృత్యాలు తీర్చుకుంటే ఒక్క గుంటే సరిపోతుంది.  మీరు అనుసరించే పద్దతికైతే మూడు గుంటలు కావాలి.  నేను చెప్పిన రీతిలో క్రమం మార్చుకుంటే, శ్రమ తగ్గుతుంది.  అప్పుడు ఒక్క గుంట చాలు కదండీ!” అని గురువు గారికి సోమరి శిష్యుడు పాఠాన్ని ఉపదేశించాడు.  గురువు గారు అవాక్కయ్యారు.

[కెబిఎన్ శర్మగారి ద్వారా]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP