శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దేవుడంటే ఎవరు? [నాల్గవభాగం]

>> Tuesday, January 7, 2014

ఈపోస్ట్ ముందు భాగాలకై ఇక్కద చూడండి
http://durgeswara.blogspot.in/2013/12/blog-post_16.html

నాయనా! టూ ఎక్స్ ప్లస్ త్రీ ఈజీక్వల్టు వై అనే ఈక్వేషన్ ని గ్రాఫుగా మలచితే, ఓ సరళ రేఖ వస్తుంది.  దాని పొడవు ఎంత ఉంటుందంటావు? సుబ్రహ్మణ్యం గారు ప్రశ్నించారు.

గ్రాఫు గీయడానికి మీరు ఎంత కాగితం తీసుకున్నారనే దానిని బట్టి ఆ రేఖ పొడవు ఉంటుంది సాయిరాం జవాబిచ్చాడు.

అయితే, నీకు ఈక్వేషన్ గురించి పెద్దగా తెలియనట్టే.  ఎందుకంటే, ఆ రేఖ పొడవు అనంతం.  గ్రాఫు కాగితం మీద ఏదో చిన్న భాగాన్ని మాత్రమె నువ్వు చిత్రించగలవు.  అంతే తప్ప, ఆ రేఖ చిన్నది కాదు. అది అఖండం సుబ్రహ్మణ్యం గారు గుర్తు చేశారు.

మీరన్నది కరక్టే.  మీ ప్రశ్న సరిగా అర్థం కాక అలా చెప్పాను. అయితే ఏమిటో చెప్పండి సాయిరాం స్థిమితంగా వినడం మొదలు పెట్టాడు.

గ్రాఫు కాగితం మీది గీతలాగే పరిమితంగా మాత్రమె భగవంతుడి ఆచూకీ మనకు అందుతుంది.  ఈ కొద్దిని బట్టి, ఆ అనంతాన్ని మనం గ్రహించక తప్పదు.

మీరు ఆ కొద్దిని కూడా ఏమీ చూపించలేక పోయారు కదా!

సాయిరాం! ఇందాక నువ్వేమన్నావు? ఆ చెట్లకి, ఈ కొండకి మధ్య ఏ కనెక్షను లేదని.  అంతే కదా!  ఓ ఉదాహరణ దగ్గరకు రా! పక్క వీధిలోని పోస్టు డబ్బాలో నువ్వు ఉత్తరం వేశావు.  అది కాలిఫోర్నియా లోని నీ మిత్రుడికి చేరింది.  అంటే, ఇక్కడికి, అక్కడికి ఏదైనా కనెక్షన్ ఉందంటావా? లేదంటావా?

“ఉండ బట్టే కదా ఆ ఉత్తరం వెళ్ళింది?

ఆ కనెక్షన్ ని నువ్వు ఏర్పాటు చేశావా? లేక కాలిఫోర్నియాలోని నీ మిత్రుడు ఏర్పాటు చేశాడా? లేక ఇక్కడికీ అక్కడికీ కలిపి మరెవరైనా ఆ ఏర్పాటు చేశారా? లేక ఆ కనెక్షనే నిన్ను, నీ మిత్రుడినీ సృష్టించిందా?

మరీ పిచ్చి ఆలోచన! నేను గానీ, నా మిత్రుడు గానీ ఆ కనెక్షన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరమే లేదు.  మరొకరు చేసిన ఏర్పాటును మేం ఉపయోగించు కున్నాం.

ఆ ఏర్పాటు ఇక్కడికి, కాలిఫోర్నియాకు మధ్య మాత్రమె జరిగిందా? లేక ఇంకా చాలా దేశాల మధ్య, జరిగిన దానికి అది చిన్న శాంపిల్ మాత్రమేనా?

శాంపిల్ మాత్రమె

సరే.  ఇప్పుడు ప్రకృతిలోని ఓ ఉదాహరణ దగ్గరికి రా! బొప్పాస చెట్లలో మగ చెట్లనీ, ఆడ చెట్లనీ ఉన్నాయి.  దుర దూరంగా వేర్వేరుగా ఉన్నాయి.  వాటి మధ్య అతుకేమీ కనబడడం లేదు.  కానీ, దీని పుప్పొడి, దాని పరాగం దగ్గరకు చేరుతోంది.  బొప్పాస ప్రత్యుత్పత్తి చక్కగా జరిగిపోతోంది.  అది ఎలా జరుగుతోందంటావు?

అది కీటకాల ద్వారా జరుగుతోంది.

అంటే అవి పోస్ట్ మాన్ లాంటి వన్న మాటే గా! మరి ఆ కీటకాలను ఈ మగచెట్టు సృష్టించుకుందా? లేక ఆడ చెట్టు సృష్టించుకుందా? లేక ఆ కీటకాలే ఈ మగ, ఆడ బొప్పాస చెట్లను సృష్టించుకున్నాయా? లేక మరేదైనా వీటన్నింటినీ సృష్టించిందా?

ప్రకృతే వీటన్నింటినీ సృష్టించింది

అంటే వీటన్నింటి ప్రజ్ఞల మధ్య కనెక్షన్ ఉన్నట్లా? లేక అవన్నీ తుంపులు తుంపులుగా ఉన్నాయా?

ఖచ్చితంగా అతుకు ఉంది.  అది ప్రకృతి.

మరి ఆ కొండలను, ఆ చెట్లను, ఈ కీటకాలను సృష్టించిన ప్రకృతి ఒక్కటేనా, లేక వేర్వేరుగా ఉందా?

ప్రకృతి అంతా కలిపి ఒక్కటే.  ఆ ప్రకృతే సృష్టి అంతటికీ మూలమని మీరు ఒప్పుకునేటట్లయితే పేచీయే లేదు.  ప్రకృతికి భిన్నంగా దేవుడంటు లేనిపోనివి కల్పిస్తేనే, మీతో వాదనకు దిగేది.   ప్రకృతినే మీరు దేవుడని అంటున్నారా?  ఆ సంగతి ముందు తేల్చండి.

మొదటి సంగతి, ప్రకృతి అంతా ఒక్కటేనని నువ్వు ఒప్పుకోవడమంటే అర్థమేమిటి?  నీ దేహం, మనో బుద్ధ్యహంకారాదులన్నింటికీ కలిపి, సాయిరాం అనే ఆత్మ ఒకటి ఉన్నట్లే, ఈ ప్రకృతి అంతటికీ కలిపి ఒక సమన్వయ ప్రజ్ఞావిశేషం ఉన్నాడని అంగీకరించడమే.  దానినే విశ్వాత్మ అని అంటున్నాం.  దీని అనేకానేక డైమన్షన్ లను అర్థం చేసుకునే ప్రయత్నమే సత్యాన్వేషణ.  ఇక నీ ప్రశ్న సంగతికి వస్తే సాయిరాం! రసాయనిక పదార్ధం కానిది ఏదైనా ఈ ప్రకృతిలో ఉందా? లేనప్పుడు, రసాయనిక శాస్త్రానికి భిన్నంగా ఫిజిక్స్ అనీ, మరోకటనీ, మరోకటనీ ప్రత్యేకంగా ఎందుకు చదువుతున్నావు? అన్నింటినీ కలిపి ఓ ముద్దగా ఎందుకు చేయడం లేదు?

స్పెషలైజేషన్ అనేది కేవలం సదుపాయం కోసం.  అసలు సంగతి, అంతా కలిపి ప్రకృతి అనీ, అదే ప్రజ్ఞ అనీ, అదే మీ దైవమనీ, మీ భగవంతుడనీ మీరు ఒప్పుకున్నట్లే కదా!

నాయనా సాయిరాం! మన చుట్టూ ఉన్నదంతా ప్రకృతే అని అనడం లడ్డూని, పెరుగునీ, పులిహోరని, ఆవకాయనీ, సాంబారునీ, అరటి పండునీ అన్నింటినీ కలిపి ముద్దగా చేసి తినడం లాంటిది.  దేని రుచి దానిదే.  లోపలికి వెళ్ళాక అంతా కలిసిపోయేదే కదా అని చెప్పి, శ్రాద్ధ పిండాలను తయారు చేసి వడ్డిస్తే అవి విందును ఆస్వాదించే వారికి పనికొస్తాయా?

ప్రకృతిని ప్రకృతిగా స్వీకరించే వారిని మీరు ఎందుకు ఈసడిస్తున్నారు?

ప్రకృతిలో అందాన్ని చూసే వారు కళాకారులు కావడాన్ని మనం చూస్తాము. ఎవరికీ సమస్య లేదు.  ప్రకృతిని రహస్యాల పేటికగా చూసే వారు, వాటిని తెరవడానికి ప్రయత్నించడం ద్వారా సైంటిస్టులు కావడాన్ని చూస్తాము.  వారితో కూడా సమస్య లేదు.  ఇదంతా దైవం అనే కోణాన్ని ఆస్వాదించడమే.  ప్రత్యేకించి అంతటి లోను దివ్యత్వం, దైవం అనే కోణాన్ని ఆస్వాదించే వారు ఉన్నారు.  వారిని నువ్వెందుకు ఈసడించాలి?

దేవుడు అనే కల్పన ద్వారా మీరు దొంగ బాబాలకు, దొంగ స్వామీజీలకు ఆస్కారం కల్పిస్తున్నారు.

అంటే, మంచి బాబాలతో, మంచి స్వామీజీలతో నీకు పేచీ లేనట్లేగా?

దేవుడు, భగవంతుడు అనే భావనలకే నేను అభ్యంతరం చెబుతున్నాను.  అవి ఉంటేనే గా మంచి బాబాలు, మంచి స్వామీజీలు ఉండడానికి ఆస్కారం కలిగేది?  ప్రజ్ఞాని, ప్రజ్ఞ అంటే సరిపోతుంది కదా! దేవుడని ఎందుకనాలి? సాయిరాం ప్రశ్నించాడు.

దైవం అనే కోణాన్ని ఆస్వాదించడంలోనే మానవుడు జంతు కక్ష్య నుంచి మహనీయుడి స్థాయికి ఎదిగే ప్రక్రియ ముడిపడి ఉంది.

నిరీశ్వర వాదులంతా జంతువులుగా ప్రవర్తిస్తున్నారా? దేవుడనే భావన లేకుండా, మానవుడు ఉన్నతుడు కాలేడా? సాయిరాం నిలదీశాడు.

(ఇంకా ఉంది     ............. )

[కెబిఎన్ శర్మ గారి సౌజన్యంతో] 

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP