శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మనం నిర్వహించే శ్రాద్ధకర్మలు చనిపోయిన వారికి ఎలా అందుతాయి?

>> Monday, November 11, 2013

దేవ ఋణం అంటే?
మనం పీల్చుకోవడానికి ప్రాణవాయువు, మనల్ని మోస్తూ పంటలివ్వడానికి భూమి, మన అవసరాలను, దప్పికను తీర్చే జలము మొదలగు ఈ పంచ భూతాలే మన జీవితానికి ఆధారములు.  ఇవి భగవంతుని సృష్టిలో భాగములే.  అట్టి ఈ పంచభూతాలే మనకు ప్రత్యక్ష దేవతలు.  వాటికి మనం ఎంతో ఋణపడి ఉన్నాం.  నీటి నిచ్చినందుకు జలం, వెలుగునిచ్చి నందుకు సూర్యుడు, ప్రాణాన్నిచ్చినందుకు గాలి మననుండి ప్రతిఫలం ఆశించడం లేదు కదా!! కనుక వాటిపట్ల కృతజ్ఞతా భావనతో ప్రతినిత్యం గృహంలో భగవదారాధనను నిర్వర్తించుటచే దేవ ఋణం తీరుతుంది. 

ఋషి ఋణం అంటే?
మన శాస్త్రాలకు, సంస్కృతికి మూలం ఋషులు.  వాటిని ప్రసాదించిన వారికి ఋణపడి యున్నాము.  భౌతికంగా వారు మన ముందు లేకపోయినా, మన గురువును వారి ప్రతిరూపంగా భావించి, సద్బుధ్ధితో వారిని సేవించాలి.  వారు మనకందించిన శాస్త్రములను అధ్యయనం చేసి దానిని ఆచరించడం ద్వారా ఋషి ఋణాన్ని తీర్చుకోవచ్చు. 

పితృ ఋణం అంటే?
మన జన్మకు కారకులైన తల్లి దండ్రులకు మనం ఋణపడి వున్నాం.  వారు జీవించి ఉన్నంత కాలం కంటతడి పెట్టకుండా చూసుకోవాలి.  మన వలన వారు ఏనాడూ  కష్టపడకూడదు.  ఎన్నడూ బాధ పడకూడదు.  అంతేకాదు వారు మరణించిన పిదప శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు వంటి కర్మలను ఆ తిథినాడు విధిగా నిర్వర్తిస్తూ పితృ ఋణం తీర్చుకోవాలి.   

మరణించిన తల్లిదండ్రులకు శ్రాద్ధ కర్మలు చేయాలా? 
తల్లిదండ్రుల ఋణాన్ని శ్రాద్ధ కర్మలను ఆచరించుట ద్వారానే తీర్చుకోగలము.  శ్రద్ధతో చేసేదే శ్రాద్ధమంటారు.  మన జన్మకు కారకులై, మనలను పెంచి పోషించినందుకు కృతజ్ఞతగా వారు జీవించి యున్నంతవరకు వారికి కావలసిన వసతి సౌకర్యాలను ఏర్పరచి సుఖ పెట్టాలి. అనంతరం వారికి శ్రాద్ధ విధులు నిర్వహించి ఋణం తీర్చుకోవాలి. 

మనం నిర్వహించే శ్రాద్ధకర్మలు చనిపోయిన వారికి ఎలా అందుతాయి? 
"ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ" ఋణానుబంధ రూపమే ఈ జన్మ. ప్రతి వ్యక్తికీ ఈ లోకంతో ఋణముంటుంది. తల్లిదండ్రుల ఋణాన్ని కొడుకు తీర్చడమే మన హిందూ సంస్కృతిలో విశిష్టమైన అంశం.  వారి ఋణాన్ని తీర్చేందుకై కొడుకు నిర్వహించే శ్రాద్ధ కర్మలను పితృలోకంలో వసించే పితృదేవతలు స్వీకరిస్తారు.  తద్వారా ఋణ విముక్తులై వంశాభివ్రుద్ధిని, శాంతిని పొందుతారు.  

స్వర్గస్థులైన తల్లిదండ్రులకు బ్రహ్మకపాలంలో శ్రాద్ధకర్మలు చేస్తే మరింక ఎప్పుడూ చేయనవసరం లేదని అంటారు.  అది నిజమేనా? 
మహాదోషం.  అది బద్ధకానికి, సోమరితనానికి నిదర్శనం.  అనుకోని అవాంతరం ఎదురై శ్రాద్దకర్మ చేయలేకపోతే అప్పుడు బ్రహ్మకపాలంలో చేసిన తీర్థవిధి రక్షిస్తుంది. అంతేకాని మనం ఇంట్లో మూడు పుటలు సుష్ఠుగా తింటూ, సంవత్సరానికి ఒక్కసారి పెట్టే శ్రాద్ధాన్ని విస్మరించడం దోషం. బ్రహ్మకపాలం పేరు చెప్పుకుని మీ కపాలాన్ని సోమరితనానికి గురి కానివ్వకండి. 

భూత ఋణం అంటే? 
మనకు నిత్యజీవితంలో ఎన్నో జీవరాశులు సహకరిస్తున్నాయి.  కనుక వాటిపట్ల మనం ఋణపడి ఉన్నాము.  క్రిమి, కీటకాల వంటి అల్పజీవుల పట్ల కూడా దయ, జాలి గలిగి మెలగాలి.  ఈ ప్రకృతిలో మనతో పాటు జీవించే సర్వహక్కులు వాటికీ ఉన్నాయి.  వాటిని హింసించడం, చంపడం వంటి క్రూరమైన చర్యలు మానుకుని వాటి జీవనానికి సహకరించుట ద్వారా భూతఋణం తీర్చుకోవచ్చు. 

అతిథి ఋణం అంటే? 
"అతిథిదేవోభవ" తిథి, వార నక్షత్రాలు చూడకుండా వచ్చే వాడే అతిథి.  అట్టి అతిథిగా మన ఇంటికి విచ్చేసే వారిని సత్కరించాలి.  వారిని చులకనగా చూడడం, తూలనాడడం చేయకూడదు. వారిని తగు రీతిలో సత్కరించుటయే గృహస్థుల ధర్మం. 

​అతిథులను సత్కరించుకునే భాగ్యం మనకు కలిగించినందుకు అతిథిని అభినందించాలి. తక్కిన ఆశ్రమవాసులైన బ్రహ్మచారులను, వానప్రస్థులను, సన్యాసులను గృహస్తులే పోషించి ఆదరించాలి.  ఈ రకంగా పంచ ఋణాలను తీర్చుకుంటూ పిల్లలను సంస్కార వంతులుగా తీర్చిదిద్ది, పెద్దల పట్ల బాధ్యతలను నెరవేరుస్తూ, సద్గురువు నాశ్రయించి, గురువు ఉపదేశించిన వాక్యాలతో జీవితాన్ని సంస్కరించుకునే సాధకుడు ధన్యుడు, కృతకృత్యుడు. 

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP